వెతుకులాట

“ఒరే! ఈరబాబు! ఇజీనగరం పైడితల్లమ్మ పండక్కి ఎప్పుడైనా ఎల్లేవా? ఎంత బాగుంతాదో తెలుసా?ఊరు వూరంతా నైట్లే. పట్టపగల్లాగా వుంతాది. ఎక్కడ సూడు, పులేసాలు, కొండేసాలు, కోయేసాలు, దొంగా పోలీసులు. మరో పక్క బుర్రకతలూ, అరికతలూ, డేన్సులు. ఒరే! సెప్పడానికి నేదురా. సూడాలి”

ఏడాది క్రితం అనుకున్న మాటలు గుర్తుకు వచ్చాయి  ఎనిమిదేళ్ళ వీరబాబుకి. ఆ మాటే వాళ్ళ నాన్నతో భోజనాలు అవుతున్నప్పుడు అన్నాడు.

“అయ్యా!అయ్యా! ఈ ఏడు పైడితల్లమ్మ పండక్కి తీసుకెళ్ళు”

“సూద్దాం లే”

“సూద్దాం అంటే కాదు. సాలా బాగా అవుద్దట. రాంబాబు గాడు సెప్పేడు”

”ఆడికేటి పోయింది. ఆడు సెప్తాడు”

“పోనీ, సరదా పడతన్నాడుకదా! నాకూ మొక్కులున్నాయి. ఈ ఏడు ఎల్దాం మావా(. ఎంతనీ పొద్దున్నఎల్తే, రాత్రికి ఎలాగో గడిపేసి పొద్దున్న వచ్చేయచ్చు.” అంది అప్పలనాయుడు భార్య వెంకటలక్ష్మి. ఆ మాట అనగానే గుండెల్లో రాయిపడింది వీరబాబుకి.

“కాదు, కాదు, అసలు పండగంతా ముందు రోజు తోలేలు రోజే నంట. ఊరంతా నైట్లూ, డెకరేసన్లు సాలబాగా సేస్తారట.”

“ఏటి, ఈ మాట కూడా ఆ రాంబాబుగాడే సెప్పేడా?” అన్నాడు కాస్త కోపంగా. “ఊ(..”అన్నాడు మరి కాస్త భయంగా.

“ఈ రాంబాబుగాడు ఎక్కడ తగులుకున్నాడ్రా?”

“పోనీ తల్లి ముగ్గురం ఎల్దాం. నానూ ఎప్పుడు సూడలేదు. అని భార్య కూడా అనేసరికి “ఊ(…”అన్నాడు.

అప్పటికి పండగ ఇంకా రెండు వారాలుంది. చాలా మంది పండగ గురించి చెప్పుకుంటున్నారు. అప్పల నాయుడు ఉంటున్నది. తామసపేట. విజయనగరానికి దగ్గరలో వున్న నెల్లిమర్ల పక్కన. పదిహేను కిలోమీటర్ల లోపే వుంటుంది. అయినా ఎప్పుడో తప్ప విజయనగరం వెళ్ళడు. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే నెల్లిమర్లలోని టూరింగ్ టాకీస్ కి వెళతాడు. మరీ అవసరమైన పని ఏదైనా పడితేనే వెళుతుంటాడు.  గతంలో ఏడెనిమిదేళ్ళ క్రితం ఒకసారి పండక్కి వెళ్ళాడు. గుంటడు సరదా పడుతున్నాడంటే నిజమే. చాలా బాగా జరుగుద్ది పండగ. అప్పటి తర్వాత మళ్ళీ ఇదే. ముందు అనుకున్నట్టే… పండగ ముందు రోజు తొలేలు సాయంత్రం, చీకటి పడేవేళలో భార్యా, కొడుకుతో బయలుదేరాడు. బస్సులన్నీ చాలా రద్దీగా వున్నాయి. అసలు లోనికి వెళ్ళడానికే ఖాళీ లేదు. మొత్తానికి జనాన్ని తోసుకొని లోనికి చొరబడ్డారు. సీట్లు లేవు. నిలబడే వున్నారు. వీరబాబుకి లోలోపల మహా సంతోషంగా వుంది.

