మాట మారిస్తే ఎలా?

బైక్ మీద వెళ్తుండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంది. బైక్ పక్కకు ఆపి, ఎవరు కాల్ చేసారా అని చూస్తే నాన్న. “నానమ్మ కింద పడింది. కాలు విరిగినట్టుంది. త్వరగా వచ్చేయ్”

ఇంటికి వెళ్లేసరికి నానమ్మ మంచం మీద పడుకుని ఉంది.

“ఏం  జరిగింది?”

“కరెంటు పోయినప్పుడు, కుర్చీ లో కూర్చోబోతే కింద పడిపోయాన్రా.  లేవాలనకున్నాను గానీ, అస్సలు వీలుకాలేదు. నొప్పి ఎక్కువ అనిపించి గట్టిగా అరిస్తే, అత్త, మామయ్య, మొత్తం నలుగురు వచ్చి, లేపి ఈ మంచం మీద పడుకోబెట్టారు” మూలుగుతూ చెప్పింది.

అత్తని అడిగితే, చీర లోపల తుంటి దగ్గర బాగా వాచిపోయింది అని చెప్పింది.

వెంటనే ఆటో మాట్లాడుకుని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం.

డిజిటల్ x-ray తీయించి చూసిన తర్వాత, డాక్టర్ నన్ను, నాన్ననూ లోపలికి పిలిచి,  తుంటి ఎముక మూడు చోట్ల విరిగిందని, ముసలి వయసు కావడం చేత ఎముకలు బాగా బలహీనంగా, బోలుగా ఉన్నాయని, అందుకే చిన్న దెబ్బకే మూడు చోట్ల  విరిగిపోయిందని చెప్పారు.

ఆపరేషన్ చేసి, తుంటి మార్పిడి చేసినా మునుపటిలా మామూలుగా తిరగలేకపోవచ్చు గానీ, టాయిలెట్ కి వెళ్లడం, స్నానం చేయడం లాంటి తన పర్సనల్ పనులకు  ఎవరి మీదా ఆధారపడకుండా ఉండగలుగుతుంది కాబట్టి ఆపరేషన్ చేయడం బెటర్ అని చెప్పారు.

ఆపరేషన్ వెంటనే చేయాలంటే, డబ్బులు కట్టి చేయించుకోవాలి.  ఆరోగ్యశ్రీ లో అయితే ఒక ఐదారు రోజులు టైం పడుతుందనీ చెప్పారు. ఎలాగూ కార్డు ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీలో చేయించుకుంటాం అన్నాము.

ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద రిజిస్టర్ చేసి, అడ్మిట్ చేసుకున్నారు. చేసుకున్న రోజు ఆపరేషన్ కి ముందు అవసరమైన రక్త పరీక్షలు చేసారు.

ఆరోగ్యశ్రీ అప్రూవల్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. హాస్పిటల్ లో జాయిన్ అయిన మూడో రోజు , ఆరోగ్యశ్రీ బిల్స్ చూసుకునే హాస్పిటల్ employee నివాస్ నన్ను పిలిచి,  “సర్జరీకి ముందు 2 d echo చేసి గుండె పనితీరు సరిగా ఉందో లేదో పరీక్షించాలి. కానీ మా హాస్పిటల్ లో కార్డియోలజిస్ట్ లేరు.  బయటి నుంచి వచ్చే డాక్టర్ 2d echo  చేసినందుకు అయ్యే ఖర్చు,  రెండు వేలూ మీరే పెట్టుకోవాలి. ఇది పూర్తిగా unofficial.  మీకు బిల్ ఇవ్వడం కుదరదు”

“డబ్బులు తీసుకుంటున్నప్పుడు బిల్ ఇవ్వాలిగా?”

“ఆరోగ్యశ్రీ కేసులకు డబ్బులు తీస్కోకూడదనే రూల్ ఉంది. అందుకే మేం బిల్ ఇవ్వలేం. మీరు మళ్లీ ఈ డబ్బులు అడగకూడదు.  మీకిది అంగీకారం అయితే ఆపరేషన్ చేసయించుకోండి. లేకపోతే, వేరే హాస్పిటల్ కి వెళ్లిపోవచ్చు.”

ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది. ఇంకో హాస్పిటల్ కి వెళ్లినా, ప్రాసెస్ మొత్తం మొదటి నుండీ చేయాలి. అంటే ఇంకో మూడు రోజులు వెయిటింగ్. అక్కడ కూడా ఇలా జరగదని గ్యారెంటీ లేదు. కాబట్టి ఇక్కడే చేయించాలి అని నిర్ణయించుకున్నాను. ఆపరేషన్ జరిగే హాస్పిటల్ వాళ్ళతో  గొడవ పెట్టుకోవడం అంటే, నానమ్మ ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టినట్టు అవుతుందనిపించి, “సరే బిల్ అవసరం లేదు. ఈ డబ్బులు వెనక్కి ఇవ్వమని అడగను” అని,  రెండు వేలూ కట్టేసాను.

తర్వాత రోజు ఆపరేషన్ సమయంలో రక్తం ఎక్కించాల్సి వస్తుందని, రెండు ప్యాకెట్లు రక్తాన్ని రెడీ చేసుకోమని చెప్పారు. నేను, మా బావ రక్తం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. రక్తం మేమే ఇచ్చినా కూడా,  రక్తపరీక్షలు కోసం ఒక్కో వ్యక్తి బ్లడ్ కీ 750 లెక్కన పదిహేనొందలు ఖర్చవుతాయనీ , ఆ డబ్బులు కూడా మీరే పెట్టుకోవాలనీ నివాస్ ముందే చెప్పడంతో బ్లడ్ బ్యాంకు లో రక్త పరీక్షలకి డబ్బులు కట్టి  రక్తం ఇచ్చాం.  బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బిల్స్ ఇస్తే నా దగ్గరే జాగ్రత్తగా ఉంచాను.

సర్జరీ అయిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీ కి సంబంధించిన నియమ నిబంధనలు మొబైల్ లో డౌన్లోడ్ చేసాను.  వాటిని అనుసరించి ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా నగదు రహిత పథకం కాబట్టి, పేషెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పటినుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరేదాకా,  ఖర్చులన్నీ హాస్పిటల్ వాళ్ళే భరించాలి. ఒక్క రూపాయి కూడా పేషెంట్ దగ్గర వసూలు చేయకూడదు. నివాస్ దగ్గరికి వెళ్ళి, నియమ నిబంధనలను చూపించి, నేను ఖర్చు పెట్టిన 3500 ఇవ్వమని అడిగాను.

“ఆ ఖర్చులు మీరే పెట్టుకోవాలని ముందే చెప్పాము కదా? ఇప్పుడు మాట మారిస్తే ఎలా?” అని చాలా సేపు నాతో వాదించారు. నేను బ్లడ్ బ్యాంక్ బిల్స్ పట్టుకెళ్లి, కంజ్యూమర్ కోర్ట్ లో కేసు వేస్తానని చెప్పడంతో,  నా దగ్గర బిల్స్ ఉన్నాయి కాబట్టి కేవలం రక్త పరీక్షాలకి అయిన 1500 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 2d echo టెస్ట్ కి బిల్ లేకపోవడం వలన ఆ డబ్బులు ఇవ్వలేదు.

డిశ్చార్జ్ టైంలో ఆరోగ్యమిత్ర స్టాఫ్ ఫీడ్బ్యాక్ ఫారం నింపమని ఇచ్చారు. 2d echo కి  2000 రూపాయల వసూలు చేసారని, బిల్ ఇవ్వలేదన్న విషయాన్నీ ప్రస్తావించాను. అది చూసి వాళ్ళు విడిగా కంప్లైంట్ లెటర్ రాసి ఇవ్వమంటే, రాసిచ్చాను. రెండు మూడు రోజులలో హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ఐదు రోజులు దాటినా హాస్పిటల్ నుంచి ఏ విధమైన ఫోన్ కాల్ రాకపోయేసరికి, నేనే మళ్ళీ హాస్పిటల్ లోని నివాస్ దగ్గరికి వెళ్ళి, నేనిచ్చిన కంప్లైంట్ లెటర్ గురించి అడిగాను.

“మీరు డబ్బులు కట్టడానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఆపరేషన్ చేయడం మొదలెట్టాం? ఆపరేషన్ అయిపోయాకా ఇప్పుడు మాట మారిస్తే ఎలా?” అని ఎదురు ప్రశ్న వేసాడు.

