ఇ ఫార్ ఇసుక ఇ ఫార్ ఇంగ్లీష్!

గత నెల రోజుల రాష్ట్ర పాలనను ఒకసారి గమనిస్తే ప్రధానంగా చర్చ జరిగిన అంశంగా కనబడేది ఇసుక కొరత. ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగు దేశం పార్టీ , కనీసం ప్రతిపక్ష స్థానానికి రావడానికి కూడా ఒక జీవిత కాలం దూరంలో వున్న జనసేన పార్టీ ఇవి రెండూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన ఇతరత్రా అంశాలు అంటే రాజధాని అభివృద్ది, ప్రత్యేక హోదా, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి  మాట్లాడడమో పోట్లాడడమో చేస్తే కనీస క్రెడిబిలిటీ అన్నా వస్తుంది. వాళ్ళు ఇసుక సమస్యనే ఎంచుకోవడాన్ని ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 

బాబుకు ఇసుక లడ్డూ

చంద్రబాబు చెబుతున్నట్లు వారి హయాములో ఇసుక సాధారణ ప్రజలకు ఉచితంగానే దొరికి వుంటే ఇప్పుడు వారి కామెంట్లకు కనీస యోగ్యత వుండేది. ప్రజలు ఒక ట్రాక్టర్ ఇసుకను నాలుగు వేల రూపాయలు పెట్టి కొన్న రోజులు కూడా వున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా ఇసుకను అమ్ముతామంటోంది. అదిగో అక్కడే చంద్రబాబుకు లడ్డు దొరికింది. అదేమంటే “తన జమానోలో ఇసుక ఉచితంగా ఇచ్చాను, ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్నారు”. నిజానికి జరిగిందేమిటి? నాడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ బినామీల చేత నదుల నుండి ఇసుకను తోడించి మామూలు ప్రజలకు అమ్ముకున్నారు. అలా కాకుండా ఏ సామాన్యుడైనా తనకు కావల్సిన ఇసుకను తానే నది నుంచి తోడుకున్నట్టు చంద్రబాబు అండ్ కో నిరూపించలేరు. 

నాలుగు నెలల కిందట అధికారం చేపట్టిన వైసీపీ వారు రాజధాని, పోలవరం వంటి ప్రధాన అంశాలపై ఇప్పుడు ప్రతిపక్షంలో వున్న వాళ్ళను అసెంబ్లీలో నిలదీయడం మొదలెట్టారు. అప్పట్లో గంపెడు గొంతెసుకుని నాటి ప్రతిపక్ష సభ్యులపై విరుచుకు పడిన అచ్చెమ్ నాయుడు వంటి వారు ఇవాళ అసెంబ్లీలో సమాధానాలు చెప్పలేక “జరిగినదానితో ఇప్పుడేందుకు. మీకు అవకాశం వచ్చింది కదా. మీరు మంచి పాలన చేయండి, మేమూ చూస్తాం” అని బేల మాటలు మాట్లాడే పరిస్థితి దాపురించింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారికి ఒక సమస్య కావాలి. ఆ సమస్య పాదరసం లా ఎలా మలిస్తే అలా మారి తమకు ఒక వాదన అంశాన్నీ అందించాలి. అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇసుక కొరత  అనే అద్భుతమైన బంతి దొరికింది. తమకు కావాల్సినట్టు ఆడుకోవచ్చని సంబర పడుతున్నారు. 

ప్రభుత్వం తొందరపాటు

ఇసుక సమస్యపై ప్రభుత్వాన్ని యేమీ అనకూడదా అంటే అనొచ్చు, అనాలి. కానీ చేసే ఆరోపణలు వాస్తవ ప్రాతిపాదికగా వుండాలి. లేకపోతే అవి వారి రాజకీయ లబ్ధికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు ఏమీ ఒరగదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇసుక సంస్కరణలు తేవాలని అనుకుంది. వెంటనే ఇసుక సప్లై ని ఆపడం కంటే ముందుగా రెండు మూడు నెలల డిమాండుకు సరిపడా ఇసుకను డిపోలలో నిల్వ చేసి ఆతర్వాత ఇసుక రవాణా ఆపివేసి వుంటే బాగుండేది. ప్రభుత్వం అక్కడే పొరపాటు చేసింది. కొత్త పాలసీని రూపొందించి ఆ తర్వాతనే ఇసుకను తోడుకొనిస్తాం అని నిబంధన పెట్టి ఒక నెలన్నర్ర పాటు ఇసుక తరలింపు ఆపివేసింది. వరదలు వచ్చే ప్రమాదాన్ని అస్సలు పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదు. కొత్త వ్యవస్థ యేర్పాటుకు రెండు నెలలు సరిపోతుంది, ఆ తర్వాత ఇసుక ఎలాగూ అందుబాటులో వుంటుంది  అనుకున్నట్టున్నారు. పరిస్థితులు తారుమారయ్యాయి. 

