‘ఇంటా – బయటా’ నాడూ, నేడూ!

రవీంద్రనాథ్ టాగోర్ నవల “ఘోరే బాయిరే’’ (ఇంటా, బయటా) 1916 లో ప్రచురితమైంది. ఈ నవల ప్రచురణకు కొన్ని సంవత్సరాల ముందు నుండే జాతీయత, దేశభక్తి గురించి ఆయన మనోభావాలు, ఆదర్శాలు సంఘర్షణ పడుతున్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనం 1908 లో ఆయన ఒక స్నేహితుడికి రాసిన లేఖ. అందులో అతనేం రాశాడంటే – “దేశభక్తి మన అంతిమ, ఆధ్యాత్మిక ఆశ్రయం కారాదు … వజ్రాల ధరతో నేను అద్దాలు కొనలేను. నేను జీవించినంత కాలం దేశభక్తిని మానవత్వంపై విజయం పొందడాన్నిఅనుమతించను.” మత ప్రాతిపదికన దేశభక్తికి ఆయన ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. మతపరంగా ఇరుకైన జాతీయవాద ఆలోచన కంటే మానవతావాదాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాడు. 1905 లో లార్డ్ కర్జన్ బెంగాలు విభజన ప్రకటించినపుడు, దానికి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమంతో జాతీయవాదం ఊపందుకుంది. ఇది విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్తువుల దహనం వంటి అతివాద చర్యలకు కూడా దారి తీసింది. ఉద్యమకారులు ‘వందేమాతరం’ అన్న నినాదంతో దేశప్రజలను సమీకరించడం మొదలుపెట్టారు. ఈ విధమైన ఒక మత ‘మాత’ ప్రతీకగా సాగుతున్న ఉద్యమం చాలా ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీస్తుందని రవీంద్రుడు ఊహించాడు. ‘వందేమాతరం’ అన్నది బంకించంద్ర ‘ఆనందమఠం’ నవల లోనిది. రవీంద్రుని ‘జన గణ మన’ మనిషికీ, ‘పంజాబు, సింధు’ వంటి అన్ని ప్రాంతాలకీ ప్రాధాన్యత ఇచ్చింది. సంకీర్ణ జాతీయతావాదం విషయంలో అతనిలో రగులుతున్న భావాలే “ఘోరే బాయిరే’’ నవలలో ప్రతిబింబించాయి.

sఅత్యజిత్ రే

సత్యజిత్ రే సినిమా – ‘ఘోరే బాయిరే’ (1984)
సత్యజిత్ రే నాన్న రవీంద్రుని స్నేహుతుడే. రవీంద్రుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలో సత్యజిత్ రే చదువుకున్నాడు. అంచేత ఈ నవలను సినిమాగా తీయాలని 1940 లోనే స్క్రిప్టు రాసుకున్నాడు. కానీ, ఎన్నో కారణాల చేత అది మొదట్లో సంభవం కాలేదు. ఈలోగా రవీంద్రుని కథలతో ‘తీన్ కన్య’ (1961), ఆ తర్వాత ‘చారులత’ (1964) సినిమాలు తీశాడు రే. చివరికి 1984 లో దీర్ఘకాలంగా అనుకున్న సినిమాను నవలలోని చారిత్రక నేపథ్యంలోనే గోవింద్ నిహ్లానీ ఛాయాగ్రహణంలో తీశాడు.
క్లుప్తంగా కథ!
1908 లో ఒక పెద్ద ధనిక బెంగాలీ జామిందారు నిఖిలేష్ (విక్టర్ బెనర్జీ) బంగళాలో ప్రధానంగా కథ సాగుతుంది. నిఖిలేష్ చాలా సౌమ్యుడు. శాంతమూర్తి. బలవంతంగా ఎవరిపైనా తన అభిప్రాయం రుద్దే మనిషి కాడు. ఆ రోజుల్లో ఆంగ్ల విద్య చదివి ఎం.ఏ. పాసైనవాడు. అతని భార్య బిమాలా (స్వాతిలేఖా సేన్ గుప్తా). పుట్టింటి నుండి నేరుగా భర్త బంగళా లోపలి గదుల్లోకి ఆమె ప్రస్థానం జరిగింది. భర్తను తప్ప మరో పురుషుడ్ని దగ్గరి నుండి చూసి ఎరుగదు. ‘ఘోరే’ అంటే ‘ఇంటి లోపలి’ అంతర్గత ప్రపంచం. భౌతిక ప్రపంచపు కార్యకలాపాల ద్వారా ప్రభావితం కాని స్త్రీ ప్రపంచం! ‘బాయిరే’ అంటే ‘బయటి’ ప్రపంచం. భౌతిక ఆసక్తులు, కార్యకలాపాలు వున్న పురుషుడి ప్రపంచం. ఈ రెండు ప్రపంచాల మధ్య బిమల కొట్లాట సినిమాలో కనిపిస్తుంది. ఆధునిక విద్య పొందిన సంస్కారవంతుడైన నిఖిల్ తన భార్యను ఆధునిక మహిళగా మార్చాలని, ఆమెను బాహ్య జగత్తుకు పరిచయం చేయాలనీ ప్రయత్నిస్తుంటాడు. ఆమె కోసం ఒక ఇంగ్లీషు మేడంను (శశికపూర్ భార్య జెన్నీ) ఇంటికి రప్పించి పాటలు నేర్పిస్తుంటాడు. నిఖిల్ బాల్య స్నేహితుడు సందీప్ (సౌమిత్రా ఛటర్జీ). అతడు స్వదేశి ఉద్యమం పనిమీద ఆ వూరు వచ్చి నిఖిల్ అతిథిగా వున్నాడు. సందీప్ రాజకీయాలతో నిఖిల్ విభేదించినప్పటికీ, స్నేహానికి విలువిస్తూ అతడ్ని తన దగ్గర వుంచుతాడు.


