కవి సమయం ఒక నిపాతం
కవిత్వం హృదయోత్పాతం

మీరు కాల్చేస్తున్న సబ్ స్క్రైబర్  కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించడము లేదు దయచేసి ఎప్పుడూ కాల్ చేయకండీ

మీ కిటికీ తలుపులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి
మీ ఇంటి గుమ్మాలు తునాతునకలై పేలిపోతాయి
మీ శరీరాలు మాంసఖండాలై చెల్లా చెదురైపోతాయి
బీకేర్‌ఫుల్…!
తలుపులు తెరుచుకుని బయటకి వస్తున్నాను
చేతులు సాచి ఆహ్వానిస్తున్నాను
నా గదికి గోడలు లేవు
బార్లా తెరిచి ఉన్న తలుపులు తప్పా
ఖుల్జా
సిం సిం
ఖులాఆస్మాన్
తొలి నమస్కారము తండ్రికి చేసినవాడు చంద్రంగారి అబ్బాయి …. కేరాఫ్ సీపీయం పార్టీ ఆఫీసు.  మేము ముగ్గురము పిల్లలము అమ్మనాన్నతో కలిపి అయిదుగురము అంటూ తన యొక్క ఇంట్రోని మొదలుపెట్టి……

అక్షరాల గుర్రాలకి కళ్లాలు తగిలించి చళ్ళుచళ్ళున చరుచుకుంటూ తీసుకు పోయినవాడు  … ఒక రకంగా కొత్త పదాలకి పాలు తాపి, అన్నప్రాసన చేసినవాడు. రాస్తున్నది కవిత్వమా , వాక్యమా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం, అసలే వచనం తన హద్దుని దాటి కొత్త కొత్త దారుల్లో పోతునప్పుడు ఆదారికి ఒక దిక్సూచిగా నిలబడినవాడు ..అతడు అరుణుడుసాగరుడుస్నేహితుడు ….హితుడు …..దాతకొండకచో నిప్పుల్నిచెరిగి వాస్తవాల్ని చెప్పిన జర్నలిస్టు ….. అతను అరుణ్ సాగర్.

పండగలులేవు, పబ్బాల ఊసేలేదు. పార్టీ మీటింగులంటేనే పండగ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ అంటే ఇంట్లో పెళ్లే. మీటింగు ఉందంటే పర్ణశాల గెస్ట్‌హవుస్ ఆక్రమణ .. ఎప్పటికి వెలిసిపోనీ ఎర్రజండా ఆ ఇల్లు.. ఒక్కసారిగా తెలుగు సాహితీలోకం ఉలిక్కిపడింది ఎవరు ఈ రాతగాడు కొత్తగా వాక్యాన్ని ముస్తాబు చేస్తున్నాడు అని కాస్తంత ఆరా తీసింది..ఎంతగానో ప్రేమించే అమ్మ పోయినప్పుడు కూడా ఈతని పలవరింత అలాగే ఉంది , వాక్యము అంతే బాధని పూసుకుని ఒదిగిపోయింది. ఎవరికి మాత్రం ప్రేమ ఉండదు అమ్మానాన్నలు అంటే. కాని ఆ రాసే వాక్యంలో ప్రేమ కనబడాలి రాసినవి నాలుగు వాక్యాలైనా గుండెని హత్తుకోవాలనే నియమం కలవాడు కాబట్టే ఆఖరిదాక అదే నిబద్దతని పాటించాడు. చూడండి అమ్మ గురించి ఎలా రాశాడో ‘అమ్మ చెప్పేవన్ని అబద్ధాలే ఒక్కసారి కూడా చందమామని నేలకు తీసుకురాలేద’ని వాపోయిన ఈ కవి ఆమె గురించి ఇలా రాస్తాడు .

సెకండ్ ఇన్నింగ్స్ పతి సేవ . ఆసుపత్రుల వరండాల్లో / అమ్మల కెందుకులే తిప్పలు అని ఆలొచించలేని కొడుకుల సాక్షిగావార్డుల్లో నెలల తరబడి పడుకుని నాన్నకి అన్నం పెట్టి వళ్ళు కడిగి , ఉచ్చ పట్టి , మందు రాసి , కట్లుకట్టి/ నాన్న కట్టెపోయే వరకూ. స్త్రీ జీవితంలో ప్రతీ దశలోను చాకిరీ. ఒక్కో దశలో ఒక్కోచాకిరీ . ప్రేమ!

