మానవ హక్కుల పరివేదన – కె.వి.ఆర్‌. కవిత్వం

శతాబ్దాలుగా రాచరికానికి ఊడిగంచేసిన తెలుగు కవిత్వం 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత దిశమార్చుకుంది. సాటి మనిషి మనుగడకోసం అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంది. ఆకాశగంగలోని హంసలను వదలి పొలంలో బురద అంటిన సామాన్య కూలి వాళ్ళను కవిత్వం వరించింది. ఇందుకు ప్రపంచంలో ముందుకొచ్చిన అనేక విప్లవాత్మక ఉద్యమాలే కారణం. ఇటీవలి సినిమాలో ‘ఆగట్టు నుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా’ అనే పాటలాగా ఏగట్టున నిలవాలో కవులకు స్పష్టత వచ్చింది. బతకడానికి మనిషి పడుతున్న అనేకానేక సంవేదనలను కవిత్వం రికార్డుచేసింది. బాగుపడడానికి కావలసిన మార్గాలను సైతం కవిత్వమే నిర్దేశించింది. మనిషి మనిషిగా ఎదగడానికి, మనిషి మనిషిగా బతకడానికి మనిషి మనిషిగా రూపుదిద్దుకోవడానికి, ప్రతి మనిషికీ  ఉండవలసిన కనీస హక్కులే మానవ హక్కులు. ఆధునిక కవిత్వంలో ఎక్కువభాగం మానవహక్కుల కోసం ఆరాటమే కనిపిస్తుంది. ఈ వ్యాసంలో ప్రముఖ విప్లవ కవి కె.వి.ఆర్‌. కవిత్వంలో మానవ హక్కుల ప్రతిఫలనం ఎలా ఉందో క్లుప్తంగా పరిశీలిద్దాం.

విప్లవ కవులలో నిబద్ధతగలవాడు, అలుపెరుగని పోరాటయోధుడు కె.వి.ఆర్‌. వీరి పూర్తి పేరు కె.వి.రమణారెడ్డి. ఘనత వహించిన ప్రజాస్వామ్యంలో పేద ప్రజల దుర్భర జీవితాలను చూసి చలించిన ఆనవాళ్లు వీరి కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. అడవి, భువన ఘోష, అంగారవల్లరి, ఎర్రపిడికిలి, సూరీడు మావోడు, జైలు కోకిల వంటి కవితా సంకలనాలలో కె.వి.ఆర్‌. మనిషికోసం తపించారు. దోపిడీదారి ప్రభుత్వ విధానాలను తన కవిత్వంలో ఎండగట్టారు. కేవలం సాహిత్య సృజనే కాదు ప్రత్యక్ష పోరాటాలలోనూ పాల్గొని అనేక కష్టాలు చవిచూసిన వారు. కె.వి.ఆర్‌. తన జైలు జీవితాన్ని కూడా సాహిత్య సృష్టికే వుపయోగించిన విప్లవ సూర్యుడు.

కె.వి.ఆర్‌. కవిత్వమంతా మనిషి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకోసం ఆరాటం కనిపిస్తుంది. పేరుకు మనకు స్వాతంత్య్రం సిద్ధించినా మనమింకా బానిసత్వంలోనే ఉన్నామన్నది వారి అభిప్రాయం. మన సమాజాన్ని అడవితో పోల్చారు. ఇక్కడ మనిషి బందీగా పడివుండటాన్ని కవి జీర్ణించుకోలేక పోయాడు. సెలయేటిని, గాలిని సైతం బంధించారని వాపోయారు. సెలయేటిని, గాలిని ఎంత సేపు బంధించగలం ఒత్తిడి పోటెత్తేవరకే. అట్లాంటి ఒత్తిడికోసం, పోరుకోసం కవి జీవితాంతం సముద్రమై ఉప్పొంగిపోయారు.

