ఆమె చూసింది

పది నిమిషాలయినా కాలేదు, చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి బాల్కనీ లోకి వెళ్లి నిల్చున్నా. హాస్టల్ రెండో ఫ్లోర్లో ఉన్న నా రూమ్ నుండి కిందకి చూస్తే వార్డెన్ రూమ్, ఎదురుగా నీలగిరి చెట్లూ, వాటి సందుల్లోంచి చూస్తే చాలా దూరంలో మనిషెత్తైనా లేవన్నట్టు కొండలూ కనిపిస్తున్నాయి. ఇంకో రెండు గంటల్లో అస్తమించబోయే సూర్యుని చుట్టూ మేఘాలు కమ్ముతున్నాయ్. ఆ కమ్ముకుంటున్న మేఘాల్లో ఒక మనిషి మొహం ఏర్పడింది. బాగా తెలిసిన ఒక అమ్మాయి మొహం. 

మొదటి సారి చూసినప్పుడే నన్ను చూపు తిప్పుకోలేకుండా చేసింది. ఆ కళ్ళు తనవే. నన్నే చూస్తోంది. అది చూస్తూ దీర్ఘాలోచనలో పడుతున్న నాలో ఒక గొంతు మొదలైంది.

‘మనం ఎవరినైనా ఎక్కువగా తల్చుకుంటే, అది వాళ్ళకి తెలుస్తుందా? తల్చుకోవడం పక్కన పెడితే, ఎవరినైనా చాటుగా దూరం నుండి చూస్తే వాళ్ళకేమైనా అనిపిస్తుందా? ఏదో సినిమాలో “చూపులు వీపుకి గుచ్చుకున్నట్టు” లాగ.’

‘…ఖచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే ఎక్కడో లాస్ట్ బెంచ్ నుండి చూస్తే, ఫస్ట్ బెంచ్లో నాకు డయాగనల్ గా కూర్చున్న తను సడన్ గా వెనక్కి తిరిగి ఎందుకు చూస్తుంది?’

‘ఇంకెవర్నయినా చూసిందనుకుంటే నాకు దగ్గరలో ఎవరూ లేరు. పోనీ నా వెనక్కి చూసిందనుకుంటే…వెనక గోడ. హు…! పని కట్టుకొని గోడని ఎవరు చూస్తారు?’

‘నాకేమైన చెప్పాలని తిరిగిందనుకుంటే, కనీసం మా ఇద్దరికీ పరిచయం కూడా లేదు.’

ఆ చూపు గుర్తొచ్చినప్పుడల్లా, నా పనులన్నీ మానేసి అంతుచిక్కని ఆలోచనలతో గడిపేస్తుంటా. పరిచయం లేని భావాలకు అర్థం వెతుకుతున్నాను. ఉత్సాహం, ఆశ మిళితమై పాలపొంగులా ఎగుస్తున్న కోరిక నన్ను నిద్ర పట్టనివ్వకుండా  చేస్తుంది.

‘తదేకంగా తనని చూస్తున్నపుడు, ఒక్కసారిగా తను వెనక్కి తిరగడం వల్ల కలిగిన భయం చెబుతుంది… తను నన్నే చూసింది.’

డిగ్రీ మొదటి సంవత్సరం, కాలేజ్ మొదలయ్యి రెండు నెలలు అవుతుంది. తన ముఖం, ఎక్స్ప్రెషన్స్ అన్నీ నాలో ముద్ర పడిపోయాయ్. తను నా కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ‘అసలు ఎంత బాగుంటుంది’ అనుకుంటూ ఇప్పటివరకూ తనని చూసిన సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటున్నాను.

చిన్న నవ్వు, ముందుకు వాలే ముంగుర్లు, ఎదుటవారితో మాట్లాడేటప్పుడు తల పంకించే విధానం, ప్రపంచంలో కష్టసుఖాలన్నీ ఎరిగిన ముఖంలా ఉంటుంది. తనని చూస్తుంటే ఎప్పటినుంచో పరిచయమున్న వ్యక్తిలా అనిపిస్తుంది. ఇది తనకి చెప్పాలని ఉంటుంది.

