పేరే ఒక ధిక్కారం

మనుషుల్లో కొందరు చాలా తేడాగా ఉంటారు. ప్రవర్తనలో మాట్లాడే తీరులో మనతో ఉన్నట్టే ఉంటూనే మళ్ళీ మనతో విభేదిస్తూనే ఉంటారు. అలాంటి వారిని చూసి కొన్ని సార్లు నవ్వుకుంటాం, మరికొన్ని సార్లు నొచ్చుకుంటాం. ఇంకా చాలా సందర్భాల్లో మనం వారికి కావాలనే దూరంగా జరుగుతాం. అది తేడాగా ప్రవర్తించే మనుషుల విషయంలో. అయితే అలాంటి మనుషులలాగే కొంత మందికి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడూ అంతే వారిని చూసి నవ్వుకుని, వారి వెనక గుసగుసలు పోతుంటాం. కనబడిన వారందరికీ వాళ్ళ పేర్లు చెప్పి మనమేదో ఘనకార్యం చేసిన వాళ్ళలా కడుపు ఉబ్బి పోయేలా నవ్వుకుంటాం.

మనదేశంలో ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది. మన ఆలోచనలకు అడ్డు కట్ట వేయగలిగే సాహసం ఎవడికి లేదు. ఒక వేళ ఉన్నా ఎవరి మాటా వినకుండా మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉంటాం.

ప్రాచీన భారత దేశములో పేర్లకి చాలా విలువ ఉండేది. ఎక్కువగా వాళ్ళ పూర్వీకుల పేర్లని పుట్టిన పిల్లలకి పెట్టడానికి మొగ్గు చూపే వాళ్ళు. అలా చాలా పేర్లు మన సమాజములో స్థిరంగా నిలబడిపోయాయి. వాటివల్ల నష్టం లేదు. ఎప్పుడైతే మన వాళ్ళ జీవితాలలోకి మతం జోరుగా ప్రవేశించడం మొదలు అయిందో అప్పటి నుంచి పేర్లలో కాస్త తేడాలు వచ్చాయి. ఒక్క ఉదాహరణ చూద్దాం .మా నాయనమ్మ వాళ్ల సంతానము మొత్తం పదిమంది ఆరుగురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు. మొదట నలుగురు ఆడపిల్లలు పుట్టాక మా నాయనమ్మ వాళ్ళ అమ్మ మగపిల్లాడు కావాలి అనికోరుకుంది కానీ ఆడపిల్ల అంటే మా నానమ్మ పుట్టింది. వెంటనే ఆమె ఆ ఊరి బొడ్రాయి కాడికి వెళ్లి ఇంకా ఈ ఆడపిల్లలు సాలమ్మా అని మా నానమ్మకి “సాలమ్మా”అని పేరు పెట్టారు. ఆ వెంటనే నాలుగు కాన్పుల లోనూ నలుగురు మగపిల్లలు పుట్టారు. మళ్లీ ఆఖరున ఒక ఆడపిల్ల. ఇందులో దైవ కార్యం ఎంత అని బేరీజు వేయడం నమ్మకాలతో కూడినది కావడం వలన ఏమి చెప్పలేం. కానీ ఈ సమాజము మీద కాస్తో కూస్తో ప్రేమతో లేదా అభిమానంతో తమ పిల్లల పేర్లని కాస్త విచిత్రంగా పెట్టుకున్న కొంతమంది తండ్రులని, తల్లుల్ని, ఆ పేర్లని బరువు అని అనుకోకుండా మోస్తున్న పిల్లలని చూసొద్దాం రండి. ఎక్కడా, వామ్మో దూరం మేం పోలేం అనుకోకండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనం మనకన్నా ఎంత తెలివిగా ఉన్నారో చూద్దాం. ఈ ప్రయత్నం చేసింది సీనియర్ పాత్రికేయులు గోరుసు.జగదీశ్వర్ రెడ్డి. ఆ పుస్తకము పేరు ” పేరులో ఏముంది?”.
నమస్తే సార్.
నమస్తే అండీ…
మీ పేరు
నా పేరా… మీకు తెలుసు అండీ
అబ్బే నాకు తెలీదే…
తెలీకపోవడం ఏంటి… ఇందాక అన్నారు కదా నమస్తే సార్ అని. నా పేరు “నమస్తే”. అని ఎవరైనా అన్నారు అనుకోండి. మనం ముందు ఆశ్చర్యపడతాం. అయ్యో బంగారం లాంటి మనిషికి అదేం పేరు అని వాపోతాం. కానీ వాళ్ల ఇంట్లో వాళ్ళ కి ఆయనకి ఆ పేరు పెట్టాలని ఎందుకు అనిపించిందో ఈ పుస్తకము మనకి వివరిస్తుంది. ఒక్కోసారి విచిత్రంగా పెట్టాలనే ఆలోచన కూడా ఇలాంటి పేర్ల వైపు మొగ్గు చూపించడానికి అవకాశం ఉంది. తద్వారా ప్రపంచంలోకి కొత్త మనుషులకి కొత్త పేర్లు పుడతాయి. ఎవరూ పుట్టించకుండా పేర్లు ఎలా పుడతాయి అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇలా పేరు పేరు కో కథ ఉంది.

