ఆ…అమ్మ

1

అరవైల నాటి కమ్యూనిస్టు ఇల్లు అది. తొంభైవ పడిలో ఉన్న ఆ వృద్ధుడు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. ముందు చిన్న వరండా గది. వెనక అంతే ఉన్న ఈ చిన్న గది సరిగ్గా ఒక మంచం పక్కన ఒక స్టూలు వేయడానికి సరిపోయింది. వెనక గుమ్మం పైనున్న గోడ మీద రంగు వెలిసి పోయిన పేద్ధ ఫోటోలు రెండు మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌ ముఖాలతో ఉన్న ఒక ఫోటో పక్కన మావో ఫోటో. పాత కాలపు ఇల్లు. వరండా పక్క చిన్న గదిలో బంగారం పనికి సంబంధించిన పనిముట్లు పడి ఉన్నాయి. బాగా దుమ్ము పట్టి గదంతా బూజుతో నిండి ఉంది.

చాలా కాలం నించి ఆయన పని చేయడం లేదు. సన్నటి పూచిక పుల్లల్లాంటి ఆయన కాళ్ళు రెండు బంగారు తీగలు మెలివేసి

నట్లుగా ఉన్నాయి. తొంభై సంవత్సరాలుగా

ఆయన ముఖానికి రూపాన్నిచ్చిన చెంపలు జారిపోయాయి. సుదీర్ఘ కాలపు జీవనం వల్ల కలిగిన అలసట బంగారం మీద మకిలిలా ఆయన శరీరమంతా ఉంది.

‘నాలుగు సార్లు చావుని చంపాను’ అనుకున్నాడు.

2

అతను పుట్టడమే చాలా బలహీనంగా పుట్టాడు. గాలేస్తే ఎగిరిపోయేలా ఉండే వాడు. వొంగి గానీ లోనికెళ్ళలేనంత కిందికి ఉన్న చూరు కింద మట్టి అరుగు మీద కూర్చుని వాళ్ళ నాన్న బంగారాన్ని నగలుగా మారుస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ పక్కని అరుగు మీద కూర్చుని నానుతాడు అల్లుతూ లోనికీ బయటకీ తిరుగుతూ ఉండేది. ఐదుగురు పిల్లల్లో చివరి వాడు. గుమ్మం ముందు పేడ అలికిన ముంగిట్లో అక్కలతో తొక్కుడు బిళ్ళలాడుతూ ఉండే వాడు. గాంధీ గారి కళ్ళ జోడు లోంచి తదేకంగా ఆ పిల్లల్ని చూస్తూ ‘‘ఈ ఒంటూపిరిగాడు అంతలా గెంతితే ఎట్లాగే…’’అన్నాడు తండ్రి.

కిసుక్కున నవ్వి .. ‘‘పిల్లలన్నాకా ఆడుకోరా… ఆడుకున్నంత మాత్రానా ఏమైపోద్ది…’’ అంది భార్య.

‘‘ఒగ్గానొక్క కొడుకు.. వీడు కాస్త మనిషిలా ఆన్తే బాగుండేది..’’

‘‘నీది మరీ అబ్బురం.. యింకా ఆడు సిన్నోడే కదా… ఎదిగే కొద్దీ ఆడే తయారౌతాడు గానీ నువ్వేం బెంగెట్టేస్కోమాక’’

కళ్ళ జోడుని పైకి తోసుకొని అతను తల ఊపాడు. భుజమ్మీంచి వేళాడుతున్న జంధ్యాన్ని చేతుల్తో వెనక్కి తోసుకుని పనిలో పడ్డాడు. ఎగూపిరితో ఆయాస పడుతూ వచ్చి ‘‘…. మ్మా…. మంచినీళ్ళు…’’అంటూ కూర్చున్నాడా పిల్లాడు. గటగటా మంచినీళ్ళు తాగేసి అక్కతో కలిసి మళ్ళీ పరుగెట్టాడు.

