వెలుగు కోసం ఆరాటం!

సాల్వదార్ అల్లెండే

ప్రజల అభిమతం మేరకు ఎంపికైన చిలీ దేశపు మొట్టమొదటి మార్క్సిస్ట్ అధ్యక్షుడు సాల్వడోర్ అల్లెండే. 1970 లో పాపులర్ యూనిటీ అనే ప్రజాస్వామ్య కూటమి తరుపు అధినేత అయ్యాడు. కానీ, అపారమైన సహజ వనరులున్న చిలీలో అమెరికా కార్పొరేట్లకు  స్వప్రయోజనాలున్నాయి. అల్లెండే వారికి అడ్డుగా వున్నాడు. ఫలితం ఎప్పట్లా మామూలే. 1973 లో ఎన్నుకోబడిన సోషలిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిలీలో అమెరికా సి ఐ ఏ మద్దతుతో సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రెసిడెంట్ ప్యాలెస్ పై ఫైటర్ జెట్స్ తో  బాంబు దాడి చేశారు. అల్లెండే హత్య (ఆత్మ హత్య) తర్వాత మన యుగపు అతిక్రూర ఫాసిస్ట్ అయిన అగస్టో పినోచెట్ పాలన ఆరంభమైంది. అల్లెండే పట్ల సానుభూతి వున్న వేలాది మంది కమ్యూనిస్ట్ లను, కళాకారులను, రచయితలను హింసించారు. వారిని హత్య చేసి ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఒక దేశాన్ని “తన సొంత ప్రజల బాధ్యతారాహిత్యం కారణంగా కమ్యూనిస్టు దేశంగా మారడానికి అనుమతించలేమని” అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ చెప్పుకొచ్చాడు. అటువంటి సామ్రాజ్యవాద దీవెనతో ఆ లాటిన్ అమెరికా దేశాన్ని పినోచెట్ రైటిస్ట్ టెర్రర్ కేంద్రంగా మార్చి, క్రూరమైన హత్యలతో 1990 వరకు ఏళ్ల తరబడి అణచివేత సాగించాడు.  కొద్ది రోజుల ఉపశమనం, అభివృద్ధి తర్వాత నేడు నయా ఉదారవాద దశలోకి చేరింది చిలీ. కానీ ఆ హంతక యుగపు నెత్తుటి జ్ఞాపకాలను మరవనీయకుండా, మరువవద్దంటూ ఆ చరిత్రను తెరకెక్కించాడు ప్రఖ్యాత చిలీ దర్శకుడు ప్యాట్రిసియో గుజ్మాన్.

దర్శకుడు ప్యాట్రిసియో గుజ్మాన్:

గుజ్మాన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా (ది బాటిల్ ఆఫ్ చిలీ, 1975-79). కళ్ళెదుట జరుగుతున్న చరిత్రను, చిలీ వీధుల్లో నిల్చుని చిత్రీకరించాడు గుజ్మాన్.  ఈ సినిమా కోసం సినిమా బృందం భారీ మూల్యాన్ని చెల్లించింది. తనను చంపడానికి వచ్చిన వాడిని తనే ఫిల్మింగు చేశాడు ఈ సినిమా ఛాయాగ్రహకుడు లియోనార్డో హెన్రిచ్‌సెన్. అంటే తనను షూట్ చేస్తున్న వాడినే తను షూట్ చేశాడన్నమాట. ఈ సినిమాతో సంబంధం ఉన్న సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్  జార్జ్ ముల్లెర్ సిల్వాను పినోచెట్ ఉరితీశాడు. దర్శకుడు గుజ్మాన్ ప్రవాసానికి వెళిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. క్రిస్ మార్కర్ ఈ డాక్యుమెంటరీకి చెందిన 35 మి.మీ ఫిల్మును స్మగుల్ చేశాడు. ప్యాట్రిసియో గుజ్మాన్ తన వార్తాచిత్రాల పరంపరను తర్వాతి కాలంలో కూడా కొనసాగించాడు. చిలీ, అబ్స్టినేట్ మెమరీ (1997), ది పినోచెట్ కేస్  (2001), సాల్వడార్ అల్లెండే (2004) సినిమాలు పినోచెట్ తదనంతర కాలంలో వచ్చాయి. ఈ పరంపరలో  2010 లో వచ్చిన ఆణిముత్యం లాంటి డాక్యుమెంటరీ నోస్టాల్జియా ఫర్ ది లైట్ (వెలుగు కోసం ఆరాటం).

