బక్కి శ్రీను హత్య
 – నిజానిజాలు


బక్కి శ్రీను మామిడాడ గ్రామంలోని పాటిమీద  ఎస్సీ పేటలో నివాసం ఉంటున్న ముప్పై రెండేళ్ల వ్యవసాయ కూలీ. వ్యవసాయం పనులు లేనప్పుడు, గృహ నిర్మాణ పనీ, మట్టి మోసే పని, ఇలా ఎవరు ఏ పని ఇచ్చినా చేసేవాడని గ్రామస్తులు చెప్పారు. తన భార్య కుమారి(25), ఇద్దరు పిల్లలు సాత్విక్(5) మహీధర్(3) లతో కలిసి, రెండు గదుల పెంకుటింటిలో ఉంటున్నాడు.  అతనికి మందు కాదు కదా, కనీసం కాఫీ టీలు తాగే అలవాటు కూడా లేదనీ, అనవసర ఖర్చులు ఏమీ చేయకుండా, చాలా పొదుపుగా ఉంటూ, పిల్లల్ని ఇద్దరినీ కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాడని, అతని భార్య కుమారితో పాటు, ఇతరులు కూడా చెప్పారు. మే నెల 29 వ తేదీ ఉదయం 8 గంటలకు వేసవి సెలవులకు మామిడాడకి వచ్చిన, కుమారి అన్నయ్య పిల్లలు ముగ్గురినీ వాళ్ళ ఇంట్లో దింపి రావడానికి సామర్లకోట దగ్గిర ఉన్న, వడ్లమూరు వెళ్ళాడు. ఉదయం 10 : 30 సమయంలో భార్యకు ఫోన్ చేసి, తాను సామర్లకోట వరకూ వచ్చానని,  మేక మాంసం తీసుకున్నానని, ఇంటికి వచ్చేవరకూ కూర వండొద్దని చెప్పాడు.

పన్నెండు గంటల సమయంలో, మామిడి కాయలు కోసినందుకు గాను, బక్కి శ్రీనుని అక్కడకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగంపల్లి పంచాయతీ ఆఫీసులో బంధించారని ఫోన్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి, “పంచాయితీ ఆఫసులో ఉంచి, పెద్దల్ని పిలవడానికి తాము బయటకు వెళితే,  శ్రీను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడ”ని తోట కౌలుదారులైన మిత్తన రామకృష్ణ, కడియాల నాగేశ్వరరావు చెబుతూ ఉన్నారు.

మృతదేహం మోకాళ్ళు నేలను తాకుతూ ఉండటం, ముఖం మీద బలమైన గాయాలూ, పంచాయతీ ఆఫీసులో అక్కడక్కడా ఉన్న రక్తపు మరకలూ చూసి, ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని  బంధువులు గొడవ చేసారు. అప్పటికి సమయం మధ్యాహ్నం ఒంటి గంట అయింది. అప్పటి నుండి మొదలు పెట్టి, డబ్బులతో కేసు సెటిల్ చేయడానికి నిందితులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈలోపు మామిడాడ గ్రామం నుండి రెండు వందలమంది మాలమాదిగలు సింగంపల్లి చేరుకొని, పంచాయితీ ఆఫీసు బయట బైఠాయించి, మర్డర్ కేసు బుక్ చేసి, తోట కౌలుదారులతో పాటు, పంచాయతీ స్టాఫ్ ని కూడా, అరెస్ట్ చేయాలని నినాదాలు చేసారు.

హత్య జరిగిన తరువాత పన్నెండు గంటల పాటు, నిందితులకు సెటిల్మెంట్ చేసుకొనే అవకాశం ఇచ్చి, అవేమీ వర్కవుట్ కాని పరిస్థితుల్లో,  అర్ధరాత్రి ఒంటిగంట తరువాత FIR రాయించి, ఇద్దరు కౌలుదారులతో పాటు, ఎనిమిదిమంది పంచాయతీ ఆఫీసు ఉద్యోగులపై కేసు బుక్ చేసారు.

మామిడి తోట కౌలుదారులు ఇద్దరూ BC శెట్టిబలిజ కులస్తులు, అగ్రకులస్తులు ఎవరూ లేరనే తప్పుడు వార్త కొన్ని న్యూస్ పేపర్లలోనూ, ఫేస్బుక్ పోస్టుల్లోనూ సర్క్యులేట్ అయింది.  అలా జరగడానికి కారణం FIR లో కూడా పేర్లు తప్పుగా ఎంటర్ అవడం. మిత్తన రామకృష్ణ( కాపు కులస్తుడు), కడియాల నాగేశ్వరరావు(శెట్టిబలిజ) మామిడితోట కౌలుదారులు కాగా, మిత్తన రామకృష్ణ ప్లేస్ లో కడియాల రామకృష్ణ(శెట్టిబలిజ)ను కౌలుదారుడుగా రాసారు. తండ్రి పేరు మాత్రం బ్రాహ్మరాజు అనే ఉంచేసారు. నిజానికి “బ్రాహ్మరాజు”  మిత్తన రామకృష్ణ తండ్రి.

