రోటి పచ్చడి

మా ఆవిడ
రోటి పచ్చడి చేస్తోంది

వేరుశనగ పప్పులు కొన్ని
కొన్ని ఎండు మిరపకాయలు
దోరగా వేయించిన ధనియాలు, జీలకర్ర
కాస్త చింత పండు
ఉప్పు కూడా వేసింది
నాలుక ప్రేమ లో పడాలిగా
పొడవయిన వాక్యం లాంటి రోకలి
లయబద్దం గా రోట్లో దంచుతుంటే
పరిసరాలు పరిమళ భరితం
రోటిది తల్లి గుండె
పచ్చడి కి
మమకారం పంచుతుంది
ఈ టెక్నిక్
ఎప్పటిదో గాని
పచ్చడికి శిల్పం,అభివ్యక్తి,రూపం
అలా కుదిరిపోతాయ్
చివరిలో వేసిన ఉల్లిపాయ
కవితకు ముగింపు లా కుదిరిపోతుంది
రోలు రొకలికి ఉన్న మనిషితనం
మిక్క్సీ కి ఉండదేమో
అది మరతనం కదా
ఇప్పుడే కాస్త పచ్చడి రుచి చూశాను
వ్బిప్లవ కవిత్వం లా ఉంది
చూపుడు వేలు తీసుకురండి
రుచి చూసి
ఎర్రెర్ర గా వెలిగిపోదురు గాని

సుంకర‍ గోపాలయ్య

సుంకర గోపాలయ్య: కాకినాడ, పిఠాపురం రాజా కళాశాలో తెలుగు శాఖాధిప‍తి. సొంత ఊరు నెల్లూరు. రాధేయ కవిత పురస్కార నిర్వాహకులు. కొన్ని పిల్లల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

22 comments

 • నాయనా, బండ పచ్చడిలాంటి స్నేహితుడివి..ఇలా పదికాలాలు పాటు రాయి నాయనా !

  భలే రుచిగా ఉంది పచ్చడి.

 • “పచ్చడి విప్లవ కవిత్వం లా ఉంది” పోలిక బాగుంది.

 • షడ్రసోపేతమైన మీ ‘రోటీ పచ్చడి’ నాలుకపై నీళ్ళూరించి.. చివర్లో చురుక్కుమని మెరిసింది.
  అభినందనలు గోపాల్ గారు.

 • చివరి లో వేసిన ఉల్లిపాయ కవితకి ముగింపు లా కుదిరిపొతుంది…. ఈ రోటీ పచ్చడి ముగింపు కూడా చాలా బాగా కుదిరింది….. చాలా బాగుంది సర్…సుపర్…..

 • ఓహో పొద్దు పొద్దున్నే నాలిక సురుక్కుమనిపించారు.మీలాంటి వాళ్ళు రెగ్యులర్ గా రాయక మాలాంటి వాళ్ళం రెచ్చిపోతున్నాం.బాగు బాగు మీ పద్యం.

 • బలే ఉంది సర్…పచ్చడి…పొడవాటి రోకలి లాంటి వాక్యం….మమకారం పంచె రోటితల్లి గుండె…వెరీ నైస్ సర్….

 • మీ రోటి పచ్చడి చూపుడు వేలికి కాదు,అర చేతిలో పెట్టండి ఎక్కువ సేపు ఆశ్వాదిస్తాం..మనిషితనం..మరతనం.. బాగుంది.. అభినందనలు..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.