చూరు కిందికి వొంగి చూస్తూ ‘‘సోది చెప్తానమ్మ.. సోది.. తల్లీ పార్వతీదేవిలా ఉన్నావు. రమ్మంతావా…’’ అంది సోదెమ్మ. లేచి పూచిక పుల్లల చీపురుతో మట్టి అరుగుని బరబరా ఊడ్చి ఈతాకు చాప వేసింది ఆమె. లోనికెళ్ళి ఇత్తడి చెంబుతో మంచినీళ్ళు తెచ్చింది. సోదెమ్మ కూర్చుంది. తంబురాని చేతిలోని కర్రని జోలె పక్కగా పెట్టుకుని చెంబు ఎత్తి పట్టుకుని గటగటా తాగింది. మిగిలిన నీళ్ళతో ముఖం కడుక్కుంది. పైట చెంగుతో ముఖం తుడుచుకుని చాప మీద వట్రంగా కూర్చుంది. ఆమె కాళ్ళకి దణ్ణం పెట్టి కొంగుని భుజాలమీదుగా కప్పుకుని కూర్చుంది తల్లి. సోదెమ్మ గొంతు వినపడ్డంతోనే చుట్టుపక్కల ఆడవాళ్ళు నలుగురైదుగురు అరుగు మీదకి చేరారు. సోదెమ్మ జోలె లోంచి పార్వతీ దేవి, లక్ష్మీదేవి బొమ్మల్ని తీసి పెట్టింది. కర్రని చేతితో పట్టుకుంది. దాన్ని నుదుటికి తాకించుకుని కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచి తల్లి చేతిని పట్టుకొని మొదలు పెట్టింది. ‘‘సోది చెపతానమ్మ సోది… ఉన్నది ఉన్నట్టు సెపతాను… లేనిది లేనట్టు సెపతాను… లచ్చిందేవి మీద ఆన… అమ్మలగన్నయమ్మ పార్వతీ దేవి మీద ఆన .. ఉన్నదే సెపతాను….’’ తల్లి చేతిని పట్టుకుని దాన్ని లక్ష్మీదేవి బొమ్మకీ పార్వతీ దేవి బొమ్మకీ తాకిస్తూ అటూఇటూ తిప్పుతూ చెప్పుకు పోతోంది. ‘‘ఒక్కగానొక్క మగబిడ్డ కలిగాడే తల్లి నీకు… ఆయ్యకి ఆడి మీద బెంగ… బక్కపల్చటోడు… కబళానికి దూరముంటడు.. తిండి యావ లేదు… కండ పట్టలేదు… అయ్యకి ఆడి మీద సూపు… నీకు ఆడి మీద మనసు…అయిదు గండాలతో పుట్టాడే తల్లి బిడ్డ….’’ పని మానేసి వింటున్న తండ్రి ఉలిక్కి పడ్డాడు. సోదెమ్మ అరమూసిన కళ్ళతో వూక్కుంటూ చెప్పుకు పోతోంది. ‘‘నిప్పుతోటి గండం… గాలి తోటి గండం.. జంతువుతో గండం… యంత్రంతో గండం… లచ్చిందేవి సల్లగా సూస్తాది… పార్వతీదేవీ సల్లగా సూస్తాది… గండాలు గట్టెక్కుతడే నీ బిడ్డ… మంది తల్లో నాలుకౌతాడు… నాలుక మీద సరస్పతి ఉంటది.. పెద్దోడౌతాడు.. పేరు తెత్తాడు…. ఆడ పిల్లలు చల్లగుంఠారు. సంతానం పెరుగుతుంది… మెట్టినింటికి పేరు తెస్తారు…’’చెప్పుకుంటూ పోయి ఆగింది. కళ్ళు తెరిచింది. ఎదురుగా తల్లి ముఖం చిన్న పోయి ఉంది. సోదెమ్మ పెదాల చివర్లనించి మొలక నవ్వు నవ్వింది. ‘‘సిన్నబోకే తల్లి… చింతపడమోకె… బిడ్డల్ని కాసేటి తల్లి ఉంటాది. ఊరిని కాసేటి తల్లి ఉంటాది. పెద్దాపురం పోయి మరిడమ్మ తల్లికి మొక్కు… కాండ్రకోట పోయి నూకాలమ్మ తల్లికి మొక్కు… సామర్లకోట పోయి సత్తెమ్మ తల్లికి మొక్కు..’’ అని ఆగింది. తల్లి కళ్ళలో నీటి పొర కదులాడుతుండగా లేచి చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ లోనికెళ్ళింది. చేట నిండుగా బియ్యం.. రవికెలగుడ్డ.. అరటి పళ్ళు.. తమలపాకు అందులో దాదాపు రెండు రూపాయల చిల్లరా పెట్టి పట్టుకొచ్చింది. సోదెమ్మ ముఖం చింకి చేటంతయ్యింది. జోలె పట్టింది. చేటలో బియ్యం జోలెలో పోసింది. పళ్ళూ, రవికెల గుడ్డా, తాంబూలం ఆమె చేతిలో పెట్టి కాళ్ళకు మొక్కింది. సోదెమ్మ జోలెలోంచి భరిణె తీసి కుంకుమ తీసి తల్లి నుదుటి మీదా పాపిట్లోనూ బొట్టు పెట్టింది. ఈ లోగా కూర్చున్న ఒకామె రమ్మని పిలిచింది.

3

‘‘ఈ సోదెమ్మలూ.. జోతీష్కాలూ అన్నీ నాన్సెన్సే అయినా ఒక సామాన్య జీవితాన్ని కళాత్మకంగా మార్చడంలో అవి బలేగా పని చేస్తాయి. సోదెమ్మ వచ్చి పోయింతర్వాత ఆ సామాన్య కుటుంబంలో ఈ ఒంటూపిరి పిల్లగాడు హీరో అయిపోయాడు. వీడు సామాన్యుడు కాదు. ఐదు గండాలు గట్టెక్కాల్సినోడు. మందికి తల్లో నాలుక. నాలుక మీద సరస్పతి ఉన్నోడు. ‘‘డడ్డనక… డం… డం… డడ్డనక డం డం …’’ అంటూ డప్పు మోత వినిపిస్తోంది. ఏదో శవయాత్ర. గీతలు పడ్డ భూతద్దాల కళ్ళజోడు లోంచి రోడ్డు మీదికి చూశాడు. మెల్లిమెల్లిగా శవయాత్ర వెళ్తోంది. ఈ డప్పు శబ్దాన్ని “దొడ్డెనక గొయి తియ్యి… నా డబ్బు నాకియ్యి…’’అని పాడుతూ గెంతులేసే

వాళ్ళం చిన్నప్పుడు అనుకున్నాడు. చిన్నగా నవ్వుకున్నాడు. కానీ ఆ నవ్వు పెదాలోనే అణిగి పోతుంది. ఆయన ముఖంలోకి నవ్వు పాకదు. ‘ఈ శబ్దం తన తొలి గండం’… అనుకున్నాడు.

