ఎర్జోవ్ కట్ట

సందకాడ బూతిని బాయి బండలకాడికని పోతి. ఆడ ఎవరైనా ఉంటే రోంతసేపట్టా కూచ్చోని యవారాలు చేసొచ్చామని. యాలపొద్దు కానందాన అప్పటికింగా ఆడికి ఎవరూ రాల్య. సరే ఆడ ఒక్కనీ కూచ్చోని కొంగ జపం సెయ్యడం దేనిక

ని మల్లా ఇంటికి మల్లుకోని వచ్చాంటి. మా జయరాం పెదనాయన వాళ్లింటి కాడికి వచ్చాలకు మా పెజ్జేజి( పెద్ద జేజి ) అప్పుడే బూ తిని బజార్లో మంచం పై బొంత పర్సుకుంటా కనపచ్చ. సరే ఇంటికి పోయి చేసేదేముండాది,  రోంచేపట్లా మా జేజి కాడన్నా కూచ్చోని పదాం తట్టుకో అని జేజి మంచం తట్టు నడిచ్చి.

మా ఊర్లో ఎవరికన్నా పాత కతలు ఇనాలని గుబులు పుడ్తే సందకాడ బూ దిని మా జేజి కాడికి వచ్చి ‘అదెట్ల పెద్దమ్మా అనో ల్యాకుంటే అప్పటి పద్దతేందనో …’ రోంతట్ల కదిలిచ్చే సాల్,  దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ మట్టసంగ సెప్తాండ్య- పూసగుచ్చినట్లు. అంత పాత మనిసైనా యాన్నేగానీ ఒక్క దుబార మాట కూడా ల్యాకుండా, ‘ఎచ్చలకు పోయి యాగటైనట్లు’ గాకుండా ఉన్నెదున్నెట్లు నికరంగ సెప్తాండ్య. అంత నికార్సైన మనిసైందాన్నే అప్పట్లో మా బజార్లో ఆడోల్ల కాడ సొత్తులున్యా, సొమ్మున్యా మా పెజ్జేజి దగ్గర సైగ్గాకుండా దాపెట్టుకుంటాంటిరంట. మల్లా వాళ్ల సొమ్ము వాళ్లకు ఎప్పుడు గావాల్సింటే అప్పుడు, నాన్చుడు యవ్వారం ల్యాకుండా బద్రంగా తిరిగిచ్చేదంట. అట్లైందాన మా పెజ్జేజి మాట మీద మా బజారోళ్లకు బలే గురుండ్య.

మా పెజ్జేజి పాత మనిసే గాదు, పిల్లోల్లను ‘బుస్యా…, బుసీ…’ అంటా పెద్దోల్లనైతే ‘అబ్బీ…అమ్మన్నీ…’ అంటా కమ్మని పాత పదాలు కలిబోసి పిలుచ్చాండ్య. అబ్బీ, అమ్మన్నీ అంటే సరేగానీ బుస్య, బుసీ అని ఎందుకు పిల్చేదో, అసలా పిలుపుకు అర్థమేందో కూడా నాకు తెలియక పాయ.

నేను జేజి మంచం తట్టు నడుచ్చా ‘బూ దిన్యావా జేజి?’ అంటా పలకరిచ్చి. ‘తిన్యా బుస్యా, ఎవ్రు సిన్న బుస్యా’ అనడిగ్య నా గొంతును గుర్తుపట్టి. నేను మా ఇంట్లో అందరికంటే సిన్నోన్నైందాన నన్ను సిన్న బుస్యా అంటాండ్య. ‘నేనేలే జేజి’ అంటి. ‘ఈ మద్దెన సూపు ఒగరవ్వ తక్కువాయ బుస్యా. కండ్లు రోంత మసక మసగ్గా కనపచ్చనాయి. వయసు పైబడే కొద్దీ అన్నీ అగసాట్లే మరి’ అని మల్లా తనే ‘యాడికి పొయ్నావ్ బుస్యా ఇట్లొచ్చనావ్ … బూ దిన్యావా’ అని అడిగ్య.

‘తింటి జేజి…తినే బాయికాడట్ల రోంచేపు కూచ్చుందామని పొయ్యింటి‘ అంటి.