ఒకమ్మాయి పేరు “ఫ్రిడ్జ్”. మీరు నమ్మరు అసలు అమ్మాయికి అదేం పేరు అనుకుంటారు. కానీ నిజం. ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఏవో అనారోగ్య సమస్యల వలన కొన్ని రోజులు ఐస్ బాక్స్ లో తక్కువ ఉష్ణోగ్రత లో ఉంచాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కి వచ్చిన జబ్బు ఏంటో కూడా ఆ తల్లిదండ్రులు కి తెలీదు. ఆ అమ్మాయి ఫ్రిడ్జ్ లాంటి దాన్లో పడుకుని బాగయింది కాబట్టి ఆ అమ్మాయి పేరు ఫ్రిడ్జ్ అని పెట్టేశారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాలని చూసినా ఆ జ్ఞాపకం వాళ్ళు మర్చిపోలేరు కాబట్టి వాళ్ళు ఆ పేరుని మార్చడానికి ఇష్ట పడలేదు. చివరికి ఆ అమ్మాయి పేరు అలానే స్థిరపడిపోయింది.ఆ అమ్మాయికి కూడా పెద్ద బాధగా ఏమి లేదు ఆ పేరు తో. ఏముంది అన్ని పేర్ల లాగే తన పేరు కూడా. ఎంత మందిలో ఉన్నా నా పేరు నేను కాస్త వింతగా కనబడాలి కదా అని ఇంకా గర్వంగా చెప్పుకుంటుంది. అలా అని ఎవరైనా అనాలోచితంగా లేక ఉద్దేశ్యపూర్వకంగా పేరు తప్పు పిలిస్తే మాత్రం తాను పలకను గాక పలకను అంటుంది. అదే కద ధైర్యం అంటే. పేరులో ఏముంది అంటే అదే ఉంది. అలా ఉండడానికే ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాల పేర్లు.

చాలా మంది కమర్షియల్ రచయితలు పిల్లల పేర్ల ని కొత్త కొత్తవి క్రియేట్ చేసి వాటిని కూడా సొమ్ము చేసుకున్నారు, చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో ఇప్పటికి పుట్టిన తిథి నకత్రాన్ని బట్టి నోరు తిరగని అక్షరాన్ని ఎంచుకుని ఏమి పేరు పెట్టాలా అని కనబడిన ప్రతీ వాళ్ళని అడుగుతూ నానా తంటాలు పడతారు. భలే నవ్వొస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. మీకు “స్కైలాబ్” అంటే తెలుసుగా. తెలుగు రాష్టాల్లో అది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి పేరు ఒక కుమారుడికి పెట్టుకున్నాడు ఒక తండ్రి. ఆ అబ్బాయిని చూసి బళ్ళో పిల్లలు పారిపోయే వారు. పైకి చెప్పకపోయినా పంతుళ్ళూ నవ్వుకునే వారు. ఇంక నోరు తిరగని వారి సంగతి మరీ దారుణం. కానీ అతను ఎక్కడా భయపడలేదు, బాధపడలేదు. ధైర్యంగా ఉన్నాడు. ఆ పేరే అతనికి వరమైంది. ఎంతో మంది ఇంటర్వ్యూ కోసం ఉన్నా కేవలం ఈ పేరు వల్లే తను వరసలో ముందుకి జరిగాడు. ఆ ఆఫీసర్ కి స్కైలాబ్ ఉదంతం గుర్తొచ్చి ఆ పేరు పెట్టుకున్నందుకు  అభినందించి కాసిన్ని ఎక్కువ మార్కులేసి ఉద్యోగం వచ్చేలా చేశారు. అదే ఏ మామూలు పేరో అయితే అలా ఉండేదా. నలుగురిలో ఒకడిగా మిగిలిపోయేవాడు. చరిత్ర మార్చాలంటే తెగువ మన నుంచి మాత్రమే మొదలవ్వాలి. అది ఎదుటి వారిని ఒప్పించగలిగేలా కూడా ఉండాలి. ఒకవేళ ఒప్పుకోకపోయినా దిగులు పడకుండా ముందుకు పోవాలి. అప్పుడే మనం కాస్త తేడా అని ఈ ప్రపంచం ఒక ట్యాగ్ తగిలిస్తుంది.