సందీప్ రాక నిఖిల్ ఇంటి లోనూ, ఇంటి బయటా కలకలం రేపుతుంది. తన భార్యను సందీప్ కు పరిచయం చేస్తాడు నిఖిల్. శాంతంగా, నిష్క్రియంగా వుండే నిఖిల్ కంటే చురుకుగా, చలాకీగా వున్నా సందీప్ పట్ల, మరీ ముఖ్యంగా అతని ఉపన్యాసం పట్ల ఆకర్షణకు లోనవుతుంది బిమల. మొదటిసారి అతని ప్రసంగాన్ని మంత్ర ముగ్ధంగా వింటుంది. స్వదేశీ ఉద్యమం ఆమెకు నచ్చుతుంది. ఈ ఉద్యమంలో పరోక్ష భాగస్వామ్యం సంపాదించి నిజంగానే తను బాహ్య ప్రపంచానికి కనెక్ట్ అయ్యానని భావిస్తుంది. సందీప్ సహచర్యం వలన కొంత తెగింపు ప్రదర్శిస్తుంది బిమల. కానీ బయటికి కనిపించేతంతటి సరళమైన మనిషి కాడు సందీప్. అతడు బిమలకు శారీరకంగా దగ్గరవుతాడు. తన రాజకీయాల కోసం ఆమె ద్వారా చందాను రాబట్టుకుంటాడు. జరుగుతున్న మార్పు నిఖిల్ గమనిస్తాడు. కానీ అనావశ్యక వత్తిడి అతని నైజం కాదు. మెరిసేదంతా బంగారం కాదు. సందీప్ కూడా అంతేనని కొంచెం కొంచెంగా అర్ధమవుతుంది బిమలకు. అతడి లోని ద్వంద్వాలు ఆమె ఎరుక లోకి వస్తాయి. అతడు కాల్చేవి విదేశీ సిగరెట్లు, రైలులో ఫస్టు క్లాసులో తప్ప ప్రయాణం చేయడు.