బొంత మట్టగ పర్సి మంచం కోడుకు ఊతపొర్సుకునే కట్టె ఆనిచ్చి ‘నువ్విట్ల కూచ్చో బుస్యా నేనట్ల కూచ్చుంటా, మంచం కుక్కి అయ్యింది, ఊడదీసి బిగియ్యాల’ అని నాకు తలాపున తావిచ్చి తను అగదాల్ల పక్కకు జరిగి కూచ్చుండ్య.

’ జేజా కండ్లు సూపిచ్చుకో. తీరా ముసలి మొబ్బున మెత్తబన్యాక సూపు ల్యాకుంటే శానా ఇబ్బంది పడ్తావ్. ఒంటేలుకంటే, దొడ్లోకంటే యా సిన్న పనికైనా మనిసి తోడుండాల మల్ల’ అంటి. సూపుడు వేలు పట్టుకుని పదిమందికి  దావ సూపిన జేజికి సూపు ల్యాకుండా పోడం ఊహకలివిగాల్య.

ఆ మాటకు మనసులో ఏమనుకుండెనో ఏమో, రోంతసేపు జేజి గమ్ముగై ఉలకల్య పలకల్య. ఏదో లోతు ఆలోచనలో పన్నెట్లుంది. మల్లా నా సెయ్యి పట్టుకుని లోగొంతుతో ‘నువ్వన్య మాట నిజమే బుస్యా… సూపిచ్చుకుంటే బాగానే ఉంటాది. సూపు ల్యాకుంటే సీకట్లో ఎట్ల దిక్కు తెలుచ్చాది. కండ్లు ల్యాకుండా ఎట్ల తిల్లాడాల? కానీ ఇంట్లో వల్ల లేనట్లుంది బుస్యా. మూడేండ్లాయ వాడు మాసూలు కండ్ల సూడక. బావులెండిపాయ. బోర్లు దప్పిగ్గుని నోర్లు తెర్సుండాయి. తోటకట్టు మాలపడ్య. యాటా కరువే. కరువుకు సంసారాలు గుల్లై పోతాయి బుస్యా. వాడు పిల్లోల్ల సదువుకని పెడ్తాడా? యాటా పెట్టుబడికని పెడ్తాడా? ఒంటిగాడు వాడైనా ఎంతని తెచ్చి పెడ్తాడు? ఆడికి పల్లెత్తు మాటనకుండా ఈ ముసిల్దానికి యాలకింత పిడస పెట్టడమే గొప్ప -ఈ గడ్డు కాలాన. ఇంత కనాగస్టంగా ఈ గడపన సంసారం ఎప్పుడూ గడపల్య. తల్చుకుంటే కడుపు తరుక్కుపోతాది. ఏందిరా అంత బతుకు బతికి ఆఖరికి ఇంత అద్మాన్నపు కాలమొచ్చ అనిపిచ్చాది. కానీ ఏంజేసేది బుస్యా, నేనా కాటికి కాల్లు జాసిన దాన్నైతి. నా కాలం సెల్లిపాయ. యాలకు కడుపుకింత తిని యాన్నో ఒక మూల రామాకిష్ణా అంటా కూకోడమో, ల్యాకుంటే అదో ఆడ వసార్లో మంచం వారగిచ్చి కూకోక నేన్జేసేదేముంది బుస్యా ఇప్పుడు. సూపుండి ఈ అగసాట్లు సూసేదానికన్నా అదీ ల్యాకుండా పోతే అంతా బాగుందిలే, ఏం జరగలేదులే  అనుకుంటా లచ్చనంగా దాటుకోవచ్చు అనిపిచ్చాది బుస్యా ఒక్కోపారి. ఐతే అది మన సేతల్లో లేదుగదా. అంతా ఆ పైవాని దయ’ అని ‘ దగ్గర సూపు బాగానే ఉందిలే బుస్యా, దూరపు సూపే రోంత తగ్య’. అన్య మల్ల నా సేయి మెల్లెగ నొక్కుతా నేన్యాడ బాధ పడ్తానో అని.

