ఒక ఉలుకులు ఊసులు…

ఔను…

ఉన్నమాటంటే ఉలుకే!

ఉలుకంటే ఉలిక్కిపడ్డమేమో? 

ఉలుకంటే అర్థం భయమట కదా?

భయమే! అన్నిటికీ భయమే! భయపడాల్సిందే! భయపడి తీరాల్సిందే! మీకేం పోయింది? అంతా మా చావుకొచ్చింది!

‘అయినా నువ్వేమైనా భాషా సినిమాలో రజనీకాంతువా?’ అని నేను పెయిన్ ఫీలయి అడిగితే, మా డాడీ హేపీ ఫీలయి ‘మనింట్లో భాషా నేను కాదురా… మీ అమ్మ’ అని ఆపకుండా నవ్వుతారే?- నేను కుంగి కుంగి ఏడుస్తుంటే పొంగి పొంగి నవ్వుతారే?!

నా మాట వినడం మానేసి ‘మనింట్లో భాషా నువ్వే కదా?’ అని నాన్న అమ్మని చూసి నవ్వుతారు!

‘చాల్లెండి బడాయి’ అని అమ్మ!

‘నువ్వు ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్టు’ అని నాన్న!

నా గోడు పట్టించుకోరే?!

అసలేమయిందో తెలుసా?

అమ్మా నాన్న స్కూలుకు వచ్చారు! పేరెంట్స్ కదా… వస్తారు! మా బాబెలా చదువుతున్నాడని అడుగుతారు! ఎందులో వెనకబడ్డాడో అందులో ముందుకు తొయ్యమని అంటారు! మేమూ పుష్ చేస్తాము… మీరూ పుష్ చెయ్యండి- ప్రెజర్ చెయ్యండి- అని టీచర్లూ అంటారు! ముందుకీ ఇప్పటికీ నా గ్రోత్ గ్రాఫ్ తారాజువ్వలా ఎలా పైకి లేచిందో మార్కుల్లో చూపిస్తారు! పేరెంట్స్ ఫీజు కట్టి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు! అంతే! ఎండ్!

కాదు?!

‘మీరు మూడు నెలలకో టీచర్ని మారుస్తూ వుంటే కెమిస్ట్రీ ఎలా కుదురుతుంది?’ నాన్న అడిగారు! ‘కెమిస్ట్రీలో కాదండి మేథ్స్… లెక్కల్లో’ అంటుంది క్లాస్ టీచర్! ‘టీచర్ని మార్చకపోతే స్టూడెంటునయినా సెక్షన్ మార్చేస్తున్నారు… అదేం లెక్కండి?’ అని అమ్మ  అడిగింది! ‘సెక్షన్స్ షఫిల్ చేశాం… స్టూడెంట్స్ మధ్య బాండింగ్ పెరిగిపోతే అల్లరిగా తయారవుతారు’ టీచర్ చెపుతుంటే, ‘నువ్వు అంత అల్లరి చేస్తావా?’ అమ్మ నాకేసి కోపంగా చూస్తుంది!

అప్పుడు నేను టీచర్ వేపు దీనంగా చూశాను! ‘అల్లరనే కాదు, వాళ్ళు చదివే స్థాయిని బట్టి సెక్షన్స్ మారుతూ వుంటారు’ అని చెప్పింది టీచర్! నేను ఊపిరి తీసుకోబోయాను! ‘అంటే మావాడు బాగా చదివితే సెక్షన్ మారుస్తారు…’ అంతేగా అన్నట్టు చూశారు నాన్న! ‘అంతేగా అంతేగా’ అన్నట్టు చూసింది టీచర్! ‘అంటే మావాడు బాగా చదవక పోతే?’ అనుమానంగా చూసింది అమ్మ! ‘ఏముంది పాత సెక్షన్లో వచ్చి పడిపోతాడు’ వైకుంఠపాళీలో పాము మింగేస్తే మళ్ళీ సేమ్ ప్లేసుకు వచ్చి పడతాడు అన్నట్టు!

నాన్న అదే మాట అనేశారు! ‘పిల్లలతో వైకుంఠపాళీ ఆడుకుంటూ ఉంటారన్న మాట’ నాన్న నవ్వారు! టీచర్ నవ్వలేదు! ‘వేరే పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు…’ కదలండి అన్నట్టు టీచర్ మా స్టూడెంట్స్ కంటే వినయంగా చెప్పింది! ‘ఇంతింత ఫీజులు కడుతున్నాం, మా డౌట్లే క్లియర్ చెయ్యడం లేదు, ఇంక పిల్లల డౌట్లు…’ అమ్మ మాటలు పూర్తి కాలేదు! క్లాసు టీచర్ సరిగా డీల్ చెయ్యడం లేదన్నట్టు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వచ్చి ఇన్చార్జ్ తీసుకుంది! క్లాసు టీచర్ ముఖం మాడి తప్పు చేసిన స్టూడెంటులా పక్కన నిల్చుంది!