చాలదూ ఆ ఒక్క వాక్యమూ నాన్న మీద ఇష్టాన్ని అమ్మమీద ప్రేమని చూడడం

ఆశలూ ఆశయాల మాటున దాగి ఉండే ప్రేమల గుట్టుని విప్పిన వాడు.

ఇతని కవిత్వము ఒక సరళరేఖా పద్దతిలో ఉండదు , నువు కళ్లతో చూసింది నిజమనుకుంటావు లేకపొతే ఎవరో చెప్పింది వాస్తవం అనుకుంటావు కాని వాటివెనక ఉన్న అసలు నిజాల వెలికితీత ఇతని సామర్ధ్యం. అది అలాంటి ఇలాంటిది కాదు నిన్ను నువ్వు ఉన్నచోటనే నగ్నంగా నిలబెట్టి నిప్పుతో కడిగేసి, నీటితో  ఆర్పేసిపోతుంది. తేరుకున్నాక నువ్వు అచ్చంగా మనిషివన్నా అవుతావు లేకపొతే ఇతని… కాని వదల్లేవు .. నీ గుండెలోపలి పొరలకి నువ్వు వేసుకున్న తాళాల పునాదుల్లోకి చొరబడి మరీ నీకు ఊపిరి ఆడకుండా చేస్తాడువాక్యం రసాత్మకం కావ్యం అవునో కాదో తెలియదు కాని ఇతని వాక్యం విప్లవాత్మకం. నిరంతరం వాడె సంభాషణలని కవిత్వంలో నేర్పుగా ఓర్పుగా ఒంపి కాగితం మీద నుంచి కళ్ళు తిప్పనీయడు

