దొప్పటాన

ఆ సమత్సరం వానలు సరిగా కుర్సల్య. జులై దాటిపోతన్యా  సుట్టు పక్కల యాన్నేగానీ ఇత్తనం కూడా ఎయ్యల్స. ఎండలకాలమున్యట్లు ఎండలు మండిపోతాండాయి. న్యాల గొంతారి దాని నాలిక పిడసగట్టక పోయుండాది. బీళ్లు నోర్లు తెర్సి ‘వానో రామసెంద్రా’ అంటా ఆకాశానికి మోరెత్తి మొరపెట్టుకుంటండాయి. పొలమంతా తడారి ఎడారిని తలపిచ్చాంది. యాడన్నా గట్లన ఉన్య సెట్ల కొమ్మల ఆకులు మట్టగ రాలిపోయి మొండి బర్రలైనాయి. వంక ఒట్టి పోయిండాది. సూచ్చామంటే యాన్నేగానీ సుక్క నీళ్లు లేవు. ఏ నోట ఇన్యా గానీ ‘ఒక్క వానొచ్చే సాల్రా దేవుడా’ అంటా యా రాయిరప్పా  కనపచ్చినా సేతులెత్తి మొక్కుకుంటనారు. అప్పటికే ఊరంతా కప్పాలమ్మ తిప్పినారు. బొడ్రాల్లకు నీళ్లు పోసి తమ గోడెల్లబోసుకున్యారు. పాత రోల్లు, పగిలిన ఇసురాల్లు, పనికిరాని పరకలు, శాటలు ఊరు దాటిచ్చి పొలిమేరల ఆవల పారేసినారు.

ఎన్ని జేసినా గానీ వాన మాత్రం వంగల్య. మోడాలు మొండికేసి కూచ్చున్యాయి. దానికి తోడు పైన రవ్వంత మబ్బు తునక కానచ్చినా ఎత్తుగాలులు లేసి దాంట్లను ఎల్లగొడ్తనాయి. ఇంగ ఈతూరి కూడా కరువు తప్పదని ఊరంతా కలవరపడబట్య. 

అట్లా అదో ఇదో అంటండగానే అదును దాటిపాయ. ఒక్క పదును వాన కూడా పడకపాయ. ఇంగ తొలిపంట ఎత్తిపోయినట్లేనని సేసేది ల్యాక ఒక్కొక్కరే గాజల్లో పోసుకున్య ఇత్తనాలు (సెనుక్కాయ ఇత్తనాలు) అమ్మబడ్తిరి. అట్లన్నా ఆ వచ్చిన లెక్క తెచ్చిన సాట కడ్తే మల్లా ఎప్పుడైనా అవసరమున్యప్పుడు అప్పైనా పుడ్తాదని. ఇంకొందరు మాత్రం ఇత్తనాలు అట్లనే పెట్టుకుంటిరి. రెండో పంటకు పెట్టుబడిగానైనా ఉంటాయిలే అని. తీరా వానొచ్చినాకంటే మల్లా ఇబ్బంది పడ్తామని. ఎవరి వాటం కొద్దీ వాళ్లు ఆలోసించబడ్తిరి.

