ఆమె వెళ్ళిపోయింది

పక్షులు కిలకిలముని శబ్దాలు చేస్తూ ఉన్నాయి, మెల్లని స్వరంతో ‘ప్రభు కాపాడండి, ప్రభు కాపాడండి’ అంటూ వంటగదిలో మోకాళ్ళ మీద పడి యేసు ప్రార్థన చేస్తున్న అమ్మ మాటలు మెల్లగా నా చెవిని చేరుతూ ఉన్నాయి. ఈలోగా సూర్యుని తెల్లని కాంతి తలుపుల సందులో నుంచి తలుపును నెట్టుకుంటూ చొక్కా లేకుండా ఉన్న నా వీపుకి తగులుతూ ఉంది. అప్పుడే మెలకువ వచ్చి నిద్రమత్తు వీడి నట్టు ఉంది. కళ్ళు తెరిచి చూస్తే మసకమసకగా కనిపిస్తున్నాయి అంతే. మళ్లీ మంచం మీద వాలి దుప్పటి కప్పాను. 

“ఆమెన్ “అంటూ ప్రార్థన ముగించింది అమ్మ. ‘నిద్ర పోయింది చాల్లే లేసి ప్రార్థన చేసుకో, కాలేజీ కి పోవాలి బస్ టైం అయింది లే’ అంటూ వచ్చింది గదిలోకి అమ్మ. 

అమ్మో! ఈరోజు కాలేజీకి వెళ్లాలి. మొదటి రోజు. బస్సు వచ్చే టైం అవుతుంది అని మనసులో అనుకుంటూ దిగ్గున లేచి దుప్పటి పక్కకు నెట్టాను. ‘లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో’ అని మళ్ళీ చెవిలో జోరీగ లా అమ్మ గోల. 

ఛీ… నీ అమ్మ గోల అంటూ టీ.వీ పక్కనున్న బైబిల్ తీసి రెండు మూడు పేజీలు తిరగేశాను. లోపల గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని పరలోకంలో ఉన్న ఏసుప్రభు కి నా పిచ్చి పిచ్చి కోరికలు చెప్పి ప్రార్ధన ముగించాను. ఇంకా మమ్మల్ని ఎప్పుడూ తోము తావు రా అని తిట్టుకుంటున్న నా 32 పళ్లను నలిగిపోయిన బ్రష్ తో అటు, ఇటు వంట చేసేటప్పుడు తిప్పే గరిట లాగా బ్రష్ ని నోట్లో పెట్టి తిప్పాను. టైం అవుతుంది ఇక డైరెక్టుగా స్నానమే. బ్రష్ నీళ్లలో కడిగి పక్కనపడేసి మాడిపోయిన గిన్నెను రుద్ది నట్టు సబ్బు పెట్టి కిందికి పైకి ఒళ్లంతా రుద్దాను. రుద్దుతూ వుంటే సబ్బు బిళ్ళ జలగ లాగ జారిపోతూ ఉంది. ఒంటి మీద నురుగు అంతా కడిగా. స్నానం అయ్యింది. 

అమ్మ అన్నం పెట్టింది. గబా గబా తిన్నా ను. ఈలోగా కుయ్ కుయ్ మంటూ బస్సు సౌండ్ హారన్ చేస్తూ వాగు దగ్గర ఉంది. మా ఊళో ఫస్టు బస్సును చూసేది నేనే ఎందుకంటే మా ఇల్లు ఊరి చివరన పొలాల్లో ఉంది. 

పేడ తట్ట లాంటి నా తలను రైతులు పొలంలో అరక తో దున్ని నట్లు నా జుట్టును దువ్వెనతో దువ్వుతూ ఉన్నాను. ‘ఆ జుట్టు పాడుగాను నువ్వు దువ్విన నంతా సేపు లో ఇద్దరమ్మాయిల కు జడ వేయవచ్చు ఎంతసేపు దువ్వు తావు రా’ అంటూ అమ్మ గోల. 

