మాది మాలవాడ
ఇంతకీ “మీరేవుట్లూ”

ఇప్పటికి మన సమాజంలో ఎవరి నోటినుంచినయినా ఒక మాట వస్తే నొసలు ముడేస్తుందో ఆ పదం “దళిత” లేదా “దళితులు”. వీళ్లకి అనేక సర్వనామాలు, సమానార్ధక పదాలు, ప్రకృతి , వికృతి పదాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ దళితులు ఎవరు అంటే, దళితులేమో తాము ఈదేశం మూలవాసులమని అంటారు.అగ్రవర్ణాలేమో దళితులు అంటరాని వారు అంటారు. అంతెందుకు మా చిన్నతనంలో అంటే తొంభైల మొదట్లో కూడా పాఠ్య పుస్తకాల వెనుక “అంటరానితనం నేరం – అంటరాని తనం పాపం ” అని ఉండేవి. అర్ధం కాని సందర్భాలలో ఎవరిని అడగలేక, ఆ తరవాత వాటి వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకుని  బాధ పడిన సందర్భాలూ ఉన్నాయి. అంత మైల పడిన మాటని తలకెత్తుకుని ఆత్మగౌరవ నినాదం ని గొంతునుంచి సృష్టించి బిగ్గరగా కేకపెట్టిన నాటి జాషువా నుంచి నేటి శిఖామణి, ప్రసాదమూర్తి, ఎండ్లూరి, వరదయ్య (లక్ష్మీనరసయ్య) లదాక గర్జించిన కవుల జాబితాలో ముందు వరసలో రాయవలసిన పేరు: ‘మద్దూరి నగేష్ బాబు కేరాఫ్ దళితుడు, అడ్రెస్ మాల పేట’.

ప్రాచీన సాహిత్యం అంతా గ్రాంధిక వాసన. తాళింపుల మోత, సంధులూ సమాసాలు, అలంకారాల పోహళింపు, ఎంతసేపు పురాణ పాత్రల బాగోగులు పట్టించుకోవడమే తప్ప, ‘పంచమ’జాతి వారి ఛాయ కూడా లేని రోజుల్లో నుంచి వెలువడుతున్న సాహిత్యం లో “కంచికచర్ల కొటేశు” మరణం బాల్యం లో తన జీవితంలో వేసిన ముద్ర లోనుంచి ఒక “కలేకురి” పుడితే ఆ తరవాత జడలు విప్పిన అగ్రవర్ణం 1985 లో కారంచేడు లో చేసిన విధ్వసం నుంచి దళిత కవిత్వం మెల్లిగా తనదైన ఒక పాయని చేసుకుని ప్రవహించడం మొదలు పెట్టింది. ఆ తరవాత వరస ఘటనలు చుండూరు లాంటివి ఈ ప్రవాహ ఉధృతిని పెంచాయి. దళిత అనే గుసగుస లాడుకునే పదం కాస్త బహిరంగం చేయబడింది. అప్పుడు ఆ మార్చింగ్ టార్చ్ పట్టుకున్న కవుల్లో మద్దూరి ఒకడు.

“ఈ గుడిసెలో
నేను సంచి తగిలించుకు బడికి బైలుదేరినప్పుడల్లా
‘ఒరే కలకటెరూ’ అని ఏడిపించిన ‘సామేలు’
తాత ఉండాలి
పేపర్లో మృతుల లిస్ట్లో మొదటి పేరు- సామేలే!

ఎక్కడా గూడార్థం ఉండదు. అంతా నికచ్చితత్వం ఎలా జరిగిందో సంఘటన అలా జనం దృష్టికి తీసుకుపోయే నేర్పు మనం ఈ కవితల్లో చూడొచ్చు. బహుశా దళిత కవిత్వ సౌందర్యం ఆ ఒక్క లక్షణం వల్లనే ఇంకా నిలబడి ఉంది. నగేష్ బాబు ఎక్కడా విషయాన్ని సాగదీయడు. అలా అని సంక్షిప్తతా ఉండదు. అంతా పారదర్శకంగా ఉంటుంది. నేరుగా సూటిగా గుండెల్లో దిగబడే తూటాల్లాంటి మాటలు ఉంటాయి.

