సహజ కథా, నాటక రచయిత ఎంటన్ చెఖోవ్

ఒక పట్టణంలోని ఓ ధనికుడి ఇంట్లో ఒక పల్లెటూరి కుర్రాడు పనికి కుదురుతాడు. ఆ యింట్లో యజమానురాలు పెట్టే కష్టాలను భరించలేక వర్ణిస్తూ  తన తాతకు ఉత్తరం రాస్తాడు. వచ్చి తీసుకుపొమ్మని అభ్యర్ధిస్తూ రాసిన ఉత్తరం పై తన తాత చిరునామాను సరిగా రాయలేకపోతాడు. తాత నుంచి సమాధానం కోసం చూస్తూ ఉండి పోయిన ఆ అమాయకుడి కథ మన అందరికీ గుర్తుండే ఉంటుంది. 

అలాంటి ఉద్వేగభరితమైన క్షణాలు, మానవ సంబంధాలు, సంఘర్షణలతో కూడిన మానవుడి ప్రతిస్పందనలు, సున్నితమైన హాస్యాన్ని కలగలిపిన కథలు రాయగల కథ, నాటక రచయిత ఏంటన్ పవ్లవిచ్ చెఖోవ్ (1860 – 1904). తల్లి నుంచి కథలు చెప్పడం లోని నేర్పరితనాన్ని నేర్చుకున్న చెఖోవ్  ధాన్య వర్తకం చేసే తండ్రి కాపట్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. చిన్నతనంలోనే మాస్కో చేరిన కుటుంబం తీవ్రమైన పేదరికాన్ని ఎదుర్కొంది. పాఠాలు చెప్తూ, పత్రికలకు హాస్య ఇతివృత్తాలను వ్రాస్తూ, వైద్య విద్య అభ్యసిస్తూ కుటుంబానికి డబ్బు పంపేవాడు. 

రష్యా లోని టోమ్స్క్ నగరంలో చెఖోవ్ జ్ఞాపిక

1884లో వైద్యునిగా జీవితం మొదలు పెట్టినా సాహిత్యవేత్తగా పలువురి దృష్టిని ఆకర్షించాడు. కథా రచయితగా, నాటకకర్తగా పేరుపొందాడు. వైద్యం చేయడం కోసం కార్మికులు, కర్షకుల, నిరుపేదల జీవితాలను మరింత క్షుణ్ణంగా దగ్గరగా చూశాడు. 1901లో ఓల్గా అనే నటిని వివాహమాడాడు. చిన్నతనం నుంచి క్షయవ్యాధితో పోరాడి 1904లో కన్నుమూశాడు. రెండు విభాగాలుగా  ప్రచురింపబడ్డ చెఖోవ్ కథల సంపుటి ప్రముఖ రచయిత టోల్ స్టాయ్ కి అత్యంత ప్రియమైనది. 

చెఖోవ్ తన కాలంలో అనేక మంది రచయితలను ప్రభావితం చేశాడు. చెర్రీ ఆర్చాడ్, అంకుల్ వాన్యా, ఇవనోవ్, త్రీ సిస్టర్స్ వంటి నాటకాలు నాటక రచయితగా  అతని ప్రతిభను చాటితే, 800కు పైగా వ్రాసిన కథలు జీవితం పట్ల లోతైన అవగాహనగల కథా రచయితగా అతని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి.  

చెఖోవ్ తన రచనల్లో ఎప్పుడు ఏ రాజకీయ దృక్పధాన్ని, వాదాన్ని ప్రదర్శించలేదు, సమర్ధించలేదు కూడా.  1881 నుంచి అనేక కథలను ప్రచురించినా చెఖోవ్ వ్రాసిన ‘స్టెప్పీ’ (1888) అనే కధ అతనికి ఖ్యాతిని, ధనాన్ని తెచ్చి పెట్టింది.  అతని ముందు తరం రచయితలు రష్యా ఆవిర్భావం గురించి, రాజకీయ సాంఘిక పరిణామాన్ని గురించి వ్రాస్తే చెఖోవ్ కేవలం మానవదేహాన్ని గురించిన విషయాలను, స్పందనలను, దోషాలను, కోరికలను, ఆత్మ విచికిత్సను  వాస్తవిక దృక్పథంతో వ్రాశాడు. 

