యాభైసోమి గుర్రం

ప్ర‌తిరోజూ..

ఉద‌యాన్నే నాలుగేళ్ల నా కూతుర్ని తీసుకుని  రెహ్మ‌త్‌న‌గ‌ర్‌లోని డైరీఫామ్‌కి వెళ్ల‌టం అల‌వాటు. వెళ్లే దారిలో  పావురాలు, కోళ్లు, ఆవులు, పిల్లులు, కుక్క‌లు, మేక‌లు.. ఎదురవుతూనే ఉంటాయి. వాటి గురించి  క‌థ‌లు చెప్పుకోవ‌టం మాకు అల‌వాటు. అదే దారిలోనే చెట్ల‌కింద ఓ తెల్ల‌గుర్రం క‌ట్టేసి ఉంటుంది. దాని ద‌గ్గ‌ర కాసేపు ఆగి.. అది తినే తిండి, దాని కాలికి త‌గిలిన గాయాల గురించి మాట్లాడుకుంటాం. కొన్నిరోజులు అది క‌న‌ప‌డ‌దు. బ‌రాత్‌ల‌కు పోతాది.  గుర్రం చెట్టుకు క‌ట్టేసి క‌నిపించ‌క‌పోతేనే ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఆ రోజు నా వీక్లీ ఆఫ్‌.. మా పాప‌ను తీసుకుని డైరీఫామ్ వెళ్తున్నా. ఎప్పుడూ క‌ట్టేసి ఉండే తెల్ల‌గుర్రం ఆ పొద్దు న‌డుస్తూ మాకెదురైంది. బైక్ ఆపాను. గుర్రాన్ని ప‌ట్టుకొస్తోన్న అబ్బాయిని  కాస్త ఆగ‌మ‌ని చెప్పాను.

ఐదుమీట‌ర్ల దూరంలో ఆ కుర్రోడు ఆగాడు. గుర్రం ఆగింది. ‘ ఏం పేరు బాబూ..’ అని అడిగా. ‘అజ‌య్’ అన్నాడు. అజ‌య్‌తో మెల్ల‌గా మాట‌లు క‌లిపా. బంధువుల గుర్ర‌మ‌ని చెప్పాడు. త‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు దోస్తులు వ‌చ్చారు. బ‌డికి సెల‌వున్న‌ప్పుడు తెల్ల గుర్రాన్ని మార్నింగ్ వాక్‌కి తీసుకెళ్తాన‌ని చెప్పాడు. అంత‌లోనే  ప‌డుకోదు మీకు తెలుసా. ఇది ప‌రిగెత్తిపోయినా మా ఇంటికి వ‌స్తుంది. లేకుంటే కృష్ణ‌కాంత్ పార్క్ ద‌గ్గ‌ర‌కు వెళ్తుంది. రెండుచోట్ల లేకుంటే తిరిగి తిరిగి త‌నుండే ఈ చెట్టుకిందికే వ‌స్తది. దీన్ని మా బంధువులు న‌ల‌భై వేలకు కొన్నార‌నుకుంటా. పెళ్లి ఊరేగింపు వెళితే  ఒన్ డేకి ఆరువేలు వ‌స్తుంద’ని చెప్పాడా కుర్రోడు. గుర్రం ఏమీ అన‌దా అన్నానో లేదో.. ‘ప‌ట్టుకో అంకుల్.. అంటూ ప‌గ్గాన్ని చేతికిచ్చాడు. ఎక్కి కూర్చోనా అజ‌య్ అని అడిగా. ‘ దీని మూడ్ ఎలా ఉందో నాకు తెలీదంకుల్‌. ఏమైనా అవుత‌దేమో’ అన్నాడు. గుర్రం త‌ల‌మీద చేత్తో నిమిరాను. ఆ గుర్రం ర‌బ్బ‌సం, ఠీవి.. బ‌లేగుంది.  గుర్రం ప‌గ్గాన్ని అజ‌య్ చేతికిచ్చినా. ఆ గుర్రం ల‌ప్పిటిక్కు ల‌ప్పిటిక్కు మ‌ని ప‌రిగెత్తింది. ఆ పిల్లోడు ప‌రిగెత్తినాడు గుర్రంతో పాటే. కాళ్ల గిట్ట‌ల్లోంచి వ‌చ్చే శ‌బ్దం వింటూనే.. నా పిల్ల‌ప్పుడు మా ఊర్లోకొచ్చిన యాభై సోమి నా కండ్ల‌ల్లో క‌న‌ప‌డ్నాడు. నా మ‌న‌సు ల‌ప్పిటిక్కు ల‌ప్పిటిక్కుమ‌ని నా బాల్యానికి ప‌రిగిత్తింది.

