మరుగు లేని పొలిమి

రేపు శుక్రారం. ఈ పొద్దు రెయ్యి నిద్రలోకి జారుకునే ముందు రేపు శుక్రారం బిరిన్నే లెయ్యల్ల అన్న మాటను తలకాయకు అప్పగించి నిద్రబోతాము. ఆ లచ్చిందేవి మా ఇంటికి వస్తుందో రాదో గాని ఇల్లూవాకిలి కడుక్కొని ముగ్గులుబోసుకొని, పసుపు కుంకాలబొట్లు పెట్టి, పూలు కట్టుకొని, సామాన్లన్నీ కడుక్కొని, పొద్దెక్కకనే నీళ్లు పోసుకుని, మాతో పాటు దేవునికీ వండి, పూజ్జేసేసరికి మా సడుగులు ఇరిగి పోతాయి.

నేను జెప్పిన పనులన్నీ జేసి పట్టెడు అన్నం తిందామని గిన్నెముందర అట్లా కుసున్న. ఆ యాలకి మా యక్కొచ్చి వాకిట్లో నిలబడే. నేను ఆ యమ్మకల్ల జూస్తి.  నాకండ్లకు తనుక్కుమని మెరిసినట్టు కనబడే.  ఆయమ్మ ఉంటే ఇంట్లో, పోతే కూలికి తప్పితే ఇంకోతావున కనపడదు. ఏదన్నా రోగమో రొచ్చో వస్తే ఆస్పత్రికి బోతుంది. ఆయమ్మ పెట్టే కంటికాటికి నుంచి తల్లోపూవరకు, తల సమురు కాడ్నిండి సంటిమింద గుడ్డ వరకు మొగుడే తెచ్చి ఆ యమ్మకు అమరస్తాడు. ఆ  యమ్మ చేతులారా పదిరూపాయలు కర్సు బెట్టింది సూల్లా. ఊరికో పట్నానికో పోయినపుడు తప్పితే ఆ యమ్మ ఒంటి మింద అరువైన గుడ్డ చూడము. అంత మాసిపోయి ఉంటాయి. కానీ ఈ పొద్దు చిలకపచ్చ చీర దానికి నాలుగేల్ల ఎడం బార్డరు, అదే చీరగుడ్డతో రైకి కుట్టి తొడిగింది. మోగానికి స్నో పౌడర్  గోరు మందం బూసుకో ఉంది. మగం కల్ల జూస్తానే ఎరిపిచ్చినట్లుంది. ఆ మొగానికి ఎడుమోటి బొట్టు పెట్టింది. గాజుపూస తగిలిచ్చుకొంది అయినా సరే మొగమే ఎత్తి కొడతా ఉంది. నేను ఆ మొగం కల్ల ఎత్తిచూస్తానే పక్కున నవ్వితి. ఏల పాపా అట్లా నగతావు అనే. ఇంక లేదా ఇంట్లో పౌడ్రు అంతా ఈ పొద్దే పూసుకునేశావా అంటి. అవునా సానా తెల్లగా ఉందా అని ఆ యమ్మ పైట సెరుగు తోని తుడుసుకుంది. ఆ యమ్మది చమర కాకి రంగు. మొహం మాత్రం తెల్లగా ఉంటె ఏమన్నా బాగుంటుందా అని జెబ్తి. ఆ యమ్మ తుడ్సుకుంటా సరేపాపా నువ్వింకా పయనం కాలేదా అనే .

 “తినేసి ఎలబారేదే నువ్వు బొయ్యి మిగిలినోల్లను అట్లా పయనం చెయ్యిబో “అంటి

మేమిద్దరం మాట్లాడతా ఉన్నట్టే నా మొగుడొచ్చే కొటారికి కయ్యడగతా.

“నీకింకా కాలేదా ఇంగెప్పుడు పొయ్యేది ఈన్నే పదయ్యె” అనే.

నేనుండుకొని “నీకేమి నిద్రలేసి ఉపుకుంటా బోతావు. పనులన్నీ ఎప్పుడయ్యేది” అంటి. సర్లే బిరన్న పొండనే .

ఇంతలో మా డ్వాక్రా సంగానికి లీడరు పద్మ వచ్చే  అక్కా మన గ్రూపులోని పదిమందిని పిల్సుకోని బ్యాంకు కాడికి వచ్చెయ్యమని సంఘమిత్ర పోను చేసింది అనే.