ఆ మాటలు ఇంటా మా జేజి తట్టు అట్లనే సూచ్చా కూచ్చుంటి. అంత బాధలో గూడా యాన్నే గాని తడబడని మాట తీరు, తెల్లటి ముతక సీరె కట్టుకున్య మా జేజి సీకట్లో  ఎలిగే ‘ఎన్నెల’ దీపం మాదిరి అగుపుచ్చ నా కండ్లకు. సందమామ మీద సెట్టు కింద కవ్వంతో మజ్జిగ సిలికి ఎన్నపూస తీసే ముసలవ్వంటే ఇట్లనే, మా జేజసుంటిదే ఉండచ్చనిపిచ్చ.

డెబ్బై ఏండ్ల వయసులో కూడా ఏదో ఒకటి సెయ్యాలనే తాపత్రయం, ఏమీ సెయ్యల్యాక పోతేమానె సత్తువలేని నిస్సత్తువలో కూడా ఒక్కగానొక్క కొడుక్కు భారం గాకుండా,  ఉన్నెదాంతోనే సర్దుకొని అండగా ఉండాలనే పెద్దరికం, తన సూపుకు ఖర్చు పెడితే మనవండ్లు, మనవరాల్ల సదువులు యాడ కుంటు పడ్తాయోనన్న ముందు సూపున్య జేజిని సూసి ‘ఎందుకురా దేవుడా మా పెజ్జేజిపై ఇంత సిన్న సూపు సూచ్చివి’ అనుకుంటి మనసులో. ఎన్ని కరువులనో ఈదిన జీవితానుభవం, ఏ కల్ముషం ల్యాకుండా పారే నిమ్మలమైన జీవధార కనపచ్చ మా జేజిలో.

నేనేదో పొద్దు పోడానికి రెండు మాటలు మాట్లాడి పోదామనుకోని వచ్చి జేజిని ఊరిక బాధ పెడ్తినే అనుకుంటి మనసులో.  ఆ మాటకొచ్చే మా బజార్న అందరిదీ అదే పరిస్థితే. వరుస కరువులతో ఊరు చితికి పోయి ఉండాది. పొలిమేరలు ఎడారిని తలపిచ్చాంటే , మనుసుల మొగాలు నెత్తుర ఆరిపోయి నెర్రలిగ్గిన నల్లరేగడి న్యాలల మాదిరుండాయి-బేలగా. వంకలు నీళ్ల సుక్క ల్యాక డొక్కలెండిన బరుగుడ్ల మాదిరి బర్రెంకలు తేలుండాయి. యా అరుగును కదిలిచ్చినా ఏదో ఒక కరువు కత సెబుతా ఉంది. నానాటికీ పల్లె పీనుగ లెక్క తయారైతాంది అనిపిచ్చ.

అందరితో పాటే మాకు ఇబ్బందులు తప్పల్య. మా దాపటెద్దు మెత్తబడి రెన్నెల్లాయ. దాన్ని మార్సి కొత్తెద్దును పటకచ్చామనుకుంటే ఉసి తిరగల్య. యాన్నేగానీ పైసా అప్పు పుట్టడంల్యా. అదో ఇదో అంటే మల్లా ఇత్తనం అదునొచ్చే ఎద్దులు పిరెమైతాయని మా నాయన మల్లగుల్లాలు పడ్తనాడు.

సరే…, జేజికి రెండు ఓదార్పు మాటలు సెప్పి నిమ్మలం జేచ్చామని నేనుండి ‘అందరిదీ అదే పరిస్థతే జేజి. ఎవ్రు మిగుల్లో తేల్తనారు! అంతా అప్పుల్లో మునిగుండారు. ఏమంటే  ఎవరూ గడ్డన పడకుండా బండిగ్గుత్తనారు’ అంటి.

అంతలోకే బజార్లో ఎవరో ఆడ మనిసి బాయితట్టు పోతా కనిపిచ్చ. దాన్ని జూసి మా జేజి స్వరం మార్చి రోంత గట్టిగా ‘అమ్మ ఏం కూర జేసింది బుస్యా’ అని ఆమె అట్ల దాటిపోతానే మల్లా లోగొంతుతో ‘గోడలగ్గూడా సెవులుంటాయి బుస్యా. సంసారం గుట్టు వ్యాధి రట్టు అన్యారు పెద్దోల్లు. ఇంట్లో ఎట్లున్యా నలుగుర్లో నవ్వులపాలు గాగుర్దు. ల్యాకుంటే సులకనైతాం’ అంటా హితబోధ జేస్య.