ఈ అడవి సందిటా
మానవుడు ఖైదీ
మానవుడు బందీ

ఈ అడవి గుబురులో
తోట ఒక ఖైదీ
ఊట ఒక బందీ

రాబందు గొంతులో
సెలయేరు ఖైదీ
గాలి ఒక బందీ (అడవి, కవిత – అడవి)

తరతరాల నుంచి మనుషులలో పేరుకుపోయిన అలసత్వాన్ని తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలను, కూలీనాలీ జనాలను పీల్చి పిప్పిచేసి వాళ్ళ బతుకులను డోపిడీ చేస్తున్న నిరంకుశ సమాజాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. జీవించే హక్కును సైతం కాలరాస్తున్న దుర్మార్గాలను ఎదిరించాలంటే కావాల్సిన మార్గం విప్లవం, నడవాల్సిన దిక్కు ఉద్యమం అంటూ కె.వి.ఆర్‌. దిశానిర్దేశం చేశారు. ఇదంతా ఎందుకంటే మనలోని చచ్చును దులిపి ప్రబుద్ధులుగా తయారు చేయడానికని వివరణ ఇచ్చారు. అందుకు కావలసిన ఆయుధాలనూ సూచించారు.

కక్కు కఱకు వీడిపోని
కోత కొడవలెత్తి
భీమ గదా ఘనదండపు
పెనుసుత్తుల నెత్తి
బానిసలను పీనుగలను
అర్భకులను అబలలనూ
మనుషులుగా వీరులుగా
కదిపి కలిపి చచ్చుదులిపి
ప్రబుద్ధులను కావింపుడు
ప్రజాధ్వజం కీలింపుడు (భువనఘోష, కవిత – శ్రావ్యాశ్రువు)

అంగారవల్లరి కవితా సంపుటిలో ‘ఇగుళ్ళు’ అనే కవితలో తన ఆకాంక్షను వెలిబుచ్చారు కె.వి.ఆర్‌. యుగాలనుంచి తీగలుగా ఇతరులమీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇకనైనా ఇగుళ్ళు పెట్టాలని ఆశ పడ్డారు. అక్కడే తన ముద్రను ప్రదర్శించారు. మామూలు ఇగూళ్ళు కాస్త ఎర్రగా ఉంటాయి. ఇక్కడ కవి కోరే ఇగుళ్ళు కెంపుల రంగులో ఉండాలన్నారు. అంటే కావాల్సిన మార్పు విప్లవంద్వారానే వస్తుందని తద్వారానే విలాపగీతాలు ఆగిపోతాయన్నది కవి నమ్మకం. పీడిత ప్రజల రక్షణకు ఆకాశం పందిరిగా నిలవడాన్ని కలగన్నారు. ఇవి మామూలు కలలు కాదు ఎరుపు కలలు, మెరుపు కలలు.

యుగాల తీగలు
ఇగుళ్ళ కెంపులు తొడిగేనా?
సరాగమే సుమ
పరాగమై వర్షించేనా?
క్రిందికి భువికి
పందిరియై దివి వంగేనా?
విలాప గీతిక వీగేనా?
విరోధ వీచిక లాగేనా? (అంగార వల్లరి, కవిత – ఇగుళ్ళు)

విరసం ఏర్పడ్డాక కె.వి.ఆర్‌. కవిత్వం మరింత ఎరుపెక్కింది. మానవుణ్ణి తనంత తానుగా బ్రతకనీయకుండా అడ్డుపడుతున్న రాజ్యహింసను కవులంతా ఖండించారు. వారిలో కె.వి.ఆర్‌. ముందువరసలో నిలబడ్డారు. అధికారం ఉందికదా అని ప్రజలను పీడించి చంపుతున్న రాజ్యాన్ని అడవిపందులతో ప్రతీకించారు. సమాజ సంక్షోభానికి ప్రధాన కారణంగా రాజ్యం వైపు వేలు చూపించారు.