‘స్వయంగా నేను వెళ్లి తనతో ఏమీ చెప్పలేకపోయినా, ఇలా ఆలోచిస్తున్నట్టు తనకి తెలిస్తే బాగుణ్ణు. నేను తనని ఇష్టపడుతున్నట్టు కొంచెమైనా అనుమానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇలా నన్ను చూడడం ఇదేం  మొదటిసారి కాదు. ఇంతకుముందు ఒకసారి మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయ్. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సారి మాత్రం నన్ను బాగా కలవరపెడుతుంది.’

ఇంతకుముందు కన్నా మేఘాలు కొంచెం దట్టంగా అలముకొని, సూర్య కిరణాలకి అడ్డుపడుతూ వెలుగుని తగ్గిస్తున్నాయ్. తీక్షణంగా ఏదో ఆలోచిస్తూ బాల్కనీలో అటూ ఇటూ రెండు పచార్లు కొట్టి, మళ్ళీ మేఘాల వైపు చూపు తిప్పాను.

‘బహుశా తనకి కూడా నన్ను చూడలనిపిస్తుందేమో! నాకు తన మీద ఇష్టం ఉన్నట్టు, తనకి కూడా నా మీద … ’

‘… అయ్యుండొచ్చు. పరిచయం లేకపోతే ఏం? చూపుల ద్వారా మొదలైన ప్రేమ కథలు చాలా ఉన్నాయ్.’

ఒక్క ఉరుముతో నా ఊహలకు అడ్డు పడింది. 

చల్లని గాలి మొదలైంది. వర్షం పడేటట్టుందని టెర్రస్ పైన ఆరేసిన బట్టలు తీసుకురావడానికి గబగబా వెళ్ళాను. అప్పటికే ఆరిన బట్టలు, క్లిప్స్ పెట్టకపోవడం వల్ల గాలికి తీగ మీద నుండి జారి చిందరవందరగా పడున్నాయ్. బట్టల్ని మూటకట్టి బెడ్ మీద పడేసి మళ్ళీ బాల్కనీ లోకి వెళ్లి నిల్చున్నా. 

ఇంతకుముందు మేఘాల్లో ఏర్పడిన ముఖం కోసం వెతికా. కనిపించలేదు. నా పిచ్చికి నేనే నవ్వుకొని రూమ్ లోపలి వచ్చేసా. టేబుల్ మీదున్న చలం మ్యూజింగ్స్ పుస్తకం, నన్నెందుకు మధ్యలో వదిలేసి వెలిపోయావన్నట్టు చూస్తుంది. దాని పక్కనే క్లాస్ మేట్స్ కి పంచమని  లెక్చరర్ నాకిచ్చిన ఇంటర్నల్ ఆన్సర్ షీట్స్ ఉన్నాయ్. మీదనుండి మూడో ఆన్సర్ షీట్ తనదే. అది పట్టుకొని బెడ్ మీద వెల్లకిలా చేరబడి ఆలోచనల్లోకి మునిగా.

‘అయినా తనకు నా మీద కలిగింది ప్రేమే ఎందుకవ్వాలి?  కోరిక అయ్యుండొచ్చు కదా!’

‘కానీ చూడడానికి ఆ అమ్మాయి అలా కనిపించదే …’

‘అయినా కోరికలనేవి బయటకి చెప్పుకొని తిరుగుతారా? ఈ వయసులో శారీరిక వాంఛ అనేది అందరికీ ఉండేదే. అది వ్యక్త పరిచే విధనంలోనే మనుషుల్లో తేడా ఉంటుంది.’

ఆశల్ని రేకెత్తించే ఏవేవో దృశ్యాలు నా కళ్ళ ముందుకొచ్చి మాయమవుతున్నాయ్.

‘…ఆ!…అయితె అదే!’

‘తనకి నా మీద ఉన్న ఫీలింగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంది గావాల. అలా వెనక్కి తిరిగి చూడడానికి  కూడా కారణం ఇదే అనుకుంటా. నేనే తనతో ముందు చెప్పాలని వెయిట్ చేస్తుంది. ఇటువంటి ధోరణి చాలా మంది అమ్మాయిలలో ఉంటుందని ఒకసారి నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను.’

