కథ రెండే రెండు అక్షరాలు.ఎంత ఇంద్రజాలం చేస్తాయి.
పుట్టుక కథ
చావు కథ
మధ్యలో బతుకు కథ
బతుకే కథ
ఈ రెండు అక్షరాలు కనబడినా వినబడినా ఉత్సుకథ.
పిట్ట ఎగరడం కథ. గూడు కట్టడం కథ.
గుడ్లు పెట్టడం కథ. పాము మింగడం కథ.
నా మటుకు నాకు కథ చదవడం అంటే తీవ్రమైన సంతోషం. భయంకరమైన మోహం. ఐతే అన్ని కథలు సంతోష పెట్టకపోవచ్చు. నీ హృదయాన్ని ఎగరేయక పోవచ్చు. కొన్ని కథలు చదివాక తవ్వకం మొదలౌతుంది. వెతుకులాట ప్రారంభమౌతుంది. కొన్ని ఏడిపిస్తాయ్. కొన్ని వాస్తవాలను చెప్పి నువ్వెక్కడున్నావ్ అని ప్రశ్నిస్తాయ్. కొన్ని చక్కిలి గింతలు పెడుతున్నట్టు ఉన్నా బతుకు లో ఉన్న దుఃఖాన్ని ఆవిష్కరిస్తాయ్.
రాయలసీమ అంటే వర్షాభావం. కరువు కరువుకు తోడు ఫ్యాక్షన్ పౌరుషాలు. వీటి వెనుక ఛిద్రమైన బతుకులు చాలానే ఉన్నాయ్. మామూలుగానే ఆకలి చాలా ఇబ్బంది పెడుతుంది. మంట పెడుతుంది. పరువు పోయేలా చేస్తుంది. తీస్తుంది. “హృదయపుమెత్తని చోటుల గీరే జంతువు ఆకలి” అని బైరాగి ఎప్పుడో చెప్పారు. దావత్ కథలో అభిదా మొగుడికి ముక్కలు తక్కువ అయ్యాయని గొడ్డును బాదినట్టు కొట్టాడు కదా. తూర్పు గోదావరి జిల్లా లో కొత్తపేట లో ఓ పెళ్లి లో ఆనపకాయ ముక్కలు సరిగా వేయలేదని కొట్లాట జరిగిందని వార్తల్లో చెప్పగా విన్నాను.
అలాంటిది అసలే కరువుకాలం. ఏట కూర తిని ఎన్నాళ్ళో. ఇప్పుడు అవకాశం వచ్చింది.
మనుషులు ఎంత దిగ జారి పోతారో.
బండి నారాయణ స్వామి రాశాడు. కాదు చూపాడు. కళ్ళకు కట్టాడు. వ్యంగ్యంగా చెప్పినా, తర్వాత మనకు ఎక్కడో గుండె లాగుతుంది. చివుక్కుమంటుంది. ఆయన కథ ప్రారంభంలో రాసిన వాక్యాలు చదువుతూ ఉంటే అవి నిన్ను సర్రున లాక్కెళ్లి చివరి పేజీ లో కూర్చోబెడతాయ్
పైటాలపొద్దు
ముద్దు పొద్దు
ఎండ అగ్గికురుస్తోంది
గాలి తోలదు
ఆకు అల్లాడదు
ఉడుకు ఉడుకు ఉమ్మరిస్తోంది
ఇప్పటిదంకా ఒక మోడం లేదు
వాన సినుకు లేదు. యాడ జూసినా ఒక గెడ్డి పూస లేదు.
కరువు కరువు.
గెడ్డికి కరువు.
గింజలకు కరువు.
ఎండ ఎండ. బలిసిన ఎండ.
ఇలా మొదలు అవుతుంది కథ. రీళ్లు రీళ్లుగా తిరుగుతుంది.
“మనుషులకు పనులు లేవు. సంగట్లోకి నూకలు లేవు. పిల్లకాయలకు అంగీ ఉంటే చొక్కా లేదు. చొక్కా ఉంటే అంగీ లేదు. రెవికలు సంకల్లో సినిగినా, రొమ్ములు మీద సినిగినా ఆడోళ్ళకి సిగ్గులేదు. ఆకులు వక్కలకూ, గడ్డి మోపుకు మానం అమ్ముకునే ఊర్లో ఎవరికీ కడుపు నిండదు.”
