వెండిపాటల్లో ఎర్రమదారం!
జాలాది-3

జాలాది సాహిత్యం మీద పరామర్శ కొనసాగిస్తూ ‘ఇదా ప్రపంచం’ సినిమాకు ఆయన వ్రాసిన టైటిల్ సాంగ్ చూద్దాం.ముందు చెప్పిన ‘బండెల్లిపోతంది సేల్లెలా’ రైలు బండిలో వస్తే, రైల్వే ప్లాట్ ఫారం మీద కనబడే పేదరికం, దైన్యం, స్టేషన్ బయట జరిగే ఘోరాలు, నేరాలు తలుస్తూ కీలక సన్నివేశాల్లో నేపథ్యంలో వినిపించే పాట ‘ఇదా ప్రపంచం ఇదేనా ప్రపంచం’.

ఇదా ప్రపంచం 
ఇదేనా ప్రపంచం 
ఇదా సమిష్టి సమాజం 
మరోతరానికి మహోజ్వలానికి మహాత్ములడిగిన మరో ప్రపంచం 
ఇదా ప్రపంచం ఇదా ప్రపంచం 
ఇదా ప్రపంచం ఇదా ప్రపంచం 

చీకటి చింపిన విస్తరిలో 
ఆకలి మెతుకుల అవమానం 
ఆశల కోసం దేశాన్నైనా 
అమ్ముకు బ్రతికే అభిమానం  
ఇది జీవితమాడే చదరంగం 
చీకటి వెలుగుల సుడిగుండం 
తీరంచేరని నావలతో 
తెరమరుగాడే పావులతో 
ప్రతి నిమిషం ఒక ప్రళయ రోదనా
ప్రతి ఉదయం ఒక ప్రసవ వేదనా 
ఇదా ఇదా ప్రపంచం ఇదా ఇదా ప్రపంచం 
మరోతరానికి మహోజ్వలానికి మహాత్ములడిగిన మరో ప్రపంచం 
ఇదా ఇదా ప్రపంచం ఇదా ఇదా ప్రపంచం 

రాతిరి కురిసే వెన్నెల్లో 
చేతులు కడిగే హంతకులు 
శవాలపైనే సవారిచేసే 
అమానుషానికి ప్రతీకలు 
ఆ సమ్మెలు కట్టిన సమాధి
అది స్వార్థపరులకే పునాది 
కపట స్వతంత్రం కౌగిట్లో 
కటిక దరిద్రం పేగుల్లో 
ప్రజాభ్యుదయమె ప్రణాళికల్లో 
ప్రపంచయుద్ధం ప్రతిక్షణంలో 
ఇదా ఇదా ప్రపంచం  
మరోతరానికి మహోజ్వలానికి మహాత్ములడిగిన మరో ప్రపంచం 
ఇదా ఇదా ప్రపంచం ఇదా ఇదా ప్రపంచం

ఇక్కడ ముందుగా చూడాల్సింది బండెల్లిపోతంది పాటకు ఈపాటకు ఉన్న శైలీ విభేదం.
ఆ పాట దేశిపద్ధతిలో జానపదశైలిలో సాగితే ఈ పాట శిష్టవ్యావహారికంలో అభ్యుదయశైలిలో సాగుతుంది. రచయిత రెండు పద్ధతులకూ సమాన న్యాయం చేయటం గమనించదగ్గ విషయం.

మొదటి వ్యాసంలో చెప్పుకున్నాం. జాలాది ఆత్రేయ, కొసరాజు, శ్రీశ్రీ పాటలను నిశితంగా పరిశీలించేవారని. ఈ పాట వ్రాసేనాటికి శ్రీశ్రీ అస్తమించి అర్థదశాబ్దం. శ్రీశ్రీకి నివాళిగా ఆయనను ఆవాహన చేసుకుంటూ జాలాది ఈ గీతాన్ని వ్రాసినట్టుగా అనిపిస్తుంది. భాషలో, భావంలో, ఎత్తుగడలో ప్రతి పంక్తి లోనూ శ్రీశ్రీని గుర్తు చేస్తుంది.
పల్లవి లోనే శ్రీశ్రీ మరో ప్రపంచానికి ప్రతిగా ఇదా ప్రపంచం అని ప్రశ్న. సామ్యవాదాన్ని గుర్తుచేస్తూ ఇదా సమిష్టి సమాజం అని మరో ప్రశ్న. ‘మరోతరానికి మహోజ్వలానికి మహాత్ములడిగిన మరో ప్రపంచం’ అన్నది శ్రీశ్రీని గురించే అని వేరే చెప్పఖ్ఖరలేదు.