వాన రాడం రాకపోడం మన సేతల్లో ఏముండాది! సరే,  ఎట్లైతే అట్లగానీ. కరువైనా, బతుకు బరువైనా ఊరుకుండి సేసేదేముండాది అని మా కలంలో ఉన్య దుగ్గు, వామడుగు కుల్లిన కట్టెను సౌడంబ పంపుల కాడుండే గుంతకు తోలి కలం మట్టం జేచ్చామనుకుంటిమి. వానొచ్చినాదంటే కలంలో గడ్డి గాదం పడి గొడ్లకు పచ్చి మేపుంటాదని మాయమ్మ సెప్పకచ్చ. ఎట్లా ఆ సమత్సరం ఎండలకాలం మా తూర్పు సేండ్లోకి సథవ తోలాలనుకుంటిమి. అట్లైందాన దానిపైన వంకలో నుంచి ఇసిక్య తోలి మండె కడ్దామనుకుంటిమి. మండె అడుగున అది కుల్లి మాంచి సథవైతాదని ఆ పని మొదలు పెడ్తిమి. ఒక నాలగైదు రోజులకంతా ఆ పని ముగిచ్చి వంకలో కుమ్మరోల్ల బాయి కాన్నుంచి దానిపైకి ఇసిక్య తోలబడ్తిమి. అప్పుడు మా బజార్లో వాళ్లు గూడా ఆడాడా బండి గట్టి సేండ్లకు ఇసిక్య తోల్తాంటిరి.యాదో ఒక పని-ఊరిక్య తిని కూచ్చోల్యాక. 

ఆ ముందు రోజే మాయమ్మ మాయవ్వను సూడక శాన్నాల్లాయన్జెప్పి మాయవ్వ గారి ఊరికి పోయుండ్య. ఆ పొద్దు మా నాయన నేను మిద్దెపైన పండుకోనుంటిమి. తెల్లార్జామున నేను ఒకంటికని లేచ్చి. బాగ సల్లపొద్దు. గాలి బలె సల్లగ తగుల్తాంది. మా నాయన బాగ గురకపెట్టి నిద్రపోతనాడు. అప్పటికే బండ్లదావన ఎవ్రో బండిగట్టుకోని మట్టి తోల్డానికి యల్లబారి పోతాండ్య.

‘వార్నీ పాసుగుల మనకంటే ముందు ఎవరో కాడిగట్టుకోని పోతండారే, ఇట్లయితే మనం పనికాడ ఎనకబడ్తామే అన్జెప్పి మానాయన దగ్గర్కి పొయ్ ‘నాయనా బండ్లు పోతనాయి. లెయ్ నాయ్న, మనం గూడా బండిగడ్తాం అంటా బాగ నిద్దర్లో ఉన్నోన్ని తట్టి లేపితి. మా నాయన రోంత మసిలి ‘ఇయ్యాలకేనేంబ్బీ. ఇంగ రోంచేపుండి పదాంలే ఏం మించిపోలేదులే’ అని అటుపక్క నుండి ఇటుపక్కకు పాటు తిరిగి మల్లా పండుకుండ్య. సరే నేను పిల్లోన్ని, చేసేదేం ల్యాక మల్లా పండుకుంటి.

అప్పుడు నేను మాంచి ప్రాయంలో ఉంటి. ఉడుకు నెత్తర బిస మీద యా పనికాన్నైన మనమే మేటికుండాలని ఒగరవ్వ మంకుపట్టు పడ్తాంటి. అంతే గాకుండా సేండ్ల గట్టున యాన్నేగానీ పుల్లనేది లేకుండా కన్నెగ పెడ్తాంటి.  ఎద్దల్నైతే బలే ఎగమేపుతాంటి. దాంట్లను సొర్రబూరో, టెంకాయ పీసో బేసి పైకడిగి బలె మట్టంగ పెడ్తాంటి. ‘యా పన్జేసినా మట్టగ సెయ్యాలబ్బీ. సగం పెట్టు మేనత్త యవ్వారం పనికిరాదు’ అనే మాయమ్మ సిద్ధాంతం నాకు వంటపట్నెట్లుండ్య.

