సంప్రదాయ_అత్యాచారాలు

ఉత్తములూ, సంస్కారవంతులూ, పితృవాక్య పరిపాలకులూ అయిన మహానుభావుల గురించి మాట్లాడుకుందాం. పెళ్ళికి ముందు గానీ, తరువాత గానీ పెళ్ళితో సంబంధంలేని ఫిజికల్ రిలేషన్స్ విషయంలో “మాత్రం” కులాన్ని గానీ, మతాన్ని గానీ పట్టించుకోని విశాల హృదయుల గురించి మాట్లాడుకుందాం. మిగిలిన విషయాల్లో ఎన్ని వేషాలు వేసినా, వీరు పెళ్ళి మాత్రం సంప్రదాయబద్దంగా పేరెంట్స్ చెప్పినవారినే చేసుకుంటారు.  కొందరైతే “నేను కనీసం అమ్మాయిని చూడను కూడా లేదు. మా పేరెంట్స్ సెలెక్ట్ చేసిన అమ్మాయినే చేసుకున్నాను” అని గొప్పగా చెప్పుకుంటారు కూడా.

ఇంతకీ సదరు పేరెంట్స్ ఏఏ పారామీటర్స్  ఆధారంగా పిల్లని వెతుకుతారు అంటే, “అమ్మాయిది మా కులమేనా?”, “కులంలో మా సబ్ కేస్టేనా?”, “మా మతమేనా?, “మాకు సరితూగే ఆస్తి ఉందా?” “సొంత ఇల్లు ఉందా?”, “ఆ కుటుంబానికి ఊర్లో మంచి పేరు ఉందా?” “వారిది బోలెడుమంది చుట్టాలు ఉన్న పెద్ద కుటుంబమేనా?” మొదలైనవి చూస్తారు. ఇవన్నీ చూసి, పెళ్ళి చూపులకు వెళ్ళాక, ఆ అమ్మాయి పెళ్ళికొడుకు తల్లికి, తండ్రికి మాత్రమే కాకుండా మేనమామలకి, బాబాయిలకీ, అలాగే పెళ్ళిచూపులకి వచ్చిన ప్రతీ చుట్టం గొట్టంగాడికీ నచ్చిందా లేదా? చూసి, ఇవన్నీ ఓకే అయితే,  అప్పుడు అబ్బాయికి ఎంచుకునే అవకాశం ఇస్తారు. 

చాలా కులాల్లో సొంతకులంలో దొరికే సంబంధాలే తక్కువ. ఆ కొద్దిమందిలో కూడా ఇన్నిన్ని పారామీటర్స్ చూసి ఫిల్టర్ చేసేస్తే, ఇక ఎంచుకోవడానికి పెద్దగా చాయిస్సేమీ ఉండదు. ఒకరో, ఇద్దరో మిగులుతారు. తల్లిదండ్రులకి ఎదురు తిరిగి, వారి ఇష్టాలను వ్యతిరేకిస్తే, పెద్దలను గౌరవించే వ్రతం చెడిపోవడమే కాకుండా, వారసత్వంగా రావాల్సిన ఆస్తిపాస్తులు రాకపోవచ్చన్న భయం వల్ల, ఎవరో ఒకర్లే అని, పెద్దలు సెలెక్ట్ చేసిన వారినే పెళ్ళి చేసుకుంటూ ఉంటారీ పితృవాక్య పరిపాలకులు.

ఇంతకీ పెళ్ళి చేసుకొనే ఇద్దరి మధ్యా ఏముండాలి? ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గొప్ప ప్రేమా, అవగాహనా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. కానీ, అరేంజ్డ్ మ్యారేజెస్ విషయంలో ఇవన్నీ ఆశించడం అత్యాశే అవుతుంది కాబట్టి కనీసం ఒకరిపై ఒకరికి ఆకర్షణయినా ఉండాలి. అటువంటి ఆకర్షణ ఉన్నప్పుడు ఒకరికొకరు గొప్పగా కనిపిస్తారు. గొప్పగా కనిపించిన దేని పైనైనా గౌరవం కలగడం సహజం కాబట్టి, ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకుంటారు. ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తారు. ఏ ఆకర్షణా లేకుండా పెళ్ళి చేసుకున్నప్పుడు అవసరాల కోసం ఒకర్నొకరు వాడు(exploit)కుంటారు. 