ఆ రోజు మైటాల‌..

నేనప్పుడే  గోలుగుండ్లు గెల్చుకుని ఇంటికొచ్చినా.  వ‌సారాలో ఉండే రంగుల‌డ‌బ్బాలో గోలిగుండ్లు పోసినా.  చ‌క్కా-నిక్క‌ర‌, కాళ్ల‌కు, మ‌గానికి మ‌ట్టి అయ్యింది. దొడ్లోకి పోయి  ప్లాస్టికు డ‌బ్బీతో నీళ్లు ముంచుకోని కాళ్లమీద పోసుకున్యానో లేదో ‘గుర్రం వ‌చ్చిందంట ఊళ్లోకి’ అనే గొల్లోల్ల పిల్లోడి గొంతు ఇన‌ప‌డినాది.  కాళ్ల మెడాలు త‌డ‌స‌కోకున్నా.. గ‌బ‌క్క‌ని దొడ్లోంచి వ‌సారాలోకి పోయినా. త‌ప్ప‌దార్ల నుల‌క‌ మంచం అగ‌దాళ్ల‌మీద ఉండే బొచ్చుట‌వాల్ను తీసుకున్యా. గ‌బ‌క్క‌ని మగానికి అట్టోపారి.. ఇట్టోపారి..  గ‌ట్టిగా తుడిచి.. కాళ్లు తుడుచుకోకుండా రోడ్డుమీద‌కి ప‌రిగెత్తినా. మెట్లు ఏసుకోవ‌టం మ‌ర్సిపోయినా. మ‌ళ్లా వెన‌క్కొచ్చి హ‌వాయి చెప్ప‌లు తొడుక్కుని ప‌దడుగులు వేసినానో లేదో.. ఇంత‌లోనే జ‌నార్ధ‌న‌న్న ‘యాభైసోమీ గుర్రం.. పైకుంట తిక్కుపోయింది’ అన్యాడు.  మాయ‌మ్మ కొట్రీ ఇంట్లోంచి రొట్టెపిండి దొడ్లోకి తీస‌క‌స్తాంది. నేను ప‌రిగెత్తాంటే.. ‘రాజావ‌లీ ఆగు.. యాటికిపోతానావు. ఎనుముల‌కు పొట్టు తీసుకురావాల్ల‌’ అంటూ గ‌ట్టిగా పిలిచింది. ‘ఈటికేలే మా మ‌ళ్లొచ్చా’ అన్యాను. కండ్ల ముంద‌ర్నే వ‌డ్డివాళ్ల‌పిల్లోళ్లు, గొల్లోల్ల పిల్లోళ్లు, పెద్దోళ్లు .. ‘యాభైసోమి వ‌చ్చినాడం’ట అని ఉరుకుతానారు.  ఆత్రంగా కుప్ప‌టిచ్చా ప‌రిగెత్తినా.

