కవిత కొమ్మకు పట్టిన తేనెతుట్టె

ఆగస్టు 1 కవి ప్రసాదమూర్తి అరవయ్యో జన్మదినం. ఈ రోజు ఆయన పుస్తకాలు మూడింటిని ఆవిష్కరిస్తున్నారు. ఈ ద్విగుణీకృతోత్సవంలో మా సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం… ఎడిటర్.

మనం ఒక లోలకం మధ్యలో వున్నాం. రెండు కక్ష్యల లోలక లోకాల మధ్య వూగుతూ వున్నాం. ఒకటి ప్రకృతి సృష్టించిన పాంచభౌతిక లోకం. రెండవది ప్రసాదమూర్తి నిర్మించిన కవనలోకం.  మొదటిది ప్రాకృతిక లోకం, ముడి ఇనుములాంటి ముడి లోకం. కర్కశ, కఠినలోకం. రెండవది – అదే ముడిలోకాన్ని పుఠంవేసి, మెరుగుపెట్టి, మనస్వినీ పరిమళం అద్ది మనకు యిచ్చిన లోకం.

ప్రసాదమూర్తి, ప్రత్యక్షంగా ఏ వాదానికీ చెందినవాడుగా కనిపించడు. పరోక్షంగా మాత్రం అన్ని వాదాలకూ చెందినవాడు. ముఖ్యంగా అన్నిటికీ మించి మానవత్వం పొంగిపొర్లే రసవాది. అతనికి బంగారం చెయ్యడం వచ్చు. ఒక ఇనుప ముక్కను యిచ్చి చూడు, బంగారమై వస్తుంది. అది కాకి బంగారం కాదు. మేలిమి బంగారం. అనుభవం గీటురాయి మీద గీసి చూడు.

అంతేకాదు, అతని దృష్టికి – ఏ సంఘటనో, ఏ దృశ్యమో, ఏ విషయమో, ఏది వచ్చినా కవిత్వమై పోతుంది. అతను గాఢమైన స్పందనల కవి. చెట్టుమీద చిటారు కొమ్మన లేలేత ఆకులు, చిరుగాలికి, వానచినుక్కి జలదరించినట్లు స్పందిస్తాడు.

అంతమాత్రం చేత లలిత లలితమైన సుతిమెత్తని కవి అనుకోడానికి లేదు. అదే చెట్టుకి పట్టిన తేనెతుట్టెపై గల తుమ్మెదలు ఝమ్మంటూ నీ మనసులోకి ప్రవేశించి మధురంగా కుట్టగల కవితలు రాయగల కవి.

అద్భుతమైన విషయం ఏమిటంటే, అతనివి జీవితంపై ఆశావహ దృక్పథం కలిగించే కవిత్వాలు. ఎవరైనా ఆత్మహత్య చేసకుందామని సముద్రం దగ్గరకో, కొండకొన మీదకో, రైలు పట్టాల మధ్యకో వెళ్ళేవాళ్ళకి అతని కవిత్వాలు వినిపించండి, జీవనోత్సాహంతో జీవితంలోకి తిరిగివస్తారు.

మోహకవితా ప్రసాదమూర్తి మనకెన్నో అతని అమూల్య పుస్తకాలిచ్చాడు, అనడం కంటే, ఎన్నో ప్రపంచాలు మనకిచ్చాడు. మనిషి, పశువు, వస్తువు యిలా దేనికదే ఒక ప్రపంచం.

