అస్తిత్వవాద ఘర్షణకు
నిలువుటద్దం కాఫ్కా

జర్మన్ ల ప్రకారం యూదు, చెక్ ల ప్రకారం జర్మన్ అయిన ఫ్రాంజ్ కాఫ్కా 1883 జూలై 3న ప్రేగ్ నగరంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. న్యాయవాద శాస్త్రాన్ని చదివి ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ విడి సమయంలో రచనలు చేశాడు. తన రచనలలో అస్తిత్వ సంఘర్షణను, వ్యక్తి సంబంధాలలో ఆత్మీయత లేకపోవడాన్ని బాంధవ్యాలలో విలువలు తగ్గడం, ద్రోహభావన, తార్కిక చింతనా లోపం వంటి లక్షణాలు ప్రతిబింబించాడు. ఇద్దరు సోదరులు చిన్నతనంలోనే మరణించడం, తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోవడంతో జీవితమంతా ఒంటరిగా తిరిగి 40 వ సంవత్సరంలో క్షయవ్యాధితో మరణించాడు.  

కాఫ్కా బ్రతికున్న కాలంలో అతని రచనలు ఎక్కువగా ప్రచురింపబడలేదు. ‘ద మెటమార్ఫాసిస్, ద ట్రయల్,    ద కాసిల్’ అనేవి మాత్రం ప్రముఖం అయ్యాయి. రాసిన నవలలో 90 శాతం తగులబెట్టాడు.  తన మరణానంతరం తన రచనలను ధ్వంసం చేయమని తన మిత్రుడ్ని అడిగినప్పటికీ, అతను ఆ మాటలను లెక్కచేయక వెలుగులోకి తెచ్చాడు. అవి 20, 21 వ శతాబ్దాలలో అనేక మంది రచయితలను, కళాకారులను, విమర్శకులను ప్రభావితం చేశాయి.  ఎక్కువగా ఒంటరితనంలో క్రూరుడైన తన తండ్రిప్రవర్తనతో భయపడుతూ బతికిన కాఫ్కా బయటి ప్రపంచంలో అందరితో నవ్వుతూ కలిసి పోయినా సరే, తనపై తనకు నమ్మకం లేకపోవడంతో ఎవరితో ఎక్కువగా మాట్లాడక, సంబంధాలు చెడకొట్టుకుని ఒంటరిగా బతికాడు. అతనికున్న ఏకైక స్నేహితుడు మ్యాక్స్ బ్రాడ్. 

కాఫ్కా తన మీద తాను నమ్మకం కలిగించుకోవడం కోసం వేశ్యాగృహాలకు అలవాటుబడ్డాడు. అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉండేవి. అయితే అతను కొందరిని పెళ్లాడాలని భావించినా అవి జరగలేదు. అతని అభిప్రాయాలు, అనుభవాలు అతని ఉత్తరాలు, డైరీల ద్వారా వెలుగులోకి వచ్చాయి. కాఫ్కా చాలా నిక్కచ్చిగా మాట్లాడేవాడు. విధులను చాలా బాధ్యతాయుతంగా నిర్వర్తించేవాడు.అతను తన రచనలలో చాలా సున్నితమైన, ఎవరికీ అంతుచిక్కని లోతైన పరిశీలనతో, వివరాలను ఇచ్చేవాడు. తాను వివాహం చేసుకొనప్పటికీ వివాహ వ్యవస్థను పిల్లలను ఎక్కువగా గౌరవించే వాడు.1924 జూన్ 3న క్షయ వ్యాధితో మరణించాడు. 

బాల్యంలో తండ్రి క్రూరప్రవర్తనతో చాలా పిరికిగా, నేరభావనతో, భయంతో, వినయశీలిగా పెరిగాడు. ఇది  జీవితాంతం ప్రభావం చూపింది. అతని సాత్విక పాత్రలన్నీ ఇలాటి క్రూరత్వాన్ని అనుభవించేవే. 

అతని రచనలు దైనందిన ఘటనల, అద్భుతాశ్చర్యాల మేళవింపులు. ఒక భ్రమ లాటి జీవితం తార్కికతకు అతీతంగా కనిపిస్తుంది. ‘జడ్జ్ మెంట్, మెటమార్ఫసిస్, అమెరికా, కాసిల్ల్’లలోని నాయకులందరూ నేర భావనతో క్రూరత్వాన్ని నిరసిస్తూ మరణిస్తారు.  ‘ఈ ప్రపంచంలో చెడే మిగిలి ఉందని, దీని నుంచి విముక్తి లభించదని, మన చేతగానితనంతో ప్రయత్నాలు మాత్రమే చేస్తూ ఉంటాం’ అని అంటాడు (జోసెఫ్.కె). 