ఇంకా శ్రీశ్రీ స్ఫురణలు కావాలంటే ఈ ద్విపదలు చూడండి.

ప్రతి నిమిషం ఒక ప్రళయ రోదనా
ప్రతి ఉదయం ఒక ప్రసవ వేదనా 

ఆ సమ్మెలు కట్టిన సమాధి
అది స్వార్థపరులకే పునాది 

ప్రజాభ్యుదయమె ప్రణాళికల్లో 
ప్రపంచయుద్ధం ప్రతిక్షణంలో 	(ఈ రెండు పాదాల్లోని ఎదురునడక గమనించండి)

భావాల్ని మండించే ఈ పాటలో కూడా జాలాదికి స్వంతమైన కవితాస్పర్శ కనిపించకుండా పోదు.
కుక్కలు చింపిన విస్తరి దేనికి ప్రతీకగా వాడతారో మనకుతెలుసు. ఆ చీకటితప్పు చెప్పడానికి ‘చీకటి చింపిన విస్తరి’ అని ప్రయోగించారు జాలాది.
తెరచాటు నర్తిస్తున్న పాత్రలను తెరమరుగాడే అనడంలో కొత్తదనం ఉంది. తెరమరుగవ్వటం అంటే మాయమవటం. ఈ జాతీయాన్ని తెరమాటున సాగే ఆటకు వర్తింపజేసి నవ్యతను చూపారు జాలాది.
‘రాతిరి కురిసే వెన్నెల్లో చేతులు కడిగే హంతకులు’ అన్న పంక్తులు ఒకేసారి సౌందర్యం భయానకం కలిసి ఉన్నవి. ఒళ్లు గగుర్పాటు కలిగించేవి.

చక్రవర్తి, ఎస్పీబాలుల జోడి వేలాది హిట్ పాటలు మనకు అందించింది. బాలసుబ్రహ్మణ్యంగారి కంఠం, భావవ్యక్తీకరణ తారాపథంలో ఉన్నకాలంలో వచ్చిన ఈ పాట వింటుంటే మళ్లీ ఒకసారి ఆయన గతవైభవం కళ్ళముందుకు వస్తుంది.

ముత్యాలసుబ్బయ్య, చక్రవర్తి, జాలాది కలిసి రూపొందించిన మరో గొప్పపాట ‘ఎర్రమందారం (1991)’ సినిమాలోని ‘యాలో యాలా ఉయ్యాల’.

ఇందులో కథానాయకుడు అన్యాయంగా నేరం మోపబడి జైలు కెళితే, బయట అతని భార్య కాయకష్టం చేస్తూ పసిబిడ్డను పెంచుతూ ఉంటుంది. భర్తను జైలుకి పంపిన శత్రువులు బిడ్డ జోలికి రాకుండా జాగ్రత్త పడాలి.
బిడ్డ తప్పటడుగులు వేస్తూ తిరుగాడేటప్పుడు ముద్దు, అతని భద్రత గురించి భయం, విధినాటకం పట్ల విచారం, దాన్ని సహించి నిలబడటంలోని స్థైర్యం, జైలులోని మనిషికి దూరమైన కుటుంబం జ్ఞాపకాలు – ఇవన్నీ ప్రతిబింబిస్తూ సాగే మరో నేపథ్యగీతం ఇది.

యాలో యాలా ఉయ్యాల 
ఏడేడు జనమాలు మొయ్యాలా  
నాలుగు దిక్కుల ఉయ్యాల 
నలుగురు కలిసే మొయ్యాల 
కళ్ళు తెరుసుకుంటె ఉయ్యాల 
కళ్ళు మూసుకుంటె మొయ్యాల 

మాసాలు మొయ్యాల మణిసిని సెయ్యాల 
కన్నీళ్ళ ఉగ్గెట్టి కష్టాల బువ్వెట్టి కాపాడుకోవాలా 
సిరునవ్వులాడాలా ఆడు సిట్టడుగులెయ్యాలా 
దండాలు మొక్కించి గండాలు రాకుండ గుండెల్లొ దాయాలా 
అడుగడుగున అణగారుతు బతికుండాలా 
ఆ బతుకున ఒక మెతుకేసే తోడుండాలా 
కొడుకైనా గొడుగయ్యే ఋణముండాలా 
చెరనైనా శవమల్లే బతికుండాలా 
యాలో యాలా ఉయ్యాల 
ఏడేడు జనమాలు మొయ్యాలా  