చెఖోవ్ కథలలో అంతర్లీనమైన హాస్యంతో పాటు మానవ సమాజంలోని వివిధ వ్యవస్థలు, మారని మానవ  ప్రలోభాలు, లోపాలు, దృక్పధాలు, స్వార్థం, ప్రేమ, అసూయ – ఇలాంటివన్నీ అడుగడుగునా కనిపిస్తాయి. చెప్పదలుచుకున్న సందేశాన్ని సూటిగా చెప్పడం, సంభాషణలు వర్ణనల ద్వారా పాత్రల మనస్తత్వాన్ని అందించడం చెఖోవ్ శైలికి మరో ప్రతీక. 

‘డ్రంక్’ అనే కథలో ఫ్రోలోవ్ పాత్ర అతని సంభాషణల ద్వారానే అర్థమవుతుంది. ‘ఓవర్ డూయింగ్ ఇట్’ అనే కథలోనూ గ్లయాబ్ పాత్ర అతని ఆలోచనలు, పనుల ద్వారా మాత్రమె తెలుస్తుంది. సంక్లిష్టమైన పాత్రలను మలచడంలో చెఖోవ్ సిద్ధ హస్తుడు. ‘పజంట్ వైవ్స్’ అనే కధలో  గ్రామీణ నేపథ్యాన్ని, మూర్ఖత్వంతో స్త్రీలను పట్టించుకోని తనాన్ని, భార్యల పట్ల చూపే తృణీకృత భావాన్ని చూపిస్తాడు. ఆ విధంగా ఆ స్త్రీలు వారి భావావేశాలను సంతృప్తి పరచుకోడం కోసం సమాజం అంగీకరించని మార్గాలను ఎంచుకోవడం చూపుతాడు. కుష్కా అనే పిల్లవాడు యుద్ధసైనికుడైన తన తండ్రి లేనపుడు తన తల్లి అక్రమసంబంధం కారణంగా ఎలాటి మానసిక సంఘర్షణకు లోనౌతాడో చూపుతాడు. 

చెహావ్  కథలలో వివరణా స్వేచ్ఛ ఒక్కోసారి కథాంశాన్ని దాటిపోతుంది.  ‘వోలోద్య జూనియర్’, ‘వోలోద్య సీనియర్’, ‘ఇన్ ద నేటివ్ ల్యాండ్’  కధలలో స్త్రీలు అనుభవించే క్రూరమైన, దుఃఖభరితమైన జీవితాన్ని చిత్రీకరిస్తాడు. తన రచనలలో స్త్రీ పురుషుల సమానత్వాన్ని చూపుతాడు. స్త్రీలు విద్యను అభ్యసించడం ద్వారా తమ కష్టాలను దాటి తమ జీవితాలను మెరుగుపరుచుకోగలరని, తద్వారా తమ స్థితిని బాగుపరచుకోగలరని భావిస్తాడు.  సమాజాన్ని పునర్నిర్మించడం ద్వారా స్త్రీలకు కొత్త జీవితం లభిస్తుందని ఆశిస్తాడు. ‘డ బ్రైడ్’ అనే కథలో నాయకురాలు నాద్యా కొత్త తరం స్త్రీలకు ప్రతినిధిగా నిలిచి కుటుంబ, సమాజ నిబంధనలను అధిగమించాల్సిన అవసరం గురించి తెలియజేస్తుంది.

ఇదిలా ఉంటే ‘వార్డు నెంబర్ 6’,  ‘లేడి విద్ ద డాగ్’, ‘వాంకా’ వంటి కథలు తమ శైలితో, విభిన్నతతో చెఖోవ్ కు మంచి ఖ్యాతిని  తెచ్చిపెట్టాయి. ‘వార్డు నెంబర్ 6’ లో ఒక పిచ్చాసుపత్రిలో బంధింపబడిన రోగులు, మంచివాడైనా పిచ్చివాడిలా ముద్రింపబడి దానిలో తోయ బడిన గ్రోమేవ్ అనే పాత్ర, డాక్టర్ అనుభవించే అంతర్మథనం  – ఇవన్నీ మన సమాజంలోని మూర్ఖత్వాన్ని చూపిస్తాయి. ‘లేడీ విద్ ద లిటిల్ డాగ్’ కథలో ఒక వాస్తవ సంఘటన అందిస్తాడు. ఆన అనే గృహిణి అనే గోరోవ్ అనే వ్యక్తి ని కలుస్తుంది. అతను కూడా వివాహితుడే. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఆమె భర్త అనారోగ్యం పాలవడంతో ఆమె గోరోవ్ ను తాత్కాలికంగా వదిలి వెళ్తుంది. మరలా కొంత కాలానికి కలుస్తారు. వారు ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమను తెలియజేసుకుంటారు. కధ ఏమౌతుంది అనే విషయం మనకు చెప్పడు. సంభాషణ తోనే కధ ముగుస్తుంది. ఇలాటి అనిశ్చితిని తెలియచేసేదే మరో కధ ‘అ కోరస్ గాళ్’. వివాహ జీవితం లోని అనిశ్చితిని , అనుమానం, నిరాశలను  తెలియ చేస్తుంది.

