నల్లమల పిలుస్తోంది
చెంచుల గొంతులెత్తి

యురేనియం మైనింగ్ కోసమని నల్లమల అడవుల్ని ధ్వంసం చేయబోతున్నారంటూ #SaveNallamala పేరుతో  సోషల్ మీడియాలోనూ, బయటా కొందరు కేంపెయిన్ చేస్తున్నారు? ఇదంతా కేవలం భావోద్వేగాలతో నడుస్తున్న పోరాటమా? అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఆర్ధిక అవసరాలను లెక్కపెట్టని తిరోగామి ఆలోచనా? లేక లాభనష్టాలన్నీ బేరీజు వేసుకొని, అన్ని కోణాల్లోనూ సమగ్రంగా ఆలోచించి ఒక స్పష్టమైన అజెండాతో ముందుకు నడుస్తున్న ఉద్యమమా? అసలేం జరుగుతోంది?

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ పరిసర ప్రాంతంలో 83 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ చేసుకోవడానికి పర్యావరణ మరియు అటవీశాఖ UCIL(యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కి అనుమతి ఇచ్చింది.  పూర్తి స్థాయి మైనింగ్ మొదలు పెట్టాలంటే, అక్కడున్న నలభై రెండు గ్రామాల్లోని 70 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. వీరిలో అడవితో మమేకమై జీవించే “చెంచులు” కూడా ఉన్నారు. అంతేకాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కూడా ఇదే ప్రాంతంలో ఉంది. మన జాతీయ జంతువు జతకట్టే సమయం (mating season)లో వాటిని డిస్టర్బ్ చేయకూడదని కనీసం సందర్శకులను కూడా లోపలికి అనుమతించని సంరక్షణ కేంద్రంలో, భయంకరమైన శబ్దాలు చేస్తూ, వాటి అంతానికి కారణం కాగల భారీ యంత్రాలతో మైనింగ్ చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అనుమతి ఇచ్చారు. “ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విధులు ఏమిటి?” అని అనుమానించాల్సిన వింత పరిస్థితి. 

చెంచులతో పర్యావరణ కార్యకర్తలు

అటవీశాఖ క్లియరెన్స్ ఇచ్చిందన్న వార్త తెలియగానే, స్థానికుల్లో భయం మొదలయ్యింది. ఇతర ప్రాంతాల నుంచి చాలామంది యాక్టివిస్టులు వచ్చి, నల్లమల పరిరక్షణ కమిటీగా ఏర్పడి, స్థానిక గిరిజన తెగలకు సపోర్ట్ గా ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటికీ మెజారిటీ జనాలు, అడవులను ధ్వంసం చేయడం తప్పే అయినా, డెవలప్మెంట్ కోసం యురేనియం మైనింగ్ వైపూ, న్యూక్లియర్ పవర్ వైపూ మొగ్గు చూపడం అవసరమేనని, తప్పదనీ భావిస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. నూక్లియర్ ఎనర్జీ అనగానే సూక్ష్మంలో మోక్షం అని వీరి అభిప్రాయం. ఒక యురేనియం పరమాణువుని విచ్చిత్తి(split) చేస్తే బోలెడంత శక్తి విడుదల అవుతుందని చదువున్న సైన్స్ పాఠం వల్ల, అణువిద్యుత్తు అతి చౌక అనే తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. నిజానికి నూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విదేశీ టెక్నాలజీ కొనడానికి అయ్యే ఖర్చు,  ప్రొడక్షన్ రావడానికి దాదాపు 20 సంవత్సరాలకు మించి పట్టడం వల్ల ఈ మొత్తం సమయంలో పెట్టుబడికి తెచ్చిన అప్పు మీద వడ్డీ కి అయ్యే ఖర్చు, నూక్లియర్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అయ్యే ఖర్చు ఇవన్నీ కలిసి ఆ విద్యుత్తు యూనిట్ రేట్ చాలా ఎక్కువ అవుతుంది. లైఫ్ అయిపోయిన నూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఆపేసి ఇంధనాన్ని, ఇతర వ్యర్థాలనూ తొలగించి ఎటువంటి రేడియేషన్ లేని స్థితికి తీసుకురావడానికి అయ్యే (decommissioning) ఖర్చు కూడా చాలా ఎక్కువ. అందువల్ల అణువిద్యుత్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 

వొదిలించుకున్నా వొదలని భూతం: జపాన్ ఫుకుషిమా రియాక్టర్ లో అణుఇంధనాన్ని చల్లార్చడానికి వినియోగించిన అణుధార్మిక నీటిని ఇలా వెయ్యి డ్రమ్ముల్లో నిలువ చేసి వుంచారు. దీన్ని ఎప్పుడో సముద్రంలో కలిపేయడం వినా దారి లేదు. అది జీవరాశికి ప్రమాదకరం.