ఆ పుస్తకాల్లో, కాలుష్యం లేని ప్రదేశంలో – ఆడుకుంటున్న పిల్లలు, అప్పుడే వికసిస్తున్న పువ్వులు, ఇంద్రధనుస్సులు, ఉదయాస్తమయాలు, రుతు సంగీతాలు, పక్షులు, ప్రజలు, హృదయ స్పందనల సౌరభాలు, గేదెలు, వరిపొలాలు, ఆత్మలు, అడవులు, వేటగాళ్ళు, ఆయుధాల గిడ్డంగులు, తాటిచెట్లు, కల్లుముంతలు, సంతలు, సరస్సులు, కొర్రమట్ట, కోడి, కోడిగుడ్డు, మట్టగిడసలు, కాలువ బురదలు, గోళీకాయలు, చింతచిగురు, ఏటమాంసం, పరజపిట్టలు, కొల్లేరు గుండెచప్పుళ్ళు, మెట్లు, లోయలు, రెక్కలు, తలుపులు, కిటికీలు, కాలవలమీద, నదుల మీద ఒంటరి పడవలు, దుఃఖపు పాటలు, నెలవంకలు, జలపాతాలు, వలలు, ఇసుక మాఫియాలు, వరద, కాంట్రాక్టులు, కత్తులు, కత్తి పడవలు, తామరతూడులు, వానలు, స్నేహాలు, తప్పిపోయిన నదులు, గ్రహాంతర వాసులు, నరకాలు, స్వర్గాలు, యివి ఉదాహరణకు కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో అంశాలను అతను సందర్భానుసారం స్పృశించాడు.

అన్నిటికీ మించి అతనిచ్చిన ప్రాముఖ్యం స్నేహానికి. అదొక విలువ, అదొక ప్రాణం. దాని విస్తీర్ణం ఆకాశమంత. కాల ప్రవాహంలో పరిణామ సందర్భంగా గమనించవలసిన అతిముఖ్యమైన విషయం ఒకటుంది.

ప్రతితరం కవులు – కొత్త భాష, కొత్త కవిసమయాలు, కొత్త కవితా సామగ్రి, కొత్త అభివ్యక్తి తమ వెంట తెచ్చుకుంటారు. అది ఉద్యమాల వల్ల కావచ్చు, కొత్త సందర్భం కావచ్చు, కొత్త ప్రభావాల వల్ల కావచ్చు, కొత్త సంఘర్షణల వల్ల కావచ్చు, ఏదయినా తత్తుల్యమైనది కావచ్చు. కళా, సాంస్కృతిక వేదిక మీద రంగం మారుతుంది. దృశ్యం మారుతుంది. ఈనాటి, ఆధునిక కాలం, చాలా వేగవంతమైంది. కాలజీవనశక్తిలో ఈనాడు వేగం కూడా ఒక మూలాంశం.

గత పారిశ్రామిక విప్లవ ప్రభావం తరువాత వచ్చిన సాంకేతిక పరిజ్ఞాన విప్లవం వల్ల తాత్త్వికం, మనస్తత్వం వంటి శాస్త్రాలు మనిషి ఆలోచనా పరిధిని పెంచాయి. నేటి కవికి చాలా కొత్త విషయాలు తెలుసు. కొత్త అనుభవాలు సమీపానికి రావడం తెలుసు. గత కాలపు కవులకు భౌతిక, అధిభౌతిక ప్రపంచాలు మాత్రమే తెలుసు. నేటి కవికి ఆ రెంటి కంటే మించి మరెన్నో మానసిక ప్రపంచాలు తెలుసు. దానివల్ల వారు ఒకే విషయాన్ని ఎన్నో కోణాల్నుండి, ఒకే సమయంలో చెప్పగలరు.

ఈ తాత్త్విక దృష్టితో చూసినప్పుడు – ప్రసాదమూర్తి నేటి కవి. ఆధునిక కవి. అభివ్యక్తిలో బహుపార్శ్వాలను కలిగిన కవి. క్లుప్తంగా చెప్పాలంటే – బహుళ కవి.