పైసలున్నవి
పోరియున్కలదు
గ్రిల్ల్ చికెన్ గుండెకాయ
ఫిష్ఫ్రైచర్మము
ఎంథిరన్
ఇదొక మేల్కొలుపు ఎలా అంటారా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇతనొక్కడే మేల్ భావనలు  తలపెట్టినవాడు.
ఎక్కడో కలుక్కుమంది కదూ గుండె అర్ధంకాకపొతే సమాజవ్యాకరణం చదువుకోమంటూ చివరికి వచ్చే సరికి ఒక స్వచ్హమైన నీటి బిందువులాంటి మాటొకటి చెప్పేస్తాడుఏ నిట్టూర్పు వెనక ఏ భావ ప్రయోగము దాగి ఉన్నదో , తెలుసుకోలేనంత కాలమూ/ పురుష్లు ముఖము పచ్చడి చేసుకుంటూనే ఉంటారు / కొంచం కీన్గా చూడుఆ పెదవులు పర్సులా తెరుచుకున్నవి కదూచాలా మందికి కోపం తెప్పించిన మాటలు అసలు వళ్ళు రగిలిపొయేలా  అరుపులు అరిచిన వారూ కూడా ఉన్నారు కాని కొన్నికఠిన వాస్తవాలని  ఒప్పుకోకతప్పదు …. ఇతను కేవలం మగవారి యొక్క బాగోగుల కొసం తపించినవాడు. ఏమిటీ ఈ మనిషి తపన అంతా. నాటకము ఈ లోకపు తపన అంతా నాటకము అంటూ ఎవరో బాగా జీవిత సత్యాన్ని తెలిసిన ఒక తత్వవేత్తలాగా ఒక్క గంజాయి దమ్ము పీల్చిన సాధువు చెప్పే వాక్యంలాగ ఈతని ధోరణి ఎందుకిలా ఉంది అంటే వచ్చిన జబ్బు నయం కాదని తెల్సిస్నప్పుడు అన్ని మందులు వదిలేసి అతడిని  అతడిగా బతకనివ్వడం మినహా చేయగలిగింది ఏమి లేదు ఇతను అదే చేస్తాడు ఇప్పటి సమాజానికి మందులు ఏవీ పని చేయవు కాబట్టి నువ్వు నీలా ఉండు అంటాడు. మాటని చాలా పొదుపుగా వాడుతూనే అది సూదిగా ఉందా లేదా అని ముందే నిక్కచ్చితంగా  ఖరారు చేసిన తరవాత మాత్రమే వాడుతాడు అందుకే ఈతని కవిత్వం కుర్రకారుని ఒక ఊపు ఊపింది . ఎక్కడౌన్నా ఒక్క వాక్యం పక్కన నీదే ఉన్నట్టుంటుంది అని పాడూకునేలా చేసింది. సందేహము వలదు ఇతను అత్యంత ఆధునీకుడు వాక్యమును వాక్యములా కాకుండా ఇంకొలా సంధించగల నేర్పుకలవాడు కాబట్టే జీవితాన్నిమ్యాగ్జిమంరిస్క్ అన్నాడునీ నడకల కింద ఏమే ఏమేమే మీటలు నాటారా ఎవరైనా క్యాట్‌వాక్‌తో వయారి మయూరీ అడుగేసావంటే చాలు రక్తంలో అడ్రినల్పరవళ్ళు అంటూ ఒక సుదీర్ఘ సబ్ కాన్షియస్ని రాస్తూనే  అందులో ప్రపంచం మొత్తం ఎందులో పడి దొర్లుతుందో అని తీరిగా ఓపిగ్గా చెబుతూ ఇలా అంటాడు కాంగోడ్రమ్ములో ఎవరో ద్రాక్ష సారాయి నిలవ చేసిరి / కీబోర్డ్నిపబ్లిగ్గాఎలుకలుకొట్టేయుచున్నవి /లీడులేదు బాసు ఒక గిటారు కుమతి బ్రమించెను / గిరగిరా తిప్పి పడేసే పాటలు విని దేహము వెర్రెత్తెను దావానలమయ్యేను. ఇతనికి అక్షరాలలో ప్రపంచం మొత్తం చుట్టేస్తూ అందులోకి మనలని కూడా తీసుకుపోతూ దారి వెంట జరిగే ఆశ్చర్యాలని చూపించడం ఒక అలవాటు . మనకా అది చాలా కొత్త ప్రదేశము , కాస్త నక్కినక్కి కూర్చుని ఇబ్బందులు పోతుంటే హటాత్తుగా అక్కడికీ మన జానపదుల్ని తీసుకొచ్చి మనతో తోడుగా పెడతాడు కాస్తకోలుకుంటాం  , తేరుకుంటాం కుదుటపడతాం లేకుంటేమనం ఎక్కడో తప్పిపోయి వివసత్వంలోనో లేక ఒక మాయా ప్రపపంచపు కౌగిలిలోనో దాక్కుని విశ్వ రహస్యాలని ఏమి తెలియని చిన్నపిల్లవాడిలా చూస్తూ నొట్లో వేలు వేసుకుని బ్రమలో ఉంటాం  . ఒక్కదెబ్బ చరుస్తాడు ఎక్కడ స్వచ్చభారత్ అంటూ నీ పేట చివర్న పేరుకుపోయిన పెంటకుప్ప మీద దోమల్నినీ మీదకు ఉసికొలుపుతాడు. మీ ఊరి చివర కొన్ని తరాల వరకు నీరు తాగిన చెరువు ఇప్పుడెందుకు రసాయనలా చెరువుగా మారిందో కనుక్కుని రమ్మన్ని కొన్నిఅక్షరాలని తోడుగా ఇచ్చి పంపుతాడు . యవ్వనుడా నీయవ్వన కాలమందే నీకు కావల్సినవి సాధించుకొనుము లేనిచో నీకు ఆ ఆఖరి భగవద్గీతస్లోకమూ మిగలదు అంటూ ఒక హెచ్చరిక చేసినవాడు

