నీతి రాజనీతి చెప్పిన కవులు

జనం మెరుగైన సమాజాన్ని, నిండైన జీవితాన్ని అనుభవించిన కాకతీయుల కాలంలో  రాజులు, కవులు అనేక కావ్యాలు రాసారు. మతపరమైన చైతన్యాన్ని తెచ్చారు. కాకతి యుగానికి పేరు తెచ్చిన  రుద్రమదేవి తెగువ ను చూస్తే, ఆ కాలం లో స్త్రీ లను తొక్కి పట్టకుండా, స్త్రీలు అన్ని రంగాల్లో ఉండాలన్న ఆలోచన వర్ధిల్లిందను చెప్ప వచ్చు. 

ఈ కాలం లో వన్నెకెక్కినవి రెండు ప్రధాన లక్షణ గ్రంధాలు.. 1.పంచతంత్రము, 2.కామందకము. 

ఈ రెండు గ్రంథాల రచయితలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, నీతి శాస్త్రానికి సంబంధించి అనేక పద్యాలు సుప్రసిద్ధమయ్యాయి. ఈ కాలంలో మత పరమైన విప్లవాలు అనేకం వచ్చాయి.. జయాపసేనాని రాసిన నృత్త రత్నావళి  గ్రంథం ఆధారంగానే రామప్ప గుడులలో కనిపించే నాట్య భంగిమలను శిల్పులు చెక్కారని అంటారు. రాజనీతి పై అప్పటి కవులు రాసిన పద్యాలు చాలా ప్రాముఖ్యం లోకి వచ్చాయి.

“జనపతి పర్జన్యు గతిం
దన భూప్రజ బ్రోవవలయు, దగ బ్రోవడయే
దను బూసి పోవు నా ప్రజ
ఘన నీరస సరసి బయ ఖగముల బంగిన్ “

దండనీతి రాజులకు అవసరమే కానీ, అంతకంటే ముందు ప్రజల క్షేమాన్ని చూడాలని తెలిపేదే పై పద్యం.

అలాగే విభజించి ఓడించే యుక్తి గురించిన ఈ పద్యం అప్పటిదే.

పెక్కండ్రు జనులు నేరమి
యొక్కట జేసినను వారి నొకమరి గినియం
జిక్కరు గావున నేర్పున
నోక్కకరణ పాపి పాపి శిక్ష యోనరింపదగున్ “

కాకతీయ కాలం నాటి ప్రధమ కామంద గ్రంథ రచయిత రాసిన కొన్ని పద్యాలు తర్వాత క్రమం లో వేమన అదే శైలి లో అదే అర్థం వచ్చేలా రాసారు.

ప్రథమ కామంద గ్రంథ రచయిత రాసిన ఈ పద్యం …

“పెనుగజము ద్రుంచు నక్రము
తన నెలవున నుండి, నెలవు దప్పిన మరి తా
శునకంబు చేత జచ్చుం
దన నెలవున హీనుడైన దగ ఘననోర్చున్ “

ఇదే శైలిలో వేమన రాసిన పద్యం తెలిసిందే:

“నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు దీయు
బైట కుక్క చేత భంగపడును.
స్థాన బలిమి కాని తన బల్మి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!”

కాకతీయ యుగం లో మతపరమైన విప్లవాలు సైతం చూడొచ్చు. అప్పటి వరకు విస్తరించిన బౌద్ధాన్ని పూర్తిగా తొక్కి పడేసే ప్రయత్నం జరిగింది. బుద్దుడిని విష్ణుమూర్తి తొమ్మిదో అవతారాన్ని చేసివేశాక, బౌద్ధానికి ప్రత్యేకత తగ్గిపోయింది.  ఈ కాలం లోనే శివునికి కేశవుడికి విగ్రహాలు కట్టించినట్లే, హిందువులు బుద్ధుడి కి ఆలయం నిర్మించారు.