ప్రతీ పేరు వెనక  ఒక చరిత్ర ఉంది. అది కేవలం పురాణానికే పరిమితమైన చరిత్ర కాదు. ఒకమ్మాయి పేరు “మానవత”. ఆ అమ్మాయి మానవహక్కుల దినోత్సవం రోజున పుట్టింది అని వాళ్ళ తాతగారు ఆ పేరు పెట్టారు. ఆ పేరు ఆ అమ్మాయికి పెట్టమని చెప్పింది పింగళి దశరథ రామ్. ఇప్పుడు ఆ అమ్మాయి పేరుకి ఒక సార్ధకత. ఆ అమ్మాయి పేరు వెనుక ఒక కథ. చూసారా ఇలాంటి కథలు కావాలి. సామాజిక కట్టుబాట్లను ఎడంకాలితో తన్నే కొత్త తరం రావాలి. ఇది ఇలా మాట్లాడుకునే లోపులో ఇంకో అబ్బాయి వచ్చి హాయ్ సార్ నా పేరు “బ్రవును” అంటాడు. బహుశా క్రైస్తవులు కాబోలు అనుకుని అతని ఇంటిపేరు అడుగుతాం. ఈ లోగా వాళ్ళ నాన్నగారు వచ్చి మా అబ్బాయికి ఇంటిపేరు లేదండీ. నా పేరు మా ఆవిడ పేరు కలిపే వాడి ఇంటిపేరు అంటారు. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. భయంగా కూడా ఉంటుంది కానీ ఇది నిజం.ఆ వ్యక్తి ఎవరో కాదు “సాహితీ స్రవంతి” ఆంధ్రప్రదేశ్ బాధ్యులు వొరప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి “బ్రవున్”. చక్కని కవిత్వం రాస్తాడు. ఇప్పుడు సొంతగా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాడు. నిజానికి అతనిపేరు అతనికి ఎప్పుడు అడ్డంకి కాలేదు. అలాగే.ఒక అబ్బాయి పేరు “శ్రీకృష్ణ దేవరాయలు”. ఒకబ్బాయి పేరు “డార్విన్” మరో అబ్బాయి పేరు” కోపర్నికస్”. ఎవరు వీళ్ళంతా ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పిన మహనీయులు. ఎలాగూ కులాలు మతాల సమీకరణలో ఎవరి మతం వాళ్ళు ప్రమోట్ చేసుకునే క్రమంలో మనం  చాలా మంది శాస్త్రవేత్తలు, మహానుభావుల పేర్లు మర్చిపోయాం. ఇప్పుడు ఇదిగో ఇలా గుర్తు చేయవలసిన వ్యక్తులు చేస్తుంటే నవ్వుకుంటూ పోతున్నాం. మనం ఏ కోవకి చెందుతామో మనకి మనమే కొన్ని సార్లు అర్ధమేకాము. పురాణాల్లో అత్యంత శివభక్తుడు రావణుణ్ణి పట్టుకుని రాక్షసుడు అంటాం. ముల్లోక సంచారి నారదుని పేరు ఎవరైనా పెట్టుకున్నారు అనుకోండి మనమే పేర్లు పెడతాం అగ్గిపుల్లల సామీ అని. ఇంత అసంబద్ధమైన మనుషులం కనకే మనలో మనకి ఇన్ని విభేదాలు, తారతమ్యాలు.

