బంకసారు

రండికూర్చొండి.” తన చాంబర్లోకి అడుగు పెట్టిన పార్ధు, కిరణ్ లను గిరిజన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు సాదరంగా ఆహ్వానించారు

వారిద్దరూ ‘పొంగేమియా ప్రొడక్ట్స్ లిమిటెడ్’ కంపెనీకి చెందినవారు. ఆ కంపెనీకీ, గిరిజన కార్పోరేషనుకీ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. గిరిజన కార్పోరేషను వారి ఆహ్వానం మేరకు కంపెనీ తన ప్రతినిధులను పంపింది

మంచినీళ్ళు తాగాక, పార్థు చెప్పాడు. “సార్, నేను కంపెనీకి దక్షిణ భారతదేశానికి ప్రొక్యూర్మెంటు ఇన్చార్జ్. ఇతడు కిరణ్. మన రాష్ట్రం ఇన్చార్జ్.” 

మేనేజైంగ్ డైరెక్టరు గంభీరంగా తల ఊపారు.

మా కంపెనీ, పేరుకే వ్యాపార సంస్థ. ప్రధాన ఉద్దేశ్యం, పర్యావరణ పరిరక్షణ. పొంగేమియా అంటే, కానుగచెట్టు. దీని విత్తనాలనుంచి తీసిన నూనెను బయో డీజిల్ గా వాడితే, కానుగ విత్తనాలు సేకరించే గ్రామీణులకు ఆదాయంతో పాటు, దేశంలో పర్యావరణ కాలుష్యం తగ్గించినవాళ్ళం కూడా అవుతాము. మా కంపెనీ యజమాన్యం, ఇతర వ్యాపార లాభాలతో దీన్ని ప్రారంంభించింది. బయోడిజిల్ ప్లాంటు స్తాపించటానికయ్యేఖర్చు చాలా ఎక్కువ కనుక కనీసం పదేళ్ళలోపల లాభాలు ఆశించటం లేదు.” 

మంచిది, చాలా సంతోషం.” ఎండీ గారు.

ప్రస్తుతం మేము కానుగ విత్తనాలను వ్యాపారుల ద్వారా కొంటున్నాము. కిలోకి హైదరాబాదులో ఆరు రూపాయలు ఇస్తున్నాము. ఈ రాష్ట్రంనుంచి మేము సేకరిస్తున్న కానుగ విత్తనాల్లో డెబ్బై శాతం ఒక్క కానుగపల్లె ప్రాంతపు వ్యాపారుల ద్వారానే వస్తోంది. మాకు ఇతర మార్గాల ద్వారా తెలిసిందేమిటంటే, కానుగపల్లె చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో గిరిజన స్త్రీలు విత్తనాలు సేకరిస్తే, వాటిని గిరిజన కార్పోరేషన్ నుండి అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు లైసెన్సులు పొందిన వ్యాపారులు కిలోకి మూడు రూపాయలే ఇస్తున్నారని తెలిసింది. మీ కార్పోరేషన్ మాకు లైసెన్సు ఇచ్చినట్లైతే, మేము నేరుగా గిరిజనులకే కిలో ఐదున్నర రూపాయలు ఇస్తాము. దీనివల్ల వాళ్ళ ఆదాయం దాదాపు రెట్టింపు అవుతుంది సార్.”

చాలా మంచిది. మీ ప్రమేయంతో గిరిజనులకు ఆదాయం పెరుగుతుందంటే అందరికంటే ఎక్కువ సంతోషించేవాణ్ణి నేనే. మా సంస్థ నుంచి మీకు కావలసిన అనుమతులన్నీ ఇస్తాం. మీ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపండి.”

సార్, రేపు మేము కానుగపల్లె వెళ్ళి అక్కడ గిరిజనులవద్ద నేరుగా శాంపిళ్ళు తీసుకోవాలి. శాంపిళ్ళలో నూనె శాతం ఆధారంగామేము కనీస మద్దతు ధర మీకు తెలియజేస్తాం. అప్పుడు మీరు లైసెన్సు ఇచ్చినటలైతే, నూనె శాతాన్ని బట్టీ కనీస ధరకంటే ఎక్కువకే సేకరిస్తాం.” 

