బయట వెన్నెల హోరు
లోన చీకటి దీపం;
బద్దలైన నీ తిమిర కిరణాలు
ఒంటరి నిర్ణిద్ర గది గోడలను ఢీకొని
నేల రాలుతుంటవి.
నీవు కట్టుకున్న అగ్గిపెట్టెలో
నీవు
నిన్ను నీవు బంధించుకున్న
బంగరు రెక్కవు.
ఎంత గింజుకున్నా
రేయి చల్లారదు
ఈ తుఫాను రాత్రి నిద్రించదు,
ఏ చలువ శశిరేఖా లోనికి రాదు
నీ ఉక్కపోత బయటికి పోదు.
ఎన్ని వెన్నెల ఉదయాలను దాటి వచ్చావో
ఈ చీకటి మధ్యాహ్నాల ఏకాంతంలోకి !
ఎన్ని వెన్నెల దారులను పేనుకున్నావో
ఈ చీకటింటి సాలెగూడు అల్లుకోడానికి !
వ్యాకుల దుమారాలు రొదచేస్తున్న
ఈ తిమిర సైకత తిన్నెలలో
నీవు
నీ పద ముద్రలను కోల్పోయిన
నిరుపేద బికారివి,
నీ ఒయాసిస్సులను వెతుక్కుంటున్న
ఒంటరి బిడారివి.
Add comment