చెఖోవ్ కథలు పాఠకులను  తరచూ తమ జీవితాల్లోకి తొంగి చూసేలా చేస్తాయి. కథల లోని పాత్రలు, సంభాషణలు పాత్రల అంతః స్వభావం చాలా లోతుగా ఉండే సరికి పాఠకుడు తన జీవితాన్ని కూడా తరచి చూస్తాడు. కధ విస్తృతి చాలా తక్కువ కనుక రచయిత పాత్రను సవిస్తారంగా చూపలేడు. అందుకే సందర్భం ద్వారా మాత్రమే పాత్ర మనస్తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు చెహోవ్.  అలాగే పాత్రల సంభాషణకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తాడు. నిబద్ధతతో పాత్రలను చిత్రీకరించడం చెహావ్ లోని మరొక గొప్ప కోణం.

నాటక రచయితగా చెహోవ్

చెఖోవ్  తన నాటకాలలో ఇతివృత్తాల కన్నా పాత్రలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. పాత్రలు వారి మనసుని బట్టి మాట్లాడటం, ప్రవర్తించడం చేస్తాయి. ఒంటరితనం, నిర్వేదంతో నిస్పృహతో ఉండే పాత్రల వల్ల ఏమీ జరగనట్లున్నా కానీ ఆ పాత్రల అంతర్గత సంఘర్షణ నాటకాన్ని పరిపుష్టం చేస్తుంది. చెఖోవ్ స్తానిస్లావిస్కీ నిర్మాణ శైలిని అభిమానించాడు. 1890 తర్వాత ‘ద సీగల్’, ‘అంకుల్ వాన్యా (1897)’, ’ద త్రీ సిస్టర్స్’(1901), చెర్రీ ఆర్చర్ద్’ (1904) నాటకాలను వ్రాసాడు. 

‘సీగల్’ నాటకం 1896 లో రచింపబడింది. కాన్స్టాంటిన్ అనే చాలా తీవ్రమైన ప్రతిస్పందనలు కలిగిన చాలా ఉత్సాహభరితమైన ఒక యువకుడు రచయిత కావాలనుకుంటాడు. ఎవరి మాట వినకుండా సాంప్రదాయకమైన పద్ధతిలో ఒక నాటకాన్ని రాసి ప్రదర్శించాలని అనుకుంటాడు. అది నిర్మాణంలోనూ, ఇతివృత్తంలోనూ కొత్తగా ఉంటుంది. దాన్ని అంకుల్ సోరిన్ ఎస్టేట్ లో ఒక పల్లె ప్రాంతంలో ప్రదర్శించాలని నిర్ణయిస్తాడు. నటీనటుల బృందంలో తన తల్లి అర్కడిన, ఆమె ప్రియుడు, ప్రముఖ రచయిత త్రిగోరిన్  ఉంటారు. అయితే వారిద్దరూ కాన్స్టాంటిన్ యొక్క రచనాశక్తిని సందేహించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ అతని ప్రతిభ పైన నమ్మకం కలిగిన ఒకే ఒక వ్యక్తి అతని వైద్యుడు. కాన్స్టాంటిన్ తన ప్రక్కనే ఉన్న భూస్వామి కూతురు నినా ని దానిలో ప్రముఖ పాత్రను ధరించమని చెప్తాడు. కాన్స్టాంటిన్ ఆమెను చాలా ప్రేమిస్తాడు కానీ తెలియజేయడు. మాషా అనే ఒక మేనేజర్ కూతురు కాన్స్టాంటిన్ ని ప్రేమిస్తుంది. అయితే ఆమె కూడా అతని పట్ల తన ప్రేమను తెలియచేయదు. నినా ఒక ప్రముఖ సెలబ్రిటీ కావాలని అనుకుంటుంది కానీ నిజమైన నటి కావాలని కోరుకోదు. ఇలాగా ఎవరి కోరికలతో వాళ్ళు ఉంటూ వారి కోరికలు తెలియచేయకుండా ఆనందాన్ని సాధిస్తారా అనే విషయం మీద ఈ నాటకం ఇతివృత్తం అంతా ఆధారపడి ఉంటుంది.

