ఆడదిగా వుంటే అంతే
మానవిగా మారాలి!

ఆడవాళ్లెప్పుడు ఒక బిడ్డగానో,ఒక భార్య గానో,ఒక తల్లి గానో పురుషుని చాటుగా బతకడమే జీవితమని, అదే పరువని నమ్మబలికే…నమ్మించే…ఈ సమాజం,ఇసుక పునాదుల మీద ఆడదాని ఆత్మగౌరవాన్ని, స్వేచ్చను నిర్మిస్తుంటది. ఆడదానికి జీవితంలో ఏదో ఒకరోజు మనిషిగా…మానవిగా మారాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మారే శక్తిని కూడగట్టుకోకపోతె, ఏ ఆధారాన్ని దొరకబట్టుకోకపోతె సర్వనాశనం కావాల్సిందే మరి. కొన్ని పద్దతులు గానీ పదాలు గానీ ఆడదాని కోసమే పుట్టినట్టు పేటెంట్ హక్కులను పొంది ఉంటాయి. మగాడు చేస్తె అదొక ధైర్యం అయితే ఆడదాని విషయంలో మాత్రం పరువుగా భావించాలి. ఆడదాన్నొక మానవిగా చూసే పరిస్థితులు ప్రస్తుతాన్ని బట్టి ఎంత వరకొస్తాయో ప్రశ్నార్థకమే…?!

ఓల్గా దాదాపు ముప్పై ఏండ్ల కిందటి రచన “మానవి” లో ఆడదాని పరిస్థితులు ఎలా ఉన్నా యో… ఇప్పటికీ అలాగే ఏమాత్రం మార్పును నోసుకోకపోవడం … ఇక మారుతుందని నమ్మడం నీటి మీది రాతల్లాంటివే మరి. ఆడది పురుషుని చాటు నుండి మానవిగా మారడమంటే…గొంగళి పురుగు దశ నుండి అందమైన సీతాకోక చిలుకలా స్వేచ్చగా ఎగిరినట్టే కదా. కానీ దాని వెనకాల ఎంత శక్తిని, మనసును, తెగింపును కూడగట్టుకోవాలో… నిత్యం ఎంత పోరాటం చేయాల్నో మరి.

రచనలోకి వెళ్లితే వసంత బి.ఏ.గ్రాడ్యుయేట్ చదువుకున్న తెలివైన యువతి అయినప్పటికీ పెండ్లైన తర్వాత తన భర్తకు అన్ని పనులు చేసిపెట్టే భార్యగా,తన పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే తల్లిగా బతకడమే తన ప్రపంచంగా భావిస్తుంది.ఆడది అలాగే ఉండాలని  సమాజం బోధించిన నీతులను చక్కగా వంటబట్టించుకున్నది. ప్రేమంటే…ప్రేమించడమంటే తెలియని బాధ్యత గల వ్యక్తిగా తన సంసారమే తనకొక అందమైన ప్రపంచంగా చూసుకొని సంతోషపడే అమాయకపు స్త్రీ.ఇంట్లోని వాళ్లందరికీ తనే అన్నీ పనులు చేసిపెడుతు ఒక భార్యగా,తల్లిగా బాధ్యతను మోస్తున్నానుకుంటుంది.

తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవాలని ఎప్పుడూ ఆలోచించదు. అలాంటి ఆలోచనే పెద్ద నేరంగా భావిస్తది. పెద్ద కూతురు లావణ్యకి పెళ్ళి చేసి తనలాగే బాధ్యత ను నిర్వర్తించాలని పదే పదే చేసిన హితబోధ వలన లావణ్య కూడా కనిపెంచిన తల్లి తండ్రి కంటే తన సంసారము, పరువే ముఖ్యమని భావిస్తది. చిన్న కూతురు నవత మాత్రం ఆదర్శ భావాలు కలిగిన, ఎంతో  మానసిక పరిపక్వత గల అమ్మాయి. తన అమ్మ ఇంటికే పరిమితమవ్వడం ఇష్టం ఉండదు. తన అభిరుచికి నచ్చిన ఏదైనా ఉద్యోగం చేయమంటది. ఈ విషయంలో వసంత, నవత ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. భర్త సురేష్ కూడా తన కూతురుకే సపోర్ట్ చేస్తుంటాడు.

వసంత స్నేహితురాళ్లు రుక్మిణీ డాక్టర్, శాంత అధ్యాపకురాలు.వాళ్లిద్దరికీ కూడా వసంత కుటుంబానికే పరిమితమవ్వడం ఇష్టముండదు. 

