కోతి బొమ్మచ్చి

ఆరేళ్ళు పూనాలో గడిపి, సికింద్రాబాదుకి బదిలీమీద రాగానే తెలుగుప్రాంతానికి వస్తున్నందుకు సంతోషించినా, ఆఫీసు క్వార్టర్ దొరుకుందో లేదో అని బెంగపట్టుకుంది. అందుకని కుటుంబాన్ని నెల తర్వాత తీసుకొద్దామని ముందు ఒక్కణ్ణీ ఆఫీసులో జాయినై క్వార్టర్ కోసం అడిగితే నన్నొక వింతజీవిని చూసినట్టు చూసారు.

ఎందుకంటే, రైల్వే క్వార్టర్లు అనగానే అతుకుల బొంతల్లాంటి గేట్లూ, డొప్పతేరి వంగిపోయి గడియలు సరిగ్గా పడని తలుపులూ, సున్నం పెచ్చులు తేలిన గోడలూ, గరుకైన గచ్చూ, ఇరుకైన బాత్రూములూ, క్రీస్తుపూర్వం నాటి కొళాయిలూ, హనుమంతుడి గద లాంటి బుర్రలతో సీలింగు ఫేనులూ, ఇదివరకూ ఉండే వాళ్ళు కొట్టిన మేకులూ, అవి ఊడిన కన్నాలూ, ఇదే రూపం గుర్తొస్తుంది. వుడ్ వర్క్ అనే మాట ఉండదు. నిజమే.

ఒకప్పుడు పట్టణాల్లో అద్దె ఇల్లు దొరకని రోజుల్లోనో, లేదా, ఇంటి అద్దె ఎలవెన్సుకన్నా బయట అద్దెలు బాగా ఎక్కువ ఉండే రోజుల్లోనో ఐతే రైల్వే క్వార్టర్లకోసం ఉద్యోగుల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. గడచిన ఇరవై ఏళ్ళలో అవసరానికి మించి పెరిగిన గృహనిర్మాణం, బయటి అద్దెలకన్నా ఎక్కువైన ఇంటి అద్దె ఎలవెన్సు, ఇంటిలోపలి రూపురేఖలకు పెరిగిన ప్రాధాన్యత, తేలిగా దొరుకుతున్న గృహరుణాలూ, వీటివల్ల ఇప్పుడు రైల్వే క్వార్టర్లకి అంత డిమాండు లేదు. కానీ నేను చూసే ప్రయోజనాలు నావి. నీరూ, విద్యుత్ సరఫరాకి అంతరాయం ఉండదు. గేట్లు గడియ పడకపోయినా, చూడ్డానికి అందంగా లేకపోయినా చాలా దృఢంగా ఉంటాయి. వాళ్ళు బిగించిన గొళ్ళేనికి చిన్న గొలుసు కట్టి తాళం వేసుకుంటే సరి. అదీకాక ఇంటి యజమాని ప్రమేయం లేకుండా స్వంత ఇంట్లో ఉన్నంత దర్జాగానూ ఉండొచ్చు. జన్మతః పల్లెటూరివాణ్ణి అవటం వల్ల, ఇంటిముందు వాకిలి ఉంటే నాకు నిండుగా ఉంటుంది. అందరూ ఇబ్బంది అనుకొనేవి నాదృష్టిలో భరించలేనివి కావు. నా ఇంటికొచ్చే అతిథుల్లో నాకన్న చాలా ధనవంతులున్నా వాళ్ళెవరూ నా ఇంటి లోపలి గోడల సౌందర్యాన్నో, ఫర్నిచర్నో చూసి నన్ను అంచనా వేసే వారు కాదు.