ఊరి శివార్లలో నీళ్ళ టేంకు దగ్గర బస్సులు ఆపేస్తున్నారు. అక్కడ నుంచి నడిచేవెళ్ళాలి. బస్సు దిగినవెంటనే జనాన్ని చూసి వీరబాబుకి అయోమయంగా వుంది. అసలు అంత మంది జనాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒకసారి శివరాత్రికి రామతీర్థాలు వెళ్ళాడు గానీ, మరీ ఇంత జనం కాదు. అక్కడ నుండి బస్సులు లోనికి వెళ్ళవు కాబట్టి, చాలా బస్సులు ఒక పక్కగా పార్క్ చేసి వున్నాయి. అన్ని బస్సుల నుండి దిగేవాళ్ళే గానీ, ఎక్కే వాళ్ళు కనిపించడం లేదు. ఒకర్ని ఒకరు తోసుకుంటూ ఊర్లోకి వెళుతున్నారు నడిచే. వాళ్లనే అనుసరిస్తున్నారు ముగ్గురూ. కొంత దూరం మామూలు లైట్లు వున్నా, మరి కాస్త వెళ్లేసరికి డెకరేషన్ లైట్లు మొదలయ్యాయి. వీరబాబుకి మతిపోతోంది. వాడి జీవిత కాలంలో అన్ని లైట్లు ఎప్పుడూ చూడలేదు.

“ఫుట్ బాల్ గ్రౌండులో రికార్డేన్సుందట” అంటున్నారు ఎవరో. మాటలు వినిపించాయి గానీ, అన్న మనిషి కనిపించలేదు అప్పలనాయుడుకి. ముందు వెళుతున్న వెంకటలక్ష్మి వినలేదు. అప్పలనాయుడు విననట్టే ఊరుకున్నాడు గానీ, ద్యాసంత రికార్డేన్సు మీద మళ్ళింది. నెల్లిమర్ల శ్రీనివాస టూరింగ్ టాకీస్ లో చాలా సినిమాలు చూసాడు. వాటిల్లో చాలా పాటలు చూసాడు. కానీ, రికార్డేన్సు మాత్రం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళూ, వీళ్ళు అనుకుంటే వినడం తప్ప. చాలా బాగుంటాదట.  మేకప్పులూ, సెట్టింగులు అచ్చు సినిమాలోలాగేనట. ఆడోళ్ళయితే ఒంటి మీద గుడ్డ కానరట. చాన్నాళ్లనుంచీ చూడాలని వుంది. ‘ఆడోల్లు ఒంటి మీద గుడ్డ కాన్రట’ అనేమాట బాగా గుర్తుండిపోయి, ఈవాళ ఎలాగైనా వెళ్ళాలని మనసులో అనుకున్నాడు.

అప్పలనాయుడుకి ఆరెకరా భూమి వుంది. సొంతంగానే వ్యవసాయం చేసుకుంటాడు. ఎప్పుడోగానీ, కూలీలను పెట్టడు. భార్య కూడా భర్తతో పాటు పొలం పనులు చేస్తుంది. ఇల్లు కూడా సొంతమే. మొన్నటి వరకూ కమ్మలిల్లే వుండీది. ఈ మధ్యకాలం లోనే శ్లాబ్ వేయించాడు. ఇల్లు కట్టించి నపుడు కూడా ఇద్దరూ పనిచేశారు. సినిమా సరదా ఉంది గానీ, ఎప్పుడోగానీ కుదరదు. సినిమాకి వెళ్ళాలంటే తామసపేట నుండి నెల్లిమర్ల రావాలి. అందుకే సినిమాలకి వెళ్ళడం చాలా తక్కువ. అయినా రాజసులోచన ఉన్నదంటే, ఎలాగో వీలు చూసుకొని వెళతాడు. అప్పలనాయుడు మనసులో ఏముందో వెంకటలక్ష్మి తెలియదు. గుడి దగ్గరవుతున్నకొద్దీ జనం ఎక్కువవుతున్నారు. అప్పటికే సమయం పది దాటింది. లైట్ల వెలుతురు మూలాన సమయాన్ని అంచనా వేయడం కష్టంగా వుంది. వేషాలు గుంపులు గుంపులుగా వెళుతున్నాయి. గుంపుతో వేషాలు వచ్చినపుడల్లా, రోడ్డుకి ఒక పక్కగా వచ్చేసి, ఏ ఇంటి అరుగు మీదనో ఎక్కి వేషాలు చూస్తున్నారు.

ఒక ఆడమనిషి, ఇద్దరు మగవాళ్ళు వెళుతూ కనిపించారు. నెత్తిమీద కోడి వెంట్రుకలు, చేతిలో గొడ్డలి, గొడ్డలి చివర మెరుపులతో ముచ్చు కాగితం. ఒక చేత్తో గొడ్డలి పైకి ఎత్తుతూ, ఒక కాలు పైకి లేపి గెంతుకుంటూ వస్తున్నారు.

 “హే…పిల్లా..”అన్నాడు వేషంలో నున్న మగవాడు. ”హే…మామా…”అన్నాడు ఆడవేషంలోనున్నతను.