అదే “వెలివాడ” కవితలో ఇంకోచోట ఇలా రాస్తాడు

“ఇది ఏసోబు వాళ్ళ ఇల్లు
ఆచూకీ దొరకని శవం ఏసోబు ఇల్లు.
ఆ ఏడుపులాంటి మూలుగెవరిదీ
వాళ్లమ్మదేనా!”.

గోతాల్లో చుట్టబడి అనాథ శవాల్లాదహన సంస్కారాలు చేయబడిన మృతదేహాల బంధువులకు మూలుగులాంటి ఏడుపు కాకా ఇంకేం ఉంటుంది.అదే నగేష్ బాబు తన కవితల్లో రాస్తాడు.

పాల వాసనైనా పోని మీ పిలగాడికి
అది ఉచ్చకే కాదు ఇంకోకందుకని తెలిసిన్నాడు
నా గుడిసె తడికే ఎందుకు నెట్టిందో
రచ్చించు బగవంతుడా అని కాళ్ళ మీద పడితే
వగిసిలో ఉండావు ఇదే సందు సంపాయించుకొమ్మని ఆ ఊరి పెద్ద ఎట్టా కూసిండో”

>హ్రదయ విదారక దృశ్యం మహాదేవమ్మ  అనే బసివికి జరిగిన అన్యాయాన్ని యదార్థంగా కవిత్వం చేసాడు నగేష్ బాబు.ఎక్కడా ప్రతీకలు కుప్ప పోయలేదు.అర్ధం కాని మెటఫర్లకి ఎక్కడా దాసోహం కాలేదు.పచ్చి నిజాన్ని ఇంకా అదే పచ్చిగా చెప్పాడు. వగిసిలో ఉండా మహాదేవమ్మ మానానికి  అగ్రవర్ణం విధించిన శిక్షని యావత్ ప్రపంచానికి ఆమె గొంతుతో పలికించాడు. అందుకే ఇతను దళిత కవుల మార్చ్ కి సారథి.

కేవలం మూడు రూపాయల బాకీ కోసం కన్న కొడుకుముందే చెరచబడ్డ ఆ బసివి అంతరాత్మని ఆమె ఆవేదనని ముగింపులో ఒక పతాక స్థాయిలో రాస్తాడు ఏమో అప్పుడు అతన్ని కవిత్వం పూనుతుందో అతనే కవిత్వం మీదకి దండయాత్ర కి పోయి దాన్ని వశపరచుకుని మెడలు వంచుతాడో కానీ ఆ పదాలు నిప్పు కనికళ్ళా ఉంటాయి.ఎక్కడా నంగి తనం ఉండదు.

“మానం అంటే కడుక్కుని సరిపెట్టుకునే దాన్ని
ఈ సినిగిపోయిన రైక నెక్కడనుంచి తెచ్చుకునేదిరా?
కుచ్చి నరాల పోటయితే ఎట్టాగో తట్టుకునేదాన్ని
రొమ్ము పీకలని కొరికేసినావే!
నా పిలగాడికి పాలెట్టా కుడిపేదిరా!
ఈ నెప్పులకి నా పెద్ద పేణానికి మోసం వస్తే
రేపు న బిడ్డలకి కూడు బెట్టే దిక్కేబుర్రా నా బట్టా…!!”.

ఇది మహాదేవమ్మా తిట్లు కావు.యావత్ బసివిల తిట్లు.వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని కవి రాసిన మాటలు .అందుకే ఒకచోట

“చట్టాలకి అర్థం కాని సాక్ష్యాలు కాబోలు
కీచురాళ్లు ఎలుగెత్తి పాడుతున్నాయి” అని నిజమే తాను రాసిన కవితా పాదాలు అన్ని ఆ దగా పడిన రాత్రి కోసమే కదా.అందుకే అది కీచురాళ్ల పాట.ఆర్తనాదాలు రికార్డు చేయడం లో ఇతను సిద్ధహస్తుడు.దళితుల పట్ల అగ్రవర్ణాల మానసిక దాడిని అక్షరాల సహాయంతో నిలువునా కోసి ఆరబెట్టి ఆ వాసన రాకుండా కాస్త అలంకారాల సహాయమూ తీసుంటాడు.

