పిల్లలపై లైంగిక వేధింపులు (CSA)

 

లైంగికంగా తమను తాము ఉత్తేజపరచుకోవడం కోసం, పెద్దవాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టేలా తాకడాన్ని, పిల్లలపై సెక్సువల్ గా దాడి చేయడాన్ని లైంగిక వేధింపులు లేదా child sexual abuse లేదా సంక్షిప్తంగా CSA అంటారు. 

చిన్నపిల్లలు ఇబ్బంది పడకపోతే, వారి ప్రైవేట్ పార్ట్స్ ని తాకడాన్ని, లేదా ఇంకేదైనా చేయడానికి పిల్లలు సమ్మతి(consent)ని తెలియజేస్తే, అప్పుడు CSA కాదా? 

UNICEF దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చింది.  సమ్మతి(consent) తెలియజేయగల మానసిక పరిణతిలేని పిల్లలతో చేసే ప్రతీ లైంగిక చర్యనూ CSA గానే చూడాలి. పిల్లల consent తీసుకున్నా, తీసుకోకపోయినా కూడా. 

CSA గురించి ఎందుకు చర్చించాలి? ఈ విషయాన్ని పట్టించుకొకపోతే, పిల్లలపై దాడులు జరిగితే ఏమవుతుంది?

చిన్నపిల్లలపై జరిగే ఈ లైంగిక దాడులు యొక్క దుష్ప్రభావం ఆరోజు తో సమసిపోదు.  చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. కొందరిలో అయితే ఆ పెయిన్ జీవితాంతం వెంటాడుతుంటుంది. పెద్దయ్యాక వారి రిలేషన్ షిప్స్, వారి లైంగిక జీవితం ఈ సంఘటనల వల్ల విపరీతంగా ప్రభావితమవుతాయి. అందుకే CSA గురించి మాట్లాడుకోవడం, వాటిని జరగకుండా ఆపడం చాలా అవసరం. 

పిల్లలను ఇబ్బంది పెట్టేలా  నడుమునూ, ఛాతీనీ, పెదాలనూ, వారి ప్రైవేట్ పార్ట్స్ నీ తాకడం, వారికి అశ్లీల చిత్రాలు చూపించడం, వారి బట్టలు విప్పి ఫోటోలు తీయడం, తమ ప్రైవేట్ పార్ట్స్ ని పిల్లలకు చూపించడం, వాటిని తాకమనడం, sexual intercourse(rape) కి ప్రయత్నించడం వీటిలో ఏది చేసినా CSA నే అవుతుంది.

అసలు Child sexual abuse కి గురయ్యే పిల్లల శాతం ఎంత?
5 శాతం?
10 శాతం?
20 శాతం?

భారత ప్రభుత్వ సంస్థ అయిన Ministry of women and child development 2007 సంవత్సరంలో Child Sexual Abuse (CSA) గురించి పరిశోధించడం కోసం, 13 రాష్ట్రాల్లోని పన్నెండు వేల ఐదు వందలు మంది పిల్లల్ని ఇంటర్వ్యూలు చేసి, రిపోర్ట్ తయారుచేసి, ప్రభుత్వానికి, UNICEF కీ సమర్పించింది.  సర్వే అనగానే sexual abuse జరిగిందా? లేదా? అనే ప్రశ్నతో కూడిన సాధారణ సర్వే అనుకుంటే పొరపాటు పడ్డట్టే.  

 లైంగికంగా వేధించిన వ్యక్తులు నీకు ఏమవుతారు? ఏ రకమైన లైంగిక దాడి జరిగింది? తాకడం, ఇబ్బంది పెట్టడం లాంటి సాధారణ వేధింపులా? లేక లైంగిక అవయవాల్ని టచ్ చేయడమా? లేక అంగ ప్రవేశానికి ప్రయత్నించడం లాంటి క్రూరమైన దాడా?  అలా వేధించడం ఎన్ని సార్లు జరిగింది? నువ్వు ఎక్కడ ఉండగా జరిగింది? జరిగిన తర్వాత నువ్వు ఎవరికి చెప్పావు? పేరెంట్స్ ఫ్రెండ్స్ పోలీస్, వీరిలో ఎవరికి కంప్లైంట్ చేసావు? ఇలా చాలా విస్తృతమైన ప్రశ్నలతో చాలా లోతైన పరిశోధన చేశారు. 

అప్పటి వరకూ నొక్కేయబడి, ఈ పరిశోధన ద్వారా, బయటకు వచ్చిన నిజాల్ని చూస్తే, మనుషులుగా మనమంతా సిగ్గుపడాలి. ఇవన్నీ వేరే గ్రహంలోనే వేరే దేశంలోనో జరగలేదు. మన దేశంలో మన రాష్టంలో జరిగినవే.

