అణువిద్యుత్ సమర్థకులు
దాచేస్తున్న నిజాలు

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ పరిసర ప్రాంతంలో 83 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో, యురేనియం కోసం డ్రిల్లింగ్ చేసుకోవడానికి పర్యావరణ మరియు అటవీశాఖ వారు UCIL(యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ సందర్భంలో అణు విద్యుత్ తయారీకి సంబంధించిన నిజానిజాల్ని చర్చించడం చాలా అవసరం. ఎందుకంటే, ప్రజల్ని తప్పుదోవ పట్టించేది కల్పిత సమాచారం మాత్రమే కాదు. ఒక విషయానికి సంబంధించిన కొన్ని అంశాలను మాత్రమే చెప్పి, కొన్ని అంశాలను తెలియజేయకుండా ఉండటం, జనసామాన్యాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. అణువిద్యుత్ తయారీలోని  ప్రయోజనకరమైన అంశాలను మాత్రమే మీడియా, పాఠ్యపుస్తకాల ద్వారా తెలియజేసి, సమస్యాత్మకమైన, ఆర్థికంగా నష్ట కారకమైన అంశాలను తెలియజేయకుండా ఉండడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. ఈ ఆర్టికల్ లో అణు విద్యుత్ కు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా చర్చించడం జరిగింది.

అణు విద్యుత్తు ఎలా తయారవుతుంది?

అటామిక్ రియాక్టర్లో యురేనియం పరమాణువుని న్యూట్రాన్ తో  పగులగొట్టడం వల్ల అది రెండు చిన్న పరమాణువులుగా విడిపోతుంది. దీనిని అణు విచ్ఛిత్తి (nuclear fission) అంటారు. అలా విడిపోయినప్పుడు, కొంత ద్రవ్యరాశి ఉష్ణశక్తిగా మారిపోతుంది. E = mc2 సూత్రం ఆధారంగా లెక్కగడితే, ఆ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది.  అంతే కాకుండా పరమాణువు విడిపోయినప్పుడు మూడు ఫ్రీ న్యూట్రాన్లు కూడా విడుదల అవుతాయి. అలా విడుదల అయిన మొదటి జనరేషన్ free neutrons ఇంకో మూడు యురేనియం పరమాణువులు గుద్దుకోవడం ద్వారా, ఆ మూడూ విచ్ఛిత్తి చెంది, తొమ్మిది సెకండ్ జనరేషన్ ఫ్రీ న్యూట్రాన్లు, ఉష్ణశక్తి విడుదలవుతాయి. ఈ విధంగా చైన్ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ లో విడుదలైన ఉష్ణశక్తితో, అధిక పీడనం గల నీటి నుంచి ఆవిరిని ఉత్పత్తి చేసి, దానితో పెద్దపెద్ద స్టీమ్ టర్బైన్స్ ని తిప్పి విద్యుత్తును తయారు చేస్తారు. 

అణు విచ్ఛిత్తి  తరువాత విడుదలైన న్యూట్రాన్ల వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల, అవి యురేనియం పరమాణువులను పగులగొట్టే చాన్సెస్ తక్కువగా ఉంటాయి. అందుకే వాటి వేగాన్ని తగ్గించి, చైన్ రియాక్షన్ బాగా జరగడానికి వీలుగా ఇంధన కడ్డీలను నింపుతూ నీటిని “మాడరేటర్” గా వాడతారు. చైన్ రియాక్షన్ రేటు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఫ్రీ న్యూట్రాన్లను తమలోకి పీల్చుకోవడానికి బోరాన్ లేదా కాడ్మియం తో తయారైన “నియంత్రణ కడ్డీలను” ఇంధన కడ్డీల మధ్యకు పంపుతూ, అణు విచ్ఛిత్తి రేటును కంట్రోల్ చేస్తూ ఉంటారు.

 

అణు విద్యుత్తు చాలా చౌక అనే ప్రచారంలో నిజమెంత?

