రష్యాలో నిరంకుశత్వం మీద
తిరుగుబాటు బావుటా ‘అనా అఖ్మతొవా’

“చీకటిలో అన్నిటినీ భయమే తాకుతుంది
వెన్నెలనీ గొడ్డలి వేటుకు లాగుతుంది
గోడ వెనుక ఓ దుశ్శకున శబ్దం:
దయ్యమో, దొంగో, ఎలుకో…”

లెనిన్ మరణం తర్వాత స్టాలిన్ పాలన రష్యా ప్రజలను భయాందోళనలో ముంచెత్తింది. ప్రజల బాధలకు, మరణానికి కారణమైంది. అతని దురహంకార అభివృద్ధి ప్రణాళిక అనేక లక్షలమందికి  మృత్యుశాసనమైంది. స్టాలిన్ ను ఎదిరించ గలవారు ఎవరూ లేకపోయారు. అలాటి నిరంకుశ రాజ్యం ఎవరికి భయపడుతుంది? దోపిడీ దొంగలకా? విప్లవవాదులకా? కవులకా? 

కవులు మాత్రమే దుష్ట రాజ్య వ్యవస్థను ప్రశ్నించ గలరు. నిల తీయగలరు. సోవియట్ దేశాన్ని పాలించిన నిరంకుశుడైన స్టాలిన్ను, అతని ప్రభుత్వాన్ని కంటికి నిద్ర లేకుండా చేసింది అనా అఖ్మతోవా(1899 – 1966). దేశద్రోహ నేరం కింద బహిష్కరించి పంపాలని చూసినా ఏ మూలకు పారిపోక రష్యన్ ప్రజల దీన గాధలకు, వారి అశ్రువులకు, వ్యధార్త గాధలకు సాక్షిగా నిలిచి తన కవితల ద్వారా న్యాయం కోసం నిలదీసింది.

1899 లో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన ఆమె కుటుంబ ప్రతిష్ట కోసం ఆమె ముత్తమ్మ పేరును కలం పేరుగా స్వీకరించింది. కీవ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని, పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని అభ్యసించింది. నికోలాయ్ నేక్రసోవ్, రాసిన్, అలెగ్జాండర్ పుష్కిన్, సింబాలిస్ట్ కవులవల్ల  ఉత్తేజితమై 11 వ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించి యుక్తవయస్సులోనే అనేక కవితలు ప్రచురించింది. 1903 లో పరిచయమైన నికోలావ్ గుమీల్యోవ్ ఆమెను మరింతగా కవిత్వం రాసేందుకు ప్రోత్సహించాడు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ వివాహం ఎంతో కాలం నిలువలేదు. ఆమెపట్ల అతనికి ఆకర్షణ తగ్గటం, ఆమె సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే  ఉండిపోవడం, అతను విస్తృతంగా దేశాలు పట్టి తిరగడం జరిగింది. మేధోపరమైన ఆలోచనలు, దృక్ఫథాలు ఆమెను అనేక మేధావులతో సన్నిహితంగా ఉండేలా చేశాయి. అనేకమంది మేధావులు ఆమె పట్ల ఆకర్షితులయ్యారు. 

1912 లో ఆమెకు లేవ్ గుమిలేవు జన్మించాడు. 1918 లో నికోలావ్ గుమీల్యోవ్ తో వివాహబంధం తెగిపోయింది. కానీ తర్వాత కూడా చాలాకాలం వారిరువురు స్నేహితులుగా ఉండిపోయారు. 1918 లోనే ఆమె వ్లాదిమిర్ ను పెండ్లాడి తీవ్రంగా పశ్చాత్తాప పడింది. బోల్షెవిక్ విప్లవం తరువాత పరిణామాలు ఆమె జీవితంలో పెను మార్పులు తెచ్చాయి. 1921 లో గుమిల్యోవ్ బోల్షవిక్ వ్యతిరేక కుట్రలో ఖైదు చేయబడి 61మంది ఇతర ఖైదీలతో కలిపి చంపబడ్డాడు.తర్వాత జరిగిన పరిణామాలు, ఆమె సన్నిహితుడు, కవి ఆసిప్ మెండల్స్టాం ఖైదు కావడం ఆమె జీవితాన్ని కుంగదీశాయి. తిండి లేక, డబ్బు లేక, తోటి వారందరూ హత్య గావింపబడుతుంటే తీవ్ర వ్యధననుభవించింది. 

