అంతరంగం పలవరింత
హైమవతి కవిత

“ఔను
నేనెప్పుడు
రెండవ పుటనే
అప్రాముఖ్య అక్షరాన్నే”

ఎత్తుగడతోనే ఉద్వేగ ప్రవాహంతో గొప్పగా చెప్పగలిగిన కవయిత్రి “మందరపు హైమావతి”. స్త్రీలు అనాదిగా తమ తమ మీద మోపబడిన  బరువులను మోస్తూ, అవి తమ మీద రుద్దబడడం గుర్తిస్తూ, వాటిపట్ల విముఖత చూపిస్తూ, అస్తిత్వ బావుటాని ఎగరేస్తున్న సమయంలో వారితో పాటుగా ఆ జండాని పొదివి పట్టుకుని వారితో పాటుగా కలిసి నడిచిన కవయిత్రి హైమవతి.

మాటలు లేని ఎడారిలో అనే కవితతో ప్రారంభ మవుతుంది ఈ నీలి గోరింట సంపుటి. సాధారణంగా ఉద్యోగం చేసే భార్యలు సాయంత్రం బడలికని వదిలించుకోవడానికి కాస్త ఏకాంతాన్ని కోరుకుంటారు ఆ కోరుకోవడాన్ని కవయిత్రి ప్రారంభంగా ఎంచుకుని ఇలా మొదలు పెడతారు ఆ కవితని.

“అనేకానేక ఒత్తిళ్ల పగటి తరవాత
వడలిన తోటకూర కాడలా
ఇంటికి వచ్చిన నిర్జీవ సాయంత్రాలు
నీ భుజం పై తలవాల్చి సేదదీరాలను కొంటా
నిశ్చింత తటాకంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని
హాయిగా ఉండాలి అనుకుంటా
సూర్యోదయంతో వెళ్లి
చంద్రోదయానిగ్గాని
తిరిగిరాని సమయాల
అది ఒక నెరవేరని కల”

కోట్లాది మంది ఉద్యోగినుల మనసు లా లేదూ ఈ పద్య భాగం?! తాము కుటుంబం కోసం ఏం కోల్పోతున్నామో తెలిసి, దాన్ని కోరుకోవడంలో పడే తపన ఈ కవితలో ఒక ప్రవాహంలా వెళుతుంది.

బస్సులో, బాసుల దగ్గర, ఆకతాయిల దగ్గర తన బాధలని చెప్పుకుంటూ ఇంటిదాకా వచ్చి తాను కోరుకున్నది దొరకదని తెలుసుకుని కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళ ఆకలి కోసం వాళ్ళని తప్పించుకోలేక మాటల్లేని ఎడారిలో ఒంటరి ఒంటెనై పోతా అని ముక్తాయింపు ఇస్తారు. ఇది దినచర్య కవిత అంటాను నేను. రోజూ చూస్తూ చూస్తూ నే మనం తొక్కుకుంటూ వెళ్లిపోయే దారిలోనే ఉంటారు వీళ్ళంతా. మనం గుర్తించం, అంతే తేడా.

రోడ్డు మీద మనం వెళుతున్నప్పుడు హఠాత్తుగా ఒక పాట మనల్ని సాయంత్రం గాలిలా తాకుతుంది. పాపం ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది మనుషులు ఒక కూడలి లో పాటలు పాడుతూ ఉంటారు. వారు దివ్యాంగులు. కళ్ళు కనబడవు కానీ స్వరం మాత్రం ఒక ప్రభంజనం లా సాగుతుంది. వాళ్ళ దగ్గర జనరంజకమైన వాయిద్యాలు ఉండవు. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడి ఆ పాటల్ని మన చెవుల దాకా చేరవేస్తారు. కానీ ఇక్కడ కూడా మనం వీళ్ళని పట్టించుకోము. ప్రపంచం తో పాటుగా పరిగెడతాం ,నడుస్తాం, కౌగలించుకుంటాం కానీ, ఆ ప్రపంచంలో తోటి వాడి బాధని మాత్రం నిర్లిప్తగా వదిలేస్తాం. ఆ నిర్లిప్తత ఖరీదు ఆ రోజు ఆ నలుగురి ఆకలి. అందుకే ఇలా ముగిస్తారు ఆ కవితని.

“ఆత్మ న్యూనతా భావం చెదలు
కొరికి వేసిన గుండెలతో
కృంగి కృశించిన మరుగుజ్జులు
మానసిక వికలాంగులకన్నా
ఆత్మవిశ్వాస రాగ సాధనలో
అనంత విశ్వాన్నే జయించిన
అపర త్యాగరాజులు
స్వర సమ్మోహనారాగాలు ఆలపించే
స్వర మాంత్రికులు
మహేంద్ర జాలికులు…!”