 “అటు కట్టా, ఇటు కట్టా ఇస్తరాకుల కట్ట, ఆ గుంటకు, ఈ గుంటకు కన్ను కన్ను కొట్టా….హై…హై…” అంటూ ముగ్గురూ గెంతుతున్నారు. ఇంకా అలాంటివే మరి రెండు పాటలు. ఇంటి గల వాళ్ళు ఏవో డబ్బులిచ్చారు. అవి తీసుకొని గుంపు కదిలింది. జనం కదలడంతో ముందుకు కదిలారు. ముందు వెళుతున్న గుంపు మరో ఇంటి దగ్గర ఆగడంతో, గుంపుని దాటుకొని ముందుకు కదిలారు. అంబటి సత్రం దగ్గరకు వచ్చేసరికి లైట్ల వెలుతురు మరీ ఎక్కువయింది. కొంత మంది ఘటం తీసుకు వెళుతున్నారు.

 “ముందు గుడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొందాం. రేపు సాయంత్రం కదా! సిరిమాను. మళ్ళీ రేపంటే ఆ దొమ్మీలో వెళ్ళలేం”అంది వెంకటలక్ష్మి.

“అలాగేలే. దర్సనం అయిన తరువాత అలా ఊరంతా చూసుకొని, అర్ధరాత్రి ఆటకు ఎల్లావంటే తెల్లారిపోద్ది. నేపోతే కుమ్మరి మేష్టరు బుర్రకత దగ్గరైనా కూర్చుండి పోవచ్చు”

“ఏదో చేద్దాంలే. ముందు ఆ తల్లికి దణ్ణం పెట్టుకుందాం” అనుకుంటూ గుడి దగ్గరకి చేరుకున్నారు. అప్పలనాయుడుకి అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే, ఫుట్ బాల్ గ్రౌండ్ కి వెళ్లి డేన్సర్ల దర్శనం చేసుకుందామని వుంది. పెళ్ళాంతో చెబితే “ఎల్తావు గవల ఎల్లు, ఎల్లి సొల్లుకారుసుకొని ముందు వరసలో కూకో” అంటది. అందుకనే, మనసులో మాట బయటకి అనలేదు. ఒక్కణ్ణి అయినా వచ్చాను కాదు. ‘అనవసరంగా ఈల్లని తీసుకొచ్చాను. ఊళ్ళోని ఎవడూ రికార్డేన్సు వుందని అనుకోలేదు’ మనసులో అనుకున్నాడు.

అప్పటికే గుడి దగ్గరకు వచ్చేసారు. చాలా జనం వున్నారు. వెళ్లి లైన్లో నిలబడ్డారు. ఆడవాళ్ళ లైన్లో వెంకటలక్ష్మి. మగవాళ్ళ లైన్లో అప్పలనాయుడు వెనకనే వీరబాబు. ఈ లైట్ల డెకరేషనూ, వేషాలూ చూసిన వీరబాబుకి ఎప్పుడో మతిపోయింది.      

     “ఈసారి డెకరేషన్లు బాగా చేసారే” అన్నాడు ఒక లైన్లలో నిలబడ్డ భక్తుడు.

   “ఇక్కడేటి, గంటస్తంభం దగ్గర చూడాలి. మూడు గుర్రాల బీడీలూ, నాలుగు గుర్రాల బీడీలూ లైటింగు చూడాలి. రెండు కళ్ళూ చాలవు” అన్నాడు మరొకడు.

“ఆ(…అంత బాగుందా?”అన్నాడు మరొకడు.

“అయ్యా!మనం ఎల్దాం.”

“అలగేలేరా! మరెందుకొచ్చాం అయితే” అన్నాడు. అందరూ ఎవరికి తోచిన మాటలు వాళ్ళు ఆడుతున్నారు. వీరబాబు ధ్యాసంతా డెకరేషన్ మీదవుంటే, అప్పలనాయుడు ద్యాసంతా రికార్డ్ డేన్సు మీద వుంది. వెంకటలక్ష్మి ద్యాస మాత్రం అమ్మవారి మీదే వుంది. లైను నెమ్మదిగా కదులుతోంది. దాదాపు గంటన్నర అనంతరం బయటకు వచ్చారు. అప్పటికే వెంకటలక్ష్మి వీళ్ళ కోసం ఎదురు చూస్తోంది. బయటకి వచ్చి ప్రసాదాలు కొన్నాడు. ముగ్గురూ ఒక దగ్గర నిలబడి తిన్నారు. అప్పటికి సమయం ఒంటిగంట. అక్కడనుండి బయటపడి ముందుకి వచ్చారు. జనాన్ని చూసి  