నీలో పాటలు మిగిలే ఉంటే
నీలో జ్వాలలు రగిలే ఉంటే
ఒక నినాదం ఇంకా ఎకోలో వినిపిస్తూనే ఉంటే
ఇఫ్యూ ఆర్స్టిల్ అలైవ్ , స్టేయింగ్ అలైవ్
వెతుక్కుంటూ వెతుక్కుంటూ
మైడియర్కామ్రెడ్
వుయార్డె స్టెయిండ్టూ మీట్ ఇది ఇతని లోకం  , ఇతని కవిత్వం చదవడం అంటే ఒక అనుభూతిని మనమూ అనుభవించడం సరే ఎక్కడ మొదలు అక్కడే ఉంటాడా ఉండడు .ఆంత్రోపాలజి చదివినవాడు కదా ఎంతసేపు దేహమూ , ఆత్మల మధ్యన జరిగే నిత్య ఘర్షణను ఎప్పుడు రికార్డు చేద్దామా అన్నఆలొచనలో ఉంటాడు . దానికి కాస్త వాస్తవికతని జోడిస్తాడు, ఒక్క పట్టాన ఒంటికి పట్టడు కాసేపు అలా చల్లగాలిలా ప్రియురాలిని పలకరించి , ఆ వెనువెంటనే బలైపోయిన రోహిత్ కొసం క్యాస్ట్ ఎవే అంటాడు ఇతనిది ఒక మార్మికమైన మనసు . అనుభూతిపరుడు అలాగని మరీ అంతర్ముకుడు కాదు ,తనకి నిజం అని ఏదీ అనిపిస్తే మాత్రం అది తప్పక కవిత్వంలోనో వ్యాసంలోనొ మనకి కనబడుతుంది . చాలా మంది ఇతడిని స్త్రీ వ్యతిరేకుడు అన్నారు గాని ,పురుష ప్రేమికుడు అనలేక పోయారు. అది వారి లోపమా లేక వాదనలు మన సమాజంలో పాతుకు పోయిన స్థాయి వలనా అనేది అర్ధం కాదు.
మిత్రమా మియర్ మేల్ ఫెలో
మియ్యర్మేల్ !
తిరస్మృతుడా , బహిష్కృతుడా !
ముందుగానేనోక్నై రూప్య వర్ణ చిత్రం గీస్తాను
ఆపైన
నీకుదాన్ని ఎలా చూడాలో నేర్పిస్తాను
జూంఇస్కోదెఖో
నీ కంటి అద్దాలు కూడా మారుస్తానుఅంటూ ఒక ధైర్య వచనం చెప్పినవాడు ,వయసుని గెలవాలి కాని ఆ పేరుతో నిన్నునువ్వు ఓడిపోవద్దు అని ఉపదేశం చేసిన నవ సామాజిక మాంత్రీకుడు .

2014 యావత్ ఆంధ్రరాష్ట్రం తెలంగాణా ఉద్యమం మీద రగులుతుంది రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న ఒక చారిత్రాత్మక సందర్భం అది , అలాంటి సమయంలో అందరూ ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని తీసుకుంటున్నరోజులు అప్పుడు పడింది ఒక పీటముడి. భద్రాచలం డివిజన్లోని ఏడుమండలాలు అందులో పొలవరం ప్రాజెక్ట్కింద ముంపుకి గురయ్యే మండలాలు మీద చర్చ తారాస్థాయి కి చేరింది. రాజకీయ చర్చల అనంతరం ఆ మండలాలని ఆంధ్రాకి ఇచ్చారు , అయితే అందులో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న కోయ సామాజిక వర్గానికి చెందిన జాతుల గూడేలు మొత్తం ముంపుకి గురౌతాయి , వాళ్లని గురించి రాజకీయం ఎక్కడా మాటలాడలేదు సరికదా వాళ్లకి చెందిన జీవోని కూడా ఇవ్వలేదు . అరుణ్జన్మథా భద్రాచలం డివిజన్‌కి చెందినవాడు . అతను ఈ వివీక్ష మీద చలించిపోయాడు. అతని ఆఖరి చరణంగా మ్యూజిక్డైస్ అనే ఒక అద్భుతకావ్యాన్ని తెచ్చాడు అందులో అంతా ఆదిమవాసుల జీవన వేదన నిండి ఉంటుంది. అతను పడిన వేదన , అతను నడిచినదారులు ,  ఆ రామును గుడి దాని పరిసర ప్రాంతాలు , ఆ పుస్తకం కవర్‌పేజీ కోసం ఒక పెద్ద యుద్దమే చేశాడు.  ఎన్నొ తెప్పించాడు. ఏవీ నచ్చలేదు, చివరకి ఇప్పుడున్న బొమ్మనే ఖాయం చేశాడు. అది అతని పర్ఫెక్షన్.  బక్కగా ఉన్నా ఉక్కు గుండె గలిగిన వాడు అందుకే ఇలా అంటాడు