అన్నీ సమకూర్చుకుని ఇసుక అమ్మకాలకు కొత్త వెబ్సైట్ రూపొందించుకుని ఆన్లైన్ లో కొనుగోళ్ళు మొదలెట్టిన వారం రోజులకే గత ఐదేళ్లలో ఎన్నడూ రానంత వరదలు వచ్చాయి. ఈ సంవత్సరం  కృష్ణా గోదావరి నదులకు ఏడు సార్లు వరద వచ్చింది. కృష్ణా గోదావరి నదుల ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నదులు నిండుగా ప్రవహిస్తుంటే ఇసుక బయటకు ఎలా వస్తుందని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. మరి ఆ విషయం చంద్రబాబు, పవన్ లకు తెలియదని మనం అనుకోవాలా? ఇసుక కొరతను రాజకీయంగా వాడుకుని లాంగ్ మార్చులు, దీక్షలు చేసి వాటిలో డబ్బులిచ్చి పిలుచుకువచ్చిన మనుషుల చేత ప్రభుత్వాన్ని, జగన్ను బండబూతులు తిట్టించారు. 

వల్లభనేని చుట్టూ గలాభా

రాష్ట్రంలో ఇసుక తర్వాత ఎక్కువ చర్చనీయాంశమైన అంశాలు రెండు . అవి ప్రభుత్వ పాఠశాళ్లలో ఇంగ్లీష్ మాధ్యమ బోధన , తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామా. ఇక టి‌డి‌పి ఎమ్మెల్యే వల్లభనేని పార్టీ నిష్క్రమణలో ఇసుక పాత్ర కూడా కొంచెం వుంది. ఎన్నికలు పూర్తయిన కొన్నాళ్లనుంచీ వల్లభనేని వంశీ పార్టీ పట్ల అసంతృప్తితో వున్నాడని ప్రచారం జరిగింది కానీ ఆయన ఎక్కడా బయటపడలేదు. మొన్న జరిగిన చంద్రబాబు గారి ఇసుక దీక్షలో ఆ అసంతృప్తి మళ్ళీ రాజుకుంది. ఆ ఇసుక దీక్షకు వల్లభనేని హాజరు కాలేదు. నిజానికి ఇంకో ఐదు మంది ఎమ్మేల్యేలు కూడా రాలేదు. వంశీమోహన్ ఇసుక గురించి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వ్యాఖ్య కూడా చేశాడు. “ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోలేదు. కొంత సమయం ఇవ్వాలి” అని అన్నాడు. అదే టి‌డి‌పి పెద్దలకు కోపం తెప్పించింది. దాంతో పార్టీ తరుపునో లేక అధ్యక్షుల ఆదేశాల వల్లనో టి‌డి‌పి నాయకులు వంశీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు. 

తాను పార్టీకి నమ్మకంగా వున్నా కూడా లోకేశ్ బాబు తన మనుషుల ద్వారా నడిపించే కొన్ని వెబ్సైట్లలో తనకు వ్యతిరేకంగా రాయడం జరుగుతోందని, ఇది తన వ్యక్తిత్వ హననమేనని వంశీ ఆరోపించారు. చంద్రబాబుతో కూడా ఇదే చెప్పారు. మరి చంద్రబాబు ఎందుకు ఇదంతా ఆపలేదు? ఒకవేళ ఎలాగూ పార్టీ మారుతాడని వారికి నమ్మకం కుదిరింది కాబట్టే చూసీచూడనట్టు వ్యవహరించారనుకున్నా వున్న కొద్దిపాటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్న స్పృహ చంద్రబాబుకు వుండి వుండాలి. ఇది ఇంతటితో ఆగుతుందని ఎందుకు అనుకోవాలి?

