రభస దేవుడు

ప్రాణభయం వల్ల నాకు కలిగిన తాత్కాలిక దైవభక్తిని నాలో కమ్యూనిస్టు కూడా ఆమోదించినట్టున్నాడు. ప్రమాదం నుంచి బయటపడగానే మళ్ళీ నాస్తికుడిగా మారిపో అంటూ నీరసంగా అదేశించాడు. నాలో ఉన్న కమ్యూనిస్టు ఏపాటి? జాతీయ నాయకులే, తమ మద్దతుతో నడిచే బూర్జువా ప్రభుత్వాలను, భరిస్తూ,  నామమాత్రంగా హెచ్చరిస్తూ, అతివాదం, మితవాదం అని కబుర్లు చెబుతూ అవకాశవాదం పాటిస్తూ, గతితార్కికవాదాన్ని గతిలేని తార్కికవాదం గా మలచుకున్నారు.

ఎమ్మే సైకాలజీ చేసి అక్కడా ఇక్కడా ఏవో చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకొనే నాకు మునిసిపల్ కార్పోరేషన్ లో ప్రజాసంబంధాల అధికారి ఉద్యోగం దొరికింది. మా మునిసిపాలిటీ జనాభా రెండులక్షలకు అటుఇటుగా ఉంటుంది కనుక కమీషనరు గారు గ్రూప్ వన్ ఆఫీసరు.  

ఈ నేపధ్యంలో ఒకరోజు మా ఆఫిసుకి వెటరినరీ డాక్టరు గారు వచ్చారు. ఆయన కమీషనరుగారి చాంబర్లోకి వెళ్ళిన ఐదు నిమిషాలో నాకూ కబురు వచ్చింది. కమీషనరుగారు నన్ను చూడగానే చెప్పారు “వీధికుక్కలకు రేబిస్ వేక్సీనేషన్ చెయ్యడానికి టీకాలు వచ్చాయి. మన ఆఫీసు తరపున ఈ కార్యక్రమానికి కావలసిన మద్దతు మీరు చూడండి. ఎవరైనా మీతో సహకరించకపోతే నాకు చెప్పండి.” 

ఇద్దరం బయటకు వచ్చాకా, పారిశుధ్య సిబ్బందితో కూడా కలిసి మాట్లాడాలి అనిపించి, సాయంత్రం ఇద్దరం కలిసి వాళ్ళతో ఒకగంట కూర్చుందికి నిర్ణయించుకున్నాం. 

సాయంత్రం, మునిసిపల్ వార్డుల వారీగా విభజన ఉన్న మేప్ పట్టుకున్నాం. ఈ టౌను, మునిసిపాలిటీ కాకముందూ మేజరు పంచాయితీగా ఉన్నప్పటి నుండీ పనిచేస్తున్న సీనియర్ మేస్త్రి సాయంతో, వీధి కుక్కల సంఖ్యని బట్టి వార్డులను మేపింగ్ చేసుకున్నాం. అతడు చెప్పిన సారాంశం ఇదీ.

టౌనులో అతి పురాతనమైన రామకోవెల దగ్గర ఉన్న రథం సెంటరులో మూడు వార్డుల సరిహద్దు ఉంది. ఏడాదికి శ్రీరామనవమి ఒకరోజు నడిచే రథం కింద ప్రతీ రాత్రీ పదిహేనుకి తగ్గకుండా కుక్కలు పడుక్కుంటాయి. రథం కింద చోటు దొరకనివి అక్కడ చీలిపోయే నాలుగు వీధుల్లోనూ తిరుగుతూ ఉంటాయి. సత్రంలో నిత్యాన్నధానం, ప్రసాదాల మిగుళ్ళూ, రధం సెంటరు నుండి ప్రారంభమయ్యే బజారువీధిలో హోటళ్ళ వ్యర్దాలూ, ఈ కుక్కలకు జీవనాధారం. 

రెండోది చర్చి సెంటరు. అక్కడ కూడా మూడు వార్డులు కలుస్తాయి. ఆ కుటుంబాలలో అత్యంత పేదవారు కూడా వారానికి కనీసం రెండు రోజులు ఏదో ఒక మాంసం తింటారు. అంచేత అక్కడ చెత్తకుండీలు కూడా కుక్కలికి అనుకూలమే. 

మూడోది, మసీదు వెనుక ఉన్న మాంసదుకాణాల సముదాయం. మాంసం మార్కెట్టుకి రెండో వైపు అన్నీ పొలాలూ, మద్యలో సన్నటి రోడ్డు, రెండు పర్లాంగులు దూరంలో మునిసిపాలిటీ కబేళా. అక్కడ కోసిన మేకలూ, గొర్రెలనే మాంసదుకాణాల్లో వేళ్ళాడగట్టి అమ్ముతారు. కోళ్ళు మాత్రం షాపుల్లోనే అక్కడకక్కడే కోసి అమ్ముతారు. ఇవికాక, ఉదయం రెండు గంటలూ, ఆదివారం ఐతే ఒక పూటంతా నడిచే చేపల దుకాణాలు. అందుకని ఈ దుకాణ సముదాయం నుండి  వచ్చే వ్యర్దాలూ, దూరంగా ఉన్న కబేళా అక్కడి కుక్కలకు తరగని నిధి.