ఒక్కొక్కరే బువ్వ తిని అట్ల పంచన అరుగుపైననో, ల్యాకుంటే బజార్లో మంచాలు వంచుకునో కూచ్చోబడ్తిరి. మేము గూడా  మా మాటల బండిని బాట మల్లిచ్చి మరో దావ పడ్తిమి.

‘ఇంగేం బుస్యా సదువెట్ల సాగుతాంది?, బువ్వ మీరే జేసుకుంటారా? కూరలెట్ల జేచ్చారు? ‘ ఇట్లా సదువుల బండి గురించి వివరం అడిగ్య. ‘బాగ సదువుకోండి బుస్యా. ఈ భూముల్లో ఏం మిగలడం ల్యా, రెక్కల కస్టం తప్ప’ అన్య జేజి.

అంతలోకే మా జయరాం పెదనాయన బూ దిని , దొడ్లో ఎద్దలకు పొట్టు పోసి బజార్లో మంచాలు ఏసి కూచ్చుండ్య. ‘ఏం బ్బీ బూ తిన్యావా’ అనడిగి, ‘ఏం పద్దటాల్నుంచి కాన్రాలేదే యాడికి పొయ్నాన్యావ్? ‘ అనడిగ్య.  దానికి నేనుండి ‘పద్దన బాయికి పొయ్యొచ్చిమి పెద్నాయ్న…మల్ల యాడికీ పోల్య. ఐనా యాడికి పోతావ్ ఎండలు మండిపోతాంటే’ అంటి. ‘యా బాయికి పోయింటిరి బ్బీ? ఐనా ఇంత కరువులో యాడ బావుల్లో నీళ్లుండాయి’ అనడిగ్య.

‘ఎలంకూరి పల్లెలో నడిం బాయికి పోయింటిమి. నీళ్లు ఆడికాడికే. మాయ్టాల ఆడిచ్చే పద్దనికి ఊరుతాయి మల్లా. ఆ నీళ్లల్లోనే మేం పొల్లాడొచ్చిమి’ అంటి.

‘ఆంత దూరం పోతారా బుస్యా పొల్లాడను! కాళ్లు నొప్పియ్యవూ…’అని, ‘యా దావన పోతారు’ అనడిగ్య జేజే. ‘వంక దావన దావీదు తాటి వనుంలో పడి ఎర్జోవ్ కట్ట దాటుకుని పోతాం జేజి ‘ అంటి. ‘నల్లగుండ్ల దావ బూడిపోయిందా బుస్యా. పిల్లొంక గట్టు మీద వంకారమ్మడి నర్సుకుంటా పోతాంటిమే. మాంచి బండి దావ’ అనడిగ్య జేజి.

దానికి మా పెదనాయ్న ఉండి ‘ఇంగా యాడ నల్లగుండ్ల దావమ్మ! అదెప్పుడో పడుబాటైంటే. పాయ పాతదావలన్నీ బూడిపాయ. ఎర్జోవ్ కట్ట యాపొద్దు తెగి పాయనో ఆపొద్దే ఆ దావలన్నీ పాయ. ఆ కట్టున్నెప్పుడు సెర్లో ఎప్పటికీ నీళ్లుంటాండెనా…దాంతో ఇట్ల పొయ్యేదానికి దావ ల్యాకపాయ. ఎప్పుడైతే ఆ సెర్రుకట్ట తెగిపాయనో అప్పుడు సెర్లో నీళ్లు నిల్సకుండా వచ్చ. ఆ కట్టను మల్ల పట్టిచ్చుకునే నాథుడే ల్యాకపాయ. దావీదు వనం లో నుంచి సక్కగ కట్ట తెగిన కాడికి కాలిబాట పడ్య. ఇది రోంత దగ్గరి దావ. ఆ పన్య కాలిదావన అప్పుడో బండి ఇప్పుడో బండీ పొయ్ అది బండ్ల బాటాయ. మల్ల ట్రాక్టర్లొచ్చినాక ఆ దావనే గుట్టకు పొయ్ బెచ్చరాళ్లు తోలబట్య. అట్లా ఇప్పుడదే అసలు దావ అయిపోయి పాతదావ రూపే ల్యాకుండా సీకిసెట్లు(తుమ్మసెట్లు) బల్సిపాయ’ అన్య.