మరి ఈ ఆకర్షణ ఎలా కలుగుతుంది?  జీవితంలో ఎన్నో వేలమంది పరిచయం అయితే, వేళ్ళపై లెక్కపెట్టగలిగినంత కొద్దిమంది మీద మాత్రమే ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ వెనుక కొన్ని వేల కారణాలు ఉంటాయి. ఉదాహరణకు చిన్నప్పుడు తొలినాళ్ళలో చూసిన వ్యక్తుల దగ్గర మనం సెక్యూర్ గా ఫీలయితే, అటువంటి ముఖాలు పెద్దయ్యాక కూడా నచ్చుతాయి. మొదట్లో చూసిన కొందరి వ్యక్తుల పట్ల భయం ఉంటే, అదే ఆకృతి ఉన్న ముఖాలు నచ్చవు.  అందుకే ఒకరికి ఆకర్షణీయంగా కనిపించిన వారు, ఇంకొకరికి డల్ గా కనిపిస్తారు. ఎవరు ఎవరికి ఎందుకు ఆకర్షణీయంగా కనిపిస్తారన్నది స్పష్టంగా చెప్పలేం.

అటువంటప్పుడు, కులం, శాఖ, మతం, ఆస్తి, చదువు, ఉద్యోగం etc etc ఇవన్నీ చూసి పెళ్ళి సెట్ చేసుకుంటే, అమ్మాయిపై అబ్బాయికీ, అబ్బాయిపై అమ్మాయికీ ఆకర్షణ ఉండటం చాలా రేర్. అయినా సరే, పెళ్ళి చేసుకొని, ఫిజికల్ గా కలవడానికి రెడీ అయిపోయారు అంటే, వాళ్ళ ఉద్దేశంలో ఆపొజిట్ జెండర్ అయితే చాలు. ఎవరితో అయినా శారీరకంగా కలవడానికి సిద్ధమైపోయే మానసిక స్థితికి చేరుకున్నారని అర్ధం. దీనినే అన్కండీషనల్ లస్ట్ (షరతులులేని కామం) అనుకోవచ్చు.  

మొదట్లో ఆకర్షణ లేకపోయినా, పెళ్ళి చేసుకున్నాక అనురాగం, అనుబంధం లాంటివి డెవలప్ అవుతాయని సినిమా డైలాగులు కొందరు చెబుతూ ఉంటారు. కానీ, వీళ్ళలో మెజారిటీ జనాలు తనకు మూడ్ వస్తే, ఆమెకు ఇష్టం ఉన్నా, లేకపోయినా, తనతో పడుకోవాల్సిందేనని ఆశిస్తారు. అది ఆమె బాధ్యతగా ఫీలవుతారు.  ఎవరైనా Marital rape ని కూడా రేప్ లాగే నేరంగా చూడాలని వాదిస్తే, “అలాంటప్పుడు పెళ్ళి చేసుకోవడం మానేయాలి” అంటారు. వీళ్ళ ఉద్దేశంలో పెళ్లికి అంగీకరించడమనేది, భర్త కోరుకుంటే ఇష్టం లేనప్పుడు కూడా సెక్స్ కి అంగీకరించినట్టే భావిస్తారు. పెళ్లి చేసుకున్న వ్యక్తుల మధ్య కూడా శారీరకంగా కలవడానికి mutual consent (పరస్పర అంగీకారం)  తప్పనిసరి అని వీరు అనుకోరు. అసలు మారిటల్ రేప్ ఒకటుందని కూడా గుర్తించరు. నచ్చకపోయినా తనతో పడుకోవడం మామూలేనని భావిస్తారు. పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా అది సహజమని భావిస్తారు. నో చెప్పొచ్చన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. నో అని చెప్పడం సరి కాదనీ, మగవారు అలా ఆశించడం వారి హక్కు అని కూడా ఆడవారు ట్యూన్ చేయబడ్డారు. 