టౌను మొత్తంలో ముప్పై వార్డులు ఉన్నా, వీధి కుక్కల జనాభాలో నూటికి ఎనబైకి పైగా ఈ మూడు సెంటర్లనీ ఆనుకొని దొరికేస్తుందిట. ఈ మూడు సెంటర్లలో పని పూర్తయ్యేసరికి మిగిలిన కుక్కలిని ఎలా కవరు చెయ్యాలో, మనకే అర్ధం అవుతుందిట. మాకు అభయం ఇస్తున్న సీనియర్ మేస్త్రీ, పండిపోయిన కోరమీసాలూ, కాకీ షర్టూ, నిక్కరూ, అరవైకి దగ్గర పడుతున్న వయసు, ఐనా, ఇప్పటి తరం పాతికేళ్ళవాడిని కూడా ఎడంచేత్తో విసిరెయ్యగలిగే దారుడ్యం. అతణ్ణి పరిశీలించిన నాకు సత్యహరిశ్చంద్ర నాటకంలో వీరబాహుడి పాత్రకి మేకప్ వెయ్యకుండా తీసేసుకోవచ్చు అనిపించింది. టౌను అంతా అతడికి కొట్టినపిండిలా ఉంది. 

నాకెప్పుడో ట్రైనింగులో చెప్పిన విషయం గుర్తొచ్చింది. ‘క్లాసు ఫోరు ఉద్యోగులికి తగిన గౌరవం ఇస్తే, చెయ్యాల్సిన  పనికి రెట్టింపు చేసేస్తారు. ఒకవేళ మనం చిన్నచూపు చూసినట్టు వాళ్ళు నమ్మితే, మనలిని వాళ్ళే క్లాసు ఫైవ్ కింద జమకట్టి మొండికేసేస్తారు. ఇందుకు మినహాయింపు ఎవరయ్యా అంటే తాగుబోతులూ, బద్దకస్తులూ, రాజకీయ అండదండలతో ఈ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే కానీ, రెక్కల కష్టం నమ్ముకునే శ్రమజీవులు మాత్రం, ఇలానే ఉంటారు.‘ వీరబాహుడు ఖచ్చితంగా శ్రమజీవే, దాదాపు నలబై ఏళ్ళ సీనియారిటీ అతడికి ఆత్మవిశ్వాసాన్నే తప్ప అహంకారం ఇచ్చినట్టులేదు.

ఇద్దరం హమ్మయ్య అనుకొని, ప్లాను మొత్తం కమీషనరుగారికి చూపెట్టేశాకా మళ్ళీ, నాసీటులోకి వచ్చి, టీలు తాగాకా, రేబిస్ గురించి నాకున్న సందేహాలు అడిగాను. డాక్టరు గారు వివరంగా చెప్పారు.

రేబిస్ ని పిచ్చి కుక్క వ్యాధి అంటారు. రబస అనే సంస్కృతపదానికీ, రేబిస్ అనే ఇంగ్లీషు పదానికీ మూలపదం బహుశః ఇండో ఆర్యన్ భాషలో ఉండి ఉండవచ్చుట. రేబిస్ బారిన పడ్డ కుక్క, దాని మానసిక స్పృహ కోల్పోయి, ఆఖరుకి యజమానినీ గుర్తించలేదు. యజమానితో సహా కనపడ్డ ప్రతీజీవినీ కరిచేస్తూ, లాలాజలంలో ఉన్న వైరస్ ని వ్యాపింపజేస్తూ ఉంటుంది. జబ్బు లేత దశలో పిచ్చి లక్షణాలు బయట పడకుండా, ఆరోగ్యంగా కనిపించినా, లాలాజలంలో వైరస్ ఉండొచ్చు. పిచ్చికుక్కలకన్నా అలాంటి కుక్కలే ఎక్కువ ప్రమాదం. 

వీధికుక్కల్లో సరిహద్దు తగాదాలు ఎక్కువ. అదీకాక అంతవరకూ ఒకదాన్ని ఒకటి ప్రేమగా నాకేసుకున్నవే, వాటిముందు పడ్డ ఎంగిలి విస్తరాకుకోసం కరిచేసుకుంటాయి. అన్ని కుక్కలకీ తగినంత తిండి ఉన్నా దెబ్బలాడేసుకొని కరిచేసుకోవటం ఈ జాతి లక్షణం. అందువల్ల ప్రతీ వీధికుక్కకీ, వారానికి ఒకసారైనా ఇంకోకుక్క పంటిగాటు దాదాపు తప్పనిసరి. వీటన్నింటికీ తోడు, ఆడకుక్కలు సంతానోత్పత్తికి సిద్దమయ్యే కాలంలో ప్రతి మొగకుక్కకీ ఇతరకుక్కల పంటిగాట్లు తప్పనిసరి. ఇవన్నీ వింటున్న నాలో సైకాలజిస్టు, ఇందులో మనిషి ప్రవర్తనతో ఉన్న పోలికలూ, తేడాలూ గమనించబోయినా, నా పరధ్యానాన్ని గమనించిన డాక్టరు, కొన్ని క్షణాలు చెప్పటం ఆపటంతో మళ్ళీ కుక్కల్లో పడ్డాను.