నాకు బలే సిత్రమాయ. నాకప్పటి దాకా పిల్లొంక గడ్డన వంకార పోయే దావ ఒక్క నల్లగుండ్ల సేండ్లల్లోకేనేమో అనుకుంటాంటి. ఆ దావ ఎలంకూరిపల్లెకు పోతన్యాదని, దానికి ఎర్జోవ్ కట్టకు లంకె ఉండేదని నాకంత వరకూ తెలియకపాయ.

మనుసులు రాయని చరిత్రలో కనుమరుగైపోయే ఆ ఎర్జోవ్ కట్ట, ఆ దావ గురించి ఇంగా శానా తెల్సుకోవాలనిపిచ్చ.

మా జేజి తిక్కు జూచ్చి. ‘ఎర్జోవ్ కట్ట తెగిపోవడం , నల్లగుండ్ల దావ బూడిపోడం ఇదంతా అప్పడే జరిగిపాయనా అబ్బీ?’ అన్య ప్రశ్న మాదిరి కూకోనుంది మా జేజి.

మెల్లెగ తేరుకుని మా పెదనాయన యాడ కత నిలిపెనో ఆడ మా జేజి ఎత్తుకుండ్య.

‘పూర్వం ఎలంకూరి పల్లెకు పొవ్వాలంటే పిల్లొంక గట్టు మీద నల్లగుండ్ల సేండ్ల దావన బండ్ల బాటుండ్య. అదే అసలు దావ. ఇప్పుడు దావీదు సెట్ల కాన్నుంచి పోయే దావన అప్పుడు ఎర్రమిట్ట సేండ్లల్లోకి పోతాంటిరి. ఈ దావన ఎలంకూరు పల్లెకు పోవాలంటే ఎర్జోవ్ కట్ట నిలేచ్చాండ్య. కట్టకాతట్టు ఎప్పుడ్జూసినా నీళ్లుంటాండ్య. అట్లైందాన ఎర్రమిట్ట సేండ్లన్నీ దాటుకోని సెరువెనకల్నుంచి సుట్టు దిరుక్కోని బాడ్దావ( బుడద దావ )సేండ్లల్లో పడి పోవాల్సి ఉండ్య. ఆ సుట్టు దిరుక్కోని పోడం, ఆ రామాయణమంతా  ఎందుకని ఇట్లనే నల్లగుండ్ల దావన లచ్చనంగా ఎలబారి పోతాంటిమి. అదీగాక ఇది దగ్గర దాపు’ అని రోంతసేపు ఉసి ఇర్స్య.

మల్లా జేజే అందుకుని నా సెయ్యి పట్టుకోని ‘ బుస్యా ఆ దావన పోతాంటే నల్లగుండ్ల సేన్ల కాడికి పొయ్యాలకు ఎర్జోవు కట్ట కాన్నుంచి సెరువు పైకి సూచ్చే సూపు పారినంత దూరం ఎర్రటి నీళ్లతో సెరువు కలకలలాడ్తాండ్య. అయ్యేం నీళ్లో గాని…కట్ట కింద రాగిమల్లు బలె ఏపుగా ఎక్కొచ్చి ఇంతింత కంకుల్దీచ్చాండ్య. ముదిరిన కంకుల్ని తుంచకచ్చి నిప్పుల మీద కాల్చుకోని, శాటలో పెట్టి గింజల్ని రాల్చుకోని, దాంట్లను దోసిట్లో బేసుకోని పొట్టూపి నోట్లో వేసుకుంటే బుస్యా…బో రుసిగా ఉంటాండ్య. సెరువు కింద పండిన రాగులతో సేసే సంగటి కూడా కమ్మగుంటాండ్య. ఆ సెరువు నీళ్లు కాలువ పట్టుకుని ఊరి పొలిమేరనుండే వరిమల్ల వరకూ వచ్చాండ్య. ఇప్పుడు ఒడిపి గట్టునుండే కలాల్లో వరి బ్రమ్మాన్నంగా ఐతాండ్య. సుట్టుపక్కల ఊర్లల్లో తాగడానికి నీళ్లు ల్యాకున్యా ఆ సెరువు పుణ్యమా అని మన వంక సెలాల్లో నీళ్లెప్పటికీ ఉంటాండ్య ‘ అని జేజి సెప్తాండంగానే మా పెదనాయన ఉండి ‘అప్పుడేంది వనుంకాడ బాయిలో ఎన్ని నీళ్లుంటాండ్య! పైన్నే ఉంటాండ్య. ఇంగ వానలకాలమందుకైతే నీళ్లు పైన దడికి తగుల్తాండ్య. సెరువు బావులకు ఎంత ఆదరువుగా ఉండ్య. పాయ్ ఆ సెరువు పాయ్…ఆ నీళ్లు పాయ్…ఇప్పుడు గంగ పాతాళాన్ని తాక్య’ అని నిట్టూర్పు ఇడిస్య.

