నిక్కమైన నక్సలైటు బషాయి టుడు

ఉన్నాడు-లేడు అనిపించే పరస్పర విరుద్ద భావాలు రేపే ఓ ఉత్కంఠభరిత ఆదివాసీ రైతాంగ విప్లవ కథానాయకుడిని ఆవిష్కరిస్తుంది ఈ ‘బషాయి టుడు’ నవలిక.

1967 మే-జూన్ మాసాల్లో ఉత్తర బెంగాల్ లోని నక్సల్బరీ ప్రాంత రైతాంగ ఉద్యమం, దాని నేపథ్యం ఈ “బషాయి టుడు” రచనకు కారణబూతమైన స్ఫూర్తినిచ్చిందని చెప్పొచ్చు. నిజమైన నక్సలైట్ ఉద్యమం నడిపిన ఆదివాసీ హీరోలు అనేక మందిలో ఒకరు, బషాయి టుడును తన గిరిజన కథానాయకుడుగా మహాశ్వేతాదేవి మలచారు. 1990  కాలంలో ఆంగ్లంలో వచ్చిన మహాశ్వేతాదేవి నవలికను సమీక్ బంధోపాధ్యాయ 1997 లో తెలుగులోకి అనువదించారు. 2018 లో పునర్ముద్రణ కూడా జరిగింది.

మహాశ్వేతాదేవి ఒక విలక్షణమైన రచయిత్రి. ఆమె బెంగాలీలో, ఇంగ్లీష్ లో అనేక నవలలు,కథానికలు, వ్యాసాలు రచించారు. ఆమె రచనల్లో చాలా వరకు బీహార్, బెంగాల్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని అరణ్యవాసుల జీవనానికి సంబందించినవే. ‘దారిద్ర్యరేఖ’ దిగువన దుర్భర దారిద్ర్యంలో ఆకలితో అలమటించే వారి జీవితాన్ని యధాతథంగా చిత్రిస్తే, ‘ఇది యదార్ధమా’ అని నిర్ఘాంతపోయేలా ఉంటుంది. ఆమె రచనల్లో అతిశయం ఎంత మాత్రం కనబడదు.

ఆమె ఒకసారి బషాయి టుడును సృష్టించాక, కాల్పనిక కథానాయకుడిగా అతన్ని ఎదగనిచ్చారు. వ్యవసాయ కార్మికుల బాగోగులే తన ఏకైక లక్ష్యంగా మొండిగా పోరాటం కొనసాగిస్తాడు. ఈ కథలో ఒకవైపు బషాయి టుడు, అతని అనుచర రైతాంగం, మరోవైపు జోతేదార్లు- వారిద్దరి నడుమ ఓ మధ్య తరగతి కమ్యూనిస్టు జర్నలిస్టు కాళీసంత్రా కన్పిస్తారు. జోతేదార్లంటే బెంగాలులో స్థిరాస్తి (భూమి) మీద హక్కు కలిగి పనీపాటూ చేయకుండా ఫలసాయం అనుభవించే వాళ్ళు. దేశంలో దాదాపుగా మొత్తం సాగుభూమిని జోతేదార్లు తమ సొంతం చేసుకున్నారు. అప్పుల మీద చక్రవడ్డీ గుంజుకోవడం, బాకీ కింద కట్టుబానిసలుగా కట్టివేయడం ఒక వ్యవస్థగా తయారయ్యింది. గ్రామీణ భారతం మొత్తం అతిపెద్ద వల్లకాడులా కళ్లకు కడుతుంది.

ఎండాకాలంలోనూ, దుర్భిక్షం సంభవించిన కష్టకాలంలోనూ ఆదివాసులు,అలగాజనంగా ముద్రపడ్డ తక్కువ కులాల వాళ్ళు నీళ్ల కోసం ఎండిపోయిన నదీ గర్భాన్ని తవ్వుకోవాలి, పొట్ట కోసం గంజినీళ్ల మీదో లేదా ఆకులలముల మీదో ఆధారపడాలి. నక్సలైట్ ఉద్యమానికి ఊపిరులూదిన పేదరిక కారణాలు యధాతథంగా ఉండిపోయాయి. సమస్య కేవలం భూమి వరకే పరిమితం కాలేదు. వ్యవసాయ కార్మికుడుగా తనకు న్యాయంగా దక్కాల్సిన కూలీని కూడా రైతు కోల్పోయాడు.

నీరు, విత్తనాలు, ఎరువుల కోసం నిరంతరం ప్రయాసపడాల్సి వచ్చింది. ఆకలి, దారిద్ర్యంతో బతుకును సాగించాల్సి వచ్చింది. బడా భూస్వాములు మరింత బలిసిపోయారు. దిగువ మధ్య తరగతి తుడిచిపెట్టుకు పోయే స్థితికి చేరింది. చిన్న, సన్నకారు రైతులు చివరకు చారెడు నేల కూడా గతిలేక వడ్డీ వ్యాపారం చేసే జోతేదార్లను తెగనమ్మి భూమి లేని వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు.