‘చెప్పండి…’ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నవ్వుతూ చూసింది!

‘మీ మేనేజ్మెంటుతో మాట్లాడాలి’ అని నాన్న!

‘నాన్నా…’ అనబోయాను! నా నోట్లోంచి మాట రాలేదు! గాలొచ్చింది! అమ్మయితే అర్థం చేసుకుంటుందని ఆగమన్నట్టు గిల్లాను! ఆగితే కదా? ‘నువ్వేంట్రా? నువ్వేం గవర్నమెంటు స్కూల్లో చదవడం లేదు, వేలకు వేలు ఫీజులు కట్టి మా చెమటా నెత్తురూ కడుతున్నాం, వీళ్ళని మేపుతున్నాం…’ అమ్మని ముట్టినందుకు కరెంటు షాక్ కొట్టినట్టే అయ్యింది!

‘మీ ప్రాబ్లమ్ చెప్పండి’ నవ్వుతూ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్!

‘ఏం మాట్లాడుతాం? ఆటలన్నారు! లేదు! పాటలన్నారు! లేదు! ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ అన్నారు! అదీ లేదు! చదువుని ఆటలాగ పాటలాగ నేర్పించాలండీ…’ నాన్న చెప్పబోయారు!

‘పరీక్షల టైం…’ నవ్వుతూ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్!

‘మీకు రోజూ పరీక్షలే’ అని, ‘మీకంటే మీ పిల్లలకి’ అని, మళ్ళీ ‘మీ స్టూడెంట్లకి’ నాన్న మాటని నాన్నే దిద్దుకుంటూనే వున్నారు! ‘డైలీ టెస్టులు యూనిట్ టెస్టులు క్వార్టర్లీ ఆఫ్యర్లీ యాన్వర్లీ… గేపేది? పిల్లల్ని ఆడిపించకపోతే చురుకుదనం ఏది?’ నాన్న మాటలు పూర్తి కాలేదు! బాబ్జీగాడి వాళ్ళ బాబు ‘మీ అబ్బాయిని యింటికి తీసుకు వెళ్ళి ఆడించుకోండి’ అన్నాడు.

నాన్న మూగయిపోయారు! అమ్మ అవాక్కయింది! ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది! టీచరుకు నీరసం తగ్గింది!

‘మధ్యలో మీకెందుకు?’ అమ్మ అవమానంగా కోపంగా వెనక్కి తిరిగి చూసింది!

‘అవును మేడమ్… పిల్లలకు మార్కులు ముఖ్యం. ర్యాంకులు ముఖ్యం. ఆడుకోవడానికీ పాడుకోవడానికీ బడికెందుకు రావడం?’ బాబ్జీగాడి వాళ్ళ బాబు మీదకి వచ్చాడు!

‘నన్నాఫ్ యువర్ బిజినెస్’ అని నాన్న!

‘ఇదేం స్పోర్ట్స్ స్కూల్ కాదు…’ గొణుగుతున్నట్టు అన్నారు నాన్న!

‘డోంట్ టాక్ రబీష్…’ అని నాన్న!

ఇద్దరూ కాలర్లు పట్టుకున్నారు! స్కూలు వాళ్ళు అడ్డం పడి విడిపించారు!

‘మాస్టారూ… పేరెంట్స్ వొత్తిడి మేరకే మేం ఆటలూ పాటలూ అటకెక్కించేశాం… అర్థం చేసుకోండి’ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చెప్పబోతుంటే ‘ఏం మేం పేరెంట్స్ కాదా? ఫీజు కట్టడం లేదా?’ అమ్మ అడిగింది!

‘మెజారిటీ పేరెంట్స్ ఒపీనియన్స్ తీసుకొనే అమెండ్ మెంటు చేస్తాం’ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నవ్వుతూ చెప్పింది! అమ్మకీ నాన్నకీ ఏం చెప్పాలో అర్థంకాక సైలెంటయిపోయారు!

‘మీ అబ్బాయికి వున్న ప్రాబ్లెమ్స్ చెప్పండి’ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఓపికగా కేసు మూసేద్దాం అన్నట్టు అడిగింది!

‘డైరీలో మేం కంప్లైంట్ రాస్తే పట్టించుకోలేదు… వొకసారి కాదు…’ అని నాన్న డైరీ తీసి చూపించారు!

ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మా టీచర్ వంక తినేసేలా చూసి, అమ్మానాన్నల వైపు చూసి ‘ఒక్కోసారి ఓవర్ లుక్కులో అలా జరుగుతుంటుంది…’ నవ్వింది! ‘యాక్షన్ తీసుకుంటాం’ అంది!

మా టీచర్ ముఖంలోకి చూడలేకపోయాను! భయం వేసింది! రేపటి నుండి నేనీ స్కూలుకు ఎలా రావాల్రా బాబూ- అని అనుకున్నాను!