ఓ నా ఘనత వహించిన నల్ల హంసా
నీ నాలుక మీద ఒక ఉచ్చ బిందువుని కళాత్మకంగా నిలబెడుతున్నాను
దీన్ని చప్పరించి అది మాలదో మాదిగదో చెప్పగలవా?”.

ఈ పద్యం రాసింది ఎండ్లూరు.సుధాకర్, నేపధ్యం దళిత రిజర్వేషన్లు అనే అంశం.యావత్ దేశం మొత్తం రెండుగా చీలి పోయి రెండు వైరి వర్గాలుగా కత్తులు నూరుకుంటున్న సమయం.ఎవరి వాదం వారు వినిపిస్తూ ఉన్న దశలో ఎండ్లూరి విసిరిన సవాల్ని స్వీకరించాడు.నగేష్ బాబు, తన స్వజాతి రిజర్వేషన్ పద్ధతిని వ్యతిరేకిస్తున్న సమయంలో ఆయన రాసిన 2+3=1 అనే కవిత చాలా ఎన్నదగినది.

“అయినా మీరొక్కళ్ళే పోరాడాల్సిన కర్మ ఏంపట్టిందిరా
ఏం మేవంతా చచ్చామనుకున్నారా
పదండి
కాలం కుతికే మీద కాలు పెట్టి

మన వాటాలు అడగడం కాదు లాగేసుకుందాం”. అని దండోరా ఉద్యమానికి తన మద్దతు ప్రకటించాడు.ఎక్కడ దళితులు అనైక్యత గా ఉన్నా సహించే గుణం లేని తనం ఆయన్ని ఇంకా బాగా దళిత వర్గాలకి దగ్గర చేసింది. అందుకే ఆయనే మరో చోట “కొసరు భాగాలు కాదు అసలు భాగం కోసమే యుద్ధం చేద్దాం” అన్నాడు. కానీ దేనికోసం అయితే ఆయన జీవిత కాలం తపించాడో అది నేటికి జరగక పోవడం ఒకింత బాధా కరమైన అంశం. జరగక పోగా మళ్ళీ కొత్త సమస్యలు రాజుకుని ఆరిపోయిన చిచ్చు ని మనువాదులు మళ్ళీ రేపి తమాషాలు చూసే నేపథ్యంలో దళితులు తమ కోసం మాత్రమే పరితపించిన ఇలాంటి కవుల్ని  తలపోసుకుంటే మంచిది.

చాలా ప్రాంతాల్లో దళితులది వెట్టి చాకిరీ ఎప్పుడో తాతల కాలం నాటి ప్రో నోటు లు ఎప్పటికి కాలం చెల్లిపోకుండా ఇంకా ఫోర్స్ లోనే ఉంటాయి.అలాంటి ప్రో నోటుని ఒకదాన్ని రాస్తారు నగేష్ బాబు.దాని మీద సాక్షి సంతకమ్ కోసం బొటన వేలు లేని కారణంగా “దుడ్డు. వందనం”, “కంచికచర్ల .కొటేశు” ల పాదముద్రలు  వేయిస్తాడు. అసలు మంట మొత్తం ఈ ఇద్దరి హత్యానంతరం మొదలయిందనే స్పృహని చెబుతాడు.దానిద్వారా వెనకబాటుకు గురి కాబడి ఇంకా ఆ బానిసత్వమే బాగుంది అనుకునే వాళ్లకి గతం అనుభవాలు ప్రోది చేసి ఇవ్వడం వలన రాబోయే తరానికి ఓలా దిక్సూచి ని తయారు చేసి దాన్ని యావత దళిత యువత చేతిలో పెట్టి దాన్నో దీప స్తంభము గా మార్చిన వాడు ఇతను.

