ప్రారంభం లాగే
ప్రయాణం వుంటుందా?

మే 23 న వెలువడిన ఎన్నికల ఫలితంగా కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ను సైతం తలదన్నేలా , సొంత పార్టీ నేతల అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి.  అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా అన్ని సీట్లను ఊహించి వుండదు. అలాగే ప్రతిపక్షంలోకి మారిన తెలుగుదేశం పార్టీ అంత ఘోరపరాజయం ఎదురవ్వబోతోందని అనుకుని వుండదు. రాయలసీమ పై పెద్ద ఆశలు లేకపోయినా మరీ మూడే లోక్ సభ సీట్లు వాళ్ళు ఊహించని పరిణామం. అడుగడుగు అబద్ధాలతో పాటు తమ పట్ల వున్న చంద్రబాబు చిన్న చూపుకు సీమ ప్రజలు ఈ విధంగా తమ కోపాన్ని ప్రదర్శించారు. ఇక్కడ వైయ్యేస్సార్సీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే… మెజారిటీలు.  రాష్ట్రంలోని మారుమూల నియోజకవర్గాల్లో కూడా ముప్పై నలబై వేల మెజారిటీలు వచ్చాయి. వాటిలో ఎక్కువ భాగం మునుపెన్నడూ అంత మెజారిటీలు రాని నియోజలవర్గాలే. కొత్త అభ్యర్థులు… ఎన్నికల నామినేషన్ వరుకు పేరు సరిగా పరిచయం లేని అభ్యర్థులు కూడా నల్లేరు పై నడక సాగించారు. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వానికి ఏ మాత్రం అస్థిరత్వం అవకాశం లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. ఇక ప్రజారంజక పాలన అందించడమే తరువాయి ఘట్టం. ఏ అరవై డెబ్భై సీట్లో వస్తే ఈవీఎంల మానిప్యులేషన్ జరిగింది. లేకపోతే మేమే గెలిచేవాళ్ళం అని రచ్చ రచ్చ చేయడానికి టీడీపీ శ్రేణులు ముందే తయారయ్యి కూర్చున్నారు. వారొకటి తలిస్తే ఓటరు మరొకటి తలిచాడు. ఇక చిత్తుగా ఓడిపోయినా టీడీపీ వాళ్ళు ఇప్పటికీ ఏ చిన్న తప్పు జరుగుతుందా విమర్శించడానికి అని ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశం వారికి ఇవ్వకుండా ఉండడం , వుండకపోవడం అనేది అధికార పక్షం చేతిలోనే ఉంది.  

కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నూతన ప్రభుత్వ పనితీరును మునుపు అందరి కంటే పూర్తి భిన్నంగా, తండ్రి శైలికి సైతం  భిన్నంగా ఉండేలా అడుగులు వేస్తున్నాడు. తను ఎన్నికలకు ముందు నుంచే ఆ రకమైన రాజకీయాలు ఫాలో అవుతున్నా, ఇప్పుడు దానికి ఒక ఖచ్చితమైన రూపం వచ్చినట్లైంది. దాన్ని ప్రమాణ స్వీకారం అయిన మొదటి రోజు నుంచే గమనించొచ్చు. అయితే అది అలాగే కంటిన్యూ అవుతుందా అనేది ఇప్పుడే డిసైడ్ చేయలేం కదా. వేచి చూడాల్సివుంది.

జగన్ ముందున్న సవాళ్లు

కొత్త ప్రభుత్వం ముందు ఇప్పుడు చాలా సవాళ్లు ఉన్నాయి. లోటు బడ్జెట్, అప్పులు, అస్తవ్యస్తమైన అడ్మినిస్ట్రేషన్, కొత్త రాజధాని పై ట్రిబ్యునళ్ళలో, సుప్రీం కోర్టులో సవాలక్ష కేసులు వగైరా వగైరా. వీటన్నిటినీ ఒక దారికి తీసుకు రావడం ఒక ఎత్తైతే , వైవిధ్య భరితమైన సుపరిపాలన అందించేందుకు కృషి చేయడం మరో ఎత్తు.

ఒక పక్క రాష్ట్రంలో ఏ కొత్త పథకం మొదలు పెట్టాలన్నా నిధులు అవసరం. కానీ వాస్తవంలో ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అప్పులే. దోచుకుతినడానికి ఎలాగూ డబ్బులు లేవు కనుక గత ప్రభుత్వం  అప్పులు తెచ్చి మరీ తిన్నదని మాజీ ఉన్నతాధికారుల మాట. మరి అటువంటి అప్పుడు జగన్ ప్రకటించిన నవరత్నాల అమలు ఏ విధంగా ఉండబోతోందో చూడాలి. ప్రమాణ స్వీకారం తర్వాత యిది రాస్తున్నప్పటికి పది రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు తప్పక హర్షణీయం. ఉదాహరణకు ఆశా వర్కర్ల జీతాలు తక్షణమే పెంచడం వంటివి.  నాలుగేళ్ళ నుంచి పోరాడుతున్న ఉద్యోగుల సీపీఎస్ రద్దు వంటి వాటిపై కూడా వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ముందే చెప్పినట్లు పింఛన్లు మూడు వేల వరుకు పెంచుకుంటూ పోతానని వాగ్దానం ఇచ్చి, ఆ తక్షణమే రెండు వందల యాభై రూపాయలు పెంచేశారు. ఇక్కడ మాజీ పాలకుల శోచనీయ వైఖరి ఏమిటంటే ప్రజలు ఇంత ఘోరంగా బుద్ధి చెప్పినా ఇంకా అసత్య ప్రచారాలు మానుకోకపోవడం. ‘చంద్రబాబు 2018 లోనే ఆశ వర్కర్ల జీతాలు 8500 చేసేసాడని, పింఛన్లు జగన్ తక్షణమే 3000 ఇస్తామని మాట తప్పాడని’ అసందర్భ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు మళ్ళీ అదే ముతకబారు అబద్ధం ఫార్ములాల్ని వాడడానికి కారణం వాళ్లకు అంతకు మించి గతి లేకపోవడమే.

