ఎర్రి ఎంకన్న

మా ఊరి నుంచి కడపకు పోవాలంటే ముందు యర్రగుంట్లకు పొయ్ ఆన్నుంచి కడప బండి పట్టుకోవాల. నేను ఎగాసగా పడ్యాలకు ఊర్లో బస్సు దాటిపాయ. అట్లైందాన రోడ్డు కాడికి నర్సిపోవాల్సి వచ్చ. బస్సు నిలిపే పాటిమీద నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలంటే ఓ మైలు దాక నడకుంటాది. కట్టెల సంచిలో నాలుగైదు సేర్ల బియ్యం పోపిచ్చి ‘బాగ సదువుకో సిన్నోడా…’ అంటా నన్ను మాయమ్మ సాగనంప్య.

రోడ్డు కాడికి నర్సుకుంటా దావపట్టినా. మా హైస్కూలు కాడికొచ్చాలకు బడి ఇర్సిందాన పిల్లోల్లంతా గ్రౌండ్లో గలగలగల మంటా ఎగిరే తూనీగల మాదిరి కనపచ్చ. ‘అప్పుడే మేలు. ఇంట్లో బూదిని(బువ్వ), బడికి పొయ్ ఎగుల్లేచ్చా ఆడుకుంటాంటిమి, ఏ బాదరబంధీ ల్యాకుండా’ అని మనసులో అనుకుంటా మా స్కూలు తట్టు సూచ్చి. పాతబడిన మా పల్లెబడి గోడలు సల్లని తల్లి ఒడి మాదిరి కనపచ్చ నా కండ్లకు. కానీ పిల్లతనంలో ఆ బడి విలువ ఇప్పుడు తెల్సినంతగా తెలియక పాయ.

నేనప్పుడు కడపలో డిగ్రీ సదువుతాంటి. ఖర్చులకు లెక్క కొండపోదామని ఊరికొచ్చింటి. కానీ పరిస్థితి బాగల్యాక లెక్క సర్దుబాటు కాల్య. లెక్కతో శానా ఇబ్బందిగా ఉండాదని, వారం పది రోజుల్లో యాన్నో ఒకసాట లెక్క పురమాయిచ్చానని సెప్య మా నాయన. ఆఖరి అస్త్రంగా యర్రగుంట్లలో ఉండే మా సుట్టాల ఇంటికాడ ఒకతూరట్ల రాయేసి పొమ్మని సెప్య. నేను పోను నాయన అంటే నాకెట్లనో కట్ల నచ్చజెప్పి సేతిలో నూర్రూపాయలు ఖర్చుకనిపెట్టి పంపిచ్చ. ఇంగ నేను చేసేది ల్యాక ఆపొద్దు కడపకు తిరుగి పోతాంటి.

మా సుట్టాలను లెక్క ఎట్లడగాల, వాళ్లకు ఏమని సెప్పాల, ఒక్యాల ‘లెక్క ఉంది’ అంటే గనక మల్లా వాళ్లకు తిరిగి ఎప్పుడిచ్చామని సెప్పాల’ ఇట్లా తెగని ముడిపడని ఆలోచనల్తో నడుచ్చా కొటాలును దాటి చర్చికాడికి సేరుకుంటి. నడుచ్చనా అన్నె మాటే గానీ నా మనసంతా లెక్క సుట్టే గెర్రున బూచక్రం మాదిరి తిరుగుతాంది. ఇంటికి పొయ్ ఉత్తసేతులు ఊపుకుంటా కడపకు పోతే అప్పు తెచ్చిన కాడ ఏమని సెప్పుకోవాలని దిక్కు తెలియడం ల్యా. నిరాశ, నిస్సత్తువ, కోపం అన్నీ కలగలిపి మనసంతా  శానా భారంగా ఉండ్య.

కోనేట్లో రాయేసినట్లు అంతలోకే  నా ఎనకల్నుంచి ‘బడ…బడ…బడ…’ మంటా ఏదో శబ్దం ఇన్రాబట్య దూరం నుంచి. నేను అదేదో ట్రాక్టర్ ఉంటాదిలే అనుకుని , మల్లా నా లోకం లోకి నేను జారుకుంటి . ‘లెక్కెట్ల సెయ్యాల్రా దేవుడా’ అనుకుంటా అట్లనే నర్సబడ్తి.

