డార్క్ టూరిజం: క్రకౌ నగరం

డార్క్ టూరిజం: ఇది కొద్దిమందికే పరిచయమున్న పేరు.  కానీ ఇటీవల కాలం లో డార్క్ టూరిజం (Dark tourism) కు బాగా ప్రాచుర్యం పెరుగుతోంది . ఏదైనా ఒక ప్రాంతం  కొన్ని చెడు సంఘటనలకు ప్రసిద్ధిపొంది పర్యాటక స్థలం గా మారితే దాన్ని డార్క్ టూరిజం ప్లేస్ గా పరిగణిస్తారు. ఉదాహరణకు భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని జలియన్వాలాబాగ్ సామూహిక దమనకాండ జరిగిన ప్రాంతం. కంబోడియా లోని “కిల్లింగ్  ఫీల్డ్స్ ‘, జపాన్ లోని హిరోషిమా నాగసాకి నగరాలు. 

యూరోప్ లో డార్క్ టూరిజం ప్లేస్ గా ప్రసిద్ధి పొందిన నగరాలలో పోలాండ్  దేశంలోని క్రకౌ (krakow ) ఒకటి. పోలండ్ రాజధాని వార్సా (Warsaw ) కు దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే క్రాకౌ  జనాభా రమారమి ఎనిమిది లక్షలు మించి ఉండదు కానీ ప్రతి ఏటా అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం సుమారు కోటి మంది పైనే. ఇందులో సాధారణ పర్యాటకులతో పాటు చరిత్రకారులు, పరిశోధకులు, పాఠశాల విద్యార్థులు, అక్కడి మృతులతో ఆత్మీయ అనుబంధం ఉన్న వారు ఇలా పలు రకాలు గా వుంటారు. ఇక్కడ ఎన్నో  దర్శనీయ స్థలాలు ఉన్నా ప్రముఖంగా కొన్నింటి గురించే చెప్పుకోవచ్చు. 

నాటి యూదు కాన్సెంటృఏషన్ క్యాంపు

ఇక్కడికి వస్తున్న వారు ప్రధానంగా మూడు ప్రాంతాలను కచ్చితంగా సందర్శిస్తారు. అందులో మొదటిది: రెండో ప్రపంచ యుద్ధ కాలం ముందు హిట్లర్ యూదుల మీద సాగించిన మారణకాండ క్రాకౌ  నగరానికి దగ్గర్లో ఆస్విట్జ్ 1 (Auschwitz ), ఆస్విట్జ్ 2 అని పిలువబడుతున్న బిర్కెనౌ (Birkenau ) నిర్భంధ శిబిరాలు ( నాజి కాన్సంట్రేషన్ క్యాంపులు) ఉన్నాయి. యూదుల మారణ కాండ చాలా ఎక్కువగా జరిగిన ప్రాంతం కావడం వలన చాలా  హాలీవుడ్, పలు యూరోప్ సినీ నిర్మాణ సంస్థలు కూడా ఇక్కడికి విరివిగా వస్తుంటాయి. ఎన్నో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్పీల్ బర్గ్ సినిమా ’ది షిండ్లర్స్ లిస్ట్’ లో చాలా సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. 

రెండవ ప్రధాన పర్యాటక స్థలం సాల్ట్ మైనింగ్ ప్రాంతం. భూగర్భంలోని ఉప్పు గనులలో ఉప్పురాళ్లలో  చెక్కిన వివిధ ఆకృతులు, ప్రార్థనా మందిరాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. మూడవది కమ్యూనిస్ట్ ప్రభుత్వ కాలంలో ఆ సిద్ధాంతాల కు అనుకూలంగా రష్యా సహకారంతో నిర్మించిన ప్రాంతం నోవాహుతా (Nowa Huta ). ఇది ఇప్పుడు క్రకౌ లో ఒక భాగం. దీనినే స్టాలిన్ కాలంలో కమ్యూనిస్ట్ స్వర్గం అని పిలిచేవారు. 

