అల్గారిథం

‘ప్రయాణ బడలిక’ ఇప్పటికి చాలా సార్లు తనకుతాను చెప్పుకున్నది శృతి.

అయినా విమానంలో కదా వచ్చింది, సంశయం కలిగింది  – ఏకధాటిగా 10 గంటల ప్రయాణం, శరీరం తట్టుకోవద్దూ?

దారిలో ఎక్కువసేపు నిద్రేనాయే, ఇంకేంటి? అది మాగన్నుగా కళ్ళు మూయడమే, సరైన విశ్రాంతి కాదుగా.

జెట్ లాగ్ వల్లనేమో – ఆఁ..! అయిదు గంటల తేడా కదా, అక్కడికీ ఇక్కడికీ -అదే అయ్యుంటది. ఇలా తానే ప్రశ్నించుకుని – తనకు తానే జవాబులు కూడా ఊహించుకొంటూ ఇల్లంతా సర్దుకుంటుంది.

‘ఆన్ సైట్’ పని మీద ఆఫీసు వాళ్లు పంపిస్తే లండన్లో 6 నెల్లు ఉండి నిన్నే ఇంటికి తిరిగొచ్చింది తను. తెల్లవారు జామున రిసీవ్ చేసుకోడానికి భర్త విమానాశ్రయానికొచ్చి మరీ తీసుకొచ్చాడు.

వచ్చాడు, కాదనట్లా ఆమెని చూడంగానే చేతిలోని లగేజి అందుకున్నాడుగానీ – రెండు చేతులూ చాచి తనను దెగ్గరకు తీసుకోలా. ఇన్ని రోజుల తర్వాత ఇంటిది తిరిగొస్తే ఇలానేనా ఆహ్వానించేది?

ఓ ఇంగిలీషు హగ్గో, తెలుగు పరిష్వoగమో పోనీ ఓ చెయ్యి బుజం చుట్టూ వేసి పక్కన నడుస్తూ మొహాన్ని దరిచేర్చి  లైటుగా తన బుగ్గమీద అతని పెదాలను తాకించడమో చెయ్యొచ్చుకదా. అగుపడగానే కావాటేసుకొని, పెదాలకు పెదాలు కలపడం ఇప్పుడు మన దేశ సగటు ప్రజానీకం అతి సామాన్యమైన విషయంగా గుర్తెరిగారు కదా. ఇంక దేనికి భయం? పోనీ ఏం తెలీని అమాయకుడా అంటే…. ఆతని రసికత్వం తానెరగనిదా?

పోనీ అక్కడొదిలేసినా ఇంటికొచ్చాక, తామిద్దరే ఉన్నారుగా, అప్పుడన్నా తనను దరి చేర్చుకోవాలిగా ఆఫీసుకు ఆలస్యం అయిపోతుందని హడావుడిగా తయారయ్యి వెళ్ళిపోయాడు.

మళ్ళీ సాయంత్రం తిరిగొచ్చి పెట్టింది తిని, కుక్కిన పేనులా పడుకొని పోయాడు. తానే అతని గుండెలపై కాసేపు ఒదిగింది, ఇంతలో ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీలా, మెలుకువ వచ్చే సరికి తెల్లారి 8 అయ్యిపోయింది.

శ్రీవారు లేచి టీ చేసి తీసుకొచ్చి శ్రీమతి కందించారు. ఇక తానెంత మారం చేసినా అతనాఫీసుకెళ్ళడం మానడని తానూ లేచి పనుల్లో పడింది.  

ఇన్నాళ్లూ తాను లేదుకదా ఇంట్లో దుమ్మూ ధూళీ పేరుకుపోయింది, సామానంతా చిందర వందరగుంది, అందుకే ముందు ఇల్లు సర్దుతుంది. నిన్నంతా పడుకొనే ఉంది, అయినా మళ్ళీ రాత్రికి నిద్రొచ్చేసింది. అదే ఆమెకు అర్ధం కావడంలేదు. ‘ప్రయాణం వల్లనే’ మళ్ళీ తనలో తాననుకుంది. వచ్చిం దగ్గరనుంచీ మొగుడి కోసం తపిస్తుంది తనువు కానీ ఆమె మురిపెం ఇంకా తీర లేదు. అందుకే తనలోతానే పరితపిస్తుంది. ఈ రాత్రికైనా … అనుకుని మైమరచిపోతుంది.

