నైపుణ్యాలతోనే పరివర్తన

            “Personal transformation can and does have global effects. As we go, so goes the world, for the world is us. The revolution that will save the world is ultimately a personal one.”
                                                                                              -Marianne Williamson

          పరివర్తన అంటే ఏమిటి? ఒక సంస్థని సరికొత్త మార్గంలోకి పయనింపచేయడానికి తీవ్రమైన, హేతుబద్ధమైన మార్పుకు గురిచేయడమే పరివర్తన. అది పూర్తిగా విభిన్నమైన నిర్వహణా సామర్ధ్య స్థాయికి సంస్థను తీసుకెళుతుంది. గత కాలపు వ్యవస్థ, దాని నిర్మాణ ఛాయలైనా లేకుండా మౌలిక స్థాయిలో మార్పు తీసుకురావడాన్ని పరివర్తన అంటారు. ఒక సంస్థలో ఇటువంటి మార్పుని ఎలా ప్రారంభించగలం? బదిలీ చేయగలిగిన నైపుణ్యాలు ఈ పరివర్తనలో ఎలా ఉపయోగపడతాయి? ఈ బదిలీ చేయగలిగిన నైపుణ్యాలంటే ఏమిటి? బదిలీ చేయగలిన నైపుణ్యాలు సక్రమంగా వినియోగిస్తే వ్యక్తిలోగానీ, వ్యవస్థలోగానీ పరివర్తన తీసుకురావడానికి ఎంతో శక్తివంతంగా పని చేస్తాయి. సరళ కౌశలాలన్నీ బదిలీ చేయదగిన నైపుణ్యాలే. సానుకూల వైఖరి నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, సమయ నిర్వహణ, పరస్పర సంబంధ నైపుణ్యాలు, ఇంకా ఎన్నో వ్యక్తులందరినీ వృత్తిగత, వ్యక్తిగత విజయాలు సాధించడానికి తోడ్పడతాయి. ఈ నైపుణ్యాలన్నీ మౌలికంగా అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి. అందుకే వీటిని కౌటుంబిక నైపుణ్యాలు అని కూడా అంటారు. 

          ఒక వ్యక్తి వారసత్వ కుటుంబ నైపుణ్యాలైన సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళల మీద దృష్టి సారిస్తే అతడు లేదా ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిగత జీవితంలో కూడా అద్భుత విజయాలు సాధించగలరు. వారసత్వ నైపుణ్యాలనే బలమైన పునాదితో వృత్తిగా స్వీకరిస్తే ఆ వ్యక్తి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చాల మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ధనార్జన మార్గం చూపించడమే నైపుణ్యమనుకుంటున్నారు గానీ, నిరంతరం నేర్చుకునే నైపుణ్యాన్నివ్వడం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనితో వారసత్వ నైపుణ్యాలు మరుగునపడిపోయి  జీవితాలు నిస్తేజంగా, నిరుత్సాహంగా, విజయావకాశాలు లేక నిర్వీర్యంగా సాగదీస్తున్నారు. బాల్యం నుంచి పిల్లల్ని ధనార్జనా నిపుణులుగా తయారు చేయడంలోనే తల్లిదండ్రులు నిమగ్నమై, వారిని నిరంతర అధ్యయన నైపుణ్యాలకు దూరం చేస్తున్నారు. దీనితో నేటి యువతకు జీవితాలు చాల త్వరగా బోర్ కొట్టేస్తున్నాయి. కొండొకచో కూడు, గుడ్డ, అన్నీ ఉన్నా భావోద్వేగ నియంత్రణ లేకపోవడంవల్ల ఆత్మహత్యల మూర్ఖత్వం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఉపాధి మార్గాల మీద దృష్టి పెట్టి, తరతరాలుగా వస్తున్న విలువైన, ప్రగతిశీలమైన వారసత్వ నైపుణ్యాలను నిర్లక్ష్యం చేయడంతో, అవి సహజ మరణానికి లోనై, వాటి ఆనవాలు కూడా లేకుండా పోతున్నాయ్. డబ్బు చుట్టూ తిరిగే జీవితాలు, అసహజమైన అలవాట్లకు లోనై సంతోషాల వానలేని గొడ్డు మబ్బుల్లా తయారవుతున్నాయి.