రాజ్యమంటే నాకు తెలిసిందల్లా జనం ఇబ్బంది
రక్షణలేని ఊళ్ళమీదపడే అడవి పందుల సిబ్బంది
దుర్వినియోగం కాని అధికారం అధికారమే కాదు
అణగి పడివుండకపోతే పచ్చని బీడైనా వల్లకాడు (ఎర్రపిడికిలి, కవిత – రాజ్యం)

గద్దెనెక్కిన ప్రతివాడు రామరాజ్యం తెస్తానంటాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి హత్యారాజకీయాలను కొనసాగిస్తాడు. ఎక్కడ చూసినా ఇదే తంతు నోరెత్తిన వాడు శవమై తేలాల్సిన దౌర్భాగ్యస్థితి మన దేశంలో నెలకొంది. ఇదేనా రామరాజ్యం? ఇందుకోసమేనా పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకుంది? ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో కూడా విజయం సాధించలేని నేతలు రామరాజ్యం తెస్తామని కల్లబొల్లిమాటలతో కాలం వెళ్ళదీస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, జైళ్ళు, దండనలు, అమాయకుల నిర్భంధాలు పెరిగిపోతుంటే మనం నిజంగా అభివృద్ధి చెందుతున్నామని ఎలా అనగలం? ప్రజాస్వామ్య లక్షణాలు పూర్తిగా మారిపోయిన తరుణంలో కె.వి.ఆర్‌ వంటి కవి విప్లవ శంఖం పూరించడంలో ఆశ్చర్యమేముంది.

హింసలు ఖైదులు హత్యాకృత్యాల్‌
హజమూ జులుమూ అత్యాచారాల్‌
నేరం మోపని న్యాయం చెప్పని
నరుల దుర్వధలు నరక దండనలు
ప్రజాతంత్ర శతపత్ర దళాలా?
ఎరుపెక్కాయ్‌ రక్తంతో కొండలు
బిరుసెక్కాయ్‌ బాధలతో కోనలు
వన్యమృగాలే చిన్నబోయినై
వృక్షాలే ముడుచుకు పోతున్నై
ప్రజాతంత్ర జీవన దృశ్యాలై (ఎర్రపిడికిలి, కవిత – రక్తం)

ఎమర్జెన్సీ కాలం భారతదేశంలో మానవ హక్కులను కాలరాసిన అనాగరిక కాలం. దేశాన్నంతా కబందహస్తాలలో బంధించాలని ఏలినవారు చేసిన క్షుద్ర ప్రయోగం. ఆ సందర్భంలోనే ప్రజల పక్షాన మాట్లాడినందుకు, ప్రజల బాధలను గానంచేసినందుకు, ప్రజల ఆర్తికోసం కలం ఝళిపించినందుకు కె.వి.ఆర్‌ జైలుపాలయ్యారు. అక్షరాన్ని బంధిస్తే అనంతాకాశాన్ని ఆక్రమించే విరాఠ్‌స్వరూపాన్ని పొందుతుందని పాపం పాలకులకు తెలియదు. జైలులో ఉండగా ‘జైలుకోకిల’ కవితా సంపుటిని రాశారాయన. రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రాన్ని హరించి అందరి నోటికి మూకుడు అడ్డుపెట్టారని కవి ఆక్రోశించారు. చీకటి మయమైన భారతావనిలో ప్రజలను గాడిదలుగా భావించిన తీరును తప్పుబట్టారు.

బలపడుతున్నై వర్షాగమ సూచనలు
లోకమే మూసుకుపోతున్నదీనాడు
లోకుల నోటికి అతుక్కుంది పెద్దమూకుడు
వాతావరణం నేడు భీతహరిణమే అయింది
వార్త నీరవతా బేతాళుని మూపున మోస్తుంది
ప్రజను గాడిదగా ఎంచి పాలక పాతకి అందిస్తుంది
ప్రపంచం ఒక చేత్తో, మరొకచేత్తో క్షుద్రాహారం! (జైలుకోకిల, కవిత-రాత్రి)