రాను రాను ఆ శబ్దం ఇంగా ఎక్కువాయ. ‘బడ…బడ…బడ…’ మని సల్లుకోకుండా సెవుల్లో సమ్మెట పోటు మోగబట్య. అప్పటికే ఆ శబ్దం మామూలు శబ్దం కాదని, ఎవరో గనీ బండ్లో పెట్రోలు బదులు గబ్బు సమురు(కిరసనాయిల్) వేసినట్లుండారని ఒగరవ్వ అందాసు దొరిక్య. ఇంగ భరించల్యాక ఆ విచిత్ర వాహనమేదో, ఆ వాహనం నడిపే మహానుభావున్ని ఒగరవ్వ దర్శించుకుందామని రోంత నిలబడి ఎనిక్కి మల్లి సూచ్చి.

ఆ బండి ఇంగా కొటాలు దాటందాన అంత దూరం నా సూపు పారల్య. అట్లైందాన ఆ వచ్చే మనిసెవరన్నది పోల్చుకోల్యాక పోతి. కాకపోతే ఆ  వచ్చేది ట్రాక్టరైతే కాదని అది స్కూటరు మాత్రమేనని తేలిపాయ. దాన్ని నడిపే ఆ పాలెగాని మీద ఎక్కడ్లేని కోపం ముంచకచ్చ, ఆ కర్ణ కఠోర శబ్దాన్ని ఎట్లా భరిచ్చనాడోనని.

అట్లా నేను రోంత దూరం నర్సాలకు ఆ స్కూటరు(TVS) నా దరిదాపుకు రానే వచ్చ. లోపల నా కోపం పొయి మీద సంగటి ఎసరు ఉడికినట్లు కుతకుతమని ఉడకబట్య. అయినా ఎనిక్కి మాత్రం తిరిగి సూల్య. ఎవరైతే మనకెందుకులే, అదట్ల దాటి పోతానే సెవులు మూసిపెట్టుకుంటే సరిపోతాదని. ఐనా భరించల్యాక మల్లా ఎనిక్కి మల్లి సూచ్చి.

ఆ బండ్లో వచ్చే మనిషిని చూసి నా కండ్లు నమ్మల్యాక పాయ. ఈయన్న ఎప్పుడు బండి తీసుకున్యాడు, తీసుకుని ఎప్పుడు బండి నేర్సుకున్యాడబ్బా అని ఆశ్చర్యపోతి. ఇరవై నాలుగ్గంటలూ పనితప్ప మరో లోకం తెలియని మా పరంటీది సెట్టు కింద ఎంకన్న బండి తోలడం కలో నిజమో తేల్చుకోల్యాక పోతి. సూచ్చాం తట్టుకో యా మాత్రం పనిమంతుడో అని సేతిలో సంచిని కింద పెట్టి ఆన్నే నిలబడి కళ్ళార్పకుండా ఆయన్న తట్టే సూడబడ్తి

ఆయన్న నాకంటే ఓ మూడు నాలుగేండ్ల పెద్ద. వాళ్లమ్మకు ఒక్కడే కొడుకు. పదోతరగతి వరకు ఊర్లోనే సదివ్య. పది పెయిల్ అయితానే కూలి పనులకు తిరుక్కుండ్య. సన్నకారు కుటుంబం. ఉన్య రెండెకరాలలో ఏదో ఒక పైరు పెట్టుకోడం, మిగతా టయంలో యా పని దొరికితే ఆ పనికి పోయి పదిరూపాయలు సంపాయిచ్చుకుంటా బతుకెల్లదీయబట్య. మూతి మీద మీసాలొచ్చినా వాళ్లమ్మకు మాత్రం ఆయన్న ఇంగా సంటి పిల్లోని కిందే లెక్క. ఎప్పుడ్జూసినా ఎంకన్నా…ఎంకన్న…అంటా కలవరిచ్చేది ఆయమ్మ. ఆయన్నేం తక్కువ తిండ్ల్య. వాళ్లమ్మను ఇర్సిపెట్టకుండా ‘అమ్మా అమ్మా’ అని వాళ్ళమ్మ సుట్టూ తిరుగుతాండ్య, ఇంగా సిన్న పిల్లగాని లెక్క. అది జూసి మా బజార్న ఎంకన్నను బో అవ్లెయ సేచ్చాండ్య. అయ్యన్నీ ఆయన్నకు లెక్కల్య. ఆయన్నకు వాళ్లమ్మ, వాళ్ల నాయనకు మించిన లోకం ల్యాకపాయ. వాళ్ల ముందర ఆయన్నకు ఎన్ని ఎక్కిరింతలైనా దిగదుడుపే.