కాఫ్కా రచనలు నిరంతరం వ్యక్తి శోధనను, అంతర్గత విశ్లేషణను, ఈ బ్రతుకులోని అర్ధాన్ని శోధిస్తూ నడుస్తాయి.  నిరంతరంఅతని ఆత్మ శోధనకు ఒక కారణం కానీ సమాధానం కానీ దొరకదు. ప్రకృతి సిద్ధమైన విషయాలన్నీ తారుమారు చేస్తాడు.మనుషులు కీటకాలుగా క్రిములుగా, క్రిములు మనుషులుగా మారిపోతుంటారు. పందుల కొష్టాల్లోంచీ గుర్రాలొస్తాయి. చరిత్ర తలకిందులవుతుంది. అతని కధలన్నీ ఒక ఏకపాత్ర సంభాషణ లాగా ఉత్తమ పురుష లోనే నడుస్తాయి. కళ్ళకు కనిపించే వాస్తవం వెనుక ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. మనల్ని పరిపాలించడానికి చూస్తున్న అర్ధంకాని చట్టాల కుట్రను ఛేదిస్తాడు. నిరంతరం భయంతో లోలోపల నిరంకుశత్వాన్ని ప్రతిఘటిస్తూ బతికే సామాన్య మానవుడి నిస్సహాయతను చూపుతాడు. వ్యవస్థ కూడా ‘భయపెట్టి’ ఎలా లొంగతీసుకుంటుందో చూపుతాడు. ఈ భయపడే స్థితిలో మనుషులు క్రిములు కీటకాలుగా ఎలా చూడబడతారో చూపిస్తాడు. స్వర్గమే మనుషులు కప్పుకున్న ముఖాలను చీల్చి వారిని పాషాణులని నిరూపించే అతని కధ ఒకటి ఈ విషయాన్ని నిరూపిస్తుంది.

అధికారాన్ని ప్రదర్శించే చట్ట సభలు, కోటలు, అధికార కార్యాలయాలు అధికారాన్ని, దానికి సంబంధించిన దర్పాన్ని ఎలా ప్రదర్శిస్తాయో చూపుతాడు. సోదాలు జరపడం, విచారించడం, జరిమానాలు విధించడం, బంధించడం, శిక్షించడం, క్షమించడం వంటివి మతదర్పాన్ని , అధికారాన్ని ఎలా ప్రతిబింబిస్తాయో చూపుతూ తండ్రి, రక్షక భటుడు, న్యాయవాది, అధికారి, వాని దూత  ఇలా ఈ నిరంకుశత్వాన్ని ప్రతిబింబింబించే విభిన్న మైన పాత్రలను కధలలో వాడతాడు. సహజ ప్రపంచాన్ని మానవుడి మేధ ఎలా అర్ధం చేసుకోలేక విఫలమౌతుందో వర్ణిస్తూ ఈ ప్రపంచాన్ని ఒక జైలు లాగా దాని చిన్న గదులలో మనం ఎలా వాటిని విస్తరించుకుంటూ వెళుతున్నామో చూపుతాడు. 

ఈ ప్రయత్నంలో వర్తమానం గతమౌతుంది. గతం భవిష్యత్తుగా మారుతుంది. న్యాయాన్ని పొందలేని సామాన్య మానవుని నిస్సహాయతను, న్యాయంలేని తనాన్నీ క్లిష్టమైన నిజమైన సంఘటనల ద్వారా ప్రతిబింబిస్తాడు. ఆశ్చర్యకరంగా ‘ట్రయల్, జడ్జ్ మెంట్,ఇన్ ద పీనల్ కాలనీ’ వంటి కథలన్నీ న్యాయ వ్యవస్థకు సంబంధించినవే! మానవునిచే సృష్టించబడిన న్యాయానికీ, సహజ న్యాయానికీ గల పోలికలను వ్యత్యాసాలను విపులీకరిస్తాడు. దేనిలోనూ సందేశాలనిచ్చే ప్రయత్నం చేయడు. అది అందరికీ అర్ధం కాదు కనుకనే అతను వాటిని ప్రచురించడానికి ఇష్ట పడ లేదు. 

కెమూ లాగా కాఫ్కా తన అనుభవాలనీ ఆలోచనలనీ డైరీలలో నోటుపుస్తకాలలో వ్రాసుకునేవాడు. గమనించిన ప్రతి సన్నివేశాన్నీ చాలా సునిశితంగా పరిశీలించేవాడు. అతని చాలా కధలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అతని రచనలు ‘మెటమార్ఫసిస్, ద ట్రయల్, జడ్జ్ మెంట్, కాసిల్’ వంటివి అస్తిత్వ వాద సంఘర్షణని ప్రధానంగా నైరూప్య స్థితిలో చూపుతాయి. 