మాదిగిల్ల ఆత‌ట్టు ఉండే పైకుంట కాడికి దౌడు తీసినా.  కుంట‌కాడికిపోతాన తేర‌చూసినా. ఎవ్వురూ లేరు. ఎన‌క్కి చూసినా. ఎవురూ క‌న‌పల్లేదు. దూరంగా  పైకుంట‌కాడ అవుత‌ల కూడా యాభైసోమి జాడ క‌న‌ప‌ల్లె. నెత్తి గీరికున్యా. రోంత దూరంలో ఫ‌ర్గూస‌న్ టాక్ట‌ర్ను ఒకాయ‌ప్ప కుంట‌లో క‌డుగుతానాడు.  ఒన్నా.. యాభైసోమి గుర్రం క‌న‌ప‌డిందా అని అడిగినా. ‘ఇప్పుడే.. ఇక్క‌డ‌నుంచి గుర్రం బోరింగు బాయితిక్కు పోయిందేమో’ అన్యాడు. బోరింగుబాయి ద‌గ్గ‌ర‌కి పోయినానో లేదో. . ‘అంకిడ్డి తోట‌తిక్కు యాభైసోమి గుర్రం పోయినాదంట‌. యాభై సోమి  పెద్ద‌బాయిని కూడా ఎగురుతుందంట‌. దాని వెంట పొట్లి, కుక్క కూడా వ‌చ్చినాయంట‌. అయ్యి.. గుర్రంతో పాటి ప‌రిగిత్తాయంట‌’ అని పెద్దోళ్లు మాట్లాడుకుంటా బెర‌బెరా అడుగులేచ్చానారు. వాళ్లెనకంబ‌డి ఉరికిత్త పోయినా. కుప్ప‌టిచ్చి ఎగిరిన ఎగురుకు..  కుడి చెప్పు బొటికినేలు కాడ ఉండే వారుకు పెట్టిన పించూది సులుక్కున పొడుచుకుంది. గుర్రం యాడ‌పోతాదో అనే తొంద‌ర్లో చెప్పుకి పించూది పెడ‌తాంటే.. పించూది చెయ్యికి పొడుచుకుంది. పించూది వంగిపోయింది, గ‌ట్టిగా అన‌గ‌మొత్తుతాంటే ఇంకోసారి పొడుచుకుంది. ఇంగ‌ చెప్పులు త‌రంగావ‌ని రోడ్డు ప‌క్క‌న ఉండే చీగిచెట్టులోప‌ల పెట్టి దానిమీద రాయి పెట్నాను.. గుర్తుకు!

చెప్ప‌ల‌బాధ చూసుకుండే స‌రికి నేనంద‌రికంటే ఎన‌క‌ల‌బ‌డినా.  బాధ‌తో కోపంగా ప‌రిగిత్తినా. గ‌స్సొచ్చి కింద‌ప‌డ‌తానేమో అనుకున్యా. యాభైసోమి యాటికి దెంకోనిపోయినాడో అని తిట్టుకున్యా.  యాప‌చెట్టు రాయి కింద గ‌స్స‌పోడానికి కూర్చున్యా. దూరంగా ఏవో అరుపులు ఇన‌ప‌డినాయి. సంబ‌ర‌మెక్కింది. నిల‌బ‌డి సూచ్చే.. బీడు భూమిలో గుంపులు గుంపులుండారు.  జ‌నాలు గోడ‌లెక్కి, చీకి కంప‌ల్లో దూరి, రేణ‌గాయ మండ‌ల్ని లెక్క‌చేయ‌కుండా జ‌నాలు ఎగ‌మ‌ల్లుకున్యారు. కాపోళ్లు, గొల్లోల్లు, త‌లారోళ్లు, సాక‌లోల్ల పిల్లోల్లు, మాదిగోల్లు అంతా ఒక‌టే చోట నిల‌బ‌డ్నారు.  క‌లిసిపోయినారు. ప‌రిగిత్తు ప‌రిగిత్తు.. దుంకు.. నీయ్య‌క్కా.. అంటూ ఒక‌టే అరుపుల‌తో ఆ కందికొయ్య‌ల ఎర్ర‌మ‌ట్టి చేను యుద్ధభూమిలా ఉండాది. మట్టి ఇంగా ఎర్ర‌గ‌యినాది. వ‌యిసుపిల్లోళ్లంతా ‘గుర్రం ఏమి చ‌లాగ్గా ఎగురుతాంది. పొట్లి బిస్స‌గా ఉంది. కుక్క‌చూడ్రోయ్’  అంటూ అర్చానారు. ఆ కేక‌ల‌కు పిల్ల‌గాళ్లు పెనంమీద ప్యాలాలు ఎగిరిన‌ట్లు.. ఎగిరెగిరి అరుచ్చానారు. సూర్యుడు మేఘాల్లో దూరుకుంటానాడు.