 జగన్ ప్రతిపక్ష సభ్యులను పార్టీలో చేర్చుకొను అని ఎన్నడూ చెప్పలేదు. ఆ చేర్చుకునే ముందు వారి చేత ముందు రాజీనామా చేయించిన తర్వాతనే చేర్చుకుంటానని అన్నాడు. మొన్నటి వరుకూ వైసీపీని, జగన్ను తిట్టిన జూపూడి వైసీపీలో చేరాడు. ఇంకా టి‌డి‌పి నాయకుల్లో ఎంతమంది పుర్రెల్లో ఏ బుద్దులున్నాయో ఏమో. ఫిరాయింపుల పట్ల తెలుగు రాష్ట్రాలను అందునా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు. గొంగట్లో తింటున్నాం అని అందరికీ తెలిసిందే. వీలైతే అసలు అన్నాన్ని గొంగట్లో పోయకుండానే చూడాలి, వెంట్రుకలేరడం వల్ల లాభం లేదు. 

భాషా బత్తాయిలు

ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరుకూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలోనే విద్యా బోధన జరగాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ నిర్ణయం మంచిదేనని కొందరూ, సరైంది కాదని కొందరూ ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ వున్నారు. వద్దనే వారి వాదన ఎలా వుందంటే “గ్రామీణ వాతావరణంలోని పిల్లలు ఇంగ్లీష్ చదవడానికి ఇబ్బంది పడి తత్ఫలితంగా పరీక్షల్లో ఫెయిల్ అవుతారు”.  సరే నాలుగు లేదా ఐదు వరుకు తెలుగు మీడియంలో చదివి ఆరో క్లాసులో ఇంగ్లీష్ మీడియం స్కూలుకు వచ్చిన పిల్లలు ఒక సంవత్సరమో లేక కొంతమంది రెండు మూడు సంవత్సరాలో ఇబ్బంది పడడం, కొన్ని సందర్భాల్లో తెలుగు మీడియంలో ఫస్ట్ క్లాస్ లో పాసైన వారు కూడా ఇంగ్లీష్ మీడియంలో అరకొర మార్కులు మాత్రమే సాధిస్తారనేది వాస్తవం. 

ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రాధమిక విధ్య ప్రారంభమయ్యేదే ఒకటవ తరగతి నుండి. ప్రభుత్వం ఒకటవ తరగతిలో నేర్పేది మొదలు ఎబిసిడి లే. తదుపరి, ఒకటి రెండు క్లాసులకు వెళ్లబోయేవారికి యేమి ఇబ్బంది వుండదు. ఒకవేళ యీ సంవత్సరం తెలుగు మీడియంలో ఐదవ క్లాసు చదువుతున్న పిల్లలైతే వచ్చే ఏడాది కరాకండిగా ఆరవ క్లాసు ఇంగ్లీష్ మీడియంలో చదివితీరాలి కాబట్టి వారు ఇబ్బంది పడొచ్చు. మనం ఒక మారుమూల గ్రామాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళి ఆ వూర్లో బడికి వెళ్ళే పిల్లలున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి “మీ పిల్లలను తెలుగు భాషా పరిరక్షణ కోసం చదివిస్తున్నారా లేక బతకడం కోసం ఉద్యోగం చేయడానికి చదివిస్తున్నారా” అంటే ఎంత మంది భాషను బతికించడానికి తెలుగు మీడియంలో చదివిస్తున్నామని సమాధానం చెబుతారు? 

ఇప్పుడు తెలుగు భాషా పరిరక్షణ అంటూ ఆందోళనలు చేస్తున్న వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుతున్నారు అని అడగకూడదట. ఎందుకూ అంటే “మా పిల్లల ఇష్టానుసారంగా వారిష్టపడిన ఇంగ్లీష్ మీడియంలోనే చేర్చాము” అని సమాధానం ఇస్తారు. లేదా నిరుద్యోగ సమస్య అనీ ఇంకా ఏవేవో అంశాలను ఇందులోకి తెచ్చి గందరగోళం చేస్తారు. మనకు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేస్తారనే భయాలు వున్నాయి కాబట్టి అసలు ప్రైవేటు రంగం అనేదే లేకుండా విద్యను ఏకీకృతంగా ప్రభుత్వానికే పరిమితం చేసేలా ఉద్యమిద్దాం. అంతవరకు మాత్రం ప్రస్తుత నిర్ణయం ఈ కాలానికి సరైనదేనని అంగీకరించక తప్పదు. 

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.