కంచికి చేరని కథ

కథ చెప్పడం అంటే అనగనగా అని మొదలు పెట్టడం కాదు. ఊ కొట్టించడం కాదు. ఊ కొట్టి నిద్రపోవడం కాదు. ఏడేడు సముద్రాలు దాటించడం కాదు. అన్ని కథలు కంచికి చేరుతాయా? కథ చదివాక పాదాల కింద సన్నటి సెగ తగలాలి. నరనరాన అగ్గి పుట్టాలి. రవ్వలు ఎగరాలి. అస్తవ్యస్త సమాజ చీకట్లను పారద్రోలే వెలుగు రావాలి.

ఆధునిక సమాజం ఏమంత పరిశుభ్రంగా లేదు. అది భౌతికంగా కానీ, మానసికంగా గానీ… చెత్త చెత్తగా ఉంది. కొత్త సమాజం కావాలి. ఈ సమాజాన్ని ఎవరు నిర్మిస్తారు? ఎలా నిర్మిస్తారు? అసమానతలు లేని సమాజం సమీప దూరంలో చూడగలమా? కులాన్ని, మతాన్ని సముద్రాలు దాటించగలమా? ప్రగతిశీల సమాజాన్ని విద్యావంతులు, రచయితలు, మేధావులు ఆకాంక్షిస్తారు. అందుకోసం సాహిత్యం ఒక సోపానం.

బడిలో పక్క పక్కనే కూర్చొని చదువుకునే రోజులొచ్చాయి. బస్సులో కులాలవారీ వంతు లేదు. ఏడుకొండలు అందరూ ఎక్కి దిగుతున్నారు. సినిమావాళ్ళ పెళ్ళిళ్ళకు కులాల అడ్డు లేదు. అంతమాత్రాన కుల వ్యవస్థ లేనట్టేనా? మనుషులు కులాల కంపు కడుక్కొని పవిత్రమైనట్టేనా? 21 వ శతాబ్దంలో కూడా కులాలు ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. కత్తులు పదును పెట్టుకొని సిద్ధంగా ఉన్నాయి. కుత్తుకలు తెగ్గోసి కులుకుతున్నాయి. పరువు హత్యలకు కారణం కులం కాదంటారా? కులం గాడి మీద ఉమ్మినా డెట్టాల్‌ తో తుడుచుకొని వెళతాడు. కానీ సంస్కరించబడటం లేదు.

అలాగే పి.వి.సునీల్‌ కుమార్‌ అనే కథకుడు ”థూ” అని ఉమ్మాడు. అక అమానవీయ కాండకు, న్యాయవ్యవస్థ చెప్పిన తీర్పు విని… గుండెలనిండా రక్తం ఉబికి, సిరాగా మారిన కథ ”థూ”.

”థూ” కథ లో ఎక్కడా అస్పష్టత కనిపించదు. పులమడం కనపడదు. రచయిత ఉద్రేక పడిపోడు. బ్యాలన్స్ తప్పడు. అలా విప్పుకుంటూ వెళతాడు. రెండే రెండు పాత్రల చేత చెప్పించుకుంటూ వెళతాడు. ఉమ్మి ఊరుతూ ఉంటుంది.

తడిసి అట్టలు కట్టిన సాల్మన్‌ రాజు రక్తం ప్రత్యక్షమౌతుంది. కుంటి జోసప్పు గాడి విరిగిన కాలు కనిపిస్తుంది. బసివిరెడ్డిగారి దబాయింపు వినిపిస్తుంది. మనువాద సిద్ధాంతం, కుల వ్యవస్థ దాష్టికం, అగ్రవర్ణ దురహంకార ఆధిపత్య ధోరణి… వీటన్నింటిని ప్రగతిశీల దృక్కోణం నుంచి రచయిత ఆవిష్కరించారు. దళిత తాత్వికతను స్పష్టం చేశారు. పోలీసు అధికారిగా ఉండి న్యాయవ్యవస్థను ధైర్యంగా ప్రశ్నించారు. మామూలు కథకులు, రచయితలు కొన్ని వ్యాఖ్యలు చేయడానికి సాహసం చేయరు. అండర్‌ కరెంట్‌ గా చెబుతారు. సునీల్‌ కుమార్‌ దాపరికం లేని రచయిత. కాకుంటే కలానికి కాస్త వ్యంగ్యము, చమత్కారము పూశాడు.

బసివిరెడ్డి నాయుడు గారి నోటి నుండి వచ్చిన కొన్ని ఆణిముత్యాలు చూద్దాం.