నిఖిల్ సంస్థానంలో విదేశీ వస్తువుల దహనం చేయించాలని పట్టుదలతో ఉంటాడు సందీప్. దీనికి ఒప్పుకోడు నిఖిల్. విదేశీ వస్తువులు అమ్ముకుని తన ఊరిలోని పేద ముస్లింలు బ్రతుకుతున్నారు. స్వదేశీ వస్త్రాలు ఖరీదెక్కువ. నాణ్యత తక్కువ. డబ్బున్న వారు తప్ప పేదలు స్వదేశీ వస్తువులు కొనుక్కోలేరు. కాబట్టి సమస్యను మానవీయ కోణంలోంచి ఆలోచించాలని నిఖిల్ వాదన. కానీ, తనవైన దూకుడు పద్ధతులను ప్రయోగిస్తాడు సందీప్. తన కార్యకర్తలచేత పేద వ్యాపారుల దగ్గర విదేశీ సరుకులు బలవంతంగా గుంజుకుని కాల్చేయమంటాడు. వారికి సరుకులు అందించే పడవల్ని దారిలో అడ్డగించమని చెబుతాడు. ఇలా చేసిన వారు హిందువులు కనుక చివరికి ఆ వూరిలో మతకలహాలు రగిలాక సందీప్ రాత్రి రైలెక్కి పలాయనం చిత్తగిస్తాడు. ‘రామాయణం’ లోంచి నిత్యం ఉటంకించే సందీప్ తను రావణుడి అభిమానిని అని ఆఖర్లో చెబుతాడు. బిమల జడ పిన్ను తన దగ్గర వుంచుకుంటానని నిఖిల్ ముందే చూపుతూ నిఖిల్ ‘జెలసీ’ పడాలని చూస్తాడు. నిఖిల్ కు కూడా ఆ ప్రాంతంలో వుండడం ప్రమాదకరమని తెలుసు. అందుకని తన పరివారాన్ని కొద్ది రోజుల కోసం కలకత్తాకు తరలించాలని భావిస్తాడు. కానీ, రగిలిన మతచిచ్చును ఆర్పడానికి వూరివారితో మాట్లాడి సామరస్యం సాధించడానికి ఆ ముందురోజు రాత్రి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. తన వదినమ్మలానే ఆ ఇంట్లో మరో విధవరాలిగా మారుతుంది బిమల.

అపర్ణా సేన్

అపర్ణా సేన్ సినిమా ‘ఘోరే బాయిరే ఆజ్’ (2019):
రవీంద్రనాథ్ నవల రాసి వందేళ్ళకు పైగా దాటింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసి కూడా చాలా ఏళ్లయింది. ప్రస్తుతం అదే రవీంద్రుని ‘జనగణమన’ను సినిమా స్క్రీనింగుకు మునుపు తెరపై వేస్తున్న సమయం. లేచి నిల్చోవడం ‘ఆప్షనల్’ అయినా నిల్చోని వారిపై అసభ్య మూకలు విరుచుకుపడుతున్న సమయం. ఇది హాలు ‘లోపలి’ పరిస్థితి అయితే, హాలు ‘బయట’ ‘వందే’మా‘తరానికి’ మించి ‘జై శ్రీరాం’ అనకపోతే ముస్లింలను చంపేస్తున్న సమయం. మూక హత్యలపై అడ్డుకట్ట వేయమంటూ ప్రధానికి విన్నవించుకున్నందుకు ఈ సినిమా దర్శకురాలితో పాటు ఎంతోమంది సెలబ్రిటీలపై ‘దేశద్రోహం’ కేసు నమోదైన సమయం. అక్రమంగా విరగ్గొట్టిన దాన్ని కోర్టులే సక్రమంగా చేతిలో పెడుతున్న సమయం. ఇటువంటి సమయంలో ‘ఆజ్’ (నేడు) అనే ట్యాగ్ తో నేటి పరిస్థితికి అన్వయిస్తూ ఈ నవలను సినిమాగా తీసింది అపర్ణా. ఈ రోజు సంఘర్షణ సో-కాల్డ్ దేశ’భక్తు’లకు, లౌకికవాదులకు మధ్య జరుగుతోంది. ఒకప్పుడు సత్యజిత్ రే ‘ఘోరే బాయిరే’లో బిమల పాత్ర పోషించాల్సి వుండిన అపర్ణా సేన్ గౌరీ లంకేష్ హత్య అనంతరం నేటి సందర్భంలో అదే సినిమాను తీసింది.


