అన్ని కాలుష్యాలపై
పెరుగుతున్న తిరుగుబాట్లు

(పైన ఫోటో ప్రజల చేత ఎన్నుకోబడిన మంచి నాయకుడు, కుట్రలకు బలి యై పదవీచ్యుతుడైన భూమి పుత్రుడు ఇవో మొరాలిస్)

భూ వాతావరణాన్ను పరిరక్షించుకోవాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయని, అన్ని దేశాలు కలిసి తగిన చర్యలు తీసుకోవాలని 11,000 మంది శాస్త్రజ్ఞులు ఇటీవలొక ప్రకటన విడుదల చేశారు. భూ వాతావరణం వేడెక్కకుండా తక్షణం చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు అవినీతి బురదలో కూరుకు పోయి వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలను సరిదిద్దే పనిని ప్రజలు చేపట్టారు. ఏడాది క్రితం ఫ్రాన్స్ లో రాజుకున్న ‘’ఎల్లో వెస్ట్స్’’ ఉద్యమం అనేక దేశాల ప్రజల్ని ప్రభావితం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1968 నాటి చేతన మళ్లి కనిపిస్తున్నది. నాటి-నేటి యువతరం, స్త్రీలు అత్యధిక సంఖ్యలో సమస్యలపై ఐక్యమై నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఉదాహరణకి….

తిరుగబడుతున్న కొలంబియా

కొలంబియా: దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో వారం రోజుల క్రితం జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. బ్యానర్లు, జెండాలు పట్టుకొని చిన్నా, పెద్ద పట్టణ్ణాల్లో, నగరాల్లో, దేశరాజధాని బొగొటా లో శాంతియుత వూరేగింపులు నిర్వహించారు. కొలొంబియా ప్రభుత్వం నియో లిబరల్ సంస్కరణల్లో భాగంగా  పెన్షన్ చట్టాలు, కార్మిక చట్టాల్లో మార్పులు చేయడంతో ప్రజల్లో నిరసన రాజుకుంది. విద్యార్థులు, కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు (ఆదివాసీ ప్రజలు) ప్రభుత్వ అవినీతి పాలనకు, పెరిగిన అసమానతలకు వ్యతిరేకంగా నవంబర్ 21 న సార్వత్రిక సమ్మె చేపట్టారు. వారం రోజులుగా సాగుతున్న నిరసన ప్రదర్శనల్లో పొలీసులు ప్రయోగించిన గ్యాస్ టిన్ లు, లాఠీఛార్జిల వల్ల ముగ్గురు చనిపోయారు. రోజూ నిరసన ర్యాలీలు జరుగుతున్నా, డిసెంబర్ 4 న మరో సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