ఇక కథలోకి వస్తే …మనది వ్యవసాయ దేశం. వరినారు పోయడం నుంచీ,నాట్లు వేయడం, కలుపు తీయడం, కోతలు కోయడం, చివరలో ఇంకెవరి గోదాముకో వడ్లు మోసుకుపోవడం వరకూ పంటతో పాటు పెరుగుతూ సాగే సంగీత స్రవంతిలో ప్రధాన గాయకుడు వ్యవసాయ కూలీయే అవుతుంటాడు. ఎక్కడ భూమిలేని వ్యవసాయ కూలీలు దిక్కులేని దీనావస్థలకు గురయ్యారన్నా అక్కడ బషాయి టుడు ప్రత్యక్షమవుతాడు. తిరుగుబాటుకి దారితీసి పోరుబాటలో ముందుండి వాళ్ళను నడిపిస్తాడు…మరణిస్తాడు. మళ్ళీ బ్రతికి మలిఘట్టంలో ప్రత్యక్షమవుతాడు. అతని మృతదేహం ఆనవాలును గుర్తుపట్టడానికి ప్రతిసారీ ఓ అంకుఠిత కమ్యూనిస్టు జర్నలిస్టు కాళీసంత్రా వెళ్ళి వస్తూనే ఉంటాడు.

బషాయి టుడు సంతాలి తెగ ప్రజల ప్రతినిధిగా కనబడతాడు. నిజాయితీ పరుడైన కమ్యూనిస్టు, విధేయుడైన కార్యకర్త. కానీ వ్యవసాయ కూలీలకు చట్టబద్దమైన కనీస వేతనాలు అనే విషయాన్ని పార్టీ, ప్రభుత్వమూ – రెండూ నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీని వదిలేసి గెరిల్లా యుద్ధతంత్రం పాటిస్తూ తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. అతన్ని నక్సలైట్ అని అందరూ భావించినప్పటికీ…. నక్సలైట్లను సైతం మించిపోయి ఎక్కడో ఇంకా ఎత్తున నిలబడి కన్పిస్తాడు. ఎందుకంటే వ్యవసాయ కూలీల బాగోగుల గురించి ఆలోచించడానికి కిసాన్ సభ గానీ, కమ్యూనిస్టు రైతు ఫ్రంట్ గానీ ముందుపడదు. భూస్వాములు, పెద్ద రైతులు, మధ్య తరగతి రైతుల వర్గాల జోలికి ఏ యూనియన్లు గానీ, ప్రభుత్వం గానీ వెళ్ళదు. ప్రతీ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచేది భూస్వాములే కాబట్టి.ఇక్కడ భూస్వామే వడ్డీ వ్యాపారిగా కూడా కనబడుతాడు. అతని దగ్గర తీసుకునే వడ్ల మీదా, డబ్బు మీదా ఆధారపడే పేదరైతు సంవత్సరం పొడుగునా బ్రతకాలి. మొత్తం రైతాంగంలో పేద రైతులు నాలుగింట మూడు వంతులున్నారు. వారే వ్యవసాయ విప్లవానికి వెన్నుముక.

మొట్టమొదట 1953 లో కనీస వేతనాలను నిర్ణయించారు. దాన్ని 1959 లో ఒకసారి, 1968 లో మరోసారి సవరించారు. సవరించిన రేట్ల ప్రకారం మగవాళ్లకు మూడు రూపాయల యాభై పైసలు, ఆడవాళ్లకు మూడు రూపాయల ఇరవై ఏడు పైసలు, పిల్లలకు రెండు రూపాయల రెండు పైసలు. కానీ నిజానికి 1970 లో కూడా యాభై పైసలు, అరవై రెండు పైసలు, ఒక రూపాయి, ఎనభై పైసలు మాత్రమే చెల్లించేవారు. కనీస వేతన చట్టాలున్నది తెల్ల కాగితాలను నల్లగ చేయడానికి మాత్రమే. పేరుకే వచ్చిన చట్టాలు వారి జీవితాల్లోకి రాక వాళ్ల బతుకులన్నీ నల్లగ నలిగిపోతూనే ఉండేవి.