‘మేత్సూ సైన్సూ బాగా చెప్పిన పాత టీచర్ని తీసేశారు, ఎక్సుపీరియన్సు లేని కొత్త వాళ్ళని పెట్టారు, అందుకే మావాడు…’ అమ్మ చెప్పడం పూర్తి కాలేదు! ‘ఎక్సుపీరియన్సుడ్ వాళ్ళనే వెతుకుతున్నాం’ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నవ్వింది! ‘ఈ లోపల మావాడి చదువు అయిపోతుంది లెండి’ అమ్మ కసిగా అనేసి లేచింది! వెనకాలే నాన్న! ‘బేడ్’ అంటూ లేచారు! ‘థాంక్యూ… థాంక్యూ వెరీమచ్’ అమ్మతో నాన్నతో నవ్వుతూ తలవూపి చెప్పింది!

ఆ తర్వాత అమ్మానాన్నా మొదట స్కూలును తిట్టారు! ఆ తరువాత నన్ను తిట్టారు! స్కూలుకు వెళ్ళిన తరువాత ‘గుడ్ మార్నింగ్ చెప్పినా’ అది మొదలు అంతా బ్యాడ్ మార్నింగే!

మునిపటిలా టీచర్లు నాతో చనువుగా ఫ్రెండ్లీగా వుండడం మానేశారు! కనిపిస్తే చాలు క్వశ్చన్స్ యిచ్చేయడమే! ‘నువ్వు చదవకు, మీ పేరెంట్సుతో తిట్లు కాయించు’ అనేవాళ్ళు! వెళ్ళి ఆడుకో అనేవాళ్ళు! లేదంటే క్లాసులో ఆడుకో అనేవాళ్ళు! నీ డైరీ ఇవ్వు అనేవాళ్ళు! అందరికన్నా ముందు దిద్దేవాళ్ళు! మీకు డైరీలో సైన్ చెయ్యడమే మా పని కాదు, పాఠాలు చెప్పాలి! నోట్సులు రాయించాలి! అవి దిద్దాలి! కరెక్ట్ చేయించాక చదివి అప్పజెప్పించుకోవాలి! మీ పరీక్షల పేపర్లు తయారు చేయాలి! దిద్దాలి! రోజూ దిద్దాలి! చాలదన్నట్టు అడ్మినిస్ట్రేషన్ సెక్షనుకు వెళ్ళి ఇచ్చిన గడువు లోపల మార్కులు ఎక్కించాలి! లేదంటే అది లాక్ అయిపోతుంది! పేరెంట్స్ వస్తే అన్నీ వదిలి మాట్లాడాలి! మేం ఇళ్ళకు వెళ్ళకుండా ఇక్కడే వుండిపోవాలి!

ఈ మాటలన్నీ నాగురించి, నాలాంటి వాళ్ళ అమ్మా నాన్నల గురించి అని నాకు తెలుసు! అంతే కాదు, మునిపటిలా కేర్ తీసుకోరు! అడగరు! డౌట్స్ తీర్చరు! ఎంకరేజ్ చెయ్యరు! డిస్క్రైజ్ చేస్తారు! ఏవైనా వేరే కాంపెటెటీవ్ పరీక్షలకు చెప్పరు! అడిగితే ఆడుకుంటావు కదా?- అని తిరిగి వెక్కిరిస్తారు! చుక్కలూ చంద్రుడూ నక్షత్రమండలమూ చూపిస్తారు!

ఇవన్నీ అమ్మానాన్నకు తెలీవు! పోనీ చెపుదామంటే మళ్ళీ వచ్చి అమ్మా నాన్నా అడిగితే మళ్ళీ వార్! ఆ ఫైటింగులో నాకే దెబ్బలు! ఒక్కరోజు కాదు! రోజూ! కట్టిన ఫీజు పోతుంది కాబట్టి ఆ స్కూల్లోనే వుండి చదువుకోవాలి! మళ్ళీ ఏడాదికి గాని… ఏమో?!

ప్చ్… స్కూలు సెకండో థర్డో వచ్చే వాణ్ని! ఇప్పుడు బ్యాక్ బెంచ్ స్టుడెంటు! నిజంగానే టీచర్లు సీట్లు మార్చినప్పుడు నన్ను వెనక్కి తోసేశారు! ఇన్నాళ్ళు అల్లరి చేసినా నవ్వేసి చూసీ చూడనట్టు వదిలేసేవాళ్ళు! ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా నన్నూ పేరెంట్సుని కలిపి తిడుతున్నారు!

నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు!

అందుకే నా పేరూ క్లాసూ స్కూలూ లేకుండా ఈ లెటర్ కంప్లైంట్ బాక్సులో వేస్తున్నా!

ప్చ్….

…………………….

…………………….

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.