గత ప్రభుత్వ నిర్ణయాలపై పునరాలోచన చేయడం కచ్చితంగా అవసరమే. ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలు కింది నుంచి పై వరకు తమ తప్పులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ లొసుగులు మూసుకున్నారు. ఆ అవినీతి అంతా బయటకు రావాలంటే నాటి నిర్ణయాలు కొన్ని రద్దు చేయడమో లేక పునః సమీక్ష చేయడమో జరగాల్సిందే. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు ఇచ్చిన జిఓ ను జగన్ రద్దు చేయడం కూడా సంతోషమే.

ఇక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత ప్రభుత్వం ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయనగా యాభై కోట్ల పనులను రెండు మూడింతలు పెంచి తమ కోటరీ కాంట్రాక్టర్ల చేతికి అప్పగించింది. వాటిని కూడా మళ్లీ టెండర్లు వేసి మిగులు లెక్కలు చూపుతాను అంటున్నారు కొత్త ముఖ్యమంత్రి. అలా చేసినా యీ గడ్డు కాలంలో కొంతైనా బాగుంటుంది. ముఖ్యంగా కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును అప్పటి టీడీపీ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి మేమే కడతామని తీసుకోవడం కూడా తప్పుడు పనే. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టాలని తీర్మానం చేసింది కొత్త ప్రభుత్వం. మొత్తానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అస్తవ్యస్త పాలనకు భారత రాజకీయాలే ఇలానే ఉన్నాయని సరిపుచ్చలేము. కచ్చితంగా ఏ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం చేసినంత అద్వాన్నంగా  మాత్రం చేసుండరు. ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క నిర్ణయం లో కమీషన్ల వెల్లువ సాగింది. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్య తనదైన మార్కు రాజకీయాలు జగన్ కొనసాగిస్తాడో లేదో.

మంత్రి వర్గ కూర్పులో సోషల్ ఇంజనీరింగ్

కొత్త మంత్రి వర్గం ఏర్పాటులో జగన్ ప్రభుత్వం తీసుకున్న రాజకీయ కుల సమీకరణాలు అందరినీ సంతృప్తిపరిచేలా ఉన్నాయి. ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఏమిటని సీనియర్ రాజకీయ నాయకులు ఆశ్చరపోతున్నారు. పైగా కొందరు ఉప ముఖ్యమంత్రి అనేది పెద్దగా ప్రాధాన్యత లేని పదవి అంటున్నారు. కానీ గత ప్రభుత్వం ఇద్దరికీ ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి మరేవో పోర్ట్పోలియోలు కూడా ఇచ్చినట్టే జగన్ మోహన్ రెడ్డి కూడా అదే విధంగా చేయాలనుకునుంటారు. అయితే అక్కడ ఆ ప్రాధాన్యత లేని పదవికి కూడా పోటీ ఎదురవుతోంది. కనుక అందరినీ బుజ్జగించినట్టు ఉండేలా చూసుకున్నాడు. ముఖ్యమంత్రి పదవికి ఎలాగూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తనే కాబట్టి ఉపముఖ్యమంత్రులుగా కాపు , బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనార్టీలకు తలొక పదవి ఇచ్చాడు. దాంతో పాటు వేర్వేరు శాఖలు కూడా కలిపి ఇచ్చాడు. ఇక మంత్రిత్వ శాఖలైతే అస్సలు ఊహించని వ్యక్తులకే ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఏ మాత్రం అనుభవం లేని సభ్యులకు, ఆ శాఖల గురించి ఎటువంటి పదవులు నిర్వహించని వారికి ఇచ్చాడు. తన తండ్రి వైఎస్ తన ప్రభుత్వం లో కీలక మంత్రి పదవులు రెడ్లకే ఇచ్చాడనే అపవాదు ఉండేది. జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అధిగమించాడు.

ఇక వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందనేది బాగా గమనించాల్సిన అంశం. గత ప్రభుత్వం మాదిరే అభివృద్ధి కేంద్రీకరణ చేస్తారా లేక వికేంద్రీకరణ చేస్తారా అన్నది చూడాలి.

ఏదేమైనప్పటికి ప్రస్తుత భారత రాజకీయాల్లో నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పూర్తి వైవిధ్య భరితం. ఇది విజయవంతం కావాలని, కొనసాగాలని ఆశిద్దాం.

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

1 comment

  • Great c.m —that is his motto
    Looks like he is going to succeed ???
    ==================
    Buchi reddy gangula

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.