చేతిలో అద్దం పట్టుకొని నన్ను నేను అద్దంలో చూసుకున్నా.  పెద్ద అందగాడినని ఫీలింగ్ ఒకటి నాకు. 

‘ఎప్పుడు రాస్తావు రా నాపై’ అనుకుంటున్నా నోట్ బుక్ చేతిలోకి తీసుకున్నాను, ‘ఒరేయ్ నన్ను మర్చిపోకు రా’ అనుకుంటున్న పెన్ను తీసుకొని జీన్ ప్యాంట్స్ కింద జేబులో పెట్టాను. పెద్ద చదివి ఊరిని ఉద్ధరించే వాడిలాగా బయలుదేరాను. 

ఈలోగా నాన్న మంచం మీద నుంచి ‘చదువుతున్నావా, లేకపోతే పోరగాళ్ళతో తిరుగుతున్నావా! మంచిగా చదువుకో ఏదో ఒక జాబ్ కి పెట్టు కొందువు గాని’ అని ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం పాట లా పాడుతూ ఉంటాడు రోజు. అన్నయ్ ఓ చిలిపి నవ్వు నవ్వి పొలంలోకి వెళ్లి పోయాడు. 

మా బజారున ఆంజనేయస్వామి గుడి దగ్గర బస్సు ఎక్కాను. అదే నాకు నాతోటి వాళ్ళందరికీ బస్ స్టాప్ . 

బస్సు బయలుదేరింది. టికెట్టు తీసుకున్నాను. మనసులో ఏవేవో ఆలోచనతో సతమతమవుతోంది. బస్ ఆగింది. మా కాలేజీ ఉన్న పట్టణానికి వచ్చేసాం. చాలా తొందరగా వచ్చేసాం అనుకున్న. 

కాలేజీకి కాస్తంత దూరంలో చిన్న లైబ్రరీ ఉంది . ఐ.ఏ.ఎస్ కు ప్రిపేర్ అయినట్టు పేపర్ చదివి కాలేజీ వైపు నడక సాగించాను. ఎదురుగా ఓ పెద్ద బిల్డింగ్. ముందు గ్రౌండ్ ఏమీ లేదు, ఓ రెండు టేకు చెట్లు, ఒక జామ చెట్టు. చిన్నచిన్న జామకాయలు.  

తిరుపతి మెట్లు లాగ మెట్లెక్కి నా క్లాస్ రూమ్ కి చేరాను. తలుపులు, కిటికీ కి తలుపులు లేవు. ఏం ! కాలేజీ రా బాబు అనుకున్నా. పక్క రూమ్ నుంచి గుసగుసలు. చూస్తే అమ్మాయి అబ్బాయి ఫైనల్ ఇయర్ వాళ్లు . లవర్స్ లాగా ఉన్నారు మనకెందుకులే వాళ్ల గురించి అనుకుని నా రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నా. క్లాసులు మొదలయ్యాయి లెక్చరర్ చెప్పే పాఠాలు “తెలుగే సరిగా రాని వాడికి తమిళం” చెప్పినట్టు ఉంది. నా మట్టి బుర్రలో కి పాఠాలు ఎక్కడం లేదు. 

పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. చదవడానికి మెటీరియల్ కావాలి సెకండ్ ఇయర్ నా స్నేహితుడు దగ్గరికి వెళ్లి విషయం చెప్పాను మీ సైన్స్ పుస్తకాలు మా ఆర్ట్స్ వాళ్ల దగ్గర ఎలా ఉంటాయి? అన్నాడు. సైన్స్ గ్రూపులో ఫ్రెండ్స్ ఉంటారుగా వారి నీ అడుగు, రేపు అడుగుతా అన్నాడు. 