సరే, మీరు నా పీయే దగ్గర కానుగపల్లె గిరిజన కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోను నెంబరు తీసుకోండి. మీరు నేరుగా అక్కడికి వెళ్లండి. వాళ్ళే మీకు ఫోను చేసి, మీకు కావలసినవి ఏర్పాటు చేస్తారు’ ఆని ఇంటర్ కంలో పియ్యేతో, కానుగపల్లి ఈవో ని నాకు ఫోను చెయ్యమని చెప్పు. పొంగేమియా కంపెనీ వారికి ఈవో ఫోను నెంబరు ఇవ్వు.” అంటూ ఆదేశలు జారీ చేశారు

బయటకు వచ్చిన వెంటనే, పియ్యే నేరుగా వచ్చి, “సార్, కానుగపల్లె ఈవో సెలవులో ఉన్నారు. ఇదిగో అక్కడ సేండి ఇనస్పెక్టరు ఫోను నెంబరు. ఇతడికి నేను ఫోను చేసి ఎండీగారి ఆదేశాలు వివరించాను. మిమ్మలిని అతడు కానుగపల్లెలో రేపు ఉదయం పదికల్లా కలుస్తాడుఅన్నాడు.  

మర్నాడు ఉదయానికి జిల్లా కేంద్రం చేరి, స్నానాలూ, టిఫినులు అయ్యాక కానుగపల్లె చేరేసరికి ఉదయం పది గంటలైంది. ఆరోజు సంతరోజు. అక్కడికి చేరేకా ఇనస్పెక్టరుకి ఫోను చేస్తే, తాను కూడా జిల్లా కేంద్రంలొనే ఉన్నాననీ, పదకొండుకల్లా వచ్చేస్తాననీ చెప్పాడు

ఈలోగా వీళ్ళిద్దరూ గిరిజన సంతలో తిరిగారు. అక్కడ చిరు వ్యాపారులతో మాటకలిపి, కానుగవిత్తనాల గురించి అడిగితే, బంకసారు అనుమతి లేకుండా మేము మీకు అమ్మలేము అన్నారు. అక్కడే ఉన్న గిరిజన స్త్రీ దగ్గర బుట్టలతో ఉన్న కానుగ గింజల శాంపిళ్ళు అడిగితే బంకసారు చెప్తేనే ఇస్తాను అంది. డబ్బులు ఇస్తమన్నా మీకు అమ్మం సార్, బంకసారు తిడతాడు అన్నారు వాళ్ళు

పదకొండున్నరకి సేండీ ఇనస్పెక్టరు వచ్చాడు. వచ్చిన పది నిమిషాల్లోనే, వీరిని సంత అంతా తిప్పి, వీరికి నచ్చిన చోట నుంచి ఇరవై శాంపిళ్ళు తీయించాడు. శాంపిల్ ఇచ్చిన స్త్రీ సేండీ ఇనస్పెక్టరుతో అంది కూడా, ఈసార్లు నన్ను కానుగ్గింజలు అమ్మమన్నారు. బంకసారుకి చెప్పకుండా కొత్త వాళ్లకి అమ్మము అని చెప్పాం అని.

సేండీ ఇనస్పెక్టరు వీళ్ళని అక్కడే ఉన్న గిరిజన్ కార్పోరేషన్ ఆఫీసుకి తీసుకెళ్ళి టీ  తెప్పించాడు.

టీ తాగుతుండగా పార్ధు అడిగాడు. “మిమ్మలిని వీళ్ళు బంక సారు అని ఎందుకంటున్నారు?”