4

అతడు నాలుగో తరగతికి వచ్చేసరికే ఇద్దరక్కల పెళ్ళిళ్ళయిపోయాయి. సామర్లకోట ఇచ్చారు ఇద్దర్నీ. ఆ రోజు ఉదయం ఇంకా బడి వదలక ముందే చిన్నబావ సైకిలేసుకుని వచ్చాడు. మాస్టారికి ఏదో చెప్పి తన్ని వచ్చేయమన్నాడు. సంచి మెళ్ళో వేసుకుని గెంతుకుంటూ సైకిలెక్కాడు అతడు. బావ ఏమీ మాట్లాడకుండానే రయ్యి రయ్యి మని తొక్కుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటి దగ్గర చాలా మంది పోగయి ఉన్నారు. అమ్మ, అక్కలు పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నారు. అతడు సైకిలు మీంచి కిందికి దూకి బిక్క మొగం వేసుకుని నిలబడి పోయాడు. బావ రెక్కపట్టుకుని వంగి నాన్న పని చేసుకునే గది గుమ్మం దగ్గరకి లాక్కెళ్ళాడు. లోపల నాన్న అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్నాడు. గుడ్లు రెండూ పైకి వచ్చినట్టున్నాయి. చేతిలో చిన్న సుత్తి ఉంది. రెండో చెయ్యి పైకెత్తినట్టే ఉంది. నోట్లోంచి నురగ పెదాల చివర పాకుతోంది. అతడికి కడుపులో ఏదో అయింది. దు:ఖం గొంతులో ముల్లులా గీరుతూ ఉంది. అతను అలవాటుగా ‘‘నానా… ’’అంటూ పిచ్చిపట్టినవాడిలా అడుగు ముందుకు వేసి కింద ఉన్న పట్టుకారు లాంటి దాని మీద కాలుపడి బొక్కబోర్లా కణకణమండుతున్న కొలిమిపైన పడిపోయాడు. బయిట జనం ఒక్కసారిగా హాహాకారాలు చేసారు. బావ తటాలున వంగి వాణ్ణి బయటకి లాగాడు. కానీ అప్పటికే వాడు సోయి లేకుండా పడిపోయాడు. గుండే… పొట్టా కాలిపోయి బొబ్బలు లేచి పోతోంది. పరుగు పరుగున సైకిలు తీసి సామర్లకోట తీసుకుపోయారు. మూడురోజులు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు కుర్రాడు. తండ్రి కొడుకుని తీసుకు పోతాడనే అనుకున్నారంతా… నాలుగో రోజు కళ్ళు తెరిచి ‘అమ్మా… నాన్న’ అన్నాడు.

గండం గడిచింది.

5

బోర్డు స్కూలుకెళ్ళి చదువుకోవడం అంటే వాడికి బొత్తిగా నచ్చలేదు. కానీ వాడి మామయ్య  చదవాల్సిందే అని స్కూలుకి పంపేవాడు. వాళ్ళమ్మ మాత్రం వాడిని రెప్పవెయ్యకుండా కాసేది. స్కూల్లో ఉండగా కూడా వెళ్ళి చూసొచ్చేది. ‘‘ఏదో అలా జరిగిందని పిల్లోడి వెంట అలా పడ్డం ఎందుకమ్మా… రాతెట్టా ఉంటే అట్టాగవుద్దీ…’’అనేది పక్కింటామె. ‘‘కొలిమిలోంచి లేచొచ్చినోడు. అడుగడుగునా గండాలున్నోడు. నా దినం బోయేదాకా కాసుకొనే ఉండాలి’’ అనేదామె. కొడుకుని ఆటకి పంపేది కాదు. ఆడినా పాడినా తన కళ్ళముందే ఉండాలి. మెల్లిగా వాడు స్కూలు లేని సమయాల్లో మావయ్య దగ్గర జేరి బంగారం పని చేస్తూ ఉండే వాడు. తల్లి వెనక తిరుగుతూ తాళ్ళు అల్లేవాడు. మూడో అక్కని మామయ్యకే యిచ్చి పెళ్ళి చేశారు. మామయ్య కాండ్రకోటకి పోయి అక్కడ కాపురం పెట్టాడు. అక్కని పిల్లలతో వచ్చేయమన్నాడు. కానీ ఆమె వొప్పుకోలేదు. అయితే కుర్రాణ్ణి తీసుకుపోతాను అన్నా ఆమె ఒప్పుకోలేదు. కానీ చదువు, పనీ, నేర్పుతానని… కుర్రాణ్ణి కనుసన్నల్లో పెట్టి పనికిమాలిన వాణ్ణి చేస్తే పెద్దయ్యాకా ఎలా బతుకుతాడని దెబ్బలాడ్డంతో అయిష్టంగానే ఒప్పుకుంది. అలా కాండ్రకోట చేరాడు. పెద్దాపురం వచ్చే దారిలో స్కూలు. స్కూలు నించి వచ్చి అటు పనిలోనూ ఇటు ఆటల్లోనూ గడిపేవాడు. కాండ్రకోట నించి పెద్దాపురం వెళ్ళే దారంతా చిన్న చిట్టడవిలానే ఉండేది. రాత్రయితే నక్కలు, కుందేళ్ళు సరేసరి, అప్పుడప్పుడు అడివి పందులు కూడా కనిపించేవి. కాస్తంత సందేళ అయితే ఎవ్వరూ ఆ దారంట పోయే వారే కాదు. మామయ్య అప్పుడప్పుడు రాత్రి వేళ ఇంటికి రావడం వాడికి తెలియదు. పగలంతా స్కూలు… అయిపోయాకా కబడీయో, గోళీకాయలో ఆడుకుని గసపోసుకుంటూ యింటికి వచ్చేవాడు. అక్క పెట్టిందేదో తినేసి బంగారం పనిలో కూర్చునే వాడు. చదువులో గొప్ప శ్రద్ధేం పెట్టే వాడు కాదు. వాడికెప్పుడూ బడి మానేయాలనే ఉండేది. కానీ మామయ్య మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ‘‘చదువుకోవాల్రా.. చదువుకుంటేనే నాలుగు విషయాలు తెలుస్తాయి.’’ అనేవాడు. కొన్ని కథల పుస్తకాలు కూడా తెచ్చేవాడు. ప్రతి శని ఆదివారాల్లో తల్లి దగ్గరకెళ్ళే వాడు. సైకిలు మీద కొన్నాళ్ళు మామయ్య తీసుకెళ్ళే వాడు. కాస్త పెద్దయ్యాకా ఒక్కోసారి ఒక్కడే వెళ్తూండే వాడు.

