ఆంగ్ల నవలా చరిత్రలో స్త్రీ వాద రచనను ప్రారంభించిన రచయిత్రి జేన్ ఆస్టెన్ (1775 – 1817). స్త్రీ విముక్తి, స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన విషయాలను గురించి వ్రాయక పోవచ్చు కానీ స్త్రీల మనోభావాలు గురించి మొదటగా వ్రాసిన రచయిత్రి జేన్ ఆస్టెన్. బ్రిటిష్ నవల 18వ శతాబ్దంలో డానియల్ డిఫో, శామ్యూల్ రిచడ్సన్, హెన్రీ ఫీల్డింగ్ తో మొదలైనప్పటికీ, దైనందిన సంఘటనలు, సన్నివేశాలు జీవితం లోని పాత్రలు, సజీవంగా రూపుదిద్దుకుంది జేన్ ఆస్టిన్ రచనల ద్వారానే. మధ్యతరగతి పాఠకుల ఇంటింటా సాహిత్య సన్నివేశాన్ని ఆవిష్కరించినవి కూడా ఇవే !
మానసికంగా పరిణతి చెందిన, చెందని యుక్త వయస్కులైన యువతులు, తమ కూతుళ్లకు మంచి భర్తలను ఎలాతేవాలని తహతహలాడుతూ గుసగుసల పిచ్చాపాటి చెప్పుకుంటూ ఉండే తల్లులు, ప్రేమలు, ఊహలు, కన్నీళ్లు, పెళ్లిళ్లు – ఇదీ జేన్ ఆస్టిన్ సృష్టించిన ప్రపంచం. మనం దీన్ని ‘ఉబుసుపోని ఆడవాళ్ల గోల’ అని కొట్టిపారేయలేం. మానవుల స్వరూపాలను, మధ్య తరగతి స్త్రీ సమాజ మనోగతాలను ఆవిష్కరించిన తొలి నవలా రచయిత్రిగా జేన్ ఆస్టిన్ ను చెప్పుకు తీరాల్సిందే. చాలా మంది తెలుగు నవలా రచయిత్రులకు స్ఫూర్తి కూడా ఆమే.
భౌతికంగా మానసికంగా స్త్రీకి ఏవి అవసరమో, అలాటి వాటిని పట్టించుకోనవసరం లేనట్టు నటించే పురుషుల గురించి, అలాటి అవసరాలకై ఆశగా చూసే యువతులకు వలవేసే వారి గురించి, కుటుంబ బాధ్యతలను విస్మరించకూడదని తెలిపే నిజాల గురించి కుటుంబాలలోని రోజూ జరిగే సన్నివేశాలతో స్త్రీ పురుషుల సంభాషణలతో జేన్ తనదైన ఒక ప్రపంచాన్ని సృష్టించింది.
హాస్యం, ప్రేమ, చతురత, వ్యంగ్యం ఇవన్నీ జేన్ ఆస్టెన్ నవలా జీవితంలోని ముఖ్య లక్షణాలు. జేన్ రచించిన నవలలన్నీ ఆమె మరణానంతరమే ప్రచురింపబడ్డాయి. ఆమె సోదరి కసాండ్రా, జేన్ డైరీలను, రచనలను లేఖలను పొందుపరచింది.
స్టీవెన్ టన్ లోని హేంప్షియర్ గ్రామంలో ఒక ప్రబోధకుని కుమార్తె జేన్ ఆస్టెన్. ఆరుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లల లో చిన్నది. ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు వారి ఇళ్లకు వెళ్లి రావడం, అక్కడి జనాలు… ఇవి జేన్ ఒక నవలాకారిణిగా రూపుదిద్దుకునేందుకు ఏర్పడిన పరిసరాలు. ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు కూడా ఆమె నవలలకు ఇతివృత్తాలుగా దోహద పడ్డాయి. ఆమె రాసిన నవలలు ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’(1811), ‘ప్రైడ్ అండ్ ప్రెజుడీస్’(1813), ‘మేన్స్ ఫీల్డ్ పార్క్’ (1814), ‘ఎమా’ (1815), ‘పర్స్యుయేషన్’ ఇంకా ‘నార్తాంజర్ ఎబే’(1817).