ఆఫీసులో నన్ను క్వార్టర్ అడగొద్దని, హెచ్చార్యే తీసుకొని బయట ఉండమని నచ్చచెప్పలేకపోయిన గుమస్తా, చివరిప్రయత్నంగా యూనియన్ లీడర్ని పిలిచాడు. సదరు యూనియన్ లీడర్ చెప్పినదేమిటంటే, క్రొత్త నిబంధనలప్రకారం ఒకసారి రైల్వే క్వార్టర్ తీసుకున్నాకా, స్వంత ఇంటికి మారినా, అద్దె ఇంటికి మారినా, ఖాళీ చేసిన క్వార్టర్లోకి ఇంకో ఉద్యోగి వచ్చే వరకూ ఇంటి అద్దె భత్యం ఇవ్వరనీ, అలా ఎంతో మంది ఖాళీచేసిన వాళ్ళు బయట ఇంటికి అద్దెకడుతూ, అద్దె ఎలవెన్సు లేకుండా బాధపడుతున్నారనీ, కొంతమందికి ఖాళీ చెయ్యాలని ఉన్నా, తాము ఖాళీ చేసిన క్వార్టర్లోకి కొత్తవాళ్ళు రాకపొతే తమకు అద్దె ఎలవెన్సు రాదన్న భయం కొద్దీ అయిష్టంగా ఉంటున్నారనీ అన్నారు. వీళ్ళంతా ఇప్పుడు యూనియన్ లీడర్లని తినేస్తున్నారుట. ఇప్పుడు క్వార్టర్ తీసుకుంటే నేనుకూడా భవిష్యత్తులో తనని తినేస్తానేమోనని లీడరుగారి భయం. సికింద్రాబాదులో ఉన్నన్నిరోజులూ, క్వార్టర్ గురించి గాని, హెచ్చార్యే గురించి గాని, మిమ్మల్ని ఏ దశలోనూ ఇబ్బంది పెట్టను. ఇప్పుడు మాత్రం క్వార్టరే ఇప్పించండి అన్నాను.

చెడుకాలం దాపురించినప్పుడు హితుల మాటలు చెవికెక్కవు లాంటి భావాలు వ్యక్తపరుస్తూ నాకు క్వార్టర్ ఇచ్చేశారు. నేను ఈ క్వార్టర్లోకి దిగినందుకు మనస్పూర్తిగా సంతోషించినది ఎవరయ్యా అంటే, క్రిందటేడు ఈక్వార్టర్ ఖాళీచేసి, అందులోకి ఎవరూ రానికారణంగా ఏడాదిగా హెచ్చార్యే పోగొట్టుకుంటూ, ఇప్పుడు నావల్ల హెచ్చార్యే తిరిగి పొందిన ఆసామీ. విషయం తెలియగానే నాదగ్గరకు వచ్చి, బోల్డన్ని థేంక్సులు చెప్పి మరీ వెళ్ళాడు.

పదిహేనేళ్ళగా రైల్వే క్వార్టర్లలో ఉండటం వల్ల, మా క్వార్టర్  మా ఆవిడా పిల్లలిని ఏఇబ్బందీ పెట్టలేదు. పెరటి నిండా పిచ్చిమొక్కలూ, సంరక్షణలేక కొనప్రాణంతో ఉన్న జామచెట్టూ కూడా ఉండటంతో, అన్నీ సంస్కరించుకొన్నాకా నెల్లాళ్ళలో కూరగాయలూ, పూలమొక్కలూ, కళకళ్ళాడే జామచెట్టూ తయారయ్యేయి. ఒక రుతువు గడిచేసరికి జామచెట్టు కాపు పట్టింది. కరివేపాకూ, పచ్చిమిర్చీ కావలిస్తే ఫ్రిజ్జు దగ్గరికి కాక పెరట్లోకెళుతున్నాం. కూరగాయలు పూర్తిగా కొనడం ఆపెయ్యకపోయినా, వారానికి రెండుమూడ్రోజులకి సరిపోతున్నాయి. ఒక ఉదయం తోట కంచె పై చిక్కుకున్న నాగుపాము కుబుసం మా అమ్మాయిలకు చూపించి, తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా చెప్పాను.