ఇతనిది చాలా చురుకు చూపు.ఎక్కడైనా క్రొత్తదనం కనబడితే ఆ నూతనత్వం బహుజనులు వలన జరిగితే బహు సంతోష పడతాడు.ఆ కోవలోనే రెహమాన్ ని నల్లపాట రెహ్మాన్ అంటాడు.
“ఏ తీరుగ  వీళ్లంతు జూసితివో
దళితొంశోత్తమ రహమాన్ అని రహమాన్ ని పొగిడి
ధ్వంసించు, ధ్వంసించు రుక్కులనూ ధ్వంసించు
బీటే నీ బాంబర్ ముస్తఫా” అంటూ  బహుజన బిడ్డగా పుట్టి యావత్ సంగీత ప్రపంచాన్ని శాసిస్తున్న రెహమాన్ ని మనకి అతడు బహుజనుడే అని గుర్తు చేస్తాడు.
దళిత రచయితల్లో చాలా మంది శుద్ధ వచనం రాస్తారని అందులో కవితాత్మకత ఉండదు అని చాలా విమర్శ ఉంది.కానీ అది చాలా తప్పుడు విమర్శ అని చాలా మంది విషయం లో అది నిరూపితం అయింది.ఒక కలేకూరి, తెరేష్ బాబు, నగేష్ బాబు,యండ్లూరి లాంటి వాళ్ళు సాహిత్యపు వసనలున్న అనేక పద్యాలు రాశారు. ఎక్కడ తిట్టాలో అక్కడ తిట్టారు.ఎక్కడ వచనం రాయాలో అక్కడ అదే రాశారు,ఎక్కడ వాక్యాన్ని కవిత్వపు పూత పూయాలో అక్కడ అదే పూశారు. దళిత కవుల్లో కూడా ఆలంకారీకులున్నారని తలెత్తి మరీ నిరూపించారు. పోస్టుమార్టం అనే కవితలో ఇలా రాశారు నగేష్ బాబు

“ఎంత అందమైన శవం
ఆఫ్ సెట్ లో ముద్రించిన మను స్మృతిలా
పుష్య మిత్రుడి చెప్పుల్లా
ఈ ఊపిరితిత్తులే కాబోలు
పల్లె ప్రాణ వాయువుల్ని గంజాయి దమ్ము లా లాగింది”

లాంటి వాక్యాన్ని రాయడం వెనక వీళ్ళ భాషా పటిమని మనం ఎక్కడా తక్కువ చేసి చూడలేము.

తరతరాలుగా వేళ్లూనుకున్న అంటరానితనం వంటివి పోవాలి అని అంటే అది మనుషుల లో మార్పు రావాలని బలంగా నమ్ముతూ, ఆ మనుషుల్లో ఉండే ఒక విపరీతత్వాన్ని వాళ్ల భావాజాలాన్ని మార్చాలని ప్రయత్నం చేశారు ఈ క్రమం లోనే “గోదావరి” అనే ఒక దీర్ఘ కవిత రాశారు. వేదంలా గోషించే గోదావరి పరీవాహక ప్రాంతం నిండా తరతరాలుగా తిష్టవేసుకు కూర్చుని ఉన్న పీఠాల మూలాలని కదిలించడానికి ఈ కావ్యం రాశారు మద్దూరి. ఇందులో వాడిన భాష కాస్త కటువుగా ఉన్నాసరే అది సామాజికంగా అనుభవించిన వేదన బాధ గా మనం తర్జుమా చేసుకోవాలి.అదీ కాక  దీన్ని మనం కేవలం అక్షరార్ధం గా తీసుకుంటే వినబడే సారాంశం వేరు. కవి అన్వయించుకున్నటువంటి ఊహలో మనం కూడా వెళితే అర్ధమయ్యేది వేరు.ఇలా అండర్ స్టేట్మెంట్ తో సాగిపోతుంది ఈ దీర్ఘ కవిత.

