నియో లిబరిజానికి
ప్రపంచవ్యాప్త నిరసన

ఏడాది క్రితం ఫ్రాన్స్ లో “ఎల్లో వెస్ట్’’ ల రూపంలో పెల్లుబికిన నిరసన జ్వాలలు ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించాయి.  ప్రభుత్వాలు అనుసరిస్తున్న నియో లిబరల్ విధానాలకు వ్యతిరేకంగా చిలీ, లెబనాన్, ఇరాక్, హైతీ… అనేక దేశాల్లో నిరసన ప్రదర్శనలు. స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం కోసం కాటాలొన్ జనం, తమ హక్కులపై చైనా పెత్తనం  సహించబోమని హాంగ్ కాంగ్ యువత రోడ్లకెక్కారు. అనేక దేశాల్లో  క్లైమేట్ ఛేంజ్ పై లక్షలాది యువత నిరసన ర్యాలీలు.

నియో లిబరల్ విధానాలకు వ్యతిరేకంగా పెల్లుబికే నిరసనోద్యమాలకు ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ లెబనాన్. లెబనాన్ ప్రధాన మంత్రి సాదల్ హరిరి ప్రజల నిరసనలకు తలొగ్గి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. 

లెబనాన్ లో  హరిరి ప్రభుత్వం   వాట్స్ అప్ మెసెజీలపై  పన్నులు విధించడంతో ప్రజల్లో నిరసన రాజుకుంది. దానికి మరి చాల సమస్యలు కలిసి  13 రోజులుగా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. 

నియో లిబరల్ విధానాలతో దేశంలో సంపన్నులు మరింత సంపద పోగేసుకుంటుంటే, పేదలు అత్యవసర సౌకర్యాల కోసం డబ్బు చెల్లించాల్సి వస్తోంది. పాలకులు, ప్రభుత్వాధికారులు బిలియనీర్లవుతుంటే ప్రజలు బికారులవుతున్నారు. ప్రభుత్వాలు అప్పులతోనే నడుస్తున్నాయి. ప్రభుత్వాల అప్పులు, వడ్డీలు చెల్లించాల్సింది ప్రజలే.  పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ రవాణా, నీరు… వంటి కనీస సౌకర్యాల పనిని ప్రభుత్వాలు వదులుకోవడం వల్ల, ప్రయివేట్ రంగం అన్నిటినీ కైవసం చేసుకొని వ్యాపారాత్మకం చేయడం వల్ల పాలకులకు, ప్రజలకు మధ్య ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయి. 

ఈ మార్పు ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ‘నియో లిబరలిజం’ ప్రపంచమంతటా ఆర్థిక సంస్కరణల పేర సాగిస్తున్న దురాగతమిది.

ఫ్రాన్స్ లో ఆయిల్ ధరలు పెరగడంతో ప్రజల్లో రాజుకున్న నిరసన జ్వాలలు ఏడాదిగా  కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణమెరికా దేశమైన చిలీ లో సబ్ వే ల  రేట్లు పెరగడంతో హైస్కూల్ విద్యార్థుల నిరసన… దేశంలో 30 ఏళ్ల సామాజిక సంక్షోభం పరిపక్వమయినట్లు… కార్చిచ్చుగా మారింది. బడి పిల్లలు సబ్ వే లకు పెంచిన 30 పెసోలు ( 4 సెంట్లు) చెల్లించకుండా, తమ ‘కుటుంబం కోసం’, తమ ‘అమ్మ కోసం’  అంటూ దాటిపోవడమే కాకుండా పెద్దలను కూడా తమతో పాటు తీసికెళ్లారు. సబ్ వే లకు కాపలాగా వున్న సెక్యూరీటీ విద్యార్థులను అరెస్ట్ చేస్తే లేదా ఆ సబ్ వే లను మూసేస్తే కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణాలు చేసి ఇళ్లకు చేరారు. పిల్లల వెంట పెద్దలు రోడ్ల మీదకు వచ్చారు.  టీచర్లు, హెల్త్ వర్కర్లు, పోర్టు వర్కర్లు, కన్ స్ట్రక్షన్ వర్కర్లు, మైనింగ్ వర్కర్లు… అన్ని సేవారంగాల శ్రామికులు… సాధారణ ప్రజలు… పట్టణాలు, పల్లెల వాళ్ళు… ఏకమయ్యారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెర ఒక్కసారిగా వీధుల్లోకి మిలిటరీని దించాడు ‘’యుద్ధం జరుగుతోంది’’ అంటూ. కర్ఫ్య్వూ విధించడమే గాకా ఎమర్జెన్సీ ప్రకటించాడు. మిలిటరీ కాల్పుల్లో 19 మంది మరణించగా 1,000 మంది గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. అయినా; దేశ రాజధాని శాంటియాగో లోనే గాక,    అన్ని ముఖ్య నగరాల్లో  వీధులు జన సముద్రాల్లా వెల్లువెత్తుతున్నాయి. 

ఇన్నేళ్లుగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న  విక్టర్ హారా పాట ప్రతి ఇంట్లోంచి ప్రతిధ్వనిస్తోంది. ప్రతి వీధీ అయన పాడిన చివరి పాటను ప్రతిధ్వనిస్తున్నది. వీధుల్లో ఎత్తిన చేతుల్లో గిటార్లు జెండాల్లా ఎగురుతున్నాయి. గతంలో పినోఛట్ నియంత స్టేడియంలో సాగించిన కిరాతకాన్ని వీధులు గుర్తు చేసుకుంటున్నాయి. పినో ఛట్ నియంత్రుత్వపు గాయాలను మాన్పడం కోసం 30 ఏళ్ళ క్రితం నియో లిబరలిస్టు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఈ సంస్కరణల్లో భాగంగా మానవహక్కులను పునరుద్ధరణ జరుగుతుందని, నియంత్రుత్వం నుంచి లిబరల్ డెమోక్రసీ కి మార్పు ప్రారంభమయిందని చెప్పుకున్నారు. 