కథ ఢిల్లీ నేపథ్యంలో …
కథ ఢిల్లీకి మారింది. నిఖిలేష్ చౌదరి (అనిర్బాన్ భట్టాచార్య) ఒక ఆన్‌లైన్‌ పత్రికకు చీఫ్ ఎడిటర్. అతని నైతికాదర్శాలను ఇతరులపై రుద్దాలనుకోడు. శాంతంగా ఉంటాడు. కానీ మతోన్మాద హిందుత్వాన్ని విమర్శించడానికి అతను ఎప్పుడూ వెనకాడడు. అతని చిన్ననాటి స్నేహితుడు సందీప్ (జీసూ సెన్‌గుప్తా) విద్యార్ధి దశలో వామపక్ష విశ్వాసి. ఆ తర్వాత నక్సలిజం మీదుగా హిందుత్వవాది, ఆ మార్కు ‘దేశభక్తుడు’. సుమారు ఇరవై సంవత్సరాల తరువాత సందీప్ లేదా శాండీ నిఖిలేష్ ఇంటికి వస్తున్నాడు. ఈ సినిమాలో బిమల ఝారియాకు చెందిన ఒక దళిత అమ్మాయి. చిన్నప్పుడే అమ్మ నాన్నలు చలిపోతే నిఖిలేష్ బంగాళాలోనే పెరుగుతుంది. వయసులో చాలా పెద్దవాడైన నిఖిలేష్ ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత ఆమెను బ్రిందా (తుహినా దాస్) అని పేరు పెడతారు నిఖిలేష్ ఇంటివారు. ఆమె చిన్నప్పటి నుండి ఆడపిల్లల స్కూలు, కాలేజీల్లో చదవడం వల్ల మగవారితో దగ్గరి సంపర్కంలోకి రాలేదు. ఇంట్లోంచే ఒక పబ్లికేషన్ ప్రూఫ్ రీడర్ గా పనిచేస్తోంది. సందీప్ తన రాజకీయపనుల్లో ఢిల్లీ వచ్చి నిఖిలేష్ ఇంటిలో అతిథిగా ఉంటాడు. సందీప్ మాటల్లోని చలాకీదనం, అతని ‘జాతీయవాద’ ప్రాంసంగాలు ఆమెను ఆకర్షిస్తాయి. వారి సభలకు హాజరవుతుంది.
నిఖిలేష్ చత్తీష్ గడ్ లో ఒక వివాదిత స్థలంలో ఆదివాసీల కోసం ఆసుపత్రి కట్టించాలన్న పనిమీద తన మానవహక్కుల టీం తో చత్తీష్ గడ్ వెళతాడు. ఆ స్థలంలో మందిరం కట్టాలని హిందుత్వ పార్టీ పంతం. నిఖిల్ ఇంటిలో లేని సమయాన సందీప్ బ్రిందాకు శారీరకంగా దగ్గరవుతాడు. ఆమెను ‘బీ’ అని ముద్దుగా పిలుస్తుంటాడు. (సత్యజిత్ రే సందీప్ బిమలను ‘క్వీన్ బీ’ అని పిలుస్తుంటాడు.) ‘మీ స్నేహితుడికి నచ్చజెప్పు’ అని హిందుత్వ పార్టీ వారు సందీప్ కు హెచ్చరిస్తుంటారు. కానీ నిఖిల్ కి తన ఆదర్శాలపై క్లారిటీ వుంది. కాబట్టి ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా వెనకాడడు.