ఇనస్పెక్టరు గట్టిగా నవ్వి చెప్పడు. “గిరిజన్ కార్పోరేషన్ ఇక్కడ పెట్టిన మొదట్లో, తుమ్మజిగురు ఒక్కటే గిరిజనులనుంచి సేకరించి జైళ్ళశాఖకి సరఫరా చేసేది. వాళ్ళు జైల్లో ఖైదీలని కూలీలుగా వినియోగించి, జిగురునిగమ్ము’గా మార్చి, ప్లాస్టిక్ సీసాల్లో నింపి, మార్కెట్లో అమ్మేవారు. అలా వచ్చే ఆదాయంలో ఖైదీల కూలి, ఇంకొన్ని చిల్లర ఖర్చులూ పోగా మిగిలినది గిరిజన కార్పోరేషనుకి ఇస్తే, మేము దాని అధారంగా వీళ్ళ దగ్గర జిగురు ధర నిర్ణయించి కొనేవాళ్ళం. అప్పట్లో తుమ్మ జిగురు సేకరణ పర్యవేక్షణ అంతా సేండీ ఇనస్పెక్టరు ఒక్కడే చేసే వాడు. తుమ్మ జిగురుని వీళ్ళు బంక అంటారు. అందుకని బంకసారు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత, తేనె, కరక్కాయలు, ఇలా ఎన్ని సేకరిస్తున్నా, తుమ్మజిగురు సేకరణ ఆపేసినా మాకు బంకసారు అన్న పేరే స్థిరపడిపోయింది.” 

మరి శాంపిల్ ఇవ్వడనికి మీ పర్మిషన్ కోసం ఎందుకు చూసేరు.” 

అదా. ఇక్కడ అటవీ ఉత్పత్తులు సేకరించటానికి తొలి ప్రాధాన్యత గిరిజన్ కార్పోరేషనుదే. మేము సేకరించము అని అనుకున్న ఉత్పత్తులనే వ్యాపారస్తులు కొనాలి. అంటే వ్యాపారస్తులే అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి లేకుండా సేకరించిన అటవీ ఉత్పత్తులిని గిరిజన కార్పోరేషను సీజ్ చేస్తుంది. అలా గతంలో జరిగినప్పుడు, జరీమానా కట్టలేక కొంతమంది వ్యాపారులు సరుకు మాదగ్గర వదిలేసి, గిరిజనులనుండి అరువుమీద కొన్న సరుకులికి డబ్బు ఇవ్వకుండా పారిపోయారు. అప్పటినుండీ, బంకసారు చెప్పని కొత్తవాళ్ళకి ఏమి అమ్మినా తమకు డబ్బులు రావు అని ఈ గిరిజనులికి అర్ధం అయ్యింది. అందుకే కొత్తవాళ్ళకి వీళ్ళు ఏమీ నేరుగా అమ్మరు.”

ఓహో అనుకున్నారు వీళ్ళు.  

ఇది కొన్నాళ్ళ తర్వాత ఆచరణకు వచ్చేసరికి ఎలా అయిదంటే, అనుమతి ఉన్న వ్యాపారి కూడా సీజను మొదట్లో తన దగ్గరకు అమ్మకానికి వచ్చిన సరుకుని తిరగ్గొట్టేస్తాడు. గిరిజనులు మాదగ్గర బతిమాలితే, అప్పుడు వ్యాపారులందరినీ ఆఫీసుకి పిలిచి, ఈ సీజనులో ఈ సరుకుని కొనుక్కోవటనికి అనుమతిస్తాం.”  వివరించాడు సేండీ ఇనస్పెక్టరు

ఆ తరువాత వీళ్ళిద్దరూ శాంపిళ్ళు తీసుకొని, గంట దూరంలో ఉన్న జిల్లా కేంద్రం చేరుకొన్నారు. అక్కడ భోజనం చేస్తూ ఉంటే కిరణ్ కి ఫోను వచ్చింది. మాట్లాడి పెట్టేసిన తర్వాత పార్ధుతోచెప్పేడు. “సార్, నాతో పాటు మనకంపెనీలో జాయినయి కర్ణాటకలో చేస్తున్న అబ్బాయీ వాళ్ళ నాన్నగారు పదిహేనేళ్ళు కానుగపల్లె చుట్టుపక్కల ఊళ్ళలోనే టీచరుగా పనిచేశారుట. రిటైర్ అయ్యారుట. ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంటున్నారుట. వీలైతే ఒకసారి వెళ్ళి కలవమంటున్నాడు.” 