”ఒరే! వీరబాబూ! చెయ్యి వదలకు. జనం ఎక్కువగా వున్నారు. తప్పిపోతావు” ఇంతలో పులివేషాలు గుంపుగా వచ్చాయి. “నాక్కనిపించడం లేదు” ఎత్తు కొని భుజం మీద కూర్చో బెట్టుకున్నాడు. ఒకకాలు తల వైపూ, ఒక కాలు వీపు వైపూ వేసుకొని, రెండు చేతులతో తలని సపోర్ట్ గా పట్టుకొని పులివేషాలు చూస్తున్నాడు. ఇంతలో నాగినీ వేషాల గుంపు వచ్చింది. ఆ గుంపూ, ఈ గుంపూ ఒకటే దొమ్మీ. అప్పటికే వీరబాబుని చాలా సేపటినుండి ఎత్తుకొని వున్నాడేమో, భుజం నొప్పెట్ట సాగింది. ఇద్దరు, ముగ్గురు తోసుకొని వచ్చేసరికి తూలిపడబోయి తమాయించుకున్నాడు. వీరబాబుని కిందకి దించి చెయ్యిపట్టుకున్నాడు. తస్సాదియ్యా! నాగినీ డేన్స్ భలేగా వుంది. రెండు వరసలు. మద్యలో మాంత్రికుడు. పులివేషాల గుంపు ముందుకు కదలడంతో, నాగినీ వైపే చూస్తున్నాడు.

మూడు లాంతర్ల సెంటర్ లో భాగోతం అవుతోంది. చాలా మంది ముసలి వాళ్ళు ముందు చాపల మీద కూర్చున్నారు. అంత వరకూ  వీరబాబు పట్టుకున్న చెయ్యి ఖాళీగా వుండడం గమనించేసరికి, ఒక్కసారిగా గుండె గుభేల్ మంది.

 “ఎంకట లస్మి! ఏడీడు?”

 “నువ్వే సెయ్యట్టుకున్నావు నన్నంతావేటి?”

“ఇంచేపు ఇక్కడే ఉండాలే. నా బుజం మీదే వున్నాడు. పులేసాలు సూసాడు. బుజం నొప్పెడతుందని దించాను.”అటూ..ఇటూ..చూసాడు. ఎక్కడా కనిపించలేదు. “ఏం వెతుకుతున్నారు?”

 “నా కొడుకండీ”

 “ఎంత వయసు”  “ఏడేల్లు”

 “చెయ్యిపట్టుకొని ఉండాలయ్యా!జనం చూడు ఎలగున్నారో. ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా?అన్నారెవరో.

“కంగారుపడకు. ఇక్కడే ఎక్కడో ఉంటాడులే”అన్నాడు మరొకడు. అప్పలనాయుడూ, వెంకటలక్ష్మి వెతుకుతూనే వున్నారు. “వుండే నువ్వు దూరంగా ఎల్లకు. మల్లీ నిన్నేతుక్కోవాలి” వెంకటలక్ష్మి ఏడుపు ముఖం పెట్టేసింది.

 “ఒరే!….ఈరిగా ఎక్కడున్నావురా?”ఆ మాటలు బయటకే అనేసింది.

“నువ్వేడకే. ఎతుకుదాం. ఆడికి మాత్రం బయం కాదేటి?మనం ఎతుకుతున్నట్టే, ఆడు మనకోసం ఎతుకుతుంటాడు” అని భార్యతో అన్నడుగానీ లోలోపల భయంగానే వుంది.

 “నువ్వీ టీ కొట్టు కాడుండు. నాను గుడి సుట్టూర వున్న రోడ్డంతా ఒకసారి సూసొస్తాను. ఇద్దరం ఒక దిక్కే ఎందుకు? ఈ లోపు మన గుంటడు ఇలాగే వస్తాడేమో? సూస్తూ వుండు. నువ్వెటు ఎల్లిపోకు”

” ఇది మరీ బాగుంది. నాకీ వూరేతెల్దు. నానేటెల్తాను. బేగిరా ”

అప్పలనాయుడు భార్యని వదలి, గుడి వెనకవైపు నుండి బయలు దేరాడు. చుట్టూ చూస్తూనే వున్నాడు. అప్పటికే సమయం రెండు. గుడి వెనక కూడా జనం ఒకర్ని ఒకరు తోసుకుంటూ వెళుతున్నారు. ఎక్కడా కనిపించడే గుంటడు. కంగారుగా వుంది. మళ్ళీ ఒకసారి పైడితల్లమ్మకి మొక్కుకున్నాడు’ మా ఈరబాబు గాడు దొరికితే, మళ్ళీ ఏడు నీకు ఘటం తీసుకొస్తాను తల్లీ’ అటుపక్కా, ఇటుపక్కా అరుగుల మీద చాలామంది కూర్చుని వున్నారు. ఏడెనిమిదేళ్ళ వయసు పిల్లలు ఎవరు కనిపించినా వీరబాబు లాగే కనిపిస్తున్నారు. బూరలు ఊదుకుంటూ కుర్రకారు, బెలూన్లూ, కాగితం చక్రాలతో చిన్నపిల్లలు. అంతా కోలాహలంగా వుంది.

