రంగు రెక్కల గుర్రం

రోజూ ఇలాగే
ఇక్కడికే
ఎందుకో ఎక్కడికో తెలియకుండానే వచ్చేస్తున్నా
ఇది నిజమూ కాదనీ కలా కాదనీ
కల లాటి నిజమూ కాదనీ తెలుస్తూనే వుంది
నిజమైతే కూడా బాగుండని అనిపిస్తూనే వుంది

ఏదో తెలియని లోకం
రోజూ చూసే మనుషుల్లా లేని మనుషులు కనిపిస్తున్న లోకం
ఆకసాన్ని లాలిస్తున్న పచ్చని చెట్లూ
అమ్మ అక్కున నిలుపుకున్నట్లున్న వెచ్చటి నేలా
ప్రాణాన్నివ్వగలిగిన గాలీ
జీవధారై పారే స్వచ్ఛమైన నీరూ
ప్రేమను పంచే స్పర్శా కనిపిస్తున్న లోకం
కాలుష్యమింకా సోకని లోకం అనుకుంటా

నేను రోజూ చూసే
దాచుకున్న కుట్రల చీటీలు విప్పబోతూ
ఒంటికంటితో నవ్వే ముఖాలున్న లోకమైతే కాదిది
ఇక్కడ టక్కుటమారాలు చేస్తున్న యక్షులు లేరు
వదరుబోతులు లేరు
అరచేతి వైకుంఠాలు అసలే లేవు
ఎలా వచ్చానో తెలియదు
చల్లని నీడ నిచ్చే చెట్లకింద
అకారణ సంతోషంతో వెలిగే ముఖాలతో
ఈ అజ్ఞాత పాంథుడ్ని
చేతనా శిల్పాన్ని చేసి మరీ నివ్వెర పరుస్తున్న
అస్పష్టానంద అదృష్ట లోకమిది

ఈ అడ్డులేని  దారుల్లో తిరిగేందుకు
ఈ ప్రపంచాన వాలేందుకు ఎవరికైనా
ఒక రెక్కల గుర్రమే కావాలి
అవును రాకుమారినెత్తుకెళ్ళిన మాంత్రికుడి గుహకు
సాహసయోధుణ్ని తీసుకొచ్చిన
రెక్కల గుర్రం ఒకటి కావాలి

ప్రేమను ఆశను నవ్వును ఆప్యాయతను
ఒకో రంగురెక్కను చేసుకు రయ్యిన
ఎగిరే అలాటి రెక్కల గుర్రమే కావాలి
ఏలాటి కాలుష్యం లేని నగరం చేరాలంటే
ఇపుడు నీకూ నాకూ అందరికీ

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.