ఎటుచూసినా చీకట్లు కమ్ముకుంటే ఎవరు మాత్రం ఏంచేయగలం? అలాగని అట్టే ఉంటే చీకటి తొలగేదెలా? రాత్రి వచ్చిన చీకటైతే సూర్యోదయంతో పోతుంది. దుఃఖం తెచ్చిన చీకటి ఎలాపోతుంది? మన ప్రయత్నంలో పోతుంది. కష్టాలు వచ్చినపుడు ఏడుస్తూకూర్చుంటే తీరిపోవు. మనిషి కొయ్యబారిపోతే ఏమి మిగలదు. అందుకే మళ్ళీ జీవితంలోకి వెలుగులు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన ఆవశ్యకతను కె.వి.ఆర్‌. తన కవిత్వం ద్వారా ఎలుగెత్తిచాటారు.

ఎందుకబ్బా ఇంత చిమ్మ చీకటి
నీ గుండెల్లోంచి కళ్ళల్లోకి వచ్చి గూడుకట్టుక్కూర్చుంది
కష్టాలుంటేనే
కాష్టంలా కొయ్యబారి పోవలసిందేనా?
చాల్చాలుగాని మరిలే!
ఊపిరాడినందాకా మరుద్దాం దిగులు
సరదాలతో కేరింతలతో
రా పోదాం బతుకులోకి మళ్ళీ…

(సూరీడు మావోడు, కవిత – మరిచిపోయిన మందహాసం)

సరదాకోసమో, హాబీగానో, పేరుకోసమో కవులుగా అవతారమెత్తుతున్న వాళ్ళని ఈనాడు చాలామందిని చూస్తున్నాం. సాటి మనిషికోసం, అక్షరం కోసం జీవితాన్ని త్యాగం చేసిన కె.వి.ఆర్‌ గారి వ్యక్తిత్వాన్ని మనమంతా పొదివి పట్టుకోవాలి. ప్రజలకోసం వారి హక్కుల పరిరక్షణకోసం కవిత్వం ముందుకు రావాల్సిన సమయంలో వెనుకడుగు వేయడం ఆధునిక కవులకు తగనిపని. రాసే అక్షరానికి చేసే పనికి మధ్య వైరుధ్యం ఉంటే వాళ్ళ కవిత్వంలో నిబద్ధత, నిజాయితీ లోపించినట్లే. కె.వి.ఆర్‌. సాహిత్యాన్ని చదువుతుంటే మానవ అభ్యున్నతి కోసం వారెంత పరితపించారో అర్థమవుతుంది. కె.వి.ఆర్‌ గారికి లాల్‌ సలామ్‌, కవిత్వానికి లాల్‌ సలామ్‌, మనిషికి లాల్‌ సలామ్‌, మానవత్వానికి లాల్‌ సలామ్‌.

డాక్టర్ పెళ్లూరు సునీల్

డాక్టర్ పెళ్లూరు సునీల్ పుట్టింది నెల్లూరు జిల్లా కోట గ్రామంలో. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డి అందుకున్నారు. ప్రస్తుతం కోటలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. కవిత్వం రాయడం కవిత్వం చదవడం వీరి ప్రధాన అభిరుచులు. ఎక్స్ రే, తానా మొదలైన పురస్కారాలను పొందారు. డా.రాధేయ కవితా పురస్కారం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఇటీవలే తన పరిశోధనా గ్రంథాన్ని "దీర్ఘ కవితా వికాసం" పేరుతో పుస్తకంగా వెలువరించారు.

5 comments

 • రాయకుండా గమ్మున ఉంటే ఎలా
  అబయా ఇంకా చాలా రాయాలి
  వ్యాసం బాగుంది
  అభినందనలు

 • చాలా బాగా చెప్పారు. ఇంకాస్త హృదయాన్ని నలుపుకుని దీపాన్ని వెలిగించమని మనవి.

  🙂

 • కెవిఆర్ గూర్చి మంచి విశ్లేషణ
  కాకవితలు పంధా మరవని మనిషి గురించి సోదాహరణం గా వివరించారు

 • సునీల్ గారు…..
  అభనందనలు.చాలా ఉపయోగకరమైన వ్యాసం

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.