మరుసటి రోజు ఒంటరిగా కూర్చొని మా రూమ్ లో నుంచి చూస్తే మెట్ల పై వచ్చి పోయే వాళ్ళు చాలా క్లియర్ గా కనిపించారు. ఆ తలుపులు లేని కిటికీలో నుంచి చల్లటి గాలి, మెట్ల మీద నుంచి టపా టపా మనీ చెప్పుల శబ్దం. ఎవరో వస్తున్నట్లు ఉంది చూస్తే ఎవరూ కనబడడం లేదు. సౌండ్ పెరిగింది ఎవరో నా వైపే వస్తున్నట్లు అనిపించింది. చూస్తే ఎవరు కనబడడం లేదు ‘ఎవరబ్బా’ అని మనసులో ప్రశ్న’, 

మా ఫ్లోర్ లోని మొదటి మెట్టు మీద చక్కగా దువ్విన తల, ఎవరో స్కేల్ తో గీసినట్లు నిలువు పాపిడి కనిపిస్తున్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంది. నా కళ్లు అటే చూస్తున్నాయి. తన రూపం కొంచెం కొంచెం కనబడుతోంది. మెట్ల లాగే ఒంపు తిరిగిన వయ్యారం. 

మెరిసిపోతున్న మొహం. కళ్ళు తిప్పుకోలేక పోతున్నాను. మెట్లు ఎక్కుతోంది. నా దగ్గరకు వస్తున్నట్లు ఉంది. మనసులో ఏదో తెలియని తొందర. గుండె వేగం పెరిగింది. తనను కింది నుంచి పై వరకూ చూసి, ‘ఏమి అందం’ అనుకున్నా. 

పై ఫ్లోర్ లో కి వెళ్తూ నా వైపు చూసింది, నేనూ చూశాను. తన కళ్ళు నన్ను తన వైపు లాగుతూ ఉన్నాయి. ‘ఈలోగా ఏరా! ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి అంటగా’ అంటూ నా వైపు వచ్చాడు స్నేహితుడు. నేను వాడి వైపు చూశాను. మళ్లీ మెట్ల వైపు చూశాను తను కనపడలేదు. క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. వీడిని బండకేసి కొట్టాలి అని మనసులో అనుకున్నాను.. 

నా సెకండ్ ఇయర్ స్నేహితుడు వచ్చి ‘ఏరా! మెటీరియల్ కావాలిగా నా వెంట రా, నా ఫ్రెండ్ దగ్గర అడుగుతా’ అన్నాడు. నేను వాడి తోకలా పై ఫ్లోర్ లో కి వెళ్లాను. 

వీడు వెళ్లి ఓ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు . ఆమె ఇందాక మెట్ల మీద చూసిన అమ్మాయి. ‘రా రా’ అంటూ పిలిచాడు. మనసులో భయం భయం. దగ్గరకు వెళ్లాను “నోట్స్ వీడికే” అన్నాడు. “రేపు తీసుకొస్తా లే” అంది ఆ అమ్మాయి. 

ఇంటికి వెళ్ళాను. మనసంతా ఒకటే గోల. ఏదో తెలియని ఆనందం. ఫోన్ తీశాను. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి ప్రేమపాటలు వింటున్నాను. రాత్రి అయింది. నిద్ర రావడం లేదు. తనతో ఎలాగైనా మాట్లాడాలి ఎప్పుడు తెల్లవారుతుందా అని అనే ఆలోచన. 

“లేరా నిద్రమొహం” అన్నట్టుగా తలుపుల సందులో నుంచి ఇంట్లోకి కిరణాల్ని పంపించాడు సూర్యుడు. రెడీ అయ్యాను. బస్సు వచ్చింది , కాలేజీ చేరాను. 

ఇక అమ్మాయి కోసం వెయిటింగ్ అదే రూమ్ లో ఒంటరిగా కూర్చున్నాను. కిటికీలో నుంచి అదే చల్ల గాలి. తను మెట్లు ఎక్కుతూ నా వైపు చూసింది. చేతిలో చూస్తే ఒకటి, రెండు పుస్తకాలు ఉన్నాయి. నేను తన వైపు చూస్తున్నా. తను నా వైపు నాతో చెప్పాలన్నట్లుగా చూస్తోంది. 