ఒకరోజు ఉదయాన్నే మొక్కలకు నీళ్ళు పోద్దామని పెరట్లోకి వెళ్ళిన మా రెండో అమ్మాయి బేర్ మని అరుచుకుంటూ లోపలికొచ్చింది. దడేలున తలుపుమూసి, బాగా ఝడుసుకున్నట్టు, కోకో…. అని ఆయాసపడుతోంది.

కోబ్రా ఉందా అని మా పెద్దమ్మాయి హింటిచ్చింది. కాదు అన్నట్టుగా తల ఊపుతూ గసపోస్తూనే మాటలు తడుముకుంటోంది చిన్నమ్మాయి. కిటికీ తెరచి చూద్దును కదా, కనీసం ఓ ఇరవై కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాల్మీకి మహర్షి వానరమూకని వర్ణించటానికి ముందు, ఆయన ఆశ్రమంలో కుడా ఇలాంటి కోతుల దండే వచ్చి ఉండాలి. ఇరుగుపొరుగు వాళ్ళకి ఫోను చేస్తే, వాళ్ళు, క్వార్టర్ మెయింటెనెన్సు వాళ్ళకి ఫోను చేస్తే, అరగంటలో కోతుల దండుని తరిమారు. పెరట్లోకెళితే ఇంకేముంది, తోటంతా సగం కొరికి పడేసిన కసురు కాయలూ, విరిగిన కొమ్మలూ. పెరటితోట పూర్వ రూపం సంతరించుకొందికి, మళ్ళీ కోతులు రాకపోతే మరో రెణ్ణెల్లు పట్టొచ్చు.

సరేలే అనుకుంటూ, వంటింట్లోకొచ్చి టీ కోసం కూర్చొని ఉంటే మా ఆవిడ అంది, రైల్వే క్వార్టర్ గనుక కోతులొచ్చాయి అని. నేను మాటలు తడుముకుంటున్నాను. అంతలో మా పెద్దమ్మాయి, మా ఫ్రెండూ వాళ్ళ ఎపార్టుమెంటులోకి కూడా మొన్న కోతులు దూరిపోయేయిట అని చెప్పింది. కూతురివైపు ఉరిమినట్టు చూడబోయి, నన్ను చూసి ఆగిపోయింది మా ఆవిడ. ఉదయం వాదనల వల్ల ఆఫీసుకి లేటు అయి, అక్కడ మళ్ళీ వాదనలు వస్తాయేమోనని, నేను టీ తీసుకొని పేపరు చూద్దును కదా, జంటనగరాల్లో ఏఏ ప్రాంతాల్లో కోతుల బెడద ఎంత ఉందో చెప్పే కథనం సెంట్రల్ పేజీ అంతా ఉంది. పేజీ చివర, కోతుల బెడద నివారణకు అవలంబించవలసిన సమస్యలపై శాస్త్రీయ అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త ఫోను నెంబరు ఇచ్చారు.  సాయంత్రం ఈ శాస్త్రవేత్తకి ఫోను చేద్దామని అనుకొని దైనందిన కార్యక్రమాల్లో పడ్డాం.

ఆరోజు కుదరలేదు. మర్నాడు పేపర్లో ఈ శాస్త్రవేత్త చేస్తున్న పరిశోధనలగురించి వివరంగా ఇచ్చారు. ఫ్రొఫెసర్ కోవెళ్ళ తిరుపతి రావు (సంక్షింప్తనామం కో. తి. రావు కావటం యాదృచ్చికమే, సంక్షిప్తనామం చూసి ప్రోజెక్టు ఇచ్చి ఉండరు) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్త. కోతుల నివారణలో శాస్త్రీయ పద్దతులపై పెద్ద ప్రోజెక్టు చేస్తున్నారు. ఇప్పటికే ఆఫ్రికా దేశాలు, బ్రెజిల్, అవీ పర్యటించి వచ్చారు. సాయంత్రం  ఫోను చేసి సమస్య వివరించాను.