ఇన్ని పేర్ల మధ్యన కొంతమంది అత్యుత్సాహంతో కొన్ని పేర్లు  పెడతారు వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇటువంటి పేర్లు కూడా ఈ పుస్తకం లో ఉన్నాయి. అయితే ఇలాంటి పేర్ల విషయంలో వాళ్ళకి పేర్ల మీద సరైన అవగాహన లేదనే విషయం అర్ధమవుతుంది. అయితే మెజారిటీ పేర్లు చాలా ప్రభావవంత మైనవి.  “నిప్పు”,”మెరుపు”లాంటి పేర్లు ఉన్న వాళ్ళ వెనక కథలు చాలా ఆసక్తి కలిగిస్తాయి. హీరో, శనార్తి లాంటి పేర్లు నవ్వించినా కానీ వాటి వెనక ఉండే అసలు విషయాలు చాలా మోటివేట్ చేసే విధంగా ఉంటాయి.ప్రముఖ కవి “పైడి. తెరేశ్ బాబు” పేరు వెనుక ఉండే ఒక ఆసక్తి కరమైన సన్నివేశం చాలా బాగుంటుంది. ఆయన్ని ఆ పేరు నోరు తిరగక ఎలా పిలిచే వారో ఆయనే స్వయంగా చెప్పారు. కానీ తాను తన పేరు మార్చుకోలేదు దాని వెనక పేరు నిర్ణయించిన పెద్దల పట్ల గౌరవం అలాగే ఆ పేరుతో వారు పెంచుకున్న అనుబంధం కూడా వాళ్ళని వెనక్కి పోనివ్వదు. కాబట్టే వాళ్ళు ఆ పేరు దగ్గరే ఆగిపోలేదు. తాము ఏమి చేయాలో అదే చేశారు. తమ పరిధిని మించి పనిచేశారు. ఆ పనిలో ఆనందం పొందారు. నిజానికి ఇదొక మానసిక విశ్లేషణ అంశంగా కూడా చూడాలి. ఒక్క చిన్న ప్రతికూల అంశం మనలో ఉంటే మనం దాన్ని ఊహించుకుంటూ కృంగిపోతాం . వాటిని జయించాలి అనే ఆలోచన ఇలాంటి పుస్తకాలు కలిగిస్తాయి. అందుకే ముందుమాటలో డాక్టర్ సమరం ఇలా అన్నారు, “నిజానికి మనిషికి పేరుకి చాలా అవినాభావ సంబంధముంది. అందుకే పేరుకి ప్రాముఖ్యత ఏర్పడింది. ఎందుకంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన వారి పేరు వింటే స్ఫూర్తి కలుగుతుంది. ఇలాంటి పేర్లు పెట్టిన తల్లిదండ్రులకు అభినందనలు ” ఈ పుస్తకానికి సమరం గారే ముందు మాట రాయాలి. వాళ్ళ కుటుంబమే ఒక అభ్యుదయ పేర్ల ప్రపంచం . అక్కడే రచయిత చాలా పరిణితి కనబరిచారు.

జనవరి 2013 నుంచి 2014 మే వరకు ఆంధ్రజ్యోతి లో వచ్చిన “పేరులో ఏముంది”అనే శీర్షికే ఈ పుస్తకం. దినపత్రిక లలో తెలుగు సాహిత్యం కి సంబంధించి కొత్త కొత్త ప్రయోగాలు చేసింది. అందులో భాగమే ఇది. ఇలాంటి కాలమ్ ని నిర్వహించాలి అంటే కత్తి మీద సాము వ్యవహారం. కానీ రచయిత, పత్రిక యాజమాన్యం చాలా ఓపిగ్గా ఆ పనిని నిర్వహించారు. అందుకు పాఠకలోకం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