ప్రకృతిలో దొరికే యురేనియంలో 99 శాతం, తటస్థంగా  ఉండే యురేనియం-238. అది విద్యుత్ తయారీకి పనిచేయదు.  కేవలం ఒక్క శాతం ఉండే యురేనియం-235 ఐసోటోప్ మాత్రమే అణు విద్యుత్ తయారీకి ఉపయోగపడుతుంది.  దాన్ని సేకరించడం, శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పోనీ యురేనియం 238, యురేనియం 235 రెండూ కలసిన మిశ్రమం అయినా వాడుకోవడానికి వీలుగా, శుద్ధంగా దొరికితే కాస్తయినా ఖర్చు తగ్గేది. కానీ ఒక కేజీ యురేనియంని సేకరించడానికి, పన్నెండు వందల టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలి. దీనికి చాలా ఖర్చు అవుతుంది. యురేనియం ముడి ఖనిజాన్ని శుద్ధి చేయడంలో వేల టన్నుల రేడియో యాక్టివ్ వ్యర్థాలు పోగవుతాయి. వాటి మేనేజ్మెంట్ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా పర్యావరణానికి చేటు చేస్తుంది. 

అణువిద్యుత్ చౌక అని  నమ్మడానికి ప్రధాన కారణం,  పరమాణువుని చేధిస్తే , బోలెడంత శక్తి వెలువడుతుందనే సైన్స్ పాఠం. పరమాణువు రెండుగా విడిపోయినప్పుడు,  కొద్దిగా ద్రవ్యరాశి, శక్తిగా మారడం వల్ల చాలా ఎక్కువ శక్తి విడుదల అవుతుందనేది నిజమే. కానీ అణు విచ్ఛిత్తి అనేది వేరుశెనక్కాయని రెండు వేళ్ళ మధ్య ఉంచి, నొక్కితే గింజలు బయటకు వచ్చినంత సులువుగా జరిగే ప్రాసెస్ కాదు. అణు రియాక్టర్ నిర్మాణం చాలా ఎక్కువ పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం. దానికి తోడు వేరే దేశాలు తయారు చేసిన టెక్నాలజీని మనం కొనుక్కోవడం వల్ల, పేటెంట్ హక్కులు కోసం చెల్లించే మొత్తం పెట్టుబడికి అదనంగా చేరుతుంది. ప్లాంట్ నిర్మాణానికి పట్టే సమయం 20 నుండి 25 సంవత్సరాలు. ఇంత ఎక్కువ సమయం పట్టడం వలన, ఉత్పత్తి మొదలవ్వకుండా పెట్టుబడి మీద వడ్డీ మాత్రం పెరుగుతూ ఉంటుంది. లైఫ్ అయిపోయిన  నూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఆపేసి ఇంధనాన్ని, ఇతర వ్యర్థాలనూ తొలగించి, ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేని స్థితికి తీసుకురావడానికి (plant decommissioning) అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఆ decommissioning ఖర్చుని కూడా పెట్టుబడిలో కలుపుకోవాలి. ఈ విధంగా మైనింగ్, ప్లాంట్ నిర్మాణం, waste management, decommissioning అన్నీ చాలా ఎక్కువ ఖర్చుతో జరిగే వ్యవహారాలు అవడం వల్ల, నూక్లియర్ పవర్ ఉత్పత్తికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఐదేళ్ళ క్రితం వరకూ కేవలం జల విద్యుత్తు, బొగ్గు, సహజవాయువుతో నడిచే థర్మల్ విద్యుత్ మాత్రమే అణువిద్యుత్ కంటే తక్కువ రేటు ఉండేవి. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు తయారీకి అణువిద్యుత్ కంటే ఎక్కువ ఖర్చు అయ్యేది. కానీ ఈ దశాబ్దం కాలంలో సోలార్, విండ్ ఎనర్జీ వాడకం పెరగడం వల్ల,  ఫోటో వోల్టాయిక్ సెల్స్ రేటు, గాలిమరల రేట్లు విపరీతంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం అణువిద్యుత్ కంటే సౌర, పవన విద్యుత్ తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలుగుతున్నారు. 

గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి నూక్లియర్ పవర్?