***

‘వళ్ళు బాగా అలసిపోయి… ‘ తన కోసం తానే చేసుకున్న మరునాటి ప్రకటన.

‘మరీ…? ఇంత ఇల్లు ఒక్కత్తినే సర్దడమంటే సామాన్యమా? వళ్ళు హూనం అయ్యిపోయిందంటే నమ్మాలి’ విశ్లేషణాత్మక వివరణ.

విదేశం నుంచి వారం మధ్యలో తానొచ్చింది, పై వారం తిరిగి ఇక్కడి ఆఫీసులో  జాయిన్ అవ్వాలి. ఈ నాల్గు రోజులూ సెలవులే. తననిట్లా ఒక్కత్తినే ఇంట్లో పడేసి పోకపోతే ఎటైనా  తీసుకెళ్లడానికి ఆలోచన చెయ్యాలి కదా ఇంటాయన. అక్కడేమో శుక్రవారం సాయంత్రం విహార యాత్రకు పయనమవ్వాల్సిందే. భలే సరదాగా ఉండేది, కొత్త ప్రదేశాలు, కొత్త రుచులు, కొత్త స్నేహాలు, కొత్త అనుభవాలు. ఏ దిగులూ, ఏ పరిమితులూ లేని మరో లోకం. ఛి…  ఛీ… తానేంటి ఇలా ఆలోచిస్తుంది? ‘స్నానం చేసి, కడుపునిండా తిని, ఏ సీ వేసుకొని, మెత్తని పరుపుపై భర్త చెంతన ఒడ్డిగిలితే తనువెటో వెళ్ళిపోతుంది’ అందుకే రాత్రి ఏమీ కాలేదు. మరింత లోతైన అవగాహన.

తనలో తానే మదనపడ సాగింది శృతి. భర్తే కదా తానే చొరవ చెయ్య వచ్చు కదా… ఎక్కడా? మంచం ఎక్కగానే మగత కమ్మేస్తుంటే. ‘నా సంగతి సరే.. మరాయనేందుకు ముందుకు దూకడంలేదు?’ మూడో నాటి పగలు  ఉత్పన్నమైన ముఖ్యమైన సవాలు. ‘సొంత పెళ్ళాం ఆరునెల్ల తరవాత పక్కకొస్తే ఏ మగాడన్నా ఇట్లా ఉదాసీనంగా ఉంటాడా? ఆ ఆకలి లేదా?’ మదిలో ఊరుతున్నయి మరెన్నో సందేహాలు.

‘ఉప్పూ కారం తినే  మనిషన్నాక లేకుండా ఎట్లుంటది? వయసులోనే ఉన్నాడుగా ‘  మరి రెండు రాత్రుల నుంచీ తననెందుకు సమీపించడంలేదు? తానే ఇంతలా తపిస్తుంటే… మాగాడు, మొగుడూ ఆయనింకెంత ఆగం చెయ్యాలి?

‘నేనే ఇంతలా….. నేనే అంటే ఏంటీ? నాకేమీ వయసైపోలేదు. నేనేమీ సన్యాసం తీసుకోలేదు. మరేంటి నేనే ఇంతలా అంటే?’ తనలో తానే కలహించుకో సాగింది.

ఈ ఆరునెల్ల విదేశీ ఆన్ సైటులో , వారాంతపు విహారయాత్రలలో, మద్యం మత్తులో, కొన్ని బలహీన పరిస్థితులలో ఒకటి రెండు సార్లు తానింకొకరికి లొంగింది. ఇష్ట పూర్వకంగా చేసిందని కాదుగానీ  అప్పుడలా జరిగిపోయిందంతే. తానప్పటికి శరీరాన్ని సంతృప్తి పర్చుకుంది. అందుకే మొగుడిని ఎదురుగా పెట్టుకొని కూడా తొందర పడక ఉండగలిగిందేమో. ‘మరాయనేందుకు మీద పడటం లేదు?’ మళ్ళీ ముందుకొచ్చిన అనుమానం. ‘ఒకవేళ ఆయన కూడా… ఎక్కడన్నా…. ఎప్పుడన్నా….ఎవరితోనన్నా?’