ఈ సినిమాలో చాలా ఉప పాత్రల ద్వారా అపర్ణా సమకాలీన రాజకీయాల్లో తను గొప్పవారనుకున్న చాలా వ్యక్తిత్వాలను స్మరించింది. ఉదాహరణకు ఆదివాసీల మధ్య పనిచేసే శ్వేతా దేవి అనే రచయిత్రి మహాశ్వేతాదేవి అనే అనుకోవచ్చు. ఆదివాసీల వివరాలను, వారిలో కన్పించే మాల్ న్యూట్రిషన్ గురించి నిఖిల్ కు వివరిస్తుంటుంది ఆవిడ. అలానే ట్రైబల్స్ కోసం నిస్వార్థంగా వైద్య సేవ అందిస్తున్న డాక్టర్ బినయ్ సేన్ నిజానికి బినాయక్ సేన్ అని మనకు అర్ధమవుతుంది. ‘అర్బన్ నక్సల్స్’ అని ప్రభుత్వం ముద్ర వేస్తున్న లాంటివారు చాలా మంది కన్పిస్తారు. వారంతా మానవత్వం కోసం సందీప్ క్యాంపుకు నచ్చని పని చేస్తుంటారు. అమూల్య పాత్ర నవల్లోనూ, రే సినిమాలోనూ వుంది. సందీప్ కు నమ్మిన బంటు లాంటి శిష్యుడితడు. ఇర్ఫాన్ హబీబ్, రొమిల్లా థాపర్ వంటి హిందుత్వ వ్యతిరేక చరిత్రకారులను విమర్శించడానికై వారి పుస్తకాలను నిఖిల్ ఇంట్లోని లైబ్రరీ నుంచి తీసుకుని చదువుతుంటాడు ఈ సినిమాలోని అమూల్య.
భారతీయ ముస్లింల విషయంలో అమూల్యకూ, నిఖిల్ కూ జరిగిన ఒక సంవాదంలో – “మన దేశం విభజన జరిగినప్పుడు పాకిస్తాను వెళ్ళిన ముస్లింల కంటే సెక్యులర్ దేశంలో ఉండాలని ఈ దేశంలో ఉండిపోయిన ముస్లింలే అధికం. ఇప్పుడు మనదేశాన్ని హిందూ రాష్ట్రం చేస్తే వారికి అన్యాయం చేసినట్టు అవదా?” అని సున్నితంగా ప్రశ్నిస్తాడు నిఖిల్. అమూల్య నిజమే కదాని అనుకుంటాడు. సందీప్ ద్వంద్వ వైఖరిని పసిగట్టిన వారిలో అమూల్య ఒకడు. అమూల్యకు జునైద్ అనే ముస్లిం స్నేహితుడుంటాడు. ఈద్ కోసం బట్టలు కొనుక్కుని ఢిల్లీ నుంచి ఇంటికి వస్తుంటే, దారిలో ట్రైన్లో హిందూమూక అతడ్ని కొట్టికొట్టి రైలు నుండి కిందికి తోసి చంపేస్తుంది. ఈ వార్త తెలిసిన తర్వాత అమూల్య పూర్తిగా మారిపోతాడు. ఇండియా గేట్ దగ్గర జునైద్ కోసం క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించడంలో ముందు వరుసలో వుంటాడు అమూల్య. నిఖిల్, సందీప్ ఇద్దరికీ ఢిల్లీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ (అంజన్ దత్త) కూడా జరుగుతున్నచరిత్రకు, తన విద్యార్థుల చరిత్రలకు సాక్ష్యంగా వుంటాడు.
గౌరీ లంకేష్ హత్యను తను మరిచిపోలేదనీ, ఆ హత్య వెనుక వున్న శక్తులను మరిచిపోలేదనీ అపర్ణా సేన్ క్లైమాక్స్ దృశ్యం ద్వారా చెప్పింది. నిఖిల్ తన ఇంటిముందే మెషిన్ గన్ తూటాలకు బలవుతాడు. స్నేహితుడి చావును ఆపగలిగి కూడా ఆపకుండా (బహుశా రహస్యంగా ఆమోదం తెలిపి), ఆ చావును కూడా తన రాజకీయ ఎదుగుదలకు వినియోగించడానికి ‘ఈ హత్య మావోయిస్టులు చేశారు, నిఖిల్ కు మావోలతో సంబంధాలు వున్నాయి’ అని మీడియాకు చెబుతాడు సందీప్. టాగోర్ బిమల వైధవ్యం ప్రాప్తించిన అబలగానే ఉండిపోయింది కానీ, అపర్ణా బ్రిందా మాత్రం సందీప్ అంతుచూసి, ఆధునిక బిమల ఎలా ఉండాలో తెలుసుకోమంటుంది.
ప్రధాన పాత్రధారులందరూ అద్భుతంగా నటించారు. నీల్ దత్త సంగీతం, సౌమిక్ హల్దార్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. క్లాసిక్ సాహిత్యాన్ని సమకాలానికి సరిగ్గా అన్వయిస్తే ప్రతిసారీ రాణిస్తుందని ఈ సినిమా రుజువు చేస్తోంది. నిర్మాణంలో చిన్న చిన్న లోపాలు వున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ రోడ్డుపై పసుపురంగు కారు పరుగుతీయడం, బీహార్ బాక్ గ్రౌండ్ వున్న సందీప్, బృందాల హిందీలో బెంగాలీ యాస ఎలా వచ్చింది అన్న విషయం వగైరాలు! తన కేరీర్లో అత్యంత రాజకీయ సినిమా ఇదే అని చెబుతోంది అపర్ణా సేన్. ఈ సినిమా ప్రస్తుతం ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొంటోంది. బెంగాలు థియేటర్లలో మూడో వారం నడుస్తోంది.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.