గోడ‌మీద జ‌నాలు నిల‌బ‌డినారు. పిల్ల‌గాళ్ల‌ను పైకి రానీలె. నాకేమో గుర్రం క‌న‌డ‌ప‌లేదు.  కూకోని కాస్త వొంగి వాళ్ల కాళ్ల సందుల్లోంచి సూచ్చాన‌. న‌న్నుచూసి మాదిగోల్ల పిల్లోడు గోడ‌మీద‌నుంచి చేయి ఇచ్చాడు.  చేత్తో గోడ‌మీద‌కి లాగినాడు. జ‌నాలమ‌ధ్య‌లోకి దూరి.. చూసినా. దూరంగా.. కాఫీక‌ల‌రు రంగులో గుర్రం క‌న‌ప‌డింది. గుర్రం మీద యాభై సోమి ల‌ప్పిటికి ల‌ప్పిటికి మ‌ని వ‌చ్చానాడు. ప‌సుపు ప‌చ్చ చొక్కా-పంచె, త‌ల‌కాయ‌కు ఎర్ర‌ట‌వాల క‌ట్నాడు యాభైసోమీ.  చూడ‌టానికి న‌ల్ల‌గుండాడు.. గ‌ట్టోడే. భ‌య‌ప‌డ‌కుండా గుర్రంమీద వ‌చ్చాండు గుర్రం వెన‌కాలే మేసిన పెద్ద పొట్లి, కుక్క ప‌రిగిత్తానాయి. అవి గుర్రంతోపాటి బిస్స‌కొద్దీ ప‌రిగిత్త‌నాయి. యాభైసోమి గుర్రం చెంగుమ‌ని ఉడాలు తీచ్చా ఎగురుతా వ‌చ్చాంది.  సూచ్చంగా కుప్ప‌ట్లు కుప్ప‌ట్లు ఎగిరిచ్చానాడు. గుర్రం క‌క‌క అనే ఇకిలింపు శబ్దానికి నా గుండెకాయ‌లు జారిపోయినాయి. అదురొచ్చింది.