సామాన్య ప్రజలు, వారి గొంతుకను ప్రతిధ్వనించే కవులు, నిరంకుశ రాజ్యంలో ఎలాంటి హింసకు గురి అవుతారో  తన కవితల్లో ప్రతిధ్వనించింది. ఆమె ఒక కవయిత్రిగా తన బాధ్యతను గుర్తు చేసుకుంది. 1933 లో ఆయన కుమారుడు ఖైదు గావింపబడడంతో అతని విడుదలకై ఎంతో ప్రయత్నించి 1938 లో స్టాలిన్ కు అతని విడుదలకై లేఖను రాసింది. అతనిని విడుదల చేయమనడం కోసం మనసును చంపుకొని స్టాలిన్ ప్రభుత్వానికి అనుకూలంగా 10 కవితలు వ్రాసింది. కానీ స్టాలిన్ కు ఆమె పట్ల, ఆమె కుమారుని పట్ల సానుభూతి కలగ లేదు. పైగా ఆమె కవిత్వాన్ని బహిష్కరించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఆ పది కవితలూ ఎక్కడా కనపడరాదని నిర్ణయం తీసుకుని స్టాలిన్ క్రూర దమనకాండను నిరసిస్తూ కవిత్వం రాసింది.

‘రిక్వీం’ అనే ప్రపంచ ప్రఖ్యాతి నార్జించిన కవితలో ఆమె వేదన, ఆమె విప్లవ కాంక్ష ద్యోతకమవుతాయి. ఆమె కదలికలపై, రచనలపై నిఘా ఉండడంతో ఆమె చిత్తు కాగితాలపై రాసిన కవితల్ని చదివి స్నేహితులతో పంచుకుని వారు నెమరువేసికుని ఇతరులతో పంచుకోవడం ద్వారా ప్రచారం చేసింది. తర్వాత ఏ ఆధారమూ లేకుండా వాటిని కాల్చివేసింది.

దేశం కోసం అసువులు బాసిన అమర వీరుల గురించి, తన కుమారుని వంటి వారి గురించిన  ఆవేదన గురించి ఈ కవితలు వర్ణిస్తాయి. అనేక కష్టాలకు నిలిచి ఆమె కవిగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. 1953 లో స్టాలిన్ మరణానంతరం 1958 లో ఆమె కవితలు ప్రచురింపబడ్డాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆమెను డాక్టరేట్ తో సత్కరించింది. స్టాలిన్ 12 వ వర్ధంతి నాడు 1966లో ఆమె కన్నుమూసింది.

కవయిత్రిగా, అనువాదకురాలిగా, విమర్శకురాలిగా పేరుపొందిన అఖ్మతోవా ‘ఈవినింగ్’(1912),’రోజరీ’ (1914), ‘వైట్ ఫ్లాక్’(1917), ‘ప్లాంటయిన్’ (1921), ‘రిక్వీం’ (1935 – 40) లను వ్రాసింది.  మొదటి నాలుగూ కవితా సంపుటాలు. చివరిది దీర్ఘ కవిత. ‘ఈవెనింగ్’ 1912 లో ప్రచురితమైంది. యిది ఆమెకు కొత్త పేరును తెచ్చింది. తాను వ్రాసిన 200 కవితలనుంచీ 35 కవితలనే ప్రచురించింది. 1914 లో ప్రచురింపబడిన ‘రోజరీ’ ఆమెను ప్రముఖ కవిగా సుస్థిర పరిచింది. ‘సోల్ ఆఫ్ ది సిల్వర్ ఏజ్’ అని పిలువ బడింది. 1917 లో వెలువడిన సంపుటి ‘వైట్ ఫ్లాక్’, కవయిత్రిగా మొజాయిక్ చిత్రకారుడైన బోరిస్ ఆన్రెప్ గురించి వ్రాసినవి. ఆమె విక్టర్ హ్యూగో , రవీంద్రనాథ్ టాగోర్ వంటి వారి రచనలు అనువదించి పుష్కిన్ , దొస్తవిస్కీ లపై విస్తృత కృషి చేసింది.

