సమ్మతి మాన్యుఫాక్చరింగ్ – అసమ్మతి అణిచివేత

బలవంతంగానైనా సరే భూములను లాక్కుని తమకు అప్పగించేందుకు పారిశ్రామికవేత్తలు గవర్నమెంటు దగ్గరకు వెళ్ళే కాలం చెల్లిపోయింది.ప్రజలు ఇప్పుడు జాగృతమై, సంఘటితమవుతున్నారు. భూములను ప్రజల నుంచి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. కళింగనగర్, సింగూర్, నందిగ్రాం ఇందుకు మంచి ఉదాహరణలు. భూములను కొనుగోలు చేసుకోమనో, లేదా గుత్తకు తీసుకోమనో గవర్నమెంటు ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు సలహా ఇస్తోంది.

అందువల్ల పెట్టుబడిదారీ వర్గం రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకునేందుకు కొత్త కుతంత్రాలను పన్నుతోంది. బహిరంగ హింసాత్మక ఎత్తుగడలు ఇక పని చెయ్యవు. భూమి స్వంత దారులు భూములను తమంత తామే అప్పగించేట్లు చెయ్యాల్సిందే.

రైతుల ఐక్యతను విడగొట్టే ప్రక్రియ ఈ దశల్లో జరుగుతుంది:

1) గ్రామంలో అసంతృప్తితో ఉన్న కొంతమంది యువకులను గుర్తించి వాళ్లకు డబ్బుతోపాటు, కంపెనీలో ఉద్యోగం ఇస్తామని ప్రలోభపెడతారు. అలాంటి యువకులను దొరికించుకోవడం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏమంత కష్టం కాదు. కొంచెం చదువుకుని, ఉద్యోగాల్లేక కాలయాపన చేస్తుంటారు. సమాజం పట్ల అసంతృప్తితో ఉంటారు గానీ, తమ గ్రామం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎలాంటి దోహదం చెయ్యడానికి సిద్ధంగా ఉండరు. ఈనాటి సమాజంలో డబ్బే అన్నిటికన్నా ముఖ్యమని భావిస్తారు. తమ స్వంత భూముల్లో కూడా వ్యవసాయం చెయ్యడానికి ఇష్టపడనంతగా వాళ్లు వ్యవసాయ అర్థిక వ్యవస్థ పట్ల విముఖంగా ఉంటారు. భూమితో అనుబంధం లాంటివేం ఉండవు. ఇక ఆదివాసీ సమాజంలోనైతే సాంప్రదాయక ఆదివాసీ నాయకత్వం పట్ల ఎటువంటి గౌరవమర్యాదలు ఉండవు. గ్రామ పెద్దల నిర్ణయాలకు కట్టుబడి ఉండరు. అట్లాంటి యువకులకు మోటర్ సైకిలూ, రోజువారి ఖర్చులకు డబ్బూ ఇచ్చి భూసేకరణలో చురుకుగా పాల్గొనమని కంపెనీలు అడుగుతాయి. ఈ ప్రక్రియలో కంపెనీలకు తమ భూమిని స్వాధీనం మొదటి వ్యక్తులు వీళ్లే అవుతారు.

దీనితో గ్రామ సమాజాన్ని విడగొట్టే ప్రక్రియలో మొదటి దశ పూర్తవుతుంది.

2) మిగిలిన గ్రామ సమాజం రెండు ముఖ్య ప్రధాన వర్గాలుగా పరిగణించవచ్చు: భూమిని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా పోలీసులకూ, ప్రభుత్వ యంత్రాగానికీ, కంపెనీలకూ భయపడి నోరుమెదపని మెజారిటీ. అంతేకాక కంపెనీ గురించి గానీ, పరిశ్రమ గురించి గానీ, పర్యావరణం మీద ప్రభావాల గురించి గానీ, నష్టపరిహారం గురించి గానీ, పునరావాసం గురించి గానీ ఎటువంటి అవగాహనా వాళ్లకు  ఉండదు. మరో మాటలో చెప్పాలంటే, బుజ్జగింపులతో తమ భూమి నుంచి వేరు పడగలిగే వర్గం ఇది.

కంపెనీ మొదటి ఈ వర్గం మీద తమ పని మొదలు పెడుతుంది. ఈ సామాన్య వ్యక్తులను మెల్లగా దువ్వి పరిశ్రమలు పెట్టడానికి సమ్మతించేట్లు చేసి స్థానభ్రంశానికి అంగీకరించేట్లు చేస్తారు కంపెనీకి చెందిన వ్యక్తులు. అప్పటికే కంపెనీకి అమ్ముడైపోయిన యువకులు ప్రజలకూ, కంపెనీకి మధ్యవర్తులై ఈ వర్గానికి కంపెనీ ఉద్దేశం తెలియజేస్తారు.  