‘చెప్పిన వెంటనే తనకి కావాల్సింది ఇదేనంటూ మురిసిపోయి, దగ్గరకొచ్చి, నన్ను …’

‘ధడ్ ధడ్ …’ రూమ్ తలుపు ఎవరో తడుతున్న శబ్దం. తలుపు తెరిచేసరికి నా స్నేహితుడు.

నిద్రలోంచి లేచిన వాడిలా బద్దకంగా “ఏంట్రా?” అన్నాను.

“టీ తాగడానికి వస్తావా?” అని అడిగాడు.

“ఇప్పుడా! వర్షం పడేటట్టు ఉందిగా”

“వర్షం అంటే నీకు ఇష్టమేగా. అయినా ఈ టైం లోనే తాగాలి. ఎండలో చెమటలు కారుతున్నపుడు తాగుతారా?” నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

ఐదు నిముషాలు ఏటీఎం లో ఏసీకి అలవాటుపడి బయటకొస్తే ఎలా ఉంటుందో, అంత ఇబ్బందిగా ఉంది వాడితో మాట్లాడుతుంటే. నా ఊహాల్లోంచి బయటకి రావాలని లేదు. మళ్ళీ అలానే పడుకో అంటూ బెడ్ నన్ను అయస్కాంతంలా లాగుతుంది. 

“నేన్ రాన్లే. నువ్వెళ్లు. నాకంత ఇంట్రస్ట్ లేదు” అని విసుగ్గా అన్నాను.

“ఎప్పుడెలా ఉంటావో నీకే తెలీదురా” అనుకుంటూ వెళ్లిపోయాడు.

తలుపు గడియ పెట్టి, బెడ్ వైపు తిరిగాను. దేనికో సంకల్పించిన వాడిలా దీర్ఘ శ్వాస తీసి, మొదలు నరికిన చెట్టులాగ  బెడ్ పైన కూలబడ్డాను. ఇందాక పడేసిన బట్టలు నా కింద నలుగుతున్నాయ్. తలగడని ఛాతికి ఆనించుకొని బొమ్మల్లా పడుకొని నా తియ్యని పగటి కలలోకి జారాను.

‘… తనకి కావాల్సింది ఇదేనంటూ మురిసిపోయి, దగ్గరకొచ్చి నన్ను కౌగలించుకొని, నా మొహంలోకి చూస్తూ “ఇన్ని రోజులు పట్టిందా నీకు చెప్పడానికి” అంటుంటే నేను ఆనందం పట్టలేక తనని ఇంకా….’

హఠాత్తుగా లేచి కూర్చున్నా.

‘ఛ ఛా!…ఏంటిదంతా? ఎందుకిలా ఆలోచిస్తున్నా? నాకు తన మీదుండే కోరికలను తనకి ఆపాదించి కలలు కనడమేంటి? నేను అనే వ్యక్తిని క్లాస్ లో ఉన్నానని కూడా తెలిదేమో తనకి. అలాంటిది, దూరం నుండి చూసి నన్ను మోహించే వరకా…!’

‘లోయలోకి విసిరిన రాయి పడడం ఎక్కడా ఆగనట్టు నా ఆలోచనలకి హద్దు లేకుండా పోతుంది. ఖాళీగా కూర్చుంటే ఇటువంటి భ్రమలే కలుగుతాయ్. ముందు ఇక్కడినుండి లేచి, ఏదైనా పనిలో నిమగ్నమవ్వాలి.’

లేచి మళ్ళీ చదవడానికి ప్రయత్నించా కానీ నా వల్ల కాలేదు. ఇందాక వాడు పిలిచినప్పుడే బయటకి పోవాల్సింది. రూమ్ లో ఒక్కడినే ఉండకూడదని నిర్ణయించుకొని, నా స్నేహితుడికి ఫోన్ చేసి ఉన్న చోటే ఆగమని చెప్పి బయల్దేరా. ఇటువంటి నా ప్రవర్తన కొత్తేమీ కాదంటూ వాడు ఒక చిన్న నవ్వు నవ్వాడు. 

