“సంస్కారం తెలీని బిడ్డ”

ఆ కొడుకు ఒక్కసారి కూడా తల్లి పాదాలకు నమస్కారం పెట్టలేదు.  

పెట్టించుకోవాలని ఆ తల్లీ కోరుకోలేదు. బిడ్డకు సంస్కారం నేర్పడంలో ఆ తల్లి ఫెయిల్ అయిందేమో.

పాదాలకు  మర్దన చేయమని ఆ తల్లి అడిగింది. తాను అడగకుండా, కొడుకే తెలుసుకొని చేయాలనే పెద్దరికం ఆమెలో లేదు. తనకిష్టమైనది కొడుకును అడగడంలో ఆమెకు ఏ ఇబ్బందీ లేదు.  తల్లి కోసం ఏదో చేస్తున్నానన్న స్పృహ ఆ బిడ్డకూ లేదు. అన్నీ ఋతువులు వచ్చిపోయినట్టు ఏ లెక్కలూ లేకుండా జరిగిపోతున్నాయి.

అమ్మ పాదాలకు కొబ్బరి నూనె రాసి,అరికాల్లోని ప్రతీ పాయింట్ ని వేళ్ళతో నొక్కుతూ మస్సాజ్ చేస్తూ ఉంటే,  ఆ తల్లి మెల్లిగా నిద్రలోకి జారుకుంది. తల్లిదండ్రులను గౌరవించడం తెలీని ఆ బిడ్డ, మస్సాజ్ ఒత్తిడిని మెల్లిమెల్లిగా తగ్గిస్తూ, అమ్మకు నిద్రాభంగం కాలేదని కన్ఫర్మ్ చేసుకున్నాక లేచి కిచెన్ లోకి వెళ్ళాడు. సింక్ లో ఉన్న వంటసామాన్లను కడిగి, పాలు కొద్దిగా వేడి చేసి తోడు చుక్క వేసి బయటకు వచ్చాడు.

“మనకంటే ముందు పుట్టిన ఒకేఒక కారణం చేత, తల్లిదండ్రులు చెప్పిన ప్రతీ విషయాన్ని గుడ్డిగా అంగీకరించాల్సిన అవసరం లేదు. తప్పనిపిస్తే తల్లిదండ్రులను కూడా ప్రశ్నించాలి. నిలదీయాలి.” అని ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు.

ఎక్కడో దూరంగా వేరే ఊర్లో, వేరే ఇంట్లో, ఏడాది మొత్తం తల్లి పని చేసుకుంటూ ఉంటే, తనకేమీ సంబంధం లేదన్నట్టు ప్రవర్తించిన ఒక సంస్కృతి ముద్దుబిడ్డ,  పుట్టినరోజు సందర్భంగా తల్లి పాదాలకు నమస్కారం పెట్టడం అనే రిట్యువల్ పూర్తి చేసాడు. అతని తల్లి సంతోషించాననుకుంది. తనకు జ్వరం వచ్చినా, జబ్బు చేసినా వంటపనీ, అంట్లు తోమడం తానే చేసుకోవాల్సి వచ్చిందనీ, వాటిని ఆడవాళ్ళ పనుల్లా, అంటరాని పనుల్లా  చూసే తన ముద్దుబిడ్డ ఎప్పుడూ సాయం చేయలేదని ఆ తల్లి గుర్తు చేసుకోలేదు. నిజమైన భౌతిక అవసరాలు తీరకపోతే, గౌరవ ప్రదర్శనలతో సంతృప్తిపడే స్థితికి తల్లిదండ్రులు చేరుకుంటారని, ఆ ముద్దుబిడ్డకూ తెలియదు. తెలిసే అవకాశం వచ్చినా, ఆ జ్ఞానం తన సుఖాన్ని తగ్గిస్తుందని ఎస్కేప్ అయ్యాడు. అలా ఆమె కాళ్లకు నమస్కారం పెట్టి, ఆశీస్సులు అందుకొని,  పైన చెప్పిన ఫేస్బుక్ పోస్టు కింద “మాతృదేవోభవ, పితృదేవోభవ అని పెద్దలను గౌరవించే సంస్కృతిలో నువ్వు చెడబుట్టావు. తల్లిదండ్రులను నిలదీయాలి అంటావా? నీలాంటి వారిని పాకిస్తాన్ పంపేయాలి.” అని కామెంట్ పెట్టాడు.

ఆ కామెంట్ కి కొందరు సంస్కృతి సైనికులు లైకులు కొట్టుకొని ఆనందించారు. “నిజమే అన్నా, ఈ నా కొడుకులు మన సంప్రదాయాల్ని మంటగలుపుతున్నారు” అని రిప్లై కామెంట్స్ పెట్టి, ఇంకొన్ని బూతులు తిట్టడం ద్వారా సంస్కృతి పరిరక్షణ బాధ్యతను నెరవేర్చారు.

ఆ బూతులు ఇతన్నీ నొప్పించలేకపోయాయి. ఇతని వాదన వారినీ  ఒప్పించలేకపోయింది. ఎవరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఎప్పట్లాగే తెల్లారింది.

మదర్స్ డే సందర్భంగా సంస్కృతి పరిరక్షకులంతా, తమతమ తల్లులతో ఫోటోలు దిగి, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసారు. తల్లి త్యాగాల్ని కొనియాడుతూ రాసిన గుండెలు పిండేసే కవితల్ని జోడించి.

 

రాంబాబు తోట

3 comments

  • రెండురకాలు వాళ్ళు, మనమధ్య ఉన్నారుఎవరి కుటుంబ పద్ధతి వారు పాటిస్తూ. !కధ బాగుంది. Sir. !

  • చెప్పదల్చున్న పాయింట్ బావుంది ..నచ్చింది ..కానీ చాలా సార్లు బ్లాక్ అండ్ వైట్ గా ఉండదు ఏదీ కూడా …

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.