నోస్టాల్జియా ఫర్ ది లైట్:

ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? విశాల విశ్వంలో ఎక్కడ్నించో ఏనాడో బయల్దేరిన కాంతిని టెలిస్కోపుల్లో నింపుకుని బ్రహ్మాండ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తారు. కాంతి కోసం వారి ఆరాటం అపారమైనది. ఆ కాంతి అన్వేషణ కోసం ఎంతటి నిర్జన ప్రదేశానికైనా ప్రయాణమవుతారు ఖగోళవేత్తలు.

ఉత్తర చిలీలోని అటాకామా ఎడారి సముద్ర మట్టానికి 10,000 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో వుంది. ఇది నింగీ నేలా కలిసే చోటు. స్వర్గం, నరకం కలిసే చోటు కూడా. మన భూమిపై వున్న ఎత్తైన ఎడారి, అతి పొడిగా ఉండే ప్రదేశాలలో ఒకటి. అంతరిక్షం నుండి చూస్తే  మన గ్రహం మీద గోధుమ రంగు మచ్చలా కన్పిస్తుంది. దాని పొడిగా ఉన్న భాగాలలో ఇప్పటివరకూ వర్షపాతం నమోదు కాలేదు. తేమ లేమి వలన ఇక్కడ ప్రతిదీ సంరక్షించబడుతుంది. సుమారు 2,000 సంవత్సరాల క్రితం కొండరాళ్ళపై చెక్కబడ్డ కొలంబియన్ పూర్వపు పశుకాపరుల డ్రాయింగులు సైతం చెక్కుచెదరకుండా వున్నాయి. అత్యల్ప వాతావరణం, తక్కువ తేమ ఈ ఎడారిని ఖగోళ శాస్త్రవేత్తల ఆకర్షణ కేంద్రంగా మార్చింది.

అటకామాలోని ఎత్తైన ప్రదేశంలో వున్నా రేడియో టెలిస్కోప్ లోపలి భాగాన్ని చూపుతూ మొదలౌతుంది సినిమా. అందమైన చందమామ బొమ్మలతో, ఖగోళ వింతల అపురూప దృశ్యాలతో సినిమా సాగుతుంది. తనకు చిన్ననాటి నుండి ఖగోళ శాస్త్రం ఎంతిష్టమో నేపథ్యంలో చెబుతాడు దర్శకుడు. అటాకామా ఎడారిలో నడుస్తూ, ఇది మనం రాబోయే రోజుల్లో చూడబోయే అంగారక ఉపరితలాన్ని పోలివుందని చెబుతాడు. ఇక్కడ్నించి ఈ ఎడారి ఈ డాక్యుమెంటరీకి కేంద్రంగా మారుతుంది. ‘ఈ పొడి నేలలో ఎడారి చేపలు, మొలస్క్లు, ఇండియన్ల చిత్రాలు, మమ్మీలుగా మార్చబడిన మానవుల కళేబరాలు’ చెడిపోకుండా దాగున్నాయని చెబుతాడు.