మరింకేం. ఆయనని కలిస్తే మనకి ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తెలియవచ్చు.” ఆయనకి ఫోను చెయ్యగానే, భోజనానికొచ్చెయ్యండి అన్నారు కానీ, వీళ్ళు అప్పటికే భోజనం చేసిన విషయం చెప్పి వెళ్ళారు.

వీళ్ళు వెళ్ళేసరికి మాస్టారు భోజనం చేసి పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకున్నారు.

వీళ్ళు వచ్చినపని వివరంగా చెప్పి, ఎంతవరకు వచ్చిందో కూడ వివరించారు

అంతా విన్న మాస్టారు, “ఐతే మీకంపెనీ గిరిజనులకు దాదాపు మూడు రూపాయల అధిక ధర ఇవ్వబోతోందన్నమాట. కానీ ఇందులో ఒక రూపాయైనా వాళ్ళకి చేరితే గొప్పవిషయమేఅన్నారు.

అదేంటి సార్, మధ్యవర్తులు  లేకుండా మేం కొంటాం కదా. నేరుగా గిరిజన కార్పోరేషనుకి డబ్బు ఇచ్చినప్పుడు అది పూర్తిగా గిరిజనులకి చెందుతుంది కదా?”

ఏమో ఎవరు చూడొచ్చారు. కార్పోరేషనుకి గింజలు ఇచ్చే గిరిజనుల పేర్లు రాత్రికి రాత్రే మారొచ్చు. రికార్డులో ఉన్న గిరిజనులు డబ్బు తీసుకొని, గింజలు సేకరించిన అసలు గిరిజనులకి డబ్బు చెల్లించొచ్చు. మీరేమైనా పగలూ రాత్రీ వాళ్ళ రికార్డులు చూస్తారా.?”

అంటే దీనివల్ల మంచీ జరగదా?”

ఎందుకు జరగదు. ఇప్పటివరకూ కేజీకీ రెండూ రూపాయలు పైగా తింటున్నవారు ఇకపై రూపాయితో సర్దుకోవచ్చు. మీరు చెయ్యాలనుకున్న మంచిలో సగం మంచి జరగొచ్చు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ విద్యావంతులైన గిరిజనులు దీన్ని ఆపనూ వచ్చు, లేదా ఆ విద్యావంతుల్లో కొంతమంది ఈ వ్యాపారాల్లో భాగం అయిపోతే ఇలా కొనసాగనూవచ్చు.” 

అక్కడ జరిగే వ్యాపారం స్ఠాయిని బట్టి చూస్తే గిరిజన కార్పోరేషను చాలా లాభాల్లో ఉండాలి సార్. కానీ అక్కడ వాతావరణం అలా లేదు.”

ఎందుకుంటుందండీ. అటవీ ఉత్పత్తులిని సేకరించి మైదాన ప్రాంతంలోనూ, పట్టణాల్లోనూ మంచి ధరకి అమ్మటం గిరిజన కార్పోరేషను ఉద్దేశాల్లో ఒకటి. అక్కడ సరుకంతా కార్పోరేషను ద్వారా వెళితే కేవలం ఐదు నుండీ పదిశాతం లాభంతో, అసలు ప్రభుత్వం నుండి పైసా తీసుకోనక్కర్లేనంత చక్కగా నడవగలదు.”

అలా ఎందుకు జరగట్లేదు సార్?”

మనదేశంలో సంక్షేమ రంగంలో పెట్టినవ్యాపారాలన్నీ శాశ్వితంగా నష్టాల్లోనే  నడుస్తాయి అనే దురభిప్రాయం ఉండిపోయింది. అంచేత లాభం రాదగ్గ ప్రతీచోటా ఇలా వ్యాపారులు దూరిపోయారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపారులకి కొనటం గిట్టుబాటు కానప్పుడు సరుకంతా, గిరిజన్ కార్పోరేషన్ అరువు మీదో, ప్రభుత్వనిధులతోనో కొనేస్తుంది.. ఇక్కడ గొడౌనుల్లో నిలువచేస్తుంది. వ్యాపారులకు డిమాండు ఉన్నప్పుడు, వీళ్ళు జిల్లా కేంద్రంలో కార్పోరేషన్ దగ్గర కొనుక్కుంటారు. కొనుక్కోవడం ఏంటీ, నాబొంద. ఈ సరుకు వీళ్ళ గోడౌనుల్లోంచీ, వీళ్ళ వాహనాల్లోనే మార్కెట్టుకి వెళ్ళిపోతుంది. డబ్బు ఈ వ్యాపారుల చేతికి వస్తుంది. అందులోంచీ, గిరిజనకార్పోరేషనుకి ఇస్తారు. అంటే, సరుకు ముట్టుకోకుండానే వ్యాపారులకి లాభం అన్నమాట.” 