అటామిక్ రియాక్టర్ నుండి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవదు కాబట్టి  గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గమని అణువిద్యుత్ ని సమర్థించేవారి వాదన. కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవ్వని మాట నిజమే కానీ పర్యావరణం గురించే ఆలోచిస్తే,  CO2 తో పాటు, ఎటువంటి radio active wastes విడుదల చేయని నూరుశాతం క్లీన్ పవర్ అయిన సౌర, పవన్ విద్యుత్ నే అభివృద్ధి చేసుకోవాలి కదా? మనుషులు కూడా పర్యావరణంలో భాగమేగా? మనుషులలో కేన్సర్ వంటి వ్యాధులను పుట్టించగల రేడియో ధార్మిక వ్యర్థాలను విడుదల చేసే నూక్లియర్ పవర్ ఏవిధంగా క్లీన్ ఎనర్జీ అవుతుంది?

గత పది సంవత్సరాలుగా, ప్రపంచ వ్యాప్తంగా సౌర విద్యుత్ పలకల (ఫోటో వోల్టాయిక్ సెల్) రేట్లు, గాలిమరల రేట్లు తగ్గుతూనే ఉన్నాయి. ఇంకా ఇంకా తగ్గుతాయి. గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచించినా, ఆర్థికంగా ఆలోచించినా సౌర మరియ పవన్ విద్యుత్ వాటా పెంచుకుంటూ పోవడం తెలివైన విధానం. 

భూమి లోపలి పొరల్లో ఉన్న వేడిని ఉపయోగించుకొని, నీటిని ఆవిరి చేసి దానితో steam turbines  నడిపి, చాలా దేశాలు geothermal విద్యుత్ ని తయారు చేస్తున్నాయి. carbon dioxide విడుదల అవకుండా, విద్యుత్ ని ఉత్పత్తి చేయగల ఈ విధానంలో ప్లాంట్ లు పెట్టడానికి వీలుగా ఉన్న 350 లోకేషన్లను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. కానీ, ఎవరికీ హాని చేయని ఆ టెక్నాలజీ వైపు ఇంకా ఏవిధమైన ప్రయత్నమూ జరగడం లేదు. 

గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం ప్రపంచంలో చాలా దేశాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే పునరుత్పాదక ఇంధన వనరుల(renewable energy source) వైపు  అడుగులు వేస్తున్నాయి. అణు విద్యుత్తు లో ఉపయోగించే యురేనియం శాశ్వతంగా ఉండే ఇంధనం అయితే కాదు. మూడు వందల సంవత్సరాల తర్వాత యురేనియం నిల్వలు పూర్తిగా అడుగంటి పోతాయి.  

స్కాట్లాండ్ 98% విద్యుత్ ను గాలి మరల తో ఉత్పత్తి చేస్తుంది. Sweden దేశం 2040 సంవత్సరంలోపు నూటికి నూరు శాతం సౌర, పవన విద్యుత్తు మీద మాత్రమే ఆధారపడే దిశగా అడుగులు వేస్తుంది. కోస్తారికా వంటి చిన్న దేశం తన విద్యుత్ ఉత్పత్తిలో 95% సౌర, పవన, థర్మల్, జియో థర్మల్ విధానాలలో తయారు చేసుకుంటుంది. 2022 లోపు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లన్నిటిని మూసివేసి, 2030 లోపు 65 శాతం విద్యుత్ ఉత్పత్తి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. 2018 సంవత్సరంలో జర్మనీలోని ప్రతి ఇంటికీ సరిపడ విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరులు సహాయంతో మొదటి అర్ధ సంవత్సరంలోనే ఉత్పత్తి చేయగలిగింది. డెన్మార్క్ తన విద్యుత్ అవసరాల్లో సగానికి పైగా పవన విద్యుత్ ద్వారా సమకూర్చుకుంటుంది. 2050 లోపు తమ దేశ విద్యుత్ పూర్తిగా renewable energy sources నుంచి సమకూర్చుకునే  ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం అమెరికాలోని సోలార్ ఇండస్ట్రీ కల్పించే ఉద్యోగాల సంఖ్య, బొగ్గు విద్యుత్తు కర్మాగారాల ఉద్యోగుల సంఖ్య కంటే ఎక్కువ. 2010 సంవత్సరంలో 13% జియో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే కెన్యా, ప్రస్తుతం 50 శాతం ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధన వైపు అడుగులు వేస్తోంది. 

ఇండియాలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి లో లో ఈ 22% మాత్రమే రెన్యువబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి వస్తోంది. 13% లార్జ్ హైడ్రో నుంచి వస్తుంది. దానిని రెన్యువబుల్ ఎనర్జీ సోర్స్ గా పరిగణించలేము. ఎందుకంటే అది నిలకడగా ఉండే ఇంధన వనరు కాదు. ఫిన్లాండ్ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ  భారతదేశం భౌగోళిక పరిస్థితులను పరిశీలించి 2050 సంవత్సరం కల్లా పూర్తిగా రెన్యువబుల్ ఎనర్జీ సోర్స్ కి మారిపోవడానికి అవకాశం ఉందని నిర్ధారించారు. గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టాలన్నా, భవిష్యత్తులో రాబోయే ఇంధన కరువుని ఎదుర్కోవాలన్నా అదొక్కటే సరైన మార్గం.  

న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో ప్రమాదాలు

చెర్నోబిల్ పేలుడు : ఉక్రెయిన్‌ దేశంలోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో జరిగిన పేలుడు, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలలో అత్యధిక మృతులు, అత్యధిక ఆస్తి నష్టం నష్టం జరిగిన  సంఘటన. 1986 ఏప్రిల్‌ 26న తేదీన ఒక సేఫ్టీ టెస్ట్ చేయడానికి ప్లాంట్ సిబ్బంది ప్రయత్నించారు. ఎప్పుడూ సర్క్యులేషన్ లో ఉండే కూలింగ్ వాటర్ సిస్టం ఆగిపోతే, back-up cooling water system ని స్టార్ట్ చేసి, రియాక్టర్ ని సాధారణ స్థితిలో ఉంచడమే ఆ టెస్ట్ యొక్క ఉద్దేశం. కానీ  back-up cooling water లేట్ అవడమూ, రియాక్షన్ రేట్ ని తగ్గించే control rods పూర్తిగా బయటే ఉండిపోవడం వల్ల, ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఇంధన కడ్డీలు కరిగిపోయి, ఆవిరైపోయి రియాక్టర్ పేలిపోవడం జరిగింది. మొదటి 36 గంటల్లో పది కిలోమీటర్ల పరిధిలోని 50 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. తరువాత ఈ పరిధిని 30 కిలోమీటర్లకు పెంచాల్సి వచ్చింది. 70 వేల మందిని అదనంగా తరలించాల్సి వచ్చింది.  అప్పుడు జరిగిన పేలుడు ప్రభావం, ఇప్పటికీ అక్కడి జీవజాలాన్ని వెంటాడుతూనే ఉంది. వెంటనే చనిపోయిన వారు 31 మంది మాత్రమే అయినా రేడియేషన్ వల్ల జరిగిన దీర్ఘకాలిక మరణాలు నాలుగు వేలు. ఈ సంఖ్యను ఐక్యరాజ్య సమితి పత్రికలకు విడుదల చేసింది. కానీ తొమ్మిది వేల మంది దూర ప్రాంతాల మృతులు కూడా ఉన్నాయని, వాటిని ప్రెస్ రిపోర్ట్ నుండి తొలగించారని, ఆ రిపోర్టును తయారు చేసిన సైంటిస్టులే ఆరోపించారు.  