లేచి తన దగ్గరికి వెళ్లాను, ఈరోజు మెటీరియల్ తేలేదు రేపు తీసుకు వస్తాను అంది. నీ పేరేంటి? అని అడిగాను, నీకెందుకు అంది. స్పీడ్ గా వెళ్లిన బైకు బోల్తా పడినట్టు అయ్యింది నా పరిస్థితి. ఏమి చేసేది ఏమి లేక కిందికి వచ్చేశాను. 

కెమిస్ట్రీ పిరియడ్ లో సెకండ్ ఇయర్ వాళ్లంతా ఫస్ట్ ఇయర్ ఫ్లోర్ లోకి వస్తారు. ఆమె వచ్చేసింది నాకు ఎదురుగా ఉన్న రూమ్ లో కూర్చుంది. 

నేను తన వైపు చూశాను. తను నా వైపు చూసింది. “ఏంట్రా కామం కళ్ళలోంచి కారుతోంది” మీద చేయి వేసుకుంటూ అన్నాడు స్నేహితుడు. ‘కొడితే కంపలో పడతావ్ ఏంట్రా నీ గోల’ అని విసుగుపడ్డాను. బెల్ కొట్టారు. ఇంటికి వెళ్ళాను. మనసులో బాధ. తను ఎందుకు పేరు చెప్పలేదు? 

మరునాడు కాలేజీ. రూమ్ లో వెయ్టింగ్ తనకోసం. కిటికీ లోంచి చల్ల గాలి. తను వస్తుంది. తను వస్తోంది తొందర తొందరగా తన దగ్గరికి వెళ్లాను. మెటీరియల్ ఇస్తూ తన పేరు చెప్పింది. నేను నా పేరు చెప్పాను. 

నాకు నీ పేరు తెలుసు అంది. ఈలోగా ఎవరో వచ్చారు. గబా గబా కిందికి వెళ్ళాను. కాలేజీ అయిపోయింది ఇంటికి వెళ్లాను మనస్సులో గోల. తనకు నా పేరు ఎలా తెలిసిందా అని. 

మళ్లీ కాలేజీ. అదే రూమ్. కిటికీ లోంచి  అదే చల్ల గాలి. తను వస్తుంది తనను అడిగాను నా పేరు నీకు ఎలా తెలుసు? అని. నీ ఫ్రెండ్ చెప్పాడు అంది. 

రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా రోజూ ఆమెను చూడడం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చినట్టుగా ఉంది నాకు. 

తనకు ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను. చెవిలో హెడ్ ఫోన్లు పెట్టా. అన్ని ప్రేమ పాటలు, పచ్చని పొలాల వైపు నడుచుకుంటూ వెళ్లాను. చెవిలో పాటలు. నేను నడుస్తూనే ఉన్నా.నడక ఇంకా వేగంగా పెంచాను. నీళ్లల్లో లో పంచదార కరిగినట్టు నా మనసు ప్రేమగీతాలతో నిండిపోయింది. 

చల్లని గాలులు నన్ను తాకుతున్నాయి, మనసు తేలిపోతోంది. చూస్తే పెద్ద గోడ లా ఉంది ఆ చెరువు కట్ట.ముందుకు కదిలాను చూస్తే పచ్చని చెట్లు, నీళ్లు. వాతావరణం హాయిగా ఉంది ఆ చెరువు దగ్గర. నీళ్ల మధ్యలో తెల్లని కలువ పువ్వులు తేలుతూ ఉన్నట్లు ఉన్నాయి. చెరువు చివరి న ఓ పొడవాటి రైలు వెళుతుంది. 

ఈ ప్లేస్ లో ఆ అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది నా మనసులో నుంచి ఒ ఊహ బయల్దేరింది. తను కూడా ఇక్కడే ఉన్నట్లు, తాను ఇక్కడ తిరుగుతున్నట్లుంది. ఊహల్లోనే ఇంటికి చేరాను. ఎలాగైనా తనకు నా ప్రేమ గురించి చెప్పాలి. చెప్పాలంటే భయం. ఆమె నా కన్న పెద్దది. ఆమె సెకండ్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్. తాడిచెట్టు ముందు ఈత చెట్టులా. 