“ఎవర్నో వెతుకుతున్నట్టుంది”అన్నారు ఎవరో.

“నాకొడుకు బాబూ! గుడిలోనుండి బయటకు వచ్చిన తరువాత మూడులాంతర్ల సెంటర్ లో తప్పిపోనాడు”

“జనంలో చెయ్యి వదలకూడదయ్యా”

“నేదు..నేదు..పట్టుకొనే వున్నాను. ఒక్కఊపులో ఏసాలు రాబోతప్పుడికి చెయ్యి జారిపోయింది. మరవుపడ్డాడు కాడు”

“సరే!ఒకపని చెయ్యి. గుడిఎదురుగా పోలిస్ కంట్రోల్ రూము వుంటుంది. అక్కడ పిల్లాడి గుర్తులు చెప్పు. వాళ్ళు మైక్ లో అనౌన్స్ చేస్తారు. దొరికితే అక్కడే వుంచి నీకు అప్పజెబుతారు. తప్పాకుండా దొరుకుతాడు గాబరాపడకు. ఇలా ఎంతని వెతుకుతావు” అన్నాడు. అన్నది ఎవరో తెలీదుగాని, దేవుడులాగా కనిపించేడు. ’ఇప్పుడే ఆ తల్లికి మొక్కుకున్నాను. ఇంతలోనే ఆ అమ్మే ఈ దారి చూపించింది.’ అనుకున్నాడు.

“అలాగే బాబూ!ఇప్పుడే ఎల్తాను” అంటూ అటువైపు అడుగులేసాడు. గుడి ముందు వున్న ఖాళీ జాగాలో వుంది. పొలీస్ కంట్రోల్ రూమ్. అక్కడకు వెళ్లి చెప్పాడు. వివరాలు అన్నీ రాసుకున్నారు. ”మేం మైక్ లో అనౌన్స్ చేస్తాం. నువ్విక్కడే వుండు”అన్నాడు.

“నాను కూడా ఎతుకుతాను బాబూ!”

“సరే! నువ్వు అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికే రా! దొరికితే ఇక్కడే ఉంచుతాంలే. కంగారుపడకు”

అక్కడ నుండి బయటపడి వెంకటలక్ష్మి దగ్గరకు వచ్చాడు. మనసంతా ఆందోళనగావుంది. మైకులో సెపుతారుకదా! దొరుకుతాడు’ అని ఆశగా కూడా వుంది. దిక్కులు చూస్తూ బిక్కుబిక్కుమంటూ ఒక పక్కగా నిలుచుంది వెంకటలక్ష్మి. ఎవరో పోకిరీ కుర్రాడు ఒంటరిగా వుంది కదాని మీద చెయ్యి వెయ్యబోయాడట చెప్పింది.

“అంతలే పద అలా చూసుకుంటూ వెలదాం”

“అక్కడ కోటకి నైటింగు బాగుంది కదా!ఒకేలా అటేపు ఎల్లాడేమో” అంది.

“సరే! ఇటేపు అంతా సూస్సేం కదా! నువ్వన్నట్టు అటేల్లాడేమో పద” అంటూ కోట వైపు ఇద్దరూ అడుగులేసారు.

కోటంతా సీరియల్ సెట్లతో అలంకరించారు. కోట ఆకారం అంతా కనిపిస్తూ, దూరం నుండి భలేగా వుంది. కోట ముఖద్వారంనుండి చుట్టూ చూస్తున్నారు. “కోట ఎంత పెద్దదో…ఇందులో రాజుగారు ఉంటారా?”

“ఇప్పుడు ఎవరూ లేరే, కోటంతా ఇస్కూల్లకీ, అపీసులకీ ఇచ్చేసేరట”

“ఒప్పుడైతే మాత్రం. ఇంత పెద్ద ఇల్లే” “దాన్ని ఇల్లన్రే కోటంటారు” కోటని చూసి మైమరచిపోయింది గానీ, అంతలోనే వీరబాబు గుర్తుకొచ్చాడు. “ఇటే వచ్చుంటాడు నైటింగు బాగుందని” ఒక పిల్లవాడు వీరబాబులాగా బట్టలేసుకొని కనిపించాడు. దగ్గరకు వెళ్లి చుస్తే కాదు. వచ్చేపోయే వాళ్ళని పట్టి, పట్టి మరీ చూస్తున్నారు. ఎదురుగా కుమ్మరి మేస్టారి బుర్రకధ అవుతోంది. ఇసకేస్తే రాలనంత జనం. ‘గుంటడు ఇక్కడ గానీ, కూకుండి పోండా? ’ దాటుకొని వెళ్ళడానికి అవకాశమే లేదు. చుట్టూ తిరిగి నడుస్తూనే వున్నారు. మనసంతా లైట్ల మీదా, పండగ మీదలేదు. వీరబాబు మీదే వుంది. కాసేపు పరిసరాల ద్యాసలో పడినా, అంతలోనే వీరబాబు గ్న్యాపకం వస్తే, మనసంతా దేవేసి నట్టుట్టుంది ఇద్దరికి.