‘Newyork Academy Of Sciences’ vol 1181 లో చెర్నోబిల్ సంఘటన ప్రభావం గురించిన రిపోర్ట్ ప్రచురితమయింది.  యూరప్ దేశాలలో చెర్నోబిల్ పేలుడు తరువాత పెరిగిన కేన్సర్ మరణాలను, ఇతర ఆరోగ్య సమస్యలను పరిశోధించిన శాస్త్రవేత్తలు తయారు చేసిన నివేదిక అది.  ఆ నివేదిక ప్రకారం అప్పటి నుండి ఇప్పటి వరకూ మృతుల సంఖ్య రెండు లక్షల ఇరవై వేలు. చెర్నోబిల్‌ అణు ప్రమాదంలో హిరోషిమా, నాగసాకిల మీద వేసిన అణు బాంబుల నుంచి విడుదలయిన దాని కంటే నాలుగురెట్లు ఎక్కువ రేడియేషన్‌ విడుదలయిందని నిపుణుల అంచనా వేసారు. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగం దీని దుష్ప్రభావానికి గురయింది. రష్యా మాత్రమే కాక, యూరప్ మొత్తం ఆ రేడియేషన్ వ్యాపించింది. ఐక్యరాజ్య సమితి నిర్దారణ ప్రకారం జరిగిన ఆర్ధిక నష్టం అక్షరాలా 17 లక్షల కోట్ల రూపాయలు. 

ఫుకుషిమా విపత్తు : 2011 మార్చి 12న ఫుకుషిమా అణువిద్యుత్ కర్మాగారంలో సునామీ వల్ల పవర్ సప్లై పూర్తిగా ఆగిపోయింది. control rodsతో రియాక్టర్ ని పూర్తిగా ఆపేసినా, కొంత రియాక్షన్ ఎప్పుడూ జరుగుతూ, ఉష్ణం పుడుతూ ఉంటుంది. అందుకే రియాక్టర్ రన్నింగ్ లో లేనప్పుడు కూడా కూలింగ్ వాటర్ circulate అవుతుండాలి. కానీ, సునామీ వల్ల backup supply ఆగిపోవడంతో రియాక్టర్ లో ఉన్న నీరంతా ఆవిరైపోయి, తరువాత క్రమంగా రియాక్టర్ 2000 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకొని, ఇంధన కడ్డీలన్నీ కరిగిపోయి, మాగ్మాగా మారి, స్టీల్ కంటెయినర్ ని కరిగించుకొని కింద ఉన్న కాంక్రీట్ బేస్మెంట్ లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో విడుదలైన గ్యాస్ లో ఉన్న హైడ్రోజన్ గాలిలోని ఆక్సిజన్ తో మండి పేలుడు సంభంవించింది. పేలుడు వల్ల రేడియో ధార్మిక పదార్థాలు గాలిలో కలిసిపోయాయి. ఒక రియాక్టర్ నుండి రేడియో యాక్టివ్ పదార్థాలు సముద్రంలో కూడా కలిసిపోయాయి. అప్పటి నుండి మూడు నెలల పాటు సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. 8 నెలల తర్వాత మాత్రమే కూలింగ్ వాటర్ సర్క్యులేషన్ ని క్రమబద్దీకరించి cold shut down చేయగలిగారు. ఫుకుషిమా రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక మరణాలు నాలుగు వందలు మాత్రమే అయినప్పటికీ ప్రజలను తరలించేటప్పుడు చనిపోయిన వారి సంఖ్య 1600. 

సునామీ వచ్చిన రోజే  విద్యుత్ ఉత్పత్తి ఆపేసినా, ఇప్పటికీ decommissioning చేయలేని పరిస్థితి. అప్పటి నుండి ఇప్పటి వరకూ డామేజ్ ఆయిన రియాక్టర్లను వాటర్ తో కూల్ చేస్తూ ఉన్నారు. డ్యామేజ్ అవడం వల్ల, ఆ వాటర్ లోకి రేడియో ధార్మిక వ్యర్థాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకూ దాదాపు వెయ్యి ట్యాంకులలో పదిలక్షల టన్నుల రేడియో యాక్టివ్ వ్యర్థాలున్న నీటిని నిలువ చేసి ఉంచారు. ఇప్పటికీ ఆ నీటిని ఏం చేయాలి అన్న విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదే రేటులో ఆ కలుషిత నీటిని నిలువ ఉంచితే, 2022 వచ్చేసరికి ఆ ప్లాంట్ లో ఉన్న ఏరియా మొత్తం ఇటువంటి రేడియో యాక్టివ్ వాటర్ టాంక్స్ తో నిండి పోతుంది. ఆ తరువాత ఫసిఫిక్ మహాసముద్రంలో వదలాలి. అప్పుడది ప్రపంచ సమస్య అవుతుంది. ఏదేమైనా అక్కడున్న టాంక్స్ ని తొలగిస్తే తప్ప decommissioning చేయలేరు. డీ కమీషనింగ్ చేస్తే తప్ప కూలింగ్ వాటర్ ఆపలేరు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆ ప్లాంట్ decommissioning కి అయ్యే ఖర్చు  అక్షరాలా 13 లక్షల కోట్ల రూపాయలు. 