మాఘ మాసం. చద్దన్నం తినేసి సైకిలు తీసుకుని తల్లి దగ్గరకి బయలు దేరాడు. పొద్దు ఎక్కి పోయింది. కాండ్రకోట నుండి పెద్దాపురం పోయే దారి దాదాపు నిర్మానుష్యంగానే ఉంటుంది. కానైతే అప్పుడప్పుడు పుల్లలేరుకునే వాళ్ళూ… దూడల్ని మేపే వాళ్ళూ కనిపిస్తూనే ఉంటారు. చిన్నచిన్న కట్టె పేళ్ళని సైకిలుకి కట్టుకుని పెద్దాపురం పోయి అమ్ముకునే వాళ్ళూ కనిపిస్తారు. ఇదంతా వాడికి ఎప్పుడూ చూసేదే. అతడు ఎగురుకుంటూ సైకిలు తొక్కుతున్నాడు. ఇంతలో టకీ మని బ్రేకు వేశాడు. రోడ్డు పక్కనే కొద్దిగా లోపలికి సీమచింత చెట్టొకటి విరగ కాసి ఉంది. గులాబీ రంగు, కాషాయరంగు ఎర్రటి కాయలు పగిలి తెల్లటి గింజలు కనిపిస్తున్నాయి. వాటినలా చూసి ఆగలేకపోయాడు వాడు. సైకిలు ఆపి రోడ్డు పక్కగా చెట్టుకి జారేసాడు. సీమచింత చెట్టు దగ్గరకి వెళ్ళాడు. దాని చుట్టూ ముళ్ళ పొదలు. కింద పల్లేరు కాయలు బాగా ఉన్నాయి. రెండు మూడు రాళ్ళు విసిరాడు. ఏమీ లాభం లేదు. పక్కనున్న కానుగ చెట్టు నించి చిన్న కొమ్మ విరిచి దాన్ని ఆకు దూసి విసిరాడు. అది సరిగ్గా కాయని తగిలి ఆ ముళ్ళకంపలో ఇరుక్కుపోయింది అటూఇటూ చూశాడు. సీమ చింత చెట్టు పక్కనే ఈ కానుగ చెట్టు… అల్లా కొమ్మ మీదికి గానీ ఎక్కామంటే బోల్డు కాయలు. కానుగ చెట్టు చిన్నది. కొత్త ఆకులతో గలగలలాడుతోంది. వాడు మెల్లిగా చెట్టు ఎక్కాడు. కొమ్మ మీదికి పాకాడు. రెండు మూడు సీమ చింతకాయు కోశాడు. జేబులోకి తోశాడు. కొమ్మ మీద ఇంకొంచెం పాకాడు.

6

‘‘ఎవరో తోసినట్టయ్యిందా.. లేక పట్టు జారిందా… తెలియనేలేదు.’’

అనుకున్నాడాయన. ‘‘ఆ పడ్డం పడ్డం పోయి పోయి ముళ్ళ కంపలో అడ్డదిడ్డంగా పడ్డాను. ఎప్పుడు స్పృహ పోయిందో… మళ్ళీ కళ్ళు తెరిచే సరికి పెద్దాపురం ఆసుపత్రిలో.. పక్క దగ్గర గుడ్ల నీళ్ళు కుక్కుకుంటూ అమ్మ… అక్కలూ….’’ ‘‘సోదెమ్మ అల్లానాడే సొప్పలేదా… కుర్రాడికి గాలితోటి గెండం… వొద్దు వొద్దురా అంటే ఒంటిగా పంపావు. బిడ్డ పొదల్లో అడి పోయి ఉండిపోయాడు. కాపుగారి పాలేరు చూశాడు కాబట్టి సరిపోయింది.. లేకపోతే..’’ అంటూ వలపోస్తోంది అమ్మ. మామయ్య ‘‘సరేలే అక్కా… ఇప్పుడేటి కాలేదు కదా…. కాలు జారి పడ్డాడు… చెట్టెక్కి పడ్డం కూడా పెద్ద వింతేనా.. నేనెన్ని సార్లు పళ్ళేదు చెప్పు… అయినా సీమచింతకాయిు వంకీ కర్రెట్టి కొయ్యాలి గానీ చెట్టెక్కుతార్రా…?’’

‘‘నువు వేరురా… ఈడు గండాలున్నోడు..’’అని వెక్కుతోంది అమ్మ.

‘‘ఈడు గండాలున్నోడు’ నవ్వుకున్నాడు. ‘ఈ గండాలు తోటే తొంభై ఏళ్ళ బతుకు…’ అతని పెదాల మీద మళ్ళీ ఒక కనపడని నవ్వు.

7.