ఆయా ప్రాంత ప్రజల విద్యా ఆరోగ్య అవసరాలను గుర్తిస్తారు. ఆ ప్రాంతాలకు స్థానికులైన కొంత మంది ఆఫీసర్లు, అమ్ముడుపోయిన యువకులతో కలిసి ప్రజలను ఒకచోట చేర్చి భూమిని ఇచ్చేస్తే వాళ్లకు అద్భుతమైన పునరావసం కల్పిస్తామని పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తారు. కంపెనీ స్వంత ఖర్చుతో ప్రాథమిక పాఠశాలలనూ, ఆసుపత్రులనూ, సమాజ కేంద్రాలనూ, బోరింగులను ఏర్పాటు చేస్తామని చెప్తారు. భూములకు ప్రభుత్వం చెల్లించే మొత్తం కన్నా మంచి ధర చెల్లిస్తామని చెప్తారు. కుంటుంబానికో ఉద్యోగం ఖచ్చితమని చెప్తారు. మొత్తానికి, ప్రజలకు భూతల స్వర్గాన్ని వాగ్దానం చేస్తారు.

దూర ప్రాంతాల్లో అదే కంపెనీ వేరే గ్రామస్తులకు కల్పించిన పునరావాసంలో వారి వెనుకటి జీవితం కన్నా ఎంత మెరుగైనదో ఉందో చూపించడానికి చిన్న చిన్న గుంపులుగా  గ్రామస్తులను తీసుకెళ్లడానికి కొంతమంది మంచి ఆఫీసర్లను పంపిస్తారు.

మెల్లగా కొంత కాలం తరువాత, కంపెనీకి తమ భూమిని ఇచ్చెయ్యడానికి చాల మంది రైతులు ఒప్పుకుంటారు. ఈ విధంగా, మొదటి ప్రతిఘటన మెల్లగా పట్టుకోల్పోతుంది.

ఇలా గ్రామ సమాజాన్ని విడగొట్టే ప్రక్రియలో రెండవ దశ ముగుస్తుంది.

3) ఇక మిగిలిందల్లా ప్రాజెక్టూ కంపెనీల గురించి అవగాహన ఉండీ, వాటి గురించి మాట్లాడడానికి వెనుకాడానిది చిన్ని గుంపు మాత్రమే. భూమి మీద వీళ్లకున్న అనుబంధం దృఢమైనది. ఇక ఆదివాసి సమాజానికైతే అడవి అంటే బ్రతుకుదెరువునిచ్చే వనరు మాత్రమే కాదు. అడవి అంటే తమ పూర్వీకుల నుంచీ వస్తున్న పవిత్రమైన వారసత్వం, పూర్వీకుల ఆత్మలు మసలే చోటు. తమ మధ్య ప్రాజెక్టులు కట్టి తమను భూమి నుంచి వేరు చేసి, నిర్వాసితుల్ని చేసే కంపెనీల గురించి వాళ్లకు అవగాహన ఉంది. కంపెనీలు ప్రాజెక్ట్లు పెట్టేది వాటి ప్రయోజనాలకోసం మాత్రమే అనీ, ప్రజలకోసం కాదనీ వాళ్లకు తెలుసు. పరిశ్రమలను నమ్మకూడదని పూర్వానుభవం వాళ్లకు చెబుతుంది. అందువల్ల, తమకు ప్రాజెక్టులు వద్దని వాళ్లు ఎలుగెత్తి చెబుతారు.

ఈ గుంపుతో పారిశ్రామికవేత్తలు ఎట్లా తలపడతారో చూద్దాం.

నయానో భయానో చెబితే ఈ గుంపు దారిలోకి రాదని పారిశ్రామికవేత్తలకు తెలుసు. దాపరికం లేకుండా మాట్లాడే వాళ్లతో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వ ఉద్యోగులతో, పోలీసులతో, అప్పటికే అమ్ముడైపోయిన యువకులతో మంతనాలు జరిపి, ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లను ఎట్లా నిర్వీర్యం చెయ్యాలో పథకం వేసుకుంటారు – ఎవరికి ఏం చేస్తే భయపడతారు. దేనికీ భయపడకపోతే వాళ్లను ఎట్లాంటి కేసుల్లో ఇరికిస్తే ఆక్కడి నుంచి అదృశ్యమవుతారు – ఇలా.