ఈ పోట్లాటల వల్ల టౌనులో ఒక కుక్కకి రేబిస్ వస్తే అన్ని వార్డులకీ వ్యాపించెయ్యగలదు. ఈ జబ్బుకి కుక్కల్లో గాని, మనుషుల్లో గాని చికిత్స లేదు. అందుకే కుక్కకి వేక్సీన్ వేయించాలి. అప్పుడు ఆకుక్క కరిచినా, గాయం అవుతుంది తప్ప రేబిస్ రాదు. మనుషులు కూడా కుక్క పంటిగాటు పడగానే రేబిస్ వేక్సీన్ వేయించుకోవాలి. 

రేబిస్ లక్షణాలు బయటపడని పెంపుడు కుక్కలు లేత దశలో, యజమానికి ఐన గాయాన్ని ప్రేమగా నాకటం వల్ల యజమానికి రేబిస్ సోకి చచ్చిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సాధారణంగా లాలాజలంలో వైరస్ ప్రవేశించిన పదిహేను రోజుల్లో అది పిచ్చిపోతుంది. కానీ అరుదైన సందర్భాల్లో, లాలాజలంలో రేబిస్ ఉండీ కూడా, కుక్కలు నెలలతరబడి ఆరోగ్యంగా కనపడుతూ ఉండొచ్చు. 

ఆఫీసునుండి ఇంటికొచ్చేదారిలో అన్నికుక్కలూ రేబిస్ కుక్కల్లాగే కనిపించాయి. భయం వేసింది. అజ్ఞానం ఇచ్చిన భరోసా, జ్ఞానం ఇవ్వదుకదా!  

ఆ రాత్రి ఇంటికి వచ్చానే గాని మనుషుల సైకాలజీ చదవటం, రేబిస్ కుక్కల మనస్తత్వం ఎలాఉంటుందా అని అలోచించసాగాను. భోజనం చేస్తున్నప్పుడు ఏమి వడ్డీంచేది అన్న మా ఆవిడతో, వేక్సీన్ అని కూడా అనేసరికి, వళ్ళుమండి వడ్డించడం ఆపేసింది కూడా. 

పడుక్కుంటే ఎంతకీ నిద్రపట్టదే. హటాత్తుగా కళ్ళుతెరచి చూస్తే మసక చీకట్లో ఉన్నాను. కళ్ళు చికిలించి చూస్తే మా ఇంటి వరండాలో ఉన్నాను. ‘ఇక్కడకెలా వచ్చాను?’ అనుకుంటూ కాలింగ్ బెల్ కొట్టబోతే అందదే. మా ఆవిణ్ణి కేకెయ్యబోతే నా కేక నాకే ‘భౌ భౌ’ అని వినిపించింది. చూసుకుంటే నారీరం మొత్తం కుక్క శరీరం ఐపోయింది. గుండె గుభేల్మంది. ఇదేమిటి. కుక్కల ఆలోచనలు అర్ధం అవాలనుకున్నాను కానీ, నేను కుక్కగా మారాలనుకోలేదే. ఐనా మనిషిని కుక్కగా మార్చే శక్తి ఉన్న మాయలపకీరు ఎవరూ? కొంపదీసి దేముడా? అబ్బే. యూనివర్సిటీలో వామపక్ష భావజాలం వల్ల దేముణ్ణి ధిక్కరించానే. ఏదో మాఆవిడ కోసం గుడికి వెళుతున్నాను కానీ నాకు దేముడి మీద నమ్మకం లేదే. ఆస్తికుల మీద మాత్రమే మహిమలు చూపించాల్సిన దేముడికి నన్ను ఇలా మార్చే అధికారం ఎవరిచ్చారు? అసలు దేముడున్నాడా? దేముడు కాకపోతే ఇలా మార్చే శక్తి ఇంకెవరికి ఉంటుంది. ఐనా కుక్కగా మారిపొయినా, నా కమ్యూనిస్టు భావజాలం వదులుకోలేను కనుక నేను దేముణ్ణి నమ్మకూడదు. కళ్ళ ఎదురుగా కనిపించే అనేక అధారాల్ని కాదని మరీ మన సిద్ధాంతాలపట్ల నిబద్దత ఉండాలని కదా, నా భావజాలం చెబుతోంది?  

మా ఇంటి బయట ‘భౌ భౌ’ లు చాలా వినిపించాయి. దాంతో నా ఆలోచనలకు బ్రేకు పడింది. వీధిలో చెదురుమదురుగా పడుక్కున్న కుక్కలన్నీ గుంపుగా ఏర్పడి భౌభౌ శబ్దాలతో మా ఇంటివైపు వస్తున్నాయి. 