వారసత్వ నైపుణ్యాలను బాల్యం నుంచే పిల్లల్లో అభివృద్ధి చెయ్యాలి. అప్పుడే వారిలో బుద్ధివికాసం, వ్యక్తిత్వ వికాసం చెట్టాపట్టాలేసుకుని పరుగెడతాయ్. సంగీతమున్న ఇంట్లో సంగీతం, చిత్రలేఖనమున్న ఇంట్లో చిత్రలేఖనం, సాహిత్యం ఉన్న ఇంట్లో సాహిత్యం వికసించి, కనుమరుగైపోకుండా, కుటుంబం, తద్వారా సమాజం, దేశం, ప్రపంచం అభ్యున్నతికి, వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు తమ వారసత్వ నైపుణ్యాలను పిల్లలకు అందించడంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. అంతర్జాతీయ క్రీడాకారిణి పి.వి.సింధుకి బ్యాడ్మింటన్ వారసత్వం తన తల్లిదండ్రులనుంచే వచ్చింది. ఆమె ప్రతిభను గమనించి వారు ప్రోత్సహించడంవల్లనే ఆమె అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కాగలిగింది. దేశానికి గర్వకారణమైంది. యువతకు స్ఫూర్తిదాయకమైంది. చక్కని జీవితానికి డబ్బే ముఖ్యం కానీ, కళలు, కాకరకాయలు కాదని పిల్లల్ని తల్లిదండ్రులు నిరుత్సాహపరచకూడదు. ఈ నైపుణ్యాల వల్ల వారు ఉద్యోగాల్లో కూడా ఎంతగానో రాణిస్తారు. నలుగురిలో విభిన్నంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికెళ్ళకపోయినా జీతమొచ్చే స్థాయికి చేరతారు. వారు తాము పని చేసే సంస్థకే ‘బ్రాండ్ అంబాసడర్ ‘ గా కీర్తిప్రతిష్ఠలు తెచ్చుకుంటారు. ఏదైనా ఒక కళలో నిష్ణాతులైనవారు పనిచేసే ప్రదేశంలో కూడా సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచించి, వృత్తిగతంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఇంటర్వ్యూ సమయంలో తల్లిదండ్రులతో కూడా మాట్లాడితే, వారి పిల్లల్ని పని చేసే ప్రదేశంలో అర్ధం చేసుకుని మేనేజ్ చేయడం కంపెనీకి సులువవుతుంది.    

ఏదైనా ఒక సంస్థలో పరివర్తన తీసుకు రావాలంటే ఎనిమిది అంశాలు ప్రభావితం చేస్తాయని హార్వర్డ్ బిజినెస్ స్కూలుకు చెందిన డా.జాన్ పాల్ కొట్టర్, కొనొసుకె మత్సుషిత ప్రొఫెసర్ ఆఫ్ లీడర్- షిప్, ఎమెరిటస్ సూచిస్తారు. 

  1. ప్రతి పని అత్యవసరమే అన్న భావనను ఉద్యోగుల్లో కలిగించాలి. 
  2. శక్తివంతమైన దిశా నిర్దేశం చేసే సమన్వయ బృందాన్ని రూపొందించాలి. 
  3. దీర్ఘకాలిక దృష్టిని పెంపొందించాలి
  4. దీర్ఘకాలిక లక్ష్యాన్ని అందరికీ తెలియచెయ్యాలి. 
  5. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పని చెయ్యడానికి సాధికారికతను పెంపొందించాలి. 
  6. తాత్కాలిక విజయాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి స్ఫూర్తి నింపాలి. 
  7. జరుగుతున్న అభివృద్ధిని సుస్థిరం చేసి మరింత మార్పుకు దారులు తెరవాలి. 
  8. సరికొత్త మార్గాలను వ్యవస్థీకృతం చెయ్యాలి. 

ఈ ఎనిమిది అంశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తిగత పరివర్తనే సంస్థాగత పరివర్తనకు దోహదం చేస్తుందని చెప్పకనే చెబుతాయి. వ్యక్తిగత పరివర్తనే సంస్థాగత సంస్కృతిలో పరివర్తనకు పునాది వేస్తుంది. 

స్థూలంగా చెప్పాలంటే వారసత్వ నైపుణ్యాలున్న యువతకు ఉపాధి కల్పించి, కంపెనీలు వారిని ప్రోత్సహించాలి. దీనివలన ఉద్యోగి, కంపెనీ రెండూ ప్రగతిపథంలో పరుగెడతాయి. వారసత్వ నైపుణ్యాలున్న ఉద్యోగులు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా, వినూత్న ఆలోచనలతో పని చేస్తూ కంపెనీ ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తారు. తద్వారా సమాజాభివృద్ధికి పునాదులు వేస్తారు.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.