నిజమైన అవయవ లోపం అంటే ఎదుటి వ్యక్తికి సాయం చేసే గుణం లేకపోవడమే అని ఇచ్చే ఈ ముక్తాయింపు పోయంకి హైలెట్ గా చెప్పవచ్చు.

హైమవతి కవిత్వం చదివితే మనకి భాష మీద చాలా గొప్ప పట్టు వస్తుంది, పురాణ పాత్రలు అలా అలవోకగా ఆమె కవిత్వ పాదాల మీదుగా నడుస్తూ పోతాయి. అవన్ని ఆ కవితకి అవసరం పడేవే. బలవంతంగా ఇరికించడం ఎక్కడా ఉండదు. ఆ పదాల  వాడకం, ఆ శైలి లో ప్రాచీన అలంకారాలని అలవోకగా ఇమిడ్చి వచన కవిత్వాన్ని రాయడం అంత సులువుకాదు, దాన్ని చాలా సునాయాసంగా చేస్తారు అందుకే హైమవతి అందరికన్నా భిన్నంగా కనబడతారు.

“ప్రవరుడా ….! నా వలపు దీపమా
మదీయ చిరకాల స్వప్నమా
జీవన వీణపై
ప్రవర రాగాన్ని మీటినందుకే
నేనొక నిందా వాచకాన్ని
నీచ ప్రతీకను”

ఇది మరో గాయపడిన గుండె ఘోష. ఇష్టం అనేది చాలా గంభీరమైన పదం, ప్రవరుడు అనే పురాణ పాత్రని తీసుకుని రాసిన ఈ కవిత మరో మంచి కవిత. సమాజంలో కేవలం పురుషులే స్త్రీలని  ప్రేమించాలని ఒక నియమంలా పెట్టుకుని దాన్నే ఒక సిద్దాంతం గా నమ్ముతూ, తమంత తాముగా పురుషులను ఇష్టపడే స్త్రీలని తక్కువ చూపుతో చూడడం మన వాళ్ళకి బాగా అలవాటు. ఎంతసేపు స్త్రీ ని వంట గదికి పరిమితం చేయడం, శయనేషు రంభ అని పడక గదికి పరిమితం చేయడం, ఒక అందమైన మాసంపు ముద్దని యుద్ధంలో గెలుచుకుని వచ్చి వారి ని కోటలో బంధించి కామకోరికలకు వాడడం వంటివి చరిత్ర నిండా చదువుకున్నవే కదా వాటినే ఈవిడ చాలా తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తుంది.

“ఎన్ని మాటలన్నావు
ఎంత అవమానం చేసావు
వేలయుగాలుగా వందల తరాలుగా
మా మనసులనే కాలిపట్టాలుగా తలచి
తొక్కుకుంటూ ఎంత కావరం…!

అంటారు.నిజమే కదా అనిపిస్తుంది కానీ ఇది ఒక అంతరంగ గాయం అని మనం అసలు గుర్తించలేం.

ప్రపంచీకరణ భారతదేశం మీద చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. బలమైన ఆర్ధిక మూలాలు కలిగిన దేశం కూడా పునాదుల్లో నెర్రెలు కనబడ్డాయి. ఆ సెగ ఎక్కడో చిన్న చిన్న పనిచేసుకునే పని వాళ్ళని కూడా తాకింది. దానికి ఆడా, మాగా అనే జండర్ పట్టింపు లేదు. ఎవరైనా దానికి దాసోహం అన్నవాళ్లే. దాన్నే ఈవిడ గుర్తించారు. వాళ్ళ వీధిలో రోజు వీళ్ళ వంటింటి  అవసరాల్ని తీర్చడానికి వచ్చే కూరగాయల అమ్మాయిని కేంద్రంగా తీసుకుని ఒక కవిత రాశారు. దాని మకుటం కూడా అదే.

రోజూ వచ్చే కూరలమ్మి ని చాలా చక్కగా వర్ణిస్తూ ,ఆమె తమ అవసరాల్ని ఎలా తీరుస్తుందో వివరిస్తూ ఇదిగో ఒక కవితని రాశారు

ఒక కాలు అరుగుమీద పెట్టి
ఒక చేత్తో నెత్తిమీద చుట్టకుదురు పెట్టి
బరువైన గంపను
శిరస్సుపై అలవోకగా ఎత్తి పెట్టుకునే దృశ్యాన్ని
గారడీ చేస్తున్నట్టు అబ్బురంగా చూసేదాన్ని”