చిలీ దక్షిణ అమెరికాలోనే సంపన్న దేశమని చెప్పుకుంటారు. ఇప్పుడున్న అధ్యక్షుడు పినెర కూడా బిలియనీరే. సంపన్నులకు, ప్రజలకు మధ్య ఆర్థిక అసమానతలు భారీగా పెరిగాయి. విద్యా, వైద్యం ప్రయివేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కనీస అవసరాల సేవలే కాకుండా  పెన్షన్ స్కీం లు కూడా ప్రయివేటు పరం కావడంతో ప్రజలు వినియోగదారులుగా మాత్రమే మిగిలారు. రాజకీయ నాయకుల అవినీతి, అరాచకాలు పెరగడంతో ప్రజలు విసిగిపోయారు. కార్లు లోన్ కు తెచ్చుకొని అప్పులు చెల్లించకపోవడం అంటే అర్థం వుంది. కానీ రోజు వారి తినడానికి అప్పులు చేసే పరిస్థితి, ఆ అప్పులు చెల్లించుకోలేని  పేద పరిస్థితిని అసంఖ్యాక ప్రజలు ఎదుర్కొంటున్నారు. 

బతుకు భద్రత లేని పరిస్థితిలో, ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. సామాజిక సంక్షోభం ఏ స్థాయిలో వుందో ప్రభుత్వాధికారంలో వున్నవారికి తెలిసినట్టుంది. ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టిన 5 గంటల్లోనే కర్ఫ్య్వూ విధించి, రోడ్ల మీద మిలిటరీని దించే పనులు చేపట్టాడు అధ్యక్షుడు పినెర. పాత గాయాలు తిరిగి రేపినట్టయింది. ప్రజలు కోపోద్రిక్తులై రాత్రి పగలు అనే తేడా లేకుండా , కర్ఫ్య్వూ లెక్క చేయకుండా రోడ్లను ముంచెత్తారు. రెండు వారాలుగా అహింసాయుతంగా పాటలు పాడుతూ, శాసనోలంఘన చర్యల ద్వారా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.  

పర్యావరణ మార్పులు: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా బడిపిల్లలు, యువత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు విచ్చల విడిగా పరిశ్రమలు, కంపెనీలు సాగించిన విధానాలతో వాతావరణంలో కార్బన ఉద్గారాల స్థాయి గణనీయంగా పెరిగి వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ఇప్పటికే అనేక దక్షిణాది దేశాల్లో తాగునీటి సమస్య ఏర్పడిందనీ, మరో పక్క తీరప్రాంతాలో సముద్రమట్టాలు పెరిగి వరదలు ముంచెత్తుతున్నాయని, ఒకవైపు దావానాలు రాజుకుని అడవులు, ఇళ్లు కాలిపోతుంటే, మరో వైపు తుపాన్లతో వరదలతో ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. వాతావరణ సంక్షోభం, సామాజిక సంక్షోభాలకు వ్యతిరేకంగా బడిపిల్లలు, ప్రజలు వీధులకెక్కుతున్నారు.

నియో లిబరలిజం దీనికే మరోపేరు గ్లోబలైజేషన్. దీని నాయక సంస్థలు ఐ ఎం ఎఫ్; ప్రపంచ బ్యాంకు కలిసి ఆర్థిక సంస్కరణల పేర  ఆడిన మార్కెట్ మాయాజాలమిది. గ్రామ స్థాయి నుంచి, దేశ స్థాయిలో అధికారంలో పాలు పంచుకునే అన్ని రకాల పార్టీల నాయకులు అవినీతి బురదలో కూరుకుపోయారు. దీనికి ఏ దేశం మినహాయింపు కాదు. ఏ పార్టీ మినహాయింపు కాదు. మునుపు కుడి, ఎడమ, మధ్యే మార్గ (సెంట్రిస్ట్) పార్టీల మధ్య తేడాలుండేవి. అవి తమ పార్టీల లక్ష్యాలు, ఆశయాలు అంటూ కొన్ని విలువల్ని ప్రజల ముందు పెట్టేవి. ఇప్పుడు మధ్యే మార్గపార్టీలు ఉనికి కోల్పోయాయి. ప్రజల ముందు రైటిస్ట్ పార్టీలుగా బహిర్గతమయ్యాయి. అధికారం చేపట్టిన చోట్ల  వామపక్షాలు కూడా పాలకవర్గంగా ప్రజల నుంచి దూరం కావడం విషాదం.

 ఉద్యమాలే ఇక మిగిలింది  సమాజంలో మార్పులు తీసుకరావడానికి శక్తివంతమైన రాజకీయ పనిముట్లుగా పనిచేసేవి  ఉద్యమాలే. ఉద్యమాలు తమ యువ శక్తులను తామే తయారుచేసుకుంటాయి. సామాజిక సంక్షోభం, పర్యావరణ సంక్షోభం- రెండు సంక్షోభాలను ఎదుర్కోడానికి ఉద్యమాలు రాజుకుంటున్నాయి.  ఉద్యమాలలో పాల్గొంటున్న యువజనం వాటి నుంచే అనుభవాలు సంపాదించి కొత్త ఆలోచనలతో సరికొత్త సమాజం కోసం కలలు కంటోంది. కలల సాకారం కోసం వీధులకెక్కి తెగిస్తోంది. 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

1 comment

  • అనేక దేశాల్లొ జరుగుతున్న ప్రజా ఉద్యమాలను సంక్షిప్తంగా పరిచయం చేసిన జయగారికి ధన్యవాదములు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.