 1. ”మనం పెద్ద మనుషులం కాబట్టి సాయపడతాం. మన సాయంతో నెమ్మదిగా వాళ్ళు కూడా పైకి రావాలండి. దానికి పడితే మహా అయితే మరో నాలుగైదు వేల ఏళ్ళు పట్టచ్చు. కాదంటే ఇంకో మూడు, నాలుగు వేల ఏళ్ళు. అంతే కదండీ. నెమ్మది ముఖ్యం”.
 2. ”సరే కష్టమో, నష్టమో ప్రజాపాలనా భారం ఎవడో ఒకడు మోయాలిగా. అందుకే మా రెడ్లంతా కష్టపడి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా నానా బాధలూ పడతా ఒస్తన్నాం.”
 3. ”అయితే పార్టీలని నమ్ముకున్న మాలమాదిగ నా కొడుకులకి మనం ఏ రోజూ అన్యాయం చేయలేదు. మనకి అంత అన్యాయం అక్కర్లేదు. మనల్ని నమ్ముకున్నందుకు ఆళ్ళకి గేదెలు, పందులు, ఆటోలు ఇచ్చాం. అంటే లోను మీద. అదొకటేనా ఎలక్షను వచ్చినపుడల్లా నా కొడుకులకి మనుగుడుపు పెళ్ళికొడుకుల్లాగా రోజూ మందూ, బిర్యానీ పొట్లం, వందో, రెండొందలో కట్నం. పోనివ్వండి ముండా కొడుకుల్ని. ఆళ్ళూ బతకాలిగా. మనకీ దయా జాలీ ఉండాలిగా”.

పై మాటల్లో బసివిరెడ్డి నాయుడు బాధ అర్థమౌతూనే ఉంది. ఆయనకు ఎంత దయ, ఎంత జాలి. వాళ్ళు అలానే ఉండాలని అతగాడు చెప్పకనే చెబుతున్నాడు. ఈ కథలో కీలకమైన ఘట్టం సాల్మన్‌ రాజు అనే తక్కువ కులం వాడు, బసివిరెడ్డి నాయుడు మాటల్లో ఎర్రగా, బుర్రగా, నదరుగా బలిసిన గొడ్డల్లే ఉండేవాడు… ఓ కామందు కూతురు ఒకరికొకరు ఇష్టపడ్డారు. కాదులే రాజుగాడి మాయలో పడింది.

పెద్ద కులపు కుర్రాళ్ళు రాజుగాడితో గొడవకి దిగారు. మాల మాదిగ కుర్రాళ్ళు వాళ్ళకి నాలుగు తగిలించారు. భూస్వాముల పిల్లల్ని, కూలి నా కొడుకుల పిల్లలు కొట్టటం కంటే ఘోరం ఈ భూ ప్రపంచం మీద యింకేముంటుంది చెప్పండి. దాంతో భూస్వాములు శివాలెత్తిపోయారు. కొడదామని వెళ్ళారు. కూలీ నా కొడుకులు తిరగబడ్డారు. ఆ చిరాకులో కత్తులు తీసి పదిమందిని నరికేశారు. అది కూడా వాళ్ళ ఆయువు మూడి చచ్చిపోయారంట. వీళ్ళు నరికితే చనిపోలేదంట. ”మీరు నిమిత్త మాత్రులు” అని ఆ ఊరి పంతులుగారు సెలవిచ్చారని బుకాయిస్తాడు బసివిరెడ్డినాయుడు.

కుంటి జోసప్పుగాడి కథనం :

నిజమైన కథ. కన్నీటి గాథ. కొడుకుని పోగొట్టుకున్న కన్న కడుపు శోకపు కథ. నన్నయ, తిక్కన లాంటి వాళ్ళు మా గురించి కతలు రాయలేదని, అయినా తమ బోటోళ్ళ గురించి కథలు రాసినా అక్షరాలు కూడా మలినమైపోతాయని పొడిచే కథ.

కుంటి జోసప్పు గాడి కొడుకు సాల్మన్‌ రాజు. వంకీల జుట్టు. మంచి పాటగాడు. ఆడు పాడుతుంటే మగ సింహం గొంతు సవ్వారు చేసుకున్నట్టుండేది. అందుకే కదా ఆ కమ్మవారి పిల్ల ఈడి మీద మనసు పారేసుకుంది. కానీ ఏం చేద్దాం. పెద్ద కులపోళ్ళు అందరూ.. దండెత్తి దొరికినోడ్ని దొరికినట్టు నరికారు. ఎంటబడ్డారు. నరికేశారు. కిందేసి తొక్కేశారు. గోనె సంచుల్లో కుక్కేశారు. పంటకాలవలో పడేశారు.

చందమామలాంటి రాజుగాడి మొహం మీద కాళ్ళతో తన్నేరు. చాకుల్తో వాడి ముక్కు కోశారు. అంగం కోశారు. ఛాతీ మీద కోసి ఆడి గుండెకాయ బయటకి తీశారు. కుంటోడొకడు, జోసప్పుగాడి కాలి మీద కొట్టేడు. జోసప్పు కుంటివాడు అయ్యాడు. బతుకు ఇరిగి శవమైపోయాడు. నోట్లో తడి ఇగిరి ఉయ్యలేకపోయాడు.