మనదేశంలో ఆధునిక కాలంలో- కవిత్వం, చిత్రకళ, నాటక, సినీరంగాల కళలు దగ్గర దగ్గరగా మసులుతూ వుంటాయి గాని, ఆ రంగాల మధ్య ప్రభావిత సమన్వయం లేదు. ఒకదానికి మరొకదానికి సంబంధం లేదు. సృజనాత్మకంగా ప్రభావ, ప్రోత్సాహం లేదు. దానిని లక్ష్యంగా పెట్టుకుని సాధించడానికి ప్రయత్నించేవారు లేరు. ఈ అంశాన్ని యిక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఒకప్పుడు పారిస్ లో ఫ్రెంచ్ కవులు, రచయితలు, ఆర్టిస్టులు, సినీ, నాటక దర్శకులు కలిసి మెలిసి తిరిగేవారు. వారి భావాలను పంచుకునేవారు. చర్చించుకునేవారు. ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి ఒకరికొకరు ప్రేరణగా వుండేవారు. అందువల్ల, ముఖ్యంగా, కవిత్వంలో చిత్రకళా రంగంలో, నాటక, సినీ రంగాల్లో వారి నూత్న నిర్మాణాల వల్ల కొత్త కళావాదాలు (isms) ప్రపంచాన్నే మార్చాయి. భారతదేశంలో యీ సంప్రదాయం ఏర్పడలేదు. ఇదొక సాంస్కృతిక విషాదం. దీనిక్కారణం – ప్రభుత్వాల్లోని పాలకులు, చాలా మంది ప్రజలు, వారి ఆలోచనా సరళి గతంలోనే బతుకతూ వుంటుంది. గతంలోని అన్ని అంశాలూ వారికి ఆకర్షణీయంగా వుంటాయి. వర్తమానంలోకి రావడానికి నిరాకరిస్తారు. అందువల్ల యిక్కడ ’భవిష్యత్తు‘ అనేదే వుండదు.

పారిస్ కళా జీవనం గురించి ప్రస్తావించడానిక్కారణం, ప్రసాదమూర్తి కవిత్వాల్లోని మూడు లక్షణాలను గురించి చెప్పడానికి.

ఒకటి – అతని కవిత్వాల్లో పెయింటింగ్స్, తైలవర్ణ చిత్రాలున్నాయి. చిత్రకళ, దృశ్యరూపంలో మన ముందుకు వస్తుంది. అనేక తైలవర్ణ చిత్రాలున్నాయి. ప్రకృతిని, మానవ ప్రకృతిని మేళవించిన దృశ్యాలు చిత్రకళారూపంలో, మనోహరమైన, రంగురంగుల హొయలతో మన ముందు ప్రత్యక్షమవుతాయి.

రెండవది – ’కాలువ సంబరంలో మా వూరు‘, ’గుండెకొల్లేరు‘, ’బుష్ మళ్ళీ రావొద్దు‘, ’రోడ్డ మీద పికాసో, ’బొమ్మల గోడలు‘ – యీ కవితలు డాక్యుమెంటరీలుగా (లఘుచిత్రాలు) కనబడుతున్నాయి. ఇవి, భావనల, శాబ్దికమైన కవిత్వాలు మాత్రమే కాదు. మనల్ని – ఆ ప్రాంతాలకు, ఆ రుతువుల్లోకి, ఆ సందర్భాల్లోకి ఆ జనాల్లోకి, అక్కడి ప్రకృతిలోకి తీసికెడతాయి. కొన్ని గుండెల్ని పిండేస్తాయి. వీటిని డాక్యుమెంటరీలుగా తియ్యవచ్చు. తియ్యకపోయినా, ఆ డాక్యుకోణం నుంచి చూస్తే, ఆ దృశ్యాలు మనని ఎన్నటికీ మరవనివ్వవు. అవి సజీవ చిత్రాలు, అనుభవాలు.

మూడోది – వీధినాటకం, ఆధునిక వీధి నాటకం  మనకు రెండు రకాల నాటక విధానాలున్నాయి. మొదటిది – వీధినాటకం, సంప్రదాయ నాటకం. రంగస్థలం ఉంటుంది. కథ ఏదైనా, అనేక పాత్రలుంటాయి. ఒకే నటుడు ఒకే పాత్రను పోషిస్తాడు. ఆహార్యం వుంటుంది, పాత్రోచితంగా వుంటుంది. రెండవది – ఆధునిక వీధినాటకం (Street play) దీని టెక్నిక్, పూర్తిగా కొత్తది. మన వూహలకు అందనిది. ఇందులోని కథ ఏదయినా కావొచ్చు. ప్రధానంగా సందేశాత్మకంగా వుంటంది. సామాజికం, రాజకీయం నేపథ్యగా ఉంటుంది.