మా జేజి మల్లా ఎత్తుకుండ్య ‘పండగాపొద్దు పల్లెమెయ్యడానికి ఊరంతా సెర్రుకట్ట మీది  మర్రిమాను కాడికి పొయ్ మర్రాకులు తుంచకచ్చుకుంటాండ్య. ఎంత ఆకుల్లే అయ్యి. ఆ కట్టమ్మడి ఎంత సింత మాన్లుండ్య. అల్లనేరేడు సెట్లైతేనేం అక్క సెల్లెల్ల మాదిరి ఎంత బాగుండ్య బుస్యా. కట్ట తెక్క ముందే అనుకుంటా బుస్యా…ఏరు పురుగ్గొట్టి రెండు సెట్లూ ఒకేతూరి ఎండిపాయ’ అన్య మా జేజి.

‘అప్పుడు నాకు బాగ మతికి. వారం రోజులు ఒకటే వాన. దడిపట్టి కుర్సింది. ఊర్లో యాడాడి పాత గోడలన్నీ కూలినాయి. మెత్తు మిద్దెలన్నీ ఒరిపెత్తినాయి. సెర్రుకట్ట ఓ…అని అరుచ్చా పారింది. ఎన్ని తరాల సెరువో అది. ఎన్నేండ్ల కట్టనో మడి. వానకు నాని నాని ఇంగ తట్టుకోల్యాక తెగిపోయింది. ఆ కట్ట తెగినాపొద్దు ఊరి బాయికాడికి నీళ్లొచ్చినాయి. పిల్లా జల్లా అంతా పాటిమీదికి పరిగెత్తినారు. వంక ఇసురున్య దాన నీళ్లు ఎగానకుండా పారినాయు. ల్యాకుంటే ఊరు మునుగు. అంత సెరువు తెగిన్యా గానీ ఒక్క మనిసికి హాని తలపెట్టల్య. ఊరంటే ఆ సెరువుకు ఎంత భ్రమో సూడు మరి! ఎర్జోవ్ కట్ట పోడంతోనే ఎర్రమిట్ట కల తప్ప్య’ అన్య మా జేజి.

‘ఇంతకూ ఎర్జోవ్ కట్ట లో ఎర్జోవ్ అంటే అంటే ఏంది జేజా’ అంటి అనుమానంగా. నాకంత వరకూ అర్థంగాని ఆ పేరులో దాగుండే మర్మాన్ని కనుక్కుందామని.

జేజి రోంత నగి ‘ఎర్జోవ్ అంటే ‘ఎర్ర సెరువు’ బుస్యా. అది ఎర్ర మిట్టన ఉండేదాన దాంట్లో నీళ్లు ఎర్రగుండేటి. అందుకే దానికి ఎర్ర సెరువని , ఆ కట్టను ఎర్ర సెరువు కట్టని అంటాండ్య. అది నోర్లల్లో నలిగి నలిగి ఎర్ర సెరువు కట్ట కాస్త ఎర్జోవ్ కట్టాయ’ అన్య జేజి.

ఆ పేరు ఊరికే రాలేదని, దానికో అర్థం ఉందని ఇన్నాల్లుగా తెలియని ఆ రహస్యం తెలుసుకున్య నాకు బలే సంబరమాయ.