సిగ్గులేని చరిత్ర మీద విసరాల్సిన చెప్పులు: ఆనవి నాటి యూది మృతులవే

ఆస్విట్జ్ 1,  ఆస్విట్జ్ 2 అనే బిర్కెనౌ కాన్సంట్రేషన్ క్యాంపులు… యూరోప్ లోనే అతి పెద్దవి. హిట్లర్ సైనికులు ఆనాడు ప్రతి రోజు వేల మంది యూదులను, తమ రాజకీయ వ్యతిరేకులను ట్ర్తక్కులలో ఇక్కడికి తీసుకు వచ్చి అతి క్రూరంగా చంపేవారు. పసిపిల్లలు, స్త్రీలు అనే తారతమ్యం కూడా చూపించే వారు కారు. ఆనాటి పాశవిక సంఘటనలకు సాక్ష్యాలుగా… మరణించిన వారి దుస్తులను, చెప్పులను, వారు వాడిన మిగతా వస్తువులను అక్కడ చూడొచ్చు. ఆనాటి నిర్మాణాలను, రోడ్లను ,ఇనుప ముళ్ళ కంచెలను, మార్చకుండా అలాగే ఉంచారు. వీటి సందర్శన కు  ప్రవేశ రుసుము లాంటివి లేవు. విదేశస్తులు ఐడెంటిటీ ప్రూఫ్ గా పాస్పోర్టులను టికెట్ కౌంటర్ లో చూపాల్సి ఉంటుంది. గైడ్ సహాయం కావలసినవారు మాత్రం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతమే కాకుండా క్రకౌ నగరం లోని యూదు కాలనీ కూడా ‘ది షిండ్లెర్స్ లిస్ట్’ సినిమా తరువాత బాగా టూరిస్టులను ఆకర్షిస్తోంది. 

నోవాహుతా  లేక కమ్యూనిస్ట్ ‘స్వర్గం’: కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పారిశ్రామిక జిల్లాగా  ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన ప్రాంతమే ఈ నోవాహుతా. రష్యా సహకారంతో నిర్మించిన ఉక్కు పరిశ్రమ మినహా మిగిలిన వాటికి… ప్రస్తుతానికి అక్కడ ఆనాటి భవనాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు చాలా తక్కువగా ఉంటారు. వీరిలో  కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, చరిత్ర పైన ఆసక్తి ఉన్నవారు ఎక్కువ. కమ్యూనిస్టు కాలంలో నిర్మించిన ఉక్కు పరిశ్రమ ఈనాడు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ చేతిలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే నోవాహుతా ఒక చెదిరిపోయిన సామ్యవాద కల.

షిండ్లర్స్ లిస్టులో కొంత?

కాన్సంట్రేషన్ క్యాంప్స్ ను దర్శించిన తర్వాత యూదుల చరిత్ర పై  కొంత అవగాహన కలిగే మాట నిజం కానీ అక్కడి ప్రదర్శించే చాయా చిత్రాలు చూసి, వాటి వివరణలు చదివేకొద్దీ మనసు భారమౌతుంది. అలాగే నోవాహుతా ప్రాంత సందర్శన లో భాగంగా అక్కడి నిర్మాణాలు చూసిన తరువాత కమ్యూనిస్ట్ భావజాలం గురించిన విషయాలు ప్రస్ఫుటంగా కాకపోయినా ఒక మోస్తరు గా అర్థమౌతుంది. ఒక సిద్ధాంతం ఆచరణ నుండి కనుమరుగయిన తరువాత కొన్ని  జీవితాలు ఎలా తలకిందులు అవుతాయో, ఎలా కొన్ని దేశాల ఆర్థికస్థితిగతులు అతలాకుతలం అవుతాయో నోవాహుతా లో కనిపిస్తుంది.

***

ఎల్ వి లక్ష్మి

ఎల్ వి లక్ష్మి లైబ్రరీ సైన్సులో పట్టభద్రులు. చిరకాలం 'అన్వేషి' సంస్థలో లైబ్రేరియన్ గా పని చేశారు.సహచరుడు జి ఎల్ నరసింహా రెడ్డి తో కలిసి దేశదేశాలు తిరిగారు. తమ యాత్రా విశేషాలను ఇలా చక్కని సరళమైన తెలుగులో అందిస్తున్నారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.