పారాడె వయసేమో పకపక నవ్వాలా 
దోరాడె వయసేమో తాతయ్యతో చేరి దోబూచులాడాలా 
నడికారు వయసేమో నడుములు గట్టాలా 
పుట్టిన నేలను పెట్టే తల్లిని కాపాడుకోవాలా 
నడుమొంగే వయసైనా నిలిసుండాలా 
నలుగురికొకటే న్యాయం కలిగుండాలా 
సావైనా బతుకైన పోరాడాలా 
కడకైన కలగన్నది నిజమవ్వాలా 
యాలో యాలా ఉయ్యాల 
ఏడేడు జనమాలు మొయ్యాలా  

దాంపత్య సంబంధాన్ని వర్ణంచే ఏడేడు జన్మల బంధం చావుబతుకులతో కూడిన బాధ్యత అని గుర్తుచేసే పల్లవి అత్యద్భుతమైనది. ఉత్థాన పతనాలకు, చీకటి వెలుగులకు జీవితానికి ఉయ్యాల ప్రతీక.

మొదటి చరణంలోని కన్నీళ్ళ ఉగ్గు, కష్టాల బువ్వ, సిట్టడుగులు వంటి పదబంధాలు చూడండి. రెండోచరణంలో మూడు తరాలను వర్ణించడానికి వాడిన పకపక నవ్వే పారాడువయసు, నడుములుగట్టే నడికారు వయసు, నిలిసుండాల్సిన నడుమొంగే వయసు వంటి వర్ణనలను చూడండి.
ఏ ఒక్క లైను తీసుకున్నా, రెండు రెండు పాదాలు కలిపి తీసుకున్నా రమణీయంగా ఒదిగే పంక్తులు, మొత్తం గీతాన్ని ఏకసూత్రంగా కలిపే లకారాంత్యప్రాస – ఇలా అనేక విధాలుగా రచనాపరంగా గొప్పపాట ఇది.
(చంద్రుడిలో మచ్చలాగా పాఱాడు వయసుకు జోడీగా దోరాడు వయసు అని వాడటం చిన్న కళంకం – దోగాడు వయసు అని ఉండాలి – అయినా ఇది స్వల్ప విషయం).

మధురంగా, స్ఫుటమైన ఉచ్చారణతో, ఈ పాటను ఆలపించిన గాయకుడి పేరు రాజా అని సమాచారం దొరుకుతోంది. గొంతును బట్టి ఈయన నందమూరి రాజా అయివుండాలి.

చక్రవర్తిగారు స్వరపరిచిన వందలాది సినిమాలలో ఈ సినిమా చిట్టచివరి దశలో వచ్చినసినిమా అయినా ఆయన సుదీర్ఘ విజయప్రస్థానానికి కారణాలు అనేకం ఈ పాటలో కనిపిస్తాయి.
ఎవరైనా పాడుకోవడానికి తేలికగా ఉన్న, సాహిత్యమర్యాదకు పూర్తి న్యాయం చేసిన వరస, జానపద బాణీలలోని ఊపుని హుషారుని పచ్చదనాన్ని పచ్చిదనాన్ని సినిమా పాటకు తెలివిగా వాడుకున్న గడుసుదనం, మట్టివాసన పోకుండా పాటను నేటివిటీకి దగ్గరగా ఉంచి ఎంత కమర్షియల్ పాటైనా ఇది తెలుగువాళ్ళు చేసినపాట అనిపించేలా చేయగలగటం – ఇవన్నీ ఆయన విజయరహస్యాలు.
ఈ రోజున ఇళయరాజా, చిత్ర, ఏ ఆర్ రెహమాన్ మైకంలో పడి అదే సంగీతం అనుకుంటున్న తెలుగు సమాజానికి గత యాభయ్యేళ్ళలోని పాటలలో చక్రవర్తి, సత్యంలు నిలబెట్టిన తెలుగుదనపు మాధుర్యాన్ని గుర్తు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
మాదాల రంగారావు, టి. కృష్ణ, ముత్యాల సుబ్బయ్య సినిమాలకు చక్రవర్తి అందించిన సంగీతం ఉన్నతమైనది. జాలాదికి తొలిసారిగా అఖండఖ్యాతి తెచ్చిన ‘యాతమేసి తోడినా’ పాటకు సంగీతం కూడా చక్రవర్తి చేసిందే.

ఎర్ర మందారం సినిమా1990 సంవత్సరానికిగాను ఉత్తమచిత్రం, ఉత్తమ నటుడు (రాజేంద్ర ప్రసాద్), ఉత్తమ విలన్ (దేవరాజ్), ఉత్తమ గేయ రచయిత (యాలో యాల పాటకు – జాలాది) నంది పుర్కారాలను గెల్చుకుంది.

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.