“బహుముఖాల గోదావరికి
కొన్ని చోట్ల నిక్కర్లుంటాయి
చేతుల్లో లఠీలుంటాయి
పలుగులుంటాయి, సారాపేకెట్లుంటాయి!
>గంజాయి గొట్టాలుంటాయి
చట్తంగా, న్యాయంగా, అధికారికంగా ముసుగు తొడుక్కొని
వాడల్ని ఊచకోత కోస్తున్నా
ఈద్గల్ని ఖరాబు చేస్తున్నా
కళ్ళలో మర్మాంగాలు పెట్టుకు నిద్ర నటిస్తుంది
సాక్షాత్తూ దేశనాయకులే
గోదావరి కాళ్ళమీదపడి వాడి వీర్యావశేషాలని నాకుతుంటే
వాడు ఒళ్ళు ఒలవకుండా ఎట్టాఉంటది!
ఇక ఇట్టా కాదుగానీ! పదరా సిన్నోడా, తాడోపేడో తేల్చుకుందాం!”

తన బాదంతా దగాపడిన తన స్వజనుల విముక్తి కోసమే .అందులో ఆధిపత్యపు భావజాలం ఉన్న మనుషుల్ని కాస్త అదిలించి ఉండవచ్చు అందువల్ల అతనికి మానవ సంబంధాల మీద మక్కువ లేదు అని కాదు.

మరో చోట దళితులే ఒక దళిత మహిళని అత్యాచారం చేసిన విషయంలో పైన ఎంత కొరడా తీసుకుని అదిలించి పారేశాడో, ఇక్కడా అదే విధంగా చెలిగి వదిలిపెడతాడు తప్పు జరిగిన చోట తన మన బేధం ఎక్కడా చూపించని తెగువ ఈ కవి కున్న మరో లక్షణం.

ఇక ఇక్కడ్నుంచి మనం
ఊరి బలుపునే కాదు వాడ కలుపుని కూడా పీకేయాలి
ఇక అమ్మలమై పేణాలు పోయడమే కాదు
>అవసరమైతే బీర్జాలు నలిపి సావనూకి సట్లో బెట్టాల”

అని సూత్రీకరణ చేస్తాడు.ఇది తెగింపు అన్యాయం ఎవడు చేసినా ఓకే మాటకి కట్టుబడి ఉండడం. ఇది కుల ఫీలింగ్ లేనితనం. కులం రొచ్చులో కూరుకుపోనితనం.

అలా అని సొంత జాతిలోనే మిగతా వాళ్లను పట్టించు కోకుండా కాస్త ఎదిగి కులం పేరు ఉద్యొగం పొంది దాని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళని చాలా కఠినంగా ట్రీట్ చేస్తాడు వాళ్ళందరిని “దళిత బ్రాహ్మలు”అన్నాడు.నిజమే కులాన్ని తమకున్న కొద్దిపాటి డబ్బో లేక మరో దాంతోనే కొలుచుకునే వాళ్ళని అంతకి మించి మరో మాట అనడానికి అతని దగ్గర ఇంకేం ఉంది కనుక.

ఆప్త మిత్రుడు అగ్రకులం లో పుట్టినా తన జీవితాన్ని దళిత బహుజనులు కోసం నిలబెట్టుకున్న త్రిపురనేని.శ్రీనివాస్ కోసం రాసిన ఎలిజీలో ఎంత తపించారో, సాటి కవులైన తెరేష్ బాబు కోసం, ఎండ్లూరి సుధాకర్ కోసం రాసిన కవితల్లో కూడా అదే ఆర్తి కనబడుతుంది. 