మొదటిసారిగా మామయ్య సైకిలెక్కించుకుని పెద్దాపురం తీసుకెళ్ళి అక్కడేదో మీటింగులో కూర్చొబెట్డాడు. తిరిగి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆ చీకట్లో చిన్న బ్యాటరీ లైటు వెలుగులో కాండ్రకోట వెళ్తుంటే వాడికి ఎంతో సంతోషమైపోయింది. కీచురాళ్ళు కిరిక్‌.. కిరిక్‌ మంటూ అరుస్తున్నాయి. రోడ్డుకి అటూ ఇటూ బేతాళ కథలో శ్మశానం లాంటి గుయ్యారం. వేలకొద్దీ మిణుగురు పురుగులు వెలుగుతూ ఆరుతూ ఎగురుతున్నాయి. మామయ్య ‘‘వురేయ్‌ పైన ఆకాశమ్మీద నక్షత్రాలు చూడు’’ అన్నాడు. ‘‘అవి మనకెంతో దూరాన ఉన్నాయి కాబట్టి చుక్కల్లా ఉన్నాయి గానీ అవి ఒక్కోటీ సూర్యుడంత గొప్పవి తెల్సా’’ అన్నాడు. అలా ఏదో చెప్తూనే ఉన్నాడు. అతడు ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాడు. మామయ్య సునాయాసంగా సైకిలు తొక్కేస్తున్నాడు. కీచుమనీ.. కిర్రు మనీ సైకిలు చేసే శబ్దం కథ వింటూ ఊ … కొడుతున్నట్టుంది.

పదవ తరగతిలోకి వచ్చాకా వాడు మామయ్యతో మీటిగులకి వెళ్ళే వాడు. మామయ్యకి పెద్దాపురంలో చాలా మంది తెలుసు. అక్కడ మామయ్యని ఒక నాయకుడిగా చూసేవారు. ఎర్రటి జెండా మీద కొడవలినీ సుత్తినీ చూసి వాడి గుండె ఎందుకో ఉప్పొంగి పోయింది. అప్పటికే వాడు సుమారుగా బంగారపు పని అంతా నేర్చుకుని ఉన్నాడు. బడి మానేయాలనీ…. పనిలో ఉండిపోవాలని అస్తమానూ గొడవ చేసేవాడు. కానీ మామయ్య మాత్రం ఒప్పుకోలేదు. మామయ్య రాత్రి పూట ఇంటికి రావడం ఎందుకో వాడికి తెలిసింది. మెల్లిగా వాడు కూడా మీటింగులకి వెళ్తూ ఉండే వాడు. రెండు రోజులు  సెలవిస్తే తల్లి దగ్గరకి పోవాల్సిందే. అక్కడ నించే పెద్దాపురం మీటింగుకి వచ్చేవాడు. ఆషాడ మాసం వచ్చిందంటే తల్లి కాండ్రకోట వచ్చేది. కాండ్రకోట, పెద్దాపురం, సామర్లకోట మూడు గ్రామాల దేవతలకీ మొక్కి వాడిచేత కూడా మొక్కించేది. ‘‘ఈ మొక్కుబడులు తన మీద చాలా విమర్శకి దారి తీశాయి….’’ అనుకున్నాడాయన. తాను పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా అవకాశం ఉంటే తప్పకుండా మూడు చోట్లకీ వెళ్ళేవాడు. చాలా సార్లు ఏమిటీ నాన్సెన్స్‌ అనుకున్నాడు. కానీ వెళ్ళకుండా ఉండలేక పోయాడు. గండాల బతుకు అయిన ఒక్కగానొక్క కొడుకు కోసం తల్లి పడ్డ దు:ఖానికీ ఆర్తికీ ఇచ్చిన నివాళి ఆ మూడు చోట్లకీ వెళ్ళడం. ఆ మూడు చోట్లా తనకి తల్లి కనిపించేది. నిజంగా చిన్న వయసులో భర్త చనిపోయాకా తాడూ బొంగరం లేని సంసారాన్ని ఆవిడ ఎలా మోసిందో ఎవరికి తెలుసు? నలుగురు ఆడపిల్లలు.. అబ్బనాకారి అయిన మగ పిల్లాడు. నిప్పుల్లో కాలిన వాడు. గాలికి తూలి పడిపోయేవాడు. ఆమె కొంగు నిండిపోయే కన్నీటి తడిని పలవరించకుండా ఉండడం సాధ్యం కాదు. ఇలాంటి వేలాది తల్లుల మూర్తిమత్వమే గ్రామ దేవతయేమో…’’ నీళ్ళు నిండిన కళ్ళని అదుము కున్నాడాయన.

తల్లి చనిపోయేనాటికే తాను పెద్దాపురం… సామర్లకోట ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకుడిగా ఉన్నాడు.

8.

చదువు పూర్తయ్యాకా పెద్దాపురంలోనే అల్యూమినియం కంపెనీలో చేరి అక్కడే ఉండే వాడు. ఒక పక్క స్వాతంత్య్ర పోరాటం.. మరోపక్క కార్మిక ఉద్యమాలతో క్షణం తీరుబడి లేని పని. మామయ్య కూతుర్ని పెళ్ళి చేసుకుని సామర్ల కోటలో మకాం పెట్టాడు. తల్లిని కూడా తన దగ్గరకే రప్పించుకుని బంగారపు పని చేసేవాడు. మరో పక్క ఉద్యమాలలో తిరిగే వాడు. స్వాతంత్య్రం వచ్చాకా రెండు మూడేళ్ళకే మామయ్య రహస్యజీవితానికి వెళ్ళి పోయాడు. ఆ తరువాత మలబారు పోలీసు కోరింగ దగ్గర కాల్చేసారు. అమ్మ… అక్క… భార్య అందరూ మామయ్య చనిపోవడంతో కుంగి పోయారు. వాళ్ళ వొత్తిడికీ… సంసార భారం తోడూ అతడు మెల్లిగా పార్టీ కార్యక్రమాలు తగ్గించుకున్నాడు. సామర్లకోటలో పేరు మోసిన బంగారం పనివాడయ్యాడు. మంగళసూత్రాలూ, పాతకాలపు మార్మిక ఆభరణాలూ తయారు చేయడంలో అతనికి రెండు మూడు జిల్లాల్లో పేరుండింది.