‘అంకుల్ వాన్యా’ జీవితంలోని చేడుతనాన్ని చూపుతుంది. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసాడు అంకుల్ వాన్యా. అతను ఆ ప్రొఫెసర్ కూతురును, ఎస్టేట్ ను కాపాడుతాడు. కానీ ఆ ప్రొఫెసర్ తన కూతురి వయసున్న ఒక యువతిని పెండ్లాడి ఎవరి మాటా వినకుండా ఆ ఎస్టేట్ ను అమ్మివేయాలని అనుకుంటాడు. తన త్యాగం వ్యర్ధమయిందని భావిస్తాడు అంకుల్ వాన్యా . కోపంతో అతనిని కాల్చి వేద్దామనుకుంటాడు. కానీ గురి తప్పుతుంది. ఇది ఆ సమస్యకు పరిష్కారం కాదు. పరిస్థితులు మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాయి. 

‘త్రీ సిస్టర్స్’ నాటకం ఒక ఉన్నత కుటుంబం యొక్క పతనం ముగ్గురు చెల్లెళ్ల పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది. తమ వంశపారంపర్యంగా వచ్చిన ఇంటిని సోదరుడికి, అతని భార్య నటాశాకు వదిలివేస్తారు. భవిష్యత్తుకై వేచి చూస్తారు.  మాస్కో నగరం తమ బాధలకు తమ సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుందని భావిస్తారు. అయితే వాళ్ళు అక్కడికీ చేరుకోలేరు, ఇక్కడ పల్లె లోనూ ఉండలేరు. 

‘చెర్రీ ఆర్చర్డ్’ రాచరిక వ్యవస్థ అంతాన్నీ, పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభాన్నీ చూపుతుంది. అప్పుల వాళ్ల బారి నుంచి బయటపడేందుకు ల్బుబోవ్ తన చెర్రీ తోటనమ్మాల్సి వస్తుంది. లుపకిన్ దాన్ని నరికి కొత్తగా కాటేజీలు నిర్మించి అమ్ముదామనుకుంటాడు. అందరూ దాన్ని అమ్మి పారిస్ కి వెళ్ళిపోతారు. దాన్ని కోల్పోవడం ఇష్టపడని ఫర్స్ తలుపులు మూసుకు గదిలో ఉండిపోతాడు. తోటను కొట్టివేస్తున్న గొడ్డళ్ళ మోతలు అంతా వ్యాపిస్తాయి.

చెహావ్ నాటకాలలో నేరుగా ఏ విషయాన్ని తెలియజేయకుండా సూచనల ద్వారా, సూక్ష్మాంశాల ద్వారా సూచిస్తాడు. అతని పాత్రలు పరస్పరం ఒకరికొకరు అర్థం చేసుకోకుండా అటూ ఇటుగా మాట్లాడుతుంటాయి. సుఖాంతాలు అతని నాటకాల్లో అసలే ఉండవు. నాటకం పూర్తయ్యేసరికి కూడా మార్పు ఏమీ జరగదు. తుది మొదళ్ళ మధ్య భేదం ఉండదు.  ఇలాంటి వాస్తవిక ఇతివృత్తాలు, నాటక నిర్మాణాల ద్వారా తదుపరి కాలానికి చెందిన నైరూప్య నాటకాలకు మార్గదర్శనం చేశాడు చెహోవ్.

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

1 comment

  • బావుంది. నాకిష్టమైన ‘చెరీ ఆర్చర్డ్’ ని ‘గద్యం పద్యం అంతా నాకే నైవేద్యం ‘ అన్న మహాకవి శ్రీశ్రీ ‘సంపెంగ తోట’ గా అనువదించాడు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.