“పరమేశుడు హరి బుద్ధ
స్వరూపుడై య్సుర్వరుల వంచించుట నా
హరియనియ పట్టసాలము
జిరముగ బుద్ధ ప్రతిష్ట జేసితి భక్తిన్

(తెలంగాణా శాసనములు, కాకతీయ శాసన సంఖ్యా -6)

ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే, జైన మతం లో వర్ణాశ్రమ ధర్మాలను జొప్పించారు. జైన శూద్రునికి, హిందూ శూద్రునికి తేడా ఏమీ లేకుండా పోయింది. బహుశా అందుకే… జైనులపైన శైవులు తిరగబడ్డారు. బౌద్ధ, జైన మతాలపై తిరుగబడ్డారు. ఆ కాలపు కవులు కూడా అందుకు సహకరించారు. రాను రాను విపరీతమైన శైవ మత ప్రాచుర్యం,  అనేక రకాలైన అణిచివేతల నేపధ్యంలో అనేక నీతి శాస్త్రాలు వెలువడ్డాయి. ఆ కాలపు కవి క్షేమేంద్రుడు సామాజిక చైతన్య దిశగా రాజ నీతి పై పద్యాలు రాశారు . మంత్రి లేని మహీపతులు నాలుగు కాలాల పాటు నిలబడ లేరని చెపుతూ…

“రాజరాజవంశభూజనపాతు లీల్గి
రకట మంత్రి తొలగి యలికినాడు
ఏది పసుపుసేయ నిటు నిల్వబోలదు
రాజు లేని కయ్య మోజపడునే?” (సకల నీతి 927).

చాళుక్యుల రాజ్యం అంతరించి పోయాక చెప్పిన పద్యమిది. క్షేమేంద్రుడు రాసిన మరో పద్యం కూడా రాజనీతికి సంబంధించి ప్రసిద్ధం>…

“వేర యొకచోట వలయెగ్గి వేటకాడు
తొలగియుండి మ్రుగంబుల ద్రుంచు పగిది
రూపు సూపక శత్రువు రూపుగూల్చు
టిదియే నయమార్గమిట్లు జయిపవలయు.”  (సకలనీతి 895)

వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించాలని చెపుతూ, రాజ్యం కోసం ఏది చేసిన తప్పులేదనే నీతి ఇతడిది. దండ యాత్రల సమయం లో శత్రువులు వచ్చే దారిలోని చెరువులలో, నూతులలో విషం కలపాలని కూడా చెపుతారు.

“తా నరులు వచ్చు తెరువున
మానుగ గల చెరువులందు మడువులయందున్
బూని ఘనగరళతరళము
గా నొనరింపంగవలయు గడువేగమునన్ .”

కవిత్వం మీద ఎంతో ఆసక్తి కలిగిన భోజుడనే రాజుకు సంబంధించి మడికి సింగన్న 25 పద్యాలను సేకరించి, బయట పెట్టారు. నీతి భూషణమ్ అనే లక్షణ గ్రంధం… ధారాపురం రాజధానిగా పరిపాలించిన  (కీ.శ. 1000-1050 ) భోజరాజు రాసిన తెలుగు పుస్తకము. “కవిత్వం యొక్క మంచి తెలియని పురుషులు పశువులు. అయితే వీళ్ళు గడ్డి తినకపోవడం పశువుల అదృష్టమే” అని ఒక పద్యం లో రాశారు. అలాగే, “మంచి  కవిత్వాన్ని వింటే మంచివాళ్ళే పొంగిపోతారు. చెడ్డవాళ్ళు పొంగుతారా?, చంద్రుడిని చూస్తే సముద్రాలు పొంగుతాయి కానీ, నూతులు పొంగుతాయా? అని అంటాడు. ఇంకో పద్యం లో “అడవులను కాలుస్తూ గొప్పగా ఉన్నప్పుడే అగ్నికి గాలి మిత్రుడు.  చిన్న దీపంగా ఉన్నప్పుడు ఆర్పివేసే ఘనుడు. హీనులకు స్నేహితులేమిటి?” అంటాడు. 