జాగ్రత్తగా వింటే ఆ శబ్దాల్లోనే “కొత్తకుక్క, కొత్తకుక్క” అనేఅర్ధం వినిపించింది. అంటే నాకు కుక్కల భాష కూడా అర్ధం ఐపోతోందా? నేను మా ఆవిడని పిలిచేటప్పటి భౌ భౌ లు విని నన్ను కొత్త కుక్కగా గుర్తించి మా ఇంటివైపు వస్తున్నాయి అన్నమాట. అర్జంటుగా మల్లెపొదలో దూరిపోయి నిశ్శబ్దం ఐపోయాను. అంతలో మా వీధి గూర్ఖా వచ్చి ఒకసారి ఈల వేసి, కుక్కలిని అదిలించాడు. మా ఇంటి ముందు నుండీ చెదరగొట్టబడి దూరంగా వెళ్ళిపోతున్న కుక్కలు, నెమ్మదిగా భౌభౌలు కొనాగించాయి. “ఈ ఇంటిమీద ఓ కన్ను వేసి ఉంచుదాం. ఎక్కడికి పోతుంది?” అనుకుంటూ వెళ్ళిపోయాయి. 

మల్లెపొదకింద నిశ్శబ్దంగా కూర్చున్న నాకు, స్కూలు రోజుల్లో తెలుగు మాస్టారు చెప్పిన ఏదో పాఠంలో వాక్యాలు గుర్తొచ్చాయి. ‘దేవుడు పెట్టే ప్రతి కష్టానికీ ఒక పరమార్ధం ఉంటుంది.’ కొంపదీసి దేవుడు నన్ను కుక్కలతో నేరుగా సంభాషించి రేబిస్ గురించి తెలుసుకోమన్నాడా? విషయం తెలుసుకోగానే మళ్ళీ మనిషిగా మారుస్తాడా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళేరని మా ఆవిడ అడిగితే, ఏమి చెప్పాలి? ఒకవేళ నిజం చెప్పినా నమ్ముతుందా? నాస్తికుడు, దేవుడి మహిమ చెప్పడం, ఆస్తికురాలు నమ్మకపోవటం, తలుచుకుంటే కొత్తకొత్తగా ఉంది. ఐనా, నేను కుక్కలతో సంభాషించాలంటే అవి నన్ను ఈ ఊరి కుక్కగా గుర్తించాలి కదా? రాత్రంతా అవి నన్ను తరుముతూ ఉంటే ఇంకేమి సంభాషించగలను? 

ఇదేమిటీ నేను దేముణ్ణి నమ్మేస్తున్నాను? మధ్యేమార్గంగా ఓ పని చేస్తే సరిపోతుంది. దేముణ్ణి నమ్మకుండానే, రేబిస్ కుక్కల ఆలోచనలు తెలుసుకుంటాను. ఈ పని పూర్తయ్యాకా నేను ప్రార్ధించకపోయినా తిరిగి మనిషిగా  మారితే సరే. మారకపోతే అప్పుడు ప్రార్ధిద్దాం. లేకపోతే చారిత్రక తప్పిదం జరిగి నేను శాశ్విత కుక్కగా మిగిలిపోవచ్చు. 

తెగించి, గట్టిగా తలవిదిల్చేసరికి టపటపా శబ్దం. నా చెవులేనా తలకి టపటపా కొట్టుకున్నాయి. అలవాటు లేకపోవటంతో చెవులూ, చెంపలూ కూడా నొప్పెట్టాయి. ఈసారి ఏమి చెయ్యాలన్నా నాది కుక్కశరీరం అని గుర్తుతెచ్చుకొని మరీ చెయ్యాలి. ఒడుపుగా గేట్లోంచి దూరి, కరెంటు స్తంభానికి కాలు ఎత్తి, ఒకటే పరుగు మొదలెట్టేను. చిత్రం. నన్ను ఏకుక్కా తరమలేదు. శివుడాజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని విన్నాను. ఇప్పుడు నన్ను కుక్కలు తరమకపోవడానికీ ఆ ఆజ్ఞే కారణమా? ఏమైనా, పరుగు పెట్టే బాధ నుండీ, కరిపించుకోవాలేమోనన్న భయం నుండీ బయటపడ్డాను. 

రథం సెంటరు దగ్గర కుక్కల గుంపు సమీపించాను. గుంపంతా ఒకసారి లేచి గుర్రుమనేసరికి రథం వెనుకనున్న సత్రం ప్రహారీ గోడమీదికి ఎగిరాను. తరుముతున్న  కుక్కలు ఎగరలేకపోయాయి. ఓహో, నాకు సగటు కుక్కకన్నా ఎక్కువ శక్తి ఉందన్నమాట. 