నూటికి 53 శాతం పిల్లలు లైంగిక వేదింపులకు గురవుతున్నారు. అలా CSA గురయ్యేవారిలో 53 శాతం మంది మగపిల్లలయితే 47% అమ్మాయిలు. 

వీరిలో 20.9% తీవ్రమైన వేధింపులకు గురవుతూ ఉన్నారని, పిల్లల ఇంటర్వ్యూలలో తెలిసింది. 

దాడి చేసేవారిలో నేరప్రవృత్తి కలిగిన వారూ, మానసిక ఆరోగ్యం సరిగా లేని వారు ఐదు శాతం దాటి ఉండరు. మిగిలిన వాళ్లంతా మానసిక ఆరోగ్యం బాగున్న వారే. మన చుట్టూ ఉండే మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళు,  చుట్టుపక్కల వారు, టీచర్లు, డాక్టర్లు, ఇలా ఎవరైనా కావొచ్చు. 

సంఘం అంటే భయం ఉన్నవాళ్లు, మానసిక ఆరోగ్యంగా సరిగా ఉన్న సాధారణ మనుషులు ఎందుకు ఇలా చేయగలుగుతున్నారు?

ఎందుకంటే,  ఈ విషయం గురించి ఎవరు వాళ్లను ప్రశ్నించరని,  పిల్లల మాటలను ఎవరూ పట్టించుకోరనే ధీమా. CSA లో కూడా సెక్స్ అనే పదం ఉంది కాబట్టి, సెక్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి  మాట్లాడటం టాబూ కాబట్టి, సొసైటీ సైలెంట్ గా ఉంటుందని దాడి చేసేవారికి తెలుసు. 

రేప్ జరిగినా, పిల్లలపై లైంగిక నేరాలు జరిగినా సంఘం బాధితులనే బ్లేమ్ చేస్తోందని, అలా నిందిస్తూ దాటి చేసినవారికి సపోర్ట్ చేస్తుందని కూడా తెలుసు. అందుకే అంత ఎక్కువ సంఖ్యలో లైంగిక నేరాలు జరుగుతూ ఉన్నాయి. 

పిల్లల రక్షణను పట్టించుకోని ఈ విష సంస్కృతిని అంతమొందించాలి.  తమతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, నా పేరెంట్స్ నాకు రక్షణగా ఉంటారని, నాకు సపోర్ట్ గా ఉంటారని భావించి,  మీ మీద నమ్మకంతో, మీ దగ్గరికి వచ్చి “ఆ అకుంల్ (లేదా బాబాయ్ లేదా తాతయ్య) ప్రవర్తన నాకు నచ్చలేదు. నేను వెళ్లను” అని మీతో చెప్పుకున్నప్పుడు, “తప్పు! అంకుల్ గురించి అలా అనకూడదు,  బాబాయ్ గురించి అలా అనకూడదు, తాతయ్య గురించి అలా మాట్లాడకూడదు. ఏదో ప్రేమతో చనువు తీసుకున్నాడే తప్పించి, తప్పుగా అర్థం చేసుకోకూడదు” అంటూ పిల్లల గొంతు నొక్కేసే ఇన్సెక్యూర్ పేరెంటింగ్ పూర్తిగా మారాలి. 

పెద్దల సోషల్ రిలేషన్స్ కంటే, పెద్దల పరువు ప్రతిష్ట కంటే, పెద్దవాళ్ళ మనోభావాల గాయపరచకుండా కాపాడటం కంటే, పిల్లల రక్షణ ముఖ్యం కావాలి. అప్పుడే పిల్లలపై లైంగిక నేరాలు తగ్గుతాయి. 

ఈ అంశం చర్చకు వచ్చినప్పుడల్లా శిక్షలు కఠినంగా ఉండాలని, అలా చేసిన వారిని వెంటనే ఉరితీసేయాలని కొందరు  ఆవేశ పడి పోతూ ఉంటారు. ఒక్కసారి ఆ రిపోర్ట్ను స్టడీ చేస్తే పేరెంట్స్ కి కంప్లైంట్ చేసింది 11 శాతం మాత్రమేనని తెలుస్తుంది. అంటే మిగిలిన పిల్లలు సొంత పేరెంట్స్ కే చెప్పుకోలేని స్థితి.  పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినవి మూడు శాతం కేసులు మాత్రమేనని తెలుస్తోంది. అంటే శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా, 97 శాతం కేసులలో పిల్లలు వేధింపులకు గురవుతూనే ఉంటారు. మారాల్సింది చట్టాలు కాదు. మన పెంపకం. 