ఇలాంటి మరో కవి శివ దేవయ్య. ఈయన పద్యాల నుంచి నేర్చకుని,  ప్రతాప రుద్రుడు రాజ్యానికి వచ్చిన వెంటనే పరిపాలనా విధానాన్ని సంస్కరించాడని, తన సామ్రాజ్యం అంతటిని 77 నాయంకరములుగా విభజించాడని చెబుతార్తు. అందుకు నిదర్శనంగా ఈ పద్యం …

“రాజుల సమ్మతిన్ తదితరంబుల ప్రాతాల భక్తియుక్తులన్
రాజితశస్త్రధారుల బరాక్రమవంతుల నప్రమత్తులన్
భోజన హేమవస్త్ర పరిపుష్టులు హ్రుష్ణులు నైనవారిగా
నొజ యొనర్చుగావలయు నొద్ధను పాయకయుండ భృత్యులన్”

తగిన విధంగా ప్రజలను రక్షించక వాళ్ళ మీద పడి తినే రాజు ఎటువంటి మూర్ఖుడో  చెపుతూ..

“చాల బ్రజ బ్రోవకయ తా
గోలాసన్  బాడి దప్పికొనుచుండెడి భూ
పాలకుడు కుప్పజిచ్చిడి
పేలాల్ వేదికికొని తినెడి బేల తలంపన్” అంటాడు.

ప్రజలను చెరిచి కూడబెట్టిన ధనాన్ని ఖర్చు పెట్టాలని, ప్రజలూ డబ్బూ పెరిగిపోతే భుజబలంతో రాజు నిభాయించుకోలేడనీ ఆర్థిక సూత్రాలను చెప్పాడు.

“ప్రజ జెరిచి కూడబెట్టిన
నిజధన మది వలయు వ్యయము నిచ్చలు జేయన్
బ్రజయను ధనమును బొలిపిన
భుజబలమున నిలువదరమే భూపతి కెందున్?

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

6 comments

 • నీతి, రాజనీతి, చెప్పిన ఆనాటి కవులు గురించిరాసినా మీకు ధన్యవాదాలు Cv సర్.కవిత్వం manchi గురించి తెలియని పురుషులు, పశువులు,.. ఈ నీతి ఈకాలం లోకూడ వర్తిస్తుంది కదా,సర్!..మీవ్యాసం👌👌సర్!

 • మరుగున పడిన ప్రాచీన కవులను, వారి అమోఘమైన రచనా ప్రతిభను, వారి గొప్ప ఆలోచనలను.. ఇలా సులభశైలిలో వివరించిన మీకు ధన్యవాదాలు..
  రాజనీతిని నేర్పగలిగిన గురువులుగా కూడా కొందరు కవులున్నారంటే వారికి పాదాభివందనం చేయాలి, కాలమెరుగనిది వారి యశస్సు..

 • సమాజంలో ప్రజల్ని సక్రమమైన మార్గం లో నడిపించేందుకు కవులు, రచయితలు, పద్యాల రూపం లో నీతి ధర్మ సూత్రాల్ని అందించేవారు. రాజులకు కూడా వారు ధర్మ మార్గంలో రాజ్యాన్ని ఎలా నడపాలి అన్న ఆలోచనే “”రాజ నీతి”” సూత్రాలు ఉటంకించారు.
  ఇప్పుడు మన కార్పొరేట్ రాజులు అందుకు భిన్నంగా నీతి కి బదులు “”బూతు””సూత్రాలు (పోర్నోగ్రఫీ) లను నింపి పబ్బం గడుపుకొని, సమాజాన్ని రేపుల దోవ పట్టిస్తున్నారు. మంచి విషయాల్ని అందించారు. ధన్యవాదాలు💐💐💐💐

 • మహా మహా కవులు రాజ్యానికి కూడా అండగా ఉండి ఎలా పాలించాలి అని తెలియజేయడం అలాంటి కవులకి వందనాలు.
  మంచి గురించి తెలియని పురుషులు పశువులు నిజమే సర్ నేటి లోకంలో చాలా వరకు జరుగుతున్న అకృత్యాలకి వరిస్తుంది ఈ వాక్యం
  అంతటి గొప్ప పద్యాలు తాత్పర్యంతో మీరు చేసిన విశ్లేషణ మహా అద్భుతమైన శైలి మీకు అభినందనలు సర్.

 • మీ రచనలో కాకతీయుల కాలంను తీసుకోవడం సంతోషంగా ఉంది సార్…మీరు చెప్పిన అంశాలను కొత్తగా విన్నాను…. ధన్యవాదాలు సార్.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.