పండుకున్యానన్న మాటే గానీ నాకింగ నిద్దర పట్టల్య. మా నాయన్ను ఇర్సిపెట్టి నేనే కాడిగట్టుకోని పోదామని మొండాలోచన సేచ్చి. కానీ వంకలో కుమ్మరోల్ల బాయికాడ దయ్యముండాదని ఎవరో అన్య మాటలు మతికొచ్చ. ఆ భయానికి ఒక్కన్నీ బండి కట్టడానికి నా దొమ్మలు సాల్య. ఇంగ రోంచేపు అట్లనే పండుకుంటి. దావన ఇంగో రెండు మూడు కాండ్లు పోతన్న్యట్టు ఎద్దల్ని అదిలిచ్చే రిక్కెల శబ్దం ఇనపచ్చ. ఇంగ పండుకోడం నా తరంగాల్య. మానాయన్ను జూచ్చే బాగ గురక పెట్టి కుంభకర్ణుని మాదిరి నిద్రపోయ్యిందే నిద్రపోయ్యిందే. మల్లా లేపుతేగనక యాడ కోపగిచ్చుకుంటాడో ఏమో అని భయమేస్య. అంతలోకే మా బజార్న ఎవరో కాడిగట్టే సప్పుడాయ. ఇంగ నేను తట్టుకోల్యాక పోతి. ఏమైతే అదైతాదన్జెప్పి, ‘ఓ నాయ్నా, అందరు కాడిగట్టుకోని పోబడ్తిరి. బెరిగ్గెన లెయ్. నేను పోయ్ ఎద్దల్ను లేపి నీళ్ళు దాపుతా నువ్వొచ్చాలకు’ అని గుటికిర్సకుండా సెప్పి మా నాయన ఏమంటాడో ఏమో అని కూడా పట్టిచ్చుకోకుండా సుంచు పక్క నర్సి, గబగబా మిచ్చెన దిగబడ్తిని.

ఎద్దల్ను లేపి నీళ్లు దాపి, గాట్లో ఒక్కరవ్వ మేపేసి పొయ్యిమీద రోంత డికాషన్ పెట్టి దొడ్లోకి పొయ్, రెండు బొగ్గు తుంటలు నాలుగు ఉప్పురాల్లేసి గుండ్రాయితో బండ మీద నూరబడ్తి. అంతలోకే మా నాయన కూడా మిచ్చెన దిగొచ్చా కనిపిచ్చ. నున్నగ నూరిన బొగ్గులో సూపుడు ఏలేసి అద్దుకుని అదరాబదరా పండ్లు తోమి మొగం కడుక్కుంటి. మ నాయన గూడా పండ్లు తోమినామంటే తోమినామనిపిచ్చ. ఇద్దరం సేర్రోంత డికాషన్ తాగి కాడిగట్టుకోని, బండ్లో పుటికెలు పారలేసుకుని , అట్లనే రెండు సంచిపట్టలు బేసుకుని పిల్లొంక దావ పడ్తిమి. 

నేను నగల్లో కూచ్చోని బండి తోల్తనా. మా నాయన అట్లనే ఉత్తపైన ఒక టవల్ భుజానేస్కోని బండ్లో కూచ్చోనుండాడు. బండి వంకలోకి దిగింది. మేము ఇసిక్య తోలే తావు సేరాలంటే  ఇంగా అరగంట పడ్తాది. దావన ఎద్దులు నడుచ్చాంటే దాంట్ల మోరకుండే సిలిమార్ల శబ్దం గల్లుగల్లు మంటాంది. బండి గాన్ల కింద ఇసిక్య నలుగుతన్య కరకర శబ్దం ఇనిపిచ్చా ఉంది. అంతకు మించి ఆ రాత్రి ఆ కటిక సీకట్లో ఆ దావన నరమానవుడు తిల్లాడే తీరు కాన్రాల్య. మా ఎద్దులకు ఆ దావ కొత్తగాదు కాబట్టి అయి బాట పట్టి పోతనాయి. మా నాయన సంచిపట్ట బండ్లో పర్సుకోని ‘అబ్బీ నేను రోంతట్ల నడ్డి వాలుచ్చా’ అని పండుకున్య. నాకు మా నాయన యాడ నిద్ర పోతాడో అని భయమేస్య. ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటండగానే దూరంగా తూరుపు దిక్కున ఆకాశంలో మెరిసినట్లు అనిపిచ్చ. ‘ఇదేందిది తూరుప్పక్క మెరుచ్చాందే’ అంటి. ఆ మాటలకు మా నాయన ఉలకల్య, పలకల్య. రోంచేపటికి ఆకాశంలో సుక్కల తిక్కు సూచ్చా మా నాయనే మొదులుపెట్య.