అతనికి ‘ఉయ్యాలనుంది దేవుళ్ళమీదా… మమ్మల్ని మనుషులు కాదన్న వాళ్ళ మీదా… కడజాతివాళ్ళని అన్నవాళ్ళ మీదా… నా బిడ్డని పొట్టన పెట్టుకున్న అందరిమీదా…’ ఇలా జోసప్పు చేత రచయిత మాట్లాడిస్తాడు. మనకు (అంటే మానవత్వం ఉన్నోళ్ళకు) కన్నీళ్ళు ఆగవు. రక్తంలో వేటకత్తులు మొలుస్తాయి. అయినా ఏం చేద్దాం. కింద కోర్టు శిక్ష వేసినా… పెద్ద కోర్టులో ఆళ్ళ కులపోడి దగ్గరకే కేసు వెళ్ళడం… దొంగ కేసు అని సాక్షాత్తూ జడ్జిగారు కొట్టేయడం… జోసప్పు గాడు ఊయడం… ఆయన మొగాన పడటం…

పి.వి.సునీల్‌ కుమార్‌ ఆవేదనా స్పర్శ లేకుండా మొద్దుబారిపోయిన న్యాయ వ్యవస్థను, దాని తీర్పును ‘థూ’ అన్నాడు.

సామాజిక న్యాయం కోరుకునేవారికి ఈ కథ ఒక ఉద్యమ స్ఫూర్తి. ఇది ఒక కొత్త కథా నైపుణ్యం. సామాజిక అన్యాయం పై యుద్ధం ప్రకటించిన కథ. ఇది కంచికి చేరకూడదు. చర్చకు దారితీయాలి. తెరలు తొలగించాలి. పొరలు తొలగాలి. అగ్రకుల, అట్టడుగు వర్గాల అంతరాలను తొలగించే ఇలాంటి రచనలు ఇంకా రావాలి. ప్రజల్లోకి వెళ్ళాలి… మార్పు వస్తుందా! మారుతారా! ఏమో!

 

పరామర్శ గ్రంథాలు :

 1. థూ – పి.వి.సునీల్‌ కుమార్‌ – హెల్ప్‌ డెస్క్‌, హైదరాబాద్‌ ప్రచురణ
 2. నీలవేణి కథా సంపుటి – పి.వి.సునీల్‌ కుమార్‌
 3. కథా 2014 – వాసిరెడ్డి నవీన్‌, పాపినేని (సం.పా)

సుంకర‍ గోపాలయ్య

సుంకర గోపాలయ్య: కాకినాడ, పిఠాపురం రాజా కళాశాలో తెలుగు శాఖాధిప‍తి. సొంత ఊరు నెల్లూరు. రాధేయ కవిత పురస్కార నిర్వాహకులు. కొన్ని పిల్లల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

13 comments

 • 100 కాపీలు కొని అందరికీ ఈ కధని పంచడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. తెలుగు కధా స్థాయిని మలుపు తిప్పిన కధ గా భావిస్తాను. శిల్పం కొత్తగా ఉంటుంది. ఒక ఐపీయస్ ఆఫీసర్ ఇలా రాయగలగడం మామూలు విషయం కాదు.

  గోపాల్, మీర్రాయడమూ బాగుంది. చాలా బాగుంది. సూటిగా సుత్తిలేకుండా. మీరు చదువుకున్న తనం మీ వాక్యం లో దాయలేరు. ఎంతైనా తెలుగు పంతులుగారు కదా !

  అభినందనలు.

 • మంచి కథను పరిచయం చేశావు మిత్రమా
  మనం ఎలాంటి ఇరుకైన సమాజంలో ఉన్నామంటే ఇక్కడ ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది

 • గొప్ప కథను చడివామని అనందించాము అప్పట్లో. .కథకుడు అధికారి అయినా భాధ్యత గల కథకుడి గా తెలుగు పాఠకుల్లో గుర్తుండి పోతారు. మరో సారి మీరు స్పృశించిన తీరు ఆకట్టుకొంది. మీకు కథకులు సునీల్ కుమార్ గారికి అభినందనలు

 • మంచి కథ. తెలుగులో ఇంలాంటి సాహిత్యం అవసరం

 • గోపాల్
  ‘థూ’ కథ పై నీ విశ్లేషణ చదివాను.
  కథా రచయిత మా పనిచేసి నప్పుడు వారి సమర్థత గురించి విన్నాను.
  ఒక ips అధికారిగా ఉండి, అంత తీవ్రమైన ఉద్వేగ పూరితంగా రాశారంటే నిజ్జంగా గొప్పవాడే..

  కథలో పాత్రల స్వభావాల్ని,కులవిద్వేషాలతోటి
  పొగలై రగిలే మానసిక సంక్షోభాల్ని నీవు చక్కగా
  పరిణతి తో వివేచించావ్.అభినందనలు.

  ‘థూ’ పేరుతో గతంలో షేక్ కరీముల్లా ముస్లింవాద
  కవితా సంపుటి తెచ్చాడు.
  ఇది కథ.దీని రూపు రేఖలు,అట్టడుగు కులాల చాకిర్ల తో అగ్రవర్ణాలు అధికార నిచ్చేనలమీద ఎలా ఎగబ్రాకు తున్నారో నీ విశ్లేషణ తెలియజేస్తోంది.
  అభినందనలు.

 • కథా పరిచయం,నీ వ్యాఖ్యానం చక్కగా అమరింది.
  ఆధునిక సామాజిక వ్యవస్థలోమనిషికి కులం,వర్గం ,అనివార్య అర్హతలైనాయి

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.