బొలీవియా లో ఇవో మొరాలెస్ అధికారాన్ని పునరుద్ధరించాలను వీధులకెక్కిన జనం

బొలివియా: ఇక్కడ ఒక కాగడా ఇంకా వెలుగుతూ వుండాల్సింది. వారం క్రితం అది నలిపివేయబడింది. దక్షిణ అమెరికాలో అతి పేద దేశం బొలివియా. 60% పైగా ఆదివాసులున్న దేశం. 200 ఏళ్ల చరిత్ర కలిగిన దేశం. మొదటిసారి ఆదివాసీ తెగ నుంచి ఇవో మొరాలిస్ అనే నాయకుడు 2005లో అధికారంలోకి రాగలిగాడు. ఆయన స్వయంగా మైనింగ్ శ్రామికుల కోసం, కోకో పండించే రైతుల కోసం, ఆదివాసీ ప్రజల కోసం పనిచేసిన యూనియన్ నాయకుడు. ఆయన అధికారంలోకి రావడాన్ని సంపన్న వర్గాలు, వారికోసం వార్తలు వండి వార్చే  మాస్ మీడియా సహించలేక, రెండేళ్ళకే ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారు, కాని విఫలమయ్యారు. మూడుసార్లు ఎన్నికై 13 ఏళ్లు అధికారంలో కొనసాగగలిగాడు. ఇవో మొరాలిస్ తనను తాను సోషలిస్ట్ గా ప్రకటించుకోవడమే కాకుండా ప్రజాసంక్షేమమే ప్రథమ లక్ష్యంగా విధానాలను అమలు చేశాడు. దారిద్య్రం రేటు గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను, ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్యను, వృద్ధాప్య పెన్షన్లు పెంచాడు. ఉద్యోగ అవకాశాలు పెంచి, నిరుద్యోగాన్ని తగ్గించాడు. జెండర్ అసమానతలు తగ్గించే దిశగా సామాజిక పథకాలు ప్రవేశపెట్టాడు, ఆదివాసీ ప్రజలకు తమలో ఒకడు తమ కోసం వున్నాడనే నమ్మకాన్ని కలిగించాడు. ఈ అక్టోబర్ 21న జరిగిన ఎన్నికల్లో నాల్గోసారి పోటీ చేసి మొదటి రౌండులోనే ప్రత్వర్థి మీద10% ఎక్కువ ఓట్లు సాధించి గెలిచాడు. అయినా, పోలింగ్ లో అవకతవకలు జరిగాయనే పేరిట, మాస్ మీడియా పశ్చిమ దేశాలు చేసిన కుట్రలతో దేశంలో అల్లర్లు పెల్లుబుకాయి. పక్కనే ఉన్న అమెరికా హస్తం కూడా ఎలాగూ ఇందులో వుంది. పదవికి రాజీనామా చేయమని మిలిటరీ నుంచి ఆయనకు ఆదేశాలు అందాయి. మరో వైపు ఆయన సన్నిహితుల ఇళ్లమీద, సోదరి ఇంటి మీద, ఆయన ఇంటి మీద దాడులు చేసి దోచుకున్నారు. ఆయన ప్రాణానికి ముప్పు వుండడంతో పొరుగున వున్న మెక్సికో కు వెళ్లి   తల దాచుకుంటున్నాడు. ఆయన స్థానంలో ఒక సెనటర్ గా వున్న రైట్ వింగ్ నాయకురాలు జీనిన్ అన్నెజ్ తనను తాను ప్రెసిడెంట్ గా ప్రకటించుకుంది.’’పచమామా అనే ‘ సైతాన్’ వెళ్లిపోయింది. బైబిల్ వచ్చింది ఈ భవనంలోకి’’ అంటూ ఆమె పార్లమెంటు భవనంలోకీ బైబిల్ ను నెత్తిన పెట్టుకొని అడుగుపెట్టింది. ((pachamama అంటే భూమి తల్లి). తాము ఎన్నుకొన్న ప్రభుత్వం కోసం, తమ నాయకుడి కోసం, తమ హక్కుల కోసం వేలాది మంది దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో అన్నెజ్ స్వయం ప్రకటిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు, ప్రతిఘటన పోరాటాలు చేస్తున్నారు. సమ్మెలు చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం అడుగడుగునా మిలిటరీ, పోలీసు బలగాలు మోహరించి ప్రజలపై హింసను ప్రయోగిస్తున్నది. ఇప్పటి వరకు 35 చనిపోయారు. 800 మంది గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు 1600 మంది దాకా అరెస్ట్ అయి పోలీస్ నిర్బంధంలో వున్నారు. ప్రజలపై హింసాత్మక దాడులను ఆపాలని, ప్రజల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితిని ఇవో మొరాలిస్ కోరారు.