కనబడడానికి ఈ కవిత అంతా బాల్యం చుట్టూరా తిరుగుతూ నోస్టాల్జియా లాగా కనబడుతుంది కానీ అంతర్లీనంగా మరో పార్స్వం ని రచయిత్రి నడిపిస్తారు. ఈ కవిత టెక్నీక్ అదే. అలా రోజూ వచ్చే అమ్మాయి రావడం లేదు, ఒక వేళ వచ్చినా ఎవరూ కొనడంలేదు, ఎందుకని. ఎందుకని అంటే వీధి చివర వెలిసిన రిలయన్స్ అనే ఒక భూతం కూరగాయలమ్మాయిని నమిలేసింది. ఆడవాళ్లు అందరూ సాయంత్రం వాహ్యాలికి కి పోయి అక్కడే కొనుక్కుంటున్నారు. పాపం ఈ కవితా వస్తువు ఆకలి ఏమిటని ఒక్కళ్ళు కూడా ఆలోచించరు. ప్రపంచీకరణ కొట్టిన దెబ్బకి ఎవరికీ నోట మాట లేదు. ఈ సందర్భం మీద చాలా కవితలు వచ్చాయి గాని ఇలా ఉత్పత్తి శక్తులైన మనుషుల మీద స్త్రీ వాద కవితలు చాలా తక్కువ వచ్చాయి, అందులో ఇదొకటి ఎన్నదగినది.

ఇదొక అంతర్వేదన. అనాది నుండి ఇప్పటి వరకు స్త్రీ  పడుతున్న గృహ హింస కి, వరకట్నపు చావులకి, బాల్య వివాహాలకు, ఇలా ఒక్కటేమిటి అణగదొక్కబడుతున్న ప్రతీ చోటా ఒక్కో స్త్రీ మూర్తి మాట్లాడుతున్నట్టుగా అనిపించే ఒక అంతసూత్రం ఇందులో ఉంది. ఇందులో ఆధునిక మహిళ ఉంది, ప్రాచీన మహిళ ఉంది, సాంప్రదాయ మహిళ ఉంది, ఇలా ఎన్ని రకాలయిన వారినైనా మనం ఈ సంపుటంలో చూడొచ్చు. ఈమెది ప్రత్యేక గొంతుక. అణచబడిన జీవితాలకి ప్రతినిధి గా తన కవిత్వాన్ని మలచుకున్న ధీర.

కాబట్టే ఈమె వచనం ప్రముఖ విమర్శకులు చేరా గారిని కదిలించింది. ఈమె రాసిన సర్ప పరిష్వంగం అనే కవిత చాలా ప్రశస్తమైనది. దాదాపు కొన్నాళ్ల పాటు ఆ కవిత యావత్ రాష్ట్రం అంతా తిరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాలు దాన్ని పాఠంగా తీసుకున్నాయి. అలాంటి కవిత ఒకటి నీలి గోరింట లో కూడా ఉంది అదే ‘వంటింటి సూర్యోదయాలు”

వంట గదుల్లో బందీలైపోయిన ఆడవాళ్ళ దైనందిన దినచర్య ని ఈ కవిత రికార్డ్ చేస్తుంది. సూర్యుడి కన్నా ముందే నిద్ర లేచి వంట గదిని నిద్ర లేపి ఆమె సుందర సూర్యోదయాలని వంటింటి ఆకాశంలో కాఫీ రాగం పలికే సమయం నుంచి ఆమె పని చేస్తూనే ఉన్నా, ఆమెను అనే సూటిపోటీ మాటలు… కూరలో ఉప్పు ఎక్కువైంది అనో పాల గిన్నె మాడింది అనో, గాయపడి నప్పుడు ఆమె కి మందు ఎక్కడ దొరుకుతుందంటే అది అంత తేలిగ్గా దొరికేది కాదు. నాతిచరామి అని ప్రమాణం చేసిన భర్త సూటిపోటి మాటలు అంటూ ఉంటే ఆమె గురజాడ మాటని గుర్తు చేసుకుంటూ “సామూహిక వంట శాలలు కావాలి” అని అనిన గురజాడని ముద్దు పెట్టుకోవాలని ఆమె రాశారు. ఎంత బలంగా కోరుకున్నారు?! ఈ సమాజాలలో ఆడమగా అనే అంతరాలు నశించాలి అని అనిపిస్తుంది.

ఒంటరి దీప స్థంభం కింద, మిగిలిన చింతల గీతం చిరునామా ఎవరికి కావాలి అంటూ బుద్ధుని అడుగుతూ నాకెందుకు ఈ ఖాళీ భిక్ష పాత్ర ఇచ్చావు అని అడుగుతారు ఒక చోట. ఇలా ప్రతీ ప్రశ్న మనల్ని సూటిగా తాకుతూ పోతుంది. ఎక్కడా శసభిషలుండవు. ఆమె ఒక ధైర్యం. ఆమె ఒక సంచలనం. ఆమె ఒక ఆర్తనాదం. ఆమె ఒక సమర శంఖం. ఈ అక్షరాలు అందరిని మంత్రముగ్ధులని చేసే జీవమున్న ఔషధాలు అనొచ్చు.