1991 ప్రపంచీకరణ తొలిదెబ్బకి బలైన కంపెనీలలో హైదరాబాద్ లోని “ఆల్విన్” ఒకటి దాదాపు పది వేలమంది ఉద్యోగులు.అందులో ఒక ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహించేవారు మన రచయిత “గోరుసు”అని మనమంతా పిలుచుకునే “గోరుసు జగదీశ్వర రెడ్డి”. దాదాపు రెండు ఏళ్లు పని లేని అదే కంపెనీలో సాహిత్యం పట్ల మక్కువ ఉన్న వ్యక్తిగా తాను చదివిన పుస్తకాలని మిగతా తోటి ఉద్యోగులకు కూడా  ఇచ్చి చదివించి వాళ్లలో సాహిత్యం అంటు కట్టి చాలా మందిని సాహిత్యం లోకి నడిపారు. వాస్తవానికి ఈయన ఒక మంచి కధకుడు “గజ ఈతరాలు”అనే కథా సంపూటాన్ని వెలువరించారు. మానవ సంబంధాలను ఈయనదైన శైలి లో రాసిన కధలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆతరువాత మరి ఎందుకు ఆ కలం కి విశ్రాంతి ఇచ్చారో తెలియదు. ‘ఖాళీ సీసాలు’ స్మైల్ ని అమితంగా ఇష్టపడే “గొరుసు” నిత్యం జరిగే సామాజిక అంశాల్ని వాటి కొత్త కొత్త ధోరణులని సునిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఆయన అభిప్రాయాలు చాలా దృఢమైనవి ఆయన చాలా విషయాల్లో మౌనంగా ఉన్నా ఆయన వాటి పట్ల తన అభిప్రాయం జనామోదం పొందేవిగానే ఉంటాయి. ఈయన భాషాపటిమ తెలియాలి అని అంటే ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం లో “పదవినోదం”చూడొచ్చు. పాత సినిమాల పట్ల చాలా ఇష్టం. పాత రేడియో పాటలు సేకరించడం అలవాటు. మంచి కలెక్షన్ ఉంది ఈయన దగ్గర.ఇండియాటుడే పాత సినిమాల మీద వ్యాసాల పోటీ పెడితే “మల్లీశ్వరి”సినిమా మీద ఈయన రాసిన వ్యాసానికి ద్వితీయ బహుమతి వచ్చింది.

ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్ గా పని చేస్తున్న ఈయన గతంలో టూరిజమ్ డిపార్ట్మెంట్ లో కూడా పని చేశారు. ఎప్పుడూ రచనల్లో కొత్తదనాన్ని కోరుకునే ఈయన ఇలాంటి కొత్త శీర్షిక మొదలు పెట్టడం, దానికోసమే అమితంగా ప్రాణం పెట్టి పనిచేయడం  ఎంతలా అంటే కొత్త పేర్ల కోసం కాలం కింద ఫోన్ నంబర్ ఇవ్వడం వాళ్లదగ్గరకి తానే స్వయంగా వెళ్లడం, వాళ్ళు చెప్పిన ఆ ముడిమాటల్ని తీసుకు వచ్చి వాటిని మెరుగు పెట్టి అందించారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలు ఈయన నుంచి రావాలి అని మనం కోరుకుందాం.

ఇలాంటి పుస్తకాన్ని పబ్లిష్ చేయాలి అని అంటే ఎవరూ పబ్లిషర్స్ అంతగా ఆసక్తి చూపరు కానీ, అభ్యుదయానికి ఒక స్థానం ఇచ్చి ప్రజల్ని చైతన్యం పరిచే “ప్రజాశక్తి బుక్ హౌస్”వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. బహుశా వాళ్ళు దీని మీద లాభనష్టాల గురించి కన్నా ప్రజాభ్యుదయంకే ఎక్కువ ఆసక్తి చూపారు. అందుకే ఈ పుస్తకం వెలుగు చూసింది అని చెపొచ్చు.

ఇంకా పేర్కొనాలంటే ఈ పుస్తకంలో చాలా పేర్లున్నాయి అవన్నీ ఇక్కడే చెబితే ఇంకెవరు పుస్తకం కొనరు. కాబట్టి చర్చకు కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఈ మధ్యనే తన కులాన్ని వదిలేసుకున్న ఒక మహిళ గురించి చదివాము. తనపేరు చివర కులం తోకని కత్తిరించుకున్న సుందరయ్య గారి వారసత్వం మన దగ్గర ఎలాగూ ఉంది.ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున యువత తమ ఇంటిపేర్లు కూడా వదిలేసుకుంటున్నారు. అలాగే మారుతున్న పరిస్తితి లో పేర్లు కూడా కొత్తగా సమాజానికి  ఉపయోగపడేలా ఉండే విధంగా మార్పు రావాలని కోరుకుందాం. మనుషులుగా మనం చేయవలసిన పని అదే.ప్రపంచానికి కావాల్సింది కూడా అదే. ఈ పుస్తకము అదే చేసింది. ఇంకా చేయాలి అంటే మీరు కొని మరొకరి చేత కొనిపించి పిల్లల పేర్ల లో రాబోయే రోజుల్లో ఒక కొత్త తరాన్ని  మనం చూడొచ్చు. అది మనచేతుల్లోనే ఉంది. అన్నట్టు మీకో పేరుంది కదూ.ఇంతకీ దాని అర్ధం తెలుసామీకు. కనుక్కోండి తెలియకపోతే ఇలాంటి కొత్త పేరు ఒకటి మీకు మీరే పెట్టేసుకోండి.