మరి ప్రభుత్వాలూ కార్పోరేషన్ ఉద్యోగులు?”

“ప్రభుత్వాలూ, ఉద్యోగులూ కూడా సంక్షేమ రంగంలో పెట్టినవ్యాపారాలన్నీ శాశ్వితంగా నష్టాల్లోనే  నడుస్తాయి అనే అభిప్రాయం లో వారి వారి లాభాలు చూసుకున్నారు. అంటే, ప్రభుత్వానికి నష్టాల్లో ఉన్న సంస్థలమీద ఎక్కువ పట్టు ఉంటుంది. దానికి గ్రాంటులు ఇచ్చి ఆదుకొని దాని రోజువారీ వ్యవహారాల్లో కలుగజేసుకోవచ్చు. ఉద్యోగులకు సంస్థ నష్టాల్లో నడుస్తున్నా ఈ భరోసా వల్ల హాయిగా ఉంటారు. సేండీ ఇనస్పెక్టరు నుంచి కొనుగోలు కేంద్రం అటెండరు వరకూ ఎవరూ టైముకి రారు. ఆవగాహనని బట్టి ఒక్కోరూ ఒక్కో రోజు వస్తారు. సంతరోజు మాత్రంఅందరూ వచ్చి కొంచెం హడావుడి చేస్తారు. ఒక లెక్క చెబుతాను వినండి. పదిటన్నుల కుంకుడు కాయలు కానుగపల్లి సంతలో గిరిజనులు తెచ్చారనుకుందాం. తొమ్మిది టన్నులు వ్యాపారులు కొంటారు. మిగతా ఒకటన్ను వ్యాపారులే కొని, గిరిజనుల కార్పోరేషన్ పేరుమీద రాయిస్తారు. ఒక టన్ను కుంకుడు కాయలు యాబైకిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాకేంద్రంలో మార్కెట్టుకి లారీలో తీసుకెళ్ళినట్టు రాసి పది టన్నులూ ఇందులోనే తరలిస్తారు. వ్యాపారులకు రవాణా వ్యయం ఆదా అవుతుంది. అదికాక, ప్రైవేటు వాహనాలైతే అటవీ శాఖ చెక్ పోస్టులో ఇబ్బంది. గిరిజన కార్పోరేషను వారి వాహనాలైతే అలాంటి ఇబ్బందులూ ఉండవు. కార్పోరేషన్ అమ్మిన డబ్బుకీ కొన్న డబ్బుకీ ఉన్న తేడా లారీలో డిజిల్ కి సరిపోతుంది. ఒకవేళ మొత్తం పదిటన్నులూ కార్పోరేషనే సేకరించి అమ్మి ఉంటే ఏమి జరిగేదో లెక్కలు వేసుకోండి.”

మరి అన్యాయాన్ని నక్సలైట్లు ఎలా సహిస్తున్నారు?”

నక్సలిట్లు బ్రతకటానికీ, ఉద్యమానికీ డబ్బుకావాలి కదా. ఈ వ్యాపారులే మామూళ్ళు ఇవ్వాలి. వాళ్ళ ఉనికిని నిరూపించుకుందికి ప్రభుత్వ ఆస్తుల ద్వంసం చేస్తారు గనుక అప్పుడప్పుడూ కార్పోరేషన్ ఆఫీసునో, గొడోనునో పేల్చేస్తూ ఉంటారు.”