‘పిల్లోల్లు ప‌క్క‌కుపాండి.. ప‌క్క‌కుపాండి’ అని పెద్దోళ్లు అరుచ్చాంరు. పిల్ల‌గాళ్లు అదురుకుంటాండారు. నేను కూడా మ‌ళ్లా అదురుకున్యా.  చేతులు, కాళ్ల‌పై ఉండే ఎంటిక‌లు గ‌గ్గ‌ర‌పొడిసినాయి. పైయ్యంత ఎట్ల‌నో అయ్యింది. అంత‌లోకే ఎన‌క్కి ప‌రిగిత్తాండే ఒక పెద్ద‌ పిల్ల‌గాడు న‌న్ను చూడ‌కుండా దొబ్బినాడు. కింద‌ప‌డి నిల‌దొక్కున్యా. నీయ‌క్క‌, నీయ‌మ్మ‌.. అంటూ తిట్లుతిడ‌తాన‌. ఎడ‌మ‌మోకాలికి ఉండే గుళ్ల ప‌క్కు పోయి కాళెలంబ‌డీ న‌త్త‌ర కార్తాంది. కోపంగా చూసినా..  ఏమ‌నుకోవాకు, చూసోకోలాబ్యా అన్నాడు ఆ పిల్లోడు. యాభై అడుగుల్లో ట‌క్‌.. ట‌క్‌.. ట‌క్ మంటూ గుర్రం ద‌ర్జాగా న‌డుస్తా ద‌గ్గ‌రికొచ్చాంది. యాభైసోమి.. సినిమాలో హీరో దిగిన‌ట్లు ఎచ్చ‌లుగా.. సులుకుసూచ్చంగా కిందికి దిగినాడు. ‘యాభైసోమి యాభై సోమి’ అని అంద‌రూ అరుచ్చాంరు. ఓ న‌లుగురు ఆయ‌ప్ప‌ ద‌గ్గ‌రికి ఉరికిత్త‌పోయి చెంబుతో నీళ్లిచ్చినారు.  యాభైసోమి నీళ్లు తాగినాడు. గుర్రం ఇగిలిచ్చాంది. పొట్లి కొమ్ములు ఎనిక్కి ముందికి త‌ల‌కాయ తిప్పుతాంటే మెడ‌కు క‌ట్టిన గంట ఘ‌ల్లుఘ‌ల్లుమంటాంది. ఎర్ర‌కుక్క శాండుగాడి మాదిరి ఉండాది. అది ఒగిరిచ్చాంటే.. కొస్సిపండ్ల సందుల్లోంచి జొల్లు కార్తాంది. గుర్రం ముంద‌రి కాళ్ల‌కాడ అయ్యి బాడీగార్డులు మాదిరి ఉండాయి. లెక్కుండేవాళ్లు కొంద‌రు మంచి మ‌న‌సుతో.. మ‌రికొంద‌రు ఇచ్చినామ‌ని ప‌దిమంది సెప్పుకోవాల‌ని ఎచ్చ‌లుగా పంచ‌లోని నిక్క‌ర్ల‌లో ఉండే  ప‌దులు, ఇర‌వైల కాగితాలు ఇచ్చినారు. భ్ర‌మప‌ట్ట‌లేక ఇంకొంద‌రు ఇవ్వ‌ని వాళ్ల ద‌గ్గ‌ర ఉండే చిల్ల‌ర‌ను ఇప్పిచ్చుకున్యారు. ఆ చిల్ల‌ర‌ను ఆయ‌ప్ప చేతిలో పోసినారు. లెక్క‌ తీసుకోని ఆయ‌ప్ప ట‌వాల్లో క‌ట్టుకున్యాడు. అంద‌రూ బాగుండాల‌.. మ‌ళ్లా వ‌చ్చే సంవ‌చ్చ‌రం వ‌చ్చా అన్యాడు. ఆయ‌ప్ప అభ‌య‌మిచ్చే సోమిలాగే క‌న‌ప‌డ్నాడు. అప్ప‌టిదాకా నేను యాభై సోమి అంటే.. ఆయ‌ప్ప‌కి యాభై రూపాయ‌ల నోట్లు క‌రిపిచ్చింటారేమోన‌నే ఆలోచ‌న ఉండేది. నోట్లు ఆయ‌న చొక్కాపై క‌న‌ప‌డ‌క‌పోయేస‌రికి.. ఏదో పోగొట్టుకున్న‌ట్టు బాధ‌ప‌డ్నా.

‘గుర్రం ఒంటెమాదిరి  ఉండాది. ఆ బండ్రేవు మండ‌ల్ని ఎగిరీ, ఆ పెద్ద గోడ‌ను ఎగిరీ’ అంటూ మీసం తిప్పుతా, తొడ‌గొట్టి మ‌రీ స‌వాల్ విసిరినాడు ఒకాయ‌ప్ప‌.  సూస్కో అన్యాడు యాభై సోమి. డ్లే.. అని ప‌గ్గం ఇదిలిచ్చినాడో లేదో.. ల‌ప్ప‌టిక్కు ల‌ప్ప‌టిక్కు మ‌ని గుర్రం ప‌రిగెత్తాంది. గిట్ట‌ల‌నుండి  ఎర్ర‌మ‌ట్టి ఎగిరెగిరి మేఘాల‌మాద్రి పొగ‌లు పోతాంది. సూచ్చాండంగ‌నే ఆ కంప‌ను, గోడ‌ను ఎగిరిచ్చినాడు. రోంత‌ దూరంగా గుర్రాన్ని దౌడు తీయిచ్చినాడు.  తుమ్మ‌చెట్టుకాడ గుర్రాన్ని ఆపినాడు. పొట్లి, కుక్క ఎప్పుడుబోయినాయో యుద్ధానికి పోతాన్న‌ట్లు ఉండాయి. ‘ఈనాక్క‌.. సినిమాల్లో కూడా ఇట్లాంటిది ఉండ‌దు. తిండికే నూర్లు ఖ‌ర్చు అయితాదంట‌.  కంప ఏంది.. ఆ పెద్ద‌బాయి, వంక‌కూడా ఎగుర్తాది.. ‘ అంటూ జ‌నాలు బిస్స‌గా, ఆ గుర్రం రౌద్రాన్ని, ప‌ర‌క్ర‌మాన్ని చెబుతాండారు. పిల్ల‌గాళ్లంద‌రం ఒక‌రికండ్ల‌ల్లోకి ఒక‌రం ఆచ్చ‌ర్యంతో సూసుకున్యాం. ఆ గుర్రం మా మీద వ‌చ్చి యాడతంతుందో..  గుర్రం త‌న్ని చ‌చ్చిపోతే ఎట్లా.. లాంటి భ‌యం న‌న్ను చుట్టుకుంది. అంద‌రూ ఆయప్ప‌నూ, గుర్రాన్ని చూచ్చా ఏంటేంటివో పొగుడుతాండారు. క‌త‌లు క‌త‌లు చెప్పుకుంటాడారు. ఆ గుర్రాన్ని దెంక‌పోయి.. బ‌డికి పోకుండా ఊర్లంబ‌డీ తిరుగుతున్న‌ట్లు.. న‌న్ను ప‌ట్ట‌క‌చ్చుకోను చేతకాక మా అయ్య‌వార్లు ఏడిచిన‌ట్లు.. నేను దొరికినాక  మాయ‌మ్మ‌,నాయినా వంక‌కాడ చాక‌లోల్లు చౌడుపెట్టి బ‌ట్ట‌లు ఉతికిన‌ట్లు ..ఇట్లా ఏవోవో క‌ల‌లు కంటాండ‌.. దారింట న‌డుచ్చానే.