పనికి పోయి సంపాయియ్యడం, ఉన్నెదాంట్లో తెచ్చుకోని తినడం , ఒళ్లు దాచుకోకుండా పన్జేయడం, పది రూపాయలు తక్కువైనా ఏ పట్టింపు ల్యాకుండా పిల్చినోళ్లకు పనికి పోవడం, యా కల్ముషం, కుట్రలు ఎరగని ఆయన్న బండి తోలడం జూసి నాకు బో నగొచ్చ. ఇంగ ఆ పొద్దు వాన తప్పదనుకుంటి.

ఆయన్న అల్లంత దూరాన ఉండగానే నా కాడ ఆ బండినాపడానికి ఎనకల బ్రేకుపై రొడ్డ సెయ్యేసి అదిమిపట్టి, అదీ సాలక కాళ్లు రోడ్డుపై ఆనిచ్చి ఏసుకున్య అవాయి సెప్పులు రోడ్డుకు ‘బర్రు’న రాసుకుంటా వచ్చి నా పక్కన బండి నిలిప్య, సిక్కెగ నక్కుంటా.

అప్పుడాయన్న ముగం లేత అరిటాకు మాదిరి తళతళ మెర్సి పోతాంది. ఆ బండిపై కూకున్య ఆయన్నలో అప్పుడే పట్టాభిషేకం జేసిన యువరాజు ఠీవి తొనికిసలాడ్తాంది, కిరీటమొక్కటే తక్కువాయ. ఆ బండి నా దగ్గర అట్లా నిలబడి ‘బడ బడ బడ’మని మొత్తుకుంటాంటే అదేదో ఎల్లీకాప్టరే వచ్చి ఆడ వాల్నెట్లుంది. ఆయన్నకు అయ్యన్నీ ఇంత కూడా పట్టల్య, పుణ్యజీవి. అంతా నిశ్శబ్దంగా ఉన్నెట్లు శానా నిర్మలంగ ఉంది ఆయన్న మొగం.

‘అబ్బీ…ఎక్కు…’ అంటా నక్కుంటా తలతో సైగ జేస్య నా తట్టు జూచ్చా. నా పానం పైపైనే గాలిలో కల్సిపాయ. ‘వారి దేవుడా. ఈ శబ్దానికి, ఆయన్న బండి తోల్తాంటే నేను ఎనకాల కూచ్చోడమా’ అన్న ఆలోచనతో నా గుండె జల్లుమని అదట్లనే సర్రున కిందికి జారినట్లాయ. కానీ ఆయన్న మాత్రం బండ్లో ఒగరవ్వ ముందుకు జరిగి కూచ్చుండ్య నాకు తావిచ్చా. ‘ఓరయ్య దేవుడా నాకింగ తప్పించుకునే మార్గమే లేదా’ అనుకుంటా

రోడ్డుపై అటు ఇటు తేరిపార సూచ్చి బెదురు సూపుల్తో. కనుసూపు మేర ఏమీ వచ్చన్యట్లు కాన్రాల్య. సరే ఇంగ తప్పింది కాదని ఆ స్కూటర్ పై పదురుకుంటా ఎనకలెక్కి కూకుంటి.