ఇంతలోనే వర్షం మొదలయ్యింది. ఎండిన నేల మీద చినుకులు పడేసరికి మట్టి వాసన కమ్మగా కొడుతుంది. ఇద్దరం కలిసి క్యాంటీన్ వైపు నడుస్తున్నాం. రోడ్డు మీద జనం కొందరు క్యాంటీన్ లోకి వెళ్తుంటే, కొందరు హాస్టల్స్ వైపు పరుగు తీస్తున్నారు. మరికొందరు  వర్షాన్ని ఆస్వాదిస్తూ రోడ్డు మీద నడుస్తున్నారు. క్యాంటీన్ చేరేసరికి జనం మాటలూ, వర్షం ధాటికి రేకులు చేస్తున్న శబ్దం, అంతా గొడవగొడవగా ఉంది. మేము టీ తీసుకొని, ఒక మూలకొచ్చి బయటకి చూస్తూ తాగుతున్నాం. 

‘నేనూహిస్తున్నది భ్రమని ఎందుకనుకోవాలి? నిజం ఎందుకు కాకూడదు? మాట్లాడితేనే కదా తన మనసులో ఏముందో తెలుస్తుంది. ఇప్పుడు వదిలేస్తే దగ్గర అవడం బదులు ఎప్పటికీ పరిచయం లేకుండానే ఉంటమేమో? అమ్మో! తలుచుకుంటేనే కష్టంగా ఉంది.’

ఫేస్బుక్లో మెసేజ్ చేయడం నాకిష్టముండదు. రిప్లై వచ్చేంత వరకు వేచి చూడడం నా వల్ల కాదు. వెంటనే వచ్చినా ఎదుటివారి మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోలేమని నా అభిప్రాయం. 

‘రేపు తను కనబడగానే డైరెక్టుగా వెళ్లి అడిగేస్తా.’

వర్షం తగ్గింది. స్టూడెంట్స్ మళ్ళీ బయట తిరగడం మొదలెట్టారు. నా స్నేహితుడు టీ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు.

రెండ్రోజులు నుండీ నాకు నిద్రలేకుండా, దేని మీదా ధ్యాస లేకుండా చేసి, ఎక్కడ చూసినా తనే కనిపిస్తూ, ఇప్పటివరకూ నా ఊహల్లో విహరించిన అమ్మాయి క్యాంటీన్ వైపు నడుస్తూ వస్తుంది. 

తనని చూడగానే ఆనందం పట్టలేకపోయాను. కనురెప్పలు విచ్చుకున్నాయి. పెదాలు కదలకుండా నవ్వుతున్నాయి. ఇప్పటివరకూ నా జీవితంలో  విన్న ఫాస్ట్ బీట్ పాటలన్నీ ఒకే సారి ప్లే అవుతున్నాయి.

‘రేపటి దాకా ఎందుకు? ఇప్పుడే మాట్లాడతా.’

తను దగ్గరవుతున్న కొద్దీ నాలో టెన్షన్ పెరుగుతుంది. ‘ఎలా మొదలెట్టాలి? ఏం చెప్పాలి? తను నన్ను చూస్తుంటే, ధైర్యంగా మాట్లాడగలనా?’ అనుకుంటుంటే, నా పక్కన నిల్చున్న స్నేహితుడు,

“నేను కెమిస్ట్రీ రికార్డు ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నానని చెప్పేనే, తనే”

సగం భయం వదిలింది. అపద్బాంధవుడిలా వచ్చాడనుకుంటూ వాడివైపు చూసాను.

“… తను తెలుసు కదా” అన్నాడు.

“ఒకర్నొకరు చూసుకున్నాం కానీ, ఎప్పుడు మాట్లాడుకోలేదు” అన్నాను.

“ఐతే ఉండు. పరిచయం చేస్తా”

నా మనసు పిచ్చి పట్టిన కోతిలా గెంతుతుంది. నాలో ఉబుకుతున్న ఉత్సాహం ముఖంలో కనిపించకుండా దాచుకుంటున్నా.

“హాయ్! ఏంటిలా ఒక్కదానివే?” కొంచెం దూరంలో ఉందనగా పలకరించాడు.