ప్రతిఘటన నాయకుల్లో కొంతమందిని నాన్ – బెయిలబుల్ కేసుల్లో ఇరికించినవీ, మరికొంతమందికి లోవర్ కోర్టుల్లో బెయిల్ నిరాకరిస్తే హై కోర్టుకు కేసు వెళ్లేలోపల సంవత్సరం పైగా జైళ్లో ఉండిపోయిన కేసులు  జార్ఖండ్ లో ఎన్నో.

ఎంతో సాంప్రదాయకంగా ఉండే ఆదివాసీ పెద్దలపై కూడా హత్యా, రేప్ వంటి తీవ్రమైన నేరారోపణలు చేసి జైళ్లో వేస్తున్నారు. ప్రాజెక్టులను వ్యతిరేకించే యువ ఉద్యమకారులైతే, పోలీసులు దౌర్జన్యంగా పట్టుకెళ్తారేమోననీ, కంపెనీలకు చెందిన గూండాలు దాడి చేస్తారేమోననీ,  వారం వారం జరిగే సంతకూ వెళ్లడానికీ, ఎక్కడికైనా వెళ్లేందుకు బస్సెక్కడానికీ భయపడతారు. మరోవైపు కంపెనీలు, ప్రాజెక్టు వ్యతిరేకులు రావడానికి వీళ్లేకుండా పరిస్థితులు కలిపించి నామ మాత్రంగా ‘ప్రజా విచారణ ‘లు నిర్వహించీ, ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి వచ్చే పనులు మొదలు పెడతారు. అదంతా అయ్యాక, ప్రాజెక్టు కట్టడాన్ని ప్రజలు అహ్వానిస్తున్నారనీ, అందుకు భూమిని ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించారనీ మీడియాలో ప్రకటిస్తారు.

ఇలా గ్రామ సమాజాన్ని విడగొట్టే క్రమంలో మూడవ దశ ముగుస్తుంది.

4) అయితే, బాధిత ప్రజలు ఎన్ని అడ్డంకులూ, ఇబ్బందులూ వచ్చినా విడిపోకుండా సంఘటితంగా నిలబడి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎదుర్కొన్న అద్భుత సందర్భాలు కొన్ని ఉన్నాయి.

అట్లాంటి అసాధారణమైన పరిస్థితులను అసాధారణమైన పద్దతిలో ఎదుర్కోవాలి. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వమూ, పోలీసులూ, ప్రాంతీయ పాలకుల మధ్య సహకారం చాల ముఖ్యమవుతుంది. ఇక్కడే ‘రాజ్యహింస ‘ వికృతరూపాన్ని చూస్తాం. ఇందుకు మరచిపోలేని ఉదాహరణ, 2001 లో కోయెల్ కరొ (తప్కార) పోలీసులు శాంతియుతంగా ప్రదర్శనలో పాల్గొంటున్న గుంపు మీద కాల్పులు జరపడంతో ఎంతోమంది గాయపడ్డారు, ఎనిమిది మంది మరణించారు. 2005 లో కళింగనగరులో బుల్ డోజర్లతో, ప్రభుత్వం ఇచ్చిన 11 ప్లటూన్లతో టాటా కంపెనీ వెళ్లినప్పుడు 11 మంది చనిపోవడం మరో ఉదాహరణ. ప్రజలను భూమి నుంచి వేరు చేసీ, నిర్వాసితులను చేసే ప్రాజెక్టులను ప్రతిఘటించే ప్రజా ఉద్యమాలను అణచడానికి ఇదే అంతిమ ఆయుధం.

అయితే, ప్రజలు ఈ యుద్ధంలో ఓడిపోయారని నిశ్చయించుకోకూడదు. పారిశ్రామికవేత్తల కపటబుద్ది గురించి ప్రజలకు ఇప్పుడు మరింతగా తెలుస్తోంది. తమ భూమిని పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి నిరాకరిస్తూ, సంఘటితంగా ఉండగలిగే ఉపాయాలను ప్రజలు కనుక్కుంటారు. అప్పుడిక మిగిలిందల్లా మానవతా విలువలు కలిగిన వాళ్లు పోరాడుతున్న రైతులకు సహకారంగా, సంఘటితంగా నిలబడడమే.

(www.sanhati.com నుంచి. అనువాదం: మమత కొడిదెల)

స్టాన్ స్వామి

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.