“ఎటెల్లిపోయడో ఏంటో, అనవసరంగా వచ్చాం. రాకపోయినా బాగున్ను”

“ఛ!తప్పు మావా(..అలగనకు. నువ్వాడుసెయ్యోదిలీసి, ఆ తల్లి నంటావేటి”

“ఈరబాబు కనిపిస్తే, మల్లీ ఏడు గటం ఇస్తానని మొక్కేనే”

“మంచిపని సేసావు. నీతో అనలేదుగానీ, నేనూ మొక్కాను” “మంచి పని చేసావు” అన్నాడు. మాట్లాడుకుంటూనే గంట స్థంభం వైపు వచ్చారు. గంటస్తంభం కూడా సీరియల్ సెట్లతో మెరిసిపోతోంది. అయినా ఆ అందాన్ని చూసి ఆస్వాదించే స్తితిలో లేరు. ఎక్కడా కూర్చోలేదేమో కాళ్ళు పీకులుగా వున్నాయి. ఆమాటే అంది వెంకటలక్ష్మి.

“పద అక్కడ మస్తాన్ కొట్టుదగ్గర టీ తాగుదాం” పెద్ద రావి చెట్టు. కిందన టీకొట్టు. ముందునున్న చెక్కబెంచి మీద కూర్చుంది వెంకటలక్ష్మి. నడచి నడచి ఉందేమో హయిగా అనిపించింది. అప్పలనాయుడు వెళ్లి రెండు టీలు పట్టుకొచ్చాడు. టీ తాగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్టుంది. మస్తాన్ టీకొట్టు ఎదురుగా వుంది.మూడు గుర్రాల బీడీల డెకరేషన్.

“అబ్బా!ఏం నైటింగ్” బయటకే అంది. ‘ఈ నైటింగ్ సూసి మైమరసిపోయి ఇక్కడ కూకుండిపోనాడేమో గుంటడు’ టీ తాగుతూ అనుకున్నాడు అప్పలనాయుడు. టీ గ్లాసులు పక్కన పెట్టేసి, బయటపడ్డారు. అప్పటికే సమయం మూడు దాటింది. అక్కడ అంతా వెతికారు. చాలా మంది జనం అక్కడ వరకూ వచ్చి, లైట్ల అందానికి మురిసిపోయి నిలబడిపోయారు. మూడు గుర్రాలూ ఒకదాని వీపుమీద ఒకటి కాళ్లేసి వున్నాయి. సీరియల్ లైట్లు వెలిగి అరడంలో గుర్రాలు పరిగెడుతున్నట్లే వున్నాయి. ఎక్కడా కనిపించలేదు.

“నాలుగు గుర్రాల బీడీల డెకరేషన్ దీనికన్నా బాగుంది”అన్నారెవరో.

“ఎక్కడ బాబూ! అది”

“గంటస్థంభం దాటిన తరవాత కొప్పుగుర్రాన్న బిల్డింగ్ దగ్గర”

“పదే! అటుకాసి ఎలదాం. ఇక్కడలేడు” జనాన్ని తప్పించుకుని ఇద్దరూ బయలు దేరారు. అంత రాత్రిలో కూడా జనం బాగానే వున్నారు. అది అర్ధరాత్రి సినిమా ఆటలు మొదలైన సమయం కాబట్టి, జనం కాస్త పలచబడ్డారనుకోవచ్చు. ఒకరిద్దరు పోకిరీ కుర్రాళ్ళు వెంకటలక్ష్మి మీద చెయ్య వెయ్యబోతే తప్పించుకుంది. గొడవ అవుద్దని ముందు వెళుతున్న మొగుడుతో చెప్పలేదు. నాలుగు గుర్రాల బీడిల డెకరేషన్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ కూడా చాలాలైట్ల డెకరేషన్ వుంది. ఒకరికి ఒకరు ఏమీ తీసిపోరు అన్నట్లుగా వుంది డెకరేషన్.

“అబ్బా! ఎంత ఎలుతురో?ఎన్ని నైట్లో. ఈ కరుసంతా ఎవరు పెట్టుకుంటారు?”

“ఇంకెవరు కంపెనీ ఓడే”

“ఆడికి మాత్రం ఎక్కడ నుండోస్తాది?”