అటామిక్ పవర్ ప్లాంట్ నుండి కార్బన్డయాక్సైడ్ విడుదలవదు కాబట్టి  గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గమని కొందరు అణువిద్యుత్ ని సమర్ధిస్తున్నారు. నిజంగా గ్లోబల్ వార్మింగ్ గురించే ఆలోచిస్తే, కార్బన్ డయాక్సైడ్ తో పాటు, ఎటువంటి రేడియో యాక్టివ్ వ్యర్థాలనూ కూడా విడుదల చేయని నూరుశాతం క్లీన్ పవర్ అయిన సౌర్, వాయు శక్తి ని అభివృద్ధి చేసుకోవాలి. 2011 సంవత్సరంలో సునామీ వల్ల దెబ్బతిన్న జపాన్ లోని ఫుకుషిమా అటామిక్ పవర్ ప్లాంట్ ని అప్పుడే ఆపేసినా, ఇప్పటికీ decommissioning చేయలేని పరిస్థితి వుంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ పాడయిన రియాక్టర్లను నీటి తో చల్లబరుస్తూ ఉండటం కోసం దాదాపు వెయ్యి ట్యాంకులలో పదిలక్షల టన్నుల రేడియో యాక్టివ్ వ్యర్థాలున్న నీటిని నిలువ చేసి ఉంచారు. ఇప్పటికీ ఆ నీటిని ఏం చేయాలి అన్న నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదే రేటులో అలాంటి కలుషిత నీటిని నిలువ ఉంచితే, 2022 వచ్చేసరికి ఆ ప్లాంట్ లో ఉన్న ప్రాంతం మొత్తం టాంకులతో నిండి పోతుంది. ఆ తరువాత ఫసిఫిక్ మహాసముద్రంలో వదలాలి. అప్పుడది ప్రపంచ సమస్య అవుతుంది. ఏదేమైనా అక్కడున్న టాంకులను తొలగిస్తే తప్ప decommissioning చేయలేరు. ప్రస్తుత అంచనాల ప్రకారం Decommissioning కి అయ్యే ఖర్చు  అక్షరాలా 13 లక్షల కోట్ల రూపాయలు. 

వీటన్నింటికంటే ముఖ్యంగా నిరంతరం ఒక ఉపద్రవాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నట్టు ఉండే అటామిక్ పవర్ ప్లాంట్ మనకి అవసరమా? ప్రకృతి వైపరీత్యాలూ, టెర్రరిస్టు దాడులూ, యుద్దాలూ, సాంకేతిక లోపాలూ, పని చేసే సిబ్బంది చేసే తప్పిదాలు ఇలా ఏ ఒక్క కారణం వల్ల అయినా ప్రమాదం జరగొచ్చు. ప్రమాదం జరిగితే డైరెక్ట్ రేడియేషన్ వల్ల మాత్రమే కాక, మనుషులను తరలించే క్రమంలో కూడా మరణాలుంటాయి. ఫుకుషిమా ప్రమాదం జరిగినప్పుడు తక్కువస్థాయి రేడియేషన్ వల్ల సంభవించిన దీర్ఘకాలిక మరణాలు 400 అయితే, ప్రజల్ని తరలించే సమయంలో తొక్కిసలాట వల్ల, భయం వల్ల 1600 మంది చనిపోయారు. 

పోనీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కట్టకుండా కేవలం మైనింగ్ చేసి ఖనిజాన్ని  అమ్ముకుందాం అనుకున్నా కూడా మైనింగ్ వల్ల వచ్చే వేస్ట్ వల్ల చాలా పెద్ద మొత్తంలో రేడియో ధార్మిక కాలుష్యం వెలువడుతుంది. ఇప్పటికే పనులు జరుగుతున్న కడపలోని తుమ్మలపల్లి యురేనియం శుద్ధి కర్మాగారం దగ్గర ప్రతి రోజు 2350 టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి, 1,350 గ్రాముల ఖనిజాన్ని తీయడం జరుగుతుంది.  మిగిలిన 2349 కేజీలలో రేడియోయాక్టివ్ వ్యర్థాలు ఉంటాయి. ఇదంతా అక్కడ ఉన్న టెయిల్ పాండ్ లోకి పంపిస్తారు. 2012 నుండి ఇప్పటి వరకు కొన్ని వేల టన్నులు వేస్ట్ పోగుపడి ఉంది. అది భూగర్భ జలాల్లో కలవడం వల్ల చుట్టుపక్కల ఊర్లలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఈమధ్యనే కొందరు సైంటిస్టులు గవర్నమెంటు కి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది కూడా. తుమ్మలపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు చర్మం మీద పుండ్లు రావడం,  సంతానలేమి, పంటల దిగుబడి బాగా పడిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే పనులు జరుగుతున్న తుమ్మలపల్లి మైన్ నుండి ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉండగా, వాటికి కారణాలు శోధించకుండా, పరిష్కారాలు చూపించకుండా, మళ్ళీ ఇంకో చోట మైనింగ్ మొదలు పెట్టబోతున్నాను. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు మీ ఊరి దగ్గర యురేనియం మైనింగ్ చేయొచ్చు. అప్పుడు మిగిలిన ప్రాంతాల వాళ్ళు మౌనంగా ఉంటారు. అందుకే ఇది మనందరి సమస్య. 