1912లో కాఫ్కా వ్రాసిన జడ్జిమెంట్ అనే కథ రచయితగా తన జీవితంలో పెద్ద మలుపు. ఇది తండ్రీ కొడుకుల సమస్యాత్మక బంధాన్ని సూచిస్తుంది. 1912లో ప్రారంభించబడి 1915 లో ప్రచురింపబడిన ‘మెటమార్ఫసిస్’ అతని రచనలన్నింటిలోనూ అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. 

గ్రెగర్ శాంసా అనే పాత్ర ద్వారా ఈ సమాజంలో వ్యక్తుల పరాయీకరణ, అనుబంధాల విధ్వంసం, సున్నితమైన మనస్కుల స్థాన భ్రంశం వంటి అంశాలను చూపుతాడు. తల్లి,తండ్రి సోదరులు అందరూ వున్న కుటుంబ వ్యవస్థ కూడా తమ వారినెలా స్వార్ధం కోసం పరాయిగా చేస్తుందో చూస్తుందో చూపుతాడు. ఈ కథలోని నాయకుడు ఒక సేల్స్ మన్ తరచూ ప్రయాణాలతో, ఉద్యోగ బాధ్యతలతో ఏకాకిగా ఉంటూ కుటుంబ సభ్యుల ప్రవర్తన తో విసిగి దూరం కాబడి యాంత్రిక జీవనంతో ఓ కీటకంగా మారిపోతాడు. కీటకమైనా మనిషితనపు భావాలను పోగొట్టుకోలేక తానెవరో తెలిసినా తనను వదిలించుకోవాలనే వారి భావనను జీర్ణించుకోలేక ఏ ప్రేమనూ పొందలేక అందరిచేతా చీదరింపబడుతూ మిగిలిన పాత్రల్లోని కృత్రిమత్వాన్ని చూస్తూ మరణిస్తాడు. ఈరోజు ప్రేమ నిరాకరించబడిన అనేక అభాగ్యుల స్థితి కూడా ఇదే.  వృత్తిపరంగా పరిగెత్తిస్తున్న జీవితం,సున్నిత మనస్కులను ప్రేమ కోరే వారిని ఏ మూలకు నెడుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు కాఫ్కా.

1914 లో వచ్చిన నవల ‘ద ట్రయల్’. దీనిలోని నాయకుడు తనకు అందుబాటులో ఉండని అధికారుల చేత  తనకు తెలియని, తాను చేయని ఒక నేరారోపణతో అరెస్ట్ చేయబడతాడు. అతను చేసిన నేరం ఏమిటో ఎవరికీ తెలియదు. మన జీవితాల్లోని అసంబద్ధత (‘అబ్సర్డిటి’)  కాఫ్కా కథలలో అణువణువునా కనిపిస్తుంది.

తర్వాత చెప్పదగిన నవల ‘ద కాసిల్’. దీనిలోని నాయకుడు ఒక సర్వేయర్. కోట దగ్గర ఉండే ఒక గ్రామంలో ఒక ఎస్టేట్లో సర్వేయర్ గా పని చేస్తూ ఉంటాడు. అతను నియమింపబడినట్లు ఎవరూ అంగీకరించరు. అలాగని తిరస్కరించరు కూడా. ఈ కథ ఉద్యోగస్వామ్య వ్యవస్థలోని పరాయీకరణను చూపిస్తుంది. అలాంటి ఉద్యోగుల నిరాశ నిస్పృహలను కూడా చిత్రీకరిస్తుంది. కాఫ్కా వ్రాసిన కొన్ని న‍వ‍ల‍లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పూర్తి కాలేదు. అందుకే ఆయన వాటిని ప్రచురింపవద్దని కోరాడు. 

కాఫ్కా నవలను విమర్శకులు విభిన్న కోణాల్లో అర్థం చేసుకున్నారు. ఇరవయ్యవ శతాబ్దపు సాహిత్యాన్ని అనూహ్యంగా మలుపుతిప్పిన ప్రతిభావంతుడు ఫ్రాంజ్ కాఫ్కా. 

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

3 comments

  • ఇలాంటివారి జీవితాల గురించి మన విద్యార్థులకు చెప్పాలి. ఇంట్లో ప్రేమ కరువైనప్పటికి నిరాశతో జీవితాన్ని అంతం చేసుకోకుండ
    చదువుకుని, సాహిత్యం రూపంలో సమాజానికి సేవచేసిన గొప్పరచయిత. విజయ్ సర్ & పద్మజామేడం ఆంగ్లసాహిత్యం పెద్దగా తెలియని నాబోటివారికి మంచి రచయితను పరిచయంచేశారు. ధన్యవాదాలు 🙏

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.