తునికి పళ్ళెప్పుడైనా తిన్నావా
పోనీ పావలా పరిక పళ్ళు
ఇప్పుడవన్నీ లేవులేండి
మాఊళ్ళోకి వెళితే
చెప్పలేనన్నా మన్నించు
దుఖంతో నా గొంతు పూడుకు పోతుంది

అయినా యూకలిప్ట స్సామాజిక వనాలతో
ఏ గాయాలకి మందు పూస్తారు
ఎండిపోయిన కళ్లలో
ఏ గిరిజన జ్యోతిని వెలిగిస్తారుఇంతలా ఒక గిరిజన తెగ గురించి అందులో అంతమైపోతున్న జాతిని గురించి తలపోసిన కవి లేడనుకుంటాను . అంతా ఆధునిక భావజాలల వెంట పర్వెడుతూ కొత్త కొత్త అభివ్యక్తులని పట్టుకుని అవార్డుల వేటచేస్తున్న జ్కలాలకి ఈ ఆదిమ భాష పట్టదు కేవలం ఒ కవి స్తాపితుడే మరో బాధితుడి భాషని రాయగలడు. అందుకే ఇతనిది నిరంతరంగా మనచెవుల్లో మార్మొగే ఒక విపంచికా గానం .

కొమ్ముబూరాలా వంపు తిరిగిన నది
బతుకునిండా ప్రవహించింది
అమ్మలేదు
నాన్నలేడు
అత్యయిక స్థితిలేదు
అర్ధరాత్రి పోలీసులూ లేరు
వర్షమూ లేదూ
కొల్లి పోతాయని భయపెట్తిన దూలాలు లేవు
ఇల్లు లేదు వాకిలి లేదు
మట్టి గోడ మీద ఆఖరిగా రాసిన
జేగురురంగు అక్షరాలు లేవు

నాన్న చూసిన ఆఖరి చూపులు అంటూ తన బాల్యాని తలపొస్తో ఉన్నవాడు హటాత్తుగా ఇప్పుడునదంతా దయగా నవ్వుతూ ఉంది తెరలు తెరలుగా ఎకొ నవ్వు . ఆ నవ్వు ఎందుకో నదికి తెలుసు అన్నీ చూసిన నది అన్నీ తెలిసిన నది మునిగిపోతున్న జీవిత చిత్రాల్ల్ని అడ్డుకోలేని నది. అది రాజకీయ నది అది ముంపు నది గూడెం ప్రజల దుఃఖదాయని ఆ నది.

రామా !
ఇలా రా
నా పక్కన కూర్చో
నాతో కలిసి
ఈ మట్టి వాంగ్మూలం విను
దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు విను
వినరా విను
సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు
ఫెటఫెటేల్ధ్వానాలు విను !
వినరావిను !

ఈ గూడెం దమ్మక్క చెబుతున్న ముంపు గాధని జాగ్రతగా విను అంటూ రాముడిని రూట్స్వెతకమన్న వాడు. ఒక పక్కన ఒక జాతి దానిని అంటి పెట్టుకుని ఉన్న భాష అక్కడి ఆచార వ్యవహారాలు అన్ని ధ్వంసం అయిపోతుంటే అక్కడి అందాలని చూడడానికి వెళ్ళిన వాళ్ల మీద కూడా తన ఆగ్రహాన్ని ప్రదర్సిస్తాడు.

ఓయ్
నిన్నే
ఇట్లా రా !
విహారయాత్రకి వచ్చావా ఏందిరా
గుడ్డినాయాలా
చెవిటి నాకొడకా
నీళ్ళు కాదురా
కనీళ్ళు

కోట్ల క్యూసెక్కుల కన్నీళ్ళు అంటాడు .అది అతని ఆగ్రహ ప్రకటన కళ్ళ ముందే జరుగుతున్న ఏమి చెయలేని నిస్సహాయత.