“కొన్ని మామిడి తోటల్లో కొండముచ్చు పెట్టామండీ. కొన్నిచోట్ల బాగానే ఫలితం వచ్చింది. కొన్ని చోట్ల మాత్రం బాగా బలిష్టమైన కోతులదండు ఈ కాపలా కొండముచ్చు మీద దాడిచేసి గాయపరచాయి.”

వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడిగాను, “ఐనా కొండముచ్చును మేము పెంచలేమేమో సార్.”

“మునిసిపల్ కార్పోరేషన్ వాళ్ళు కొన్ని కొండముచ్చులిని, అలాగే కొండముచ్చుని సంరక్షిస్తూ, కోతులున్నప్రాంతాల్లో తిప్పగలిగే మనుషులిని పెట్టుకొని, సమస్య ఎక్కడుందో అక్కడికి పంపాలి.”

“మా స్థాయిలో చెయ్యగలిగేవి ఏవైనా ఉన్నాయా సార్?”

“కుక్కని పెంచుకోవచ్చు. కానీ కుక్కలు వెంటపడగానే కోతులు చెట్టెక్కటమే కాక, అక్కడినుంచి, కుక్కని వెక్కిరించినట్టు కవ్విస్తూ ఉంటాయి. అందువల్ల కుక్క అదేపనిగా మొరుగుతూ ఇరుగుపొరుగులికి చికాకు తెప్పిస్తుంది.” సమస్యకి పరిష్కారం చెబుతున్నాడో, పరిష్కారాల్లో సమస్యలు చెబుతున్నాడో అర్ధం కాలేదు.

ఇలా కొన్ని పరిష్కారాలూ అందులో సమస్యలూ చెప్పాకా, చివరగా అన్నాడు. “కోతుల దండు మీదకి వొంటరిగా వెళ్ళకూడదు. నలుగురైదుగురు ఒకేసారి కర్రలు పట్టుకొని తరమాలి అని.” తరతరాలుగా ఉన్న పరిష్కారాన్నే చెప్పాడు. దీనికోసం ఆఫ్రికా, బ్రెజిలూ తిరగటం ఎందుకో అర్ధం కాలేదు. స్పీకర్ మోడ్ లో ఆయన చెప్పిన పరిష్కారాలన్నీ మా ఆవిడా పిల్లలూ కూడా విన్నారు. అన్ని మాటలకూ వచ్చే నవ్వుని ఆపుకున్నా చివరి మాటలకు మాత్రం ఆపులేకపోయారు. భళ్ళుమన్న నవ్వులు ఆయన చెవిని తాకే లోపే ఫోను కట్ చేశాను.

తరువాత ఇరుగుపొరుగులో ఐదారేళ్ళుగా ఉంటున్నవారితో మాట్లాడితే తెలిసిందేమిటంటే, ఏడాదిలో ఒకట్రెండు సార్లు కోతుల రాక సాధారణమే అని. మేముకూడా అందుకు సిద్దపడిపోయాం.

మరో నెల రోజులతర్వాత పేపర్లో ఒక వార్త ఆకర్షించింది. ఒకరైతు తన పళ్ళ తోటలను కోతులనుండి రక్షినచటానికి పెద్దపులి బొమ్మని కొని, కోతులు వచ్చేదారిలో చిన్న షెడ్డులో పెట్టాడట. కోతులబెడద తగ్గిందిట. కోతులు దీనిని నిజం పులి అనుకొని భయపడుతున్నాయిట. దాంతో రైతుని ఆదర్శ రైతుగా గుర్తించి, కలెక్టరుగారు సన్మానం చేసేరట. మా చిన్నమ్మాయి నన్ను కూడా పులిబొమ్మ కొనమంది గానీ, ఆ సైజు పులిబొమ్మ ఖరీదు పదివేలు అని తెలుసుకొని, ‘గడియ వేషానికీ గెడ్డం మీసం గొరిగేరు’ అన్న సామెతలా అనిపించి కొనలేదు.