తన చుట్టూ జరిగిన జరుగుతున్న సాంఘిక రాజకీయ విప్లవాలు పరిస్థితులేమీ తనను ప్రభావం చేయనట్లుగా మధ్య తరగతి కుటుంబాల గురించి మాత్రమే వ్రాసింది. సమకాలీన నెపోలియన్ యుద్ధాలు, ఫ్రెంచి విప్లవఘటనల గురించి ఆమె ఏమీ వ్రాయలేదు. ప్రేమలో పడడం, అపార్థాలు, చెప్పకుండా వెళ్లి పోవడాలు, కుంగిపోవడం, అనేక సంఘర్షణల తర్వాత నిజాన్ని గ్రహించడం వంటి ఇతివృత్తాలతో మధ్య తరగతి కుటుంబాల కథలను వ్రాసింది.
ఆమె నవలలలో తర్వాతి తరాల నవలా రచయితల రచనలలోని సంక్లిష్టత లేకపోవచ్చు గానీ పాత్రలు, వాటి స్వభావాలను మాటల ద్వారా చెప్పించే శిల్పాన్ని జేన్ పెంపొందించుకుంది. ఆ తరంలోనే చరిత్ర కథలను వ్రాస్తున్న స్కాట్ కూడా జేన్ రచనలపై వ్యాసాలు వ్రాశాడంటే వాటి గొప్పతనాన్ని మనం అర్ధం చేసికోవచ్చు. ఆమె పాత్రలు, సన్నివేశాలు కనుల ముందు నడిచే చిత్రాల్లా ఉంటాయి. సరళత ఆమె శైలి లోని గొప్ప సుగుణం. పాత్ర చిత్రీకరణ ఆమెకు గల వరం. బ్రాంటీ, వంటి సమకాలీన రచయితల వంటి వారికి ఇవి కొంత కొరుకుడు పడక పోయి ఉండవచ్చు. చాలామంది లాగే వారు జేన్ ను ఒక సాధారణ సాంప్రదాయిక మధ్యతరగతి రచయిత్రి లాగా భావించారు.
కానీ జేన్ అనేక మంది యుక్త వయస్కుల ప్రేమ కథలను చెప్పాలనుకుంది. డబ్బున్న యువతులను పెళ్లాడటం ద్వారా ధనికుల మవుదామనుకునే యువకుల పాత్రలు, మనస్తత్వాలు, అదృష్టవంతుల భార్యలవబోయే వారి కలల గురించి, ప్రేమలోని అర్ధాలు, అపార్థాలు, అహంకారాల గురించి తన ప్రపంచాన్ని నిర్మించింది. సమాజంలోని విలువలు ఎలా నేర్చుకోవాలో చిత్రించే ప్రయత్నం చేసింది.
‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’: ఈ రెండు లక్షణాలనూ ప్రతిబింబించే ఇద్దరక్కా చెల్లెళ్ళ కథ యిది. మేరియన్ చాలా ఆసక్తితో నిష్కర్షగా మాట్లాడే అమ్మాయి. ఆమె చాలా అందగాడయిన జాన్వీలోచీ తో తలమునకలుగా మోహం లో పడుతుంది. అతను ఇంకొక ధనికురాలి కోసం ఈమెను వదిలిపెడతాడు. దాంతో ఆమె తన కన్నా ఇరవై యేళ్ళ పెద్దవాడైన కర్నల్ బ్రాండ్ ని పెళ్లి చేసుకుని ‘సెన్స్’ని గ్రహిస్తుంది. ఈమెకు విరుద్ధంగా ఈమె అక్క ఎలినార్ చాలాతెలివితేటలు, వివేచన కల పిల్ల. కొన్ని ఆటుపోటులకు తట్టుకొని తాను ప్రేమించిన ఎడ్వర్డ్ ఫెరాస్ ను భర్తగా పొందుతుంది.
అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన నవలల్లో మొదటిదైన ‘ప్రైడ్ అండ్ ప్రెజుడీస్’ ఎలిజబెట్ బెనెట్ కు, ఫిజ్ విలియం డార్సి కి మధ్య గల ఆసక్తికరమైన సంఘర్షణ తో కూడిన ప్రేమను వివరిస్తుంది. ఎలిజిబెత్ ఒక పల్లెలోని మర్యాదస్తుని కుమార్తె. డార్సి ధనిక వర్గానికి చెందిన ఒక జమీందారు. మొదట కలిగిన అభిప్రాయాన్ని కాదని, నిలకడతనంతో డార్సి లో అహంకారాన్ని ఓడించి అతనిలో మనిషిగా మార్పు తెచ్చి ఎలిజబెత్ విజయాన్ని సాధిస్తుంది. నవలను ఆసాంతం చదివిన వారెవరైనా ఎలిజబెత్ తో ప్రేమలో పడి తీరతారు. మంచి వ్యక్తిత్వం, విలక్షణత, సౌందర్యం, స్వతంత్రమైన అభిప్రాయాలు, తెలివితేటలూ, చలాకీతనం, నిర్భయత్వం, ఆత్మ గౌరవం, ఇవన్నీ ఎలిజబెత్ పాత్రను ఉన్నతంగా నిలబెట్టే అంశాలు. డార్సీ కూడా మొదట ఆమె సౌందర్యం పట్ల ఆకర్షితుడైనా, తరువాత ఆమె అంత స్సౌందర్యానికి ముగ్ధుడౌతాడు. తన ధనం, సాంఘిక స్థాయి వల్ల కలిగిన అలవి మాలిన గర్వము, అహంభావంతో ఉండే డార్సీ, ఆత్మగౌరవం, కొంత అపోహలతో ఉండే ఎలిజబెత్, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ ద్వారా ఒకరి మంచితనాన్ని ఒకరు గుర్తించ డమే ఈ నవల కథ. తండ్రి పట్టించుకోకపోవడం వల్ల, తల్లి చేసే అతిగారాబం వల్ల ఆడ పిల్లలెలా పెడ దారి పడతారో వంటి అంశాలను కూడా ఈ నవల చూపిస్తుంది. జేన్ రాసిన అన్ని నవలలోనూ ‘ప్రైడ్ అండ్ ప్రిజుడీస్’, ఆ నవలలోని డార్సి, ఎలిజిబెత్ పాత్రలు ఆంగ్ల సాహిత్యంలో స్థిరంగా నిలిచి పోయాయి.
ఆస్టిన్ రాసిన నవలలో ఏ హాస్య కోణము లేని నవల ‘మేన్స్ ఫీల్డ్ పార్క్’. లెక్కలేని తనం తో పెరిగిన ఫానీ ప్రైస్ బెర్త్రాం వంశీయుల ప్రేమను ఎలా పొందిందీ, అనేక ఘటనల తరువాత బెర్త్రాంను ఎలా వివాహమాడిందీ తెలియజేస్తుంది.
జేన్ రాసిన అన్ని నవలలోనూ చాలా హాస్యభరితమైన నవల ‘ఎమ్మా’. చాలా ధనికురాలు, సౌందర్యవతి అయిన ఎమ్మా వుడ్ హౌస్ తన స్నేహితులకు, బంధువులకు పెళ్లి సంబంధాలను కుదర్చడానికి తంటాలుపడుతూ ఉంటుంది. అనేక తప్పిదాల తర్వాత, అవమానకర సంఘటనల తర్వాత ఆమె తనకు తోడుగా ఉండే జార్జ్ నైట్లీని పెళ్ళాడుతుంది.
కాదనుకున్న ప్రేమికుని ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ పొందే ప్రేమ కథ ‘పర్స్యుయేజన్’. ఏన్ ఎలియట్ , కెప్టెన్ ఫ్రెడరిక్ వెంట్ వర్త్ ను ప్రేమిస్తుంది. కానీ అందరూ ‘పెళ్లాడ వద్దు’ అని చెప్పడంతో విరమించుకుంటుంది. అతను యుద్ధానంతరం విజేతగా తిరిగి రావడంతో, అందరూ అతన్ని గుర్తించడంతో తిరిగి మళ్ళీ అతన్ని పెళ్లాడుతుంది.