ఎప్పుడైన మనసు కాస్త కంగారుగా అనిపించినప్పుడు వాడవలసిన మూడు మాత్రలు మూడు పూటలా అరుణ్సాగర్కవిత్వం లేకా వ్యాసం నీకు నువ్వే ఒక బైపుకి వచ్చేస్తావు.  బద్దలైన నీ హృదయం దానంతట అదే అతుక్కుంటుంది. దానికి కెందుకు ఇంత వగరుస్తావు అని నిన్ను అక్కున చేర్చుకుంటాడు . ఈతను ఎంతో మంది డబ్బు తీసుకుని వైద్యం పేరు చెప్పి మోసం చేసే నయా హిప్నోలకంటే చాలా ముందున్న వాడు నీ జబ్బుకు మందు ఉన్నవాడు.  ఏమీ చేయడు నీ పక్క వాడిలా ఓదార్పు చెబుతాడు , నాన్నలా చిరు కోపం చూపెడతాడు,  అమ్మలా తల నిమురుతాడు,  ప్రేయసిలా తన ఒడిలో నీ తలని పెట్టుకుని నీ బాధని అలా తుడి చేస్తాడు, కొన్ని వాక్యాలు నీ జేబులో వేసి నీకు తోడుగ ఉంచమంటాడు,  నువ్వెన్ని మెట్లు ఎక్కినా సరే సమాజాన్ని ఒక కంటితో చూస్తూ ఉండమని చెబుతాడు. అంత కన్నా మనసుకు కావాల్సిన మందు ఏముంటుంది, ఆ రహస్యం తెలిసిన వాడు అందుకే కె.శ్రీనివాస్ ఇతడిని గురించి ఇలా అంటారుబహు ముఖీనమైన, ఖచితమైన ఊహలు ఆదర్శాలు కలిగిన సాగర్లాంటి మనుషులు అరుదు.  అతనిలాంటి అల్లరి మనిషి, అతనిలాంటి సందడి మనిషి, అతనిలాంటి కవిత్వపు మనిషి అరుదు. మంచి మనిషిగా ఉండడంలో ఎటువంటి రాజీలేని మనుషులూ అరుదు. సాగర్ అరుదైన పిల్లవాడు. నా , మా , మన పిల్లవాడు“.

మనకి చాల వృత్తాలు ఉంటాయి కవులు కవిత్వమే రాయాలి, కధకులు కధలే రాయాలి, అంటూ ఎవరూ గీయని గీతల్లో పడి మనం కొట్టుకుపోతుంటాము . కాని అరుణ్తాను ఏమి రాయాలి అనుకున్నాడో దాన్ని రాసిన వాడు కవిత్వంలో చెప్పే విషయాన్ని కవిత్వంలో  .

కవిత్వంలో దేహ భాషని పొదిగి వ్యాసాన్ని కూడా అదే స్థాయిలో వెలిగించిన వాడు . ఒక సీతారాం ఏచూరి మీద రాసినది కావొచ్చు, మైకెల్జాక్స్న మీద ప్రేమకావొచ్చు, బ్రూస్లి మీద ఆరాధన కావొచ్చు , సినిమాల మీద అధిక్షేపణ కావొచ్చు. వేటూరి మరణించినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు (వేటూరిని ఇంటర్వ్యూ చేశారని అది ఎక్కడో సీడీ రూపంలో ఉందని కూడా విన్నాను ఎవరైనా మిత్రులు ఉంటే ఇవ్వొచ్చు)  అబ్బా ఒకటి కాదు రెండు కాదు ఎన్నొ ఎన్నెన్నో మగవారి బాధలు, ముసలి వారి కన్నీరు, పత్రికా కష్టాలు , బీజీపీ వాదులు కుక్కలు అని తిట్టినప్పుడు రాసిన కుక్క మీద వ్యాసమూ , సాఫ్త్వేర్జెవితాలు ఇలా ఒక్కటేమిటి ఎన్నొ ఎన్నెన్నో రాయడానికి మనకి స్థలం చాలనంత రాశాడు . అంత బాధని మనసులో పెట్టుకుని అనారోగ్యాన్ని కూడా లెక్కచేయక పాత్రికేయ వృత్త్తిని నిబద్దతతో చేసినవాడు, టీవీనైన్, టెన్‌టీవీ ఆఖరి గాటీవీ 5 వరకు తన యొక్క బాధ్యతని సమర్ధవంతంగా చేసినవాడు.  కొత్త కొత్త ప్రయోగాలు చేశాడు,  దినపత్రికల్లో వ్యాసాలు , నవీనా పేజీని ఆంధ్రజ్యోతిలో అలాగే 10 టీవీలో అక్షరం అనే కార్యక్రమం పెట్టి కొన్ని వందల మంది తెలుగు కవుల కధకుల మీద కార్యక్రమాలని చేశాడు . ఇంతా చేసిన అతనికి అర్ధంకాని కవి అని ముద్రవేయించుకున్నాడు కాని ఇతని వాక్యం అజరామరం. ఇతను వ్యధ వర్తమానం.

