అరుపులు కాదు ఆలోచించండి

ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ హైటెక్-సిటీ అభయ ……… ఇప్పుడు హైదరాబాదు శంషాబాద్ లో ఇద్దరు యువతులు …. 

దారుణంగా సామూహిక అత్యాచారం చేయటం, అత్యంత పాశవికంగా చంపటం కొనసాగుతూనే వున్నాయి.  ఈ సంఘటలనన్నిటినీ మనం విడివిడిగా చేపడితే ఫలితం వుండదు. మూల కారణాలను వెదికి, వాటికి వ్యతిరేకంగా మహోద్యమాలు చేపట్టాలి. 

సామాజిక స్థితిగతులు గాక, సినిమా మీడియాలు యువతను విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. సినిమాల్లో, టీవీల్లో, పత్రికల్లో, మాగజైన్లలో రెచ్చగొట్టే విషయాలని కోకొల్లలుగా గుమ్మరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో, హీరోయిన్లు నీతిని చాటేవాళ్ళు. విలన్లూ వాంపులూ వేరేగున్నా, హీరో హీరోయిన్లది ముఖ్య భూమికగా ఉండేది. ఇప్పుడు హీరోయిన్లే వాంపుల అవసరం లేకుండా చేస్తున్నారు. ఇక నీతీనియమాలను వదిలేసి, ఎదుటి వారిని ఏడిపించి ఆనందించే శాడిస్టులుగా హీరోలను చిత్రీకరిస్తున్నారు. స్త్రీలు తమ ఆస్తులంటూ, తనకు దక్కకపోతే మరెవ్వరికీ దక్కనీయమనే డైలాగులతో యువత మెదళ్ళలోకి విషాన్ని ఎక్కిస్తున్నారు. స్త్రీని ఒక విలాస వస్తువుగా చిత్రీకరిస్తున్నారు. అంతర్జాలంలో బూతు అంశాలు పుంఖానుపుంఖాలుగా దొరుకుతున్నాయి. వీటన్నిటినుండీ పిల్లలను తల్లిదండ్రులు దూరం చేయలేక పోతున్నారు. ఈ విష ప్రభావాల వల్ల, ఈతరం పిల్లలలో పెద్ద వారిని గౌరవించటం గానీ, స్త్రీలను సమానంగా చూడటం గానీ ఏమాత్రం లేకుండా పోయింది. యువతలో నీతీనియమాలు లేకుండా చేస్తున్నారు. అడ్డుఅదుపూ లేకుండా కామాన్ని రెచ్చగొడుతున్నారు.

ఈతరం అమ్మాయిలు తమ ఇష్టాయిష్టాలను కుండబద్దలు కొట్టేలా చెబుతున్నారు. తమ హక్కులకై నిలబడుతున్నరు. అబ్బాయిలు దీన్ని ధిక్కారంగా అర్ధం చేసుకోవటంతో, పెళ్ళయిన తరువాత మొదటి మూడు, నాలుగు సంవత్సరాలు పెద్ద గండంగా గడుస్తున్నాయి. ఈ గండం గట్టెక్కితేనే కాపురాలు నిలుస్తున్నాయి. 

ఈ రోజు సినీరంగ ప్రముఖులు శంషాబాద్ లో బలైపోయిన అమ్మాయిపై నిస్సుగ్గుగా సానుభూతి చూపిస్తున్నారు. సినీ “హీరోయిన్లు” ఎంత రెచ్చగొట్టినా, వారికి మాత్రం పోలీసు రక్షణ ఉంటుంది. రెచ్చిపోయిన వారెవరైనా వారి పై చేయివేస్తే వెంటనే అరస్టు చేస్తారు. బలైపోయేది సామాన్యులే.