దక్షిణ అమెరికాలో ఒక సోషలిస్టు ప్రభుత్వం కొనసాగడం అమెరికాతో పాటు మరి కొన్ని యూరోపియన్ దేశాల ప్రభుత్వాలకు ఇష్టముండదు. అవి విజయవంతంగా కొనసాగకుండా రైట్ వింగ్ శక్తులతో కలిసి ఆ ప్రభుత్వాల మీద కుట్రలు చేస్తారు. ఇప్పుడు బొలివియాలో ఈ ఒక్క కారణమే కాకుండా మరో ముఖ్యమైన కారణం కూడా వుంది. బొలివియాలో లిథియం విస్తారంగా దొరుకుతుంది.  ఎడారిలా చెట్టు చేమలు లేకుండా ఇసుక పరుచుకున్నట్టు లిథియం, ఉప్పు కలిసిన ‘తెల్ల బంగారం’ మైళ్ళకు మైళ్లు విస్తరించి ఉంది. ఇంతవరకు ఉప్పు నుంచి లిథియం ను వేరు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేది బొలివియా. ఇన్నాళ్లు లిథియం ను కొన్ని రకాల మెడిసిన్ లలో, బాటరీలలో వాడేవారు. ఇటీవల ఆయిల్ (గ్యాస్) అవసరం లేకుండా ఎలక్ట్రిసిటీతో నడిచే కార్ల ఉత్పత్తి పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్లల్లో వాడే  బాటరీల్లో, సెల్ ఫోన్ల్ కు వాడే బాటరీల్లో లిథియం ఉపయోగిస్తారు. లిథియం ను ఎగుమతి చేసే బదులు బాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీనే ఏర్పాటు చేస్తే, దేశానికి ఆదాయం పెరగడమే గాక, తమ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఇవో మొరాలిస్ అందుకు అడుగులు వేశాడు. యూరప్ దేశాలు ముఖ్యంగా జర్మనీ కంపెనీ బాటరీలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నించింది. బొలివియాలోనే,తమ ప్రభుత్వ అధ్వర్యంలోనే ఫ్యాక్టరీ ని నిర్మించుకుంటామని, ఏ దేశానికీ తమ దేశ సంపదను ముడిసరుకుగా  ఇవ్వబోమని తేల్చి చెప్పేశాడు ఇవో మొరాలిస్. బొలివియాలో నియో లిబరల్ విధానాలను అమలుచేయడానికే ‘మూవ్ మెంటు టువర్డ్స్ సోషలిస్ట్ (MAS) పార్టీ నాయకత్వంలోని ఇవో మొరాలిస్ ప్రభుత్వాన్ని కూల్చరనడంలో సందేహం లేదు. 

చిలీ, ఈక్వెడార్, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, సూడాన్,హైతీ, అల్జీరియా..అనేకదేశాల్లో  ప్రజలు లేవనెత్తుతున్న సమస్యలు, చేస్తున్న నిరసన ర్యాలీలు నియో లిబరలిజాన్ని వ్యతిరేకిస్తున్నవే. ప్రభుత్వాలు ఐ ఎం ఎఫ్, ప్రపంచబ్యాంకు విధానాలను అమలుచేస్తూ, ప్రజా సంక్షేమానికి తిలోదకాలిస్తున్నాయి. ప్రయివేట్ వ్యక్తులు అన్ని రంగాలను వ్యాపా మయం చేసి, సంపద పోగుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు పోత్సహించే ఈ ప్రయివేట్ వ్యక్తులు ప్రభుత్వంలో వున్నవారో, వారి సన్నిహితులో కావడం వల్ల రాజకీయాలే పెద్ద  వ్యాపారం అయిపోయాయి. ప్రజా సంక్షేమం గీటురాయిగా పాలించే ప్రభుత్వాలకై ఇప్పుడు ప్రపంచమంతటా కాగడా పట్టుకొని వెతకాలి.

అదే సమయంలో నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో ఉద్యమాలు రాజుకొని  నెలల తరబడి (ఫ్రాన్స్ లో ఏడాది గడిచింది, అల్జీరియాలో 9నెలలు) కొనసాగుతున్నాయి.   

ప్రజలు సమస్యలతో  ఏక మయ్యే మేర్రకు ఉద్యమాలు  విజయవంతమవుతాయి. ఉద్యమాలు పెల్లుబుకడమంటే   సమాజం తనను తాను సరిదిద్దుకోడానికి చేస్తున్న ప్రయత్నమిది. సాంకేతికత పెరిగింది. సంపద పోగుపడింది. కానీ, దానితో పాటూ అవినీతి పెరిగింది. అసమానతలు పెరిగాయి. లాభాల వేట కారణంగా భూగోళం కాలుష్యం తో పొగచూరి వేడేక్కుతోంది. ఇది మన కంటికి కనిపిస్తోంది. అంతగా పైకి కనిపించనిది రాజకీయాలు, ఆర్థికం వంటివి అవినీతితో  పెరిగిన కాలుష్యం. ప్రజలు ఒకే సారి అన్ని కోణాలలో ‘కాలుష్యా’న్ని ఎదుర్కొనక తప్పదు. ఎదుర్కొని గెలవక తప్పదు.  

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.