‘న్నా ఒక్కరవ్వ మెల్లిగనే పోనీన్నా… తొక్కులాడకుండా’ అంటి.

ఆయన్న నా తట్టు జూసి ‘ పోనీమంటావ్ బ్బీ’ అన్య అప్పుడే యుద్ధంలో గెల్సొచ్చిన వీరుని మాదిరి.

నేను ఎనకల కూచ్చున్యానో లేదో ఆయన్న బండిని సర్రున రైజ్ చేస్య. ఊహు…బడ బడ బడ మంటా బండి శబ్దం రైజాయనే గానీ బండి మాత్రం రవ్వ కదల్య. దాంతో నాకొకరవ్వ ధైర్యం వచ్చ. దాని సన్న పానానికి ఇద్దరు మనుషులు తలకు మించిన భారమైతిమి. నాగ్గూడా కావల్సిందదేలే అని సందులో సందు మెల్లెగ బండి దిగి తప్పించుకోబోతి. కానీ నా ఎత్తులు ఆయన్న ముందర పారల్య. ‘కూచ్చో బ్బీ…ఏం పర్వాలేదులే. మంచి బండి లే’ అన్య. ఆయన్న రెండు కాళ్లను రోడ్డుకేసి కొమ్మదన్ని బండిని ఎనిక్కి ముందుకు రోంత  ఊంచి మల్లా రైజ్ జేస్య. ఈ తూరి మాత్రం గురి తప్పల్య. బండి ఒగరవ్వ కదిల్య. తక్య ఇంగ దాన్ని ఇర్సి పెట్టల్య. రైజ్ తగ్గియ్యడం మల్లా ఉన్నెంత రైజ్ పెంచడం. దాంతో బండి పికప్ అందుకోని పది పదైదు కిలోమీటర్ల స్పీడుతో రుయ్యున పరిగెత్తబట్య.

ఇంగ అంతే. ఆన్నుంచి ఆయన్న ఆనందానికి పట్టపగ్గాలు ల్యాకపాయ. దావలో ఎవ్రన్నా నన్ను ఆ బండ్లో సూచ్చే మానం బోతాదని నేను ఆయన్నను దాపు జేసుకుని మొగం కాన్రాకుండా కూచ్చుంటి. ఆయన్నకు మాత్రం అదేందో ఇమానంలో గద గాలిలో ఎగుర్తన్నెట్లు మహదానందంగా ఉండ్య. అట్లా మేము బండ్లో పోతండంగానే మెయిన్ రోడ్డు మీద పొద్దుటూరు బస్సొకటి దాటుకుని పాయ.

ఎట్టకేలకు మా వూరి మెయిన్ రోడ్డు సేర్తిమి. ఆయన్న రోడ్డు పక్క యాపమాను కింద బండి నిలిప్య. ఆ శబ్దం దెబ్బకు సెట్టు పైనుండే పిట్టలు దిక్కు తెలియక దిక్కుకొకటి ఎగిరిపాయ. నేను బండిపై నుంచి దిగి ‘గండం గడ్సింది రా దేవుడా’ అంటూ దండం పెట్టుకుంటి మనసులో.

అంతలోకే అటుపక్క సెట్టుకింద నుంచి ‘ఓ…ఎంకన్నా…’ అంటా ఓ పిలుపు ఇనపచ్చ. ‘బ్బీ నువ్వీన్నే ఉండు. మల్లొచ్చా’ అని అటుపక్క కదిలిపాయ. పల్లెల బస్సు కోసరం ఎదుర్జూసే పక్కూరాయప్పతో మాటల్లోకి దిగ్య ఆయన్న. ఆయప్పకు బండి సూపిచ్చా ఏంటేంటో ఇవరాలన్నీ ఇప్పి యవారాలు మొదలుపెట్య. ఇంగ నేను అదే అదను అనుకుని పొద్దుటూరు బస్సు కోసరం రోడ్డు దాటుకుని అటుపక్కకు పోయి నిలబడ్తి సైగ్గాకుండా.