ప్రపంచీకరణని దానివల్ల  నాశనం అయిన దళిత జీవితాల్ని స్పృశిస్తాడు. మిస్ ఇండియాలాని  మా ఊరి పేటకి వచ్చి మా ఆడొళ్ల బాడీ లని చూసిపొమ్మంటాడు. ఆత్మహత్య చేసుకున్న సునీత కోసం రాస్తూ తప్పు నీది కాదు డార్విన్ ది అంటూ లోపల కుట్ర ఏంటో బహిర్గతంచేసి భాష నన్ను ఏపుకు తింటుంది అని అది దేవ నాగరి కాదు దెయ్య నాగరి అంటారు.ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ ఆలోచన అంతా బహుజనులు పక్షమే ఏది రాసినా నల్ల రాతలే , ఏ అగ్రకుల బాపనోళ్ళని , సవుదరుల్ని, పెద్ద కాపుల్ని తిట్టినా అది దగా పడి ఊరి బయట ఉంటున్న జాతుల కోసమే. మన మధ్యనుంచి అలా నడుచుకుంటూ వెళ్లి పోయిన దళిత మహా కవుల సరసన నిలబడి కాబోయే కాలానికి కాపలాగా తన వాక్యాలని ఉంచి పోయాడు. కానీ మనం ఎంతవరకు ఆ ఆశయాలని ,అక్షరాలన్ని అదుముకుంటున్నాం, పైకి కనబడని హిపోక్రసీ కోరల్లో ఇంకా ఆధిపత్య భావజాలం వైపు మనల్ని మనమే నెట్టుకుంటూ ముందుకు పోతున్నాం అది కాదు దళిత సాహిత్య గమ్యం.వెలివాడల్ని ఎప్పుడో గుర్తుచేసుకున్న కవి.రోహిత్ లాంటి విద్యార్థుల అమరత్వం సమయంలో ఉండి ఉంటే ఆ ప్రస్థానం మరో మలుపు తిరిగి ఉండేది.కానీ దళిత సంఘాలు కులం మలుపులోనే ఆగిపోతున్నాయి ఆ ఆగడం అనే దాని వెనక కొత్త మనువు ఉన్నాడనే విషయం తెలిసినా వాడి పీక కొయ్యడానికి చేతిలో ఉన్న కన్నమ నాయుడి కత్తి వాడడం లేదు, ఆరేని గూటాన్ని వాడి తలని చితకాబొడవడానికి భయ పడుతున్నారు. పాత నెత్తుటి వాసనల్తోనే మనమింకా మనగలగాలంటే కాని పని . మనం ఎదిగిన నాగరికత ని మనం రాసుకుంటూనే మనం ఎదిగిన తీరుని మనం మననం చేసుకోవాలి అప్పుడే ఈ అక్షరాలకు అసలైన అర్ధం వచ్చేది.

అనిల్ డానీ

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

14 comments

 • అప్పడెప్పుడో నా కవిత్వానికో బహుమతి నిస్తూ నర్సరావుపేటలో నన్ను పలకరించి నాతో మాట్టాడిన
  దగ్ధమూర్తి నగేష్ సార్ కవిత్వాన్ని మళ్ళొకసారి కళ్ళముందు కవే నిలబడి మాట్టాడుతున్నాడా అనిపించేట్లు రాసిన డానీ కి అభినందనలు..
  రస్తా కు వందనాలు..

  • Tq
   రవి అన్నా మనం ఈ తరం తప్పక స్మరణ చేయవలసిన పుస్తకాలు అవి.

 • థాంక్స్ అనిల్ గారు. మరో మహాకవిని, ఆయన రచనల్ని పరిచయం చేసినందుకు. ఇంతకాలం ఎందుకు మిస్సయ్యాన అనిపిస్తోంది మీ ఆర్టికల్ చదివాక. మీరు ఉదహరించిన ఆయన కవితలు చదువుతుంటే మనసుని మెలేస్తున్నాయి.

  • థ్యాంక్యూ ఈశ్వర్.మీలాంటి కధకులు తప్పక చదవాల్సినవి ఇవన్నీ. మీరు అడిగిన బుక్స్ వీలైతే పంపుతా.

 • అనిల్, మొదలుపెట్టిందగ్గరనుంచీ ఆపకుండా చదివించావు. అస్తిత్వ పరివేదన భాషకి ఎప్పుడూ లొంగలేకపోయింది.

  థ్యాంక్స్

  • నిజమే మీరన్నది ఎంతరాసినా ఆ బాదకి పర్యాయ పదం లేనే లేదు మిత్రమా

 • దళిత కవిత్వం.. ఎవరు రాసినా అది తరతరాలుగా జరిగిన అన్యాయానికి రేకెత్తిన అగ్నిజ్వాలే! మహాదేవమ్మకి జరిగిన అన్యాయాన్ని కవిత్వం రూపంలో చదువుతుంటే ఏ మాత్రం సామాజిక స్పృహ ఉన్నా ఒళ్ళు ఉడుకెత్తిపోతుంది. నాకు వీళ్ళ గురించి ఏమీ తెలీదు.. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అని చెప్పడానికి నేనేమీ సిగ్గు పడటం లేదు. ఇప్పటికైనా తెలుసుకుంటున్నాను అది చాలు. దళిత సాహిత్యం, కవిత్వాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఈ రైటప్‌ చాలా నచ్చుతుంది. అనిల్‌ డానీ గారికి అభినందనలు.