‘అబ్బీ…నాకు పెళ్ళైన కొత్తలో ఇట్లనే నేను తోందాసు వంకాగట పోట్లాటి సేండ్లో మండ్య కడ్తాంటిమి. ఎద్దులు బో బిసగా ఉండ్య. తక్య బలె తెంపు నాకొడకల్టిలే! పడ్తే ఉడుం పట్టే. సల్లుకునేదేల్య. ఆ పొద్దు తెల్లార్జామున్నే కాడికట్టిన్యాము. ఇదో ఇప్పుడు నీ మాదిరే నేను బో మంకుపట్టు పడ్తాంటి పనికాడ. ఆ ప్రాయం అట్లాడ్ది. బాగ రెండు తడవలు తోలి మూడో తడవకు ఇసిక్య పోసుకుని బండి సేనిదావ పట్టి పోతాండ్య. ఇట్లనే తూరుపక్క మెరుచ్చన్న్యాది. ఆ…యాన్నో దూరంగ మెరుచ్చాందిలే అని అట్లనే యామారి పోతిమి. తీరా సేనికాడికి పొయ్యాలకు కుమ్ముల్లు కుమ్ముల్లు మోడం కమ్ముకోనొచ్చ. ఆమైన రాడం రాడం దంచుకుంటా వచ్చ. దొప్పటాన దిగబన్యాది. మొదలు పెట్టడం పెట్టడం సల్లుకునిందే ల్యా. బో కుర్సింది, ఇర్సకుండానే. ఆ వానకు ఎద్దలు, మంచులం పైనుంచి కింది దాకా మట్టగ తర్సినాము. ‘ అన్జేప్పుకుంటా వచ్చినాడు. ‘తెల్లార్జాము మొబ్బుల్ని నమ్మేదానికి ల్యాబ్బి’ అంటా ముగిచ్చినాడు.

అయితే అబ్బీ ఆ సమత్సరం ఒక వాన తక్కువైనా సథవ బాగ తోలిందాన న్యాలకాయ (సెనిక్కాయలో ఒక రకం) సంపిర్సింది పంట. తోందాసు ఎప్పుడూ అంటాండ్య ‘ఆ పొద్దు కుర్సిన వానకు బాగ గడ్డపదును అయ్యుండ్య. వంకలోని ఇసిక్య పడిందాన సేను తనువెక్కి ఉండ్య’ అని.

బండి వంకలో మేం ఇసిక్య తోలే తావు కాడికి సేర్య. నేను బండి నిలబెట్టి నెత్తికి రుమాలు సుట్టి నగల్లో నుంచి కిందికి దిగితి. మా నాయన పుటికలు, పారలు, సంచి పట్టలు కిందేసి దిగ్య. ఇద్దరం కలిసి బండికి ఇసిక్య పోచ్చిమి. ఎంతకైనా మంచిదని మా నాయన పుటికలు, పారలు, సంచి పట్టలు బండ్లో వేస్య. నేను ‘ఎందుకు నాయనా,  యాడ వానొచ్చాది’ అంటే ‘వాన రాకడ పానం పోకడ సెప్పలేమబ్బీ …’ అని ఒక సామెత ఇర్సిరి నా నోరు మూయిచ్చ మా నాయన. బండి సౌడంబ పంపుల దావ పట్య. మా నాయన బండ్లో ఇసిక్య మీద పట్ట పర్సి కూకుండ్య. నేను నగల్లో కూచ్చోని ఎద్దల తోల్తాంటి.