అలాగే, తోటలో గొడవ అయినప్పుడు, తగలారాని చోట దెబ్బ తగిలి బక్కి శ్రీను చనిపోతే, డెడ్ బాడీని పంచాయితీకి తీసుకు వచ్చి ఉండొచ్చన్న, అనుమానం కొందరు వ్యక్తం చేసారు. బక్కి శ్రీనుని తోట నుండి ప్రాణంతోనే తీసుకువచ్చి, పంచాయితీ ఆఫీసులో కూర్చోబెట్టినప్పటి  ఫోటో పంచాయతీ గుమాస్తా సెల్ ఫోన్ లో ఉంది. ఆ ఫోటోని పోలీసులు బక్కి శ్రీను కుటుంబ సభ్యులకు, ఇతర గ్రామస్తులకు చూపించడం జరిగింది. దీని ఆధారంగా, అది పొరపాటున తగిలిన దెబ్బ వల్ల చనిపోవడం కాదనీ, తోట నుండి తీసుకు వచ్చి, పంచాయితీ ఆఫీసులో కావాలనే చంపడం జరిగిందని స్పష్టం.

“పరిచయంలేని వ్యక్తి దళితుడు అని ఎలా తెలుస్తుంది?” అనేది ఇంకొక వాదన. నిందితుల్లో ఒకరైన పచ్చిపాల వీరబాబు సింగంపల్లి గ్రామంలోనే ఉంటున్న 40 ఏళ్ల చెల్లే లక్ష్మి అనబడు మాల కులస్తురాలైన బక్కి శ్రీను దూరపు బంధువు వద్దకు వెళ్లి, “మామిడాడకు చెందిన మీ బంధువుల అబ్బాయి మామిడికాయలు దొంగతనం చేస్తూ ఉంటే, పంచాయతీ ఆఫీస్ లో బంధించాం” అని  చెప్పడం జరిగింది. బక్కి శ్రీను చుట్టాలు ఎవరో తెలుసుకున్నారు అంటే, అతని కులం నిందితులకు ముందుగానే తెలుసు. ఆమె వచ్చి చూసేసరికి బక్కి శ్రీను శవమై వేలాడుతున్నాడు. పోలీసు రికార్డ్ ప్రాకారం కూడా బక్కి శ్రీను డెడ్ బాడీని చూసిన మొదటి వ్యక్తి చెల్లే లక్ష్మీ.

కులహత్య అంటే, ఎదుటి వ్యక్తి కేవలం దళితుడు ఆయిన కారణంగా చంపేస్తారు అని కాదు. హత్య జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ, కాయలు కోసిన వ్యక్తి దళితుడు అయితే, అతను తిరగబడితే, అగ్రకుల అహంకారం ఎక్కువ గాయపడుతుంది. అవే మామిడి కాయలు ఏ రెడ్డి/కాపు/కమ్మ కులస్తులు కోస్తే మహా అయితే తిడతారు. అగ్రకులస్తులడు అయినా బీదవాడు అయితే, ఒకటి రెండు దెబ్బలు కొడతారు గానీ, చంపేసేంత ధైర్యం చేయరు. ఎందుకంటే, అప్పర్ కేస్ట్ వ్యక్తి బీదవాడు అయినా, వాళ్ళ బందువుల్లో ఉన్న లోకల్ లీడర్ల సహాయంతోనో, ఇతర పరిచయాలతోనో ఎదురుదాడి చేస్తారన్న భయం ఉంటుంది.  ఇది కులహత్య అనడానికి రెండో కారణం పట్టపగలు పంచాయితీ ఆఫీసుని హత్య చేయడానికి వాడుకోవడం. అలా చేయగల అవకాశం, వెసులుబాటు ఆ ఊరి అప్పర్ కేస్ట్ వ్యక్తులకు, వారి సహకారంతో ఇటారులకూ ఉంటుంది. ప్రభుత్వ కార్యాయంలో మర్డర్ చేసి కూడా మ్యానేజ్ చేయగలను అనుకోవడం వెనుకున్నది కుల అహంకారమే.