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

8 comments

 • పొదుపొద్దున్నే ఎందుకబ్బా అరుణ్ణి గుర్తుకుతెచ్హావ్ ? మనసంతా అదోలా అయిపోయింది. అతను చాలా స్పెషల్. అతని అక్షరాలూ అంతే. ఆ కవిత్వంలో పదునూ, వేగమూ, కొత్తదనమూ మాటల్లో చెప్పలేము. ఈ మధ్య వస్తున్న భాషా సంకర సాహిత్యం కన్నా ఇంగ్లీషునీ తెలుగునీ అతను స్నేహపరిచిన విధం ఆమోదయోగ్యంగా ఉంటుంది. మ్యూజిక్ డైస్ గురించి బాగా చెప్పావ్. అతని స్నేహం గురించి స్నేహితులగురించి, అతనిపేర పెట్టిన అవార్డు గురించీ ఒక మాటనాల్సింది కదా ?

  నీ వాక్యాల్లో ఈ సారి ఉద్వేగం కనబడింది. బాగుంది. సమ్యుక్తాక్షరాల్తో ఇబ్బంది పడ్డాను మిత్రమా. కాస్తంత క్లియర్ గా ఉండాలికదా పదప్రయోగం. ఓహో నువ్వూ అరుణ్సాగరుడిలా ట్రై చేశ్వావా ? అయ్తే సర్లే !🤣

  • అరుణ్ ఖచ్చితంగా ఈ తరం చదవాల్సిన కవి. అందుకే రాశాను. అతని భాష కొత్తది.అతను వ్యాకరణం కి ఒక.సూత్రం ఉండదు. ఈ పద.బంధాలు అతని ప్రేరణ మాత్రమే

 • నువు కళ్లతో చూసింది నిజమనుకుంటావు లేకపొతే ఎవరో చెప్పింది వాస్తవం అనుకుంటావు కాని వాటివెనక ఉన్న అసలు నిజాల వెలికితీత ఇతని సామర్ధ్యం. ..ఇలాంటి వాక్యాలతోనే కవిని విమర్శకుడు పట్టుకోవాలి.అద్భుతమైన వ్యాసం.

 • ఈవ్యాసం నిండా అరుణ్ సాగర్ గారి గొంతు ఎకోలై వినిపిస్తూ ఉర్రుతలూగించింది..అతని కవిత్వాన్ని చదవాలనే కోరిక మరింత బలపడింది..అతని శైలిని,ఆయన హృదయబాషని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు అనిల్ గారు..చాలా బాగుంది మీరు ప్రజెంట్ చేసిన విధానం అభినందనలు..

 • చాలా బాగా రాశారు అనిల్ గారు
  చదువుతుంటే కళ్లు చెమ్మగిల్లాయి…

 • మాటల్లేవ్. మరోసారి గుండె బరువెక్కింది తమ్ముడూ.

 • అతని గొంతుకను మీ పదునైన విశ్లేషణతో వినిపించారు… చాలా బాగుంది అనిల్ సార్…అభినందనలు

 • అరుణ్ సాగర్ గురించి రాస్తే ఇలా రాయాలి 🙂

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.