మల్ల రోంత సేపటికంతా నేను ఆన్నుంచి లేసి ఇంటికి పోతి. ఆ పొద్దు మిద్దెక్కి పండుకోని ఆకాశంలోకి సూచ్చాంటే ఆ ఆకాశం మా ఊరి ఎర్ర సెరువు మాదిరి, ఆ సుక్కలు ఆ సెరువుపై తేలాడే నీళ్ల తళుకుల మాదిరి కనపచ్చ. ఎప్పుడెప్పుడు తెల్లార్తాద్యా? ఎప్పుడెప్పుడు ఎర్జోవ్ కట్టను సూజ్జామా అనుకుంటా నిద్రలోకి జారుకుంటి.

మర్సటి రోజు తెల్లార్జామున్నే నేను మా నాయన మట్టి బండికి పోతిమి. ఆ సెరువు తెగినప్పుడు మా నాయన పిల్లోడని సెప్య. ఎర్జోవ్ కట్ట తెగినాక కూడా వంకలో ‘దొమ్మరాం’ గడ్డ కాడ మడుగులోని నీళ్లను పారిచ్చి వరి, రాగి కొన్నేండ్లు పండిచ్చిరని సెప్య. కాకపోతే సెరువు కింద సాగినట్లు ఆ సాగు అంతదూరం సాగలేదని సెప్య. అది దిగుమాల్ల సెరువని పిల్లప్పుడు వాళ్లబ్బ సెప్పంగా ఇన్నెట్లు రోంత రోంత మతికని మా నాయన సెప్య.

మట్టి బండి కాడిర్సి ఇంట్లో రొంటాలకని సెంబు పట్టుకుని వంక దావ పట్టి కాల్జంపున నడిచ్చి. నా నిండా మా ఎర్ర సెరువు హోరెత్తి పారతా ఉంది. నా నెత్తురు ఆ ఎర్ర సెరువులోని ఎర్రనీళ్ల అయినట్లు, ఆ ఈసే గాలికి ఆ నీళ్లు అలలు అలలుగా వచ్చి నా గుండె దడిని తాకుతున్నెట్లుంది. ఇప్పుడక్కడ నీళ్లు లేవు గానీ ఎర్జోవ్ కట్ట రూపంలో మట్టి మనుసుల కట్టిన చరిత్ర ఉంది. నా కండ్లకది ఏదో ఒక అపురూపమైన కట్టకంలా కనిపిచ్చా ఉంది. ఆ బూడిన పాత దావలు మా ఊరి కండ్ల కింద కరువుకు కారిన కన్నీటి సారల మాదిరి, ఈ కొత్త దావలు ఎర్జోవ్ కట్టపై కత్తిపోట్లలా కాన్రాబట్టినాయి. ఆ సెరువులోని ఎర్ర నీళ్లన్ని ఆ కత్తిపోటుకు పారిన నెత్తురులా కనిపిచ్చినాయి. అట్లా ఆ నెత్తురు పారించిన దావలోనే నడుచ్చా ఎర్జోవో కట్టను సూచ్చి. ఆ కట్ట మునుపటి కట్టలా లేదు. అది కండ్లు తెర్సి, సేతులు సాచి ‘రాబ్బీ…నీతో నా కత పంచుకోవాల రా…’ అని మాట్లాడతాంది.

అల్లంత దూరాన ఆ కట్టుండగానే నేను పరుగెత్తా పొయ్ ఆ కట్ట మీదికెక్కి ‘అమ్మా…ఎర్జోవ్ తల్లీ…’ అంటా బిగ్గరగా అర్సి ఆ తల్లి వొడిలో వొదిగిపోతి. ఎన్నో తరాల కిందట తప్పిపోయిన తన బిడ్డ మల్లా తన వొడికి సేరిన తల్లి మాదిరి ఆ కట్ట నన్ను కావలిచ్చుకుండ్య గట్టిగా… ‘అబ్బీ నువ్వు నన్నిర్సి ఇంగ్యాడికీ పోవాకబ్బి’ అంటా ఉప్పొంగుతా ఏర్స్య.