తూర్పున ఇంగా అట్లనే మెరుచ్చానే ఉండాది. మా బండి కదలడం జూసి అయి కూడా రథమెక్కి కదుల్తా మా తట్టు వచ్చినట్లాయ. మెరుపులు ఇంగా రోంత ఎక్కువాయ. రోంత ఉరుముల శబ్దం కూడా ఇన్రాబట్య. నిండు బండి శానా తూకంగా ఉండాది. ఐనా ఎద్దులు ఉషారుగా నడుచ్చనాయి. అట్లా ఓ 20 నిమిషాలు అయ్యింటాది. తూరుపు దిక్కు  నుంచి మెరుపులు మా దరిదాపుకొచ్చనాయి. అప్పుడు రోంత గాలి కూడా లేస్య. ఆ గాలి యాన్నో సినుకులు న్యాలను తాకినప్పుడు వచ్చే కమ్మని మకరంద మట్టి వాసనను మోసకచ్చాంది. బండ్లో కూచ్చున్య మా నాయన పక్క తిరిగి నేను అనుమానంగా సూచ్చి. ‘వంతు తప్పేట్లు లేదు గదబ్బీ ఈ పొద్దు’ అన్య మా నాయన. అయినా ఆ మాటల నిండా తీరని దప్పిక దాగుండ్య. ‘ఎద్దుల్ను రోంత ఉషారుగా అదిలీబ్బి’ అన్య మల్లా మా నాయనే. 

మా వలపటిది ముందే రోంత బెదురు గొడ్డు. అప్పటికే అది ఒళ్లు పుల్లబొర్సి, బిక్కిరి సెవులు పెట్టి కాలు సాగదీసి నడుచ్చాంది. పెద్దెద్దు గూడా ఉషారుగానే నడుచ్చాంది. అయితే అది మా నాయన మాదిరే అనుభవమున్య పసరం. సేనికాడికి పోవ్వాలంటే ఇంగా  దూరముండాది. గాలి రోంత ఎక్కువాయ. తూర్పునుంచి నల్లగ కమ్మడి కప్పినట్లు మోడాలు కుమ్ముల్లు కుమ్ముల్లు ఎక్కొచ్చనాయి. 

గాలికి మోడం తేలిపోతాదేమో అనుకుంటి నేను. కానీ అడుగడుక్కు వాన వాసన ఎక్కవైతా వచ్చ. దాంతో పాటు ఆకాశంలో యుద్ధం జరుగుతన్యట్లు సల్లిర్సకుండా మెరుపులు మెర్సి, ‘బడబడమంటా’ ఉరుములు ఉరమబట్య. ఆ శబ్దాలకు ఎద్దలకు బెదురు పుట్టుకుండ్య . మా వలపట దాని పగ్గం ఎంత బిర్రుగ పట్టుకున్యా అది సల్లుకోకుండా బుసపెడ్తా నర్సబట్య. ఇంగో పక్క దాపటది దానికి జత కలిసి పరిగెత్తినట్లు నర్సబట్య. నేను పగ్గాలు సేతల్లో రెండు మూడు సుట్లేసి పురితిప్పి వడ్సి పట్టుకుంటి. ఐనా అయి సల్లుకోకుండా నర్సబట్య. నేను నగల్లో రోంత ముందుకు జరిగి కాడిమానుకు కాల్లేసి కొమ్మదన్ని ఎద్దుల పగ్గాలు బిర్రుగా పట్టుకుంటి. ఐనా దాంట్లను పట్టుకోడం నా వల్లగాల్య. అయి బుసపెడ్తా సల్లుకోకుండా నడుచ్చానే ఉండాయి. ‘అబ్బీ…దిగబడిందబ్బీ ఈ రోజు ఇర్సి పెట్టదు.’ అన్య మా నాయన. దానికి నేనుండి ‘ఇరుక్కున్యాం గదు నాయనా ‘ అంటి. అప్పటికే నా సేతులు సివసిమని మంట దీచ్చనాయి. 