మరికొంతసేఫు మాస్టారుతో ఉండి, సాయంత్రం టీ అయ్యాకా వీళ్ళు తిరిగి వచ్చేశారు. మరో వారం రోజుల్లో కానుగపల్లె గిరిజన కార్పోరేషన్ పత్రికాముఖంగా కానుగ గింజల కొనుగోలుకు సీల్డు టెండర్లు పిలిచింది

ఎండీ కార్యాలయం నుండి వీరికి సమాచారం వచ్చింది. సేండీ ఇనస్పెక్టరు స్వయంగా ఫోన్ చేసి వీళ్ళ కంపెనీని టెండరు వెయ్యమని చెప్పారు. వీళ్ళు కిలో ఐదున్నరకి వెయ్యబోతే, సార్, చిల్లరఖర్చులకు ఉంటాయి, మీరు ఐదు రూపాయలకు వెయ్యండి. ఒక ఏడాది వ్యాపారాన్ని బట్టి రేటు పెంచుకొండి అని సలహా కూడా ఇచ్చాడు

పార్ధూ, కిరణ్ లు కలిసి బయోడీజిల్ ధర, కానుగపల్లె శాంపిళ్ళలో నూనెశాతం అన్నీ చూసుకొని, నూనె ముప్పై శాతం, ఆపైన ఉన్న గింజలకి కిలో ఐదురూపాయలు, ఇరవైకీ ముప్పైకీ మద్య ఉంటే నాలుగు, అంతకు తక్కువ ఐతే సరుకు తిరస్కరించే షరతులతో టెండరు వేశారు

నిబంధనల ప్రకారం, కనీసం మూడు కొటేషనులు రాకపోతే రద్దు చేయవచ్చు కానీ, ఎండీగారి అసాధారణ అనుమతి వల్ల ఒక్కకొటేషను వచినా ఇచ్చేలా, పరిష్తితిని బట్టి వచ్చే ఏడాది పోటీ పెరగవచ్చు అని సమర్ధింపు (జస్టిఫికేషన్) కూడా రాశారు

చిత్రంగా, ఇంకో కొటేషన్ కూడా వచ్చింది. అది దాఖలు చేసింది కానుగపల్లి వ్యాపారే. ఉన్నవాళ్ళలో కాస్త పెద్దవాడు. జిల్లాకేంద్రంలో స్వంత లారీ కూడా ఉంది.

టెడర్లు తెరిచాక తెలిసింది. కానుగపల్లెలోనే ఉండే వ్యాపారి మొదటిగ్రేడుకి ఐదున్నర, రెండో గ్రేడుకి నాలుగురూపాయల పావలా, మూడో గ్రేడుకి రెండు రూపాయలు ఇచ్చి కొనటానికి టెండరు వేసాడుట. ప్రతీ రేటూ వీళ్ళ కంపెనీ కన్న ఎక్కువ ఉండటంతో పాటు వీళ్ళు తిరస్కరించిన సరుకుని కూడా కొనడానికి ముందుకు వచ్చాడు.  

పార్ధు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే స్వంతంగా బయోడిజిల్ ఫేక్టరీ ఉన్న తమకే ఫేక్టరీ వద్ద ఆరు రూపాయలకు మించి గిట్టుబాటుకాదు. అలాంటిది కానుగపల్లెలో ఐదున్నరకు కొంటే ఇంకోప్లాంటుకి అమ్మేవాళ్ళకి ఈరేటు ఎలా గిట్టూబాటు అవుతుంది. మార్కెట్టులో రూపాయి విలువ కూడా చెయ్యని మూడో గ్రేడు సరుకు రెండూ రూపాయలకు ఎలా కొంటాడు? పోనీలే, మనం నేరుగా వెళ్ళటం వల్ల గిరిజనులకు ఆదాయం పెరుగుతోంది. మనకు కానుగగింజలు దొరక్కపోవు అని సర్దిచెప్పుకున్నారు