ఈ విధంగా యువతలో నీతినియమాలు లేకుండా చేయటమే గాక, అడ్డు అదుపు లేకుండా కామోద్రేకాన్ని రేపుతున్నారు. ఒకపక్క ఈ పాశ్చాత్య సంస్కృతి విషప్రభావంతో యువత పబ్బుల్లో ఎగురుతూ, ఇంకోపక్క భూస్వామ్య సమాజ విష సంస్కృతి ప్రభావంతో ఇళ్ళ దగ్గర మూఢ నమ్మకాలను అమలు చేస్తున్నారు. 

ఈ విష సంస్కృతులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనావుంది.

అలాగే మద్యం ఏరులై పారుతుంది. ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యాన్ని ప్రోత్సహించటం అమానుషం. ఈరోజు యువత మద్యపానానికి బానిసై పోయింది. అదొక ఫాషన్ గా మారింది. 

సంపూర్ణ మద్యపాన నిషేధం వున్నప్పుడు నేరాలు, తగవులూ చాలా తక్కువగా వుండేవి. 

మళ్ళీ సంపూర్ణ మద్య నిషేధంకై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ప్రగతిశీల ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడే రోజుల్లో ఇలా స్త్రీలపై హింసలు గానీ, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వారిపై దాడులు గానీ చాలా తక్కువగా వుండేవి.

ఈ నిజాలనన్నిటినీ దాచేస్తూ, నేడు రక్షణకోసం పోలీసులకు ఫోన్ చేయమనీ యాప్ లు వాడమనీ బోధిస్తున్నారు. ఆపదలో వున్న వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేయాలనే ఆలోచన రావటం లేదంటే, పోలీసులు తమ విధులు ఎంత చక్కగా నిర్వర్తిస్తారో అర్ధమౌతుంది. రక్షకభటులనే పదం నామమాత్రం గానే మిగిలిపోయింది. పోలీసులు నూరు శాతం రక్షణ కల్పిస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. పోలీసుల దగ్గరకు పోవాలంటే భయపడే పరిస్థితే వుంది. 

ఒక అమ్మాయి తప్పిపోయిందని పోలీసుల దగ్గరకు వెళ్తే, వారి నుంచి వచ్చే సమాధానం ఎవడితోనో లేచిపోయి వుంటుందనే. తమ పరిధిలో లేక పోయినా కేసు రిజిస్టర్ చేసుకోవాలనే ఆదేశాలున్నా, వేరే పోలీస్ స్టేషన్లకు పొమ్మంటారు. శంషాబాద్ మృతురాలి తల్లిదండ్రులకు కూడా ఈ రెండు అనుభవాలూ ఎదురయ్యాయి. ఒక అమ్మాయి అత్యాచారానికి గురైందంటే, ముందు ఆ అమ్మాయి ఎలాంటిదోననే అంటారు. ఈ అమ్మాయి డాక్టర్ కావటంతో ఆ అపవాదు తప్పించుకుంది.

ఇక యాప్ లు వాడాలంటే స్మార్ట్ ఫోన్ కావాలి. ఎంతమందికి వాటిని కొనే స్థోమత వుంటుంది? వాటిని కొనలేని వారు, వీరి దృష్టిలో అసలు మనుషులే కాదు. యాప్ లు వాడే వారు కూడా, భౌగోళిక స్థాన సూచి(GPS)ను ఎల్లప్పుడూ తెరచి వుంచాలి. మన మదుగు (privacy) కోసం జీపీయస్ ను మూసి వుంచినాగానీ, గూగుల్ మొదలైన కంపెనీలు మన కదలికలను రికార్డు చేస్తూనే వున్నాయి. పైగా మీరు ఫలానా ప్రదేశానికి వెళ్ళారు, ఆ ప్రదేశం గురించి వివరంగా రాయండని భయం లేకుండా మనల్నే అడుగుతున్నాయి. మదుగు మన హక్కు అనే పరిజ్ఞానం మనకు లేనందునే వాళ్ళిలా బరితెగిస్తున్నారు. 