9.

‘నక్సలైటు ఉద్యమం జీవితంలో ఇంకో మలుపు’ అనుకున్నాడాయన. అది అతని తొలి యవ్వనాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. నక్సలైటు నాయకుడిగా అడవి బాట పట్టేశాడు. ఏలేశ్వరం అడ్డతీగల వైరామవరం అడవిలో తిరుగుతూ గిరిజన పల్లెల్లో పనిచేశాడు. బసవరాజు! అతడ్ని తలచుకుంటేనే కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతాయి. పాతికేళ్ళు నిండని కుర్రవాడు. ఆశా, ఆశయం రూపు కట్టినవాడు. అతడి ఉత్సాహం కరెంటు షాకులా అందర్నీ పట్టేస్తుంది. ‘‘ఏమయ్యా.. కామ్రేడా… జిల్లాలో అందరికన్నా సీనియర్నంటావ్‌ అల్లా నడిస్తే తెల్లారిపోద్ది…’’ అంటూ హుషారెక్కించేవాడు. శాంతిరాజు గసపోసుకుంటూ నడిచేవాడు. ఊళ్ళు తిరిగి శ్రీకాకుళంలో గిరిజనుల గురించి చెపుతూ తిరిగేవాళ్ళు. ఎంత దట్టమైన అడవి. ఇప్పట్లా కాదు. చీకటి పడితే కోటి నక్షత్రాలు ఆకాశమ్మీద. చేయి చాచినంత దూరాన కూడా ఏముందో తెలియని రాత్రులు. కీచురాళ్ళ శబ్దాలు.. గలగల పారే ఏలేరు. నిశ్శబ్దంగా చాకుల్లా ఉండే వెదురాకు… వెదురు పొదలు… సందెవేళ వేటకి బయలుదేరుతూ మెకం పెట్టిన బొబ్బ! చెట్టు మీది నించి ఇళ్ళ మీదికి ఎగిరే నెమలి కోడి. గంట్లు కలిపిన బుడమల అన్నం వుప్పు చేప వేసిన పప్పు చారుతో గిరిజనులు పెట్టే తిండిని ఆవురావురని తినే వాళ్ళు. రోజుల తరబడి మన్నెంలో అంబలి తాక్కుంటూ, తిరిగేవాళ్ళు. ఆడ్డతీగల, రాజవొమ్మంగి, లబ్బర్తి, లాగరాయి, కాకరపాడు.. లోపల ఊళ్ళు.. గూడేలూ అన్నీ తెగ తిరిగారు. ఒక కను చీకటి పడుతున్న వేళ దుశ్చర్తి వెళ్తూ దారిలో ఒక కొండ మీద గెడ్డ పక్కన చిన్న గుహలాంటిది కనిపిస్తే ఆగారు వాళ్లు. ‘‘విప్లవంలో మనకి ఇలాంటి గుహలతోటి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి వీటి గురించి ముందే కనిపెట్టాలి మనం’’అంటున్నాడు బసవరాజు. నడిచి నడిచి ఉన్న శాంతిరాజు లావుపాటి చెట్టు కింద కూలబడుతూ…‘‘ఎక్కడో గానీ యిలాంటియి ఉండవు..’’అన్నాడు. జేబులోంచి బీడీ తీసి ముట్టించాడు తను. ‘‘అగ్గున్నీ…. కామ్రే…’’ అంటూ శాంతిరాజు చుట్ట తీసాడు. బసవరాజు గుహ ఉన్న కొండ పైకి ఎక్కి మళ్ళీ దిగి ‘‘ఈ లోపల ఏముందో చూడాలి’’అన్నాడు. ‘‘దీనికి సరిగ్గా దారే లేదు.. చీకట్లో గబ్బిలాలు సరే… ఏ పాములుంటాయో… తేళ్ళుంటయ్యో…’’ ‘‘ఏహే.. పేద్ద … నక్సలైటు బయల్దేరాడండీ.. పాముకీ తేళ్ళకీ హళ్లి పోతే ఎలా…’’ అని వెక్కిరించాడు బసవరాజు. శాంతి రాజు కళ్ళు మిటకరిస్తూ ‘‘అయ్యేమో కానీ యిలాంటి గుహల్లో బంటులుంటాయి’’ అంటున్నాడు. ‘‘పెద్దపుల్లుండవా…’’అంటూ వొంగి గుహలోపలికి దూరాడు బసవరాజు. మళ్ళీ వెనక్కి వచ్చి ‘‘లోపల బాగా చీకటిగానే ఉంది. ఏమీ కనపడ్డం లేదు.’’ అంటూనే పక్కనున్న తుప్పల్లోకి పోయి ఎండు కొమ్మల్ని కొన్ని విరిచి కట్టకింద కట్టాడు. అగ్గిపుల్లతో కట్టని అంటించి వూదుతున్నాడు. తాను బీడీని పీలుస్తూ గుహ దగ్గర వొంగి మోచేతి మీద పాకుతూ ముందుకెళ్ళాడు. ఇంతలో ఏదో గురక వినిపించింది. ఆగి మళ్ళీ వెనక్కి తల తిప్పి ‘‘లోపలేదో శబ్దం వినిపిస్తోంది … గురక లాగా..’’ అన్నాడు. ‘‘గురకలాగానా.. లోన బంటుందేమో….’’ అంటున్నాడు శాంతి రాజు. ఈలోగానే గుహలోంచి నల్లటి బొచ్చుతో ఉన్న ఎలుగుబంటి గునగునా బయటకి వచ్చి వెనక్కి తిరిగి ఉన్న తన వీపు మీద పంజాతో కొట్టి చీరేసింది. శాంతిరాజు అడవి జంతువు లాగా టేకు చెట్టు ఎగబాకేశాడు. బసవరాజు కట్టె మోపు చేత్తో పట్టుకుని ఒక్క గెంతులో గుహ పైకి పాకేశాడు. తాను కెవ్వు మని అరిచి పక్కనున్న గెడ్డలోకి పరిగెత్తేశాడు. నిజానికారోజు అయిపోవాల్సిందే… బంటి వెంట పడిపోయింది.  కానీ బసవరాజు కట్టె పుల్లల్ని కాగడాలాగా అంటించి ఎలుగుబంటిని కేకలతో హడలగొట్టేశాడు. మొత్తానికా మంటని చూసి బంటి అడవిలోకి పారిపోయింది. గెడ్డలోంచి బయటకొచ్చి పడిపోయాడు తాను. వీపు మీద భుజాన్ని చీరేసింది బంటి. చొక్కా అంతా రక్తం మండ్లమైపోయింది. అలాగే దుశ్చర్తిపోయి వూరికి చివరగా కొండ మొగదలలో ఉన్న పాకలో పడిపోయాడు. ఆ గాయం పెద్దదై చీము పట్టడంతో మన్నెం వదిలి వచ్చేశాడు తాను. ఆసుపత్రిలో తన్ని చూసి అమ్మ అంది. ‘‘జంతువుతో గండమని ఆనాడే సెప్పిందిరా సోదెమ్మ…’’