తెల్లారింది, కాలేజీకి వెళ్లాను. ఎలాగైనా తనకు చెప్పాలి నా ప్రేమ విషయం ఈరోజు. ధైర్యంగా తన దగ్గరకు వెళ్లాను. ఏంటి నిన్న కాలేజీ కి రాలేదు. తను అలా చెప్పగానే నాకు దిమ్మ తిరిగింది. 

నీకు ఎలా తెలుసు అన్నాను. మీ ఫ్రెండ్ ఒకడు fb లో ఫోటోలు పెట్టాడు సినిమా కి వెళ్లిన వి. ఆ విషయం పట్టించుకోకుండా తనకు ఎలాగైనా ఈ రోజు ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నా. చెప్పాలి అనిపిస్తుంది. కానీ చెప్పలేక పోతున్నా. ఈలోగా తన స్నేహితురాలు వచ్చింది.. ములక్కాయ లాగా పొడవుగా, సన్నగా ఉంది తన స్నేహితురాలు. ఏంటి ఇక్కడ ఉన్నావ్ అంటూ తనతో మాట్లాడి లోపలికి వెళ్ళింది. నా మనసులో ఆవేశం ఆపుకో లేక పోతున్నాను. తనకు ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలని తనకు చెప్పాను, తను నవ్వింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండియర్ వాళ్లకు లైన్ వెయ్యడం ఏంటి అని నవ్వుతుంది తను. తను అలా అనగానే కుక్కలు చింపిన విస్తరి లా అయింది నా పరిస్థితి. 

పగలంతా దిగులు. వెళ్లి నా స్నేహితుడికి ఈ విషయం చెప్పాను. వాడు కూడా నవ్వి” అయినా సెకండ్ ఇయర్ వాళ్లకు ఎవరో ఉండే ఉంటారు రా “అన్నాడు. వాడు అలా చెప్పగానే పుండు మీద కారం చల్లి నట్లయింది.

మనసులో ప్రశ్నలు. తనకు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో ఎందుకు మాట్లాడుతుంది? నా వైపు ఎందుకు చూస్తుంది? కాదు కాదు తనకు ఉండే ఉంటారు. తను నన్ను ఫ్రెండ్ గా గా చూస్తుందేమో. కొబ్బరి చిప్ప కోసం కొట్టుకునే రెండు కోతుల్లా నా మనసుకు శరీరానికి మధ్య ప్రశ్నల పోరాటం.

తనకు ఎవరు లవర్స్ ఉండరు. టెన్షన్ గా ఉంది రాత్రంతా. తననే అడిగితే ఎలా ఉంటుంది. వద్దు తను ఏమనుకుంటుందో. 

తెల్లారింది, పకుల అరుపులు. కోపంతో రగిలిపోతున్న సూర్యకాంతి వచ్చి” లేరా పిచ్చి మొహం, తెలివి తక్కువ ఎదవ, దద్దమ్మ, పంది, ఏ అమ్మాయి కి ఐ లవ్ యు చెప్పాలో కూడా తెలియదు అన్నట్లుగా నా కళ్ళల్లోకి పడింది. కాలేజీకి వెళ్ళా. దసరా సెలవులు అని కాలేజ్ లో చాటింపు. ఓహ్, దసరా సెలవులు, తనను ఎలాగైనా తన తో నా ప్రేమ విషయం చెప్పాలని తన క్లాస్ రూం దగ్గరికి వెళ్లి చూశాను. తను ఆ రోజు కాలేజీ కి రాలేదు. 