అలాంటి పరిస్థితిలో ముసోలుడు సచ్చిపోయాడు. కోరక కోరక కడసారి కోరిక తీరకుండానే పోయాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వయస్సులో ఉన్నప్పుడు బాగా తిండి పుష్టి కలిగినోడు. పెళ్లి ఐన కొత్త లో గెలికిన సంగటి ముద్దలన్ని భార్యకు కూడా మిగల్చకుండా తిన్నోడు. మంచం ఎక్కిన కాడినుంచి కోరిక కాలుస్తుండే. చూసే పోయే వాళ్లకు సియ్య ముచ్చట్లు చెప్పేవాడు. సియ్య బువ్వ తినాలనే కోరిక తీరకుండానే వెళ్లి పోయాడు.
చావు రోజు ఏర్పాట్లకు ఎవరికి వాళ్ళు ఏమి పట్టనట్టు ఉండే కొడుకులు. ఊరొళ్లు మొగాన ఊసాక చావు ఖర్చు మూడు భాగాలు చేసుకుని, షావుకారు కి అప్పు పెట్టారు. పీనుగును సాగనంపారు.
ఊరోళ్ళు, బంధువులు మూసలోడి ఆత్మ శాంతికి పదకుండో రోజు కర్మకి మాంసం కూర విందు పెట్టాలని సతా యించారు. మూడు నూర్లు పెట్టి బక్క గొర్రెను కొన్నారు. కూర పొయ్యి మీదకు ఎక్కింది. మసాలా వాసనకు నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి. పిల్లొళ్ళు, పెద్దలు అంతా పొయ్య చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అసలే కరువుకాలం. మాంసం తిని ఆరునెలలు. అప్పుడెప్పుడో మారెమ్మ పండగకు తినడమే. ఇగ చూస్కో సామి రంగా వరి అన్నం తిని ఎన్నాళ్ళో,ఎముకలు కొరికి ఎన్నాళ్ళో. ఆకులో వేసింది వేసినట్టు మింగుతూ ఉన్నారు. నమలడం లేదు. దవడలు కదలకుండా తింటున్నారు. ఆ ముసలి గొర్రె మాంసాన్ని రబ్బరు నమిలినట్టు నమిలి గసపెడుతూ తింటున్నారు.
సెమట్లు కక్కుతున్నాయ్. తిని తిని మొలతాళ్లు బిర్రెక్కుతున్నాయ్.
ఎవరి పిల్లల్ని వారు దగ్గర కూర్చో బెట్టి తినిపించారు. ఇంక సాలు మొర్రో అని లేయబోతే నాలుగు గుద్దులు గుద్ది, కూర్చో బెట్టి నోట్లో కుక్కుతున్నారు. ఉద్దరగా దొరుకుతుంటే తినకుండా, దొబ్బులా వీళ్లకు, రాత్రికి ఇంట్లో పొయ్యి మీద ఎసరు ఎక్కించే ఖర్చు ఉండదని పెద్దోళ్ల బాధ.
సామి మంత్రాలు చదవడం మొదలెట్టాడు.
మా పెద్దాయన కూర తినాలని ఆశ తీరకనే పోయా. నువ్వు మంత్రాలు బాగా చదివి ఆత్మ శాంతి కలిగేలా చేయాలని ఓ బంధువు సామికి చెప్పాడు. సామి బంగారు పెట్టమనె, గోవులు ఇమ్మన్నాడు, వస్త్రాలు అంటున్నాడు, ఇంకా ఏమెమో అడుగుతుండే. అన్ని ఉత్తుతి దానం చేసినట్టు అక్షింతలు ఏసుకున్నారు. దచ్చిన మాత్రం నిజం దచ్చిన పెట్టమన్నాడు. పెద్ద కొడుకు పది రూపాయలు పెట్టాడు. సామి ఎగా దిగా చూసాడు. ఆత్మ మధ్యలోనే ఉందన్నాడు. ఇంకో పది సమర్పించుకున్నాడు. అందరి మీద నీళ్లు చల్లాడు.అందరూ ఆత్రంగా చల్లించుకున్నారు.