మా ఏడుపు ఇని ఆ కట్టపై  మట్టి సేతులు మొలసబట్య. నేనొక కత సెప్తానంటే నేనొక కత సెప్తానంటా అయి పోటీ పడబట్య. అప్పుడాకట్టుండి ‘ఇప్పుడింగ ఈయబ్బి యాడికీ పోడులే, తొక్కులాడగాకండి’ అన్జెప్పి ఒప్పించ్య.

కరువుల మీద కరువులు తట్టుకోల్యాక ఊరంతా కల్సి ఒక్క తాటిపైకొచ్చి కట్టుకున్య సెరువు కట్ట గురించి ఆ మట్టి సేతులు పాటొకటి పాడబట్య.

నల్లగుండ్లకూ ఎర్రమిట్టకూ మద్దెన నారవలో
ఊరిని కరువు నమిలేసే కష్ట కాలాన
మట్టి సేతులు కల్సి కట్టుకున్య సెర్రు కట్ట
ఎర్రెర్రని నీళ్లతో కరువును తరిమికొట్టే కట్ట
ఎర్రమిట్టను, వంకాగటను కలిపే మట్టికట్ట
ఎర్ర సెరువు కట్ట అదే ఎర్జోవ్ కట్ట
ఆ కట్ట కింద విత్తు మొలిసి న్యాల పచ్చని పైరయ్యేది
ఆ కట్ట చెంతన సింత సెట్లు సిగురేసేయి
ఆ కట్ట మూలన మర్రిమాను ఊడ ఉగాదికి ఊయలయ్యేది
ఆ కట్ట గట్టున అల్లనేరేడు మాన్లు అక్క సెల్లెల్ల మాదిరి ఆడుకుండేయి
పిట్టల గూళ్లు, పిల్లల అల్లరి ఆటలు,
ఊరికి పడమటి దిక్కున ఎగిరే ఊటల పిట్ట
ఎర్ర సెరువు కట్ట అదే ఎర్జోవ్ కట్ట.

ఒక్క సారిగా అన్ని గొంతులూ గమ్ముగైపాయ. మల్లా మాటలు మొదలైనాయి. అయి తుఫానుకు భయపల్లేదట. కట్ట తెగినందుకు దిగులు పల్లేదట. ఆఖరికి కరువుకు కూడా అయి బెదరలేదట. కానీ దాంట్ల దిగులంతా ఇప్పుడు దిక్కుకొకరై ఎక్కడెక్కడికో ఎగిరి పోతున్న మనుసుల గురించేనట! ఏ దిక్కూ ల్యాకుండా పోతున్న మట్టి సేతుల గురించే దాంట్ల గుబులట. ఆ మట్టి సేతులు కూలిపోతే యా సెరువులూ ఉండవని , యా కట్టలూ కట్టలేమని అసలు సిసలైన మనిసి చరిత్రనేది మిగలదని అయి కుమిలిపాయ.

అవును అక్కడ కూడా కొన్ని వెలివేసిన మట్టి సేతులున్నాయి. కేవలం బువ్వ కోసరం బతుకంతా సెమటలో ధారపోసిన సేతులవి. అయ్యి దాంట్ల కత సెప్పినాయి. దాంట్లదీ మరో దీనగాథ.

ఇటుపక్క ఎర్రమిట్ట నుంచి అటుపక్క నల్లగుండ్ల దాకా కట్టమ్మడి అటూ ఇటూ నడిచ్చి. అక్కడి మట్టిలో ఓ ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఆ కట్ట దేహంలో దూరి ఎర్జోవ్ కట్టయ్యింది. ఆ కట్టకైన గాయాలను నిమురుతూ అట్ల ఎంతసేపు ఏర్సినానో నాకు తెలియదు. నాతో పాటు ఆ కట్ట కత తెలిసిన ఆ నల్ల గుండ్లు, ఎర్రమిట్ట, పిల్లొంక ఆఖరికి మా ఊరు అందరం ఏర్సేసి అలసిపోతిమి.

ఆఖరికి ఒకర్నొకరం ఓదార్సుకోని పట్ట పైటాలకు తిరిగి నేను ఊరి దావ పడ్తి. దావలో వచ్చా వచ్చా ‘మా పెజ్జేజికి ఎట్ట దిరిగీ కండ్లు సూపియ్యాలనే’ మొండి పట్టుదలతో

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.