అంతలో, గోడ కిందకి చేరిన కుక్కలగుంపు, “జై రబసదేవుడా, జై రబసదేవుడా” అని అరవసాగాయి. అరుస్తున్నప్పుడు వాటి నోట్లోంచి వచ్చిన చొంగ చూస్తే అందులో నాకు రేబిస్ వైరస్ వాసన తెలిసిపోయింది. అంటే ఇవి మనుషుల దృష్టిలో ఇంకా పిచ్చికుక్కలు కావు. ఆరోగ్యంగా కనపడుతున్న రేబిస్ కుక్కలు. 

నువ్వు కూడా “జై రబసదేవుడా అని అరువ్,” ఆగుంపులో అతిపెద్దకుక్క ఆజ్ఞాపిస్తున్నట్టు అంది. 

“నేనెందుకు అరవాలి” అన్నాను. నామీద ఈ కుక్కలు, అందునా పిచ్చి కుక్కలు తమ భావజాలాన్ని రుద్దజాలవు కదా.

“ఈ వీధిలో ఉండాలంటే జై రబసదేవుడా అని అరవాలి. లేకపోతే కరిచి చంపుతాం.” ఇంకో కుక్క అంది. నాలో సగం ఎత్తు లేదు. వెనుక ఉన్న పిచ్చి ఇచ్చిన ధైర్యం దానిది. 

“అయ్యో, రబస అంటే దేవుడు కాదు. వైరస్. జబ్బు. పిచ్చి”. అన్నాను, చైతన్యపరచే ఉద్దేశ్యంతో. 

“దేముడిమీద నాకున్న నమ్మకాన్ని జబ్బు అంటవా. నిన్ను కరిచి చంపాల్సిందే.” అంటూ నేను నిలుచున్న గోడమీదికి ఎగరడానికి ప్రయత్నాలు మొదలెట్టాయి. 

ఏ కుక్కా గోడకి సగం ఎత్తుకి మించి ఎగరలేకపోతోంది. కొంచెం బలహీనంగా, వెనకాల నిలుచొని ఉన్న మిగిలిన కుక్కలన్నీ “జై రబసదేముడా, జై రబసదేముడా” అని అరుస్తూ, గోడమీదికి ఎగరాలనుకొనే కుక్కలిని ఉత్తేజపరుస్తున్నాయి. 

ఈ హడావుడికి సత్రం వాచ్‌మేన్ నిద్ర లేచి, కర్రపట్టుకొని వచ్చి, అదిలించేసరికి కుక్కలన్నీ రథం కిందికి చేరిపోయాయి. ఓహో. ఏడాదికొక్కసారి దేముణ్ణి ఊరేగించే రథం, మిగతా ఏడాదంతా, వీటిని ఎండా, వానా, చలీ నుంచే కాక, వాటిని కోపగించే మనుషుల నుండి కూడా రక్షిస్తోందన్నమాట.

బ్రతుకు జీవుడా అని సత్రం గోడమీంచి గెంతి రామాలయం ముందునుంచి వెళుతూ, “రామయ్యా, సమయానికి నీ వాచ్‌మేన్ ని పంపి ఈపిచ్చికుక్కల బారినుండి రక్షించావయ్యా” అని మనస్సులో నమస్కరించి బయలుదేరాను. రాముడికి నమస్కరించినందుకు నాలో కమ్యూనిస్టు నన్ను కోపగించినా, భావజాలం కన్నా క్షేమం ముఖ్యం అని కమ్యూనిస్టుకి సర్దిచెప్పాను. 

మతాన్నే జబ్బు అని నేను నమ్ముతూ ఉంటే, ఈ కుక్కలు రేబిస్ వైరస్ ని రబసదేముడు అని నమ్మటం ఏమిటి అని ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తూ ఉండగా కమ్మని వాసన ముక్కుపుటాలని తాకింది. మసీదు ఆవరణలో ఇఫ్తార్ విందు జరుగుతోంది. రంజాన్ మాసం అని అప్పుడు గుర్తొచ్చింది. మునిసిపల్ ప్రజాసంబంధ అధికారిగా ఈ రోడ్డుమించే కబేళాకి వెళ్ళేవాణ్ణి. మొదట్లో కబేళావాళ్ళు నన్ను విసుక్కున్నా, నేనూ వెటరినరీ డాక్టరూ కలిసి చేసిన పనులవల్ల కబేళాలోనూ, మాంసదుకాణాల పరిసరాల్లోనూ దుర్వాసన తగ్గటంతో విసుగు స్తానంలో గౌరవం పెరిగింది. 