ఆ తర్వాత మూడు రోజులకు పున్నెం దుత్త దించారు
మూడో దినం ముసల్ది ఏడవడం మొదలెట్టింది.
నట్టింట్లో ఏడుపు ఎందుకు, ముసలోడు ఏమైనా తిరిగి వస్తాడా, పిలుపు వచ్చింది, పోయాడు అని కొడుకులు
ముసలి దాన్ని కూతలేశారు. ముసలి దానికి ముసలోడు జ్ఞాపకం వచ్చి ఏడుస్తుంది అని అనుకున్నారు.
కానీ రచయిత కరువు, ఆకలి ఎంత పతనం చేస్తుందో చివరి వాక్యాల్లో విప్పుతాడు.
“లే సన్న నా కొడకా మూడు నూర్లు బెట్టి గొర్రిని కోస్తిరి. ఎవరెవరికో పుట్టిన నా కొడుకులో వచ్చి గొంతు వరకు సించుకొని పాయిరి. నా ఇస్తారాకులో మాత్రము నాలుగు తునకలు కూడా ఏయక పోతిరి కదరా మీ కడుపులు దొక్కా ముండలు మొయ్యా! మీరు తునకలు తిని నా మొగానికి నీళ్లు కలిపిన పులుసు పోస్తిరి. మీ యమ్మ కడుపుకాలా” అని ముసల్ది శాపనార్థాలు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఇక్కడ మనకు ఒక్కసారిగా గబుక్కుమంటుంది. చాలా సేపు తెరిపి పడలేము.
ఈ కథ రాయలసీమ మాండలికం తో, వ్యంగ్యంగా సాగుతుంది. ఆ పలుకుబడి మనల్ని చదివిస్తుంది.
బలసిన ఎండ బహుశా ఎండను ప్రపంచ సాహిత్యంలో ఇంత బలం గా చెప్పిఉండరు.
“సావు ఎవరికైనా వస్తుంది. ఈ కష్ట కాలంలో బతికే దానికంటే, సచ్చిపోయేవాళ్లే పున్నాత్ములు” లాంటి మాటలు కెలుకుతుంటాయ్. ఐతే ఈ కథను రచయిత మూతి బిగించుకుని చెప్పిఉండవచ్చు. కంట్లో నుండి నీళ్ళు కార్చుకుంటూ, ముక్కు సీదుకుంటు చెప్పవచ్చు. కానీ ఎక్కదు. నరాల్లో నడవదు. బిగి ఉండదు. ఎలా చెప్పాలో బండి నారాయణ స్వామి కి తెలుసు. ఆ జీవితాన్ని చూసిన వారు, చూస్తున్న వారు, మాటలకు మాటలు నేర్పడం తెలిసిన వారు.
స్వామి ఈ పాత్రలను ఎక్కడినుండి తీసుకువచ్చాడు. తన చుట్టూ ఉన్నవే. నిజానికి ఈ కథలో ముసలి దాని ప్రస్తావన ఓ చోట మాత్రమే కనబడుతుంది. అసలు మన దృష్టి ఆ ముసలి దాని మీద వెళ్లదు. ఐనా రచయిత కథ భారాన్ని ముసలిదాని మీద వేశాడు. ఆమె మోసింది. కథను నిలబెట్టింది. స్వామి పాత్రను తన పరిసరాలనుండి తెచ్చుకున్నాడు. ఓ కథ రాస్తున్నప్పుడు పాత్రలు పక్కింట్లో ఉండొచ్చు. ఎదురుగా గోడ మీద కూర్చొని కాళ్ళూపుతూ పిలుస్తూ ఉండొచ్చు. రచయిత పక్కనే తిరుగుతూ ఉండొచ్చు. బస్సులో ఓ కునికేస్తూ ఉండొచ్చు. కానీ రచయత ఓ కన్నేసి ఉండాలి. పాత్రని అమాంతంగా లాక్కెళ్లి, కథలో కలుపుకోవాలి. ఆ కళ స్వామి కి తెలుసు.