సూర్యుడు తప్పిపోయాడు అంటూ సాహితీ ఆవరణలోకి ప్రవేశించిన ఈమె.నిషిద్ధాక్షరి రాశారు. ఇది కన్నడ లోకి అనువాదం అయింది

హైమావతి గారి నుంచి ఇది మూడో సంకలనం.

కొన్ని వేల కవిసమమ్మేళనాల్లో పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం అనేక రాష్ట్రాలకి వెళ్లారు. సంతకాలు చేద్దాం రండి అనే కవిత అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి బడింది. ఈమె నిషిద్ధాక్షరిని యోగి వేమన యూనివర్సిటీ లో పాఠంగా పెట్టారు. కవి గారి భార్య అనే కవిత కుప్పం విశ్వవిద్యాలయం లో పాఠం గా ఉంది. తిరుపతి విద్యార్థులు ఈమె సాహిత్యం మీద ఎంఫిల్ చేశారు. చాల కవితలు మాత్రమే కాక. విశాలాంధ్రలో వాన చినుకులు అనే కాలం ని ఆంధ్ర ప్రభలో హరివిల్లు అనే కాలం ని చాలా కాలం కొనసాగించారు.

చూడడానికి అమాయకంగా ఒక చేతి సంచి ని భుజానికి తగిలించుకుని వచ్చే ఈమె ని చూస్తే ఇంత కవిత్వం రాస్తారని ఎవరూ అనుకోరు. ఈమె సమాజపు ఉపాధ్యాయురాలు. తెలుగు భాషా ప్రేమిక. పాఠం చెప్పడంలో ఆసక్తి, కవిత్వం రాయడంలో అమితమైన ప్రతిభ ఉన్నవారు. కాస్తంత సంస్కృత భాషని సరళీకరణ చేసి, ప్రబంధ వ్యక్తుల పోలికలని తగ్గించి వర్తమాన అంశాల మీద మరింత గా కృషి సలుపుతారని ఆశిద్దాం. ఈ నీలి గోరింట మీ ఇళ్లలో పూయాలి కొని చదవండి. చదివించండి

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

8 comments

 • వచనం లో మెరుగ్గా మొనదేలిన వాక్యాలు కనబడ్డాయ్. హైమావతి గురించి బాగా చెప్పావ్…ఆమె కవిత్వాన్ని గురించి కూడా.

  హైమావతి గారి కవిత్వం లో ఉన్న ఇంకొన్ని విశేషాంశాలూ, పేచీలు, రిజర్వేషన్లూ మరింత విపులంగా చర్చించ వలసి ఉంది.

  • నిజమే కానీ సమయా భావం వల్ల వీలు కాలేదు. అందుకు క్షమార్హుడిని మిత్రమా

 • అనాదిగా అన్ని తరాల మహిళల అరచేతిల్లో పూస్తూనే ఉందీ ఈ నీలిగోరింట..మందరపు హైమావతి గారి రచనా ధీరత్వాన్ని మీ శైలిలో బాగా పడించారు…అభినందనలు అనిల్ గారు.

 • చాలా బాగుంది అనిల్ గారు

 • స్త్రీ హృదయ మధనాలను మనసుతో విశ్లేషించిన అనిల్ మంచి విశ్లేషకులు కూడా💐💐💐

 • చలన చిత్రాలకు,వ్యాపార ప్రకటనలకు
  పెట్టుబడి నా శరీరమే కదా

  కుక్కర్ విజిల్స్ లోనే
  మనోజ్ఞ సంగీతం వింటాను
  పతిదేవుని టేబుల్ పై కాఫీ కప్పుగా…

  ఎమ్మే పాఠాలలో వీటిని చదివినపుడు ఈవిడెవరో భలే వ్రాస్తుంది అనుకున్నాను.

  హైమావతిగారి ప్రతి కవిత లోను స్త్రీల సమస్యల పట్ల
  కవయిత్రికి ఉన్న అవగాహన, పరిశీలనా శక్తి, మనకు అవగతమౌతాయి, ప్రతి కవితలోను, ఆర్తి మనసులను కదిలిస్తుంది.
  సమస్యలకు పరిష్కారమార్గాలను కూడ సూచించడము వాటిలో మనము గమనించవచ్చు.

  మళ్ళీ మీ వ్యాసంలోనే హైమావతిగారిని చదవడం.శీర్షికలు,ఎత్తుగడల నుండి హైమావతిగారి కవిత్వ విశిష్టత చెప్పడమే గాక భాషని సరళీకరణం చెయ్యాలన్న సూచనతో మీలోని విమర్శకుడి బాధ్యతను నెరవేర్చారు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.