‘ఖగోళ శాస్త్రవేత్తలు, భూతత్వవేత్తలు ఇరువురూ గతాన్ని శోధించే పనిలోనే వున్నారు. మేము ఆకాశంలోకి చూసి అన్వేషిస్తే, వారు నేలను తవ్వి అన్వేషిస్తున్నారు’  అంటూ చాలా తాత్వికంగా చెబుతాడు గ్యాస్పర్ గాలాజ్ అనే ఖగోళవేత్త. లౌతారో నీజ్ అనే పురావస్తు శాస్త్రవేత్త కూడా అటువంటి అభిప్రాయమే చెబుతాడు. ‘వర్తమానంలో దొరికే ఆనవాళ్లతో భూమి పుట్టుక చరిత్రను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు ఖగోళవేత్తలు. భూమిలో పాతుకుపోయిన భూమి చరిత్రను వెలికితీస్తున్నాము మేము’  అని చెబుతాడాయన. ఈ ఎడారిలో వున్న ఖనిజ సంపద కోసం స్థానిక ఇండియన్లను బానిసల్లా వాడుకున్నారు పంతొమ్మిదో శతాబ్ది సామ్రాజ్యవాదులు. వారి కడగండ్ల చరిత ఈ నేలలో వుంది. ఇది వందల ఏళ్ల మునుపటి చరిత్ర. కానీ నిన్న మొన్నటి నియంత్రుత్వపు చరిత్రతో ఈ ఎడారికి సంబంధమేమిటి అన్నది ఇకముందు చూస్తాం.

పినోచెట్ కాలం నాటి చాకాబుకో కాన్సంట్రేషన్ క్యాంప్ నుండి ప్రాణాలతో బయటపడిన లూయిస్ హెన్రాక్వెజ్ ను ఇంటర్వ్యూ చేస్తాడు దర్శకుడు. ‘ఈ క్యాంపులో ఖగోళ పరిశోధన చేసే ఖైదీలు వుండేవారటగా?’ అన్న ప్రశ్నకు  ‘డాక్టర్ అల్వారెజ్ ఖగోళశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నవాడు. అతడు 20 మంది బృందానికి పగటిపూట థియరీ చెప్పి రాత్రి పూట ఖగోళ పరిశోధన చేయమనేవాడు. నేనూ ఆ బృందంలో వాడినే. ఆకాశాన్ని పరిశీలించినపుడు ఎంతో స్వేచ్చగా వున్నట్టు అనిపించేది మాకు. నక్షత్రమండలాల నమూనాలు గీయడం కూడా నేర్చుకున్నాము. కానీ ఖైదీలు నక్షత్రరాశుల పటాలతో క్యాంపు నుంచి తప్పించుకోగలరని సైనికులు ఈ పాఠాలను నిషేధించారు’ అని చెబుతాడతడు. మిగ్యుల్ లానర్ అనే ఖైదీ అద్భుతమైన ‘వాస్తుశిల్పి’ అని చెప్పక తప్పదు. తను సందర్శించిన క్యాంపులను అడుగుజాడలతో కొలిచి క్యాంపుల నమూనాలను వేయగల నిపుణుడు. గుర్తుపెట్టుకుని జ్ఞాపకాలను మోసుకుపోగల వ్యక్తి ఇతడైతే, అల్జీమర్స్ వ్యాధితో వున్న అతడి భార్య అనిత గతాన్ని మర్చిపోతూ వుంది. వీరిద్దరూ చిలీకి ఒక రూపకంలా కన్పిస్తున్నారంటాడు దర్శకుడు.

విక్టోరియా, వియోలెటా అనే ఇద్దరు వృద్ధురాళ్లు మనకు ఎదురౌతారు. పినోచెట్ మిలిటరీ జంటా ఎత్తుకు పోయిన తమ ప్రియజనుల అవశేషాల కోసం ఎడారిలో తవ్వకాలు చేస్తూ వెదుకుతూ జీవితంలో ఎక్కువ భాగం గడిపారు వీరు. విక్టోరియాకు తన భర్త పాదం అతను వేసుకున్న షూతో పాటు దొరుకుతుంది. అది ఆమెకు కొంత ఊరట. ‘నా తమ్ముడి నోటి ఎముక ముక్క దొరికింది. కానీ దాంతో ఎందుకు సర్దుకుంటాను? వారు నా సోదరున్ని సంపూర్ణంగా ఎత్తుకు పోయారు. వాడి శరీరం నాకు సంపూర్ణంగా దొరకాలి. నేను చనిపోడానికి ముందురోజు దొరికినా పర్వాలేదు’ అని చెబుతుంది వియోలెటా. ‘ఆ టెలిస్కోపులు నేలను శోధించగలిగితే ఎంత బావుణ్ణు. ఈ ఎడారి అంతా గాలించి మావారి జాడ చెప్పేస్తేనో! మా అన్వేషణ సులువయ్యేది కదా?’ అని వాపోతుంది. ఈ స్త్రీలను సినిమా ఆఖర్లో అబ్సర్వేటరీకి తీసుకువెళ్ళి టెలీస్కోప్ చూపిస్తాడు దర్శకుడు.  