 • మద్దూరి నగేష్ బాబు కవిత్వంపై…
  చక్కని సమీక్ష….అభినందనలు

 • మీ వాక్యాల వెంట పరుగులు పెట్టించారు…వాస్తవాలెపుడూ ఇంత వాదరగానే ఉంటాయనడానికి ఈ కవిత్వసంపుటి ఒక ఉదాహరణ..

 • అన్న…ఎప్పుడు నగేష్ అన్న వాక్యం సదివినా గుండె కదిలిపోతాది.. మీ అద్భుతమైన మీసమీక్ష ద్వారా మళ్లీ ఒక ఉత్తేజాన్ని పొందాను…ధన్యవాదాలు. శుభాకాంక్షలు అన్నా

 • మార్చింగ్ టార్చ్ పట్టుకున్న కవి మద్దూరి…
  మరింతగా ఆశిస్తున్నాను మీ కలం నుండి మద్దూరి పైన, మద్దూరి లాంటి మార్గదర్శకుల పైన..!
  ఈ వ్యాసం చాలా బాగుంది ధన్యవాదాలు.

 • మనం ఎంతవరకు ఆ ఆశయాలనీ అక్షరాలనీ అదుముకొంటున్నాం… అంటూ చర్నాకోల దెబ్బవంటి ప్రశ్న వేశారు.
  నేటి దళిత తరానికి ఏమీ తెలియదని చేదు జవాబునే చెప్పుకోవాలి పై ప్రశ్నకు.
  అందుకు కారణాలు అన్నీ చెప్పను కానీ ప్రధాన కారణాల్లో ఒకటి తల్లిదండ్రులు !
  అదెలాగో ఏమిటో కూడా ఇక్కడ రాయబోను.
  తమ్ముడు డానీ,
  చాలా గొప్పగా రాశారు మద్దూరిగారి లోని మహాకవిని గురించి..
  ఓ దళిత సభకు నన్నొకసారి చుండూరు హత్యాకాండ గురించి కవిత రాసి చదవమని ఆహ్వానించారు. వేదిక పైనా కిందా అందరూ తలలు నెరిసినవారే. కవిత చదివాక సభాధ్యక్షుని అనుమతి తీసుకొని నేను అడిగిన రెండు ప్రశ్నలు 1. “మీ పిల్లలనో, పిల్లల పిల్లలనో ఈ సభకు మీతోపాటు ఎందుకు తీసుకురాలేదు ?”
  2.”మన దళితుల్లోనూ మహాకవులున్నారు, ఒకరిద్దరు పేర్లయినా మనవాళ్లందరికీ తెలుసు అనుకొంటున్నారా, వారి రచనలు మీరు చదివారా, మీ దగ్గర దళిత కవుల సాహిత్యం వుందా ?”
  ఇందుకు ఆ సభ ఇచ్చిన సమాధానం మీ ప్రశ్నకు వచ్చే సమాధానమే అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
  ఆయా సందర్భాల్లో నగేష్ బాబు లోని కవి స్పందించిన/సంధించిన కవితలతో రోమాంచితంగా వుంది ఈ వ్యాసం. వీలుచూసుకొని ఏదైనా పత్రికకు కూడా పంపండి ఈ సమీక్షను(మరింత మందికి చేరగలదు కదా పత్రికల్లో పడితే..)
  అభినందనలు తమ్ముడు.. 💐

  • మీ కామెంట్ ఎన్నదగినది అన్న గారు… మీరు చెప్పినది నిజమే అందరిని అనలేము గాని చాలా మంది ,ఆచరణకు రాతలకి చాలా దూరంగా ఉంటున్నారు.అలాంటి వాళ్ళు ఈ కవిత్వాన్ని చదివి కాస్త మారితే బాగుండు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.