రోజుకు 300టన్నుల చొప్పున ఫుకుషిమా ప్లాంట్ నుండి పసిఫిక్ మహా సముద్రం లోకి  విడుదలయ్యే రేడియో యాక్టివ్ వాటర్ వల్ల చాలా చేపలకు పుండ్లు పడటం, రక్తం రావడం జరిగింది. పరీక్ష నిర్వహించగా వాటిలో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉన్నాయని తేలింది.  రేడియోధార్మికతకు లోనైన చేపలు దూరప్రాంతాలకు వలస వెళ్ళడం వలన, అమెరికాలో ఉన్నవారి ఫుడ్ చెయిన్ లో కూడా రేడియో యాక్టివ్ పదార్థాలు చేరాయి. దీనివల్ల మనుషులకు జంతువులకు మాత్రమే కాకుండా జీవ వైవిధ్యానికి కూడా ముప్పు ఏర్పడింది.  దక్షిణ కాలిఫోర్నియా తీరంలో సీలయన్ పిల్లల్లో 45 శాతం పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోయాయి. మూడో వంతు పిల్లలు చనిపోవడం సాధారణమైన విషయమే. ఫుకుషిమా ప్రమాదం జరిగిన నెల తరువాత 12 శాతం ఎక్కువగా చనిపోయాయి. ఇటువంటి రేడియేషన్ వలన కొన్ని జాతులు పూర్తిగా అంతరించిపోయే అవకాశం కూడా ఉంది

రేడియోధార్మిక వ్యర్ధాలు

అణు విద్యుత్తు వల్ల ప్రధాన సమస్య అణు విద్యుత్ కర్మాగారాల్లో జరిగిన పేలుళ్లు కాదు. నలభై లేదా యాభై ఏళ్ల తరువాత decommissioning చేసినప్పుడు, మిగిలిపోయిన రేడియో ధార్మిక వ్యర్థాలు. రియాక్టర్ లో వాడని కొత్త ఇంధనం కంటే వాడేసిన ఇంధనం నుండి ఎక్కువ రేడియేషన్ వస్తుంది.   ఈ రేడియో యాక్టివ్ వ్యర్థాలను నిల్వ చేయడం ప్రపంచ ముందున్న అతి పెద్ద సమస్య. ఎందుకంటే వీటిని నిల్వ ఉంచాల్సిన సమయం కొన్ని సంవత్సరాలు కాదు. కొన్ని శతాబ్దాలు కాదు. వేల సంవత్సరాల పాటు దాచి ఉంచాలి. ఈ వ్యర్థాలలో ఉండే సీజయం 135, స్ట్రాంటియం 90 మొదలగునవి 30 సంవత్సరాలలో తటస్థ స్థితికి వచ్చేస్థాయి. కానీ ప్లూటోనియం139 అర్థజీవితకాలం మాత్రం 24 వేల సంవత్సరాలు. ఈ వ్యర్థాలను భూమి అడుగున లోతుగా దాచేస్తే దాని వలన కొంత కాలం తర్వాత భూగర్భ జలాలు కలుషితం కావచ్చు అందుకే వీటిని ఎత్తైన కొండల పైన నిల్వ ఉంచాలి అని ఒక ప్రతిపాదన ఉంది కానీ ఇప్పటివరకు ఒక్క చోట కూడా అది జరగలేదు. ఇప్పటికీ విద్యుత్ కర్మాగారాల్లో భూమి లోపల తాత్కాలికంగా నిల్వ ఉంచబడి మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నిజంగానే టన్నెల్స్ లో నిల్వ ఉంచినా 24 వేల సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారతాయి. దేశాల సరిహద్దులు మారతాయి. అంతెందుకు ప్రకృతి వైపరీత్యాల వల్ల, నిల్వ ఉంచిన ప్రాంతాల ఉపరితల స్వరూపం మారిపోవచ్చు. కొత్త తరాల వారు తవ్వకాలు జరిపి ఈ రేడియేషన్ వల్ల పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు.  పోనీ నిల్వ ఉంచిన చోట శాశ్వతంగా ఉండిపోయే నోటీసు బోర్డు పెడదాం అనుకున్నా ఇప్పుడున్న భాషలు అప్పటివరకు ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఈలోపు టెర్రరిస్టు గ్రూపులు ఈ వ్యర్థాన్ని దొంగిలించి, దానితో అణుబాంబు తయారుచేయవచ్చు. 

ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 88 వేల టన్నుల రేడియో యాక్టివ్ వ్యర్థాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం చూసుకుంటే దీనికి నాలుగు రెట్లు ఉంటాయి. ఈ వ్యర్థాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి.  వాటిని శాశ్వతంగా ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాడుతున్న రేట్ లో యురేనియం ఇంధనాన్ని వాడుతూ ఉంటే, మూడు వందల సంవత్సరాల తర్వాత యురేనియం నిల్వలు పూర్తిగా అడుగంటి పోతాయి. అదేమీ శాశ్వత ఇంధన వనరు కాదు. 

అణు విద్యుత్తు అభివృద్ధికర టెక్నాలజీనా?

అభివృద్ధి చెందిన దేశాలన్ని న్యూక్లియర్ పవర్ ని వాడుకొని ముందుకు పోతున్నాయన్నది ఒక తప్పుడు అవగాహన.  ప్రపంచ వ్యాప్తంగా మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణువిద్యుత్ వాటా ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోంది 1996 సంవత్సరంలో 18 శాతంగా ఉన్న అణువిద్యుత్ వాటా ప్రస్తుతం 11 శాతం గా ఉంది. ఇంతగా తగ్గిపోవడానికి ప్రధాన  కారణం అభివృద్ధి చెందిన దేశాలే. అవి కొత్త రియాక్టర్ల నిర్మాణానికి పూనుకోకపోవడమే. ఈ శాతం ముందు ముందు మరింతగా తగ్గుతుంది. ఎందుకంటే కొత్తగా నిర్మితమైన రియాక్టర్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న రియాక్టర్ల  లైఫ్ నలభై నుంచి యాభై సంవత్సరాలు మాత్రమే. ప్రపంచంలో మెజారిటీ దేశాలు సౌర విద్యుత్తు పవన విద్యుత్తు వైపు అడుగులు వేస్తున్నాయి. జర్మనీ అయితే 2022 సంవత్సరానికల్లా మొత్తం అణు విద్యుత్తు ఉత్పత్తిని ఆపేయాలని నిర్ణయించింది. 

రోజురోజుకు సౌర విద్యుత్తు పవన విద్యుత్తు రేట్లు తగ్గుతూ ఉండగా, అభివృద్ధి చెందిన దేశాలు వదిలేసుకున్న అణు విద్యుత్ ఉత్పత్తిని మనం చేపట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ టెక్నాలజీని మనకి అమ్మడం ద్వారా వారు డబ్బులు చేసుకోవడం కోసం అణు విద్యుత్ గురించి పాజిటివ్ గా ప్రచారం చేస్తూ ఉన్నాయి. సౌర విద్యుత్తు, పవన విద్యుత్ లా కాకుండా అణువిద్యుత్ కర్మాగారానికి సంబంధించి ప్రాజెక్ట్ ఖర్చులను చాలా ఎక్కువ రేట్లు రాసుకోవడానికి వీలు ఉంటుంది. అందువలన అవినీతి, కుంభకోణాలు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.  నాయకులకు అధికారులకు సంపాదించుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సోలార్ ప్లేట్ల విషయంలో ఈ విధంగా చేయడం వీలు పడదు. అందుకే గ్లోబల్ వార్మింగ్ పేరు చెప్పుకుని సౌరవిద్యుత్ వైపు, పవన విద్యుత్ వైపు మొగ్గకుండా అణువిద్యుత్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ రెండు కారణాలు తప్ప, ఆర్థికంగా గానీ, పర్యావరణ పరంగా గానీ, ఉద్యోగాల కల్పనలో గాని అణు విద్యుత్ ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు.