పైగా ఈ యాప్ లు వాడితే, మనకు మదుగంటూ ఉండనే ఉండదు. ఇప్పుటికే మనకు తెలియకుండా మన ధ్వని, ఫోటోలు, విడియోలు రికార్డు చేస్తున్నారు. మన మదుగు, మన హక్కని ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ లు మన మదుగును అతిక్రమించడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని మనం పోరాడాలి!

యాప్ లు వాడినా ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పనిచేస్తాయనే నమ్మకం లేదు. రాజకీయ నాయకులూ, ప్రభుత్వ ఉన్నతోద్యోగ్యులు వారి వారి విధులను నిర్వర్తించడం కంటే, ఏమి చేస్తే సంపాదించుకోవచ్చోననే చుస్తూవుంటారు. యథా రాజా – తథా ప్రజా అన్నట్లే కింది వారు కూడా వుంటారు. ప్రజా సేవకులనేది ఉట్టి మాటే

హత్యగావించబడ్డ డాక్టర్ విషయంలో, మొదట హంతకులు కర్నూలు  అనంతపూర్ లకు చెందిన లారీ డ్రైవర్లుగా వార్తలొచ్చాయి. రాష్ట్రం దాటెళ్ళి పోయిన అసలైన హంతకులను పట్టుకోవటం కష్టం కావున, స్థానిక అమాయకుల్ని నేరస్తులుగా చూపించే అవకాశం ఉన్నదా? నిందితులుగా చూపించిన వారినే మనం నేరస్తులుగా పరిగణించి, మనం వారిని ఉరితీయాలనీ, ఎన్ కౌంటర్ చేయాలనీ డిమాండ్ చేయకూడదు. నిందితులకు, నేరస్తులకు మద్య తేడా మనం గమనించాలి. నిందితులే నేరస్తులా కాదా అన్నది మనం స్వతంత్రంగా విచారించాలి.

అయేషా మీరా కేసులో సత్యం బాబు నేరస్తుడని పోలీసులు చెప్పినా, ఆమె తల్లి ఒప్పుకోకుండా ధైర్యంగా పోరాడింది కాబట్టే అమాయకుడైన సత్యంబాబు ఉరి తప్పించుకున్నాడు. ఒకసారి ఉరితీసిన తరువాత నిజం బయట పడితే, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకు రాగలుగుతామా?

శంషాబాద్ లో హత్యగావించబడ్డ రెండో మహిళను తగలబెట్టిన చోట రక్తం వున్నా, మద్యం సీసాలు వున్నా పోలీసులు దానిని ఆత్మహత్యగా చిత్రిస్తున్నారంటే – నిందితుల్ని దోషులుగా పోలీసులు, ప్రభుత్వం, మీడియాలు చెప్పినా మనం ఉరి తీయమని  ఎన్ కౌంటర్ చేయమని డీమాండ్ చేయకూడదనీ, స్వతంత్రంగా విచారించ వలసిన అవసరం ఉన్నదనీ గ్రహించాలి. గుంపులో గోవింద కొట్టకూడదు. ధైర్యంగా మళ్లీ మళ్ళీ ఆలోచించాలి!

 • రాప్ర   2019.11.30

 

రాప్ర

1 comment

 • అనామక ప్రియాంకలు

  డా. ప్రియాంక ఒక ప్రభుత్వ గెజిటెడ్ అధికారి. కుటుంబం విద్యావంతులు. మాట్లాడుతూ భయం వేస్తోంది అని చెప్పగానే, కుటుంబ సభ్యులు ఆమెను రక్షించుకొనేందుకు కదిలారు. పోలీసులు కూడా, పిర్యాదువచ్చిన కొన్ని గంటల్లో సీసీ కెమెరా ఫుటేజీ చూసి, టోల్ గేటు వారిని వాకబుచేసి, తెల్లారేసరికి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులది నిర్లక్ష్యం అని మీడియా, బాదితకుటుంబం, ఎంత నిందిస్తున్నా, సగటు పోలీసు చురుకుదనం తో పోలిస్తే, ఈకేసులో చాలా సత్వరమే స్పందించినట్టు. అమ్మాయి కనపడలేదు అనే పిర్యాదు వినగానే, అలా పిర్యాదుచేసిన కొన్ని వందలమందికి “ఎవడితోనో లేచిపోయుంటుంది” అని చెప్పడానికి అలవాటుపడ్డ వాళ్ళు కనుక వారి తొలి సమాధానం అది. ఆ సమాధానం ఒక్కటీ పక్కనపెడితే, పోలీసుల పాత్ర, మరీ నిందార్హం కాదు.