10

గండాల సంగతీ.. సోదెమ్మ సంగతీ ఏనాడో వదిలేశాడు తాను. తల్లి అలా అనేసరికి అంత నొప్పిలోనూ నవ్వొచ్చింది. నవ్వి ‘‘ఇంకా ఏటమ్మా… నీ చాదస్తం….’’ అన్నాడు. వడిలిపోయిన తల్లి ముఖం చిన్న బోయింది. ఆమె ఏమీ అనకుండానే ఉండిపోయింది. హఠాత్తుగా అనిపించింది అతనికి తాను వాదిస్తున్నానని. కానీ తల్లి వాదనల్లోకి దిగదు. తన మాటని ఉద్రేకంతోనో దు:ఖంతోనో చెప్పి ఊరుకుంటుంది. తన బదులుగా తాను నమ్మిన దేవతల్ని ప్రార్థించే హక్కు ఉన్నది. ఆవిడ హక్కుని … ఆవిడ నమ్మకాన్ని తానెందుకు కాదనాలి? తనకి గాయం మానిపోయి ఇంటికి వచ్చిన రెండు మూడు రోజుకి తల్లి చనిపోయింది. బిడ్డల తండ్రి అయ్యి… ఎప్పుడూ మందిలోనే గడుపుతూ… నాయకుడయ్యీ … ఎంతో చదువుకున్న కొడుకుని అలాగా చూస్తూ ఉండగానే ఆమె గాజుగోళీ కళ్ళలోంచి ఆఖరి నీటి చుక్క పొటమరించింది. ఊపిరి ఆగిపోయింది.

11.