చదువుకున్నందుకు ఏదో ఒక పని చేసుకొని ఒకరిపై ఆధారపడకూడదనే నమ్ముతారు.వసంత తన స్నేహితురాళ్లను కలవడానికి గుంటూరు వెళ్లినప్పుడు శాంతకు కుటుంబ బాధ్యతల వల్ల  పెళ్లికాలేదని తెలిసి చాలా బాధ పడ్తది.మగాని తోడు లేకుండా ఆడదానికి బతుకే లేదని …జీవితాంతం ఎలా బతుకుతావని ప్రశ్నిస్తది.కానీ శాంత వసంత అమాయకపు మాటలకు నవ్వుకొని తననెంతో ఇష్టపడే …ప్రేమించే రాధాకృష్ణ గురించి…సంవత్సరంలో ఒక నెలరోజులు వాళ్లిద్దరు కలిసుండే విషయాన్ని చెప్పుతది.కానీ వసంతకు ఒక పెళ్లైన పురుషునికి ఉంపుడుగత్తెగా శాంత ఉండటం నచ్చక స్నేహితురాలిని తన మాటలతో అవమానిస్తది.కానీ శాంత మాత్రం “చరిత్రలో చాలా మంది స్త్రీలు ఉంపుడుగత్తెలుగా ఉన్నారు.భార్యాభర్తల బంధం లేని ప్రతి ప్రేమలోనూ స్త్రీ ఉంపుడుగత్తె అయ్యింది.నాకు భార్యగా ఉండటం కంటే ఉంపుడుగత్తెగా ఉండటమే నాకిష్టం…ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంటుంది.ఒకరికొకరు ప్రేమించుకునే వాళ్లుంటారు” అని ఖరాఖండిగ చెప్పుతుంది. శాంత వైఖరి నచ్చని వసంత అక్కడి నుండి వెంటనే వెళ్ళి పోవాలని, తన కోసం ఎదురుచూసే, తన మీద ఆధారపడిన భర్త, తన ఇల్లును వెంటనే చూసుకోవాలని హైదరాబాదుకి వెళ్లిపోతుంది.

రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన భర్త తన సహోద్యోగి డాక్టర్ నీలిమతో గత ఆరునెలలుగా గల సంబంధాన్ని, ఆమెపై తన ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తపరచడంతో… ఇరవై రెండేళ్ల తమ సంసార జీవితంలో భర్తకు తనే లోకమని ఊహించుకున్న వసంత కలలన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి.నేను తనకి భార్యని, తనపై సర్వహక్కులు నావే అనుకుంటది తప్ప ఒకరినొకరు ప్రేమించుకోవాలె… మనసులు,అభిప్రాయాలు కలవాలనే విషయం ఎంత మాత్రం తెల్వదు. భర్త దూరమైపోతున్నాడనే బాధ వసంతను రోజు రోజుకు కృంగదీస్తుంటది. ఆత్మహత్యా యత్నం కూడా చేసుకుంటది. వసంత పరిస్థితిని అర్థం చేసుకొని మామూలు మనిషిలా మార్చడానికి స్నేహితురాలు రుక్మిణీ చాలా ప్రయత్నాలు చేస్తుంటది. “ఈ రోజుల్లో వివాహాలు నిలబడటం లేదు.ఇందులో ఎవరిది తప్పు అనేది అలా ఉంచి,అసలు వివాహ సంబంధాన్ని గురించి మన ఆలోచన మార్చుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. దానికంత విలువ ఇవ్వకపోతే మనకింత బాధ ఉండదేమో” అని రోహిణి వసంత మనసులో వివాహ బంధం మీదున్న దృఢమైన ఆలోచనలను తగ్గించడానికి ప్రయత్నిస్తది. ఆడపిల్లల్లో ఆడలక్షణాలే గానీ మానవతా లక్షణాలు ఉండగూడదనుకుంటారు తల్లిదండ్రులు. కూతుళ్ళం,భార్యలం, తల్లులం అని తప్ప మనుషులం అని గుర్తుంచుకోరు ఆడవాళ్ళు. పెళ్ళితోనే జీవితం మొదలవుతదను కుంటారు. కానీ ఆడదానికి తన జీవితం, తన పని, తన స్థానం మనకు ప్రత్యేకంగా ఉండాలని ఆలోచనే రానివ్వరు. “భర్తలొదిలేసిన భార్యలందరూ పనికిమాలిన వాళ్లని, బజారు మనుషులని అనుకుంటారు. ఆడవాళ్లని భర్తల హోదాతో గుర్తించటం మానేసే దాకా ఆడవాళ్లకు విముక్తి లేదు” అని రోహిణి వసంతను కోపంగ మందలిస్తది. కానీ ఈ సమాజం ఒక భార్య భర్తతో ఎలా ఉండాల్నో నేర్పించిన సంప్రదాయాన్ని వసంత బాగా జీర్ణించుకుంది. రోహిణి చెప్పే మాటలేవి వినిపించుకునే స్థాయిలో ఉండదు. వసంతకిక ఒకేఒక దిక్కు, తన భర్త ఆలోచనలో మార్పు తెచ్చె వ్యక్తి చిన్న కూతురు నవత నేనని. నవత కోసం చాలా ఎదురు చూస్తది. కానీ నవత మొదటి నుండి ఆదర్శ భావాలు కలిగిన అమ్మాయి కావడం వల్ల తల్లిదండ్రుల పరిస్థితిని సులభంగా అర్థం చేసుకుంటది. తండ్రి తో మాట్లాడినపుడు  ప్రేమ లేకుండా రాజీపడుతు ఎన్నేండ్లు బతకాలె. ప్రేమించే వ్యక్తిని వదిలేసి అనే మాటలు నవతలో బాగా నాటుకుంటాయి. కానీ తల్లికి ఇదంతా అర్థంకాని విషయం… తండ్రి ఆలోచనలను వదిలెయ్యమని “నువ్వింకా భార్యాభర్తలందరూ ప్రేమించుకుంటారని నమ్ముతున్నావా అమ్మా…నాకైతే భార్యాభర్తలందరూ రాజీపడి ఎలాగోలా బతుకుతున్నారని పిస్తుంది. నేను పెళ్ళి చేసుకోను. ఒక మొగాడి ప్రేమకోసం జీవితమంతా ఏడుస్తూ గడపను” అని తల్లి మనసును మార్చడానికి కోపంగా తన స్థిరమైన మాటలను వ్యక్తపరుస్తది. విశాఖపట్నంలో తల్లిని తనతో పాటు ఉంచుకోడానికి హాస్టల్ నుండి బయటకొచ్చి తండ్రి సహాయంతో ఇల్లు అద్దెకు తీసుకుని వసంతను తీసుకెళ్లుతుంది. వసంత తప్పదనుకొని నవతతో వెళ్లినప్పటికీ క్రమక్రమంగా నవత ఒక విద్యార్థి సంఘానికి అధ్యక్షురాలిగా చేసే కార్యక్రమాల వల్ల … రోజూ ఇంటికి వచ్చే నవత స్నేహితుల వల్ల… చిన్న వయసులోనే సమాజం పట్ల వారికున్న అపారమైన అవగాహనకి, వారు చేసే తెగింపు పనులని గమనిస్తూ వసంతలో కూడా క్రమక్రమంగా మార్పు చోటుచేసుకుంటది. ఒకప్పుడు తన భర్త, పిల్లలు, సంసారం … పండక్కి పిల్లలకు, తనకు కొత్త బట్టలు లేకపోతే అదే పెద్ద కష్టంగా భావించే వసంతకు జీవితం అంటే ఇంటిచాకిరీకే కాక సమాజం కోసం అనుకుంటే ఎంత బాగుంటుందో అర్థమవుతది. “జీవితాన్ని కాస్త విశాలంగా అనుభవాలతో నిండేలా చూసుకోవాలి. ఆడవాళ్ల జీవితాలకు ఆ అవకాశం చాలా తక్కువ ” అని తెలుసుకోగలుగుతుంది. ఒక భర్తకు భార్య ఏం చెయ్యాలని బోధిస్తారో, ఒక బిడ్డకు తల్లి ఏం చెయ్యాలని బోధిస్తారో అవే ఏ లోపం లేకుండా చేసి ఓడిపోయానని తెలుసుకుంటుంది. ఎవరి జీవితాలు వాళ్ల చేతుల్లో ఉండాలని,ఆ జ్ఞానం రావటం మనిషికి చాలా అవసరమని…ఆడదానికి ఏదో ఒకరోజు మనిషిగా, మానవిగా మారాల్సిన రోజు వస్తుందని,ప్రాణాలు ధారబోసి అయినాసరే మనుషుల్లా మారడానికి కావాల్సిన శక్తి సంపాదించుకోవాలని తెలుసుకుంటుంది. ఆడదానిగా బ్రతికే తన పెద్ద కూతురు లావణ్యను కూడా ఎప్పుడో ఒకసారి నువ్వు కూడా మానవిగా మారమని చెప్పుతుంది.

కూతురిగా, భార్యగా,తల్లిగా పురుషుని చాటుగా బతికిన ఆడదైన వసంతకు మానవిగా మారడానికి తన చిన్న కూతురు లావణ్య, భర్త సురేష్, స్నేహితురాళ్లు రుక్మిణి, శాంత కారణమయ్యారు.ప్రతీ ఆడదానికి కూడా జీవితంలో ఏదో ఒక కారణం గానీ… ఎవరో ఒకరు గానీ తప్పక ఉంటారు.ఆ ఆధారాన్ని దొరకబట్టుకొని,తన అంతర్లీన శక్తిని కూడగట్టుకుని పోరాడితే ఈ సమాజంలో ఆడవాళ్లే ఉండరు మానవీలు తప్ప.

 

వెంకి, హన్మకొండ

అసలు పేరు గట్టు రాధిక మోహన్. హన్మకొండలో నివాసం. వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్. పుస్తకాలు చదవడం ఒక అలవాటు. అడపాదడపా "వెంకి" కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. కవిత్వం మీద "ఆమె తప్పిపోయింది" పేరుతో పుస్తకం వెలువరించారు.

2 comments

  • పుస్తకం మొత్తం చదివినట్టుగా కనులకు కట్టినట్టు ఉంది అక్క
    మీ విశ్లేషణ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.