వీటన్నింటికంటే ముఖ్యంగా నిరంతరం ఒక ఉపద్రవాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నట్టు ఉండే అటామిక్ పవర్ ప్లాంట్ మనకి అవసరమా? ప్రకృతి వైపరీత్యాలూ, టెర్రరిస్టు అటాక్ లూ, యుద్దాలూ, సాంకేతిక లోపాలూ, పని చేసే సిబ్బంది చేసే మానవ తప్పిదాలు ఇలా ఏ ఒక్క కారణం వల్ల అయినా ప్రమాదం జరగొచ్చు. ప్రమాదం జరిగితే డైరెక్ట్ రేడియేషన్ వల్ల మాత్రమే కాక, మనుషులను తరలించే ప్రాసెస్ లో కూడా మరణాలుంటాయి. ఫుకుషిమా ప్రమాదం జరిగినప్పుడు లో రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక మరణాలు 400 అయితే, ప్రజల్ని తరలించే సమయంలో తొక్కిసలాట వల్ల, భయం వల్ల 1600 మంది చనిపోయారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి.  అదేవిధంగా అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ మంది ప్రజలను తరలించే సిస్టం గానీ, అంత మంచి రోడ్లు గాని మనకు లేవన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. 40 నుండి 50 సంవత్సరాల తాత్కాలిక లైఫ్ ఉన్న అణువిద్యుత్ ప్లాంట్ నుండి, 24000 సంవత్సరాలు పాటు లాండ్ మైన్ మీద నిలబడినట్టు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అతి ప్రమాదకర వ్యర్థాలు వస్తాయి. ఒక అశాశ్వతమైన ఇంధనాన్ని కొంత కాలం పాటు వాడుకొని, ఒక శాశ్వతమైన సమస్యను నెత్తిమీద పెట్టుకోవడం ఏ విధంగా తెలివైన పనో ప్రజలంతా బాగా ఆలోచించాలి.

 

రాంబాబు తోట

3 comments

 • అసలైన పాఠ్యాంశం ఇది.
  ప్రభుత్వాలు పునరాలోచించుకుంటే మంచిది.
  పైగా ఇంత భయంకర ప్రమాదకరమైన విధానాన్నీ
  పట్టుబట్టి ప్రభుత్వాలు తీసుకురావడం వెనుక నాయకులకు సంకుచితమైన లాభాలు వున్నట్లు ఖచ్చితంగా స్పష్టమౌతుంది.

  నల్లమలను (అడువులను)కాపాడుకోవడం సామాన్య విషయం కాదనేది అర్థమౌతుంది.అనుమతులకు …
  ప్రజాభిప్రాయం నిక్కచ్చిగా వుండాలి.
  పర్యావరణ పరిరక్షణ ప్రతి యొక్కరిది..
  ఆలోచించండి!!

 • పూర్తిగా వాస్తవం. అందరకు అర్థం అయ్యే శైలి.

 • Plutonium 239 అని పడాల్సింది అనుకుంటా. ఒక radioactive element పూర్తిగా నశించడానికి పది half lives కాలం పడుతుంది కనుక ఈ అణు వ్యర్థం రెండు లక్షల నలభై వేల సంవత్సరాలు ప్రమాదకారి గా వుంటుంది. నాగసాకి బాంబు plutonium తో తయారు చేసినదే.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.