కాలువలో నీళ్ళు పుష్కలంగా ఉన్నప్పటికీ భూస్వాములు నీటి పన్ను కట్టేవాళ్లు కాదు. ఉత్తర భారతంలో వ్యవసాయానికి కాలువలే ప్రధాన నీటి వనరులుగా ఉంటాయి. భూస్వాములు నీటి పన్ను కట్టకపోవడం వల్ల ఎదురుగా ఎంత నీరున్నప్పటికీ కౌలుదార్లు వర్షపు నీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేయాలి. కౌలుదారుడు ఎక్కువ పంట పండిస్తే అది భూస్వామి ప్రయోజనాలకు నష్టం. పంట ఎంత తక్కువ పండితే కౌలుదారుని పరిస్థితీ, వ్యవసాయ కూలీ పరిస్థితి అంత ఘోరంగా తయారవుతాయి. అప్పుడు వడ్డీకి భూస్వామి దగ్గరికే వెళ్లుతారు. కౌలుదార్లు పండించిన పంటలో సగభాగం భూస్వాములకు చెల్లించేవారు. ఎప్పుడైతే చారు మజుందార్ 1946-47 లో తెభాగా ఉద్యమం తీసుకొచ్చారో…ఆ ఉద్యమం ఫలితంగా కౌలుదార్లు తాము పండించిన పంటలో మూడోవంతు పంట మాత్రమే భూస్వాములకు చెల్లించాలి. నీటిపన్ను కడితే ఎక్కువ పంట పండుతది. దానివల్ల కౌలుదార్లకు లాభం చేకూరుతదనే ఉద్దేశంతో పన్ను కట్టేవాళ్లు కాదు. ఉత్తర బెంగాల్ లో సరైన వర్షపాతం ఉండకపోవడం …. వ్యవసాయాన్ని వర్షం పైనే ఆధారపడి చేయడం వల్ల కౌలుదార్లు కొన్ని రోజులకి వ్యవసాయ కూలీలుగా మారిపోయే వారు. వామపక్ష పార్టీ భూస్వాములకే అండగా ఉండడం వల్ల బషాయి టుడు వ్యవసాయ కూలీల కోసం వారికి ప్రతినిధిగా పోరాటం చేసేవాడు.

ఈ “బషాయి టుడు” కథని చదువుతున్నంత సేపు అప్పటి పరిస్థితులు మన కళ్లముందు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే బషాయి టుడు దేనికోసమైతే తిరుగుబాటు చేసాడో ఆ సమస్యలు ఇప్పుడు కూడా మన దేశంలో కనబడుతూనే ఉన్నాయి. కౌలుదార్ల కోసం ఎన్నో చట్టాలు చేయబడ్డాయి.. అయినప్పటికీ కౌలుదారునికి ఇంకా భద్రత కరువు గానే ఉంది. సమస్యల సాధనే లక్ష్యంగా,ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1967 లో అవతరించిన నక్సలైట్ వ్యవస్థ ఇంకా జీవించే ఉంది. ఈ దేశానికి రైతు వెన్నుముక అనుకుంటూనే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధరలివ్వకుండా దేశం వెన్నుముకను విరగ్గొడుతూనే ఉన్నారు. ఎన్ని కిసాన్ ఉద్యమాలు జరిగినా… ఎన్ని లాంగ్ మార్చ్ లు చేసినా ఇచ్చిన హామీలు, వచ్చిన చట్టాలు మురిగిపోవడమే జరుగుతోంది. పుట్టుకతోనే ఒక ఆదివాసీ ఎలాంటి వంచనకూ, దోపిడీకి, పీడనకూ గురవుతాడో అగ్ర కులాల వాళ్లెవ్వరూ అర్థం చేసుకోలేరు కాబట్టే ఆదివాసీ చట్టాలు కాగితాలకే అంకితమవుతున్నాయి. ఇలాంటి బషాయి టుడు ల అవసరం ఇప్పటికీ ఇంకా ఎంతో అవసరం ఉందని చెప్పొచ్చు.

విస్పష్ట వాస్తవికత, విప్లవ స్వప్నం, నడుస్తున్న చరిత్ర, కల్పనా చమత్కృతుల మేలు కలయికను తనదైన విలక్షణ శైలిలో బెంగాలీ నవలాకారిణి, క్రియాశీల సంఘసేవిక మహాశ్వేతాదేవి ఈ నవలికలో సాధించారు.

వెంకి, హన్మకొండ

అసలు పేరు గట్టు రాధిక మోహన్. హన్మకొండలో నివాసం. వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్. పుస్తకాలు చదవడం ఒక అలవాటు. అడపాదడపా "వెంకి" కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. కవిత్వం మీద "ఆమె తప్పిపోయింది" పేరుతో పుస్తకం వెలువరించారు.

3 comments

  • ఈ వచనం భలేగా ఉందబ్బా. చదవడంలో అలసటే అనిపించట్లేదు. రాధికా, కంగ్రాట్స్. మీరు సెలెక్ట్ చేసుకుంటున్న పుస్తకాలు విలక్షణంగా ఉన్నాయ్.

    జస్ట్ గో అహెడ్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.