‘ఇరుక్కోల్య గిరుక్కోల్య గానీ బండి పక్కన నిలుపు ’ అన్య మా నాయన.  ‘ఏం నాయ్నా ‘ అంటి నేను ఏం సెయ్యాల్నో దిక్కు తెలియక. ‘ఇంగా ఏంది నాయనబ్బి, అదో… మోదొచ్చాంది సూడు’ అంటా నగల్లోకొచ్చి నా ఎనకల కూచ్చోని నా సేతల్లోని పగ్గాలు అట్లనే పట్టుకోని దాపట దాని పగ్గం ఒడిసి పట్టుకోని వలపట దాన్ని ఎగదోలి బండి పక్కకు మల్లిచ్చి ‘ఓమ్మ…ఓవ్…’ అంటా ఎద్దల్ను నిలిప్య మా నాయన. అప్పుడు గానీ గుర్తురాల్య నాకు-మా నాయన ఉత్తపైనుండాడని. 

బండి అట్ల నిలబన్యాదో లేదో టపటపటపమని సినుకులు రాలబట్య. గోలుగుండ్లంత సినుకులయ్యి. మా నాయన గబుక్కున నగల్లో నుంచి దుంకి ఎద్దుల ముందుకు పాయ. ‘బ్బీ…నేనేద్దల్ను పట్టుకుంటా గానీ నువ్వొచ్చి పట్టేండ్లిప్పి బండి లేవనెత్తు ‘ అన్య.  ‘గబక్కన లేబ్బి ఒళ్ళు సురుక్కు మంటాంది సినుకులకు’ అన్య మా నాయన. నేను నగల్లో నుంచి దుంకి కాడిమానుకుండే పట్టెండ్లు తప్పిచ్చి నగల్లను పట్టుకోని బండి లేవనెత్తితి. ఉత్తబండిని కిందికి దింపి నేను దాపటెద్దు మొగదాడును పట్టుకుని దాన్ని ఒక గానుకు కట్టేచ్చి. మా నాయన సిన్నెద్దును పట్టుకోని దాన్ని దాపటి దాని పక్కనే కట్టేసి బెరబెరా బండి కిందకు దూర్య. 

ఒక్క నిమిషంలోనే మోడం దిగబడ్య. వాన మెండాయ. మా నాయన బండి కిందికి దూరి ముడుక్కున్న్యాడు సంచి పట్ట కప్పుకోని. నేను మాత్రం మా సిన్నెద్దు కాడికి పొయ్ దాని మొగదాడు పట్టుకొని మొరను నిమురుతా కూకుంటి. ఆ వానలో దానికి నేను తోడు, నాకదే తోడు.

మెల్లెగా గాలి తగ్గిపాయ, వాన బలపడు, ఒకటేమైన మోదబట్య. నిమిషాలలోనే నీళ్ళు అడ్డం పారబట్య. ఎద్దులు మనుషులం మట్టంగ తర్సినాము. అట్లా ఎంత సేపటికి వాన సల్లుకోక పాయ. ఇంటకాడ మాయమ్మ లేనిది మతికొచ్చి ‘ఏ నాయనా కాడి కడ్దామా?’ అంటి. ‘కట్టుబ్బీ . ఇంటికి పదాం బెరిగ్గెన. నాకు సలి పెడ్తాంది. అన్య. ఎద్దల్ను కాడికిందికి పటకచ్చి పట్టెండ్లు పెడ్తిమి. మానాయ్న బండెక్కి కూచ్చుండ్య. నేను నగల్లో కూచ్చొని ఎద్దల పగ్గాలు ఒడిసి పట్టుకుంటి మల్లా ఎద్దులు యాడ జార్తాయో అని. వానమాత్రం అట్లనే కురుచ్చానే ఉంది. మేము నిండా తర్సి, సినుకల్లో సినుకులమైనాము. ఎద్దులు నెమరేచ్చా నడుచ్చనాయి. ఇట్లా ఆ వానలో ఇంటి దావపట్టి రోంత దూరం పొయ్యాలకు మా నాయన కూడా నగల్లోకొచ్చి నా ఎనకాల కర్సుకుని కూర్చుండే. మా నాయన గడగడ వనుకుతనాడని అప్పుడర్తమాయ. మా ఊరి పాటిమీద బురుజు కాడికి పొయ్యాలకు వాన రోంత తెరపిచ్చ. రోంత సేపటికంతా ఇండ్లు సేర్తిమి. గబగబా ఎద్దల్ను ఇర్సి నిదానంగా తొక్కులాడకుండా దాంట్లను ఇంట్లో గాటికి కట్టేచ్చిమి. 