“లాభాల్లో పెడతాడు. లేకపోతే అడింట్లో సొమ్మెడతాడేటి”

“అమ్మ బాబోయ్! బీడిల్లోనుండి అంతంత లాభాలొస్తాయా?”

“ఒక్క మనూర్లోనేనేటి? అంతలక్కా అమ్ముతారుకదా!” ఇలాతలో మాటా అనుకుంటున్నారు. మాటల్లో పడి వీరబాబు సంగతి కాసేపు మరచిపోయినా అంతలోనే గుర్తుకు వచ్చి, వెతకడం మొదలెట్టారు. అందరి మధ్యలోని వున్నాడేమో నని ఆశగా అందరి మద్యా అటూ, ఇటూ తిరుగుతూ అక్కడికక్కడే వెతికారు. ఏదీ కనిపిస్తేనా?

 “ఒరే! ఈరబాబు ఎక్కడున్నావురా?”బయటకే అంటూ కళ్ళమ్మట నీళ్ళుపెట్టుకుంది. కళ్ళవెంట దాదాపు నీళ్ళు వచ్చినట్టే వున్నాయిగానీ తమాయించుకొని ”దొరుకుతాడులేయే”అంటూ లేని దైర్యం తెచ్చుకొని అక్కడనుండి బయటపడ్డారు. అక్కడనుండీ కన్యకాపరమేశ్వరీ గుడివైపు వెళ్లి, ఆ గుడి చుట్టూ కూడా తిరిగారు. అక్కడా జనమే. సమయం గడుస్తూనే వుంది.

“ఇంత వరకూ రాడు. ఆడికి ఈవూరు కొత్త. ముందూమునుపు ఎప్పుడైనా ఒచ్చాడేటి? ఆడికి ఇంత దూరం రాడం బయం కదేటి. గుడి దగ్గరకే ఎల్దాం. మైకిలో సేపుతున్నారు కదా! ఈపాటికి దొరికేవుంటాడు”అనుకొని ఇద్దరూ వెనుదిరిగారు. చాలా వరకూ షాపులు మూసేసి వున్నా, లైట్ల డెకరేషన్ మాత్రం వుంది. మళ్ళీ మూడు గుర్రాల డెకరేషన్ మీదుగా నడుస్తున్నారు. కాస్త దూరంలో ఎడమచేతి వైపు మినర్వా సినిమాహాలు. ఎదురుగా “అచ్యుతరావు టైలర్”బోర్డ్ చూసాడు. అప్పుడప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ బట్టలు తీసుకురావడానికి అక్కడకి వస్తుంటాడు.

“మనూరి పెసిడెంటు ఇక్కడే బట్టలు కుట్టిస్తాడే”

“అలాగా”అని మరి కాసేపటికే ”ముందు ఈరబాబు సంగతి సూడు”

“సూస్తన్నాను లేయే” పులివేషాలు గుంపుగా వస్తున్నాయి. గుడి దగ్గరవుతున్న కొద్దీ జనం ఎక్కువవుతున్నారు. ఆశలన్నీ పోలీస్ కంట్రోల్ రూమ్ మీదే పెట్టుకున్నారు. గుడి ఎదురుగానున్న బండి మీదకూడా అమ్మవారు ఉంటాదట. లోపలికి వెళ్ళలేం అనుకునే వాళ్ళు కొందరు అక్కడే మొక్కులు తీర్చేసుకుంటున్నారు. ఆ బండి వెనకాలే వున్నా కంట్రోల్ రూము దగ్గరకు వెళుతున్నాడు. అంతలో…

“తామసపేట గ్రామం కాపురస్తుడు. అప్పలనాయుడు ఎక్కడున్నా పోలీస్ కంట్రోల్ రూము దగ్గరకు రావాలి. మీ అబ్బాయి వీరబాబు ఇక్కడే వున్నాడు” ఆ మాటలు ఆలకించగానే ప్రాణం లేచి వచ్చింది ఇద్దరికీ. “హమ్మయ్య” అనుకొని దగ్గరకు వెళ్లారు. ఒకపక్కగా వీరబాబు పులిహోర తింటూ కనిపించాడు. అప్పలనాయుడుని చూసిన వెంటనే తింటున్న పులిహోర ఆపేసి వచ్చి”అయ్యా!…”అంటూ కౌగిలించుకున్నాడు.

“బాబూ! నేనే అప్పలనాయుడ్ని” అన్నాడు పొలీస్ తో.

“ఎక్కడి కెళ్ళిపోయావయ్యా! తెల్లవార్లూ గుంటడు ఏడుస్తూనే వున్నాడు. మీరు ఇలా కంప్లయింట్ ఇచ్చి వెళ్లారు.  ఎవరో తీసుకొచ్చి అప్పజెప్పారు. ఒక గంట లోపే దొరికాడు”

“ఎక్కడెక్కడ తిరుతున్నాడో నని, ఊరంతా తిరిగాం బాబూ!     