మా గ్రూపుకి నేను రెండో లీడరు. సర్లే పదండి అని నేను, మాయక్క , పద్మ ముగ్గురం బయలుదేరి మాఊరి దారిలో ఉన్న గంగమ్మ గుడికాడ నిలబడితిమి .ముందుగా వచ్చినోల్లు అందరూ ఆడ కుచోనుండారు. ఆ యమ్మ రాలేదా ఈ యమ్మ రాలేదా అని వచ్చినోల్లు  రానోల్లను తిడతా ఉండారు . ఎనకా ముందు అందరూ జమై బస్సుకాడికి దావంటి నడస్తాపోతా వుండాము. మా యక్క ఉండుకోని ఈ పొద్దు నా మొగుడే అన్నం చేసినాడని, ఇంగోరు నా మొగుడే నీల్లు దెచ్చి కాంచినాడని ఈ పొద్దు గ్రూపులో డబ్బులిస్తారని మనకంటే ముందే మన మగోల్లు మనల్ని అవసరిస్తాఉండ్రి అంటా, డబ్బు ఇచ్చేటపుడు సంబరంగానే తీసుకుంటాము, కట్టేటప్పుడు మనమే నలిగిసావల్ల అంటా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

ఇంతలో బస్సు రోడ్డొచ్చే.మాఊరినుండి మల్ల బ్యాంకు కాడికి పోవల్లంటే పదిరూపాయలు ఛార్జి. అందరం బస్సుకి పోతిమి. ఆ  బ్యాంకుకాడికి చేరుకున్నాము . ఆ బ్యాంకుజూస్తే డబ్బులు కట్టేవాళ్ళు తీసుకునేవాళ్ళు , మాయట్ల లోన్ల కోసం వచ్చినోళ్ళతో నిండి పోయిండాది. మాది గ్రామీన బ్యాంకు. లోపల ఐదు బెంచీలేసినారు. ఇంగ యాబై బెంచీలేసినా కూడా సరిపోయేంత జనం నిండుకోనుండారు . కొద్దిమంది నిలబడి, మోటారు సైకిళ్లకు ఆనుకోని ఇంకొంతమంది, బ్యాంకుముందర దావలో జానెడెత్తు దుమ్ములో మరికొంతమంది కుసోనుండారు. వాళ్ళు గాక నిండు మన్సులు  చిన్నబిడ్డతల్లులు, ముసిలోల్లు రకానికొకరు కుసున్నే దానికి తావు దొరక్క తారాడతా ఉండారు.

మాకు లోనియ్యల్లంటే ఫీల్డ్ ఆఫీసర్ ప్రతి ఒక్కరినీ చూసి సంతకాలు పెట్టిచ్చుకోవల్ల. మావంతు వచ్చేసరికి మావిటేల మూడు నాలుగయ్యేటట్టు ఉంది. మేము నిలబడి నిలబడి నిలువుకాల్లు బడిపోతావుండాయి. మా యట్లా ఆడోళ్ళు నూరు మంది ఉండారు. బ్యాంకు వాకిలి దాటొస్తే నేమో  మెయిన్ రోడ్డు. ముడ్డి నేలబెడతామంటే తావు లేదు.

ఇట్లా బాదలు పడతా ఉంటే మాయక్కకి ఉచ్చలొచ్చినాయి. నన్ను పక్కకి బిల్సి “మేయ్ ఇంటికాడ బస్సెక్కినప్పట్నుంచి ఉచ్చలొచ్చినాయి. అబ్బటి నుండి ఉగ్గబట్టుకోనుండా, నానించి కాలే.  ఏడకన్నా బోయి పోసేసి వస్తాం పదా అనే. నేను ఆబ్యాంకు చుట్టుపక్కలా బాత్రూములు ఉండాయేమోనని తారాడితి. ఏడనే కానీ గానీ బాత్రూములు లేవు. బయటొస్తే అంత కాలీగా మరుగ్గా ఉండే తావు లేదు. మెయిన్ రోడ్డులో బ్యాంకు ఆనుకొని ఈపక్క ఆ పక్క ఎనక ముందు చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగులు. ముందర మెయిన్ రోడ్డు దాటాలంటే పదినిమిషాలు పడతావుంది ఆ పాడిగా తిరగతావుండాయి బండ్లు. ఏడబోసేది . బ్యాంకులో పని జేసే వాళ్ళను అడిగితి. బాత్రూం అర్జంటు అని. ఆయమ్ముండుకోని బాత్రూమ్లు లోపలుండాయి అవి ఈడ పనిజేసే ఆఫీసర్లకే, మిమ్మల్ని రానీరు అనే.

ఇట్లా  మేము అగసాట్లు పడతా ఉన్నట్లే గంట గడిసిపాయె! మాయక్క మొకం కల్ల చూస్తే బిక్కున దిగులుబడిపోయి అట్ల నొసకతా ఇట్లా నొసకతా ఉంది. మొగం నల్లగా బెట్టుకోనుంది. కడుపు ఊదకొస్తా ఉందిమే అంటుంది. ఇంగ  మేము పోతే ఆర్టీసీ బస్టాండుకు పోవల్ల లేదంటే చిత్తూరు బస్టాండుకి పోవల్ల. బ్యాంకు కాడ మనం లేకుంటే ఎట్ల, ఏ టైం లో పిలుస్తారేమోనన్న భయం. మా యక్క మొగం చూసి ఎట్లయితే అట్లగానీలే అని ఆటో బిలిసి ముప్పై రూపాయలు ఆటో బాడుగిచ్చి ఆర్టీసీ బస్టాండ్లోకి తొడుక్కునిబొయినా. ఆడ మొగోల్లకోపక్క ఆడోల్లకోపక్క బాత్రూములుంటే మధ్యలో ముసిలాయన డబ్బులు వసూలు చేస్తా ఉండాడు. డబ్బులిచ్చిపోండి అనే. నేనుండాలే ఇస్తానని ఆ యమ్మను లోపలకు బొమ్మంటి. డబ్బులడిగె వాన్నికూడా గమనించకుండా గబుక్కున లోపలికి దూరేసే. నేను ఐదు రూపాయలిచ్చి బయటే నిలబడితి. కాలుగంట బోసింది. బాత్రూములోకి ఏడుపుమొగంతో బొయింది .వచ్చేటపుడు నగతా వస్తావుంది. మొగంకల్ల జూస్తే నెత్తి బరువు నేలకు దిగినట్టుంది. ఒగ మాట కూడామాట్లాడకుండా బిగిసికిపోయినట్లున్న ఆడది ఎన్ని మాటలు జెప్పిందో !