గిరిజన కార్పోరేషన్ ఎండీని మరోసారి కలిసి ధన్యావాదాలు తెలిపితే, వీళ్ళకి టెండరు దొరకనందుకు బాగా నొచ్చుకొని వీళ్ళ ఎదురుగా ఫోనులోనే, సేండి ఇనస్పెక్టరుమీద కేకలేసాడు. “టెండరు దక్కించుకున్న వ్యాపారి దగ్గర లక్ష రూపాయల సెక్యూరిటీ డిపాజిట్టు కట్టీంచుకో. ఈఏడాదంతా వాడు ఇదే రేటుకి కొనకపోతే, లక్షా జప్తు చెయ్యటంతో పాటు, నిన్ను కూడా సస్పెండు చేస్తాను. ఐనా, ఈ కంపెనీవారు వచ్చేవరకూ వాళ్ళంతా కేజీ మూడురూపాయలకు కొంటూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా?” అని కేకలేసి, ఫోనుపెట్టేసాక, పార్ధుతో, “ఈ వ్యాపారి మధ్యలో చేతులెత్తేస్తే, మీకు ఇప్పటికే కోట్ చేసిన ధరకే అనుమతిస్తూ ఫైలు రాస్తున్నాను. మీరు మద్యలో మళ్ళీ టెండరు వెయ్యక్కర్లేదు. ఒకవేళ నేను ఇక్కడినుండి బదిలీ ఐనా మీకు గిరిజన కార్పోరేషనుతో పని ఉంటే నాకు చెప్పండి. వచ్చే అధికారికి కూడా ఒకమాట చెబతాను. మీలాంటి కంపెనీలు కార్పోరేషనుకి చాలా అవసరం.” 

వీళ్ళు హైదరాబాదు వచ్చిన రెండు రోజులకి సేండీ ఇనస్పెక్టర్ నుండి ఫోను వచ్చింది. “సార్, వీళ్ళు వాళ్ళ కొటేషన్ ప్రకారం ఐదున్నరకి మొదటిలోడు కొన్నారు. లేకపోతే లక్షరూపాయల డిపోజిట్ పోతుంది అని భయం. వాళ్ళకి ఐదురూపాయలకంటే ఎవరూ ఎక్కువ ఇవ్వటం లేదు. మీదగ్గరకే వస్తారు. మీరు ఇదివరకు కొనే రేటుకే కొనండి. దెబ్బకి మూడు నెలల్లో కుదేలెత్తిపోతారు. కేజీకీ అర్దరూపాయి నష్టం అంటే మాటలా?” 

మరో రెండు రోజులకి కానుగపల్లినుండి ఫోను వచ్చింది. చేసినది కొత్త వ్యాపారి దగ్గర టెండరు వ్యవహారాల కోసమేపెట్టుకున్న యువ గుమస్తా. “సార్, మీకు కిలో ఆరు రూపాయలికి మొదటిరకం గింజలు హైద్రాబాదుకి డెలివరీ ఇవ్వగలంఅని. ఆశ్చర్యపోయినా, సరే మన కంపెనీకి ఏం నష్టం అని కొనుక్కుందికి ఒప్పుకున్నారు

మూడు నెలలు గడిచాయి. కానుగపల్లివాళ్ళు గింజలిని కొంటూనే ఉన్నారు, వీళ్ళ కంపెనీకే అమ్ముతూనే ఉన్నారు. సరుకంతా మొదటిగ్రేడే. కుదేలౌతున్న లక్షణాలు ఎక్కడ కనపడలేదు

ఈలోపల కిరణ్ పనిభారం పెరగటంతో ఒక అసిస్టెంటు కావలసి వచ్చింది. వీళ్ళది జాతీయస్తాయి కంపెనీ కావటంతో, అంతవరకూ కానుగపల్లి వ్యాపారి తరపున పనిచేసే గుమస్తా వీళ్ళదగ్గర చేరాడు