విందులో కొంతమందిని గుర్తుపట్టేను. చికెన్ షాపు షరీఫూ, కబేళాలో గొర్రె స్వయంగా కోసుకొని, షాపులో మటన్ అమ్ముకొనే మస్తానూ, హలాల్ సమయంలో ఖురాన్ వాక్యాలు చదివే ముల్లా గారూ అందరూ కనిపించారు. మస్తాను మొన్న రాత్రి కమ్మని పాయసం ఇంటికి తెచ్చి ఇచ్చాడు కూడా. పాయసం కమ్మగా ఉన్నా, మాంసం వండిన పాత్రలో వండేరేమోనని మా ఆవిడ తినడానికి జంకుతూ ఉంటే, అబ్బే అలా వండరు అని అబద్దం చెప్పి మరీ తనచేత పాయసం తినిపించేను. మామూలుగా ఐతే, ఇప్పుడు వాళ్ళు నన్ను ఖచ్చితంగా పిలిచి ఇఫ్తార్ విందులో కూర్చోబెట్టేవారే. ఈకుక్క శరీరానికి అంత అదృష్టం లేదు. మసీదు ముందు నిలబడి, తనివితీరా వాసనలు పీలుస్తూ ఉంటే నామీదికి దూసుకొస్తున్న ‘భౌ భౌ’ అరుపులు వినిపించాయి. తరుముకొస్తున్న కుక్కల గుంపుని తప్పించుకొని, మసీదు వెనుక మాంసదుకాణాల ప్రహారీ ఎక్కేశాను. అప్పుడు తీరిగ్గా అరుపులను అర్ధం చేసుకోవటం మొదలెట్టేను. 

“రభసదేవుడి శతృవు, రబసదేవుడి శతృవు” అని అరుస్తున్నాయి ఆ కుక్కలు. 

“నేనెందుకు రబసదేవుడి శతృవుని?” అని అడిగాను.

“నీ లాలాజలంలో రబసదేవుడి వాసన లేదు. నువ్వు మాచేత కరిపించుకొని రబసదేవుణ్ణి నమ్మితేనే నిన్ను బతకనిస్తాం.” అన్నాయి ముక్తకంఠంతో. 

“ఈ వాసన లేని ప్రతీ కుక్కనీ కరుస్తారా? ఇదేనా మీపని?” 

“నీతో వాదించే ఓపిక మాకులేదు. మర్యాదగా కిందికి దిగి కరిపించుకో. లేకపోతే ఏదోలా గోడ ఎక్కి బలవంతంగా కరిచి చంపేస్తాం.”

“నేను చచ్చేలోపల మీలో కనీసం రెండు కుక్కలిని చంపెయ్యగలను.” బెదిరిస్తూ అన్నాను.

“అది మాకు ఇంకా మంచిది. రబసదేవుడి శతృవులతో జరిగే పోరాటంలో చచ్చిపొయే కుక్కకీ కుక్కల స్వర్గంలో రబసదేవుడు డజను ఆడకుక్కలిని బహుమతిగా ఇస్తాడు.” అలా చెప్పిన కుక్క ఇంకా ఆరునెలల వయసు కూడా ఉండదు. మనుషుల్లో పన్నెండేళ్ళ మొగపిల్లడి లాంటి పిల్లకుక్క. ఆడకుక్కని ఏమి చేసుకోవాలో తెలియని వయసులో డజను ఆడకుక్కలకోసం చావడానికి సిద్దపడుతోంది. ఇదేం పిచ్చి? ఒకసారి శరీరంలో ప్రవేశించాకా రేబిస్ వైరస్ కుక్కలకు ఆ స్తాయి పిచ్చి ఎక్కించగలదా?

అంతలో మటన్ షాపు మస్తాను, మసీదు ఆవరణలో చెత్తబుట్ట తెచ్చి చెత్తకుండీలో వేశాడు. ఆ చెత్త నిండా తాజా ఎముకలూ, పేగులు లాంటి మనిషి తినలేని మాంస ఖండాలు. కుక్కల గుంపంతా పొలోమంటూ చెత్తకుండీలో గెంతి, అరుచుకుంటూ, ఒకదాన్నొకటి కరుచుకుంటూ ఎముకలూ, పేగులూ తినసాగాయి. మస్తానుని ఆ సమయంలో సాక్షాత్తూ అల్లా పంపి నన్ను రక్షించాడు అనిపించింది. ఆ క్షణంలో అల్లాకు మనసులో తెలుగులోనే కృతజ్ఞతాపూర్వక ప్రార్ధన చేసేశాను. 

ప్రాణభయం వల్ల నాకు కలిగిన తాత్కాలిక దైవభక్తిని నాలో కమ్యూనిస్టు కూడా ఆమోదించినట్టున్నాడు. ప్రమాదం నుంచి బయటపడగానే మళ్ళీ నాస్తికుడిగా మారిపో అంటూ నీరసంగా అదేశించాడు. నాలో ఉన్న కమ్యూనిస్టు ఏపాటి? జాతీయ నాయకులే, తమ మద్దతుతో నడిచే బూర్జువా ప్రభుత్వాలను, భరిస్తూ,  నామమాత్రంగా హెచ్చరిస్తూ, అతివాదం, మితవాదం అని కబుర్లు చెబుతూ అవకాశవాదం పాటిస్తూ, గతితార్కికవాదాన్ని గతిలేని తార్కికవాదం గా మలచుకున్నారు.