ప్రస్తుతం ఉన్న చట్టాలు బలంగానే ఉన్నాయి. చాలా అడ్వాన్సుడ్ గా కూడా ఉన్నాయి. సమాజమే వెనుకబడిపోయింది. చట్టాలు ఎప్పుడు పనిచేస్తాయంటే, సమాజంలోని మెజారిటీ జనాలు చట్టాలను ఫాలో అవుతూ ఉంటే, ఏ అయిదు శాతం ప్రజలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటే, అప్పుడు వారిని శిక్షల ద్వారా కంట్రోల్ చేయవచ్చు.  అలా కాకుండా సమాజంలో 50 శాతం మంది చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటే, శిక్షల ద్వారా సమాజాన్ని కంట్రోల్ చేయలేం. అది అసంభవం. 

ఇప్పుడు జరగాల్సింది కొత్త చట్టాల తయారీ కాదు. ఉన్న ఉన్న చట్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం జరగాలి. సంఘం గురించి, పరువు గురించి ఆలోచిస్తూ, పిల్లల నోరు నొక్కేసే తల్లిదండ్రుల్లో  మార్పు తీసుకువచ్చేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రతి పాఠశాలలోనూ పేరెంట్స్ మీటింగ్ పెట్టి, ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుందని, నేరస్తులను కఠినంగా శిక్షిస్తుందని, లైంగిక నేరంలో మీ పిల్లలు బాధితులు అవ్వడం సిగ్గుపడాల్సిన విషయం కాదని, సిగ్గు పడాల్సింది కేవలం నేరస్తులు మాత్రమేనని చెప్పడానికి, ప్రభుత్వమే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. 

సంఘం మొత్తం లో ఏర్పడ్డ ఇటువంటి టాబూని బ్రేక్ చేయడం కోసం, ఏ ఊరి ప్రజల్లో పెద్దలు పరువు ఫీలవుతారో అదే ఊరిలో, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి, లైంగిక నేరాల గురించి మాట్లాడటం తప్పు కాదన్న విషయాన్ని బిగ్గరగా చెప్పాలి. ఎంత లౌడ్ గా మాట్లాడితే, ఎంత పబ్లిక్ గా మాట్లాడితే, ఎంత ఎక్కువ మందిని ఒకే చోట ఉంచి మాట్లాడితే,  ఈ టాబు అంత త్వరగా బ్రేక్ అవుతుంది. సంవత్సరంలో రెండు మూడు సార్లైనా ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలి. 

బాధిత పిల్లలకు సపోర్ట్ గా నిలబడటం ఎంత ముఖ్యమో, నేరస్తుడిని expose చేయడం, అతన్ని ప్రజల ముందు నిలబెట్టి చేసిన నేరాన్ని పబ్లిక్ గా చెప్పడం  కూడా అంతే అవసరం. అలా చేయడం వల్ల నేరాలు చేయడానికి మిగిలిన వారు భయపడతారు. 

పిల్లల మాటల్ని పేరెంట్స్ సీరియస్ గా తీసుకుంటారని, నేరం చేసినవారు ఎవరైనా సరే నలుగురిలో మాట్లాడటానికి పేరెంట్స్ వెనుకాడరని, సమాజం మొత్తం నేరప్రవృత్తిని వ్యతిరేకిస్తోందని అనుకున్నప్పుడు ఎవ్వరూ నేరం చేయాలి అనుకోరు. అటువంటి నిజమైన అభ్యుదయం వైపు మనమంతా అడుగులు వేయడానికి ప్రయత్నిద్దాం.

(‘పడాల ఛారిటబుల్ ట్రస్ట్’ సెప్టెంబర్ 26,27 తేదీలలో ‘ఆంధ్ర ప్రదేశ్ సొషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ’ హౌస్ టీచర్లకు, హెల్త్ సూపరవైజర్లకు  ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించింది. menstruation చుట్టూ ఉన్న అపోహల గురించీ, కౌమార (adolescence) దశలో స్టూడెంట్స్ ఎదుర్కొనే ఎమోషనల్ ఇష్యూస్ గురించీ, పిల్లలపై జరిగే లైంగిక దాడుల గురించీ ప్రశ్నోత్తరాలతో కూడిన వర్క్ షాప్ అది.  ఆ వర్క్ షాప్ లో Child sexual abuse(CSA) టాపిక్ కి రీసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన రచయిత టీచర్లతో చర్చించిన అంశాల ఆధారంగా రాసిన ఆర్టికల్ ఇది.)

రాంబాబు తోట

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.