ఒక్కసారిగా మనసులో ఆలోచన fb ఉంది కదా మనకు. fb లో మెసేజ్ పెడదాం అనుకున్న. అయినా నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. …. నీ అమ్మ జీవితం టచ్ ఫోన్ కూడా లేదు. ఏంటి పరిస్థితి అని ప్రభుయేసు నీ కరుణించని మనసులో వేడుకున్నా. ప్రభుయేసు కరుణించాడు. గంటసేపు బుర్రను గోకి ఆలోచిస్తే నా చిన్న నాటి స్నేహితుడు దగ్గర టచ్ ఫోన్ ఉంది. మన పని కి వాడే కరెక్ట్ అనుకున్న. కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు ఉంది నా పరిస్థితి. వెళ్లి విషయం వాడితో చెప్పాను. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. నాకు ఒక కొత్త ఎకౌంటు తయారు చేసి. 

తోకలా వాడి వెంట తిరుగుతూనే ఉన్నా యాక్సెప్ట్ చేసిందా అని గంట నుంచి అడుగుతున్నా వాడిని. వాడేమో విసిగించకురా అంటున్నాడు. 

ఒక్కసారిగా పిడుగు పడినట్లు అరిచాడు వాడు. నీ ఫ్రెండు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది తను అన్నాడు. 

వాడు అలా చెప్పగానే వేల కోట్లు గెలిచినట్లు ఉంది నా ఆనందం. 

తనకు లవ్ సింబల్స్ పంపించాను. కొడితే మొహం పగిలిద్ది అంటూ చెంప మీద కొట్టినట్లుగా తన నుంచి మెసేజ్ వచ్చింది. ఓడిపోయిన ప్రెసిడెంట్ అయినట్టు అయ్యాను. రోజులు గడుస్తున్నాయి, సెలవులు అయిపోయాయి. “ఈసారి సూర్యుని కాంతి తిక్క కుదిరిందా” అన్నట్టుగా మొహం మీద పడింది. బస్ వచ్చింది , రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్ళాను. 

రూంలో కూర్చున్న. తను వస్తోంది. తన వైపు చూడలేదు తనతో మాట్లాడలేదు. దగ్గరకొచ్చి సెలవుల్లో ఏం చేసావ్ అని అడిగింది. ఏముంది బీరు తాగి పడుకున్నాను అని కోపంగా అన్నాను. నువ్వు బీరు తాగుతావా అని ఆశ్చర్యంగా అడిగింది. నేను ఆ….. అన్నాను. 

తన పైకి వెళ్తుంది నెంబర్ ఇవ్వవా అని అడిగా, ఎందుకు అంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నీ నెంబర్ ఎందుకు అడుగుతాడు అన్నాను. చిలిపిగా చూస్తూ ‘సారొస్తారు వెళ్ళు’ అంది. రోజులు గడుస్తున్నాయి. తను నెంబర్ ఇవ్వడం లేదు. 

పరీక్షలు దగ్గరకు వచ్చాయి. ఇక తన నన్ను పట్టించుకోదు. ఆకాశం నుంచి కింద పడినట్లు ఉంది. పరీక్షలు అయిపోయాయి. కాలేజీ అంతా కోలాహలంగా ఉంది. ఎందుకంటే రేపు లవర్స్ డే అని. రేపు తనకు ఎలాగైనా చెప్పాలని ఫిక్స్ అయ్యా.  

తెల్లారింది, లవర్స్ డే. కాలేజీకి వెళ్లాను. తన కోసం వెయిటింగ్. నా ఎదురుగా ఉన్న మెట్ల పై నుంచి వెళుతూ ఉంది తను.నా వైపు చూసి నవ్వింది నేను నవ్వాను. కాలేజీలో చెప్పాలని మనసులో తొందర తొందరగా ఉంది. ఎవరైనా చూస్తే బాగోదు కాలేజీ బయట చెప్తే బాగుంటుంది అనుకున్నాను. 