మా మునిసిపల్ పెద్ద మేస్త్రీ చెప్పిన ఆ మూడో సెంటరు కూడా చూసేస్తే పూర్తి నిర్ణయానికి రావచ్చు అనుకుంటూ నడుస్తూ ఉండగా చర్చిలో హడావుడి కనిపించింది. మా ఆఫీసులో టౌనుప్లానింగు ఇంజనీరు జోసెఫ్ గారి అబ్బాయి పుట్టినరోజు. ఆర్దరాత్రి పన్నెండు గంటలకు కేకు కోతా, అంతకు ముందు ఆశీర్వాద ప్రార్ధనా కలిపి పెట్టుకున్నట్టు అక్కడ ఫ్లెక్సీబేనరులో ఉంది. అబ్బాయి ఇంజనీరింగు స్టూడెంటు కావటంతో ఫ్రెండ్స్ దండిగా వచ్చారు. ఖురాన్ టోపీలతో ముగ్గురు కుర్రాళ్ళు కనిపించారు. వాళ్ళు బహుశః ఇఫ్తార్ విందు నుండి నేరుగా బర్త్‌డేకేకు పార్టీకి వచ్చేసినట్టున్నారు. అతిథుల్లో బొట్టు పెట్టుకున్న ఫేమిలీలూ ఉన్నారు. అక్కడ ఉన్న పాస్టర్లకి వీరు క్రైస్తవేతరులలాగా కాక అబ్బాయి స్నేహితుల్లాగే కనపడుతున్నారు. ఈ ఫ్రెండ్సుకి కూడా అక్కడ జరిగే పుట్టినరోజు ఆశీర్వాద ప్రార్ధన తమ మతవిశ్వాసాలకి బిన్నమైనది అన్న స్పృహ ఉన్నట్లు లేదు. చాలా ముచ్చటేసింది.

నా సంతోషాన్ని పంచుకొందికి కొన్ని కుక్కలు వచ్చినట్టున్నాయి. అవి ఉల్లాసంగా తోక ఊపుతూ, నా కాలిని చూడసాగాయి. నేను కిందికి చూస్తే ఏముంది. రక్తం చిమ్ముతున్న గాయం. ఇంతసేపూ తెలియలేదు. రథం సెంటరులో తగిలిందో, మసీదుసెంటరులో తగిలిందో కూడా అర్ధం కాలేదు. గోడ అంచో, మేకో, గీసుకున్నట్టుంది. ఆ గాయాన్ని నాకు నేను నాకుకోబోతూ ఉండగా “మేము నాకుతాం” అంటూ దగ్గరకు వచ్చాయి. వాటి మూతుల దగ్గర రేబిస్ వైరస్ వాసన తగిలేసరికి తుళ్ళిపడి చర్చి బయట ట్రాన్స్‌ఫార్మర్ కోసం కట్టిన కాంక్రీటు దిమ్మ ఎక్కేసాను.

“ఎందుకుభయపడతావు. మాచేత నాకించుకో. నీకు నొప్పి తగ్గుతుంది.” అన్నాయి. నేను వాటికి దూరంగా పారిపోవటం చూసి ఏమాత్రం నొచ్చుకున్నట్టు లేవు. 

“మీ నోట్లో రేబిస్ వైరస్ ఉంది. మీరు జబ్బుపడ్డ కుక్కలు. మీరు నాకితే నాకూ పిచ్చికుక్క జబ్బు వచ్చేస్తుంది.” మొహమాటం లేకుండా చెప్పేసాను.

“అయ్యో. అది వైరస్సూ కాదు. జబ్బూ కాదు. రభసదేవుడి పట్ల మాకున్న నమ్మకం. మేము ప్రేమగా నాకుతూ నీలో రభసదేముడిపట్ల నమ్మకాన్ని కలిస్తాం. గాయం అనేది ఒక మార్గం మాత్రమే. రభసదేముడి నమ్మకం కలిగించటమే మా అసలు లక్ష్యం. ఆ మాటకొస్తే రభసదేవుడిని నమ్మకపోవటమే ఒక జబ్బు. దాన్నే మేము నయం చేస్తాం” 

“సరే. జబ్బుకాదు. మీది జబ్బు కాదు. ఐనా సరే నేను రభసదేముడిని నమ్మదలుచుకోలేదు. నాకు జబ్బు ఉన్నా నా మానాన నన్ను ఈ జబ్బుతో ఉండనివ్వండి. నన్ను నాకొద్దు.” 

“అలా ఎలా కుదురుతుంది. ఏ కుక్కైతే రబసదేవుణ్ణి నమ్మదో అది మంటల్లో కాలిపోతున్నట్టు. దానిని నాకటం ద్వారా మంటల్లోంచి లాగవలసిన బాధ్యత మామీద ఉంది. ఒకసారి నాకనిస్తే ఆ తర్వాత నీక్కూడా మాలాగే రబసదేవుడిని నమ్మని కుక్కని నాకెయ్యాలనిపిస్తుంది.” 

సాయంత్రం డాక్టరు చెప్పినది గురొచ్చింది. అంతవరకూ పిచ్చికుక్కలకు దూరంగా పరుగెత్తే మంచి కుక్క కూడా, ఒకసారి వైరస సోకగానే మిగిలిన కుక్కలికి ఇది అంటించెయ్యాలని చూస్తుంది.