‘యాభైసోమి అంకేన‌ప‌ల్లికి పోతానాడు. ఆ తిక్కున‌ ఉండే బాయిని ఎగిరిచ్చాడంట‌. ఐదు నిమిషాల్లో బోనాల‌కు పోతాదంట గుర్రం. పులింద‌ల తిక్కు ప‌ల్లెల‌కు పోతాడంట‌.. ‘ అని స‌నాలు ఏదేదో చెప్పుకుంటాడారు.  మాయమ్మ ఏమంటాదో.. ఎన‌మ‌ల‌కు మేపు వెయ్యాల‌.. వామికాడికి పోయి పొట్టు దుస్స‌క‌రావాల‌ని మ‌తికొచ్చింది. ఇంటితిక్కు మ‌ల్లుకున్యా. సూరుడు ప‌డ‌మ‌రింటికి ప‌రిగిత్తాండు. ‘యాభైసోమి వెన‌కాల‌నే ఉంటే నా జీవితం ఎంత బావుంటుందో.. అని మ‌న‌సులో అనుకుంటా ఒక్క‌డుగేసినా..  తెగిపోయిన మెట్లు గుర్తుకొచ్చినాయి. అట్ల‌నే మెట్ల‌కాడికి ప‌రిగెత్తి.. చేత‌ల్లో ప‌ట్టుకోని ఇంటికి ఎల్ల‌బారినా. గుర్రాన్ని, యాభైసోమి గొప్ప‌ను ఇంటిదాకా మాట్లాడుకుంటూ పోయినాం. ఆ మ‌ర్నాడు యాభైసోమి గురించి బ‌డిలో సావాస‌గాళ్ల‌మంతా కైక‌ట్టి మ‌రీ ఎచ్చులు చెప్పుకుంటిమి.

మా ఊళ్లో యాభైసోమిని, ఆ గుర్రాన్ని ఎవురు త‌ల్చుకున్నారో లేదో తెలీదు కానీ.. తెల్లం గుర్రం ప‌గ్గాన్ని అజ‌య్ నా చేతికిచ్చానే  నా కండ్ల‌ల్లో యాభైసోమి క‌న‌ప‌డినాడు. నేనే రోంత‌సేపు యాభైసోమిని అనుకున్యా.