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

11 comments

 • డ్యానీ పేరులోని మర్మమేమన్నా ఉంటే చెప్పరాదూ ? అలానే నాదీ, మా అబ్బాయిదీ కూడా ! ఆసక్తికరమైన పుస్తకమూ, నీ వ్యాఖ్యానమూనూ ! భలే భలే. ఇలాంటి పుస్తకాలూ ఉంటాయా అనిపించింది.

  బ్రౌన్ అని చెప్పగానే నేనూ ఓరోజు స్టన్నాయాను. బాగుంది అనిల్ . పైడి తేరేష్ గురించి సగంలో ఆపేశావే ?

  మంచి ఆర్టికల్ మిత్రుడా !

  • కథ , కవిత్వం , నవల లాగా ఇలా ఆసక్తి రేపే కొన్ని పుస్తకాలు కూడా ఉన్నయని తెలిసి చదివాను సార్ ఎందుకో రాయాలి అనిపించింది , రాసాను ఇలాంతి పుస్తకాలు ప్రజల్లొకి వెల్లవలసిన అవసరం చాలా ఉంది . మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

 • డానీ… చాలా బాగా రాశావు. నీ వ్యాఖ్యానం సరదాగా బాగుంది.

 • చదివే కొద్దీ ఆసక్తి పెరుగతూ ,విషయాన్ని మనోల్లాసం కలిగించే విధంగా ,కొత్త పేర్ల పరిచయం….సూపర్ గా ఉంది .రచయిత గా మీకు అభినందనలు. పుస్తకానికై ఎదురు చూస్తా మండి.

 • జ్యోతి వీక్లీ సంచిక లో వస్తున్నప్పుడే చూశాను. మంచి ప్రయత్నం. పేరు పెట్టడం అనగానే గోవింద నామాలు వరసగా అందుకునే వాళ్ళ నుండి లేటెస్ట్ గా వస్తున్న పేర్ల నిఘంటువు ల సహకారం తీసుకునేవారు.అవన్నీ సర్వ సాధారణం. ఐతే తను నమ్మిన భావాలూ,తనకు నచ్చిన పాత్రల ,పరికరాల పేర్లు పెట్టడం ఓ కమిట్ మెంట్.మరింత మంది కి ప్రోత్సాహం ఇచ్చే పుస్తకం. మావాళ్ళుకొందరున్నారు.నేనూ కొనుక్కుంటా.

 • పేరులో ఏముంది, ఆ వెనుక దాని కారణమేమైవుంటుంది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది ఆంశం.అయితే మన పేర్లవెనుక కూడా ఏదైనా రీజన్ ఉందేమో వెంటనే తెలుసుకోవాలి.ఇంట్రెస్టింగ్ సబెక్ట్ కి మీదైన విశ్లేషణ జోడై చదవాలనే కుతుహాలన్ని పెంచారు… రచయితకి మీకు అభినందనలు

 • ధన్యవాదాలు అనిల్ డ్యానీ గారూ 🙂
  నిజానికి ఆంధ్రజ్యోతి ఆదివారంలో ఈ శీర్షిక రావడానికి కారణం అప్పటి మా సండే ఇంచార్జ్ వసంత లక్ష్మి గారు . ఈ శీర్షిక ఐడియా కూడా వారిదే . నేను వారధిని మాత్రమే. విషాదం ఏమంటే ఇందులోని మెరుపు అనే కుర్రాడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది . అలాగే మరొక చిన్న కుసుమం కూడా రాలిపోయింది వాళ్ళ నాన్న నాకు కాల్ చేసి చెప్పారు . ఆనందంతో పాటూ విషాదాన్ని నింపిన శీర్షిక ఇది .
  ఏదేమైనా నా పుస్తకానికి మీరు రివ్యూ రాయడం సంతోషం .
  నా మిత్రుడు వరప్రసాద్ చేయి చేసుకోపోతే ఈ పుస్తకం వెలుగులోకి వచ్చేది కాదు . ఈ సందర్బంగా ప్రసాద్ కు కృతజ్ఞతలు చెబుతున్నాను .

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.