“నేను ఏ మంటల్లోనీ లేను. నన్ను నాకే ప్రయత్నంచేస్తే కరిచి చంపేస్తాను.” బెదిరించక తప్పలేదు.

“నీకు రబసదేముడి మీద నమ్మకం కలిగించేప్రయత్నంలో చచ్చిపోయే ప్రతీకుక్కనీ రభసదేవుడు హత్తుకుంటాడు.”

“మీరెలాగో రబసదేముణ్ణి నమ్ముతున్నారుకదా, ఎలాగో రభసదేముడు మిమ్మలిని తన దగ్గరకు చేర్చుకుంటాడు. నేను కరిచి చంపేస్తానంటున్నా ఎగబడి మరీ నాకెయ్యడం ఎందుకు?”

“చచ్చిపోయిన తరువాత రభసదేవుడు ప్రతీ కుక్కనీ లెక్క అడుగుతాడు. మా జీవితంలో మాకు ఎదురైన కుక్కల్లో రబసదేవుడిమీద నమ్మకం లేని కుక్కలు కనపడ్డప్పుడు అందులో ఎన్నింటిని నాకేమో లెక్కచెప్పాలి.”

మూడు చోట్ల నాకు తగిలిన పిచ్చికుక్కల ఆలోచనలూ కలబోసుకుంటే జ్ఞానోదయం అయింది.  అన్నీ పిచ్చికుక్కలే ఐనా, వాటిని అవి పిచ్చి కుక్కలుగా కాక రబసదేముడి ఆదేశాన్ని నిర్వహిస్తున్న కుక్కలుగా  భావిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన కుక్కలన్నీ వీటి కళ్ళకి ద్రోహులుగానో, చంపదగిన కుక్కల్లాగానో, జబ్బు కుక్కలుగానో, మంటల్లో ఉన్న కుక్కల్లాగానో కనపడి, వాటిని కరుస్తూనో, నాకుతూనో తమలో చేర్చేసుకోవాలనుకుంటున్నాయి? 

సరిగ్గా, అప్పుడే చర్చిలోంచి ‘ఆమెన్’ అని వినిపించింది. వెనక్కాళ్ళమీద నిలబడి, కష్టపడి బేలన్సు చేసుకొని, ముందుకాళ్ళు గాల్లోకి లేపి జీసస్ కి కూడా కృతజ్ఞతలు తెలిపేసుకున్నాను. మతం మత్తుమందు అని, నా మనసుని హెచ్చరించవలసిన కమ్యూనిస్టు ఎప్పుడో  నిద్రపోయాడు.

అప్పుడు కర్తవ్యం గుర్తొచ్చింది. ఏ దేవుడీపేరూ తల్చుకోకుండా, ఆకాశం చూస్తూ, మళ్ళీ నన్ను మనిషిగా మార్చమని ప్రార్ధిస్తూ “భ్భ….వ్వ్…. .వ్వ్… .వ్వ్… .వ్వ్… .వ్వ్…” అని కూతపెట్టేను.

వీపు మీద తగిలింది మృదువైన చెయ్యేగానీ, చెళ్ళుమని తగిలింది. నేను ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మమీద కదా నిలబడ్డాను. ఏ మనిషికీ అందనే. అనుకుంటూఉండగానే, నా ముందుకాళ్ళ పంజా ఉండాల్సినచోట అరచేతులు తగిలాయి. నా మనిషిశరీరం నాకు వచ్చేసింది. వీపు చుర్రుమంటున్నా, మళ్ళీ మనిషినయ్యానన్న ఆనందంతో “మనిషినైపోయాను” అని అరిచాను. 

ఎవరో భుజం పట్టుకొని కుదిపారు. చూస్తే ఒక్కసారిగా అంతా కాంతిమయం. “ఈ భౌభౌ కలవరింతలేంటి. వీధి కుక్కల డ్యూటీ కాదు గానీ, తింటున్నప్పుడూ, నిద్దట్లోనూ కూడా అవేనా కలవరింతలు?” మా ఆవిడ కసిరింది.

ఈ కల గురించి మా కమీషనరుగారికి చెబితే ఖచ్చితంగా, నాక్కూడా ఆ వెటరినరీ డాక్టరుచేత రేబిస్ వేక్సీన్ వేయించేసేవారు. నన్ను కదలకుండా పట్టుకొనే బాధ్యత వీరబాహుడీకి అప్పజెబితే. అమ్మో.  

 

డాక్టర్ మూలా రవికుమార్

మూలా రవికుమార్ పశువైద్య పట్టభద్రుడు. పశుపోషణలో పీజీ, గ్రామీణాభివృద్ధిలో పీహెచ్ డీ.
పశువైద్య విశ్వ విద్యాలయంలో శాస్త్రవేత్త. పద్దెనిమిదేళ్ళగా కథా రచన. 2012 లో చింతలవలస కథలు సంకలనం విడుదల. కథాంశాలు: ఉత్తరాంధ్రా గ్రామీణం. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి. సంస్థలలో ఉద్యోగుల మనస్తత్వాలు.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.