“మీరు కనిపించనేదు ఎంత బయం ఏసిందో”అన్నాడు వీరబాబు తల్లిని కావిలించుకుంటూ.

“ఏవైనా తిన్నావా?”అడిగింది.

“ఆడికేం. నాలుగు పులిహోర పొట్లాలు లాగించాడు”

“ఎల్లోస్తాం బాబూ!”

“ఆగాగు. ఇక్కడ సంతకం పెట్టు”అన్నాడు పోలీసు. వేలిముద్రవేసి ముగ్గురూ బయటపడ్డారు.

“నీకోసం ఊరంతా తిరిగాంరా! నైట్లు డెకరేసను ఎంత బాగుందో. పద”

“నాకే నైట్లు వద్దు. అసలీ వూరే వద్దు. పద మనూరుఎల్లిపోదాం”

“తప్పు అలా అనకూడదు. మనం జాగ్రత్తగా వుండాలి. నువ్వు అయ్య సెయ్యి వదిలేసావు. తప్పిపోనావు. మద్య ఆ తల్లేటి సేసింది”

“మరలాటప్పుడు ఎంటనే మిమ్మల్ని సూపించాలి కదా!”

“నోర్ముసుకో. పద పద”

“అప్పటికే తూరుపురేఖలు కొద్దికొద్దిగా విచ్చుకుంటున్నాయి. ఒక పక్కగా వెళ్లి, ఒక షాపు అరుగుమీద కూర్చున్నారు. పక్కనేవున్న టీకొట్టు దగ్గరనుండీ పందుం పుల్లలు తెచ్చాడు అప్పలనాయుడు. ముగ్గురూ ముఖాలు కడుక్కున్నారు. టిఫిన్ చేసి, టీ తాగారు. “రికార్డేన్స్ భలేగా వుందయ్యా”ఎవరో ఎవరితోనో అంటున్నారు. అప్పుడు గుర్తుకు వచ్చింది రికార్డింగ్ డాన్స్.  ఇంకేం రికార్డింగ్ డేన్సు. బళ్ళున తెల్లరిపోతే. ఈపాటికి ఆ డెన్సర్లు ఆళ్ళ ఊరు బస్సేక్కేసే వుంటారు.

వి. వెంకట్రావ్.

4 comments

 • బాగుందండీ. రచయిత బాగా రాశారు.
  చివరికి ఏమవుతుంది, రచయిత ఏం చెప్పబోతున్నారోనని ఉత్కంఠగా చదివాను కథ!
  చివరికి పిల్లాడికైనా జ్ఞానరేఖలు విచ్చుకున్నాయి గానీ, తల్లిదండ్రుల్లో మార్పు రాలేదు. తండ్రయితే తన బలహీనతని వదిలించుకోలేదు, అందుకు విచారించనూ లేదు!.

 • చాలా బాగుందండీ.. సిరిమాను పండగ గుర్తొచ్చింది.. పండగ వైభోగం చూసి మైమరచి పోవడం.. అంతలోనే తప్పిపోయిన కొడుకుని గుర్తుకొచ్చి భాదపడడం.. ఇలాంటి భావోద్వేగాల సమాహారం ఈ కథ. కథలో వాడిన యాస, నడిపిన విదానం చాలా నచ్చింది. ఇజీనగరం 🙂 🙂

 • సాంబశివరావు గారికి కధ అర్థం అయినట్టు లేదు. తండ్రికి తన బలహీనత గుర్తే రాలేదు, పిల్లాడు దొరికే వరకూ. భార్య నోటికి దడిసి, బలహీనతని నొక్కుకున్నాడంటే, సగటు మంచి మనిషే. ఆ బలహీనతని సమర్థిస్తున్నట్టు కాదు. పిల్లాడి బుర్రలోని అంధకారానికి వయసు తక్కువ. అందుకే అలా అనగలిగాడు. ఆ పెంపకంలో ఆ అంధకారం పెరుగుతుంది. ఆ తల్లిదండ్రులు మొక్కుకోబట్టే పిల్లాడు దొరికాడనుకుంటారు. పిల్లాడు దొరికాక కూడా, ఎవడో అనేవరకూ, తండ్రికి తన బలహీనత గుర్తు రాలేదంటే, కాస్త ప్రేమమయుడే. పిల్లాడిని భుజాల మీదకి ఎక్కించుకుని, వేషాలు చూపించేడంటే, అతను తండ్రే.

  అచ్చు తప్పులు బాగానే వున్నాయి.

 • విజయనగరం లో పెద్ద పండుగను బాగా పరిచయం చేసారు. కుటుంబంలో
  మనస్తత్వాలు మంచి చిత్రీకరణ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.