‘ఛా. ఆయన అలాటి వాడు కాదులే. అయినా ఇక్కడ మన దేశంలో వీకెండులో పబ్బులో డాన్సులు, సినిమాలు, షాపింగ్ మాల్స్ తప్పా, తప్పని సరి లాంగ్ డ్రైవ్ లు, మోటెల్ లో ఉండడాలు కుదరవు లే’

‘మరీ… ?’ ఆమెకంతుపట్టకున్నది తన మగని  తంతు.

***

‘ఏమండీ గుడికెళదామా?’ ఉదయాన్నే భర్త చెవిలో గుసగుసలాడింది శృతి.

‘హా…! లేచి తయారవ్వు. కాసేపైతే జనాలు ఎక్కువైపోతారు’ తొందర చేశాడు భర్త.

తలారా స్నానం చేసి, ఆయనకిష్టమైన  చీర సింగారించి, కొప్పున పువ్వులు తురుముకొని, పూజా సామాగ్రిని చేతపట్టి దేవాలయం చేరి తదేక మనసుతో భగవంతుడిని ధ్యానం చేసుకొని తన తప్పులన్నీ కాయమని సాష్టాంగ నమస్కారాలు, గుంజిళ్ళూ, ప్రదక్షణలూ, లెంపలేసుకోవడాలు వంటి తనకు తెలిసిన పరిహారాలన్నీ పూర్తి గావించి పరిపూర్ణ హృదయంతో భర్త వద్దకొచ్చి నిలుచుంది. ఆతను ఆమె చెయ్యి పట్టి ముందుకు నడిపించి  తీసుకొచ్చి, మెట్ల పైన కూర్చోబెట్టి, ప్రసాదం తినిపిస్తూ తన చీర రంగును మెచ్చుకొంటూ, గాలికి రేగుతున్న జుట్టును సవరిస్తూ, సరైన తిండి లేక చిక్కిన జబ్బల నునుపును గూర్చి విచారిస్తూ, సాయంత్రపు కార్యక్రమం గురించి, రేపటి తంతును గూర్చీ వివరిస్తుంటే… శృతికి రాత్రి తన మనో సంఘర్షణ గుర్తుకొచ్చింది. ‘ఈ ఆరునెల్ల ఎడబాటుని ఎలా భరించారని ఆయన్ని నిలదియ్యాలని, ఇప్పుడెలా దూరం ఉండగలుగుతున్నారని కనుక్కోవాలని, ఏదో విధంగా భర్త మనసులోది కక్కించెయ్యాలని,  ఆమ్మో తిరిగి ఆయన తనను అదే ప్రశ్న వేస్తె నేనేమి చెప్పాలోనని , ఆయన చెప్పేది నమ్మాలో, నేను చెప్పేది ఆయన నమ్ముతాడో లేదోనని’ ఇలా ఎన్నో మరెన్నో ఏవేవో ఆలోచనలతో మానసల్లకల్లోలం కాగా ఎప్పుడు నిద్రపట్టిందో తెలీనేలేదు. కానీ ఉదయన్న మెలుకువ రాగానే దేవుడు గుర్తొచ్చాడు. ‘గుడికెళదామా?’ అని అడిగేసింది. తాను తయారయ్యిందగ్గరనుంచీ చూసిన పతి కళ్ళలో మెరుపు కనపడుతుంది. జంటగా గుడి మెట్లు ఎక్కడం మొదలు, ఇరువురూ కలసి పూజ పూర్తి కావించడం, ఆపై ప్రసాదం ఒకరికొకరు అందించుకుంటూ తినేశారు. చల్లని గాలికి ఇద్దరి మధ్య ఏదో కదిలింది. ఇన్నాళ్ల ఎడబాటు తెచ్చిన సందేహాల సునామీ సద్దుమణిగింది.

 

అనిల్ ప్రసాద్ లింగం

''తనను తాను సాహితీ అభిమానిగా చెప్పుకోడానికే ఎక్కువ ఇష్టపడే అనిల్ ప్రసాద్ లింగం, ఆ ఆలోచనామృతంలోంచి పుట్టేవే తన రచనలని చెబుతారు. 15 కథల వయసున్న ఈ రచయిత, మనిషి అంతరంగంలో దాగిన కంటికి కనిపించని భావావేశాల్ని, వైవిధ్యంతో కూడిన భావోద్వేగాల్నీ, మానవ సంబంధాలలోని విచిత్ర పార్శ్వాలనీ - 'అద్వైతం' పేరున తన కథలలో అక్షరీకరించే ప్రయత్నం చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.