కాలేజీ అయిపోయింది. తనకోసం బస్టాండ్లో వెయిటింగ్ తను వస్తుంది నా ముందు నుంచి ఒకడు గులాబి పువ్వు పట్టుకొని తన లవర్ కు 

ఇవ్వాలని వెళుతున్నాడు. నా దగ్గర గులాబీ పువ్వు లేదు తను నా వైపు చూసింది. నేను చూసాను. పెద్ద పిడుగు పడినట్లు శబ్దం తో బస్సు హారన్ కొట్టుకుంటూ వచ్చింది. చేసేదేమీలేక బస్సు ఎక్కి కూర్చున్న. మనసులో తెలియని బాధ. ఈ మాయదారి బస్ ఇప్పుడే రావాలా అంటూ బూతులు తిట్టుకున్నాను. 

తొందర తొందరగా ఇంటికి వెళ్లి fb లో మెసేజ్ పెట్టా. రిప్లయ్ రాలేదు. సమయం గడిచిపోతుంది. తన రిప్లై కోసం ఎదురు చూస్తున్నాను. భూకంపం వచ్చినట్లుగా తన దగ్గర నుంచి రిప్లై వచ్చింది నా సంతోషానికి హద్దులు లేవు. నేనేమో నీ లవర్ ఎవరు అంటూ మెసేజ్ పెట్టా. రిప్లై రాలేదు. సంతోషమంతా సంతూర్ సబ్బుల కరిగిపోయింది. 

రోజూ రూమ్ లో తన కోసం వెయిటింగ్. తను వస్తుంది తన మొహం చూస్తే బాధపడుతూ ఉంది. తన వైపు చూసాను తను నా వైపు చూస్తూ ఏంటి ! అని కోపం గా అంది. ఎందుకో తెలీదు అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసింది. 

రోజులు గడిచాయి. 

తను డిగ్రీ ముగించుకొని శాశ్వతంగా కాలేజీ నుంచి వెళ్లిపోయే టైం వచ్చింది. అది చివరి రోజు. తనతో మాట్లాడాలని తన క్లాస్ రూం దగ్గరికి వెళ్లాను. తన వైపు చూశాను. తను కూడా నా వైపు చూస్తే బాగుండు అనుకున్నా. అదేంటో తెలీదు, ఒక్కసారిగా నా వైపు చూసింది. అయితే కోపంగా. అక్కడి నుంచి వెళ్లిపోయాను. 

నేనే తప్పు చేశాను, ఆరోజు తనతో ‘ఐ లవ్ యు’ చెప్పలేదు అనుకుంటూ కాలేజీ బయట నిలబడ్డాను. 

తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చింది తను. తను వెళ్ళిపోతుందని బాధ. ఇక తను కాలేజీకి రాదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అ కళ్ళతో తన వైపు చూస్తూనే ఉన్నాను. ఒక్కసారిగా నా వైపు తిరిగింది. నా కన్నుల్లో బాధ అర్థమైంది తనకు. అలా చూసుకుంటూ వెళ్ళిపోయింది. 

బాధతో ఇంటికి చేరాను. తన గురించే ఆలోచనలు. చీకటి పడింది. నిద్ర లేదు. 

తెల్లవారింది, పక్షుల అరుపులు, సూర్యుని కాంతి నా మీద. బస్ వచ్చింది కాలేజీ. 

తనకోసం రోజు వెయిట్ చేసే గదిలోకి వెళ్లి కూర్చున్న. మెట్ల వైపు చూస్తూ ఉన్నాను. తను రావడం లేదు. తను రాదు కూడా. మనసులో బాధ. తనతో గడిపిన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉన్నాను. 

మనసులో అనుకున్న ఓసారి “ఆమె వచ్చి పలకరిస్తే” బాగుంటుందని. 

కానీ తను రాదు.

వెళ్లిపోయింది.

మరీదు వేణుగోపాల రావు

మరీదు వేణుగోపాలరావు: శీలం పుల్లారెడ్డి కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ b.z.c చదువుతున్నారు. పుట్టిన ఊరు: ఆళ్లపాడు, బోనకల్ మండలం: ఖమ్మం జిల్లా, తెలంగాణ. నివాసం: మధిర.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.