పది నిమిషాలాయ, ఇరవై నిమిషాలాయ, అర్థగంట దాటిపాయ, కానీ బస్సు రాల్య. అటుపక్క పల్లెల బస్సు కూడా వచ్చ. ఎంకన్న అన్నతో మాట్లాడ్తాన్య మనిషి కూడా ఆ బస్సెక్కి పాయ. అప్పుడాయన్న ఏదో తటిక్కెన మతికొచ్చినోని మాదిరి సుట్టూ జూస్య. ఆయన్న సూపు నాపైన పడ్య. సరే ఎట్లైతే అట్లైతాది, నాల్రూపాయలు చార్జీ లెక్కన్నా మిగుల్తాది ఈ కష్ట కాలంలో అనుకుంటా తెగించి ఆయన్న బండికాడికి పోతి. ఆయన్న నన్ను జూసి, ‘ఏంది బ్బీ ఇంగా బస్సు రాల్య.’ అన్య. ‘రాలెన్నా కాలబడి’ అంటి విసుగ్గా. ‘మాటల్లో పడి మర్సే పోతినబ్బీ. సరే ఎక్కు బెరిగ్గెన పదాం. నిన్ను యర్రగుంట్ల లో ఇడుచ్చా’ అన్య.

బండి స్టార్టు సేస్య. ఆ రథంలో ఇద్దరం యర్రగుంట్లకు బయల్దేర్తిమి. ఆ బండి పది పదైదు కంటే స్పీడు పోడంల్యా. అసలు స్పీడు ఎంతనో సూచ్చామంటే రీడింగు పన్జేయమండ్ల్య. మా పక్కూరు బడి పిల్లోల్లు సైకెల్లో పోతా పోతా మా బండిని దాటుకుని, మా తిక్కే సూసుకుంటా పాయ. ఆ సూపు మమ్మల్ను ఎక్కిరిచ్చినట్లుండ్య.

ఆయన్నకయ్యేం పట్టల్య. అంతలోకే ఆయన్న ఉండి ‘అబ్బీ…బండెట్లుంది? ‘ అని అడిగ్య. నాకేం సెప్పాల్నో దిక్కు తెల్య. ఐనాగానీ ఆయన్న సంతోషాన్ని సెడగొట్టడం దేనికని ‘బాగుందిన్నా…’ అంటి.

‘కొత్తది బ్బీ. నిన్ననే తెచ్చింది’ అన్య. నిన్ననే కంపెనీ నుంచి తెచ్చిన సీలు బండి మాదిరి సెప్య.

‘యాడ కొన్యావు న్నా’ అని అడిగితి.

‘యర్రగుంట్లలోనే బ్బీ. బాగ తెల్సిన మనిసి. పన్నెండు వేలు సెప్పిండ్య. వారం కిందట బ్యారమాడ్తే నిన్న దిగొచ్చ. నేను పది వేల వరకు పెట్టచ్చని లెక్క సర్దుకుంటి. నిన్న వేరే వాళ్లతో పిలంపినాడు. అట్టజేసి ఇట్టజేసి ఆఖరికి ఎనిమిది వేలకు ఖరారు జేచ్చి’ అన్య గర్వంగా యుద్ధ వీరుని మాదిరి.

అసలా బండి బండున్నెట్లు లేదు. దానికి ఎవడో తలమాసినోడు దొరక్కపోతాడా అని ఎదుర్జూసి ఈయన్నకు అంటగట్నెట్లుంది వాడెవడో, అనుకుంటి లోలోపల.

అంతలోకే కోడూరు గుట్ట కాడ దిగుమారొచ్చ. ఆయన్న బండిని ఆప్ జేసి ‘పెట్రోలు ఆదా’ అన్జెప్య. నాకాయన్నను చూసి ఇంత అమాయక ప్రాణి ఈ భూమి పై ఇంగొకటి ఉంటుందా అనిపిచ్చ.