ఆఖ్మతోవ శైలి చాలా క్లుప్తత తో సాగుతుంది. పదాల ఎంపిక, అనుభూతుల వర్ణన, ఆమె ప్రత్యేకత. కవిత మొదట అర్థం కాకున్నా, అంతర్గతమైన అల్లిక అంతరార్ధాన్ని స్పష్టంగా తెలియ పరుస్తుంది. కవిత చదివేటప్పుడు ‘ఏముంది? అందరికీ తెలిసిన విషయమే! రోజూ వాడే పదాలే!’ అనిపించినా, అంతుచిక్కని భావమొకటి ఆ కవితను ప్రత్యేక పరుస్తుంది. కవిత్వం పట్ల, పదాల పట్ల ఎంపికలో లోతైన అవగాహన గలవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది, అర్ధమవుతుంది. 

‘ఒక ప్రేమికురాలి చివరి కలయిక’ అనే కవితను చూడండి:
అప్పుడు నిస్సహాయంగా నా హృదయం గడ్డ కట్టింది
కానీ నా అడుగులు తేలికగానే ఉన్నాయి
నా ఎడమ చేతితొడుగును కుడి చేతికి ధరించాను పొరపాటుగా’ –

ఈ కవితలో ఆమె ప్రేమికురాలి తత్తరపాటును, భారమైన మనసును సూచిస్తుంది. కవిత రాయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎక్కడా కనిపించదు. ఆమె తొలి సంకలనాన్ని చదివిన వారు, ఆమెను కేవలం ప్రేమ కవితలు మాత్రమే రాయగలదని భావించారు. సరళమైన పదాల ఎంపికతో ఆమె దైనందిన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఎక్కడా కృత్రిమత్వం కనపడదు. చిన్న గీతలతోను, విరుపుతోను, భావ పూరణను సూచించే చుక్కలతోను మాట్లాడుతున్నట్లుండే  శైలిని సృష్టిస్తుంది. భాషకు ఒక గొంతుకను ఇస్తుంది. తీవ్ర ఉద్వేగభరితమైన ప్రేమ కవిత్వం చదివిన బోరిస్ మికైలవిచ్ ఐకేన్ బాం ఆమెను ‘యోగిని-భోగిని’ అని వర్ణించాడు. దీన్ని అడ్డం పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీ అధికారులు ఆమె కవిత్వాన్ని ‘అనైతికమైనదని, ఆదర్శప్రాయమైనది ‘కాద’ని విమర్శించారు. అలా బహిష్కరణకు గురి కావడానికి ఆమె కవిత్వ శైలి ని అడ్డం పెట్టుకున్నారు. 

మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే సరికి  ఆమె కవిత్వం కొత్త గొంతుక ఏర్పరుచుకుంది. తన వ్యక్తిగతమైన బాధలు, ప్రేమ నుండి పౌరులకు సంబంధించిన, సమాజానికి, దేశానికి సంబంధించిన విషయాల వైపు తన దృష్టి మరల్చింది. తన కవిత్వ దృష్టిలో వచ్చిన మార్పును ఆమె స్నేహితునికి తెలియజేస్తూ “నా పెదవులు ఇక ముద్దాడవు / ఇప్పుడు భవిష్యత్తు నే చెప్తాయి” అంటుంది. ఆమె ఈ కఠిన పరిస్థితులను ఇంట్లో కూర్చుని ఊహించి వ్రాయలేదు. ప్రత్యక్షంగా చూసి అనుభవించి వ్రాసింది.