నెల్లాళ్ళతర్వాత, దినపత్రికలోప్రభుత్వ అనాలోచితచర్య నష్టపోయిన ఆదర్శరైతు’ అనే హెడ్డింగుతో వార్త వచ్చింది. వివరాలు చూద్దును కదా. పులిబొమ్మ ఉపాయం జిల్లా కలెక్టరుని ఆకర్షించిందిట. వెంటనే ప్రభుత్వ నిధులతో పది పులిబొమ్మలు తెప్పించి అదే ఊర్లో పదిమంది మామిడి రైతులకు ఇచ్చి ఫలితాలు చూద్దామనుకున్నారుట. అంతా బాగానే ఉంది.  కాకపోతే, పులి బొమ్మలన్నింటినీ ఒకే వాహనంలో గుట్టగా పోసి రవాణా చెయ్యటంతో ఠీవిగా, భయంకరంగా కూర్చొన్న భంగిమలో ఉన్న పులిబొమ్మలు కాస్తా వంకర మూతులూ, వంగిన మెడలు, నలిగిన చెవులూ, దుమ్మూధూళితో మాసిపోయి ఊరు చేరాయిట. మొదట పులిబొమ్మ పెట్టిన రైతు ఐతే, పదివేలరూపాయల ఖర్చు పెట్టి ఏర్పాటు చేసాడు కనుక అన్నీ శ్రద్ధగా చూసుకున్నాడుకానీ, తరువాత పదిమందికీ పులిబొమ్మలు ఉచితంగా దొరకటంతో, చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న రీతిలో, వచ్చిన బొమ్మలు వచ్చినట్టే తోటల్లో నచ్చినచోట పెట్టేసారు. పైకప్పు లేకపోవటంతో, ఆపులిబొమ్మలమీద పక్షుల రెట్టలు అదనపు అలంకారాలు కావటంతో కోతులు అవి బొమ్మ పులులే అని గ్రహించేసి, మెత్తగా ఉండటంతో వాటి మీద ఎగిరి దుమికి ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాయిట. అక్కడితో ఊరుకోకుండా, మొదట స్వంతఖర్చుతో పులిబొమ్మ పెట్టుకున్న ఆదర్స రైతు తోటలోకొచ్చి, దానితో కూడా ఆడుకొని చెవులూ తోకా చింపి పోసాయి. ఆవిధంగా ఆదర్సరైతు సృజనాత్మకత కాస్తా ప్రభుత్వం కలుగజేసుకోవటంవల్ల ఓడిపోయింది. ఆదర్స రైతు ప్రభుత్వ అధికారుల్ని తిట్టిపోస్తున్నాడుట.

నాకర్ధమయిన మొదటి నీతి: సృజనాత్మకతను నకలు చేయరాదు.

రెండోనీతి: ప్రభుత్వం కన్నుపడగానే సృజనాత్మకత దాని విలువ పోగొట్టుకుంటుంది.   

డాక్టర్ మూలా రవికుమార్

మూలా రవికుమార్ పశువైద్య పట్టభద్రుడు. పశుపోషణలో పీజీ, గ్రామీణాభివృద్ధిలో పీహెచ్ డీ.
పశువైద్య విశ్వ విద్యాలయంలో శాస్త్రవేత్త. పద్దెనిమిదేళ్ళగా కథా రచన. 2012 లో చింతలవలస కథలు సంకలనం విడుదల. కథాంశాలు: ఉత్తరాంధ్రా గ్రామీణం. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి. సంస్థలలో ఉద్యోగుల మనస్తత్వాలు.

3 comments

  • హాస్యం బాగా వచ్చింది. చివర ఇచ్చిన సూక్తులు బలే ఉన్నాయి.

  • కథకు తగ్గట్టు పేరు పెట్టారు. మీదయిన శైలిలో హాస్యాన్ని జతపరచారు.

  • ప్రభుత్వంఅనుసరించిన తీరుకన్నా!
    ఇరుకుగదుల అపార్ట్ మెంట్ లో నివాసం కన్నా
    అందుబాటులోఉండే రైల్వే వారి నివాసభవనం బాగుంది !

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.