మల్ల ముప్పై రూపాయలు ఆటోబాడిగిచ్చి ఆటో ఎక్కితిమి. దోవ పొడుగూకు “మేయ్ నువ్వు నా పానం గడ్డ నేశావు, ఎంచేడు కడుపునొప్పితో వంగలేను లెయ్యలేను. బిగబట్టుకోలేక కండ్లల్లో నీరు కారినాయనుకో, ముక్కోటిదేవతలకు మొక్కుకున్నాను ఆపమని. నువుజేసినమేలు నేను ఎప్పటికీ మర్సిపోను అయినా ఇంత ఇబ్బంది పగోనికి కూడా రాకూడదు. అరవైరూపాయల ఆటోచార్జీ పోతే పోనీ గానీ నా పానం నిలబడింది. అయినా ఏంటికి ఈ బ్యాంకులు? ఈ డ్వాక్రా సంఘాలు బెట్టి మనట్లా వాళ్ళు బ్యాంకు మొగం చూస్తా ఉండాము. లేకబోతే మనకిట్లా బాధలేల? అందరం ఆడోల్లమే కదా వచ్చేది.  మనం కస్టపడి వడ్డీ మొదులు కడితేనే గదా వాళ్ళు జీతాలు దీసుకునేది. వాళ్లకు మాత్రం బాత్రూములు ఉండల్ల మనల్ని మట్టుకు రానీయరా, మనం ఏడకు బొయ్యిపోసేది. బ్యాంకుకు మన్సులే రాకుంటే ఈల్లకు పనేముంది? వచ్చిన మన్సులకు కుసోను సోటుండదు, ఒంటికి దొడ్డికి పోసుకోను తావు లేకుంటే నిండుమన్సులు , చిన్నబిడ్డతల్లులు, ముసిలోల్లు ఏమైపోవల్ల, ఏమి గుడ్డి సట్టమమ్మా” అనే ఆ యమ్మ

ఈ యమ్మ మాట్లాడతా ఉంటె తలకొక మాట అన్రి అందరూ. అవును ఇబ్బందే అని అనుకుని పొయ్యేవాళ్లే గాని ఆ మేనేజర్ దగ్గరకు బొయ్యి అడిగే వాళ్ళు లేరు. మేము కూడా పోలే. మాకు పని అయ్యేసరికి సాయంత్రం ఐదయ్యింది. ఇంగ బ్యాంకుకు వచ్చేటబుడు  నీళ్లు ఉరువు తాగనమ్మా అని మా యక్క. దినామూ వచ్చేటోళ్లు ఎంత బాదపడతారో అనుకుంటా మేము ఇండ్ల దావ బడితిమి. అందరి మొగాలూ బీర్సుకుపోయుండాయి .

పొద్దున్న ఎలబారేటపుడు తంగేడు పూల గతం కళకళలాడిన మాయక్క మొగం సాయంత్రానికి ఎండిన తాటాకు అయ్యింది.

***

 

అర్థాలు

మరుగులేని పొలిమి = మరుగులేని ప్రదేశం

కొటారికి కయ్యడుగుతా = పెత్తనం చలాయిస్తా

బీర్సుకు పోవడం =పీక్కుపోవడం

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి: 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి తాలూకా లోని దిగువబురుజు గ్రామంలో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు.  గత  15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. ముప్పై కథలతో  'ఎదారి బతుకులు' పేరుతో వీరి కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు. ఫోన్ నెంబర్ : 9390803436 mail id :navobharathi@gmail.com

2 comments

  • ఎంతో విలువైన కత.
    హక్కుల చైతన్యం కలిగించే కత. మాండలికం గొప్పతనం చాటే కత. ఒక పెద్ద చర్చ, అవసరమైన క్రియాశీలత కోరే కత. రచయిత్రి భారతికి,
    రస్తా కి అభినందనలు

  • ఇలాటి కథలు ఎన్ని రావాలి..ఎప్పటి కైన ఆడవాళ్ళు సుఖంగా బతక గలిగే అవకాశం వస్తుందా..నా తరం వెళ్లి పోతోంది..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.