“హాయ్! టీ తాగడానికి వచ్చా. నా రూమ్ మేట్ బయటకి వెళ్ళింది… రికార్డ్ వర్క్ అయిపోయిందా?” మధ్యమధ్యలో నా వైపు కళ్ళు తిప్పుతూ వాడితో మాట్లాడుతుంది.

“ఇచ్చేస్తాలే తల్లీ. నేనేం ఉంచుకోను”

‘మీ రికార్డ్ గోల ఆపి నన్ను పరిచయం చెయ్ రా’ 

“నా ఫ్రెండ్ తెలుసుగా? మన క్లాసే.”

“ఓ హాయ్!” అంది. “మన క్లాసా? నేనెప్పుడూ చూడలేదు.”

ఎగురుతున్న కోతి రైలు పట్టాల కింద పడి నుజ్జునుజ్జయింది.

“నీకెలా తెలుస్తుంది? చదువు బిడ్డలు మీరు. చుట్టూ మనుషులు గురించి ఎందుకు పట్టించుకుంటారు?” అన్నాడు.

కాంటీన్ లో గాజు గ్లాసు పగిలిన శబ్దం భయంకరంగా తోచింది. పగిలిన గాజు ముక్కలు నా ఛాతిలో చెల్లాచెదుర్తె ఎక్కడికక్కడ గుచ్చుకుంటున్నాయి.

“ఏంటి నీ ఫ్రెండ్ కి మాటలు రావా? కామ్ గా ఉన్నాడు.”

ఏదో అనబోయాను. పెదాలు కదల్లేదు. “నిజంగా ఇంతకుముందు నన్నెప్పుడూ చూడలేదా?” అని నోటివరకు వచ్చి లోపలికి వెళిపోయింది.

అంతా నిశ్శబ్దం. దాని తర్వాత వాడేమంటున్నాడో, తనేమంటుందో ఏం వినిపించట్లేదు. ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయా.

“మళ్ళీ వర్షం పడేటట్టుంది. టెర్రస్ మీద బట్టలుండిపోయాయ్. నేను వెళ్తా” అంటూ సమాధానం గురించి ఎదురు చూడకుండా అక్కడ నుంచి వెళిపోయా.

ఇసుక మీద రాసిన అక్షరాలు అలల తాకిడికి చెరిగిపోయినట్టు, కన్న కలలన్నీ క్షణంలో తుడుచుకుపోయాయ్. నాకు కలిగిన ఆలోచనలూ, కనిపించిన దృశ్యాలూ… ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక అంతా గందరగోళంగా ఉంది.

‘మన క్లాసా? నేనెప్పుడూ చూడలేదు.’

‘నేనెప్పుడూ…. చూడలేదు….మన క్లాసా …’

‘ఓ హాయ్… ఔనా… ఔనా… ఔనా…’

మళ్ళీ మళ్ళీ ఈ మాటలే వినిపిస్తున్నాయి. తన చూపులే గుర్తొస్తున్నాయి. భరించలేక, దీర్ఘశ్వాస తీసి నడక వేగాన్ని పెంచాను. నా నడక చప్పుడు నాకే విచిత్రంగా వినిపిస్తుంది. అప్పటివరకూ ఆహ్లాదకరంగా కనిపించిన ప్రకృతి, నా పరిస్థితిని చూసి గేలి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.

‘ఏంటి… మాటలురావా… మాటలురావా…. కామ్ గా ఉన్నాడు…’

“థూ… నీ బతుకు” అని నన్ను నేనే తిట్టుకుంటూ ఇంకా వేగంగా నడుస్తున్నాను.

హాస్టల్ కి తిరిగి వెళ్ళాలనిపించలేదు. నాకు నేను కొత్తగా కనిపిస్తూ, అర్థం లేని ఆలోచనలకు నన్ను నేను అసహ్యించుకుంటూ, రోడ్డు వెళ్ళే దిశగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను.

 

హరీశ్

హరీశ్: వయసు 26. పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లా. హైదరాబాద్ లో MSc Physics చదివారు. ఇప్పుడు Indian Meteorological Department లో Scientific Assistant గా నిజామాబాద్ లో పని చేస్తున్నారు.

12 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.