వాలెంటినా రోడ్రిగెజ్ పసిపిల్లగా వుండగా ఆమె తల్లిదండ్రులను మిలటరీ వారు ఎత్తుకుపోయారు. ఆమెకు  ఏ లోటూ లేకుండా తాత, నాన్నమ్మలు పెంచారు. బాధను మరిపించడానికి ఆమెకు ఖగోళశాస్త్రంలో ఆసక్తి కల్పించారు. మిస్సింగు తల్లితండ్రుల బిడ్డననే బాధ మహా విశ్వదర్శనంలో పోతుంది అని ఆమె చెబుతుంది. ‘ఆది, అంతం లేని క్రమంలోని బిందువులే కదా మా అమ్మా, నాన్నా అనుకుని సర్దుకుంటాను’ అని చెబుతుంది. జ్ఞాపకాల విలువను ధృవీకరిస్తూ డాక్యుమెంటరీని ముగిస్తాడు దర్షకుడు. “జ్ఞాపకాలు మిగుల్చుకున్నవారు ప్రస్తుత క్షణాలలో కొంతైనా జీవించగలుగుతారు. అది అసలు లేని వారు ఎక్కడా జీవించలేరు ” అని చెబుతాడు దర్శకుడు.

ప్యాట్రిసియో గుజ్మాన్  డాక్యుమెంటరీ ఖగోళ, భూగోళ పరిశోధనలనూ, సైన్సు, చరిత్ర పరిశోధనలనూ మేళవించి వీటితో చిలీ మహిళలు తమ ప్రియజనుల కళేబరాల కోసం చేస్తున్న అన్వేషణను జతపరిచింది. విశ్వాన్వేషణ, చరిత్ర అవగాహనకు సంబంధించిన తాత్వికమైన చర్చ లేవనెత్తుతుంది. ఎడారిని శోధించే మహిళలు కాల్షియంను ఎముకల రూపంలో చూస్తుండగా, ఖగోళ శాస్త్రవేత్తలు కాల్షియంను నక్షత్రాల అవశేషంగా, బిగ్ బ్యాంగ్ ఆధారంగా చూస్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు, పురావస్తువేత్తలు, బాధిత మహిళలు ఒకే ప్రయాణంలో ఉన్నారనీ, అంతా మూలాల కోసం శోధనే అని చెబుతాడు దర్శకుడు. మనిషి, జీవితం, చరిత్ర, విజ్ఞానం వంటి ఎన్నో అంశాలపై మన మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ సినిమా చూస్తున్నపుడు మిస్సింగ్ మనవలూ, మనవరాళ్ళ కోసం అమ్మమ్మలు, నాన్నమ్మలు చేసే పోరాటాన్ని చూపే ‘అబూఎలాస్’ అనే అఘు చిత్రం గుర్తొస్తుంది.

దృశ్యాలు ట్రాన్సిట్ అవుతున్నపుడు కాస్మిక్ డస్ట్ తోనే మనమంతా తయారయ్యాము అనేలా చిత్రీకరణ వుంటుంది. చిన్ననాటి తన గోళీకాయల్లో కూడా యూనివర్స్ ను చొప్పించి చూపే ఫోటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్. అంతే చక్కని సంగీతం కూడా. ఈ సినిమా యూరోపియన్ ఫిలిం అవార్డు, షెఫీల్డ్ డాక్యుమెంటరీ ఫెస్టివల్ అవార్డు, అబూ ధాబీ డాక్యుమెంటరీ అవార్డులతో ఇంకెన్నో అవార్డులు, విమర్శకుల ప్రశంసలు పొందింది.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.