పైవన్నీ ఎంత పెద్ద సమస్యలో, చెంచులను వేరే ప్రాంతానికి పంపడం అంతకంటే పెద్ద సమస్య. చెంచులు ఆదివాసులు. చెంచులు సజీవ చరిత్ర పుస్తకాలు. విపరీతమైన కంజ్యూమరిజంలో పడి, జీవితాల్ని పాడు చేసుకుంటున్న సోకాల్డ్ డెవలప్డ్ జనాలకు, తక్కువ వనరులతో ఆనందంగా బతకడం ఎలాగో నేర్పగల గురువులు.  ఇష్టంతో, ప్యాషన్ తో ఆంత్రోపాలాజిస్ట్ గా ఉన్న వారిని అడిగి చూడండి. చెంచుల వంటి ఆదిమ తెగల వద్ద ఎంత జ్ఞానం ఉంటుందో తెలుస్తుంది. వాళ్ళని కాపాడుకోవడం మన అవసరం. వేల సంవత్సరాలుగా ‘స్లో లైఫ్ స్టైల్’ కి అలవాటు పడ్డవారిని, వాహనాల పరుగుల మధ్య, ఈ శబ్ద కాలుష్యాల మధ్య పడేయడం దారుణమైన హింస. విశాలత్వానికి, ప్రకృతికీ అలవాటుపడిన వారిని తీసుకొచ్చి ఇరుకు గదుల్లో పడేస్తే వారికి ఊపిరాడదు. చాలా ఒత్తిడి (స్ట్రెస్) అనుభవిస్తారు. మెల్లిగా కొన్ని సంవత్సరాలకు ఆ జాతి మొత్తం అంతరించి పోతుంది. ఒక విధంగా ఇది స్లో పాయిజనింగ్. It’s a state sponsored genocide (మారణహోమం). మనుషులంతా దీన్ని వ్యతిరేకించాలి. అప్పుడే మన గుండెల్లో ఏమాత్రం తేమ మిగిలి ఉన్నా దాన్ని కాపాడుకోగలం.

హైదరాబాద్ నుండి బయలు దేరి మూడు గంటలు ప్రయాణం చేసి, ఉమామహేశ్వరం వెళ్లి నల్లమలను పలకరించి, రెండు చేతులూ చాచి అడవిని హత్తుకొని, పక్షుల పలుకుల్ని, ఆకుల సవ్వడుల్ని ఆస్వాదించి, కొండపైకెక్కి చూస్తూ సుదూర విశాలత్వాన్ని గుండెల్లోకి పీల్చుకొని, అక్కడ నుండి మల్లెల తీర్థం వెళ్లి జలపాతం కింద కూర్చొని జలపాతమైపోయి, దగ్గర్లో ఉన్న చెంచుల ఊరెళ్లి, వారితో మాట్లాడి, మీకోసం మేమున్నామని భరోసా ఇచ్చి వస్తే, మనసుకు ఎంత తృప్తిగా ఉంటుంది? ఆ ఫోటోలన్నీ తెచ్చి సోషల్ మీడియాలో #SaveNallamala hashtag తో పోస్ట్ చేస్తే అది మంచి ఉద్యమమే. లోపల బయట కూడా జరిగే ఉద్యమం.

రాంబాబు తోట

7 comments

  • Buddha weeps in Jaduguda documentary చూస్తే యురేనియం తవ్వకం, టైలింగ్ పాండ్స్ ఆదివాసీల జీవితాలతో ఎలా చెలగాటమాడతాయో తెలుస్తుంది. ఈ సినిమాని గతవారం నెల్లూరులో ప్రదర్శించాము. యూ ట్యూబులో వుంది.

  • అభివృద్ధి అవసరమే ! కూర్చున్న కొమ్ము నర్కునే అంత భయంకరంగా ఉండకూడదు.ప్రభుత్వాలు సోలార్, విండ్ పవర్ దిశగా అడుగేయాలి.
    ఆదివాసిలను జీవనం ప్రశ్నార్థకంగా వుంటుంది.
    చాల మంచి ఆర్టికల్ రాసిన రాంబాబు తోట గారికి అభినందనలు 🌹🌹🌹🌹

  • అభినందనలు. నేటి అవసరం గురించిన విషయాలు తెలిపారు.

  • యురేనియం తవ్వకాల వల్ల, అణు విద్యుత్ ఉపయోగం, యురేనియం అమ్మకం వలన కలిగే అనర్థాలు అంత ర్జాతీయ అంశాలు మేళవించి మానవతా దృక్పధంతో ఆలోచించి బాగా వ్రాసారు.

  • గొప్ప వ్యాసం. మనిషిలోని స్వాభావిక ఉగ్రవాదానికి పరాకాష్ట అభివృద్ధి పేరుతో చేసే ప్రకృతి విధ్వంసం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.