1917 ఫిబ్రవరిలో దేశమంతా జార్ కార్మికుల, వ్యాపారుల, ధనిక వర్గాలకు వ్యతిరేకంగా ఏకమైంది. ప్రభుత్వానికి పోటీగా మరో అధికారం ఏర్పడింది. యుద్ధం తీవ్రతరం దాల్చింది. సైనికులు విప్లవవాదులను కాల్చి చంపారు. దారుణమైన జీవనయోగ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. కరంటు లేదు. మురుగు పారుదల నిలిచిపోయింది. తిండి నీరు లేక కరువు. అందరూ రోగ గ్రస్తులయారు. కొందరు మిత్రులు కంటి ముందే రాలిపోయారు. ఇతరులు దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. 

ఫిబ్రవరి 25 న విప్లవం ముమ్మరమైన రోజు అఖ్మతోవా ఓ దర్జీ దగ్గరి నుంచి  నేవా నది అవతల వున్న ఇంటికి బయలుదేరి విఫలమైంది. ఆ నదిని చేరుకోవడం కూడా అత్యంత ప్రమాదమని తెలుసుకుని పెట్రోగ్రాడ్ నగరమంతా వంటరిగా తిరుగాడి ఆ దమనకాండకు విచలితురాలైంది. ఆ సన్నివేశాన్ని ఇలా వర్ణించింది: 

“రోజంతా ఆ గుంపు తీవ్ర వేదనతో మెలితిరిగి
తన మూలుగులతోనే భయ విహ్వలమైంది;
నది పైనంతా, దహన సంస్కారాల తోరణాలపై
భయానకమైన పుర్రెలు నవ్వుతున్నాయి;
వారు నా హృదయాన్ని నిలువునా చీల్చారని
నేనిలా పాడుతూ స్వప్నిస్తున్నాను,
తుపాకీ మోతల తర్వాత అంతా నిశ్శబ్దమైంది.
ఇళ్ళ ముంగిట మృత్యువు పహారా కాస్తోంది.”

సున్నితమైన భావాలను కవితలలో పొదిగిన ఆమె, తన చుట్టూ ఉన్న పరిస్థితులతో పాటు కఠినంగా మారింది. కానీ తన భాష లాలిత్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఆమె తోటి వారందరూ దేశం విడిచి పెడుతూ, ఆమెను కూడా వెళ్లిపొమ్మని చెప్తున్నా సరే, ఆమె తన దేశం ముఖ్యమని భావించి, దేశాన్ని విడిచి వెళ్తున్న వారి గురించి, తన కవితలలో ప్రస్తావించింది.

1922 లో ఆమె ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తిగా తన తోటి బాధితులకి ఐకమత్యాన్ని తెలుపుతూ –

“నేను మీ గొంతుకను, మీ శ్వాస వేడిమిని
మీ భవిష్య వ్యర్ధ పక్ష చలన ముఖ ప్రతిబింబాన్ని
ఏమైనా సరే తుది వరకూ నేను మీ తోనే”

తాను హృదయ విదారక స్థితిలో ఉన్నా సరే బహిష్కృతుల దుస్థితి చూసి జాలిపడింది. అనుక్షణం ఆమె ఇంటిపై దాడులు, సోదాలు, ఆమె కదలికలపై నిఘా ఆమె స్వేచ్ఛను హరించి ఆమె జీవితాన్ని దయనీయంగా మార్చాయి. 