  కొన్నాళ్ళక్రితం ఈనాడూ పేపర్లో ఒక కథనం వచ్చింది. “నగర శివార్లలో గుర్తుతెలియని మహిళల దహనాలు” అని. అంటే పొదల్లో కాలీ కాలని మహిళల శరీరాలు కొన్ని ఆనవాళ్ళతో బయటపడుతున్నాయిట. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత, ఆ శవం కనీసం వారం క్రితం దహనం కాబడ్డది అని అర్దం అవుతోంది. చనిపోయిన మహిళ/ యువతి వయసు తెలియాలంటే మరికొన్ని ఫోరెన్సిక్ పరీక్షలు అవసరం అవుతున్నాయి. చాలామందివి ఊరూ పేరూ తెలియట్లేదు. ఇదీ ఆ వార్తా కథనం సారాంశం. ఒకటిరెండు చోట్ల, అప్పటీకి దొరికిన చిన్న ఆధారం ద్వారా వాకబుచేస్తే బాదితురాలిది వరంగల్లు (దహన స్తలానికి రెండొందల కిలోమీటర్లు) అని తెలిసిందట. చాలా కేసులు గుర్తుతెలిస్యని మహిళలౌగానే మిగిలిపోతున్నాయి.

  నా ఊహ ప్రకారం, నిన్నటి ప్రియాంకా హత్యలో నిందితులకు ఇది మొదటిది కాదు. లేదా వారి సహవాసగాళ్ళు ఇలా చేయాటం, పట్టూబడకపోవడం చూసి ఉండోచ్చు. ఇప్పుడు వాళ్ళని లైడిటెక్టర్ గాని, నార్కో పరీక్షలు గాని చేస్టే, ఏమనవచ్చు, అంటే,
  “అనవసరంగా ఈ అమ్మాయిని ఎంచుకున్నాం, ఎప్పటిలాగే దిక్కూమొక్కూ లేని అమ్మాయిలను ఎంచుకోవలిసింది.” అని అనుకోవచ్చు.

  ఇంతకీ ఈ దిక్కూ మొక్కూ లేని అమ్మాయిలు ఎవరు.

  ఒక ఉదాహరణ.

  మహబూబ్ నగర్ ప్రమాధం జరిగిన ప్రాంతానికి, బండిమీద గంట బస్సులో రెండుగంటలూ దూరంలో ఉంది. ఏ కాలేజీ ప్రేమ జంటైనా, ఉదయాన్నే అమ్మాయి బస్సులోనూ, అబ్బాయి బండిమీదా విడివిడిగా బయలుదేరారు అనుకుందాం. ఎందుకంటే ఆ వయసు ప్రేమికులు పెద్దలిని బురిడీ కొట్టించే ప్రతీ అడుగూ, ఊబి లోకో, తోడేళ్ళు నక్కి ఉన్న పొదలవైపో వెళుతుంది. ఇద్దరూ కూడబలుక్కొని వేసిన అడుగే ఐనా, ఇద్దరికీ ప్రమాదమే ఐనా, అమ్మాయికి ఎక్కువ ప్రమాదం. అలా విడివిడిగా బయలుదేతి, పరిచయస్తులు లేని ప్రాంతంలో కలుసుకొని, పగలు సినిమా అయ్యాకా, సాయంత్రం ఇలాంటి పొదలదగ్గర ఇలాంటి లారీ డ్రైవరూ క్లీనరులకి దొరికిపోతే, వాళ్ళు అబ్బాయిని ఒక తన్ను తన్ని, బండి మీద పారిపోయే అవకాశం ఇచ్చేరు, లేదా, వాడే దూరంగా పారిపోయాడు. అమ్మాయిని ఇదే విదంగా తమ లారీలో మైన్రోడ్డూ దిగి, మట్టిరోడ్డుమీద పది కిలోమీటర్లు ఎతూకెళ్ళి, రెండు గంటలతర్వాత ఇలాగే నిర్మానుష్యమైన ప్రాంతంలో దహనం చేసేసారు.