జేన్ అంతుచిక్కని ఊహలు, తప్పిదాలతో గల ఆలోచనలు నిండివుండే సజీవ మానవ పాత్రలను సృష్టించింది. కుటుంబ చరిత్రలు, వంశాల గొప్పతనాలు, ప్రవర్తనల విశ్లేషణలు, ఈమె నవల లోని ముఖ్యాంశాలు.ఈమె నవలలలో ఎక్కడా మోటు హాస్యానికి చోటు కనిపించదు. సునిశితమైన హాస్యం, కుటుంబపరమైన ప్రవర్తనలు, రోజూ వినే సంభాషణలు ఈమె నవలల్లో ప్రధానంగా కనిపిస్తాయి. అయితే ఆమె నవలలను సమాజపరంగా కన్నా వ్యక్తి సంబంధాల దృష్ట్యా చూడాలనే వాదన కూడా బాగా ఉంది.
సాంఘిక స్థితి గల వ్యక్తులను ముఖ్యంగా ధనిక వర్గపు పురుషులను ఎక్కువ పక్షపాతంతో వర్ణిస్తుందన్న వాదనా లేకపోలేదు. ‘ప్రైడ్ అండ్ ప్రెజుడీస్’ అనే నవలలో డార్సీ, ‘పర్స్యువేజన్’ అనే నవలలో కెప్టెన్ వెంట్ వర్త్- ఇలా వారికి ఇచ్చిన ప్రాధాన్యం లో మిగిలిన పాత్రలన్నీ చిన్న పోయి కనిపిస్తాయి. మేరియన్ కథలా సాగే ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ లో ఎడ్వర్డ్ ఫెరాస్ కానీ, కర్నల్ బ్రాండన్ గాని డార్సీ లాంటి లోతైన పాత్రలుగాకనపడవు.
జేన్ సృష్టించిన పురుష పాత్రలు కొన్ని విచిత్ర లక్షణాలు కలిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. డార్సీ కి బిగుసుకుపోయి ఒప్పించలేని తనముంటే, ‘ఎమ్మా’ లోని నైట్లి కి ఎమ్మా కున్న చలాకీతనం ఉండదు. ‘మాన్స్ ఫీల్డ్ పార్క్’ లో కనిపించే బెర్త్రాం పెద్ద అహంకారి. ఇలాంటి పురుష పాత్రలతో కలవాలనుకునే స్త్రీ పాత్రలు ఏ విధంగా ఆహ్లాదకరంగా వుండగలవో చెప్పండి? స్త్రీ పురుష పాత్రల మధ్య సంబంధాల మధ్య ఆంతరంగికత, ప్రేమను ఒక మధురానుభవంలా పంచుకునే సున్నితత్వం బయట పడక, ఎవరి చట్రాలలో వారుంటూ ఆత్మ స్పృహను వీడక, స్వతంత్ర నిర్ణయాలు తీసికోలేక మథన పడే మనస్తత్వాలే ఎక్కువగా కన్పిస్తాయి. అయితే సంభాషణల ద్వారా పాత్రలను చిత్రీకరించడం జేన్ కు మాత్రమే సాధ్యమైన విషయం.
పురుష శారీరక సంబంధాల గురించి విస్తృత వర్ణనలు జేన్ చేయదు. స్త్రీ పాత్రలతో పోలిస్తే పురుష పాత్రలకు అంత ప్రాధాన్యత కూడా ఉండదు. సాంప్రదాయికతకు పెద్దపీట వేస్తుంది జేన్ నవల. నవలను, కథనాన్ని, సాంప్రదాయక స్త్రీ దృక్కోణాన్ని స్త్రీ గానే చూస్తూ స్త్రీ మనోగతాన్ని, స్త్రీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది జేన్ ఆస్టెన్.
–
డా. విజయ్ కోగంటి
డా.పద్మజ కలపాల
జేన్ ఆస్టిన్ కథనం, శైలి, ఆమె స్పృశించిన అంశాలు మన కళ్ళకు కట్టినట్లు చూపించిన విజయ్ బాబు, పద్మజ నిజంగా అభినందనీయులు.