అట్లా యర్రగుంట్లకు పొయ్యాలకు ముక్కాలుగంట పట్య. ‘అబ్బీ నిన్యాడిర్సాల’ అని అడిగ్య. కడప రోడ్డులో పెట్రోలు బంకుకాడ రోంత పనుందని సెప్తి. ‘సరే పా బ్బీ నేను గూడా ఆన్నే బండిని మెకానిక్ కు ఇయ్యాల, సైలెన్సర్ పొయ్నట్లుంది’ అని సెప్య. ఇద్దరం కల్సి కడప రోడ్డులో పోతాంటే అందరూ మా తట్టే సూడబట్య. ఎట్టకేలకు బండిని మెకానిక్ షెడ్డుకు చేర్చ.

నేను మా బంధువులింటికాడికని సెప్పి ఎంకన్న అన్నకు పొయ్యొచ్చాన్నా అని చెప్పి ఆన్నుంచి బయల్దేర్తి.

ఆన్నుంచి నన్ను మల్లా లెక్క ముసురు కప్పుకుండ్య. లెక్కడుగుతే ఏమనుకుంటారో…ఏమనుకుంటారో అని దిగులు పట్టుకుండ్య. అయినా అడగక తప్పని పరిస్థితి. అట్లా మా సుట్టాలింటికి పొయ్,  పొయ్నంత సేపు కూడా ల్యాకుండా సేతులు కాల్చుకోని తిరుగు ముఖం పడ్తిని. ఈ ప్రపంచానికి లెక్క తప్ప మనుసులు పట్టరని అనుకుంటా లెక్కను, లెక్కున్నోళ్లను తిట్టుకుంటా. వచ్చా వచ్చా మెకానిక్ షాపు తిక్కు సూచ్చిని. ఎంకన్న అన్న కనిపిచ్చ. సరే మల్లా ఆయన్న తట్టు పోతిని, ఎటు పోవాల్నో దిక్కు తెలియక.

‘ ఏం బ్బీ అప్పుడే పనైపాయనా?’ అన్య.

నేను ఏం సెప్పాల్నో తెలియక ‘పొయ్న పని కుదర్ల్యన్నా’ అంటి. అప్పుడు నా మాటలు వనుకుతాండ్య. నా ముగంలో నెత్తర సుక్క ల్యాకుండా వాడిన కొయ్టాకు కట్ట మాదిరుండ్య. ఆయన్నకు నా మాటలు ఎట్లినపచ్చనో ఏమో గానీ ‘అట్ల టీ తాగొచ్చాం పా బ్బీ’ అని నన్ను పిల్చకపాయ.

టీ బొంకు కాడ టీ తాగుతా…’ఏమైనా లెక్క పనిమీద పొయ్నావా బ్బీ’ అన్య. టీ సప్పరిచ్చా.

నేనుండి ‘అవున్నా, లెక్కకే పోయింటి’ అంటి.

‘ఎంత గావాలబ్బి?’ అన్య.

‘ఐదువందలు న్నా’ అంటి.

ఆయన్న ఇంగేం మాట్లాల్య. నేను ఏమన్ల్య.

టీ తాగి గ్లాసు పక్కన పెట్టి ప్యాంటు జోబిలో సెయ్యి దూర్సి పది రూపాయల కట్ట గడ్డకు పెరిక్య. దాంట్లో నుంచి యాబై కాయితాల్ని టకటక ఎంచి ‘ఇదోబ్బీ…మల్లా లెక్క పెట్టుకో ఒకపారి’ అని నా సేతిలో లెక్క పెట్య.

నాకు ఒకపక్క ఆశ్చర్యం , ఇంగోపక్క సంబరమాయ ఆ నోట్లు జూసి. మల్లా మా నాయనకు తెలియకుండా ఆయన్న కాడ లెక్క తీసుకోవాలంటే రోంత భయం కూడా వేస్య. ‘నాయనతో నేను మాట్లాడుకుంటా లేబ్బీ, తీసుకో’ అన్య నా మనసు సదివినోని మాదిరి.

దాంతో లెక్క తీసుకుని జోబిలో పెట్టుకోని ఆన్నుంచి బస్టాండుకు దావపడ్తి.

నేనొచ్చాంటే ఆయన్న నా తట్టే సూచ్చా ‘బ్బీ బాగ సదువుకోబ్బీ’ అని, మెకానిక్ షాపు దగ్గరికి పాయ.