  అబ్బాయి ఉదయం ఒక్కడే బయలుదేరేడు, రాత్రి ఒక్కడే ఇంటీకి చేరేడు. అమ్మాయి తరుపువారు పోలీసు కంప్లైంటు ఇచ్చేరు. కంప్లైంటూ ఇచ్చిన పోలీసు స్టేషను, అమ్మాయి హత్యకు గురైన ప్రాంతం వేర్వేరు జిల్లాలు. మద్య మూడో జిల్లా కూడా ఉంది. ఐదారు పోలీసు స్టేషనుల పరిది అంతరం ఉంది. అదీ కాక, ఈ అమ్మాయి సగం కాలిన శవం ఏ వారం తర్వాతో బయటపడి, కాలగా మిగిలినది పురుగులు తినేసి ఉంటే ఈ నేరస్తులు దొరకదు, అమ్మాయి ఏమైందో ఎవరికీ తెలీదు.

  గతంలో వరంగల్లులో అనేకమంది అమ్మాయిలను ఇలాగే హత్యచేసి వ్యవసాయబావుల్లో పడేసిన శ్రీనివాసరెడ్డి, ఒక కేసులో దొరికేకా, అతడిని ఇంటరగేషన్ చేసినప్పుడే మిగిలిన బాదితుల వివరాలు తెలిసాయి. అప్పుడే ఆ బావుల నీరు తోడిస్తే అమ్మాయిల ఎముకలూ, పుస్తకాల బేగులూ దొరికాయి. అంతవరకూ అలా చనిపోయిన అమ్మాయిలందరూ, ఊరివారి దృష్టిలో, పోలీసుల దృష్టిలో “లేచిపోయిన” అమ్మాయిలే.

  ఇలాంటి ఎందరో బాదితుల తర్వాత (కనీసం వందమంది అని నా నమ్మకం), ఒక ఉన్నత విద్యావంతురాలు, గెజిటెడ్ అధికారి, ఒక సాధికార మహిళ, సెల్ ఫోను మాట్లాడుతూ ఉండగానే, ఈ అమానుషానికి బలి అయిందంటే, ఆ నిందితులకు ఆ స్తాయి ఆత్మచిశ్వాసం ఎంత “అనుభవం” తర్వాత వచ్చి ఉండాలి.

  నిందుతుల దృష్టిలో, దారిపక్కన వొంటరిగా వెళుతున్న మేకపిల్ల ని లారీలోకి లాకెళ్ళి కూరొండుకొని తినడానికీ, దీనికీ ఏమీ తేడా లేదు.

  ఈ కేసు సమాజంలో ఇంత అలజడి సృష్టించిన సందర్భంగానైనా, టోల్ గేటుల వద్దా (అలాంటి జాగాల్లోనూ) నిఘా మరికొంచెం పెరిగి, అమ్మాయిల్లో ప్రమాధాన్ని పసిగట్టే జాగ్రత్తలు మరింత పెరిగితే,
  డా. ప్రియాంకకు సమాజం అంతా నిజమైన నివాళి అర్పించినట్టు.

  లేకపోతే
  కొవ్వొత్తుల వ్యాపారం పెంచడమే,
  కన్నీళ్ళు నిలువచేసుకొని కారుస్తూ ఉండటమే.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.