తీరా ఇంట్లోకొచ్చాలకు మా ఆపిద్దేలో పెద్ద గుమ్మడి పడుండ్య. మా నాయన నా పక్క జూసి నగ్య. నేను నగి ‘నేను మిద్దెక్కి గుమ్మడి బూడుచ్చా. బూడిందో లేదో సెప్పు నాయ్నా’ అంటి పట్టతో గూడు జేసుకొంటా. నేను గుమ్మడి బూర్సొచ్చాలకు మా నాయన గాటిపాట సలిమంటేచ్చా కనిపిచ్చినాడు. నేను టవల్తో నెత్తి తుర్సుకుంటా మా నాయన కాడ సేరితి. ‘అబ్బబ్బ ఏం వాన నాయ్నా అంటి’ నేను. ‘ఈ వాన ల్యాకనే కదబ్బీ మనకిన్ని అగసాట్లు. పన్నీ రెండో పంటన్నా పండుతాది’ అన్య మా నాయన. 

పద్దన లేసి సూచ్చే ఎన్నాళ్ల నుంచో బూజు పట్టిన ఆకాశాన్ని ఎవరో తెల్లని తడిగుడ్డేసి తుర్సివట్లు కన్నెగుండాది. మా ఊరి పరమట పక్క సెర్రుకట్ట పొంగి పారతన్య శబ్దం ఇనిపిచ్చా ఉంది. ‘ఎన్నాల్లాయ సెర్రుకట్ట పారక’ అని మనసులో అనుకుంటా అటుపక్కకు అడుగులేచ్చి. సేర్లో సేండ్లల్లో నీళ్లు అడ్డం పారతాండాయి. నిన్న రాత్రి దాకా దప్పిగ్గున్య నేల తల్లి రాత్రి కుర్సిన వానకు తనివి తీరా తాగి సల్లబన్నెట్లుండాది. ఏ మనిసి ముఖం సూసినా నిండు సెరువు మాదిరి కలకలలాడ్తాంది. వాన పానం పోయే ఊరికి మల్లా జీవం పోసినట్లు, మా ఊరు సిక్కెగ నగుతన్యట్లు ఉండాది. మా ఊరి వంక మల్లా పారతా ఉండాది. ‘ఒక్క వాన, ఒకే ఒక్క వాన ఎన్ని పానాలను నిలుపుతాది’ అని అనిపిచ్చ అప్పుడు

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

8 comments

  • ప‌ట్టుకుండేది ఎన‌క్కి త‌గ్గ‌కుండా రాచ్చివి. నువ్వు, మీ నాయిన, మీ కాడెద్దులు క‌న‌ప‌న్యాయి. దొప్ప‌టాన‌లో నేనూ త‌డ్చినా. ప‌దాల‌ను ఇర్సిపెట్ట‌కుండా ప్యూరు సీమ‌భాష‌లో రాయ‌టం నాకు భ‌లే న‌చ్చుతాది.

    • ధన్యవాదాలు వలి. అవునప్ప నీ కతలు బలె కమ్మగుంటాయి సదువుతాంటే.

  • నిజంగా యీ ఏడు వాన దంచుతోంది అన్నా.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.