కొత్త కవితలలో మరలిపోయిన తన స్నేహితుల గురించి, విప్లవ వీరుల గురించి, గత సంస్కృతిని గురించి, వ్యక్తిగతమైన సంతోషం గురించి రాసింది. విమర్శకులు ఆమె కవిత్వానికి కాలం చెల్లిందని భావించారు. ఆర్ధిక అభివృద్ధి కోసం  స్టాలిన్ ప్రవేశ పెట్టిన పొలాల ఏకీకరణ కరువు పరిస్థితులకు దారి తీసింది. వ్యతిరేకించిన చిన్న సన్నకారు రైతులు జైళ్లలో నెట్టబడి కిరాతకంగా చంపబడ్డారు. వీధులన్నీ ఒంటరిగా నెత్తురోడాయి. రహస్య పోలీసులు నిఘా వర్గాల మూలంగా దాదాపు 7,50,000 మంది అమానుషంగా చంపబడ్డారు. మయకొవిస్కీ, మరీనా స్వెతయేవా వంటి కవులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1925 లో సెర్గీ ఎసేనిన్ అనే కవి ఆత్మహత్య ఆమెను కలచివేసింది. అతనేమీ చెప్పుకోదగిన కవీ వ్యక్తీ కాదు. కానీ రష్యా తిరిగి కర్షకుల స్వర్గమౌతుందని భావించిన వ్యక్తి. ఇలా ఎందరో స్టాలిన్ మూలంగా అసువులు బాసారు. 1925 లోనే ఆమె ప్రచురణలు అధికారికంగా అణచివేశారు. 

1930 – 40 లలో ఆమె వ్రాసిన సుదీర్ఘ కవిత ‘రిక్వీం’ ఆమెలాటి సంక్షోభ  జీవితాన్ని గడిపిన వారికి అంకితం చేసింది. లెనిన్ గ్రాడ్ లో ఆమె కుమారుని బంధించిన జైలు ముందు నుంచుని ఆ కవితను ఊహించింది. ఆత్మక్షోభ ను, ప్రపంచ విధ్వంసం గురించి, విభిన్నమైన శైలితో, విభిన్నమైన పాదాలు గల చరణాలతో వ్రాసింది.

ముందే అనుకున్నట్లుగా ఆమె కవిత్వంలో జానపద గీత శైలి, విషాద గీతికల శైలి, భావ కవిత్వ శైలి అన్నీ కలగలిసి కనిపిస్తాయి. పురాణ కవుల శైలిని అనుకరిస్తూ ఒక దైవాన్నో , ఒక దేవతనో ఆవాహన చేసినట్లుగా మృత్యువును ఆవాహన చేస్తుంది. ఈ భీకర జీవితానుభవం కన్నా మృత్యువే మంచిదీ గొప్పదనే భావన తో ఇలా చెప్తుంది:

నువ్వెటూ వస్తావు- అయితే ఇప్పుడెందుకు రావు
నేను నీకోసం వేచి ఉన్నాను –
ఇక నేను ఇంకా నిలువలేను
దీపాన్ని ఆర్పి  తలుపు తీసి ఉంచాను
నిరాడంబరంగా అద్భుతంగా వచ్చే నీకోసం” –  అంటూ చెప్తుంది. 

అందుకే ‘రిక్వీం’ ఆమె కవితను గొంతుకగా పొదువుకుని అపూర్వంగా నిలిచిపోయింది. ఆమె కవిత్వం అంతా ఒక కవయిత్రిగా ఆమె కవితా లక్ష్యాన్ని, తన స్థానాన్ని గురించి చెప్పింది. కవిత్వ ప్రక్రియ పరమ పవిత్రమైనదని తెలియజేస్తుంది. కవిని శారీరకంగా మానసికంగా  రాజ్యం వేధించి, హింసించి, శాసించినా కవిత మాత్రం అన్ని దురాక్రమణలనూ అధిగమించి ప్రపంచానికి సత్యాన్ని చాటిచెప్తుంది అని తెలియచేసింది. వ్యక్తిగా కవయిత్రిగా తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కున్నా నిబ్బరంగా ఎదురీడి నిలిచిన ధీర అఖ్మతొవా.

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.