కడప బస్సులో ఎక్కి కిటికీ సీట్లో కూచ్చోని దావలో పెట్రోలు బంకుకాడ మెకానిక్ షాపు తిక్కు తొంగి సూచ్చి. ఊర్లో ‘ఎర్రి ఎంకన్న’ అని అవ్లేయ జేసే ఎంకన్నను సూడాలని నా మనసు బో తాపత్ర్యం పడ్య. ఆయన్న మెకానిక్ షాపు కాడ స్కూటర్ ను రైజ్ సేచ్చా కనపచ్చ. ఇంగ అప్పుడు యా ‘బడ బడ బడ’ శబ్దమూ ఇన్రాల్య. అట్లనే ఆయన్న తట్టే సూచ్చా ‘అసలు ఎర్రంటే లెక్కను కాదని మనసల్ను ప్రేమించే అమాయకత్వమేనేమో’ అనుకుంటి. అప్పుడు నా మనసు బలే నిమ్మలపడ్య.

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

14 comments

 • మంచి మనసున్నోడు ఎర్రి ఎంకన్న. చాలా బాగుంది.. ఆ అమాయకుడి యవ్వారం

 • అన్న…బలే ఉంది…😊💝థాంక్స్
  పోన్ జేస్తా ఇపుడే..

 • బ్బి సికాంత్ ఇలాంటి ఎర్రి నా కొడుకులు ఉరికి ఒక్కడన్నఉంటాడు బ్బి… ఊళ్ళో ఉండేవాళ్ళు అందరూ ఇలాంటోన్ని లోకం తెలియని ఎర్రినాకొడుకులు అనుకొంటారు కానీ..
  ఇలాంటి ఎర్రి ఎంకన్నలు మనసులు గెలిసిన మారాజులు బ్బి…

  బాగుంది బ్బి సికాంత్.. ❤️❤️🙏🙏💐

  • శాన బాగుండాదన్నా ఇలాంటి ఎర్రిఎంకన్నలు పల్లెలకు అందం అన్న.
   ఇలాంటోల్లే పదిమందిబాగు కోరతారు. చాల గొప్పగా వ్రాసారు అన్న. మన యాసలో..

   జై రాయలసీమ..

 • అన్న స్కూటర్ బండి కానించ్చి భలే నవ్వుకుంటి అన్న,

 • చాలా బాగుంది సికాంత్.. నేను 1996 ౼ 99 లో కడపలో Arts college లో degree చేసాను…నాకు కూడా ఇలానే ఉండే…hostel లో ఉండటమే కానీ అక్కడ భోజనం ఉండేది కాదు. మేమె weekly ఇంటికి వెళ్లి బియ్యాన్ని తెచ్చుకొని అన్నం చేసుకొని కూరలు బయట తెచ్చుకోవడం…ఉదయం estate road లో tiffen కు మధ్నాన్నాం రాత్రి కురులకు వారానికి 100 రూపాయలు ఇచ్చేది మా నాయన…. ఒక వవారం నాకు ఇలానే జరిగింది… మీరు చెప్పిన ఎర్రి ఎంకన్న లు ఉంటారు ప్రతి వూరిలో…

 • Awesome . The story in SEEMA dialect, specially in Kadapa slang is superb . Need more of this kind to keep our local words and language alive. We have lost most of our traditional language and speaking non local and improvised TELUGU,.
  Effort to keep our local dialects is really good. Let us preserve/ record them our next generation.
  Thank u Sreekanth for your wonderful effort . Gid bless u . Look forward for more from u .
  .

 • శ్రీకాంత్ గారు, సానా బాగుండాది అన్న. ఎదో ఇంగిలీషు మీడియం బళ్ళల్లో సదువుకోని అస్సలికి ఈ యాస మర్సిపోయున్నాంలే ..

  వాడిపోయిన కోయటాకు కట్ట మొహం దగ్గర నవ్వలేక సచిపోయిన అన్న. నీకు దండాలు ఎన్నో…

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.