అతడు విప్పిన గుట్టు ఇదీ

నూటికి ఎనబై కేజీలు గ్రేడు వన్, పదిహేను కేజీలు గ్రేడ్ టూ, మిగతా ఐదు శాతం తప్ప తాలు వస్తాయి. కానీ, వీళ్ళు కొనేముందు గ్రేడు వన్ శాంపిలు, గ్రేడు టూ శాంపిలూ తారుమారు చేస్తారు. దానివల్ల ఎనబై శాతం సరుకు నాలుగు రూపాయల పావలాకీ పదిహేను శాతం సరుకు ఐదున్నరకీ, మిగతాది రెండురూపాయలికీ కొంటారు. సగటు ధర  నాలుగు రూపాయల నలబైపైసలు పడుతుంది. కార్పోరేషనుకి పావలా కమీషను పోనూ మిగతాది గిరిజనులకి వెళుతోంది. మీకు హైదరాబాదు తెచ్చి  ఆరురూపాయలకి అమ్ముతున్నారు. మీరు ఇంకో విషయం గమనించలేదు. ప్రతీ బేచూ, మీకు కేవలం ముప్పైఒక్క శాతం నూనే వస్తోంది. అంటే ముప్పై ఐదుశాతం నూనెవచ్చే గ్రేడు వన్ సరుకులో గ్రేడు టు సరుకు కలిపేస్తే, సగటు నూనె శాతం ముప్పై ఒకటి వస్తోంది. అంటే మీకు మొత్తం సరుకుని గ్రేడు వన్ గానే అమ్ముతున్నాం.”

ట్రాన్సుపోర్టు వ్యయం అర్దరూపాయి పోగా బాగానే మిగులుతోందన్నమాట. మాస్టరు చెప్పినట్టే జరుగుతోందే.” కిరణ్ అన్నాడు

అర్దరూపాయెందుకు సార్. ఇప్పుడు వెయ్యికేజీల చింతపండు అమ్మటానికి గిరిజన కార్పోరేషను లారీలు హైదరాబాదు వరకూ వచ్చేస్తున్నాయి. మిగతా తొమ్మిదిటన్నులలోడూ మన ఫేక్టరీకి కిలోమీటరు దూరంలో వేరే లారీలోకి మార్చి మన ఫేక్టరీకి వేస్తున్నారు. జిల్లా కేంద్రంలో చింతపండు రేటు కన్న హైదరాబాదు రేటు ఎక్కువ కనుక డీజిల్ ఖర్చు పెరిగినా నికరంగా నష్టం లేదు కనుక ఆడిట్ అభ్యంతరం కూడారాదు.”

మరి సేండీ ఇనస్పెక్టరు ఎలా ఊరుకుంటున్నాడు?”

బంకసారు ఎందుకూరుకుంటాడు సార్. కేజీకీ పావలా తీసుకుంటాడు. అదికాక డీజిలు రేటు వ్యాపారి దగ్గరే వసూలు చేస్తాడు సార్. అది లారీ బాడుగలో సగం ఉంటుంది గనక కిలోకి పావలా పడుతుంది. ఒక్క బంకసారు కమీషనే ఏడాదికి రెండున్నర లక్షలుఅసలు మీకు పోటీ కొటేషన్ రాసి ఇచ్చింది బంకసారే కద సార్.”

డాక్టర్ మూలా రవికుమార్

మూలా రవికుమార్ పశువైద్య పట్టభద్రుడు. పశుపోషణలో పీజీ, గ్రామీణాభివృద్ధిలో పీహెచ్ డీ.
పశువైద్య విశ్వ విద్యాలయంలో శాస్త్రవేత్త. పద్దెనిమిదేళ్ళగా కథా రచన. 2012 లో చింతలవలస కథలు సంకలనం విడుదల. కథాంశాలు: ఉత్తరాంధ్రా గ్రామీణం. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి. సంస్థలలో ఉద్యోగుల మనస్తత్వాలు.

4 comments

  • Good story. Ravi Kumar writes only when he feels conversant with the topic he covers. A spark towards the climax is another important aspect of his stories.

  • బంకు సారు, కధ,బాగుంది..!తెలియని,కనపడని, అన్యాయంగురించి బాగరాశారు, రచయిత కి,అభివందనలు!💐సర్,మనము కొనేప్రతి గిరిజనఉత్పత్తి లో ఇలాంటి మోసమే, జరుగుతుంది అన్నమాట!

  • కథ బలే ఉంది.తెలుగులో ప్రాక్టికల్ ఎకనామిక్స్ గురించి వచ్చిన కథలు తక్కువే. సైన్స్ ఫిక్షన్ కథల లాగా ఎకనామిక్ కథలు ఎక్కువగా వస్తే బాగుంటుంది. రవికుమార్ గారికి అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.