తన మీద కేసులూ గట్రా పెద్దగా లేకపోవడమూ తన వృద్దాప్య కారణమూ వల్ల పోలీసులు ఎంక్వైరీలు చేశారే గానీ అరెస్టు చేయలేదు. ఇంటి మీద ఎప్పుడూ నిఘా ఉండేది. అతను ఇంటి దగ్గరే ఉండి పని చేసుకుంటూ పార్టీ పని చేసేవాడు. పెద్ద అల్లుడు తన దగ్గరే ఉండి బంగారం పని నేర్చుకున్నాడు. ఇప్పుడు అతనే పనంతా చూసుకునేది. జిల్లాలో పెద్ద స్థాయి బంగారం దోపిడీలు జరిగినప్పుడల్లా పోలీసులు అల్లుణ్ణి స్టేషనుకి పిల్చేవారు. ఇది చాలా చిన్నతనంగా ఉండేది తనకి. దీని మీద చాలా సార్లు దెబ్బలాడేవాడు. ‘‘అయ్యా .. ఆచారిగారూ… మీ సంగతి మాకు తెలియదా.. ఏదో పై ఆఫీసర్ల కోసం తప్పదు..’’ అని ఎస్సై బుజ్జగించేవాడు. మెల్లిగా పెద్ద పెద్ద కంపెనీలు బంగారం వ్యాపారంలోకి వచ్చాకా పని తగ్గిపోతూ వస్తోంది. అయినా మనవడు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వాడు ఈ పన్లోకి రాడు. తనతోనూ అల్లుడితోనూ ఈ పని ఆఖరు. చిన్న అల్లుడు మాత్రం ఇల్లు పీకి పందిరేశాడు. అతడు రైల్వేలో ఉద్యోగి. అలా అనే పెళ్ళి చేశాడు. కానీ అతనికి ఇంకో సంసారం కూడా ఉంది. దాంతో కోప్పడి దెబ్బలాడి పుట్టింటికి వచ్చేసింది రెండో కూతురు. అల్లుడే ఎప్పుడైనా వచ్చేవాడు. కొంత దెబ్బలాట తరువాత కూతుర్ని కొట్టి పోయేవాడు. తరువాత విడాకులకి కోర్డులో వేశాడు. పెళ్ళప్పుడు ఇచ్చిన కట్నం లాంఛనాలూ ఇమ్మని కోర్టుకి వెళ్ళారు. పెద్దాపురం కోర్టు చుట్టూ తిరిగేవాడు. ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని … జనం సమస్యల కోసం పోరాటాలు చేసిన తాను కూతురు సమస్యతో ఇరుక్కుని పోయాడు. అనేక సోమవారాలు కూతుర్ని తీసుకుని ఆటోలో పెద్దాపురం వెళ్ళే వాడు కోర్టుకి. కోర్టు దగ్గర ఉన్నంత సేపూ చాలా మంది పలకరించేవారు. కానీ పెద్దాపురం మారిపోయింది. అల్యూమినియం పరిశ్రమ పోయింది. చేనేత పోయింది. ఊరికున్న పల్లెతనం మెల్లిగా పోతోంది. ఈ సెంటర్లో వంద సంవత్సరాల్నించీ ఉన్న సంత అలా జరుగుతూనే ఉంది. పెద్దాపురం సంతంటే జిల్లా అంతా పెద్దపేరే. కానీ జనాన్ని చూడాలంటే మరిడమ్మ తల్లి తీర్థపు రోజుల్ని చూడాలి. చాగల్నాడే కాదు జిల్లా జిల్లా అంతా ఇక్కడకొస్తుంది. … అరే… ఆ వెళ్తున్నది అల్లుడులా ఉన్నాడే… అనుకుని కూతురుతో ‘‘మీ ఆయనేనా…’’ అన్నాడు. కూతురు తలూపగా  ‘‘ఓ… పెసాదో…’’ అంటూ పిలిచాడు. అతడు చూసి బస్సు ఆగివున్న వేపు వెళ్ళి పోతున్నాడు. వొళ్ళు మండింది. పిలుస్తున్నా పలక్కుండా పోతాడే అనుకుంటూ వడివడిగా వెళ్ళి అల్లుడెక్కిన బస్సు ఎక్కేసాడు. బస్సులో అల్లుడితో గొడవ పడుతుండగానే సామర్లకోట వచ్చేసింది. రైల్వే స్టేషను దాటుతుండగా అల్లుడు మామని పక్కకి గెంటి బయటకు గెంతేసాడు. మామ కూడా వెనకే గెంతాడు.

12.

తూలి కింద పడ్డాడు. ఎదురుగా వచ్చిన బస్సు డ్రైవరు కేకలు పెడుతూనే ఉన్నాడు. బ్రేకు వేసినా .. టైర్లు రోడ్డుని రాసుకుని భయంకరమైన చప్పుడు చేస్తూ వచ్చి గుద్ది ఆగిపోయింది. టైరు కాలు మీదికి ఎక్కలేదు కానీ ముందున్న కడ్డీ తగిలి కాలు పుల్లలా విరిగిపోయింది.

తుంటి నించి మోకాలి వరకూ తడుముకున్నాడు. లోపల రాడ్డు వేశారు. తొడ మీద కుట్లు గాట్లులాగా కనిపిస్తున్నాయి. ఆ రాత్రి అతనికి కలో వాళ్ళమ్మ కనపడి ‘‘యంత్రంతోటి గండమని సోదెమ్మ చెప్పిందిరా…’’ అంది. ఈ సోదెమ్మ తొంభై ఏళ్ళుగా వెంటాడుతూనే ఉంది అనుకున్నాడతను. ‘‘యిప్పటికి నాలుగుసార్లు చావుని చంపాను.’’ అనుకున్నాడు. ‘‘…. కానీ… కాదేమో… ఇంకా అది రాలేదేమో… కానీ ఇప్పుడిక గెలవాలని లేదు.’’ అనుకుంటూ పెద్దగా నవ్వుకున్నాడు.

కానీ ఆ నవ్వు ఎవరికీ వినపడదు.

అద్దేపల్లి ప్రభు

పేరు అద్దేపల్లి ప్రభాకరరావు. ప్రభు అనే పేరుతో కవిత్వం, కథలు రాస్తుంటారు. కవిత్వంలో ఆవాహన, పారిపోలేం, పిట్టలేని లోకం ప్రచురితమయ్యాయి. దాదాపు 30పైగా కథలు రాశారు. సీమేన్ అనే పేరుతో మొదటి కథా సంకలనం ఇటీవలే వచ్చింది. మానవుల మధ్య సంబంధాల్నీ, మానవునికీ ప్రకృతికీ ఉండే సంబంధాలలోని ఎమోషనల్ అనుబంధాన్నీ చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు.

2 comments

  • గండాల్ని గడిచిన వీరుడి కథ ఆసక్తికరంగా వుంది. ముగింపు బాగుంది.

  • కధ విస్తరణకి చాలా చోట్ల కారణం అర్ధం కాలేదు. లూస్ త్రెడ్స్ ఎక్కువగా కనిపించాయి..

    7 వ పార్ట్ చివర తల్లి చనిపోయేనాటికి అన్న వాక్యంలో తల్లి ఎవరు ? చివర చనిపోయిన తల్లి ఎవరు ? నాకు కన్ఫ్యూషన్ గా అనిపించింది.

    రీడబిలిటీ వల్ల నాకు నచ్చింది. కధాంశం, దాని మూలం కన్నా విస్తరణలో వర్ణనే బాగుంది. ముగింపు లోని ఔచిత్యమేమిటి ? ఇప్పుడిక గెలవాలనిలేకపోవడం దేనికి సంకేతంగా ప్రతిపాదించారు ?

    నాకింతే అర్ధమయ్యిది ప్రభూ గారు. 😛😛

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.