కథలో వాతావరణం నిజాయితీ గా ఉండాలి. పాఠకుడు ఆ వాతావరణం లో కూర్చుని కథ చూస్తున్నట్టే ఉండాలి. వాతావరణం బలహీన పడితే కథ కూలే ప్రమాదం ఉంది. సావుకూడు కథలో ఆ వాతావరణం ఉంది. అందుకే పాఠకుడు పక్కకి జరగడు.
స్వామి వాడిన అనంత భాష, పలుకు బళ్ళు ఈ కథకు మరో బలం.
నేను అనంతపురంలో ఓ రెండేళ్లు ఉన్నాను. ఆ ప్రాంతం చాలా ఇష్టం.ఈ కథను కొన్ని వేల మంది పిల్లలకు చెప్పాను. ఇది 1989 అక్టోబర్ 18 ఆంధ్రభూమి లో వచ్చిన కథ.
ఈ కథ చెప్తుంటే మా కాలేజ్ పిల్లలు
ఓ సారి అనంతపురం వెళదాం అన్నారు.ఆ మాటలు విందాం అన్నారు .
ఇది అంత నారాయణ స్వాము చేసిన పని.
వాళ్ళను అందునా బాగా కడుపు నిండిన గోదావరి జిల్లా వాళ్ళను.అంతకంటే ఎం కావాలి రచయితకు.
ఇది “సావుకూడు “కథ
స్వామి చూపిన సీమ వ్యధ.
బాగా చెప్పావు.. గోపాల్ ..కథ ను ప్రేమించి రాశావు.
tq, మిత్రమా
మిత్రమా.. కథలో నిజాయితీ ఉంది.. పాత్రలు మన చుట్టూ తిరుగుతున్నాయ్.. అనంత కరువు ప్రతిబింబిస్తుంది.. కడుపు నిండిన ఎవరికైనా కడుపుమాడిన వాడిని ఓదార్చాలని అనిపిస్తుంది..
tq sir
Katha kallaki kattinatlu chepparu,kaadhu chupincharu..sir,bagundhi..
Katha kallaki kattinatlu chepparu,kaadhu chupincharu..sir bagundhi
చాలా గొప్ప కథ చాలా గొప్ప విశ్లేషణ
బండి నారాయణస్వామి గారి ‘సావుకూడు’ కథను మాచే చదివించి … మమ్ములను ఏడిపించి … ఏడుపులోనే సియ్య బువ్వను తినిపించిన మిత్రుడు సుంకర గోపాలయ్య గారికి …
కనీసకర్తవ్య ప్రేరేపిత…
కృతజ్ఞతా హృదయ సమర్పిత
చిరు అభినందనాక్షరమాలికలు
Chala manchi visleshana
Goal chala bagunnayi simple ga pillalaku kuda ardhamyyela vundi nee కవిత
అద్భుతమైన కథకు అద్భుతమైన విశ్లేషణ
Super sir
గొప్ప కథ
చాలా బాగుంది ఈ కథ…
Chala bavundhi sr…Baga visleshana chesaru
అనుభూతి కి లోనయ్యా మాష్టారు…. కొన్ని కథలు కెలికేస్తయ్…..ఈలాటి కథనం తో
Super sir
👌
చాలా బావుంది … heartful review
రాయలసీమ కరువు చిత్రం నరాయణ స్వామి గారి సావుకూడు కథ.””ఒక్కాకుకూ, గడ్డిమోపుకూ మానం అమ్ముకునే ఊళ్ళో ఎవ్వరికీ కడుపు నిండదు””..అన్న మాట అతిసయోక్తేమో గానీ, సత్యదూరం అనడానికి వీల్లేని కరువు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు సత్యజిత్ రే గారి సినిమా “”ఆశని సంకేత్””గుర్తుకొస్తుంది. గ్రేట్ బెంగాల్ ఫామిన్ పై తీసిన సినిమా అది.అందులో ఒకడు పిల్లలకాకలి ఒక గిద్దెడు బియ్యం అడుగుతాడు.””కావాలంటే నా భార్యతో కాసేపు పడుకో..కానీ బియ్యం ఇవ్వలేను”” అంటాడు బియ్యం ఉన్నోడు.. మంచి కథను మీ విశ్లేషణతో చదివించినందుకు ధన్యవాదాలు🙏🙏
Nicely discribed about famine in anathapuram district. Well written sir. Lots of love