ఎన్ని మామిడి కాయలు కోసాడు? కోసాడా? ఏరుకున్నాడా?  అన్న విషయం స్పష్టంగా తెలీదు. ఆ సంఘటన జరిగిన సమయంలో ఉన్నది బక్కి శ్రీను & నిందితులు మాత్రమే. వేరే సాక్షులు లేరు. బక్కి శ్రీను చనిపోయి ఉండటం వల్ల నిందితులు చెప్పేది నిజమా? కాదా? అన్నది తెలీదు.

రెండు మామిడి కాయలైనా? ఇరవై మామిడి కాయలైనా?  కిందపడినవి ఏరుకున్నా? దొంగిలించినా? లేదా వేరే ఏ ఇతర కారణం వల్లనైనా, తోటి మనిషి ప్రాణం తీయడం క్రూరం. హత్యను జస్టిఫై చేసే ప్రతీ వాదనా అమానుషం.

“అది హత్య కాదేమో?” అన్న చిన్న డౌట్ ఎవరికైనా ఉంటే, దాన్ని, చెరిపేస్తూ, పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండు రోజుల క్రితమే వచ్చింది. ఎడమ కన్ను మొత్తం నలిగిపోయి, internal bleeding అయ్యి నల్లగా అయిపోయింది. ఎడమ కను బొమ్మ మీద ఎముకను తాకేంత పెద్ద గాయం ఉంది. అదే ప్లేస్ లో లోపలివైపు, బ్రెయిన్ లో రక్తనాళాలు పగిలి గడ్డకట్టిన రక్తం(బ్రెయిన్ హేమరేజ్) ఉంది.  ఊపిరితిత్తుల్లో చేరిన రక్తం. ముక్కు పుటాల్లో రక్తం. ప్రేగులు కూడా కమిలిపోయాయి. మెడకు ఒక పక్క మూడు గోర్లు, రెండో వైపు ఒక గోరు. పీకను బలంగా నులిమి చంపేసారని సూచిస్తున్నాయి. మెడ చుట్టూ దుప్పటి బిగుసుకోవడం వల్ల ఏర్పడ్డ గాయాలు చనిపోయిన తరువాత, శవానికి తగిలిన గాయాలు(postmortem injuries) మాత్రమే అని, చనిపోవడానికి కారణం ఒళ్ళంతా తగిలిన దెబ్బలతో పాటు, శ్వాస ఆడకుండా పీక నొక్కడం అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ధ్రువీకరించడం జరిగింది.

ఒక హత్య కులహత్య అని నిర్దారణ జరిగితే, హత్య చేసిన కులం వారినందరినీ తప్పుపట్టినట్టు కాదు. అన్ని కులాల్లోనూ ఉన్న, కుల అహంకారాన్నీ, కులవివక్షను సమర్దించేవారిని తప్పుపట్టినట్టు. అందువలన, ఇటువంటివి జరిగినప్పుడు పరిణతి చెందిన వ్యక్తులు, కులాల ఆధారంగా, మతాల ఆధారంగా విడిపోయి, సొంత కుల,మతస్తులను సపోర్ట్ చేసుకోవడం మానేయాలి.  అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ, న్యాయం వైపు నిలబడాలి. అసలు దోషులు తప్పించుకోకుండా, సంఘం మొత్తం సహకరించాలి. లేకుంటే, రేపెప్పుడో శ్రీను ప్లేసులో నువ్వో, నేనో ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆలోచించడానికి ప్రాణమే ఉండదు.

రాంబాబు తోట

3 comments

  • దుప్పటికి వేలాడుతున్న బక్కి శీను శవం, ఆ వెనుక చేతులు ముడుచుకొని, చేతులు వెనుక మడుచుకొని, చేయి నడుం మీద పెట్టుకొని, టేబుల్ మీద మోచేయి ఆనించి గడ్డం కింద చేయి పెట్టుకొని… ఈ బాడీ లాంగ్వేజ్ నన్ను విస్మయ పరుస్తోంది. నన్నెప్పటికీ ఇది వెంటాడుతూనే వుంటుంది బహుశా!

  • Tragic రియాలిటీ

    ఒక తప్పు చేస్తూ దొరికిన అగ్రకులస్తుణ్ణి, మీకులంలో పుట్టి ఈతప్పు చెయ్యటానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నే వారిదృష్టిలో ఒక శిక్ష.

    కులం తగ్గుతున్నకొద్దీ శిక్షల్లో భౌతిక హింస పెరుగుతుంది.

    British classification of Criminal Tribes had given license to such judgement and punishments.

    ఇందుకు మూలాలు మాత్రం కులవ్యవస్తలోనే ఉన్నాయి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.