“ఒక పర్టికులర్ సర్జరీకీ మీ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ స్కీమ్ లేకపోతేనో, లేదా అడ్మిట్ చేసుకోవడానికి బెడ్స్ ఖాళీ లేకపోతేనో తప్పించి, మీ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చిన ఏ పేషెంట్ నీ వెనక్కి పంపించడానికి రూల్స్ ఒప్పుకోవు. కచ్చితంగా అడ్మిట్ చేసుకోవాల్సిందే.  అటువంటిది, ఆల్రెడీ జాయిన్ అయిన పేషెంట్ ని, డబ్బులు ఇవ్వకపోతే వెనక్కి వెళ్లిపొమ్మన్నారు. ఒక విధంగా అది బెదిరించడం లాంటిదే. మీరు చేసింది చాలా తప్పు. నానమ్మ ఆరోగ్యం రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక ఆ మూమెంట్ లో ఒప్పుకున్నాను. ఇప్పుడు కనుక మీరు బిల్ అమౌంట్ ఇవ్వకపోతే మీ హాస్పిటల్ పేరునీ, మీ పేరునీ మెన్షన్ చేసి, జరిగినదంతా వివరంగా రాసి ఫేస్బుక్  లో పోస్ట్ చేసి, దీన్ని  పెద్ద ఇష్యూ చేస్తాను. తర్వాత మీ ఇష్టం”

బ్లాక్ మెయిల్ లాంటి, నా రిక్వెస్ట్ విన్న నివాస్, లోపలికి వెళ్లి పది నిమిషాల తర్వాత నన్ను కూడా లోపలి పిలిచారు.  అక్కడ హాస్పటల్ కి చెందిన ఒక మేనేజర్ ఉన్నారు. అతను నేను చేస్తున్నది తప్పు అన్నట్టు మాట్లాడాడు. నేను పెద్దగా ఆర్గ్యు చేయకుండా, నా ఫోన్ లో ఉన్న రూల్స్ చూపించి, “డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేదంటే జరిగిందంతా as it is గా, సోషల్ మీడియా లో రాస్తాను. అన్నీ నిజాలే రాస్తాను. ఒక్క అబద్దం కూడా రాయను. ఇంతకు మించిన డిస్కషన్ మీకు నాకూ కూడా టైం వేస్ట్” అని చెప్పి బయటకు వచ్చేసాను.

అయిదు నిమిషాల తరువాత మళ్లీ లోపలికి పిలిచి, నేను రాసిన కంప్లైంట్ లెటర్ మీద డబ్బులు ముట్టినట్టు నాచే సంతకం చేయించుకొని, 2000 చేతిలో పెట్టారు.

కొందరి దృష్టిలో మూడు వేల ఐదువందల రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు. అంత చిన్న అమౌంట్ గురించి ఇంత మేటర్ రాయడం అవసరమా? అని కూడా అనిపించవచ్చు.  కానీ, కొందరికది ఒక నెల సంపాదన. ఎంత మొత్తం అన్నది ముఖ్యం కాదు. నువ్వు ప్రశ్నించడం మానేస్తే, మూడు లక్షల విషయంలో కూడా ఇలాగే జరగొచ్చు. ప్రశ్నించడం మానేస్తే, నీ హక్కులకు భంగం కలగొచ్చు.  ప్రశ్నించడం మానేస్తే, నీ ప్రాణానికి కూడా ప్రమాదం రావొచ్చు.

సిస్టం సరిగ్గా పనిచేయాలంటే, పటిష్టమైన రూల్స్ ఉంటే సరిపోదు. నియమాలు అతిక్రమించ బడినప్పుడు, ప్రశ్నించే తత్వం సంస్కృతిలో భాగం అవ్వాలి. అది సంస్కృతిలో భాగం అవ్వాలంటే, క్రమశిక్షణ పేరుతో, “పెద్దల్ని గౌరవించడం” పేరుతో,  ప్రశ్నించే పిల్లల నోరును నొక్కడం మానేయాలి. అప్పుడే సంఘం ఆరోగ్యంగా ఉంటుంది.

రాంబాబు తోట

4 comments

  • Excellent. ప్రశ్నించే పిల్లల నోరును నొక్కేయడం మానేయ్యాలి. ఇలాగే పోరాడాలి. ఇలాంటివి నలుగురికీ చెప్తే మరింతమందికి స్ఫూర్తినిస్తుంది.
    Well done man.

  • ప్రశ్నించటం నేర్చాలి. నేర్పాలి. సమస్యను ఎదుర్కున్న తీరు సమయస్ఫూర్తి బాగుంది. ఇక్కడ డబ్బు ఎంత అన్నదానికంటే వారి తప్పును నీవు ఉపేక్షించకపోవటం ముఖ్యం.

  • అచ్చం ఇలాంటి సంఘటనే నాకూ ఎదురైంది. కానీ నేను విఫలం అయ్యాను.
    చాలా మంచి విజయం రాశారు.

  • ఇక్కడా హాస్పటల్ పేరు కూడా మెన్షన్ చేస్తే వారి రంగు బయటపడేది కదా

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.