ఇలా పెద్దల మాటలను, సాంప్రదాయాలనూ గౌరవిస్తూ సొంత భార్యలను రేప్ చేసే జనాలు లక్షల్లో ఉన్నప్పుడు, అవతలి వ్యక్తి అంగీకరించనప్పుడు, వారి అభిప్రాయానికి విలువ ఇచ్చి ఆగిపోవడమనే అలవాటు లేని జనాలు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు, అది కల్చర్ గా మారిపోతుంది.  మనం ఏం చేస్తూ ఉంటామో ఆ పనిని డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఇతరులు చేసినప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇటువంటి మైండ్ సెట్ తో ఉన్న పేరెంట్స్ పెంపకంలో ఉన్న పిల్లలపై కూడా దీని ప్రభావం పడుతుంది. లైంగిక జ్ఞానం లేని చిన్న పిల్లలకు ఇదెలా ట్రాన్స్ఫర్ అవుతుందని మీకు అనిపించవచ్చు. రేప్ లో సెక్స్ ప్రధానమైనది కాదు. రేప్ అంటే ఒకరి ఇష్టానికి వ్యతిరేకంగా ఫోర్స్ చేయడం . డామినేట్ చేయడం, బలవంతం చేయడం  మాత్రమే రేప్ ని డిఫైన్ చేస్తుంది. పిల్లలకు పేరెంట్స్ సెక్స్ లైఫ్ తెలియకపోవచ్చు గానీ అమ్మకు ఊరు వెళ్లాలని ఉన్నా నాన్నకు ఇష్టం లేకపోతే మానేయాల్సి రావడం, తనకు ఇష్టం లేకపోయినా నాన్న కోసం ఎవరెవరికో వండిపెట్టాల్సి రావడం, లేని నవ్వులు పులుముకొని నాన్న బంధువుల ముందు తనను తాను ప్రజెంట్ చేసుకోవాల్సి రావడం ఇవన్నీ పిల్లలు చూస్తారు. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఆకర్షణ, ఇష్టంలేకపోయినా, బలవంతంగానైనా అంటీముట్టనట్లు కలిసి ఉంటూ, రెండో వ్యక్తి కోసం తనకు నచ్చని పనులు కూడా చేయాలని పిల్లల మైండ్ లో ముద్రపడిపోతుంది. పిల్లలకు పెద్దలే రోల్ మోడల్స్ కాబట్టి, పెద్దయ్యాక వాళ్ళు డామినేట్ చేయడం, ఫోర్స్ చేయడం అలవాటు చేసుకుంటారు. 

ఈ ఫోర్స్ చేయడం ఓకే అనే మైండ్ సెట్ ఇలాగే ఉన్నంత కాలం, అవతలి వ్యక్తి NO అంటే NO అని, అక్కడితో ఆగిపోవాలనీ అర్థం చేసుకోనంత కాలం,  రేప్ గురించి సరైన చర్చను, మార్పును ఆశించడం కూడా అత్యాశే. ముందు సాంప్రదాయబద్దంగా వివాహం పేరుతో జరుగుతున్న రేపులను ఆపితే, ఎదుటి వ్యక్తి “నో” అంటే అక్కడితో ఆగిపోవడం అలవాటు అవుతుంది. అప్పుడే ఎవరు ఎవర్ని ఫోర్స్ చేసినా తప్పుగా గుర్తించగలరు. ప్రపంచంలో చాలా దేశాలు మారిటల్ రేప్ ని నేరంగా గుర్తిస్తున్నా, భారతదేశంలో ఇప్పటికీ మారిటల్ రేప్ ని నిలువరించే చట్టాలు లేవు. అటువంటి చట్టాలు వచ్చి, ఎవరు ఎవరిని లైంగికంగా ఫోర్స్ చేసినా నేరమేనని గుర్తించడం జరగనంత కాలం, ఈ సంస్కరణలు, కౌన్సెలింగులు పైపై పూతలుగా మాత్రమే మిగిలిపోతాయి

రాంబాబు తోట

4 comments

 • పెళ్లి తర్వాత కూడా ఆ ఇద్దరు వ్యక్తిత్వాలని బట్టి కూడా వారిలో ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగుతుంది కేవలం భార్య భర్తల్లా కాకుండా మంచి స్నేహితులు, ప్రియులు లాగా జీవితాన్ని కొనసాగించేవారు కూడా ఉంటారు

 • మీరు చెప్పిన అన్నింటికి తోడు అమ్మాయి, అబ్బాయి నక్షత్రాలు, రాశులూ కలవాలికూడా!

 • ఈ పోస్ట్ లోని విషయాన్ని అపరాధ భావంతోనో ఆత్మరక్షణ భావంతోనో కాక మామూలుగా చదవగలిగినపుడు ఇందులోని వాస్తవాలు అర్ధమవుతాయి.
  ఎంత గొప్ప గురువైనా ప్రశ్నలు రేకిత్తించగలడు గానీ సమాధానాలు ఇవ్వలేడు బయటనుండి వచ్చేది సమాచారమేగానీ సమాధానం కాదు.
  సమాజం ప్రగతి వైపు పయనించవచ్చుగానీ అది వ్యక్తి స్వీయ అవగాహనతో పోందగలిగిన వివేకం తో పోల్చితే అత్యల్పం!! ఎంత కష్టమైనా సత్యాన్నే స్వీకరించాలి గానీ ఆత్మవంచన కూడదు!!

 • చాలా నిజం ..
  ఇందులో ఎవరైనా తప్పులు ఎంచితే, అది వాళ్ళ గిల్టీ ఫీలింగ్.
  చాలా బాగా రాసారండి. ఇది చదివాక ఐనా ఎవరైనా మారితే బావుండు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.