(కథ మొదట కనిపించేది ఊరేగింపుల తెల్ల గుర్రం. యాభై సోమి గుర్రం కాదు)

 

రాళ్ళపల్లి రాజావలి

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి: క‌డ‌ప‌జిల్లాలోని పులివెందుల ప‌ట్ట‌ణానికి 26 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే హిమ‌కుంట్ల గ్రామం వీరిది. ప‌దోత‌ర‌గ‌తి నుంచీ క‌విత‌లు రాస్తున్నారు. బిఎస్సీ, డిప్ల‌మో ఇన్ జ‌ర్న‌లిజం చేశారు. ఇంట‌ర్‌మీడియేట్ నుంచే క‌విత‌లు, వ్యాఖ్యానాలు, సినిమా రివ్యూలు.. లాంటివి ప్ర‌ముఖ పత్రిక‌ల్లో అచ్చ‌య్యాయి. హైద‌రాబాద్‌లో 'ఈభూమి'లో, టీవీ1(టీవీ9) లో, ఆంధ్ర‌జ్యోతి, పత్రికల్లో పని చేశారు. ప్ర‌స్తుతం ఈనాడులో ఫీచ‌ర్స్ విభాగంలో స‌బ్ ఎడిట‌ర్‌, రిపోర్ట‌రుగా ప‌నిచేస్తున్నారు. *గ‌చ్చ‌కాయ‌రంగు చీర‌*, *మూన్‌వాక్‌* అనే క‌థ‌లు కౌముది ఆన్‌లైన్‌ మ్యాగ‌జైన్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. క‌థ‌ల‌తో పాటు క‌విత‌ల్నీ పులివెందుల యాస‌లో రాస్తున్నారు. భ‌విష్య‌త్తులో కవిత‌లు, క‌థ‌ల పుస్త‌కం వేయాల‌నే చిగురాశ ఉందంటారు. మ‌నిషిని కులం బ‌ట్టి గౌర‌వించ‌టం అనే దుర్మార్గ‌సంస్కృతి పోవాలంతారు.

4 comments

 • నాదీ ఇలాంటి జ్ఞాపకమే! ఆ రోజుల్ని బాగా గుర్తు చేశారు.
  మేమ్య్ యామయ్య సామి అని పిలిచేవాళ్లం. నా బాల్యం మొత్తానికి మా వూరికి ఓ మూడు నాలుగు సార్లు వచ్చి వుంటాడు.
  ఇంటింటికీ గుర్రం మీద వచ్చేవాడు. వెంట ఆయన శిష్యగణం కూడా. ఒకసారి నాకు బాగా గుర్తు, చేతిలోని వేపమండతో దీపం వెలిగించాడు.
  మేము గుర్రం గురించి ఇలాగే కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళం. ముఖ్యంగా అది ఎప్పుడూ పడుకోదని. పడుకుంటే చచ్చిపోతుందని. మొన్నటి వరకూ ఎక్కడ గుర్రం కనపడినా అది పడుకుంటుందా లేదా అని చూసేవాడిని.

  • అవును సార్‌..
   యామ‌య్య సామిని యాభై సోమి అని పిలిచేవాళ్లం. నేను పిల్ల‌ప్పుడు విన్న *యాభై సోమి* అనే ప‌దాన్నే అలా ఉంచి క‌థ రాశా. దాదాపు రాయ‌ల‌సీమ‌లో ప్ర‌తి ఊర్లో ఇలాంటి అనుభ‌వాలుంటాయి. ఎప్పుడో ఆరోత‌ర‌గ‌తి చ‌దివేప్పుడు జ‌రిగిన ఓ చిన్న జ్ఞాప‌కాన్ని రాశానంతే. నాకు గుర్తున్న విష‌యాల్ని మాత్ర‌మే పంచుకున్నా. మీ స్పంద‌నకు ధ్య‌న్య‌వాదాలు స‌ర్‌.

 • బలె రాసినావు రాజావలి. పిల్లప్పటి యామయ్య సామిని కండ్ల ముందుంచినావు

 • Super thammudu. Chinnanaati gnapakalu aksharam pollu pokunda gurthu pettukuni rasav. Naa chinnappudu Nenu chusina yamaiah swami gurthu vachadu. Aa age lo adi Oka strange laa anipinchedi. Malli eppudu vasthada ani wait chesava allam. Ippudu children ku Ee sweet memories levu….

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.