ఆధునిక వీధినాటకానికి ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు, వేదిక అక్కర్లేదు. రోడ్డుమీదో, నాలుగు రోడ్ల కూడలిలోనో, ఎక్కడయినా, ఏ సమయంలో నైనా యీ నాటకాన్ని వెయ్యవచ్చును. అనేక పాత్రలుంటాయి. నటుడు ఒకే పాత్రకు పరిమితం కాడు. తెరలు వుండవు. అనేక పాత్రల్లోకి మారిపోయి, ఆయా పాత్రలను నిర్వహిస్తాడు. ఆహార్యం – ఆ పాత్రకు తగినదిగా వుండదు. ఆ నటుడు రోజూ వేసుకునే దుస్తులే వేసుకుని వుంటాడు. నాటకంలో కూడా. అతను పురుషుడవుతాడు, స్త్రీ అవుతాడు, ఆవు అవుతాడు. మరో జంతువు అవుతాడు. జడ్జీ అవుతాడు, ముద్దాయి అవుతాడు. ఇలా నటి కూడా. ఏ పాత్రలోకి అయినా పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. ఇది మిమిక్రీ అస్సలు కాదు.

అంటే – యీ నాటకంలోని గొప్పదనం, ప్రేక్షకుడు నటుణ్ణి గాక, నటుడు ధరించిన పాత్రలను చూసే పద్ధతి. నటుడు ఒకేసారి ఎన్నో పాత్రలను పోషిస్తాడు. స్థలం, సమయం, సందర్భం, ఆహార్యం  ఇవేమీ ప్రేక్షకుడికి అడ్డురావు. నటుడిలోని పాత్రను మాత్రమే చూసే విధానం. ఇదేమీ మాయాజాలం కాదు. ప్రేక్షకుడి మనస్సుని పాత్రోచితం చేయడమే. ఇదొక అద్భుతం.

ప్రసాదమూర్తి కవిత్వంలో అక్కడక్కడా ’వీధినాటకం‘ టెక్నిక్ కూడా కనబడుతుంది.  ఇది కావాలని చేసిందికాదు, సహజంగా వచ్చినదే. అవే పూలు, అవే అడవులు, అవే నదులు, ఆడుకుంటున్న పిల్లలు, అవే ఎగిరెగిరే చేపలు, వస్తువేదయినా, విషయం ఏదైనా, సందర్భానుసారం, వాటి లక్షణాలను దాటి అవి ప్రవర్తిస్తాయి. ఇదే ఆధునిక వీధినాటకం టెక్నిక్.

కొన్ని కవితా వాక్యాలు –

దయచేసి పిల్లల్ని కొట్టొద్దు
పువ్వులు బాధపడతాయి‘‘

అన్నప్పుడు

హృదయంలో ముల్లు గుచ్చుకుంటుంది.

అలాగే

పిల్లలు అనాధలైతే
ప్రపంచమూ అనాథే‘‘

అన్నప్పుడు

మనసు అల్లకల్లోలమవుతుంది.

ఆ పదాలు మామూలుగా చెబుతున్నట్లు అనిపించినా, అర్థమైతే, రాత్రులు – నిద్రలేని రాత్రులవుతాయి.

ఇలా ఎన్ని వాక్యాలో, ఎన్ని శీర్షికలో, ఎన్ని బాధార్ణవాలో. బహుశా ప్రసాదమూర్తి మనకందించిన ప్రతిపుస్తకమూ, ఒక చెట్టు కొమ్మలకు పట్టిన తేనె తుట్టెలు. వాటిని కదిపితే తుమ్మెదలు కుడతాయి కదా, మరి మధువును కూడా యిస్తాయి కదా..  

సరేనా..!

నగ్నముని

1 comment

  • గుడ్ రివ్యూ సర్ … కంగ్రాట్యులేషన్స్

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.